మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం

జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

ఇదే మార్చి నెలలో రెండు ప్రధాన సందర్భాలు. తొలి పక్షంలో ప్రపంచ వ్యాప్తంగా మహిళాదినోత్సవ సంరంభం. మలిపక్షంలో తెలుగు సంవత్సరాది ఉగాది మహోత్సవం. ఈ రెండూ ఉత్సవ ఉత్సాహాలే. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు ఎటుచూస్తే అటు సరికొత్త ఆశలూ, ఆశయాల పరంపరలే. వీటిల్లో మనం చూడాల్సింది వాడుక, వేడుకలను మాత్రమే కాదు.. అంతర్గతంగా నిండిన వాటిని మనసులోనే కేంద్రీకరిస్తే, ఒక విశాల భావన ఎవరికి వారికే ప్రత్యక్షమవుతుంది. ఇంతటి సువిశాలత నుంచే-ఇప్పటిదాకా మనమంతా చేసిందేమిటి? ఇక నుంచి చేయాల్సింది మరేమిటి? అన్నది ప్రస్ఫుట మవుతుంది. ఆ రోజు మొత్తం సందేశాలూ సమా వేశాలూ శుభాకాంక్షలూ అభినందనలతోనే గడిపేస్తే సరిపోతుందా? ఊరూవాడా పండగగా చేసుకుని, ఆ మరునాటి నుంచే యథాపూర్వ స్థితితో సరిపెట్టుకుంటే అది ఉత్సవ ఉత్సాహం అనిపించు కుంటుందా? అనే ప్రశ్నలున్నట్లే సమాధానాలు కూడా మన ఎదురుగానే ఉన్నాయి. వాటి కోసం ఇంకెక్కడో వెదకాల్సిన అవసరమైతే ఎప్పటికీ లేదు. వంద మాటలు కట్టిపెట్టి ఒక్క పనైనా మొదలుపెడితే, అంతకుమించిన దినోత్సవం మరొకటి ఉండదు. అన్ని రంగాల్లోనూ సృజన, సాంకేతికత అంటున్నాం. సమానత కావాలని, ఇంటాబయటా అంతరం తొలగాలని నినదిస్తున్నాం. అంటే-సమాజ సాంకేతికీ కరణ. డిజిటల్‌ ‌పేరు పదే పదే ప్రస్తావిస్తున్నాం కదా. ఇప్పుడిక డిజిటల్‌ ‌కాదు… డిజిట్‌ ఆల్‌.

‌డిజిటల్‌ ‌భాగం, స్థానం, కళ అంతర్భాగాలు. ఇవి లేకుండా ఏ అడుగూ ముందుకు పడదు, పురోగతి ఏ విధంగానూ సాధ్యం కాదు. భాగం అనగానే చాలామంది ప్రశ్నార్థకంగా చూస్తారు. ఎంత, ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు వంటి ప్రశ్నలన్నింటినీ ఒక్కసారే ఒకే ఒక చూపుతో సంధిస్తారు. స్థానం అనే పేరెత్తితేనే మరింత మంది ఎన్నోది అన్నట్లు మొహం పెడతారు. ఇక కళ అంటే మటుకు చూపులన్నీ వికసిస్తాయి, వదనాలు కళకళలాడతాయి. ‘అవునండీ. ఇంటికీ స్త్రీ మూర్తే కళాకాంతీ. ఆమె నవ్వితేనే ఇంటిల్లిపాదీ ఆనంద తరంగితం. అదే స్థానంలో ఏ విచారమో, విషాదమో చోటుచేసుకుంటే కుటుంబమంతటికీ అంతే సంగతి’ అంటుంటారు. అలా అనుకునే, అనే వారంతా తెలుసుకోవాల్సింది మరొకటుంది. తగిన భాగం, సముచిత స్థానం, అన్నివేళలా కళలొలుకుతూ ఉంటేనే, వనితకు సరైన గుర్తింపూ, గౌరవం లభించి నప్పుడే  సమాజమంతటికీ మనుగడ.

సామాజికంగా అతివ పరిస్థితి ఏమిటన్నది ఎవరూ ఎవరికీ ప్రత్యేకించి వివరించాల్సిన పనేమీ లేదు. శ్రమశక్తికి తానొక శాశ్వత ఉదాహరణ. ఐక్యరాజ్య సమితి ప్రకటనకు సంస్థాగత రజతోత్సవం ఏనాడో అయింది. ఒకటా, రెండా- ఇప్పటికీ పాతికేళ్ల పైమాట. ‘గతాన్ని గుర్తించు, వనితభవితకు నీవంతు ప్రణాళిక రచించు’ అంటూ ఎప్పుడో 1996లోనే ప్రచారాంశం వెలువడింది. శాంతి, హక్కులు, అహింస, సమత్వం, అభివృద్ధి, నిర్ణయశక్తి, అవకాశాల కల్పన, విద్య-శిక్షణ, సాధికారత, మార్పు, ఉదాత్త భవిత… ఇలా ఎన్నెన్ని ఉన్నా; అన్నింటికీ కీలకం, సర్వవిధాలా ప్రధానం స్త్రీ శ్రమశక్తి. ఆ ఏకైక ప్రాముఖ్యం ప్రతి ఒక్కరికీ తెలిసి, జీవితాలకు అన్వయించుకున్ననాడే ఉత్సవమైనా, ఉత్సాహమైనా!

మాటలతో సరిపోదు

మహిళాదినోత్సవం మార్చి 8నే ఎందుకు? వివిధ దేశాల్లోని సామాజిక అనుభవాలే దీనికి సమాధానమిస్తున్నాయి. మొదట్లో ఇది మహిళా శ్రామిక ఉత్సవం. శ్రమశక్తి కనబరచినవారు సమాజంలో తమకు కావాల్సిన స్థానం, రావాల్సిన భాగం, అందుకోవాల్సిన కళ గురించి ముందుకు కదిలారు. విసుగూ విరామం లేకుండా పరిశ్రమిస్తున్న అందరికీ – నిర్ణీత విశ్రాంతి ఇవ్వాల్సిన సామాజిక బాధ్యతను ‘గుర్తుచేశారు.’ మన దేశంలోనైతే, గుజరాత్‌ ‌వేదికగా ప్రత్యేకించి వస్త్ర పరిశ్రమ మహిళాశ్రామిక సంఘం రూపొందింది. ‘కలసి నడుద్దాం, ప్రగతి సాధిద్దాం’ అంటూ ఆనాడు నేతృత్వం వహించినవారిలో ఎందరెందరో మహిళా మణులున్నారు. వనితల ప్రాధాన్యం తెలిపేలా, దినోత్సవ ఆవిర్భావం గురించిన పరిశోధనను అంతర్జాతీయంగా చరిత్రకారిణిరినీ నిర్వర్తించారు. అధికారిక గుర్తింపు సాధించేందుకు నటీమణి చేతా ఆ రోజుల్లోనే కృషి సాగించారు. భారత జాతీయంగా ఎన్నో పరిణామాలు సంభవించాయి. గుజరాతీ నేపథ్యంగా, పలు రాష్ట్రాలు ఎక్కడికక్కడ ఉత్సవాల నిర్వహణకు నడుంకట్టాయి. తెలుగు రాష్ట్రాలు రెండూ ప్రత్యేకత సంతరించే కార్యక్రమాలు చేపడుతున్నాయి.

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు; మహిళా సంక్షేమ-అభివృద్ధి మంత్రిత్వ శాఖలు తమవంతు బాధ్యతల్లో నిమగ్నమవుతున్నాయి. దశాబ్దాల క్రిందట న్యూయార్క్ ‌నగరాన మహిళాగణం నినదించడాన్ని నాయకులు నేటికీ ప్రస్తావిస్తుంటారు. అప్పట్లో పరిస్థితుల మెరుగుదల కోరుతూ నారీలోకం మార్చి నెల 8వ తేదీన  కదిలింది. మహాసభలు నిర్వహించి, సమైక్యతను చాటి చెప్పింది. అది మొదలు అన్ని స్థాయుల్లో, దేశాల్లో ఇలా ఉత్సవ నిర్వహణలు. వీటి పూర్వాపరాల ప్రాచుర్యం మరింత జరిగితే తప్ప, వనితా నేతల జీవిత ఆకాంక్షలు నెరవేరవు. స్త్రీల పరంగా ఆలోచనలు సువిశాలమైతే తప్ప, నేటి స్థితిగతుల్లో మార్పు చేర్పులు రావు. వర్ణనలతో కాదు, అవగాహనా ప్రపూర్ణతతో వనితాభ్యుదయం సిద్ధిస్తుంది. కోరుకోవాల్సింది క్రియాశీలతనే!

సవాళ్లు లెక్కలేనన్ని

వనితల దినోత్సవ నిర్వహణం అంటే – కేవలం కొందరు విజేతల కథన పరంపరలు మటుకే కాదు. వర్ణలు, ప్రశంసలకు మాత్రమే పరిమితమై వాస్తవిక పరిస్థితిని విస్మరించడం కాదు. ఆ ఒక్కరోజుతోనే పూర్తయ్యే ప్రసంగాల, సమావేశాల, పోటీల హోరాహోరీ కాదు. వాణిజ్య ప్రయోజనాలనే మేళవించి ప్రకటనలూ ప్రచారాలతో హోరెత్తించడం అంతకన్నా కాదు. ప్రతికూల భావనలను మెదడు నిండా నింపుకొని, ఉద్వేగాలూ, నిరసనలను సమాజమంతటా పరచడమూ కాదు. వాస్తవిక దృష్టి అంటూ ఉన్నప్పుడు, ఆలోచనల స్పష్టత సహజంగానే ముందు నిలుస్తుంది. ‘అమ్మను పూజించు, భార్యను ప్రేమించు, సోదరిని దీవించు..’ అని నీతిపాఠాలు వల్లె వేయించుకున్నా; స్త్రీని సాటిమనిషిగా గుర్తించి గౌరవించి ఆదరించే తత్వాన్ని ఆచరించడంవల్ల… ఎంత అవసరమో తెలిసేలా చేస్తే చాలు. మంచిని పంచి చెడును తుంచాల్సిన వ్యవస్థలే నానా రకాల అవస్థలకు నెలవైనప్పుడు స్త్రీ మూర్తికి మన్నన ఇంకెక్కడ? ఎవరూ ఎవరికీ ఏదీచెప్పే స్థితి లేదిప్పుడు. తెల్లవారింది మొదలు పొద్దుపోయేవరకు; ఆ తర్వాత కూడా ప్రచార సమాచార సాధనాలు, పలు విధాల మాధ్యమాలు వెలువరిస్తున్న వన్నీ సామాజిక రీతిని ప్రస్ఫుటం చేస్తూనే ఉన్నాయి. వనితలపై నేరాలూ, ఘోరాలూ, వాటి అనంతర రీతులు సైతం మొత్తం మానవతకే పెను సవాళ్లుగా దాపురిస్తున్నాయి. పత్రికలూ, టీవీలూ, ఫోన్లూ ఇతరాల్లో వెల్లడవుతున్నవి కొన్నే; ఎవరికీ తెలియని, ఎంతకీ అంతుపట్టని, ఏనాటికీ బయటపడని అకృత్యాలు కొల్లలు. భావస్వేచ్ఛ మరీ విపరీతంగా ఉందో, అసలు స్వేచ్ఛ అనేదే అంతరిం చిందో తెలియదు కానీ – సమాజం కకావికలమవుతోంది. కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు నోరెత్తి మాట్లాడటంవల్ల కనీసం వాస్తవా లేమిటో కాస్తో కూస్తో తెలుస్తున్నాయి. కం యోధులు ఆయుధాల్ని ఝళిపించడం వల్లనే ఏవో కొన్ని పరిస్థితులైనా ఎంతో కొంత అదుపులోకి వస్తున్నాయి. అంతవరకూ సంతోషమే!

మాతృశ్రీకారం

భారతనారి తానే మాట్లాడితే, లోపలి భావాలకు వెలుపల స్వరరూపమిస్తే…

భారతీయ నారి నేను, భాగ్య సుధాధారను

లలిత నవోషస్సులా విలసిల్లిన బాలను.

నీ ఇంటిని వెలిగించిన నిరుపమ దీపాన్ని

నిను మానవునిగా చేసిన నిత్యశక్తి ధాత్రిని

జీవన సౌఖ్యామృతం చిందిన కల్యాణిని

నీ జీవిత పరిపూర్ణత నిలిపిన అర్థాంగిని

సమస్త సృష్టిలో జననమైనా, గమనమైనా, జవమైనా, జీవమైనా, సృష్టి అయినా దృష్టి అయినా స్త్రీతోనే. ఆమె బాధితురాలైన ప్రతీ సందర్భమూ పురుషుడి ఉనికినీ మనికినీ ప్రశ్నార్థకం చేస్తున్నట్లే. ఏటేటా మహిళా దినోత్సవమనగానే; వారిపైన దురాచారాలూ, దురాగతాల గణాంకాలు వెల్లడించాల్సిన స్థితి నుంచి, సదాచారాలూ సమున్నత దశలను వివరించాల్సిన రోజు కావాలి, రావాలి. అందుకే భారతాంబను అర్చిద్దాం ఇలా-

ఆమె బ్రహ్మర్షిజాత కల్యాణగీత

ధర్మ సముపేత వేదమంత్ర ప్రపూత

విశ్వవిఖ్యాత సుశ్రీల వెలయుగాత

పరమ కరుణాసమేత మా భరతమాత

అని పలికిన కరుణశ్రీ ‘మాతృశ్రీ’ని ప్రార్ధిద్దాం. ఏమని?

మహిళాదినోత్సవం ఒక్కరోజుకీ పరిమితం కారాదని

ప్రతిరోజూ ఆ ఉత్సాహమే శాశ్వతమై నిలవాలని.

By editor

Twitter
Instagram