ఇంటర్నెట్, వాట్సాప్, గూగుల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వంటి సోషల్ మీడియా వేదికలు ఈ కాలంలో మన జీవితంలో విడదీయరాని భాగాలుగా మారిపోయాయి. ముఖ్యంగా యువ తల్లిదండ్రుల జీవితాల్లో ఇవి ‘‘అవసరమైన చెడు’’ (అవమీవ•తీ• వఙఱశ్రీ)గా నిలుస్తున్నాయి. సాంకేతిక అభివృద్ధి మనకు ఎన్నో సౌకర్యాలు, అవకాశాలు అందించినప్పటికీ, అదే సమయంలో అనేక సమస్యలు, ఒత్తిడులు, గందరగోళాలు కూడా తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటి ప్రభావం కుటుంబ వ్యవస్థపై ఎలా పడుతోంది అనే విషయాన్ని లోతుగా పరిశీలించడం అవసరం.
ఇంటర్నెట్ ప్రపంచాన్ని మన చేతిలోకి తెచ్చింది. గూగుల్ ద్వారా ఏ సమాచారమైనా క్షణాల్లో అందుబాటులోకి వస్తోంది. వాట్సాప్ ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలవడం సులభమైంది. ఫేస్‌బుక్ వంటి వేదికలు మన ఆలోచనలు, భావాలు పంచుకునే వేదికగా మారాయి. అయితే ఈ సౌలభ్యం క్రమంగా వీటిపై ఆధారపడే స్థితికి తీసుకెళ్లింది. ‘‘సమాచారం’’ అనే పేరు మీద వచ్చే ప్రతి విషయం నిజమా కాదా అని ఆలోచించకుండా నమ్మే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకంలో కూడా ఈ డిజిటల్ వనరులపై అతిగా ఆధారపడుతున్నారు. ఈ సాంకేతిక సౌకర్యాల ప్రభావం తల్లిదండ్రులపై చాలా ఉంది. ఇప్పటి తల్లిదండ్రులు ఎక్కువగా ఉద్యోగస్తులు. వారి జీవితం వేగంగా మారుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వారికి ఒక విశ్రాంతి వేదికగా మారింది. కానీ అదే అలవాటు క్రమంగా వ్యసనంగా మారుతోంది.
పిల్లలతో, భార్యాభర్తలు కలిసి గడపాల్సిన సమయం ఫోన్ స్క్రీన్ ముందు గడుస్తోంది. పిల్లల అవసరాలు, భావాలు అర్థం చేసుకోవడంలో తల్లిదండ్రులు వెనుకబడుతున్నారు. తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నా, మానసికంగా అక్కడ లేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇది పిల్లల భావోద్వేగ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. మరో వైపు భార్యాభర్తలు తమ తల్లిదండ్రులపై ఆధారపడడం, చిన్న చిన్న విషయాలకు దీర్ఘకాలం ఫోన్లో ముచ్చ టించుకోవడంతో, వివాహ బంధం పటుత్వం వీడుతోందని చెప్పాలి.
తల్లిదండ్రులలో పెరుగుతున్న అస్థిరత మనం ఇటీవల కాలంలో చాలా చూస్తున్నాము. సోషల్ మీడియాలో ఇతర కుటుంబాలను చూసి తమ జీవితం తక్కువగా ఉందనే భావన తల్లిదండ్రుల్లో పెరుగుతోంది. ఇతరులు చూపించే ‘‘పర్ఫెక్ట్’’ జీవితం చూసి తమ పెంపకం సరైనదేనా అనే సందేహం కలుగుతోంది.
గూగుల్‌లో ఒక సమస్యకు వెయ్యి పరిష్కారాలు కనిపిస్తాయి.దాంతో తల్లిదండ్రులు ఏది సరైనది అనే గందరగోళంలో పడిపోతున్నారు. పిల్లల ఆరోగ్యం, విద్య, అలవాట్లు, ప్రతి విషయంలో అనవసర భయం పెరుగుతోంది. పిల్లలపై ప్రతికూల ప్రభావంవలన వారి పెరుగుదలలో అనేక సమస్యలు ఎదురవు తున్నాయి. తల్లిదండ్రులు ఎక్కువ సమయం ఫోన్‌లో గడపడం వల్ల పిల్లలు కూడా అదే అలవాటు చేసు కుంటున్నారు. చిన్న వయస్సులోనే మొబైల్, టాబ్లెట్‌లపై ఆధారపడే పరిస్థితి వస్తోంది. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది.
పిల్లలు బయట ఆడుకోవడం, వారిలో సృజనాత్మ కత, తల్లిదండ్రులతో మాట్లాడటం తగ్గిపోతోంది. భావోద్వేగ అనుబంధం బలహీనమవుతోంది.
అంతులేని సమాచారంతో అలసట
ఇంటర్నెట్ ద్వారా వచ్చే అపారమైన సమాచారం తల్లిదండ్రులను అలసటకు గురి చేస్తోంది. ప్రతి చిన్న విషయం గురించి తెలుసుకోవాలని తపన పెరుగు తోంది. కానీ ఈ సమాచారంలో నిజం ఎంత? అపోహలు ఎంత? అన్నది గుర్తించడం కష్టం.ఈ పరిస్థితి తల్లిదండ్రుల నిర్ణయ సామర్థ్యాన్ని దెబ్బతీస్తోంది. స్వయంగా ఆలోచించకుండా, ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడే అలవాటు పెరుగుతోంది. కుటుంబ సంబంధాలపై ప్రభావం ఎక్కువై, ఎదురుగా ఉన్న వారిని నిర్లక్ష్యం చేసి, దూరాన ఉన్న వారితో సంభాషణలు ఎక్కువగా మనం చూస్తున్నాము. సోషల్ మీడియా కుటుంబ సభ్యుల మధ్య దూరాన్ని పెంచుతోంది. ఒకే ఇంట్లో ఉన్నా, ప్రతి ఒక్కరు తమ తమ ఫోన్లలో మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. సంభాషణలు తగ్గిపోతున్నాయి. చిన్న విషయాలకే అసహనం, నిర్లక్ష్య భావం తరచుగా మనం చూస్తు న్నాము. ఇది దాంపత్య జీవితంపై కూడా ప్రభావం చూపుతోంది. పరస్పర అవగాహన తగ్గిపోతుంది. చిన్న విషయాలకే గొడవలు పెరుగుతాయి. కుటుంబ బంధాలు బలహీనమవుతాయి. భద్రతా సమస్యలు తలెత్తి, బంధాలకు విలువ తగ్గుతోంది. సోషల్ మీడియా వాడకంలో భద్రతా సమస్యలు కూడా పెరుగుతున్నాయి. వ్యక్తిగత సమాచారం సులభంగా బయటకు వెళ్లే ప్రమాదం ఉంది. పిల్లల ఫోటోలు, వివరాలు అనుకోకుండా ఇతరుల చేతుల్లో పడే అవకాశం ఉంది. ఇది తల్లిదండ్రుల్లో భయం, ఆందోళనలను పెంచుతోంది. సోషల్ మీడియా అవసరమైన చెడు అనే మనం భావించాలి. ఈ సాంకేతిక సామాజిక వేదికలను పూర్తిగా వదిలేయడం సాధ్యం కాదు. ఇవి మన జీవితాన్ని సులభతరం చేస్తున్నాయి. సమాచారాన్ని వేగంగా అందిస్తున్నాయి. ఉద్యోగ, విద్యా అవకాశాలను పెంచుతున్నాయి. అందుకే ఇవి ‘‘అవసరమైన చెడు’’గా మారాయి. ఉపయోగం ఉంది, కానీ దాని వల్ల నష్టాలు కూడా ఉన్నాయి.
పరిష్కారానికి పంచ సూత్రాలు
ఈ సమస్యకు పూర్తిగా పరిష్కారం లేకపోయినా, కొన్ని మార్గాలు అనుసరించడం ద్వారా ప్రభావాన్ని తగ్గించవచ్చు.
1. సమయ నియంత్రణ:
రోజుకు ఎంత సమయం సోషల్ మీడియా వాడాలో నిర్ణయించుకోవాలి. పిల్లల ముందు ఎక్కువగా ఫోన్ వాడకాన్ని తగ్గించాలి.
2. కుటుంబ సమయం:
రోజులో కొంత సమయం కుటుంబంతో గడపడం అలవాటు చేసుకోవాలి. ఫోన్ లేకుండా మాట్లాడటం, ఆటలు ఆడటం వంటి కార్యకలాపాలు చేయాలి.
3. సమాచారం ఎంపిక:
అన్ని విషయాలు నమ్మకుండా, నమ్మకమైన వనరులనే అనుసరించాలి. అవసరమైన సమాచారా నికే పరిమితం కావాలి.
4. పిల్లలకు మార్గనిర్దేశం:
పిల్లలకు సాంకేతిక వాడకం గురించి సరైన అవగాహన ఇవ్వాలి. స్క్రీన్ టైమ్‌ను నియంత్రించాలి.
5. స్వీయ నియంత్రణ:
తల్లిదండ్రులే ముందుగా తమ అలవాట్లను మార్చుకోవాలి. పిల్లలు వారిని అనుసరిస్తారు.
ఇంటర్నెట్, వాట్సాప్, గూగుల్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికలు మన జీవితాన్ని మార్చేశాయి. ఇవి మనకు ఉపయోగకరమైనవే అయినప్పటికీ, వాటి దుర్వినియోగం కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. తల్లిదండ్రులు ఈ మార్పులను సమతుల్యంగా స్వీకరించాలి. సాంకేతికతను నియంత్రణలో ఉంచితేనే అది మనకు సహాయకారి అవుతుంది. లేకపోతే అది మన జీవితాన్ని నియంత్రించే శక్తిగా మారుతుంది. మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. అందుకే సాంకేతికతను తెలివిగా ఉపయోగించి, కుటుంబ బంధాలను బలోపేతం చేయడం ఈ కాలంలోని అత్యవసర కర్తవ్యంగా మారింది.
డా।। జె.పి. భారతి కాజా