ప్రాణాధార ఔషధాల తయారీలో భారతదేశం కీలకమైన స్థానాన్ని అందుకుంది. జనరిక్‌ ఔషధాల హబ్‌ అన్న పేరు తెచ్చుకుంది. కానీ జాంబియా, ఉజ్బెకిస్తాన్‌లలో సంభవించిన 70 మంది చిన్నారుల మరణం, వారికి పట్టిన దగ్గుమందు భారత్‌లో తయారైనదని తేలడంతో ఒక్కసారి ప్రపంచం ఉలిక్కి పడింది. నిజానికి దగ్గు మందు నేరుగా వెళ్లి దుకాణంలో తీసుకున్నా, డాక్టర్‌ ‌చీటీ ఇచ్చి కొనుగోలు చేసినా కూడా అది ఇచ్చే ప్రభావం మీద భిన్నాభిప్రాయాలే ఉన్నాయి. అయినా ఇది కేవలం వ్యాపారం, ఎగుమతులకు సంబంధించిన ప్రశ్నగా భారత ప్రభుత్వం తీసుకోలేదు. ఇంతకాలం దేశం సంపాదించుకున్న ప్రతిష్ట మీద నీలినీడలు ప్రసరించడం ఒకటైతే, వినియోగదారులలో వీటి పట్ల భయం వ్యాపించడం గురించే ఎక్కువ ఆలోచించవలసి ఉంటుంది. నాణ్యమైన మందులను అందుబాటు ధరలో సరఫరా చేస్తూ ఫార్మాస్యుటికల్‌ ‌రంగంలో తనదైన ముద్రవేసుకుని అంతర్జాతీయ యవనికపై భారత్‌ ‌దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ తయారైన కొన్ని మందులు ఇటీవల విదేశాలలో వివాదాస్పదం కావటంతో కేంద్రం అప్రమత్తం అయ్యింది. నకిలీ లేదా నాసిరకం మందులు తయారీ సంస్థలపైన కొరడా ఝుళిపించింది. ఇది ముగిసిపోలేదని, దాడులు కొనసాగుతాయని ప్రకటించింది. నకిలీ మందులు తయారీని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని కూడా వెల్లడించింది.

18 కంపెనీల లైసెన్సుల రద్దు ..

26 కంపెనీలకు షోకాజ్‌ ‌నోటీసులు…

మూడు కంపెనీల్లో ఓ రకం మందు తయారీకి అనుమతులు రద్దు…

దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఔషధ నియంత్రణ అధికారులు జరిపిన దాడుల పర్యవసానమిది. ఇందులో ఆంధప్రదేశ్‌, ‌తెలంగాణ కూడా ఉన్నాయి. మొదటిదశలో 76 కంపెనీల నుంచి రాండమ్‌గా సేకరించిన నమూనాల ఆధారంగా 203 కంపెనీలను అధికారులు గుర్తించి తనిఖీలకు సిద్ధం అయ్యారు. రాబోయే రోజుల్లో ఈ తనిఖీలు కొనసాగుతాయని అధికారులు ప్రకటిం చారు. భారత్‌ ‌కంపెనీలు తయారుచేసిన కొన్ని మందులు విదేశాల్లో కొందరి ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడులకు ప్రాధాన్యం ఏర్పడింది. ఔషధాల తయారీ మీద, విశ్వసనీయత, ప్రామాణికతల పైన తమకు రాజీ లేదని 2018 సెప్టెంబర్‌లో కూడా ఒకసారి కేంద్ర ప్రభుత్వం రుజువు చేసుకుంది. ఫిక్స్‌డ్‌ ‌కాంబినేషన్‌ ‌డ్రగ్స్ ‌విభాగంలో చాలా మందులను సుదీర్ఘ న్యాయ పోరాటం తరువాత భారత ప్రభుత్వం నిషేధించింది. ఆ విధంగా ప్రజారోగ్యం పట్ల తమకున్న నిబద్ధతను చాటు కుంది. ఇంతకీ భారత దేశంలో ఔషధాల తయారీ, అందుకు అనుమతులు ఎలా ఉన్నాయి?

హరియాణాలోని మైడెన్‌ ‌బయోటెక్‌ ‌తయారు చేసిన నాలుగు ఔషధాలకు (దగ్గు నివారణకు వాడే సిరప్‌లు) జాంబియాలో 70 మంది చిన్నారుల మరణాలతో సంబంధం ఉందని ఆరోపణలొచ్చాయి. ఈ కొత్త వివాదానికి ఇదే నాంది. నోయిడాలోని మేరియన్‌ ‌బయోటెక్‌ ‌సంస్థ రూపొందించిన రెండు సిరప్‌లతో ఉజ్బెకిస్థాన్‌లో 18 మరణాలకు సంబంధం ఉందని ఫిర్యాదులొచ్చాయి. దేశ, రాష్ట్ర బృందాలు జరిపిన సంయుక్తదాడుల అనంతరం, ఈ రెండు కంపెనీలలోనూ ఉత్పత్తిని నిలిపివేశారు. అక్కడ నుంచి సేకరించిన శాంపిళ్ల ఆధారంగా మైడెన్‌ ‌బయోటెక్‌లో నాణ్యతాలోపం లేదని అధికారులు తేల్చారు. మేరియన్‌ ఆ ‌విషయంలో విఫలమైంది. దీని మీద చర్యలకు అధికారులు సిఫార్సు చేశారు. మరో సంఘటనలో చెన్నై కేంద్రంగా పనిచేసే సంస్థ ఉత్పత్తి చేసిన కంటి చుక్కల మందు 55 ప్రతికూల సంఘటనకు కారణమైంది. బ్లడ్‌ ‌స్ట్రీమ్‌ ఇన్ఫెక్షన్‌ ‌కారణంగా అమెరికాలో ఒక వ్యక్తి చనిపోయాడు. మరికొందరు చూపు కోల్పోయారు. దాంతో కంపెనీ స్వచ్ఛందంగా మార్కెట్‌ ‌నుంచి తమ ఉత్పత్తిని వెనక్కి తెప్పించుకుంది. ఇక్కడ తనిఖీలు చేపట్టారు. ఉత్పత్తిని నిలిపివేశారు.

15 రోజుల క్రితం అధికారులు చర్యలకు ఉపక్రమించారు. కంపెనీలు నాసిరకం లేదా నకిలీ మందులు తయారు చేయరాదని సూచించారు. అవి కచ్చితంగా మంచి తయారీ పద్ధతులను అనుసరించా లని సూచించారు.

కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఈ ఏడాది నిర్వహించిన చింతన్‌ ‌శిబిర్‌లో డ్రగ్స్ ‌కాస్మొటిక్స్ ‌చట్టంలోని షెడ్యూల్‌ ఎం ‌ప్రకారం ఫార్మా సంస్థలు మంచి తయారీ పద్ధతులు అనుసరించటం అన్న అంశంపైన చర్చించారు. ఇందుకు కంపెనీలకు కొంత గడువు ఇవ్వాలన్న ప్రతిపాదనలొచ్చాయి. డ్రగ్‌ ‌నియంత్రణ అధికారులు, ఇతర భాగస్వాములు పాల్గొన్నారు. ఇప్పటికే డబ్ల్యుహెచ్‌ఓ.. ‌జీఎంపీ విధానాలు అమలులో ఉన్నా కొన్ని కంపెనీలు మాత్రమే వాటిని పట్టించుకుంటున్నాయని ఈ రంగానికి చెందిన అధికారులు చెబుతున్నారు. ఇవేమిటో చూద్దాం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు

ఆయా ఫార్మా సంస్థలు మంచి తయారీ పద్ధతులు (గుడ్‌ ‌మాన్యుఫ్యాక్చరింగ్‌ ‌ప్రాక్టీస్‌- ‌జీఎంపీ) ను తప్పనిసరిగా అనుసరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. నాణ్యతా ప్రమాణాల మేరకు ఆయా మందులను స్థిరంగా ఉత్పత్తి చేసే పక్రియను జీఎంపీగా పిలుస్తారు. ఆయా ఉత్పత్తుల్లో తయారీలో ఉన్న రిస్క్‌ను వీలయినంత వరకూ తగ్గించుకోవటం దీనివల్ల సాధ్యమవుతుంది.

–         ఇందులో ఐదు ‘పీ’లుప్రధాన పాత్ర పోషిస్తాయి. అవి పీపుల్‌, ‌ప్రొడక్టస్, ‌ప్రాసెసెస్‌, ‌ప్రొసీజర్‌ (‌లేదా పేపర్‌ ‌వర్క్), ‌ప్రెమిసెస్‌. ‌వాటి గురించి విడివిడిగా తెలుసుకుందాం.

–         మొదటిది పీపుల్‌. ఇం‌దులో భాగస్వాములయిన ఉద్యోగులంతా తయారీ విధానాలను, నిబంధనలను తప్పనిసరిగా పాటించి తీరాలి. తమకు అప్పచెప్పిన బాధ్యతలను, అందులో తమ పాత్రను సక్రమంగా అర్థం చేసుకుని ఆచరణలో పెట్టాలి. ఇందుకు అవసరమైన శిక్షణను వారికి అందించాలి.

–         నాణ్యతా ప్రమాణాల మేరకు ఉత్పత్తులు రూపొందించాలి. వినియోగదారులకు చేరే ముందు వీటిని నిర్ధారించుకునేందుకు అవసరమైన పరీక్షలు నిర్వహించాలి. తయారీలో ప్రతి దశలోనూ ఇందులో వాడే సామాగ్రి, ప్రోడక్టులు, ఇతర ఉత్పత్తులు నిర్దేశిత పరిమాణాల్లో ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి.

–         విధివిధానాలను రికార్డు చేసి దానిని ఉద్యోగు లందరికీ పంపిణీ చేయాలి. ఉద్యోగులంతా దానిని ఆచరిస్తున్నారా లేదా సంస్థ నిర్దేశించు కున్న స్థాయి మేరకు పని చేయగలుగుతున్నారా లేదా అనేది నిర్ణీత సమయాల్లో విశ్లేషించాలి.

–         కొన్ని రకాల మార్గదర్శకాలను అనుసరించి లక్షిత గమ్యాన్ని చేరటానికి కొన్ని పద్ధతులను అనుసరించాలి. దీనికి ఉద్యోగులంతా కట్టుబడి ఉండాలి. ఏ మాత్రం దానినుంచి పక్కకు తొలగినా తక్షణం ఆ విషయం రిపోర్టు చేయాలి. దానిపైన విచారణ చేపట్టాలి.

–         ప్రాంగణం మొత్తాన్ని పరిశుభ్రంగా ఉంచాలి. కాలుష్యానికి, ప్రమాదాలకు, మరణాలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలి. యంత్రాలను జాగ్రత్తగా భద్రపరచాలి. అవి తగిన విధంగా పని చేస్తున్నాయా లేదా ఆశించిన విధంగా ఫలితాలు ఇస్తున్నాయా లేదా ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. ఇందుకు అవసరమైన ‘మెంటెనెన్సు’ను చేపట్టాలి.

జీఎమ్పీలో పది సూత్రాలుంటాయి

 1. ముందుగా ప్రామాణిక పద్ధతి (స్టాండర్డ్ ఆపరే టింగ్‌ ‌ప్రొసీజర్‌-ఎస్‌ఓపీ) రూపొందించాలి.
 2. ఎస్‌ఓపీలో పేర్కొన్న విధంగా అంతా సక్రమంగా అమలయ్యేలా చూడాలి.
 3. విధివిధానాలను తప్పనిసరిగా కాగితం మీద పెట్టాలి.
 4. ఎస్‌ఓపీ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు ధృవీకరించు కోవాలి.
 5. పనివిధానంలో ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు చేసుకోవాలి.
 6. అందుబాటులో ఉన్న వ్యవస్థలను, సౌకర్యాలను, పరికరాలను సరిగా నిర్వహించుకోవాలి.
 7. పనివాళ్ల సామర్థ్యం మెరుగుకు చర్య తీసుకోవాలి.
 8. ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచటం ద్వారా కాలుష్యానికి ఆస్కారం లేకుండా చూడాలి.
 9. నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ, దానిని పనిలో భాగంగా చేయాలి.
 10. ఎప్పటికప్పుడు జీఎంపీ ఆడిట్‌ ‌నిర్వహించాలి.

ప్రతి తయారీ సంస్థ తప్పనిసరిగా జీఎంపీ నిబంధనలు పాటించి తీరవలసి ఉంటుంది. వాటి ఉత్పత్తిని క్రమబద్ధీకరించటం, తనిఖీ చేయటం, ఆ ఉత్పత్తులు సమర్థవంతమైనవి, సురక్షితమైనవని ధృవీకరించటం వంటివన్నీ ప్రభుత్వం చేతిలో ఉంటాయి. ఉదాహరణకు, అమెరికానే తీసుకుంటే, అక్కడ జీఎంపీని అమలుచేసే బాధ్యతను యూఎస్‌ ఎఫ్‌ ‌డీఏ చూస్తుంది. అది కరెంటు గుడ్‌ ‌మ్యాన్యు ఫ్యాక్చరింగ్‌ ‌ప్రాక్టీసెస్‌ (‌సీజీఎంపీ) ద్వారా దీనిని అమలు చేస్తుంది. కాస్మొటిక్స్, ‌ఫుడ్‌, ‌మెడికల్‌ ‌డివైసెస్‌ ‌పరిశ్రమలు ఈ పరిధిలోకి వప్తాయి. తయారీ సంస్థ సీజీఎంపీ నిబంధనలు పాటిస్తున్నదా లేదా అనేది నిర్ధారించటం కోసం ఎఫ్‌డీఏ తనిఖీలు చేపడుతూం టుంది. ఎక్కడయినా నిబంధనలను ఉల్లంఘించినట్టు గుర్తించినపక్షంలో, ఎఫ్‌డీఏ ఆయా ఉత్పత్తులన్నింటిని వెనక్కి రప్పిస్తుంది. దానివల్ల సంస్థ వ్యాపార ప్రయోజనాలకు విఘాతం ఏర్పడి తీరుతుంది. నాణ్యత లేని మందులు వినియోగ దారుల ఆరోగ్యానికి ముప్పు తెస్తాయి.

జీఎంపీ నిబంధనలను ఆచరించి, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వటం వల్ల మందులు తయారుచేస్తున్న కంపెనీల పేరు ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. బ్యాచ్‌ ‌మందులను వెనక్కి రప్పించవలసి రావటం, వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రావటం వంటి వాటికి ఆస్కారం ఉండదు. జీఎంపీ ప్రమాణాలను ఆచరించాలంటే దిగువ నిబంధనలను పాటించాలి.

 1. నిపుణుల బృందం

జీఎంపీ నిబంధలను తు.చ. తప్పకుండా పాటించే నిపుణులను ఎంచుకోవాలి. నాణ్యతను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, సమస్యల పరిష్కారా నికి వారు అనువైన మార్గాలను ఎంచుకోగలుగు తారు. ఈ బృందం పనితీరులో అక్కడున్న పరికరాలు, యంత్రాల వినియోగం, వాటి నిర్వహణ, సిబ్బంది నైపుణ్యాలను పరిశీలించటం ఒక భాగం అవుతుంది.

 1. ధృవీకరణ

ఎప్పటికప్పుడు అన్ని పనులు సక్రమంగా సాగుతున్నాయా లేదా అనేది గమనిస్తూ వాటిని రికార్డు చేయటం ఇందులో భాగం. అందులో విధానాలు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత, కంప్యూటర్ల పనితీరు, విశ్లేషణ విధానాలు… ఇలా నాలుగు అంశాల్లో పనితీరును ధ్రువీకరించుకోవలసి ఉంటుంది.

 1. ఆకస్మిక తనిఖీలు

అప్పుడప్పుడు ఆకస్మికంగా ఆడిట్‌ ‌చేపట్టటం నిర్దేశించుకున్న విధంగా అన్ని సక్రమంగా సాగుతున్నాయా లేదా అనేది నిర్ధారించుకోవటానికి దోహదం చేస్తుంది. ఎక్కడ అవి అమలుకాకపోతే, అందుకు మూల కారణం ఏమిటనేది తక్షణం పట్టుకోగలగాలి. అది ముదిరిపోకుండా చర్యలు తీసుకోవాలి.

 1. శిక్షణ

జీఎంపీ ప్రమాణాలను అందరూ ఆచరించ టానికి సిబ్బందికి శిక్షణ ఇవ్వటం అనేది మెరుగైన మార్గం. సమగ్రంగా రికార్డులను నిర్వహించటం, పారిశుద్ధ్యం అమలు, పరికరాల నిర్వహణ, లేబిలింగ్‌ ‌చేయటం, ఎస్‌ ఓపీ వంటి అంశాలు శిక్షణలో భాగం కావాలి. దీనివల్ల జీఎంపీని సమగ్రంగా అర్థం చేసుకోగలుగుతారు. తమ పని తీరును మెరుగుపరచు కోవటానికి రోజువారీ పనిలో వాళ్లు చేసే తప్పులు తగ్గుతాయి.

Find list of Jan Aushadhi Kendra in Lucknow - Justdialవిశిష్టమైన జనఔషధి కేంద్రాలు

వైద్య, ఆరోగ్యానికి సంబంధించి మోదీ ప్రభుత్వం ప్రారంభించిన పథకాల్లో ప్రధానమంత్రి భారతీయ జనఔషధి కేంద్రాలు ప్రతిష్ఠాకరమైనవి. ప్రజలకు నాణ్యమైన మందులను అతి తక్కువ ధరకు అందించటం వీటి ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదు జనరిక్‌ ‌మందుల్లో ఒకటి భారత్‌లోనే తయా రవుతోంది. అలాగే దేశంలో ఉన్న జన ఔషధి కేంద్రాలు మార్కెట్‌ ‌ధర కంటే 50 నుంచి 80 శాతం తక్కువ ధరకు మందులను అందిస్తున్నాయి. గత ఎనిమిదేళ్ల కాలంలో ఈ అవుట్‌ ‌లెట్ల సంఖ్య, వాటి అమ్మకాలు వందశాతం పెరిగాయి. సగటున 1.2 మిలియన్ల మంది ప్రజలు జన ఔషధి కేంద్రాలను రోజూ సందర్శిస్తున్నారు. ఈ పథకం కింద 1759 మందులు, 280 సర్జికల్‌ ఐటమ్స్ అం‌దుబాటులో ఉన్నాయి. యాంటీ కేన్సర్‌ ‌డ్రగ్‌లు కూడా ఇందులో ఉండటం విశేషం. దేశవ్యాప్తంగా 700 జిల్లాల్లో 8,689 జన ఔషధి కేంద్రాలున్నాయి. వాటికి తగినంత ప్రచారం కల్పిస్తే ప్రజల నుంచి వారికి మరింత ఆదరణ కలుగుతుంది. ఔషధ రంగంలో భారత్‌ ‌గడించిన ఖ్యాతికిది నిదర్శనం.

ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ ‌మన్సుఖ్‌ ‌మాండవ్యా దాదాపు 100 మంది విదేశీ ప్రతినిధులతో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన పథకంపైన సమావేశం నిర్వహించారు. ఇందులో విదేశాంగ మంత్రి జైశంకర్‌ ‌కూడా పాల్గొన్నారు. కొవిడ్‌-19 ‌పరిణామాల అనంతరం వైద్య ఆరోగ్యరంగంపైన దృష్టి సారించవలసిన అవసరం ఉందని చెప్పారు. 50 శాతం ఎగుమతులు నిర్వహిస్తున్న భారత్‌ను ‘ఫార్మసీ ఆఫ్‌ ‌ది వరల్డ్’ ‌గా పిలవటం సమంజసమని పేర్కొన్నారు. పేదలకు కమర్షియల్‌ ‌మార్కెట్‌తో పోలిస్తే 50 నుంచి 80 శాతం తక్కువ ధరకు నాణ్యమైన మందులను అందించటం జనఔషధి కేంద్రాల విశిష్టత అని పేర్కొన్నారు. పైలట్‌ ‌ప్రాజెక్టు కింద ఇండియా ఫార్మా ఎగుమతిదారులతో కలిసి వేగంగా అమ్ముడయ్యే 50 రకాల మందులను సేకరించాలని, దానితో పాటు ఇతర దేశాలతో ఐటీ, సప్లై చెయిన్‌, ‌ప్రచారం విధానాలను జోడించాలని సూచించారు. భారత్‌ ఆచరిస్తున్న ఉత్తమ విధానాలను గమనించి తమ దేశాలలో ఆచరించవలసిందిగా సూచించారు. విదేశాంగమంత్రి జైశంకర్‌ ‌మాట్లాడుతూ, అభివృద్ధిచెందిన దేశాలలో సైతం ఆర్థిక అసమానతలు ఉన్నాయని, దానితో అంతర్జాతీయ ప్రపంచంలో అందరికీ వైద్యాన్ని అందుబాటులో తేవటం ఎలా అన్నది అందరినీ ఒక చోటకు చేర్చిందని పేర్కొన్నారు. మూడు ‘ఏ’లు అందరినీ ఇక్కడకు చేర్చాయని అన్నారు. అవి స్తోమత, సౌలభ్యం, లభ్యత (ఎఫర్టబులిటీ, ఎక్సెసబులిటీ, ఎవైలబులిటీ).ఆయా దేశాలలో జనఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయటానికి అవసరమైన సహకారం అందిస్తామని అన్నారు.

ఈ-ఫార్మశీల నియంత్రణకు బిల్లు

కేంద్ర ప్రభుత్వం ఆన్‌ ‌లైన్‌ ‌ఫార్మశీలను నియంత్రించటానికి సిద్ధమైంది. ఇందుకు న్యూ డ్రగ్స్, ‌మెడికల్‌ ‌డివైసెస్‌, ‌కాస్మొటిక్‌ ‌బిల్లును సిద్ధం చేసింది. ఆన్‌ ‌లైన్‌ ‌విధానంలో అమ్మే మందులను నిషేధించటం, నియంత్రించటం, క్రమబద్ధీక రించటం వంటివి ప్రభుత్వం చేయవచ్చు అని ఈ బిల్లు ముసాయిదాలో పేర్కొంది. ప్రభుత్వం అనుమతి లేకుండా అవి ఇకపై మందులను అమ్మటం, పంపిణీ చేయటం వంటివి చేయకూడదు.

దేశవ్యాప్తంగా ఈ- పార్మశీలు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి. అవి మందులపైన భారీ రాయితీని ఇస్తున్నాయి. దానితో వాటిని క్రమబద్ధీకరించాలనే డిమాండ్లు రిటైల్‌ ‌కెమిస్టుల నుంచి, ఫార్మాస్యుటికల్‌ ‌సంస్థల నుంచి వస్తున్నాయి.

రిజిస్ట్రేషన్‌ ‌లేని ఈ-ఫార్మశీలపైన నిషేధం విధిస్తూ 2018లో కేంద్ర వైద్య ఆరోగ్యసంస్థ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో ఆన్‌ ‌లైన్లో నార్కోటిక్స్, ‌సైకో ట్రోపిక్‌ ‌డ్రగ్‌ ‌లు, ట్రాంక్విలైజర్లను అమ్మకాలపైన నిషేధం విధించారు. ఇందుకోసం 1945 నాటి డ్రగ్స్, ‌కాస్మొటిక్స్ ‌నిబంధనలను సవరించింది.

2015లో ఈ ఫార్మశీలపైన కన్సల్టేటివ్‌ ‌కమిటీని నియమించారు. ఉన్నతస్థాయిలో 86 సార్లు చర్చించిన అనంతరం 2016లో డ్రగ్‌ ‌కంట్రోలర్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ఇం‌డియాకు నివేదిక సమర్పించారు.

కొత్త బిల్లు ప్రకారం, తన సెంట్రల్‌ ‌డ్రగ్స్ ‌స్టాండర్డు కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ ‌ద్వారా కేంద్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకోవచ్చు. ప్రస్తుతం తయారీ లైసెన్సులన్నీ రాష్ట్రాల డ్రగ్‌ ‌నియంత్రణ సంస్థల చేతుల్లో ఉన్నాయి. గత జులైలో ఈ ముసాయిదాను సలహాలు సూచనల నిమిత్తం ప్రజలకు అందుబాటులో ఉంచారు. దాంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు, సెంట్రల్‌ ‌డ్రగ్‌ ‌స్టాండర్డ్ ‌కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌కు అనేక సూచనలు అందాయి. వీటన్నింటిని ఆధారంగా మంత్రిత్వశాఖ అవసరమైన సవరణలు చేసి మధ్యంతర సంప్రదింపుల కోసం పంపారు.

క్లినికల్‌ ‌ట్రయల్స్‌కు సంబంధించిన అంశంలోనూ కొన్ని ప్రతిపాదనలు చేశారు. కొత్త చట్టం ప్రకారం, కొత్త జౌషధాల నిమిత్తం నిర్వహించే క్లినికల్‌ ‌ట్రయల్స్, ‌మెడికల్‌ ‌డివైజెస్‌, అలాగే వీటిని నిర్వహించేటప్పుడు చనిపోవటంగానీ, గాయపడటం గానీ సంభవించటం.. ప్రయోగంలో భాగస్వాములయిన మెడికల్‌ ‌మేనేజిమెంటు మొత్తం న్యూడ్రగ్స్ అం‌డ్‌ ‌క్లినికల్‌ ‌ట్రయల్స్, 2019 ‌పైన ఆధారపడుతుంది. మెడికల్‌ ‌డివైజెస్‌ను కూడా డ్రగ్స్ ‌గానే పరిగణిస్తారు తప్ప దానికి ప్రత్యేకమైన నిర్వచనం అంటూ ఉండదు. ఇంతకు ముందు ఆయుర్వేదం, యునాని, సిద్ధ ఔషధాలను. కాస్మొటిక్‌ ‌లను మాత్రమే నియంత్రించే ఆయుష్‌లో సోవా, రిగ్పా, హోమియోపతి వ్యవస్థలను కూడా చేర్చారు.

 మందులపైన నిషేధం

గత ఏడాది సెప్టెంబరులో కేంద్రవైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ ‌మాండవ్య 27 విభాగాల్లో 384 మందులతో నేషనల్‌ ‌లిస్ట్ ఆఫ్‌ ఎస్సెన్సియల్‌ ‌మెడిసిన్స్ (ఎన్‌ఎల్‌ఈఎమ్‌) ‌జాబితాను విడుదల చేశారు. ఇందులో 26 మందులను ఈ జాబితా నుంచి తొలగించారు. ఉదాహరణకు ఎసిడిటీకి, ఉదర సంబంధమైన ఇతర సమస్యలకు వాడే రాంటాక్‌, ‌జైన్‌ ‌టాక్‌, ఎసిలోక్‌ అన్న బ్రాండ్‌ ‌నేమ్‌తో విక్రయించే రనిటుడీన్‌ ‌కూడా ఇందులో ఉంది. ఇందులో కేన్సర్‌ ‌కారక రసాయనాలు ఉన్నాయన్న అనుమానంతో దానిని నిషేధించారు.

2020లో, ఫుడ్‌ అం‌డ్‌ ‌డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌ ‌డి ఏ) మొత్తం రనిటుడీన్‌ ‌మందులను వెనక్కి తీసుకుంది. ఇందులో తక్కువ స్థాయి నైట్రోసోడిమే థైల్మైన్‌ (ఎన్‌ ‌డి ఎమ్‌ ఏ) ఉం‌దని, ఇండియన్‌ ‌జర్నల్‌ ఆఫ్‌ ‌ఫార్మకాలజీ అధ్యయనాన్ని ప్రకటించింది. దీనితో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణంగా వాడే కొన్ని యాంటీబయోటిక్స్, ‌వాక్సిన్లు, కేన్సర్‌ ‌డ్రగ్‌ల ధరలను తగ్గించి వాటిని ప్రజలకు అందు బాటులోకి తెచ్చామని కేంద్ర మంత్రి ప్రకటించారు.

–         మొత్తం 14 కాక్‌ ‌డ్రయిల్‌ ‌డ్రగ్స్ ‌పైన నిషేధం విధించవలసిందిగా డ్రగ్స్ ‌కంట్రోలర్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ఇం‌డియా (డిసిజిఐ)కు చెందిన ఎపెక్సు ఎడ్విజరీ బోర్డు సూచించింది. రెండు లేదా అంతకు మించిన డ్రగ్‌లను తగిన నిష్పత్తిలో కలిపి ఒకే మందుగా రూపొందించటాన్ని కాంబినేషన్‌ ‌డ్రగ్‌లుగా పిలుస్తారు. ఇందులో అనేక దగ్గు నివారణ మందులున్నాయి.

–         2018లో పెయిన్‌ ‌కిల్లర్లు, యాంటీ బయోటిక్‌, ‌శ్వాస, గ్యాస్ట్రో, ఇంటెస్టినాల్‌ ‌వ్యాధులకు సంబంధించిన ఆరువేల బ్రాండ్లపైన నిషేధం విధించారు.

నిషేధిత మందుల సిఫార్సు

2016లో నిర్వహించిన ఒక సర్వేలో ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడయింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిషేధిత 344 కాంబినేషన్ల మందులలో ఏదో ఒక దానిని తాము వ్యాధిగ్రస్తులకు సూచిస్తున్నామని దాదాపు 80 శాతం మంది వైద్యులు పేర్కొన్నారు. నిజానికి నిషేధించిన మందుల్లో ఎక్కువ యాంటీ బయోటిక్స్, ‌పెయిన్‌ ‌కిల్లర్లు ఉన్నాయి. వీటిని నిషేధించటం వల్ల తమ పేరుప్రతిష్ఠలపై ప్రభావం పడిందని భావిస్తున్నారు. హెల్త్ ‌కేర్‌ ‌సంస్థ ఈమెడ్‌ ‌నెక్సెస్‌ ఈ ‌సర్వే నిర్వహించింది. దేశంలో 4,892 మంది వైద్యుల నుంచి అభిప్రాయాలను రాబట్టింది. ఇందులో పాల్గొన్న పది మందిలో నలుగురు ఈ నిషేధం ‘అనవసరం’ అని అభిప్రాయపడ్డారు. దీనితో ఆల్‌ ఇం‌డియా ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ‌కెమిస్టస్ అం‌డ్‌ ‌డ్రగిస్టస్ ‌సంస్థ నిషేధం అంశాన్ని పున:పరిశీలించవలసిందిగా డ్రగ్‌ ‌కంట్రోలర్‌ ‌జనరల్‌ ఆఫ్‌ ఇం‌డియాకు లేఖ రాసింది. రెండు కంటే ఎక్కువ ఫార్ములాలు లేదా ఇంగ్రేడియెంట్స్ ఉం‌డటం వల్ల కేంద్రం ఈ మందులపై నిషేధం విధించింది. ‘‘జలుబు ఒక్కటే బాధిస్తున్నప్పుడు రోగికి జ్వరం మందు ఇవ్వటం ఎందుకు. ఈ మందులను ఎక్కువగా ఉపయో గించటం వల్ల ఔషధ నిరోధక శక్తి ఎక్కువవుతోంది’’ అని వైద్యనిపుణులు చెబుతున్నారు. 60 శాతం మంది వైద్యలు నిషేధాన్ని సమర్థించారు. మీడియాలో నిషేధిత మందులను గురించి వార్తలు రావటం వల్ల, గతంలో ఈ మందులను వాడటం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అని కొందరు వైద్యవృత్తిలో ఉన్నవారిని కలిసి అడిగారు.

Coronavirus India Highlights: 1,17,100 Fresh COVID-19 Cases In Indiaకొవిడ్‌ అనంతర పరిస్థితుల్లో…

స్వాతంత్య్రానంతరం భారత చరిత్రలో ఆరోగ్యరంగంలో దురదృష్టకర పరిణామాలు కొవిడ్‌ -19 ‌రెండో దశ సందర్భంగా 2021లో సంభవించాయి. తగిన వైద్యసేవలందక ప్రజలు అలమటించిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వాలు కూడా చాలా సందర్భాల్లో నిస్సహాయంగా ఉండిపోవలసి వచ్చింది. ఆసుపత్రులలో పడకలు, మెడికల్‌ ఆక్సిజన్‌, ‌మందుల కోసం పడరాని పాట్లు పడ్డారు. ఈ సందర్భంగా కార్పొరేట్‌ ఆసుపత్రులు అందినకాడికి దోచుకున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో అరకొర సౌకర్యాలు ఉండటం వారికి కలిసొచ్చింది. డబ్బు ఖర్చయినా ఫరవాలేదు. ప్రాణాలు దక్కితే చాలు అనుకుని బాధిత కుటుంబాలు అప్పో సొప్పో చేసి లక్షలు తెచ్చి వైద్యుల చేతిలో పోశారు. అంత ఖర్చు చేసినా తమ వారి ప్రాణాలు దక్కక ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయారు. మే, జూన్‌ 2021‌లో దేశవ్యాప్తంగా అత్యధికంగా కేసులు, రోజువారీ మరణాలు సంభవించాయి. అప్పటి నుంచి ప్రజల్లో ఆరోగ్యం పట్ల భయం, అభద్రత అనేవి మరింతగా పెరిగిపోయాయి. ప్రజల అమాయ కత్వాన్ని, బలహీనతను వైద్యులు, ఫార్మసిస్టులు, మెడికల్‌ ‌షాపులు, డయోగ్నస్టిక్‌ ‌సెంటర్ల వాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఇదో మాఫియాగా తయారైంది.

మారిన జీవనశైలివల్ల కావచ్చు, ఆహారపు అలవాట్ల వల్ల కావచ్చు, రోజువారీ జీవనపోరాటం వల్ల వచ్చే ఒత్తిడి వల్ల కావచ్చు. ఇప్పుడు రోగనిరోధక శక్తి చాలా తగ్గిపోయింది. దాంతో ప్రజలు ఇట్టే జబ్బు పడుతున్నారు. ఒకప్పుడు వాము, సొంఠి, పసుపు లాంటివి వాడి ఇంటి వైద్యాలతో బి.పి., సుగర్‌, ‌థైరాయిడ్‌ ‌లాంటివి తగ్గించుకునేవారు. ఇప్పుడు బాధితులు ఆసుపత్రులను ఆశ్రయించక తప్పటం లేదు. అదే దోపిడీకి నాంది. ముందుగా పరీక్షల ప్రహసనం. వైద్యుని దగ్గరకు వెళ్లగానే, అవసరం ఉన్నా లేకపోయినా సాధారణ జ్వరమే అయినా 10 నుంచి 15 రకాల పరీక్షలు రాస్తారు. ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న డయోగ్నస్టిక్‌ ‌సెంటర్‌లోనే పరీక్ష చేయించాలి. ఆ తర్వాత చాంతాండంత మందుల జాబితా రాస్తారు. అన్ని ప్రయివేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల ప్రాంగణాల్లో మందుల షాపులు ఉంటాయి. ఆయా డాక్టర్లు రాసే మందులు అక్కడే లభ్యమవుతాయి. అక్కడే తీసుకోవాలని నిబంధన విధించి మరీ వాళ్ల చేత కొనిపిస్తారు. సదరు ఫార్మసీ కంపెనీతో వైద్యులకు ఒప్పందం ఉంటుంది. వారు అందించే కమిషన్లు, బహుమతులు, విదేశీ ప్రయాణాల కుకక్కుర్తి పడి వైద్యులు ఎక్కువ సంఖ్యలో మందులు రాస్తూంటారు. అవీ ఫార్ములేషన్‌ ‌మందులు. మందు ఒకటే, అవి పనిచేసే లక్షణం ఒకటే అయినా, జెనరిక్‌ ‌మందులు సిఫార్సు చేయరు. ఫార్మా కంపెనీలు ఆయా జబ్బులపై పరిశోధనలు చేస్తూ ఉంటాయి. ఇందులో విజయవంతం అయిన కంపెనీలు పేటెంట్‌ ‌సాధిస్తాయి. దీనివల్ల 20 ఏళ్ల పాటు ఆ కంపెనీకి ఉత్పత్తిపైన గుత్తాధిపత్యం లభిస్తుంది. మరే కంపెనీ దాని ఫార్ములాను ఉపయో గించకూడదు. ఈ సంస్థలు తయారు చేసిన మందు లను ‘బ్రాండెడ్‌ ‌మందులు’ అని వ్యవహరిస్తారు. పరిశోధనలు, ప్రయోగాలు, క్లినికల్‌ ‌ట్రయల్స్ ‌తదితరాలకు భారీగా ఖర్చు చేశామని చెప్పి మందులకు ఎక్కువ ధర నిర్ణయిస్తారు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ఇతర కంపెనీలు అదే ఫార్ములాతో మందులను తయారు చేస్తాయి. వాటిని ‘జెనరిక్‌ ‌మందులు’ అని పేర్కొంటారు. బ్రాండెడ్‌ ‌మందులు పాటించవలసిన ప్రమాణాలన్నీ పోస్తాయి. పైగా తక్కువ ధరకే లభ్యం అవుతాయి. ఈ విషయం తెలిసినా వైద్యులు జెనరిక్‌ ‌మందులు రాయరు. నూటికి 90 శాతం మంది నిబంధనలు పాటించరు.

మరోవైపు డాక్టర్లు సిఫార్సు చేసిన మందుల దుకాణదారు అందించాడా లేదా అన్నది ఎప్పుడూ చిక్కు ప్రశ్నే. డాక్టర్ల చేతి రాత అర్థంకాదు. నాసిరకం, నకిలీ మందులు అంటకట్టినా దానిని గుర్తించగలిగే పరిస్థితులు లేవు. జెనరిక్‌ ‌మందులను ఫార్ములేషన్‌ ‌మందుల పేరుతో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఎంఆర్పీ ధరలకు పన్నులు కలిపి మరీ అమ్ముతున్నారు. దీన్ని నియంత్రించే వ్యవస్థ లేదు. డ్రగ్‌ ‌కంట్రోల్‌ అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తగిన విద్యార్హతలు ఉన్నవాళ్లని మెడికల్‌ ‌షాపుల్లో ఉంచాలని నిబంధనలు ఉన్నా అరకొర చదువులు ఉన్నవారిని తక్కువ జీతం ఇచ్చి పనిచేయించుకుంటున్నారు.

అమెరికాలో ‘‘ఆరెంజ్‌ ‌బుక్‌’’ అనేది అమలులో ఉంది. ఆమోదం పొందిన మందులు, వాటి ఫార్ములా వివరాలన్నీ దాని ద్వారా తెలుసుకోవటం వీలవు తుంది. మనదేశంలో కూడా ఈ విధానం అమలు చేస్తే బావుంటుందని వైద్యరంగ నిపుణులు సూచిస్తు న్నారు. ఇకపోతే కల్తీ మందులను కనుగొనగలిగే వ్యవస్థ లేదు. అవన్నీ అందమైన ప్యాకింగ్‌లలో వస్తున్నాయి. భారత్‌లో తయారవుతున్న మందులలో 20 శాతం నకిలీవని, రూ.16వేల కోట్ల నకిలీ మందులు విక్రయం అవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐదేళ్లక్రితం ప్రకటించింది. ఇప్పుడు అది తగ్గుముఖం పట్టిందని చెప్పటానికి కూడా ఆధారాల్లేవు. ఫార్మా సెక్యూర్‌ ‌కంపెనీ, ఎస్‌ఎంఎస్‌ ‌ల్యాబ్‌తో కలిసి డేటా బ్యాంక్‌ ‌రూపొందించింది. మందు పేరు, దాని బ్యాచ్‌ ‌నెంబరు ఆ సంస్థకు ఎస్‌ ఎమ్‌ ఎస్‌ ‌చేస్తే మందు నకిలీయా, నాణ్యమయినదా అని చెబుతానని గతంలో ప్రకటించింది.

ఫార్మా రంగంలో పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద పీట వస్తోంది. ఈ రంగంలో పరిశోధన, అభివృద్ధిపైన ప్రత్యేక దృష్టిపెట్టాలని బడ్జెట్లో నిర్దేశిం చారు. నైపుణ్యాభివృద్ధికి, స్థానీయంగా వైద్య ఉపకరణాల తయారీకి ఏర్పాట్లు చేస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌పేర్కొన్నారు. ఇందు కోసం ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సు’ లను ప్రారంభించా లన్న కేంద్ర నిర్ణయాన్ని పరిశ్రమల వర్గాలు స్వాగతించాయి.

కృత్రిమ మేథ ఆధారిత మూడు ఇన్నోవేషన్‌ ‌సెంటర్లు ఏర్పాటు చేస్తారు. అలాగే కొత్త విద్యా సంస్థలను ఏర్పాటు చేసి వైద్య ఉపకరణాల రంగంలో నిపుణులయిన వైద్యనిపుణులను తయారు చేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక పరిశ్రమల వర్గాల వారు చవకగా లభించే చైనా ఉత్పత్తులతో పోటీ పడలేక పోతున్నారు. దానితో పాటు తక్కువ డ్యూటీ ధర, దిగమతులలో సౌలభ్యం వల్ల చైనా నుంచి విడిభాగాల ఉత్పత్తి పెరిగిపోతోంది. గత ఏడాది చైనా నుంచి దిగుమతి చేసుకున్న వైద్య ఉపకరణాల విలువ రూ.9 వేల కోట్ల నుంచి రూ. 15వేల కోట్లకు చేరింది. ఈ రంగంలో స్వావలంబనను సాధించాలంటే చాలా దూరం ప్రయాణించాలి. మరోవైపు ప్రజల ధన, ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నకిలీ మందుల పైన ప్రభుత్వ కొరడా ఝుళిపిస్తూ ఉండవలసిందే. ‘ది ట్రూత్‌ ‌పిల్‌: ‌ది మిత్‌ ఆఫ్‌ ‌డ్రగ్‌ ‌రెగ్యులేషన్స్ ఇన్‌ ఇం‌డియా’ అన్న పుస్తకం కూడా సరైన సమయంలోనే విడుదలైందని చెప్పవచ్చు. దినేశ్‌ ‌ఠాకూర్‌, ‌ప్రశాంత్‌ ‌రెడ్డి ఈ పుస్తకం ద్వారా వెల్లడించిన అంశాలు ప్రభుత్వం సత్వరమే కదల డానికి ఆస్కారం కల్పించాయి. జనరిక్‌ ‌మందులు పేరుతో కంపెనీలు తయారు చేస్తున్నవి అసలు మందులంత నాణ్యమైనవని చెప్పడానికి సందేహించ వలసి ఉంటుందని రచయితల అభిప్రాయాన్ని కేంద్రం తీవ్రంగానే పరిగణించింది. అందుకే ఆ రంగానికి ఇంత కుదుపు ఇచ్చింది. తయారీతో దగ్గరే కాదు, అనుమతుల విషయంలోను సరైన నిబంధనలు అమలు కావడం లేదన్న ఆరోపణ కూడా ఈ పుస్తకంలో చేశారు. 1970 దశకం నుంచి వస్తున్న ఇలాంటి ఆరోపణలకు ఇకనైనా అడ్డుకట్ట వేయాలని కేంద్రం నిర్ణయించడం స్వాగతించదగినదే.

‌- డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Twitter
Instagram