‘‘సేవా పరమో ధర్మః’’

‘‘మానవ సేవయే మాధవసేవ’’

‘‘సేవా వ్రత్‌ ‌వే అంతర్‌ ‌మన్‌ ‌మే సచ్ఛే కదమ్‌ ‌బడ్‌తే జాయే।

హర్‌ ఆం‌గన్‌ ‌మే సుఖద్‌, ‌సుమంగల్‌, ‌సమరస జీవన్‌ ‌సరసాయేం’’

ఈ గీతంతో ‘బాలాసాహెబ్‌ ‌దేవరస్‌ ‌సభా మండపం’ పులకించిపోయింది. రాష్ట్రీయ సేవా సంగమ్‌ ‌జాతీయ సదస్సులో పాల్గొన్న 2700 మంది స్వచ్ఛంద సేవకులు హృదయాల నుంచి వచ్చిన పాట అది. సేవను భగవదాదేశంగా భావించే కర్మయోగుల గుండె సవ్వడి అది. సోదర భారతీయుల కోసం, జాతి హితం కోసం జాతీయత పట్ల ఏకాభిప్రాయం కలిగినవారంతా ఈ సదస్సుకు హాజరయ్యారు. ఒకటీ రెండూ కాదు, వందా రెండు వందలు కాదు.. వారంతా చేపట్టి నిర్వహిస్తున్న 43,000 సేవా కార్యక్రమాల గురించి అక్కడ సమీక్ష జరిగింది. ఇంకా ముందుకు వెళ్లి, మరిన్ని సేవా పథకాలు చేపట్టే  అవకాశాల గురించి చర్చించారు. అందుకే ఈ సదస్సు అపురూపం, అసాధారణం. అన్ని కార్యక్రమాలు సేవ కోసం సేవ అన్నట్టే జరుగుతున్నాయి. సేవ, దయ, చదువు పేరుతో మత మార్పిళ్లు, కొన్నిచోట్ల వేర్పాటువాద బీజాలు వేసే క్రైస్తవ మిషనరీల వలె కాకుండా దేశం కోసం, జాతీయ భావంతో సాటి భారతీయుల కోసం ఆ సంస్థలు సేవా కార్యక్రమాలు చేపట్టాయి. సేవ పేరుతో ఇక్కడి సామాజిక వ్యవస్థకు తూట్లు పొడవడం కాదు. సేవ అంటే ఇక్కడ సాంస్కృతిక విధ్వంసం చేయడం కాదు. సేవ ఇక్కడి కుటుంబ వ్యవస్థను, విశ్వాసాలను పెకలించేది కాదు.

అందుకే పరమపూజనీయ సర్‌సంఘచాలక్‌ ‌డాక్టర్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ఒక మాట అన్నారు. అది- దేశానికి సేవ అంటే అందులో దేశభద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఉండాలని ప్రతి భారతీయుడు గుర్తించాలి. రాష్ట్రీయ సేవా సంగమ్‌ ఇదే ఆశయంతో సాగుతున్నది.

ఐదేళ్ల విరామం తరువాత జరిగిన రాష్ట్రీయ సేవా సంగమ్‌ ‌జాతీయ సదస్సు ఏర్పాట్ల కోసం మార్చి 9న శ్రీకారం చుట్టారు. రాజస్థాన్‌ ‌రాజధాని జైపూర్‌లోని కేశవ విద్యాపీఠ్‌ ‌ప్రాంగణంలో భూమిపూజ, వినాయక స్థాపనతో పనులు మొదలైనాయి. సేవా సంగమ్‌ ‌జాతీయ అధ్యక్షుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త పన్నాలాల్‌ ‌భన్సాలీ ఆధ్వర్యంలో ఏర్పాట్లన్ని సమయానికి, సక్రమంగా పూర్తయ్యాయి. జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆయనే పాల్గొన్నారు కూడా. ఏప్రిల్‌ 7,8,9 ‌తేదీలలో ఈ సదస్సు జరిగింది. ఈసారి సంగమ్‌ ‌సదస్సు నినాదం ‘స్వావలంబన భారత్‌-‌సుసంపన్న భారత్‌’. ఏర్పాట్లు పూర్తయిన తరువాత మార్చి 21న ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో సంగమ్‌ ఆశయాల గురించి ఇంకాస్త వివరంగా చెప్పారు భన్సాలీ. సమరసత కలిగిన, సమర్థ, స్వావలంబన కలిగిన భారత్‌ ‌నిర్మాణమే సంగమ్‌ ఆశయం. ఇందుకోసం రాష్ట్రీయ సేవాభారతి సాయంతో ఇలాంటి సమున్నత ఆశయంతో పనిచేస్తున్న ఇతర సంస్థలను అనుసంధానం చేయడంలో సంగమ్‌ ‌కీలకంగా వ్యవహరిస్తుంది. కొవిడ్‌ ‌మహమ్మారి చుట్టుముట్టిన కాలంతో పాటు, దేశం ఎప్పుడు సంక్షోభాలను ఎదుర్కొన్నా రాష్ట్రీయ సేవాభారతి ముందు వరసలో ఉండి సేవలు అందించింది. అలాంటి సంక్షోభాలలో మొదటిగా అవసరమయ్యే ఆహార సరఫరా, మందుల పంపిణీ, ఆర్థిక సాయం చేయడంలో రాష్ట్రీయ సేవాభారతి అగశ్రేణి సంస్థగా వ్యవహరించింది. కొద్దికాలంగా ఆరోగ్యవంతమైన బాలల కోసం పౌష్టికాహారం పంపిణీ అన్న  అంశం మీద సేవాభారతి దృష్టి సారించిందని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి రేణు పాథక్‌ ‌చెప్పారు. ఇక ఏప్రిల్‌ 7‌న జైపూర్‌ ‌సదస్సుకు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పరమపూజనీయ సర్‌సంఘచాలక్‌ ‌డాక్టర్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ‌కూడా  హాజరై దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రీయ సేవా సంగమ్‌ ఆశయం ఏమిటి? ఎలా పనిచేస్తుంది? ఎవరి కోసం పనిచేస్తుంది? జాతి జీవనంలో, ఆ జీవనానికి సంబంధించిన సాంస్కృతిక, సామాజిక గమనంలో కచ్చితమైన మార్పు తేవడంలో కీలకంగా కృషి చేస్తున్న సామాజిక సంస్థలకు సంగమ్‌ ‌మార్గదర్శనం చేస్తుంది. ఈ పనిలో రాష్ట్రీయ సేవా భారతి ఉపాధ్యక్షులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏప్రిల్‌ 7‌న ప్రారంభమైన మూడవ ‘రాష్ట్రీయ సేవా సంగమ్‌’‌కు రాజస్థాన్‌ ‌రాజధాని జైపూర్‌ ‌వేదిక అయింది. జైపూర్‌ ‌శివార్లలో జామ్‌దోలీలోని కేశవ విద్యాపీఠ్‌లో మూడు రోజుల పాటు సేవాసంగమ్‌ ‌కార్యక్రమాలు నిర్వహణ తీరుపై విస్తృత సమీక్ష జరిగింది. దేశం నలుమూలల నుంచి విచ్చేసిన సుమారు 2700 మంది ప్రతినిధులు ఈ అద్భుతమైన సేవాసంగమ్‌లో పాల్గొని నూతనోత్తేజం పొందారు. రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌నుంచి స్ఫూర్తిని, అనుభవాన్ని పొందిన వేలాది మంది కార్యకర్తలు దేశవ్యాప్తంగా సుమారు 43 వేల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్య, వైద్యం, స్వావలంబన, ఆత్మనిర్భరత, వ్యక్తి నైపుణ్యం పెంపొందించ•డానికి ‘సేవాభారతి’ సంస్థ ఆధ్వర్యంలో అనేక కార్యకలాపాలు జరుగుతున్నాయి. అనాథ బాలబాలికలకు ఆశ్రమాలు, సేవాబస్తీలలోని బాలబాలికలకు ఉచిత విద్యాబోధన, ఆరోగ్యసేవలు అందిస్తున్నారు. సేవా బస్తీలలోని పిల్లలకు సంస్కారాలు అందించే లక్ష్యంతో బాల సంస్కార కేంద్రాలు నడుస్తున్నాయి. ఆరోగ్యసేవల నిమిత్తం సేవా బస్తీలలో క్లినిక్‌లు, సంచార వైద్యశాలలు నడుపుతున్నారు. ఇలా… సమాజంలోని పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సేవాభారతి సంస్థ కృషి చేస్తున్నది. ఈ సంస్థ ఆధ్వర్యంలో నడిచే సేవా ప్రాజక్టుల నుంచి ఎంపిక చేసిన ప్రతినిధులు ఈ ‘రాష్ట్రీయ సేవా సంగమ్‌’‌లో పాల్గొనడం విశేషం.

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పూజనీయ సర్‌సంఘచాలక్‌ ‌డాక్టర్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ‌ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఉజ్జయినిలోని వాల్మీకి ఆశ్రమ నిర్వాహకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సంత్‌ ‌బాలయోగి ఉమేశ్‌నాథ్‌ ‌మహారాజ్‌, ‌ప్రముఖ పారిశ్రామిక వేత్తలు అజయ్‌ ‌పిరమిల్‌, ‌నర్సింరాం పులేరియా విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్రీయ సేవాభారతి అధ్యక్షులు పన్నాలాల్‌ ‌బన్సల్‌, ‌పర్యవేక్షణలో కార్యక్రమాలు జరిగాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబళే, సేవాభారతి మార్గదర్శకులు భయ్యాజీ జోషి తదితర జ్యేష్ఠ ప్రచారకులు మూడు రోజులపాటు జరిగిన వివిధ కార్యక్రమాలల్లో కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు.

ఆపన్నులకు అండగా….

 వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు తాము నిర్వహిస్తున్న ముఖ్యమైన ‘సేవా’ కార్యక్రమాల గురించి వివరించారు. ఇతర ప్రతినిధులతో అభిప్రాయాలను కలబోసుకున్నారు. ఒకరి అనుభవా లను మరొకరు పంచుకున్నారు. ఈ సంస్థలు ఒక యజ్ఞంలా దేశంలో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను పరిశీలిద్దాం-

మాధవసేవా సమితి, ఉజ్జయిన్‌

ఉజ్జయినిలోని ‘మహాకాళేశ్వర్‌’‌ని దర్శించడానికి ప్రతిరోజు వందల మంది భక్తులు వస్తూ ఉంటారు. వీరందరికి తగిన వసతి కల్పించడానికి ‘మహాకాళేశ్వర్‌ ‌భక్తి నివాస్‌’ ‌నిర్మాణం జరిగింది. అదేవిధంగా మాధవ సేవాసమితి ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్‌ ‌శిక్షణ కేంద్రం, ఉచిత వైద్య పరీక్షల కేంద్రం, హోమియోపతి మందుల వితరణ, కంటి పరీక్షలు, యోగా కేంద్రం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

 రాష్ట్రీయ సేవాభారతి కార్యకర్తలు దేశ వ్యాప్తంగా 16,184 విద్యా కేంద్రాలు, 10,513 ఆరోగ్యపరీక్ష, చికిత్సా కేంద్రాలు, 9,543 సామాజిక కేంద్రాలు, 6, 805 ఉపాధి కేంద్రాలు నిర్వహిస్తున్నారు.

మాతా, శిశు సంరక్షణ కేంద్రం :

కొంకణ్‌ ‌ప్రాంతం, గోవా

పసిపిల్లలకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో కొంకణ్‌ ‌ప్రాంతంలో మాత శిశు సంరక్షణ కేంద్రాలు నడుపుతున్నారు. ఈ కేంద్రంలో చిన్నారులకు పౌష్టికాహారం అందించటంతోపాటు అవసరమైన వారికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించి మందులు అందజేస్తారు.

వైదేహీ ఆశ్రమం – కిశోరీ వికాస్‌ ‌కేంద్రం :

హైదరాబాద్‌

‌హైదరాబాద్‌లోని వైదేహీ ఆశ్రమంలో అనాథ బాలికలకు విద్య, ఉపాధి కల్పనతోపాటు వివాహాలు కూడా చేయడం విశేషం. కిశోరీ వికాస్‌ ‌కేంద్రం కార్యకర్తలు ప్రతివారం సేవాబస్తీలలో బాలసంస్కార కేంద్రాలు నడుపుతున్నారు. ప్రతి ఏటా ‘రన్‌ ‌ఫర్‌ ‌ఛైల్డ్’ ‌నిర్వహించడం ద్వారా సమాజంలో చైతన్యం తీసుకువస్తున్నారు.

వనవాసీ ఉపాధి కల్పనా కేంద్రం :

మాల్వా ప్రాంతం

మాల్వా ప్రాంతంలో గిరిజనులకు ఉపాధి కల్పించడానికి వివిధ వృత్తులలో నైపుణ్య శిక్షణ ఇస్తున్నారు. విద్యుత్‌ ‌పరికరాల మరమ్మతులు, కుట్టు శిక్షణ, డ్రైవింగ్‌లో శిక్షణ, పర్యావరణ అనుకూల విగ్రహాల నిర్మాణం, మొబైల్‌ ‌ఫోన్ల మరమ్మతులు, రాఖీల తయారీ వంటి అనేక వృత్తులలో గిరిజనులకు శిక్షణ ఇచ్చి వారు ఉపాధి పొందే విధంగా కృషిచేస్తున్నారు.

జమ్ము-కశ్మీర్‌ : ‌జమ్ముకశ్మీర్‌ ‌ప్రాంతంలో సేవాభారతి కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి పిల్లలకు అవసరమైన ఆరోగ్య టీకాలు వేయిస్తున్నారు. ఈ సంవత్సరం రెండు విడతలుగా చేపట్టిన టీకా కార్యక్రమంలో సుమారు లక్షా 50 వేల మందికి టీకాలు వేశారు.

స్టూడెంట్స్ ‌ఫర్‌ ‌సేవా : అహ్మదాబాద్‌లోని స్టూడెంట్స్ ‌ఫర్‌ ‌సేవ – ఎస్‌ఎఫ్‌ఎస్‌ ‌సంస్థ యువతరంలో చైతన్యం కలిగించి, వారిని వివిధ సేవా కార్యక్రమాల్లో భాగస్వాము లను చేస్తోంది. ఎస్‌.ఎఫ్‌.ఎస్‌ ‌కార్యకలాపాలు అన్ని రాష్ట్రాలకు విస్తరించాయి.

సమతోల్‌ ‌ఫౌండేషన్‌ , ‌ముంబయి

ముంబయిలోని సమతోల్‌ ‌ఫౌండేషన్‌ అనాథ, వీధి బాలలను గుర్తించి వారికి విద్య, వైద్య సేవలు అందిస్తోంది. అనాథ బాలలకు కౌన్సెలింగ్‌ ఇచ్చి వారి కోసం బాల సంస్కార కేంద్రాల ద్వారా సంస్కారాలు అందించే కార్యక్రమం చేపట్టింది.

చేతనా చైల్డ్ ‌డెవలప్‌మెంట్‌ ‌సెంటర్‌- ‌మంగుళూర్‌

‌మంగుళూర్‌లో బాలల మానసిక, విద్య వికాసం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాలలకు విద్య, వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు సంస్కారాలు అందిస్తున్నారు.

కేరళలోని మొబైల్‌ ‌దహన వాటిక విశేష సేవలను అందిస్తోంది. కొవిడ్‌  ‌మహమ్మారితో మృతి చెందినవారి దహన సంస్కారాల కోసం ఈ మొబైల్‌ ‌దహన వాటిక ఏర్పాటు చేశారు. ప్రజలు ఒక్క ఫోన్‌కాల్‌ ‌చేస్తే ఈ దహన వాటిక వాహనం అక్కడకు చేరుకొని ‘గ్యాస్‌’ ఆధారంగా అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుంది. ప్రస్తుతం కేరళలో ఇటువంటి పది మొబైల్‌ ‌దహన వాటికలు నిర్వహిస్తున్నారు.

ఆంధప్రదేశ్‌లోని తీర ప్రాంతంలో మత్స్యకారుల గ్రామాలు అధికంగా ఉన్నాయి. గ్రామాల్లో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఇలా దేశంలోని అన్ని ప్రాంతాలలో స్థానిక అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాలకు అవసరమైన నిధులను సమాజంలోని దాతల నుంచే విరాళాలుగా సేకరించడం విశేషం. రాష్ట్రీయ సేవాసంగమ్‌ ‌విజయవంతం చేయడానికి 820 మంది కార్యకర్తలు అహోరాత్రులు కృషిచేశారు. ప్రతినిధులను ఆప్యాయంగా పలకరిస్తూ వారికి అవసరమైన వసతులు ఏర్పాటుచేయడం ద్వారా అందరి ప్రశంసలు అందుకున్నారు.

ఈ సదస్సు సేవ అనే పదానికి కొత్త తాత్త్వికతను, అర్థాన్ని అందించింది. ఆపన్నులకు సేవ చేయడం భగవంతుని సేవించడంగానే భావించాలని చెప్పింది. మానవ సేవే మాధవ సేవ అన్న మహోన్నత వాక్యంలోని పరమార్ధం ఇదే కూడా. త్యాగం, సేవ భారతీయ ఆదర్శాలు అంటారు వివేకానందులు. సేవ కూడా వ్యాపారమైపోతున్న తరుణంలో, సేవ కూడా మాఫియాల చేతులలోకి వెళుతున్న పాడుకాలంలో సేవాభావన గురించి చర్చించుకోవడం తక్షణ కర్తవ్యమే. అది జైపూర్‌ ‌సదస్సు చేసింది.

————

‘మానవ కల్యాణానికి సేవ ఉత్తమ మార్గం’

– డాక్టర్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌

‘‌సేవ’ మాధ్యమం ద్వారా ‘వసుధైవ కుటుంబకం’ అనే కలను సాకారం చేసుకోవచ్చునని, అయితే దీనికోసం కార్యకర్తలు నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు సమాజ వ్యాప్తి కావాలని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ ‌పూజనీయ సర్‌ ‌సంఘచాలక్‌ ‌డాక్టర్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ‌పిలుపునిచ్చారు. జంతువులకు, మానవులకూ కూడా ‘సంవేదన’ ఉంటుందని ఆ ‘సంవేదన’… కృత్‌… ‌కారుణ్యం… సేవ… సమరసతగా మారినప్పుడే సమాజానికి ఉపయుక్తంగా ఉంటుందని డాక్టర్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ‌పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో హిందూ ఆధ్యాత్మిక సంస్థలు, క్రైస్తవ మిషనరీల కన్నా ఎన్నో రెట్లు ముందుంటున్నాయని ఆయన స్పష్టం చేశారు. రాజస్థాన్‌ ‌రాజధాని జైపూర్‌ ‌సమీపంలోని జామ్‌దోలీలో గల కేశవ విద్యాపీఠ్‌ ‌ప్రాంగణంలో ఏప్రిల్‌ 7‌వ తేదీన మూడవ రాష్ట్రీయ సేవా సంగమ్‌ను డాక్టర్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ‌ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మిషనరీ సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలో ఆసుపత్రులు, విద్యాసంస్థలు నిర్వహిస్తున్నాయి. అయితే హిందూ ధార్మిక సంస్థలు నిస్వార్థంగా, ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా నిర్వహించటం అభినందనీ యం. సేవ ద్వారా ఆరోగ్య కరమైన మనుషులను, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చు’ అని అన్నారు.

సేవ చేయడానికి ‘సంవేదన’ చాలా ముఖ్యమని డాక్టర్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలను పరిష్కరించి ప్రపంచాన్ని భావాత్మకంగా ఏకం చేయడానికి సేవామార్గం అత్యుత్తమమైనదని అన్నారు. సజ్జనశక్తిని జాగృతం చేయడం ద్వారా సమాజ కల్యాణానికి కృషి చేయాలని ఆయన సూచించారు. జీ-20 గ్రూపు దేశాల మధ్య సంబంధాలను ‘కరణ’ ఆధారంగా పటిష్టం చేయవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘నా దగ్గర ఏది ఉందో అది అందరిది.. అందరూ నా వారే’’ అనే భావన ఉన్నప్పుడు ఇతరులను ఆదుకోవడం సులభ సాధ్యమవుతుందని డాక్టర్‌ ‌భాగవత్‌ అన్నారు. ఆర్‌.ఎస్‌.ఎస్‌ ‌ప్రారంభం నుంచి సంఘ స్వయంసేవకులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, సంఘ వ్యవస్థాపకులు డాక్టర్‌ ‌హెడ్గేవార్‌ ఆర్‌.ఎస్‌.ఎస్‌. ‌ప్రారంభానికి ముందు నుంచే సమాజంలో జరిగే అనేక సేవా కార్యక్రమాలలో భాగస్వాములయ్యేవారని గుర్తు చేశారు. ఆయన శతజయంతి సంవత్సరం 1989 నుంచి సేవా కార్యక్రమాలను వ్యవస్థీకరణ చేయడం జరిగిందని చెప్పారు. ఎవరైనా వెనుకబడి ఉంటే అది సమాజానికి మంచిది కాదని అంటూ, సంచార జాతులు స్వాతంత్య్ర పోరాటంలోనూ పాల్గొన్నాయని, ప్రస్తుతం వారు తగిన చిరునామా, ఓటు హక్కు లేక అనేక అవస్థలు పడుతున్నారని, ఈ వర్గాలకు సేవా కార్యక్రమాల ఫలాలు అందాలని డాక్టర్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ‌సూచించారు.

‘విశ్వమంగళ సాధన’ మన లక్ష్యం కావాలి

 ‘విశ్వమంగళ’ సాధన కోసం మనమంతా కృషి చేయాలని, అందుకు అవసరమైన సద్గుణాలను పెంపొందించుకోవాలని ఏప్రిల్‌ 8‌వ తేదీన ప్రతినిధుల సదస్సులో మోహన్‌భాగవత్‌ ‌సూచించారు. సంఘస్థాన్‌లో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ‘విధాయాస్య ధర్మస్య సంరక్షణమ్‌… ‌పరమ్‌ ‌వైభవన్‌ ‌నేతు మేతత్‌ ‌స్వరాష్ట్రమ్‌’ అని ఆకాంక్షిస్తామని, ఆ దిశగా సమాజాన్ని నడిపించడానికి అందరం కృషి చేయాలని సూచించారు. వ్యక్తిగత పేరు ప్రఖ్యాతుల కోసం ఆశించకుండా నిస్వార్థంగా సమాజానికి సేవచేయడానికి ముందుకు రావాలని డాక్టర్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ‌పిలుపునిచ్చారు. ఏప్రిల్‌ 9‌వ తేదీన జరిగిన ముగింపు కార్యక్రమంలో సర్‌ ‌కార్యవాహ దత్తాత్రేయ హోసబళే ప్రసంగించారు.

—————-

సేవా సంగమ్‌ అద్భుతం : మీడియా

ఈ రాష్ట్రీయ సేవాసంగమ్‌ అద్భుతంగా జరిగిందని స్థానిక మీడియా పేర్కొంది. మూడురోజులపాటు జరిగిన వివిధ కార్యక్రమాలను జైపూర్‌ ‌నుంచి వెలువడుతున్న అన్ని పత్రికలు వివరంగ ప్రచురించాయి. అన్ని పత్రికలు ఏప్రిల్‌ 6,7,8 ‌తేదీలలో ప్రత్యేక సంచికలను ప్రచురించాయి. మీడియాలో వచ్చిన సేవాసంగమ్‌ ‌వార్తల క్లిప్పింగులను ప్రధాన సభామండం బయట ప్రదర్శించారు.

‘అధికార్‌’, ‘‌మహానగర్‌ ‌టైమ్స్’ ‌వంటి దినపత్రికలు ప్రత్యేక సంచికలను ప్రతినిధులకు అందజేయడంతో ఆ వార్తలను చూసి దేశం నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు ఆనందించారు. ‘మహానగర్‌ ‌టైమ్స్’ ‌పత్రిక తమ ప్రత్యేక సంచికలలో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌సంఘచాలకుల విశేష కృషిని అభినందిస్తూ పూర్తి పేజీ వ్యాసాలను ప్రచురించింది. డాక్టర్‌ ‌హెడ్గేవార్‌, ‌బాలాసాహెబ్‌ ‌దేవరస్‌ ‌జీ, రాజేంద్రసింహ్‌జీ హయాంలో జరిగిన సంఘ కార్యవిస్తరణను ప్రముఖంగా ప్రచురించింది. సేవా సంగమ్‌ ‌ప్రాంగణంలో ఏర్పాటుచేసిన వివిధ ప్రకల్పాల ఛాయాచిత్ర ప్రదర్శనను, ఆయా స్టాల్స్‌లో ఏర్పాటు చేసిన దేశీయ ఉత్పత్తులపై ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. పర్యావరణ హితమైన ఉత్పత్తుల గురించి ప్రజలకు తెలియజేయడానికి ఇంటర్వ్యూలను తీసుకొని ‘బాక్స్ ఐటమ్‌’‌లుగా స్థానిక పత్రికలు ప్రచురించాయి. ‘ప్రభాత్‌ అభినందన్‌’, ‘‌జయపూర్‌ ‌టైమ్స్’, ‘‌విరాట్‌ ‌వైభవ్‌’, ‘‌దైనిక నవజ్యోతి’, ‘సమాచార జగత్‌’, ‘‌రాష్ట్రదూత్‌’, ‘‌సీమా సందేశ్‌’ ‌తదితర చిన్నా, పెద్ద పత్రికలు రాష్ట్రీయ సేవా సంగమ్‌కు విస్తృత ప్రచారం కల్పించాయి. ఆర్‌.ఎస్‌.ఎస్‌.‌ను తీవ్రంగా వ్యతిరేకించే ‘ది హిందూ’, ‘హిందూస్తాన్‌ ‌టైమ్‌’ ‌వంటి పత్రికలు కూడా ‘సేవాసంగమ్‌’ ‌వార్తలను ప్రచురించడం విశేషం. జాతీయ, స్థానిక టెలివిజన్‌ ‌ఛానళ్ళు, సోషల్‌ ‌మీడియాలో కూడా విస్తృత ప్రచారం లభించింది.

——————

ఆకట్టుకున్న ఛాయాచిత్ర ప్రదర్శన

సేవాసంగమ్‌ ‌ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. వివిధ ప్రాంతాలలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల ఫొటోలను ఆకర్షణీయంగా తీర్చిదిద్ది ప్రదర్శించారు. ఒక ప్రాంతంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు ఇతర ప్రాంతాలవారు తెలుసుకోడానికి ఈ ప్రదర్శన ఉపకరించింది. హనుమత్‌ ‌జయంతి రోజు, ఏప్రిల్‌ 6‌వ తేదీ సాయంత్రం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుధాంశు మహారాజ్‌ ఈ ‌ప్రదర్శనను ప్రారంభించారు. పూజ్యశ్రీ మహామండలేశ్వర్‌ ‌స్వామి కేశ్వరానంద్‌ ‌మహారాజ్‌, ‌జైపూర్‌ ‌రాజకుటుంబానికి చెందిన పార్లమెంటు సభ్యులు శ్రీమతి దియాకుమారి, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌జ్యేష్ఠ ప్రచారకులు ప్రేమ్‌చంద్‌ ‌గోయల్‌, అశోక్‌ ‌చాగ్లా తదితరులు పాల్గొన్నారు.

సుధాంశు మహారాజ్‌ ‌మాట్లాడుతూ, ‘సేవ’ అనే దీపం దేశ వ్యాప్తంగా వెలుగులు ప్రసరించడం అభినందనీయమని పేర్కొన్నారు. లద్దాఖ్‌ ‌నుంచి దక్షిణాది వరకు అన్ని ప్రాంతాల నుంచి ప్రతినిధులు సేవా సంగమ్‌లో పాల్గొంటున్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా ‘సేవా’ జ్యోతి ప్రజ్వరిల్లాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఆదివాసులు నివసించే ప్రాంతాలలో తాను పర్యటించినప్పుడు వనవాసుల ఆత్మీయత, ధర్మరక్షణ పట్ల వారికున్న చిత్తశుద్ధి గమనించానని చెప్పారు. సంఘ కార్యకర్తలు తను, మన, ధన రూపంలో సమాజ సేవలో పునీతులవుతున్నారని అన్నారు. సేవ చేయడంలోనే భగవంతుని సాక్షాత్కారం లభిస్తుందని అన్నారు. సేవాసంగమ్‌ ‌లక్ష్యం ‘స్వావలంబీ భారత్‌’‌ను సాధించడమే. ఈ లక్ష్య సాధనకు అవసరమైన స్ఫూర్తి ‘ఛాయాచిత్ర ప్రదర్శన’ ద్వారా లభించింది.

—————-

తెలుగు రాష్ట్రాల నుంచి 153 మంది

అటు అరుణాచల్‌‌ప్రదేశ్‌ ‌నుంచి ఇటు గుజరాత్‌ ‌వరకు, జమ్ము-కశ్మీర్‌ ‌నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రతినిధులు సేవా సంగమ్‌లో పాల్గొనడం విశేషం. సేవాభారతి ఆధ్వ ర్యంలో నడుస్తున్న 698 సంస్థల నుంచి మొత్తం 460 మంది మహిళలతో సహా 2408 మంది ప్రతి నిధులు ప్రాతినిధ్యం వహించారు. ఆరోగ్యభారతి, రాష్ట్ర సేవికాసమితి, సక్షమ్‌, ‌విద్యాభారతి, విశ్వ హిందూపరిషత్‌, ‌సేవా ఇంటర్నేషనల్‌, ‌వనవాసి కల్యాణ్‌ ‌పరిషత్‌, ‌భారత్‌ ‌వికాసపరిషత్‌ ‌వంటి పది హేను సంస్థల ప్రతినిధులు కూడా సేవా సంగమ్‌లో భాగస్వాములయ్యారు. కేరళ ప్రాంతం నుంచి అత్యధికంగా 198 మంది ప్రతినిధులు హాజర య్యారు. తెలంగాణ నుంచి 96 మంది, ఆంధప్రదేశ్‌ ‌నుంచి 57మంది కార్యకర్తలు ఈ భవ్యమైన శిబరంలో పాల్గొన్నారు. ‘రాష్ట్రీయ సేవాసంగమ్‌’ ‌ప్రతినిధులకు స్థానిక కార్యకర్తలు ఇచ్చిన ఆత్మీయ ఆతిథ్యం అబ్బురపరచింది. రైళ్లు, విమానాలలో విచ్చేసిన ప్రతినిధులకు స్వాగతం పలకడం నుంచి వసతి, భోజన సదుపాయాల వరకు ఎటువంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేశారు. దేశంలోని విభిన్న ప్రాంతాల సంస్కృతులు, భాషలు కలగలిపిన ‘సేవా సంగమ్‌’ అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించింది.

– వేదుల నరసింహం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram