ఆమెకి నిండు నూరేళ్లు.
ఆమె చూపిన మహోదాత్త ఉదారతకు అందరి జేజేలు.
పేరుకు తగిన తీరు, తీరుకు దీటైన పేరు – లక్ష్మీబాయి. ఎంతగానో పేరొందిన వైద్య చికిత్స నిపుణురాలిగా స్వరాష్ట్రం ఒడిశాతోపాటు దేశంలోని అనేకానేక ఇతర ప్రాంతాల వైద్యులెందరికో తెలుసు.
సాక్షాత్తు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక అభినందనలందుకున్న డాక్టర్ కె.లక్ష్మీబాయి అద్భుత వనిత. తన జీవితకాల పొదుపు మొత్తం, సొంత నివాస గృహాన్ని విక్రయిస్తే వచ్చిన ధనం అంతటినీ మహిళారోగ్యం కోసమే కేటాయించారు.
వృత్తి జీవితానికి పరిపూర్ణంగా అంకితమయ్యారు. కుటుంబ బాధ్యతల భావ ప్రభావంతో వైద్యసేవకు దూరంగా ఉండాల్సి వస్తుందేమోనని వివాహమే వద్దనుకున్నారు. రోజులో 24 గంటలూ డాక్టర్‌గానే!
గతేడాది డిసెంబరు ఐదున ఆమెకి శత వసంతోత్సవం. అదే క్రమంలో వచ్చే ఏప్రిల్ తొలివారంలోపలే మరో వందరోజులు. శతాయుష్కురాలు, శతాధిక ఆయుష్కురాలు, మహోదార గుణసంపన్నురాలు. క్యాన్సర్ బాధితుల చికిత్సల గురించి దరిదాపు రూ.మూడున్నర కోట్లు విరాళమివ్వడం ఎంతైనా చరిత్రాత్మకం!
రాష్ట్రపతి ప్రశంసించినట్లు – దానమయి లక్ష్మీబాయి!
దానం అంటే త్యాగం, మహత్తరం, మహోన్నతం.
పేరు కోసం కాదు, ప్రచారం కోసమైతే అసలే కాదు. రికార్డు సృష్టించాలన్న ఆలోచనా అసలే ఉండదు. జీవితాన్ని సార్థకం చేసుకుందామన్న సంకల్ప బలమే దానగుణాన్ని పెంచి పోషిస్తుంది. దానసంపద. అది పుష్కలంగా ఉంది లక్ష్మీబాయిలో.
ఆమె సొంత ఊరు కటక్. పుట్టింది 1926లో. పురాతన బారాబతి కోటకు ప్రసిద్ధి కటక్ నగరం. సహస్రాధిక సంవత్సరాల చరిత్ర. మిలీనియం సిటీ.
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌తో కలిసి జంటనగరాల్లో ఒకటి కటక్. స్వరాజ్య ఆశ్రమం, స్వాతంత్య్ర సమరయోధుల స్మారక చిహ్నం అక్కడే. విలక్షణత సంతరించుకున్న కటక్‌లోని వైద్యకళాశాలలో లక్ష్మీబాయి చదివారు. కాలేజీ పూర్తిపేరు శ్రీరామచంద్ర భంజా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. పొడి అక్షరాల్లో ఎస్.సి.బి. ప్రతిష్ఠాత్మకత నిండిన ప్రభుత్వ సంబంధ వైద్యసంస్థ.
నేషనల్ మెడికల్ కమిషన్ గుర్తింపు అందుకున్న కటక్ కళాశాలలో తొలి బ్యాచ్ విద్యార్థిని ఆమె. వ్యాధి పీడితులకు ఉచిత వైద్య సేవలు, అత్యవసర చికిత్సలు, సూపర్ స్పెషాలిటీ సేవాపరంపరలు అందించే వైద్యాలయం తనది. అందులో విద్య, ప్రయోగ, పరిశోధన ఫలాలను అందిపుచ్చుకున్నారు. అందులోనే బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ చేశారు.
ఎంబీబీఎస్ తర్వాత మద్రాసు మెడికల్ కాలేజీలో ఎండీ చేశారు లక్ష్మీబాయి. ఆ వైద్యాలయం మన దేశంలోనే కాకుండా మొత్తం ఆసియా ఖండంలోనే పురాతన ప్రసిద్ధ సంస్థ. ఎంఎంసీగా జగద్ విఖ్యాతం. అనుబంధ విభాగాల సంఖ్య ఇరవైకి పైగా ఉంటుంది.
కటక్, మద్రాసులలో చదివినంతకాలమూ నిరంతరంగా పరిశ్రమించారు లక్ష్మి. మహిళా డాక్టరుగా నిరంతర సేవలందించాలని, జీవితమంతటినీ అందుకే అంకితం చేయాలనీ ఆ రోజుల్లోనే స్థిర నిశ్చయానికి వచ్చారు.
స్త్రీల ఆరోగ్య సమస్యల గురించే ఎప్పుడూ ఆలోచిస్తుండేవారు. పలు వ్యాధుల గమనింపు, నిర్ధారణ, చికిత్స అనంతర జాగ్రత్తలపరంగా అధ్యాపకులు, శస్త్ర చికిత్సల నిపుణులతో చర్చిస్తుండేవారు.
ప్రధానంగా వనితలు ఎదుర్కొనే క్యాన్సర్‌కి సంబంధించి. జీవన శైలి బాగుంటే సమస్యను సమర్థంగా నివారించుకోవచ్చు. శరీర బరువు నియంత్రణ, క్రమం తప్పకుండా నిత్యమూ వ్యాయామం చేస్తుండటం, ప్రత్యేకించి పోషక ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యమని చెప్తుండేవారామె.
వైద్యసంబంధ ముందస్తు సూచనలు, సకాల హెచ్చరికలతో అప్రమత్తం చేయడమన్నది ఆమె అలవాటుగా మారింది. నివాసలో ఉన్నా, వైద్యాలయంలో పనిచేస్తున్నా, ఎక్కడ ఏ పనిలో నిమగ్నమైనా – స్త్రీల ఆరోగ్య పరిరక్షణవైపే తన చూపు.
తరచుగా జ్వరం, ఉన్నపళంగా బరువు తగ్గడం, విపరీతంగా అలసటరావడం, శరీరంలో అనూహ్య మార్పులు, ఏవైనా గాయాలు తగిలి ఎంతకీ మానని స్థితి, ఇతరత్రా ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సత్వర జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్‌గా లక్ష్మీబాయి రోజూ చెప్తుంటారు ఇప్పటికీ. క్యాన్సర్ వ్యాధి వచ్చాక నివారించడం కన్నా, నిరోధించడం పైనే దృష్టి సారించాలన్నది ఆమె నినాదం, విధానం.
‘ఆరోగ్యమస్తు’ అనడం ఊతపదంగా మారింది.
అది 1950. అంటే ఇప్పటికీ 75 సంవత్సరాల కిందటి సంగతి.
వైద్యవిద్య ఉన్నత స్థాయికి రాగానే, సుందర్‌గఢ్‌లోని ప్రభుత్వ వైద్యశాలకు ఆమె నియమితులయ్యారు.
పరిశ్రమల కేంద్రంగా సుందర్‌గఢ్ ప్రతీతి. వేడిమి, చల్లదనం రెండూ విపరీతంగా ఉండే ప్రాంతం. వైద్యపరమైన సదవగాహన అక్కడి ప్రజలకి మరింత కలిగేలా ఎన్నో విధాలుగా కృషి సాగించారామె.
జీవనయానంలో భాగంగా పలు వైద్యకళాశాలల్లో బోధనలు సాగించారు. వివిధ ఆస్పత్రుల్లో వైద్యసేవలందిస్తూ, ఎక్కడ తాను ఉన్నా అక్కడ ప్రాంతీయుల్లో వైద్య అవగాహన పెంపొందేలా చేశారు. అందుకు అనువుగా ఎన్ని సదస్సులు నిర్వహించారో, శిబిరాలు ఏర్పాటుచేశారో, ఉచితంగా వైద్యచికిత్సలూ సేవలూ ఎన్ని కొనసాగించారో లెక్కే లేదు. నిత్యమూ సేవల నిర్వహణలోనే నిమగ్నమైన అంకితభావం ఆమెది.
బరంపురంలో ఉన్న విఖ్యాత ప్రభుత్వ వైద్యసంస్థ ఎంకేసీజీ. మహారాజా కృష్ణచంద్ర గజపతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్.
‘అందరి ఆరోగ్యమే జాతికి సౌభాగ్యం’ అనేది ఆ సంస్థ లక్ష్యం. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పరిధిలోనిది. వైద్యబోధన, శిక్షణ, పరిశోధన, పేషెంట్ కేర్ రంగాల్లో పేరు పొందిన బరంపురం వైద్య సంస్థకీ డాక్టర్ లక్ష్మీబాయి సేవలు విశేషంగా అందాయి.
ప్రసూతి, గైనకాలజీ విభాగం అధిపతిగా ఆమె అందించినవన్నీ నిరుపమాన సేవలు. పరిశోధన కృషిలో భాగంగా దేశ విదేశాల్లోని వైద్య నిలయాలను సందర్శించారు. అనేకమంది వైద్య నిపుణులతో పరిచయాలు పెంచుకున్నారు. చికిత్సల్లో సలహాలు ఇచ్చారు, అందుకున్నారు కూడా. మహిళా వైద్యురాలిగా తనదైన శైలిని కనబరిచి, ఎందరెందరికో అభిమానపాత్రురాలయ్యారు.
వైద్యం, సమాజం… ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంటుందనీ, ఉందనీ గట్టిగా నమ్మిన ఆమె వివిధ సందర్భాల్లో వ్యక్తపరచిన ప్రగాఢ అభిప్రాయాలు ఇవి :
- భారతీయ వైద్య వ్యవస్థలో కీలకపాత్ర మహిళా వైద్యులదే.
- లేడీడాక్టర్ వత్తి అనేది ఒక ఉపాధి మాత్రమే కాదు, అదొక నిబద్ధత. మానవతాసహిత బాధ్యత.
3 వైద్యరంగంలోకి ప్రవేశించడం, స్థానం పొందడం, నిలబెట్టుకోవడం మన దేశంలో స్త్రీలకు అంత సులభమేమీ కాదు. అయినా పలువురు మహిళా వైద్యులు అంతర్జాతీయ ఖ్యాతినీ అందుకుంటున్నారంటే… అదంతా వనితా ప్రతిభకు ప్రతీక.
- వనితావైద్యుల ప్రాతినిధ్యం దేశంలో ఎంతగానో పెరిగింది.
జాతీయ స్థాయిలో పనిచేస్తున్న వైద్యమండలి నివేదిక ప్రకారం చూసినా అండర్ గ్రాడ్యుయేట్ (మెడికల్) కోర్సుల్లోని వారిలో సగంమంది వైద్య విద్యార్థినులే! అలాగే ప్రభుత్వ వైద్యశాలల్లో ఉద్యోగ / వృత్తి విధులు నిర్వర్తిస్తున్న స్త్రీల ప్రాతినిధ్యం గడచిన రెండు దశాబ్దాల్లో రెట్టింపు అయింది. ఇది శుభసూచిక.
- ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి నివేదికలూ, అధ్యయన అంశాలూ మహిళావైద్యులు ప్రాధాన్యాన్ని వెల్లడిస్తున్నాయి.
ఉద్యోగ విరమణ చేశాక, డాక్టర్ లక్ష్మీబాయి సేవలు ఎంతో విస్తృతమయ్యాయి. సమాజంలో వైద్యసేవల విస్తరణకు ఒక ఉద్యమాన్నే నడిపారామె. జాతీయంగా ‘భారత జ్యోతి’ పురస్కారాన్ని స్వీకరించారు. అంతర్జాతీయంగా ఫ్రెండ్‌షిప్ సొసైటీ అవార్డును కైవసం చేసుకున్నారు. ‘బెస్ట్ సిటిజన’ అనిపించుకున్నారు. ప్రతిష్ఠాత్మక పురస్మృతిని అందుకున్నారు.
వైద్యం గురించే వృత్తిపరంగా పరితపించే డాక్టర్ లక్ష్మీబాయి తన సంపాదన అంతటినీ విరాళరూపంలో ‘ఎయిమ్స’కి సమర్పించారు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ` భువనేశ్వర్‌కి ఆమె అందించిన మొత్తం కోట్ల రూపాయల్లో! ఆ నిధి అంతటినీ గైనకాలజీ వైద్య ప్రక్రియ పురోగతికి కేటాయించాలన్నారు. అంతేకాదు…
స్త్రీలలో క్యాన్సర్ నిరోధానికి అత్యధునాతన చికిత్స అత్యవసరం. అందుకే మరికొన్ని లక్షల రూపాయల మొత్తాన్ని బరంపురంలోని గైనకాలజీ చికిత్సల సొసైటీకి డాక్టర్ లక్ష్మీబాయి ప్రకటించారు. అందించారు.
తనకంటూ ఏమీ మిగుల్చుకోలేదు. ఇంటిని సైతం విక్రయించగా వచ్చిన మొత్తాన్ని విరాళమిచ్చిన త్యాగమయి. ఆ భారీ వదాన్యతకు స్పందించిన ప్రభుత్వం ఆమెను ధన్యచరితగా కొనియాడింది.
‘అసలు మీ ఆలోచనే అద్భుతం. వనితాశక్తి సంపన్నతకు ఇదే సంకేతం. ఆరోగ్యభాగ్యం అందరికీ అందించాలన్న ప్రభుత్వాల నిరంతర కృషికి అన్ని విధాలుగానూ వెన్నుదన్నుగా నిలుస్తోంది మీ వదాన్య స్వభావం. సమాజసేవకు నిర్వచనం మీతోనే ప్రకటితం అయింది. ఇదీ సాధికారత. ఇదే సేవా తత్పరత, అంటూ డాక్టర్ లక్ష్మీబాయికి ఆత్మీయ సందేశం పంపించారు భారత రాష్ట్రపతి.
ఈనాటికీ అక్షరాక్షర సాక్ష్యాలే ఈ అన్నీ. ధన్యజీవని డాక్టర్ లక్ష్మి.

– జంధ్యాల శరత్‌బాబు
సీనియర్ జర్నలిస్ట్