ఏప్రిల్‌ 13 ‘‌బాగ్‌’ ‌దురంతం

ఏప్రిల్‌ 13, 1919.. ‌వైశాఖీ పండగ రోజున ఓ తోటలో వేలాది మందితో సభ జరుగుతోంది. హఠాత్తుగా ఓ సైనిక బలగం అక్కడికి వచ్చి నిమిషాల వ్యవధిలోనే కాల్పులు మొదల పెట్టింది. ఏం జరుగు తోందో అర్థం కాక హాహాకారాలు మొదల య్యాయి. ఎవరూ తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఆనాటి విషాద ఘటనలో వందలాది మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో నెత్తురోడిన చీకటి రోజు అది. 104 ఏళ్ల క్రితం జలియన్‌ ‌వాలాబాగ్‌లో బ్రిగేడియర్‌ ‌జనరల్‌ ‌రెజినాల్డ్ ‌డయ్యర్‌ ‌జరిపిన మారణ కాండ బ్రిటిష్‌ ‌పాలనపై పోరాటాన్ని మలుపు తప్పింది.

భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో అత్యంత విషాదకర, దురదృష్టకర, హేయమైన సంఘటనగా జలియన్‌ ‌వాలాబాగ్‌ ‌దురాగతం నిలిచిపోయింది. స్వాతంత్య్రం కోసం అన్నిరకాల పద్ధ్దతుల్లో పోరాడు తున్న భారతీయులకు ఒక హెచ్చరిక అన్నట్లుగా బ్రిటిష్‌ ‌వారు ఈ చర్యకు పాల్పడినా, దాని పరిణా మాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించ లేకపో యారు. ఇందుకు దారితీసిన పరిణామాలను మొదటి ప్రపంచ యుద్ధం కన్నా ముందు నుంచే గమనించ వచ్చు..

బెంగాల్‌లో వందేమాతర ఉద్యమం, విప్లవ కారుల దాడులు, తిరుగుబాట్లకు బెంబేలెత్తిపోయిన బ్రిటిష్‌ ‌పాలకులు రాజధానిని కలకత్తా నుంచి న్యూఢిల్లీకి మార్చారు. ఇంతలోనే మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. బ్రిటిష్‌ ‌వారికి భారీగా సైన్యం కావాల్సి వచ్చింది. భారతదేశం నుంచి సైనికులను సమీకరించుకోవడానికి స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న జాతీయవాదుల సాయం కోరారు. యుద్ధం తర్వాత స్వాతంత్య్రం పొందాలనే ఆలోచనతో కాంగ్రెస్‌ ‌సహా ఇతర పార్టీలు అందుకు అంగీక రించాయి. ఆ యుద్ధ్దంలో 43 వేల మంది భారతీయ సైనికుల్ని పోగొట్టుకున్నాం. అంతేగాక మన దేశం నుంచి భారీగా ధనం కూడా తీసుకెళ్లడంతో ద్రవ్యోల్భణం తీవ్రమైంది. బ్రిటిష్‌ ‌వారు ప్రజలపై మరిన్ని పన్నులు విధించారు.

నిరంకుశ రౌలత్‌ ‌చట్టం

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్‌ ‌వారికి చేసిన సాయానికి ప్రతిగా స్వాతంత్య్రం ఇవ్వాలని జాతీయవాదులు పట్టుబట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో స్వాతంత్య్రం బదులు పరిపాలనలో మాంటేగ్‌-‌చెమ్స్‌ఫర్డ్ ‌సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఇవి ఏ మాత్రం చాలవని భారతీయులు స్పష్టం చేయడంతో బ్రిటిష్‌ ‌వారు కొత్త కుట్రలకు తెరలేపారు.

దేశ ప్రజల్లో నానాటికీ రగులుతున్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని 1918లో ఆంగ్లేయ న్యాయమూర్తి సిడ్నీ రౌలత్‌ ఆధ్వర్యంలో ఒక కమిటీని (రౌలత్‌ ‌కమిటీ)ఏర్పాటు చేసింది. ఈ కమిటీ భారతదేశంలో గదర్‌ ‌కుట్ర నేపథ్యంలో పంజాబ్‌, ‌బెంగాల్‌ ‌ప్రాంతాలలో మిలిటెంట్‌ ఉద్యమానికీ, రష్యా, జర్మనీకి సంబంధాలు ఏమైనా ఉన్నాయా? అనే అంశంపై దర్యాప్తు చేసింది. రౌలత్‌ ‌కమిటీ ప్రతిపాదనను అనుసరించి బ్రిటీష్‌ ‌ప్రభుత్వం 1915లో రూపొం దించిన భారతీయ రక్షణ చట్టానికి అదనంగా 1919లో రౌలత్‌ ‌చట్టాన్ని ప్రతిపాదించింది.

ఈ నల్లచట్టం ద్వారా తిరుగుబాట్లను అణిచి వేయడానికి వైస్రాయ్‌లకు విశేష అధికారాలని కట్టబెట్టారు. పత్రికలపై సెన్సార్‌షిప్‌తోపాటు విచారణ లేకుండా రాజకీయ నాయకులను నిర్బంధించడం, వారంటు లేకుండా అరెస్టు చేయడం మొదలైన నిరంకుశమైన అధికారాలు ఇందులో ఉన్నాయి. ఈ చట్టం ప్రకారం, నేరస్థుడిపై కేసు నమోదు చేసిన వ్యక్తి పేరును తెలుసుకునే హక్కు కూడా రద్దు చేశారు. రౌలత్‌ ‌చట్టంపై దేశంలో సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిరసనలు, ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి. ఆందోళన లను కట్టడి చేయడంలో భాగంగా బ్రిటిష్‌ ‌ప్రభుత్వం డాక్టర్‌ ‌సైఫుద్దీన్‌ ‌కిచ్లూ, సత్యపాల్‌ ‌వంటి నేతలను అరెస్ట్ ‌చేసి, దేశ బహిష్కరణ విధించింది. దీనిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ప్రజాందోళనలు నిర్వహించారు. రౌలత్‌ ‌చట్టానికి వ్యతిరేకంగా అరెస్టయిన వారికి సంఘీభావం ప్రకటిస్తూ అమృత్‌సర్‌లోని జలియన్‌ ‌వాలాబాగ్‌లో కూడా ఒక సభ ఏర్పాటైంది.

గర్జించిన తుపాకులు

జలియన్‌ ‌వాలాబాగ్‌లో భారీ సభ జరుగుతున్న విషయం ప్రభుత్వానికి ముందుగానే తెలుసు. సరిగ్గా వైశాఖీ పండుగ ముందురోజే జనరల్‌ ‌రెజినాల్డ్ ‌డయ్యర్‌ ‌జలంధర్‌ ‌నుంచి అమృతసర్‌కు ట్రాన్స్‌ఫర్‌ అయ్యాడు. అతడు వచ్చీ రాగానే బహిరంగ ప్రదేశాల్లో జనం గుమిగూడటంపై ఆంక్షలు విధించాడు. వీటిని లెక్క చేయకుండా జలియన్‌ ‌వాలాబాగ్‌లో సభ నిర్వహించడాన్ని జీర్ణించు కోలేకపోయాడు. డయ్యర్‌ ‌నగరంలో కర్ఫ్యూ విధించి సైనికులతో కవాతు నిర్వహించాడు.

ఏప్రిల్‌ 13‌తేదీ సాయంత్రం. జలియన్‌ ‌వాలాబాగ్‌ ‌కిక్కిరిసి పోయింది. ఆ రోజు సిక్కులు, పంజాబీలకు ఎంతో పవిత్రమైన వైశాఖీ (బైశాఖీ) పండుగ దినం. వేలాది మంది సభకు తరలి వచ్చారు. కుటుంబసమేతంగా నగరంలో వ్యాహ్యాళి కోసం వచ్చినవారు కూడా వారిలో ఉన్నారు. దాదాపు 20 వేల మంది ఉంటారు. ఇందులో హిందువులు, సిక్కులు, ముస్లింలతో పాటు మహిళలు, వృద్ధులు, చిన్నారులు కూడా ఉన్నారు. వక్తల ప్రసంగాలను ఆసక్తిగా వింటున్నారు.

సూర్యాస్తమయ సమయంలో ఆకాశంలో ఓ విమానం చక్కర్లు కొడుతూ కనిపించింది. అక్కడున్న వారిలో చాలామందికి విమానాన్ని చూడటం అదే తొలిసారి. అప్పుడు బూట్లతో కవాతు శబ్దం వినిపించింది. జలియన్‌ ‌వాలాబాగ్‌ ‌తోటను అప్పటికే 90 మంది సైనికులు చుట్టుముట్టారు. వీరితో సైనిక శకటాలు కూడా ఉన్నాయి. ఇంతలో పెద్దగా బూట్ల చప్పుడు మొదలైంది. కొన్ని క్షణాల్లోనే జలియన్‌ ‌వాలాబాగ్‌కు వచ్చే ఇరుకైన దారినుంచి 50మంది సైనికులు లోనికి వచ్చారు. ఇద్దరేసి చొప్పున ‘ఫార్మేషన్‌’‌గా ఏర్పడుతూ బాగ్‌కు రెండు వైపులా విస్తరిం చారు. 25 మంది గోరా, 25 మంది బలూచ్‌ ‌సైనికుల్లో సగంమంది కూర్చొని, సగంమంది నిల్చొని పొజిషన్‌ ‌తీసుకున్నారు. వారిని చూసిన జనం ఆందోళనతో లేచారు. అప్పుడే ‘కూర్చోండి.. కూర్చోండి.. వాళ్లు కాల్పులేమీ జరపరు’ అని ఎవరో అనేసరికి అంతా కూర్చుండి పోయారు.

ఈ సైనికులతో పాటు జనరల్‌ ‌డయ్యర్‌ ‌కూడా వచ్చాడు. ఎలాంటి హెచ్చరిక లేకుండా, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ‘ఫైర్‌’ అం‌టూ ఆదేశించాడు. సైనికులు తుపాకులు గురిపెట్టి కాల్పులు మొదలు పెట్టారు. సభలో హాహాకారాలు మొదలయ్యాయి. జనాలు గాయపడుతూ, ప్రాణాలు వదులుతూ నేల కొరుగుతున్నారు. సైనికుల తూటాలేవీ వృథా కావడం లేదు. వరుసగా రీలోడ్‌ ‌చేసి కాల్పులు కొనసాగించారు. డయ్యర్‌ ఒక పెద్ద గుంపును చూసి అటువైపు కాల్చమని పురమాయించాడు. జలియన్‌ ‌వాలాబాగ్‌ ‌చుట్టూ ఎత్తయిన గోడలు, ఒకే ద్వారం ఉండటంతో ఎవరూ తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ద్వారం వైపు పరిగెత్తే గుంపును కూడా లక్ష్యం చేసుకున్నారు. నేల మీద పడుకొని రక్షించుకునేందుకు ప్రయత్నించిన వారినీ వదలలేదు. పార్కు గోడలపైకి ఎక్కేందుకు కొందరు విఫలయత్నం చేశారు. ఆ తోటలో ఉన్న బావిలో దూకి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ ఒకరిపై ఒకరు పడి ఊపిరాడక చని పోయారు.

శవాల గుట్టలు, క్షతగాత్రుల రోదనలు

జనరల్‌ ‌డయ్యర్‌ ‌పక్కనే ఉన్న సార్జంట్‌ ఆం‌డర్సన్‌, ‌కెప్టెన్‌ ‌బ్రిగ్స్ ‘‌కాల్పులు ఇక ఆపుదామ’ని చెప్పినా, ఆయన సలహాను డయ్యర్‌ ‌లెక్క చేయలేదు. వారితో పాటు మరో ఇంగ్లీషువాడైన ఎస్పీ రీహేల్‌ ‌కూడా ఉన్నాడు. జలియన్‌వాలాబాగ్‌లో పది నిమిషాల వరకూ ఆ కాల్పులు కొనసాగాయి. మొత్తం 1650 రౌండ్ల కాల్పులు జరిపారు. సైనికులు ఆ తోటలోకి ఎంత వేగంతో ప్రవేశించారో కాల్పులు పూర్తయిన వెంటనే అంతే వేగంతో అక్కడి నుంచి నిష్క్రమించారు. డయ్యర్‌ ‌కారులో కూర్చోగా, వెనకాలే సైనికులు కవాతుగా అనుసరించారు.

కాల్పులు జరిగిన ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించారు. అక్కడ ఎన్నో శవాలు గుట్టగా పడి ఉన్నాయి. వాటి మధ్యలో క్షతగాత్రులు సాయం కోసం రోదిస్తున్నా పట్టించుకునేవారు లేరు. రాత్రి దాటే వరకూ ఎవరికీ వైద్యసాయం అందలేదు. మృత దేహాలను, క్షతగాత్రులను తీసుకువెళ్లేందుకు వారి కుటుంబసభ్యులను, బంధువులను సైతం అనుమ తించలేదు. ఈ కారణంగా మరణాలు మరింతగా పెరిగాయి.

జలియన్‌ ‌వాలాబాగ్‌లో కాల్పుల తర్వాత జనరల్‌ ‌డయ్యర్‌ ‌మొత్తం పట్టణానికి విద్యుత్‌, ‌నీటి సరఫరాను నిలిపేయించాడు. రాత్రి పది గంటలకు పట్టణంలో మరోసారి పర్యటించి, ఆంక్షలు అమలవుతున్న తీరును పరిశీలించాడు. ఆ రాత్రి డయ్యర్‌కు రోడ్లమీద జనం కనిపించకున్నా, పట్టణమంతా రోదిస్తూ జాగారం చేసింది. తెల్లవారేసరికి జలియన్‌ ‌వాలాబాగ్‌లో గద్దలు ఎగరడం మొదలుపెట్టాయి. ఎండ కారణంగా శవాలు కుళ్లిపోసాగాయి. సాయాన్ని కూడా అడ్డుకోవడానికి మించిన క్రూరత్వం ఏముంటుంది?

తేలని మరణాల సంఖ్య

జలియన్‌వాలాబాగ్‌ ‌కాల్పులు జరిగినప్పుడు పంజాబ్‌ ‌లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌గా ఉన్న ఓ. డ్వాయర్‌కు డయ్యర్‌ ‌పంపిన నివేదికలో 200 మంది మరణించా రని పేర్కొన్నారు. అయితే ఫైరింగ్‌లో మొత్తం 378 మంది మరణించినట్లు హంటర్‌ ‌కమిటీ తేల్చింది. వారిలో 337 మంది పురుషులు, 41 మంది చిన్నారులు ఉన్నట్లు నిర్ధారించింది. కానీ అనధికారిక లెక్కల ప్రకారం వెయ్యి మందికి పైగా మరణించగా, రెండు వేల మంది గాయపడ్డారు. మరో కథనం ప్రకారం 502 మంది మృతుల వివరాలను ధ్రువీకరించారు. గుర్తు తెలియని మృత దేహాలు 45 లభించాయి. జలియన్‌ ‌వాలాబాగ్‌ ‌తోట ఇరుకైన సందులో చుట్టూ పెద్ద ఇళ్లు, భవంతులతో ఉంటుంది. ఈ కారణంగా సైనిక శకటాలు లోనికి వెళ్లలేక పోయాయి. అవి కూడా వెళ్లి ఉంటే పరిస్థితి మరింత ఘోరంగా ఉండేది. ఆ స్థలంలోకి వాహనాలు వెళ్లగలిగితే తాను మెషిన్‌ ‌గన్లతో కాల్పులు జరిపించి ఉండేవాడినని డయ్యర్‌ ‌చెప్పుకున్నాడు. జలియన్‌ ‌వాలాబాగ్‌ ఉదంతం చరిత్రలో ఓ విషాద దినంగా, చీకటి రోజుగా మిగిలిపోయింది.

బ్రిటిష్‌వారు ఎంత దాచాలని ప్రయత్నించినా జలియన్‌ ‌వాలాబాగ్‌ ‌ఘటన దేశమంతా తెలిసి పోయింది. ప్రజలంతా బ్రిటిష్‌ ‌వారిపై ప్రతీకారంతో, దేశభక్తి జ్వాలలతో రగిలిపోయారు. ఇంత భయంకరమైన క్రూరత్వాన్ని చూసినా దేశ భక్తుల ధైర్యం ఓడిపోలేదు. స్వాతంత్య్ర కాంక్ష ప్రజల్లో మరింత ఉధృతంగా పెరగడం మొదలైంది. ఎంతో మంది ఆ ప్రదేశాన్ని సందర్శించి రక్తంతో తడిసిన ఆ నేలను చూసి తల్లడిల్లిపోయారు. జలియన్‌ ‌వాలాబాగ్‌ ‌ఘటనకు నిరసనగా మహాత్మా గాంధీ తనకు వచ్చిన అన్ని పతకాలను వెనక్కి ఇచ్చేశారు. రవీంద్రనాథ్‌ ‌ఠాగూర్‌ ‘‌నైట్‌హుడ్‌’ ‌బిరుదును వెనక్కి ఇస్తున్నట్లు వైస్రాయ్‌ ‌చామ్స్‌ఫోర్డ్‌కు లేఖ రాశారు.

నరహంతకునికి ప్రశంసలు

జలియన్‌ ‌వాలాబాగ్‌ ‌మారణకాండకు కారకుడైన జనరల్‌ ‌డయ్యర్‌ను భారతీయులతో పాటు బ్రిటిష్‌ ‌ప్రజలు కూడా ఛీత్కరించారు. అదే సమయంలో ఆ నరహంతకునిపై బ్రిటిష్‌ ‌ప్రభుత్వంలోని చాలామంది ప్రశంసలు కురిపించారు. ‘నేను నా కర్తవ్యాన్ని నిర్వహించాను’ అని డయ్యర్‌ ‌చెప్పుకున్నాడు. ఇంత పెద్ద హత్యాకాండ జరిగినా బ్రిటిష్‌ ‌ప్రభుత్వం డయ్యర్‌పై మొదట ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో దర్యాప్తు కోసం హంటర్‌ ‌కమిటీని నియమించగా, ఆ కమిషన్‌ ‌నివేదిక (1920లో) డయ్యర్‌ను, అప్పటి పంజాబ్‌ ‌ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. పంజాబ్‌ ‌లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ ‌మైకేల్‌ ఓ ‌డ్వాయర్‌ను మాత్రం ఏమీ అనలేదు. హంటర్‌ ‌కమిటీ నివేదిక తర్వాతే బ్రిటిష్‌ ‌ప్రభుత్వం డయ్యర్‌ను రాజీనామా కోరింది. ఉద్యోగం నుంచి తొలగించి, భారత్‌లో మళ్లీ పనిచేయకుండా లండన్‌కు పంపింది. తర్వాత ‘సర్‌’ ‌బిరుదుతో సత్కరించింది. అయితే బ్రిటన్‌ ‌పార్లమెంటు దిగువ సభ హౌస్‌ ఆఫ్‌ ‌కామన్స్‌లో ఈ అంశంపై తీవ్రమైన చర్చ జరిగింది. ‘డయ్యర్‌ది పూర్తిగా తప్ప’ని సభ నిర్ణయించింది. కానీ, హౌస్‌ ఆఫ్‌ ‌లార్డస్ ‌దీన్ని తిరస్కరించింది. డయ్యర్‌కు అన్యాయం జరిగిందని బ్రిటిష్‌ ‌ప్రభుత్వానికి చెప్పింది. హౌస్‌ ఆఫ్‌ ‌లార్డస్ ‌సభ్యులు ఆ క్రూరుడి చర్యల్ని సమర్థిస్తూ ‘పంజాబ్‌ ‌రక్షకుడు’ అంటూ బిరుదులను అంకితం చేశారు. ఆనాటి కొన్ని బ్రిటిష్‌ ‌పత్రికలు కూడా డయ్యర్‌ను మెచ్చుకున్నాయి. అతని సంక్షేమం కోసం విరాళాలు కూడా సేకరించారు. బ్రిటిష్‌ ‌ప్రభుత్వం ఇంత తేలికగా డయ్యర్‌ను వదిలేసినా, భారతీయులు మాత్రం వదల్లేదు.

ఉద్దమ్‌ ‌సింగ్‌-‌భగత్‌ ‌సింగ్‌ల ప్రతిజ్ఞ

స్వాతంత్య్ర సమర పోరాటంలో అతివాద మార్గాన్ని ఎంచుకొని అమరులైన ఇద్దరు వీరులు ఉద్దమ్‌సింగ్‌, ‌భగత్‌సింగ్‌ల జీవితాలను జలియన్‌ ‌వాలాబాగ్‌ ‌ఘటన మలుపు తప్పింది. ఉద్దమ్‌ ‌సింగ్‌ ‌కేవలం డయ్యర్‌ను హతమార్చడానికే ఇంగ్లండ్‌ ‌వెళ్లి ఆ ప్రయత్నంలో విజయం సాధించాడు.

పంజాబ్‌లోని సంగ్రూర్‌ ‌జిల్లాలోని సునం తెహసీల్‌కు చెందిన కలన్‌ ‌గ్రామంలో డిసెంబరు 26, 1899న జన్మించిన ఉద్దమ్‌ ‌సింగ్‌ ‌చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. బతుకుబండిని ఈడ్చడానికి కూలీ పనులు చేశాడు. ఏప్రిల్‌ 13, 1919‌న జలియన్‌ ‌వాలాబాగ్‌లో జరిగిన సభకు మంచినీళ్లు అందించే వాలంటీర్‌గా వెళ్లాడు. ఆ రోజున తన కళ్ల ముందు జరిగిన ఘోరాన్నిచూసి తీవ్రంగా చలించిపోయాడు. కన్నీరు ఉబికివస్తుండగా రక్తంతో తడిసిన మట్టిని తీసుకొని ‘ఈ దురాగతానికి కారకుడైన వ్యక్తిని చంపిన తర్వాతే నేను చస్తాను’ అని శపథం చేశాడు.

మరోవైపు ఆర్యసమాజ్‌ ‌నడిపే వైదిక్‌ ‌స్కూలులో చదువుతున్న 13 ఏళ్ల భగత్‌సింగ్‌ను జలియన్‌ ‌వాలాబాగ్‌ ‌ఘటన కలచివేసింది. స్కూలు నుంచి 12 మైళ్లు నడచి జలియన్‌ ‌వాలాబాగ్‌ ‌వెళ్లి, రక్తంతో తడిసిన మట్టిని తిలకంగా దిద్దుకొని తనకు తాను దేశానికి అంకితం చేసుకుంటూ శపథం చేశాడు.

ఉద్దమ్‌ ‌సింగ్‌, ‌భగత్‌ ‌సింగ్‌ ‌మంచి స్నేహితులు కూడా. ఇద్దరూ కలిసి విప్లవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డయ్యర్‌ను చంపడమే లక్ష్యంగా పెట్టుకున్న ఉద్దమ్‌ ‌తుపాకీ కాల్చడం నేర్చుకున్నాడు. పార్లమెంట్‌లో బాంబు వేసి అరెస్టయిన భగత్‌ ‌సింగ్‌ను జైలుకు తరలించారు. అదే జైలులో ఉద్దమ్‌ ‌కూడా ఉన్నాడు. భగత్‌ ‌తనకన్నా చిన్నవాడైనా ఉద్దాం అయన్ని గురువుగా సంబోధించేవాడు. భగత్‌ ‌సింగ్‌ను జైలులో ఉరి తీయడం ఉద్దమ్‌కు కలచివేసింది.

ఉద్దమ్‌ ‌తుపాకీకి డయ్యర్‌ ‌హతం

ఉద్దమ్‌ ‌సింగ్‌ ‌జైలు నుంచి విడుదలయ్యాక ఇంజనీరింగ్‌ ‌చదవాలనే కారణం చూపి ఇంగ్లండ్‌ ‌పయనమయ్యాడు. లండన్‌ ‌చేరుకున్న తర్వాత మైఖేల్‌ ‌డయ్యర్‌ను అనునిత్యం వెంటాడుతూ, సందర్భం కోసం ఎదురు చూశాడు ఉద్దాం. దీనికోసం చాలా కష్టాలు పడ్డాడు. ఆకలితో నిద్రలేని ఎన్నో రాత్రులు గడిపాడు. చివరకు అనుకున్న సమయం రానేవచ్చింది.

ఆరోజు 13 మార్చి 1940. లండన్‌ ‌కాక్స్‌టన్‌ ‌హాల్‌లో డయ్యర్‌ ఒక కాన్ఫరెన్స్‌కు హాజరు కాబోతున్నాడని ఉద్దమ్‌కు సమాచారం అందింది. ఎంతో కష్టపడి ఎంట్రీ పాస్‌ ‌సంపాదించాడు. ఒక పుస్తకం మధ్యలో కాగితాలను కత్తిరించి అందులో పిస్టల్‌ ‌దాచాడు. పుస్తకం చేత పట్టుకొని హాలులోకి ప్రవేశించాడు. ఆ సభలో ఆంగ్లేయులంతా డయ్యర్‌ ‌గొప్ప వీరుడని కీర్తిస్తుంటే ఉద్దమ్‌ ‌రక్తం మరిగి పోయింది. కళ్ల ముందు జలియన్‌ ‌వాలాబాగ్‌ ‌ఘటననాటి అమాయకుల ఆర్తనాదాలు గుర్తుకు వచ్చాయి.

కొద్దిసేపటి తర్వాత డయ్యర్‌ ‌ప్రసంగం ముగిసింది. జనాలు ఆయన్ని అభినందించడానికి ఆయన దగ్గరకు వెళ్లారు. ఉద్దమ్‌ ‌కూడా దగ్గరకు వెళ్లాడు. డయ్యర్‌ ఆయన వేషధారణ చూసి కంగారుపడి అప్రమత్తమయ్యేందుకు ప్రయత్నించారు. ఉద్దమ్‌ ‌సింగ్‌ ‌మెరుపు వేగంతో పుస్తకంలోంచి తుపాకీ తీసి డయ్యర్‌ ‌మీద గుళ్లు కురిపించాడు. డయ్యర్‌ ‌రక్తపు మడుగులో పడిపోయాడు.ఉద్దమ్‌ అక్కడే నిల్చొని ‘భారత్‌ ‌మాతాకీ జై’ అంటూ నినాదాలు చేశాడు. ఉద్దమ్‌ ‌సింగ్‌ను చుట్టుముట్టిన కొందరు ఆయనపై పిడిగుద్దులు కురిపించారు. ‘ఇతన్ని చంపడానికే నేను ఇన్ని రోజులు బతికాను. నన్ను ఏమైనా చేసుకోండి’ అంటూ అరిచాడు ఉద్దమ్‌.

‌బ్రిటన్‌ ‌కోర్టులో ఉద్దమ్‌సింగ్‌ను విచారించారు. డయ్యర్‌ను ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో ధైర్యంగా చెప్పి, ఆ పని చేసినందుకు గర్వంగా ఉందన్నాడు ఉద్దమ్‌. ‌న్యాయస్థానం ఆయనకు మరణశిక్ష వేసింది. 31 జూలై 1940న ఆల్బర్ట్ ‌పియర్‌పాయింట్‌ ‌పెంటోన్‌విల్లే జైలులో ఉరితీశారు. ఉద్దమ్‌సింగ్‌ అవశేషాలను అమృత్‌సర్‌లోని జలియన్‌ ‌వాలాబాగ్‌లో భద్రపరిచారు.

స్మారక స్తూపం

జలియన్‌ ‌వాలాబాగ్‌ ‌దుర్ఘటన జరిగి0న స్థలంలో ఒక స్మారక స్తూపాన్ని నిర్మించారు. 1923లోనే ఇందుకు కావలసిన స్థలం కొనుగోలు చేశారు. పంజాబ్‌ ‌కాంగ్రెస్‌ ‌ప్రముఖులు. అమెరికాకు చెందిన బెంజమిన్‌ ‌పోల్క్ అనే ఆర్కిటెక్టు స్మారక స్తూపానికి రూపకల్పన చేశాడు. 1961 ఏప్రిల్‌ 13‌న అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేందప్రసాద్‌ ‌చేతులమీదుగా, నాటి ప్రధాని జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ వంటి నాయకుల సమక్షంలో ఈ స్తూపాన్ని అవిష్కరించారు. నిరంత రాయంగా మండుతూ ఉండే అఖండ జ్వాలను ఆ తర్వాత కాలంలో జోడించారు. జలియన్‌ ‌వాలాబాగ్‌లో గోడలు, ప్రక్కనున్న భవనాలపై బుల్లెట్‌ ‌గుర్తులను ఇప్పటికీ చూడవచ్చును. తొక్కిసలాటలో అనేక మంది మరణించిన బావి కూడా ఒక స్మారక చిహ్నం. జలియన్‌ ‌వాలాబాగ్‌ ‌స్తూపాన్ని రెండేళ్ల క్రితం ఆధునీకరించారు. 2021ఆగస్టు 28న ప్రధాని మోదీ దానిని ఆవిష్కరించారు.

– క్రాంతి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram