– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌మహోన్నత హిమాలయాన్ని ఎవరూ జయించలేరు.

మహార్ణవం వంటి జాతిని మరెవరూ తరించలేరు.

మహిమాలయ తల్లికి మణిమకుటం గగనసీమ

అక్కడి వాహినులే పొంగి కలిగిస్తాయి మనోరమ.

ధరణీతలం దద్దరిల్లేలా భరతభూమి విజృంభిస్తుంది.

యుద్ధ సిద్ధమై శత్రు వ్యూహాలన్నింటినీ ఛేదిస్తుంది.

జాతిరక్షణకు సదా సన్నద్ధంగా ఉండే త్రివిధ దళాలు ఆర్మీ, నేవీ, ఎయిర్‌పోర్స్. ‌పేరులోను తీరులోనూ హోరూ జోరూ నిండిన ‘ఫోర్స్’ ‌మన వైమానిక బృందం. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ ‌విశ్వమంతటా విశిష్టం. శక్తియుక్తుల్లో పేరెన్నిక గన్న విమానదళం ఏడు దశాబ్దాలకు పైగా ఘనచరితతో ప్రత్యేకం. లక్షలాది సిబ్బంది, వేలకొద్దీ విమానాలు ది గ్రేట్‌గా నిలుస్తున్నాయి. నాడూ నేడూ, సేనా సంబంధ ‘ఆపరేషన్‌’‌లో భాగంగా విజయ్‌, ‌మేఘదూత్‌, ‌పవన్‌ ‌వంటివి కాలగమనంలో ఎన్నెన్నో. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా శాంతిపరిరక్షణ బాధ్యతను మనదైన వాయుసేన నిర్వహిస్తూ వస్తోంది. సైన్యం అంటేనే పోరాటం. పోరు అనే పదానికి మారు పేరు శాలిజా ధామీ!

శాలి, శిల, శైల అనేవి ఒకేలా అనిపిస్తాయి, వినిపిస్తాయి.

శాలిలో బలశాలి ఉంది. శిలలో దృఢత్వం నిండింది.

శైలిలోనూ శిఖరస్థాయి ధ్వనిస్తుంది. వీటన్నిటి సమాహారంలా మన ముందు కనిపిస్తున్న శాలిజా అసలు సిసలు కెప్టెన్‌. ‌భారత వాయుసేనలోని యుద్ధ నిర్వహణ బృందానికి ప్రథమంగా నేతృత్వ బాధ్యత చేపట్టిన వీరనారి.

సమర సమయంలో మన సేనావాహినికి అన్నివైపులా నిలిచే విభాగాలు లెక్కలేనన్ని, రక్షణ సామగ్రి, ఆయుధ పరంపరను ఆకాశవీధిలో తరలిస్తారు. సైనిక ప్రయోజనాల కోసం అంతరిక్ష పరికరాల తరలింపులో సంబంధిత సంస్థలతో కలిసి పనిచేస్తారు. ప్రకృతి వైపరీత్యాల దరిమిలా, ఎటు వంటి ప్రాంతంలోనైనా బాధితులకు అండదండగా ముందుకు దూసుకెళ్తారు. విభిన్న సందర్భాల్లో ఇతర దేశాలకూ తరలివెళ్లి సహాయ సమన్వయాలు నిర్వర్తిస్తారు. వీటికన్నా మిన్నగా, ఏకంగా పోరాట విభాగానికే నాయకత్వం వహిస్తున్నారు కెప్టెన్‌ ‌శాలిజా. ఐఏఎఫ్‌ అనగానే ఆమె పేరు తళుక్కుమంటుంది. గ్రూప్‌ ‌కెప్టెన్సీ అని వినడంతోనే, ఇప్పుడు తనదైన పటిమ మారుమోగుతోంది.

సాయుధ దళంలో నాయకత్వం అంటే మాటలా? చేతల వనితగా తొలి నుంచీ తనను తాను నిరూపించుకుంటూనే వస్తున్నారు శాలిజా. పంజాబ్‌ ‌ప్రాంతంలోని సరభా అనే చిన్నపాటి ఊరు ఆమె స్వస్థలం. తల్లిదండ్రులు ప్రభుత్వ సేవల శాఖల్లో విధులు నిర్వహించినవారు. తల్లి దేవకుమారి మంచినీటి సరఫరా విభాగంలో, తండ్రి హర్కేష్‌ ‌విద్యుత్‌ ‌ప్రసార నిర్వహణ విభాగంలో సేవలు అందించారు. ఆ రెండు విభాగాలు అత్యవసర సేవలకు సంబంధించినవే కావడంతో, ఆ జీవన సరళే బాల్యం నుంచీ ప్రభావితం చేసిందంటున్నారు లేడీ కెప్టెన్‌.

‌తొలి నుంచీ తెగువ

సంవత్సరాలుగా ప్రభుత్వ సర్వీసుకే అంకితమైన అమ్మ,నాన్నలు తమ బిడ్డకు సేవాభావాన్నే నూరి పోశారు. ప్రభుత్వ పాఠశాలలోనే చేర్చారు. మంచి మార్కులు సాధించడంలోని పట్టుదలను అలవాటు చేయించారు. సమయపాలన, పూర్వ సంసిద్ధత అంటే ఏమిటో అనుభవపూర్వకంగా నేర్పించారు. క్రమశిక్షణ అవసరాన్ని తేటతెల్లం చేయడంతో, శాలిజా ధీశక్తి వెల్లివిరిసింది. పెద్దల కలల పంటగా తనను తాను తీర్చిదిద్దుకున్నారామె.

ఆమె మహిళా కళాశాలలో పట్టభద్రులయ్యారు. ఆ రోజుల్లోనే ఎయిర్‌ఫోర్స్ ‌ఘనత ఎంతటిదో విస్తారంగా తెలుసుకున్నారు. ఆ కార్యక్రమాల గురించి ఎనలేని శ్రద్ధాసక్తులు కనబరిచారు. సరిగ్గా అప్పుడే పీపీ సింగ్‌ ‌మార్గదర్శనం లభించింది. ఎవరాయన? భారతీయ యువతను రక్షణ దళాలవైపు మళ్లించే ఉత్తమ పౌరుడు. ఆ కారణంగ థానే నేషనల్‌ ‌కేడిట్‌కోర్‌లో చేరారు శాలిజా. సుశిక్షితురాలయ్యారు. తదుపరి పరిణామాలు మొదటగా ఆమెను ఫ్లయిట్‌ ‌కమాండర్‌గా చేశాయి. వింగ్‌ ‌కమాండర్‌గా తీర్చి దిద్దాయి. ఫోర్స్‌లో చేరి రెండు దశాబ్దాలవుతోంది. తన గ్రామ సమీపంలోని లూథియానా తనకు ఎంతో నేర్పిందంటారు. సేవాబలానికి అది మారు పేరు, ఎందరెందరినో తయారుచేసిన ఆదర్శ ప్రాంతమని ఇప్పటికీ చెప్తుంటారు.

వడివడిగా ముందడుగు

తాను చదివింది ‘కమ్యూనికేషన్‌’. ‌సంపాదిం చింది టెక్నాలజీ డిగ్రీ. విమానసేనలో చేరగానే కనులారా చూసింది ‘దీపక్‌’ ‌ఫ్లయిట్‌ను. అక్కడే తను మొదట ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ అయ్యారు. రెండేళ్లు గడిచాయో లేదో ఫ్లయిట్‌ ‌లెఫ్టినెంట్‌గా పదోన్నతిని సొంతం చేసుకున్నారు. మరికొంత కాలానికి స్క్వాడ్రన్‌ ‌లీడర్‌ అనిపించుకున్నారు. 2016లో వింగ్‌ ‌కమాండర్‌గా ప్రమోట్‌ అయింది. అంటే – ఏడేళ్ల క్రితం. మర్రి ఫ్లయిట్‌ ‌కమాండరూ తానే. మరో ముఖ్యాంశం-హిందన్‌ ఎయిర్‌ఫోర్స్ ‌స్టేషన్‌కు సంబంధించి, చేతక్‌ ‌హెలికాప్టరుకు సారథ్య బాధ్యతలు తీసుకున్నారు. ఫ్లయింగ్‌ ఇన్‌‌స్ట్రక్టరుగా ఉన్నతాధికారులతో శభాష్‌ అనిపించుకున్నారు. అదే విభాగంలో శాలిజానే మొదటి వనితారత్నం.

నేటికీ ప్రశంసల వెల్లువ

‘మా అమ్మాయి అని చెప్పడం కాదు కానీ, శాలిజా – వనితలందరికీ ఆదర్శం’ అంటారు తండ్రి. ఆయనకిప్పుడు 66 ఏళ్లు. లక్ష్మీనగర్‌లోని తన నివాసానికి రోజూ వస్తున్న ఫోన్‌కాల్‌ అభినందనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వెస్టర్న్ ‌సెక్టార్‌లోని యూనిట్‌లో ఆ మహిళా కమాండర్‌, ‌పక్కనే కనిపిస్తున్న హెలికాప్టర్‌ ఎవరిలోనైనా దేశభక్తిని పెంపొందిస్తాయని చెప్తుంటే తల్లి కళ్ల నుంచి ఆనందబాష్పాలు జాలువారాయి. గ్రూప్‌ ‌కెప్టెన్‌ అం‌టే, దరిదాపుగా ఆర్మీలోని కల్నల్‌ ‌స్థాయి. ఆ పడతి ఫ్రంట్‌లైన్‌ ‌కమాండ్‌ ‌హెడ్‌క్వార్టర్స్‌లోని ‘ఆపరేషన్స్’ ‌విభాగంలో లీడర్‌. అం‌తకుమించి, క్షిపణుల స్క్వాడ్రన్‌కు నేతగా బాధ్యతలు నెరవేరుస్తున్న ధీరురాలు. ఇంతటి ప్రత్యేకత దేశమంతటికీ అత్యంత విలక్షణం, ఎంతైనా వందనీయం. ప్రశంసా పాత్రం.

యుద్ధ హెలికాప్టర్లు శత్రుసేనల్ని గడగడలాడి స్తుంటాయి. రెప్పపాటులో మెరుపులు సృష్టించి, అనుకున్న లక్ష్యాల్ని సూటిగా ఛేదిస్తుంటాయి. అటువంటి గగన వాహనంలో దాదాపు మూడువేల గంటల సారథ్య అనుభవం శాలిజాకు జత చేరింది. బంధుమిత్రులు, సహ అధికారులతో ముక్తసరిగా మాట్లాడే ఆమె… విధి నిర్వహణ వేళల్లో మనమెవ్వరం ఊహించలేనంతటి గడసరి.

సేవకూ సదా సన్నద్ధత

ఈ ఏడాది తొలి మూడు నెలలూ ఘనమైనవే. గడచిన జనవరిలోనే మన సేనా వాహినిలోకి కెప్టెన్‌ ‌శివ ప్రవేశించడం గుర్తుండే ఉంటుంది. పదాతి దళంలోని

ఫైర్‌ అం‌డ్‌ ‌ఫ్యూరీ కోర్‌లో ఆర్మీ ఆఫీసర్‌ ఆమె. ఇప్పుడు ఈ విమాన బలగంలోకి శాలిజా సమున్నత ప్రవేశం అతివల నాయకత్వ రంగాన మరిన్ని ఆశల్ని రేకెత్తిస్తోంది. నేరుగా రణక్షేత్రంలో విధి నిర్వహణ భాగ్యానికి రూపురేఖలద్దిన సందర్భమిది.

నగరమ్ములు జనపదాలు

నగా గ్రములు కాననాలు

తరులు ఝరులు గిరి గహ్యర

తతులు యుద్ధ రంగమ్ములు

                    గగనాంగణ గర్జనములు

                    కనద్ధరా సంభ్రమములు

                    సాగర సంఘర్ణనములు

                    శతశతఘ్న ఘోషణములు

శాత్రవ విధ్వంసనమ్ము

సాగించెడు, మోగించెడు

జయదుందుభి నాలకింప

సాగిరండు మునుముందుకు

                    నిప్పులుమియు విమానముల

                    నుప్పరమున గాల్చి కూల్చు

                    విజయోజ్వల వీరచక్ర

                    విజేతలకు కేల్మోడ్పుడు

                    అఖండమే భరతజాతి

                    అజేయమని చాట రండు!

ఇవి చదువుతున్నంతసేపూ, వింటున్నంతసేపూ మనముందు నిలిచే వీరవనితగా భావించి… శాలిజాను సంభావిద్దాం.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram