ఏప్రిల్‌ 25 ఆది శంకరాచార్య జయంతి

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి

ఆదిశంకరులు కేవలం ఆధ్యాత్మిక గురువు, మతాచార్యుడు కాదు. సంస్కర్త. పీడిత జన బాంధవుడు. భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలో మేరునగధీరుడు. సనాతన వైదిక ధర్మానికి విఘాతం కలుగుతూ, అంధవిశ్వాసాలు ప్రబలుతున్న సమయంలో జగత్తును జాగృత పరిచేందుకు ఆవిర్భవించిన చైతన్యదీప్తి. సమాజంలో సమానత్వం గురించి వేల సంవత్సరాల క్రితమే బోధించి, ఆచరించిన మహనీయుడు. శాంతియుత సమాజ స్థాపకులు. సంప్రదాయాలు వేరైనా పరమార్థం ఒక్కటేనని చాటి చెప్పిన విశ్వగురువు. నేటి కేరళ రాష్ట్రంలోని పూర్ణానదీ తీరంలోని కాలడి (కాలటి) గ్రామంలో వైశా• శుద్ధ పంచమి నాడు జన్మించి జగద్గురువుగా ఎదిగిన ఆయన జీవిత ప్రస్థానం కేవలం ముప్పయ్‌ ‌రెండు సంవత్సరాలే అయినా యుగయుగాలకు తరగనంతటి ఆధ్యాత్మిక సంపదను ప్రోది చేశారు. తరచి చూస్తే ఆ ఆధ్యాత్మిక బోధనల వెనుక కాలాలకు అతీతంగా, ము్య•ంగా నేటి యువతకు ఉపకరించే ఎన్నో అంశాలు దాగి ఉన్నాయి.

సర్వమానవ కల్యాణానికి కంకణం కట్టుకున్న భారతీయ ఆచార్య ప్రవక్తలలో అగ్రగణ్యులు శంకర భగవత్పాదులు. ఆయన అవతారం జ్ఞానప్ర దాయ మైనది. సమాజంలో అస్తవ్యస్తత ఏర్పడినప్పుడు, ధర్మానికి హాని కలిగినప్పుడు, పరిస్థితులను చక్క దిద్దేందుకు భగవంతుడు ఏదో రూపంలో అవత రిస్తాడని భారతీయుల విశ్వాసం. శంకరుల అవతార తత్త్వం అలాంటిదేనని ఆస్తికుల నమ్మకం. సాక్షాత్‌ ‌మహేశ్వరుడి అంశతో జన్మించిన ఆయన మూడేళ్ల వయసునాటికి దేశభాషలలో, ఐదేళ్లకు సంస్కృతంలో, ఏనిమిదేళ్లకు వేదశాస్త్రాలలో ప్రావీణ్యం సంపా దించారు. సర్వదా, సర్వధా సమాజ హితాన్ని శ్వాసించిన ఆయన శాంతియుత సమాజ స్థాపకులు. సంప్రదాయాలు వేరైనా పరమార్థం ఒక్కటేనని చాటి చెప్పిన మహమనీషి. వేళ్లూనుకుంటున్న దుష్ట సంప్ర దాయాలు, మూఢ విశ్వాసాల నుంచి సమాజాన్ని సక్రమ మార్గంలో నడపాలని, ఆధ్యాత్మిక భావనను పెంపు చేయాలని పసివయసులోనే సంకల్పించిన ఆయన అందుకు సన్యాసాశ్రమమే ఉత్తమమార్గంగా భావించారు. అదీ లోకేశ్వరుని సంకల్పంగానే పరిగణించారు.

నాలుగు ఆశ్రమాలలో దేశభ్రమణానికి సన్యాసమే అనుకూలం. బ్రహ్మచారి గురువు అంతేవాసిగా, గృహస్థు భార్యాబిడ్డలను గమనిస్తూ, అతిథి అభ్యాగ తులను సేవిస్తూ ఉండాలి. వానప్రస్థులు తపో ధ్యానాలతో గడపాలి. కానీ సన్యాసి ఏ ఒక్క చోట మూడు రాత్రులకు మించి గడపకూడదని శాస్త్రం. అందువల్ల లోకసంచారంలో భాగంగా అజ్ఞాన తిమిర వినాశనానికి, వేదాంతోపదేశానికి సన్యాసాశ్రమమే అత్తుత్యమైనదంటారు. అయితే, సన్యాసదీక్ష స్వీకరణకు మాతృమూర్తి అనుమతి తప్పనిసరి. ఒక్కగానొక్క కుమారుడి యతిదీక్ష నిర్ణయాన్ని తల్లి ఆర్యాంబ తొలుత అంగీకరించలేదు. ఒకనాడు తల్లితో కలిసి నదీస్నానానికి వెళ్లిన బాల శంకరుని కాలును నీటిలోని మొసలి పట్టుకుని ప్రవాహంలోకి లాక్కువెళుతుండగా, ‘ఈ మకరి బారి నుంచి విముక్తి పొందాలంటే సన్యసించేందుకు అనుమతించు తల్లీ! నేను అల్పాయుష్కడనని జ్యోతిష్యులు మొదటే చెప్పారు. సన్యాస జీవితం అంటే మరోజన్మ కనుక, ఈ గండం నుంచి బయటపడితే మరికొంత కాలం జీవిస్తాను’ అని తల్లిని ప్రార్థించి ఆమె ఆమోదాన్ని పొందాడు. ఆ ‘మరికొంత కాలం జీవితం’ కూడా లోకోద్ధరణ కోసమేనన్నది ఈశ్వర సంకల్పం.

‘మోక్ష మార్గాలన్నిటిలో జ్ఞానమార్గం అత్యంత ఉన్నతం, శ్రేష్ఠం. ‘జ్ఞానాదేవతు కైవల్యం’… జ్ఞానం వల్ల మాత్రమే ముక్తి (కైవల్యం) లభిస్తుంది. జ్ఞానం అంటే కేవలం పాండిత్యం కాదు. ‘జ్ఞ’ అంటే తెలుసు కోవడం. దేనిని తెలుసుకోవడం? అనే ప్రశ్నకు ‘సర్వం బ్రహ్మమయమనే సత్యాన్ని తెలుసుకోవడం అని శంకరవాణి. ‘జ్ఞానం’ అంటే సూర్యుడు అనీ పేర్కొ న్నారు. సూర్యోదయంతో అంధకారం విడిపోయినట్లు జ్ఞానమనే సూర్యకిరణాలతో అజ్ఞాన తిమిరం అంతరిస్తుందని వ్యాఖ్యానించారు. అలా జ్ఞానం ద్వారా పొందిన మోక్షం అక్షయం. ఏ విద్యకైనా గురువు అనుగ్రహం తప్పనిసరి. ముఖ్యంగా, జ్ఞాన సముపార్జనకు గురుకటాక్షం అవసరం. కుంటివాడు నడవగలిగినా, మూగవాడు మాట్లాడగలిగినా, విద్యా గంధం లేనివాడు పండితుడు కాగలిగినా గురుకృప వల్లనే. గురువు అనుగ్రహంతోనే ఆత్మవిద్యను సాధించుకోవాలి. అందుకు గురువును త్రికరణ శుద్ధిగా సేవించాలి’ అని ఉద్బోధించారు. ప్రత్యక్షంగా కనిపించే గురువును కాదని కంటికి కనబడని శాస్త్రాధ్యయనం ద్వారా జ్ఞాన సముపార్జన యత్నం చేతిలోని నీటిని వదులుకొని మేఘంలోని జలాన్ని నమ్మినట్లే ఉంటుందన్నది పెద్దల మాట. అందుకే ఆయన శివాంశ సంభూతులైనా పాద చారులై గురువు కోసం అన్వేషణ సాగించి, నర్మదా నదీతీరంలో ఒక గుహలో ఉన్న గోవింద భగవత్పాదులను ఆశ్రయిం చారు. ఆ బాలుని అద్వైత జ్ఞానానికి, ఏకసంథాగ్రాహీత్వానికి ముగ్ధుడైన గోవిందులు ఆయనను శిష్యునిగా అంగీకరించారు. అలాంటి స్ఫూరద్రూపి శిష్యుడిగా లభించడం భాగ్యంగా భావించి, బ్రహ్మ సూత్రాలు, మహా కావ్యాల విశేషార్థాలను వివరించారు. భావి ‘జగద్గురువు’ గురువును భక్తి శ్రద్ధలతో సేవించారు.

 సమాధినిష్ఠలోని గురుదేవులను, పరిసర వాసులను ఉప్పొంగే నర్మద నది నీటి నుంచి కాపా డేందుకు జలాకర్షణ మంత్ర పఠనం ద్వారా నదిని తన కమండలంలో ఒడిసిపట్టిన గురుభక్త శిఖామణి, లోకహితైషి. పరమగురువు గౌడపాదులు (గోవింద భగవత్పాదులు గురువు) ఆదేశానుసారం బ్రహ్మ సూత్రాలకు భాష్యం రాశారు. ‘బ్రహ్మసూత్రాలకు తమరు భాష్యం రాస్తే బాగుంటుంది కదా?’అని గోవిందపాదులు ఒక సందర్భంలో వ్యాస భగవా నుడికి మనవి చేశారట. అందుకు వ్యాస మహర్షి ‘అందుకు మరొక మహాత్ముడు ఉద్భవించబోతు న్నాడు’ అని సమాధానమిచ్చారట. అది జ్ఞప్తిలో ఉన్న గోవిందులు ‘నాయనా శంకరా! ఇది నీ కర్తవ్యం’ అని ఆశీర్వపూర్వకంగా ఆదేశించారని ఐతిహ్యం.

‘ప్రపంచాన్ని జయించిన వాడు విజేత కాదు.. తనను తాను జయించిన వాడే విజేత’ అని స్వానుభవం పూర్వకంగా తెలుసుకున్న ‘సత్యవేది’ శంకరులు. కాశీ పురవీధుల్లో నాలుగు శునకాలతో ఎదురైన మనిషిని (ఛండాలుడు) ‘దూర•ంగా తప్పుకో’ అని కోరినప్పుడు ‘తప్పుకోమన్నది నన్నా? నాలోని ఆత్మనా? ఆత్మకు అంటు ఉంటుందా? ఇరువురి శరీరాలు పంచభూతాల వల్ల ఏర్పడినవే. రెండు దేహాలు అన్నమయమే? అందరి శరీరాల్లోని ఆత్మ ఒక్కటే. మరి తేడా ఎక్కడ? మురుగు కాల్వపైనా, గంగాజలం పైనా సూర్యకాంతి ఏకకాలంలో ప్రతిఫలి స్తోంది. పసిడి కలశంలో ఉన్నా, మట్టికుండలో ఉన్నా నీటికి భేదం లేదు కదా?’ అన్న ఆయన ప్రశ్నలు శంకరుల హృదయానికి జ్ఞాన కిరణాలుగా తాకాయి. ఆ అపరిచితుడిని విశ్వేశ్వ రుడిగా గ్రహించి ప్రణ మిల్లారు. శంకరులు శిష్యగణంతో ‘భజ గోవిందం …’స్మరణతో రామేశ్వరం పురవీధులలో సాగుతుండగా, అక్కడి శాక్తేయులు అభ్యంతరం చెప్పారట. భవానీ పూజాసక్తులకు తప్ప అన్యులకు ఊరిలోకి ప్రవేశం లేదనీ స్పష్టం చేశారట. అందుకు ఆయన చెరగని చిరునవ్వుతో ‘భవానీ ఆరాధనే ముక్తి దాయకమనే మీ భావన సరైనది కావచ్చు. కానీ, అందరిలో ఉన్నది బ్రహ్మపదార్థమనే విషయాన్ని గుర్తెరిగి మీ పూజాదికాలు సాగించు కోండి. ఇతరు లను, ఇతర పూజాదికాలను నిందించడం సరికాదు. అందరూ ఒకటే అనే దివ్య భావనతో చేసేదే నిజమైన ఆరాధన’అన్న హితవుతో ఆధ్యాత్మిక సమానత్వానికి పాదులు వేశారు.

గురుకులంలో విద్యాభ్యాస సమయంలో భిక్షకు వెళ్లిన ఆయనకు బ్రాహ్మణ స్త్రీ తమ ఇంట ఉన్న ఉసిరికాయను సమర్పించారు. ఆమె పేదరికానికి హృదయం ద్రవించి ‘కనకధారా స్తవం’తో శ్రీమహా లక్ష్మిని ప్రసన్నం చేసుకోవడంతో ఆ ఇంట బంగారు ఉసిరికాయలు వర్షించాయని, ఇది ఆయన అద్భుత కార్యాలలో మొదటిదని చెబుతారు.

షణ్మతస్థాపకాచార్యులు

శంకరులు దేశభ్రమణ సమయంలో సుమారు ఆరు పదుల సంప్రదాయాలను గమనించారు. వాటిలో కొన్నిటిని మంచి (వైదిక) సంప్రదాయాలు, మరికొన్ని దుష్ట (అవైదిక)సంప్రదాయాలుగా గుర్తిం చారు. శ్మశానాలలో శవపూజలు, నరబలులు, జంతు బలులు, కపోలాలు, ఎముకలను ధరించి సంచరిస్తూ, ఎలాంటి సిద్ధాంతాలులేని అనాగరిక ఆచారాలను ఖండించారు. అవాంఛనీయ ఆచారాలను తొలగించి పూజా విధానాన్ని పరిపుష్టం చేశారు. దేశంలోని అనేక క్షేత్రాలు సందర్శించారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి సాధారణ ఆలయాల దాకా ఒక యంత్రమో, ఆచారమో వారి అనుగ్రహమేనని చెప్పుకోవడం నేటికీ కనిపిస్తుంది. నేడు భక్తకోటి చేస్తున్న దేవీదేవతా స్తుతులలో అనేకం ఆయన గళం నుంచి ఆశువుగా జాలువారినవే. కనకధారా స్తోత్రం, సౌందర్య లహరి, శివానందలహరి, మహిషాసుర మర్దనీ స్త్త్తోత్రం లాంటివి ఆయనపెట్టిన ఆధ్యాత్మిక భిక్షే.

‘సకల జీవరాశుల్లో మనిషి బుద్దిజీవి.జీవరాశి క్షేమంపట్ల అనురక్తుడై ఉండాలి. సృష్టికి అంతా సమానమే. అందులో ఏ లోపం లేదు. ఉన్నదంతా మనిషి నడత, చూపులోనే. దానిని సరిచేసుకుంటే సమస్యే ఉండదు’ అని వేదాంత భావనను అతి సులభ రీతిలో బోధించారు. అన్ని జన్మలలోకి మానవ జన్మ దుర్లభమైందని, అలాంటి జన్మను ప్రసాదించిన భగవంతుని గురించి ఆలోచనలేకుండా జీవితాన్ని గడపడం నిరర్థకమని ఉద్బోధించారు. భగవదారాధన జీవితంలో ఒక భాగం. నిజమైన భక్తికి ఆర్భాటాలు అవసరం లేదన్నది శంకర ‘సూక్తి’. సర్వం పరమాత్మ అనే భావనతో భక్తి అనేది సంపూర్ణ విశ్వాసంతో నిండి ఉండాలి. జ్ఞాని అయిన భక్తుడు తన హృదయాన్ని భగవత్‌ ‌మందిరంగా చేసి సర్వేశ్వరుడుని అందులో ప్రతిష్ఠిస్తాడు. ఈ పూజా విధానంలో ధూప దీప నైవేద్యాలతో నిమిత్తం లేదు. మనసునే వాటికి ప్రత్యామ్నాయంగా భావించాలి. అయితే కుదురులేని మనసుతో నిరాకార ఈశ్వరుడిని అర్చించడం కష్ట సాధ్యంగా భావించి విగ్రహారాధనను సమర్థించారు. విష్ణువు, శివుడు, ఆదిత్యుడు, అంబిక, గణ నాథులను పూజించే పంచాయతన విధానాన్ని ప్రవేశ పెట్టారు. సామాన్యులలో భక్తిని మరింత ప్రచోదనం చేసేందుకు ముమ్మారు దేశవ్యాప్త పర్యటన చేశారు. ఎన్నో ఆలయాలను పునరుద్ధరించారు. నూతన ఆలయాల నిర్మాణానికి కృషి చేశారు. దేశం నలుదిశల పీఠాలు నెకొల్పి, తన ముఖ్యశిష్యులను వాటికి అధిపతు లుగా నియమించారు. ఉత్తరాదిన బదరీనాథ్‌లో జ్యోతిర్మఠం (తోటకాచార్యులు), తూర్పున పూరీలో గోవర్ధ్దనమఠం (పద్మపాదుడు), పశ్చిమాన ద్వారకా మఠం (హస్తామలకుడు), దక్షిణాదిన తుంగానదీ తీరంలో శృంగేరి (సురేశ్వరా చార్యులు) మఠం అలా స్థాపితమైనవే . కైలాసగిరి నుంచి తెచ్చిన స్ఫటిక పంచలింగాలలో కేదార్‌లో ముక్తిలింగం, నేపాళంలో వరలింగం, చిదంబరంలో మోక్షలింగం, శృంగేరిలో భోగలింగం, తమ కంచి కామకోటి పీఠంలో యోగ లింగాన్ని ప్రతిష్ఠించి పూజించారు.

సమస్త మానవాళిని సంసార దుఃఖ విముఖులను చేయాలని, సమాజంలో భక్తిమార్గాన్ని మరింత వ్యవస్థీ కృతంచేయాలన్న సంకల్పంతో మాతృమూర్తిని ఒప్పించి యతిదీక్ష స్వీకరించిన శంకరులు ఆమె అంతిమదశలో పుత్రధర్మం నిర్వర్తించారు. తల్లి అంతిమదశలో తిరిగి వస్తానని మాట ఇచ్చిన ప్రకారం, దేశాటనలో ఉన్న ఆయన కాలడి చేరు కున్నారు. అంతిమ సంస్కారాలు నిర్వహించే అర్హత సన్యాసులకు లేదన్న ఊరివారి వాదనను కాదని స్వగృహంలోనే చితిని పేర్చి తల్లి పార్థివదేహానికి యోగాగ్నితో అంతిమసంస్కారం, ఉత్తర క్రియలు నిర్వహించారు. ‘వేద బహిష్కృతులైన మీ స్థితి అలాగే ఉండనీయండి. మీకూ పరుల సహాయం అంద కుండనే ఉంటుంది. మీ మీ ఇళ్ల దగ్గరే దహన సంస్కారాలు చేసుకోండి’ అని మాతృవియోగ ఆవేద• నతో అన్న నిష్ఠుర పలుకులు స్థానికులకు శాపమైంది. ‘న• మాతుః పరం దైవతమ్‌’..‌తల్లిని మించిన దైవం లేరన్న శాస్త్ర వాక్యానుసారం లోకాన్ని ఎదిరించి మాతృరుణం తీర్చుకున్న తృప్తి మిగిలింది.

‘సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం

అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం!!’

About Author

By editor

Twitter
YOUTUBE