ఆరఎసఎస్ ఆదర్శాలతో ప్రేరణ పొందిన విద్యా విభాగమైన విద్యాభారతి తరతరాలుగా భారతీయ విలువలు, సంస్కృతి, నడవడికలో నిష్ణాతులైన విద్యార్థులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తోంది.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్`ఆరఎసఎస్ ఆవిర్భవించిన నాటి నుండి, గ్రామీణ భారత్‌ను చైతన్యపరచడానికి విద్యే అత్యంత ప్రభావవంతమైన మార్గమని గుర్తించింది. సేవ, సంస్కారం ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాలను చైతన్య పరచాలని నిర్ణయించుకుంది. విద్యా భారతి సంస్థలు, ముఖ్యంగా సరస్వతీ శిశుమందిరాలు, విద్యా మందిరాలు, సరైన ప్రభుత్వ పాఠశాలలు లేని ప్రాంతాలలోని లోపాలను సరిచేస్తూ, తక్కువ ఖర్చుతో కూడిన, సమాజ ఆధారిత విద్యను అందించాయి. విశ్వాసం, సేవ ఆధారంగా గ్రామీణ భారత్‌లో ఒక సామాజిక, సాంస్కృతిక ఉనికిని పెంపొందించింది. విద్యాభారతి, సాంస్కృతిక విలువలను సమకాలీన విద్యతో మేళవించడానికి కట్టుబడి ఉన్న, భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వేతర పాఠశాలల నెట్‌వర్క్‌లలో ఒకటిగా ఉంది. ఇది 1977లో అధికారికంగా ఏర్పడి నప్పటికీ, దీని కార్యకలాపాలు 1952లో ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో మొదటి సరస్వతీ శిశుమందిరం స్థాపనతో  ప్రారంభ మయ్యాయి. విద్యా భారతి “వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం” అనే ఆరఎసఎస్ సిద్ధాంతానికి ఒక నిదర్శనం. విద్యాభారతి అఖిల్ భారతీయ శిక్షా సంస్థాన్ – (వీబీఏబీఎసఎస్) సంస్థాగత ప్రధాన కార్యాలయం లక్నోలో ఉంది. ఇది మేధోపరంగా నిష్ణాతులుగా, నైతికంగా దృఢంగా, ఆధ్యాత్మికంగా ప్రబుద్ధులైన విద్యార్థులను తీర్చిదిద్దే లక్ష్యంతో దేశవ్యాప్తంగా వేలాది పాఠశాలలను పర్యవేక్షిస్తుంది. విద్యాభారతి విద్య “భారతీయీకరణ, జాతీయీకరణ, ఆధ్యాత్మికీకరణ”ను ప్రోత్సహిస్తుంది. 2024-25 నాటికి 12,000కు పైగా విద్యాసంస్థలతో, 35 లక్షలకు పైగా విద్యార్థు లకు సేవలందిస్తున్న ఇది, భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ పాఠశాలల నెట్‌వర్క్‌లలో ఒకటి.

విద్యాభారతి పాఠశాలల సహకారం

విద్యాభారతి పాఠశాలలు విద్యాబోధన, భారతీయ విలువల సమ్మేళనానికి ప్రసిద్ధి చెందాయి. పాఠ్యప్రణాళికలో రోజువారీ ప్రార్థనలు, దేశభక్తి గీతాలు, యోగా, సంస్కృత బోధన, నిజాయితీ, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతపై దృష్టి సారించిన నైతిక విద్య ఉంటాయి. భారతీయ సంస్కృతి, వారసత్వం పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి సాంప్రదాయ పండుగలను జరుపుకుంటారు. ఈ విద్యా వ్యవస్థ సాంస్కృతికంగా దృఢమైన యువతను తీర్చిదిద్దింది. అలాంటి యువత సామాజిక సేవల ద్వారా ఆరఎసఎస్‌తో తన అనుబంధాన్ని కొనసాగి స్తోంది. ఈ విధంగా, విద్యాభారతి ఆరఎసఎస్ పట్టణ మేధో పునాదికి, గ్రామీణ సమాజానికి మధ్య వారధిగా పనిచేస్తూ, పాఠశాల విద్యలో జాతీయ చైతన్యాన్ని పెంపొందిస్తుంది. అదేవిధంగా, గిరిజన వర్గాలతో విద్యాభారతి అనుబంధం ఏకల్ విద్యాలయాలు (ఒకే ఉపాధ్యాయుడు ఉండే పాఠశాలలు), సంస్కార కేంద్రాల ద్వారా జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లోని మారుమూల, అటవీ ప్రాంతాలకు విస్తరించింది. ఈ సంస్థలు అక్షరాస్యత, ప్రాథమిక విద్యను అందించడంతో పాటు, స్థానిక ఆచారాలను పరిరక్షిస్తూ జాతీయ సమైక్యతను పెంపొందిస్తాయి. ఈ విస్తరణ కార్యక్రమం ఆరఎసఎస్ సామాజిక పునాదిని పట్టణ మధ్యతరగతి నుండి గ్రామీణ, గిరిజన జనాభా వరకు విస్తరించింది. గతంలో ఏకాంతంగా ఉన్న వర్గాలను విస్తృత సాంస్కృతిక, జాతీయ సందర్భానికి అనుసంధానించింది. విద్యాభారతి నుంచి వచ్చిన అనేక మంది గ్రాడ్యుయేట్లు ,స్థానిక వాలంటీర్లు సేవాభారతి, వనవాసి కళ్యాణ్ ఆశ్రమం, గ్రామ వికాస్ కార్యక్రమాల వంటి ఆరఎసఎస్-ప్రేరేపిత కార్యక్రమాలకు మద్దతు ఇస్తున్నారు. తద్వారా స్వీయ అస్త్తిత్వంతో కూడుకున్న  సామాజిక నాయకత్వ ఆవృతాన్ని స్థాపిస్తున్నారు. ఈ అనేక కార్యక్రమాలు ఆరఎసఎస్‌ను గ్రామ అభివృద్ధి, స్వయం సమృద్ధి, నైతిక జీవనానికి అంకితమైన క్షేత్రస్థాయి సంస్థగా నిలబెట్టాయి. ఇటీవల భారత ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల భాగస్వామ్యంతో కొత్తగా 100 సైనిక్ పాఠశాలలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ చర్యలో భాగంగా, ఏడు (07) విద్యాభారతి పాఠశాలలను సైనిక్ పాఠశాలలుగా మార్చడానికి ఎంపిక చేశారు.

దేశ పునః నిర్మాణంలో విద్యాభారతి పాఠశాలల పాత్ర

విద్యాభారతి పాఠశాలలు విద్యాపరమైన కఠినత్వం, సాంస్కృతిక వారసత్వం , నైతిక సూత్రాల కలయిక ద్వారా విద్యార్థులను తీర్చిదిద్ది, భారత దేశ పునఃనిర్మాణానికి గణనీయంగా దోహదపడతున్నాయి. విద్యాభారతి, సరస్వతీ శిశు మందిరాలు, సంస్కార కేంద్రాలు వంటి సంస్థల ద్వారా మేధస్సును, వ్యక్తి నిర్మాణాన్ని పెంపొందించే సంపూర్ణ విద్యను ప్రోత్సహిస్తుంది. ఈ సంస్థలు నిత్య ప్రార్థనలు, యోగా, సంస్కృత విద్య, ప్రాచీన పండుగల స్మరణ ద్వారా భారతీయ సంస్కారాలను (ఆదర్శాలను) ప్రచారం చేస్తూ, విద్యార్థులలో ప్రగాఢమైన దేశభక్తి,  క్రమశిక్షణ భావనను పెంపొందిస్తున్నాయి. ఇవి సమకాలీన పాఠశాల విద్యతో పాటు, సేవ, స్వయం సమృద్ధి, సామూహిక శ్రేయస్సు వంటి సూత్రాలను ప్రోత్సహిస్తూ, యువతను సామాజిక సేవల్లో చురుకుగా పాల్గొనేలా ప్రేరేపిస్తున్నాయి. విద్యా భారతి తన పరిధిని మారుమూల, గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తూ, ప్రభుత్వ వనరుల కొరత ఉన్న ప్రదేశాలలో నాణ్యమైన విద్యను అందిస్తుంది. గిరిజన, అణగారిన వర్గాలను శక్తిమంతం చేయడం ద్వారా, ఇది జాతీయ అభివృద్ధికి అవసరమైన సామాజిక ఐక్యతను, సమ్మిళిత వృద్ధిని పెంపొందిస్తుంది. స్వయం సేవకులుగా శిక్షణ పొందిన విద్యావేత్తలు, వాలంటీర్లు, పౌర కర్తవ్యాన్ని, జాతీయ చైతన్యాన్ని పెంపొందించే నైతిక నమూనా లుగా నిలుస్తున్నారు. తత్ఫలితంగా, విద్యాభారతి పాఠశాలలు దేశాభివృద్ధికి అంకితమైన బాధ్యతా యుతమైన, సాంస్కృతికంగా పరిణతి చెందిన పౌరులను తీర్చిదిద్దుతున్నాయి.

విద్యావేత్తలు, విమర్శకుల అభిప్రాయాలు

విద్యాభారతి పాఠశాలలు, ఆరఎసఎస్ గురించి పలువురు విద్యావేత్తలు, పరిశోధకులు, విమర్శకులు రచనలు చేశారు. వాల్టర్ ఆండర్సన్, శ్రీధర్ దామ్లే తమ ‘ది బ్రదర్‌హుడ్ ఇన్ సాఫ్రాన’ అనే గ్రంథంలో, విద్యాభారతిని ఆరఎసఎస్ సామాజిక-సాంస్కృతిక అజెండాకు ఒక కీలకమైన సంస్థాగత విస్తరణగా అభివర్ణించారు. రచయితల ప్రకారం, ఈ పాఠశాలలు ఆరఎసఎస్ క్రమశిక్షణ, దేశభక్తి, ధార్మిక విలువలు వంటి సైద్ధాంతిక సూత్రాలను ఒక క్రమబద్ధమైన విద్యా చట్రంగా మారుస్తున్నాయి. క్రిస్టోఫ్ జాఫ్రెలాట్ రచించిన ‘ది హిందూ నేషనలిస్ట్ మూవ్‌మెంట్ అండ్ ఇండియన్ పాలిటిక్స’ అనే గ్రంథం, ఆరఎసఎస్ విద్యాసంస్థలుగా, హిందూ సాంస్కృతిక చైతన్యానికి వాహకాలుగా పనిచేసే పాఠశాలలను స్థాపించి, విద్య ద్వారా తన ప్రభావాన్ని ఎలా పద్ధతిగా విస్తరించిందో వివరిస్తుంది. తపన్ బసు (‘ఖాకీ షార్ట్స్ అండ్ సాఫ్రాన్ ఫ్లాగ్స’), మీరా నంద (‘ప్రొఫెట్స్ ఫేసింగ్ బ్యాక్‌వర్డ’) వంటి ఆరఎసఎస్ విమర్శకులు కూడా, విద్యాభారతి పాఠ్యప్రణాళిక సాంప్రదాయ విద్యా విషయాలతో పాటు నైతిక, సాంస్కృతిక విద్యను కూడా సమగ్రంగా అందిస్తుందని పేర్కొన్నారు. ఈ రచనలు విద్యార్థు లలో వారి నాగరిక వారసత్వంపై అవగాహనను పెంపొందించే ఉద్దేశ్యంతో సంస్కృతం, యోగా, భారతీయ చరిత్ర, నైతిక విద్యపై ఉన్న ప్రాధాన్యతను నొక్కి చెబుతున్నాయి. దీని మద్దతుదారులు దీనిని విలువ-ఆధారిత విద్యగా భావిస్తుండగా, మరికొందరు దీనిని బోధనలో జాతీయవాద, మత-సాంస్కృతిక గుర్తింపును ఏకీకృతం చేసే ప్రయత్నంగా వ్యాఖ్యానిస్తున్నారు. పూజనీయ రెండవ సర్‌సంఘ చాలక్ ఎం.ఎస్. గోల్వాల్కర్ సైద్ధాంతిక గ్రంథాలు, ముఖ్యంగా ‘బంచ్ ఆఫ్ థాట్స’, ప్రామాణిక విద్య భారతీయ సంప్రదాయంలో పాతుకుపోయిన నైతిక, ఆధ్యాత్మిక సూత్రాలైన సంస్కారాలను పెంపొందిం చాలని వాదించడం ద్వారా ఈ దృక్పథానికి పునాది వేశాయి. తదుపరి పూజనీయ సర్‌సంఘచాలక్ బాలసాహెబ్ దేవరస్ “రాష్ట్ర నిర్మాణ్ మే శిక్ష”లో ఈ భావనను విపులంగా వివరించి, విద్యను ఒక జాతీయ బాధ్యతగా పేర్కొన్నారు. ఈ ఆదర్శాలు విద్యాభారతి నమూనాకు నేరుగా ప్రేరణనిచ్చాయి. ఈ నమూనా విద్యను కేవలం విద్యాబోధనగా మాత్రమే కాకుండా, జాతీయ సేవతో కూడిన వ్యక్తిత్వ వికాస సాధనంగా భావిస్తుంది.

టి.ఎన్. మదన్, క్రెయిగ్ జెఫ్రీ నిర్వహించిన పరిశోధన, విద్యాభారతి ద్వంద్వ విధిని నొక్కి చెబుతోంది. వాటిలో మొదటిది గ్రామీణ, గిరిజన ప్రాంతాలలో ప్రాథమిక విద్యను అందించడం, రెండవది జాతీయవాద భావజాలాన్ని ప్రచారం చేయడం. గ్రామీణ ప్రాంతాలలో విద్యాభారతి పాఠశాలల విజయానికి కారణం, అక్షరాస్యతను, సాంస్కృతిక పరిరక్షణను ప్రోత్సహించే, తక్కువ ఖర్చుతో కూడిన, సమాజ ఆధారిత బోధనా విధానమే. విమర్శకులు దీని భావజాల స్వభావంపై చర్చలు జరిపినప్పటికీ, అనధికారిక విద్య, గ్రామీణాభివృద్ధిలో దీని పాత్రను ప్రభుత్వ అంచనాలు అడపాదడపా గుర్తించాయి. జ్యోతిర్మయ శర్మ (టెర్రిఫైయింగ్ విజన్), ప్రేమ కురియన్ (ఎ ప్లేస్ ఎట్ ది మల్టీకల్చరల్ టేబుల్) వంటి ఇతర విమర్శ కులు ఆరఎసఎస్ అనుబంధ పాఠశాలల విస్తృత పరిణామాలను పరిశీలిస్తూ, దానిని ప్రపంచ హిందూ గుర్తింపు ఉద్యమంలో ఒక భాగంగా చిత్రీకరిస్తున్నారు. విద్యాభారతి బోధనా విధానం సారాంశంలో పూర్తిగా స్థానికమైనప్పటికీ, ఉమ్మడి సాంస్కృతిక కథనాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సమాజాలను అనుసంధానించడానికి కూడా పనిచేస్తుందని వారు వాదిస్తున్నారు. అందువల్ల, ఆరఎసఎస్ ప్రస్థానంలో విద్యాభారతి పాఠశాలల కీలక పాత్రను నిర్ధారిస్తూ, స్వతంత్ర పండితులు, విమర్శకులు ఇద్దరూ వాటి గురించి విస్తృతంగా రాశారని మనం గమనించవచ్చు.

ముక్తాయింపు

విద్యాభారతి ప్రాథమికంగా ‘దేశమే ప్రథమం’ అనే ఆరఎసఎస్ సిద్ధాంతం విద్యాపరమైన రూపానికి ప్రతిరూపం. సమకాలీన జ్ఞానాన్ని ఆధ్యాత్మిక వారసత్వంతో అనుసంధానించి, భారతీయ సంస్కృతికి, జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే క్రమశిక్షణ, సేవా దృక్పథం ఉన్న వ్యక్తులను తీర్చిదిద్దడమే దీని లక్ష్యం. దీని సమర్థకులు దీనిని దేశీయ సూత్రాలపై ఆధారపడిన సమగ్ర విద్యా నమూనాగా పరిగణిస్తుండగా, విమర్శకులు దీనిని భావజాల ప్రబోధానికి ఒక సాధనంగా భావిస్తారు. ఏదేమైనప్పటికీ, ఈ రెండు దృక్కోణాల నుండి, ఆధునిక భారతదేశంలో విద్యాసంబంధ సంభాషణను, సాంస్కృతిక గుర్తింపును సృష్టించడంలో విద్యాభారతి ఒక ముఖ్యమైన ప్రభావంగా కొనసాగుతోంది. అంతేకాకుండా ఆరఎసఎస్, దాని అనుబంధ సంస్థల గ్రామీణ విస్తరణకు విద్యా భారతి పాఠశాలలు కీలకంగా నిలిచాయి. విద్య, సంస్కృతి, సేవలను సమన్వయం చేయడం ద్వారా, అవి గ్రామాలను జాతీయ చైతన్యం, స్వయంసమృద్ధి కేంద్రాలుగా మార్చాయి. రాజకీయ పద్ధతులను అవలంబించకుండా, ఆరఎసఎస్ ఈ విద్యా సంస్థల ద్వారా గ్రామీణ భారతదేశంతో మమేకమై, దృఢమైన నైతిక సమగ్రత, దేశభక్తి సూత్రాలతో కూడిన యువతను తీర్చిదిద్దుతోంది. ప్రస్తుతం, విద్యా భారతి భారతదేశంలోని 70 శాతానికి పైగా జిల్లాల్లో, ముఖ్యంగా గిరిజన, మారుమూల ప్రాంతాలలో పనిచేస్తూ, “విద్య ద్వారా దేశ నిర్మాణం, విలువలతో విద్య” అనే ఆరఎసఎస్ శాశ్వత వ్యూహానికి నిదర్శనంగా నిలుస్తోంది.

About Author

By editor

Twitter
YOUTUBE