నలుగురు నృత్యగురువులు ఆమెకి. వారు పంకజ్‌చరణ్‌దాస్, కేతాచరణ్ మహాపాత్ర, సంయుక్తా పాణిగ్రాహి, సోనాల్. ఆమె – అరుణా మొహంతీ.

ఒడిస్సీ, నాట్య పితామహ పంకజ్. ఆ రాష్ట్రం నుంచి తొలి ‘పద్మవిభూషణ’ విజేత కేతాచరణ్.ప్రభుత్వం తరఫు సాంస్కృతిక కళాప్రతినిధి సంయుక్త.భారతీయ నర్తన రీతిలో మేటి సోనాల్.వారందరి ప్రియశిష్యురాలు అరుణ. నిరంతరమూ విదేశీ పర్యటనల్లో ఉన్నా, మాతృభూమి ఘనతను చాటి చెప్పే అతిథి అధ్యాపక నిపుణ. ఏప్రిల్ 4న తన పుట్టినరోజు.

కళింగ సాహిత్య ఉత్సవం అనగానే, మనముందు ప్రత్యక్షమయ్యే నర్తకీమణీ – అరుణే!

భారతదేశ పరంగా అతిపెద్ద సాహితీ స్ఫూర్తి ప్రక్రియ కళింగ లిటరరీ ఫెస్టివల్ (కేఎలఎఫ్) ఆ వేడుకతోనే ఈమెకు అనుబంధం.

ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు చెందిన నర్తకీమణి అరుణలో సారస్వత, నృత్య రీతుల మేలు కలయికను చూడవచ్చు.

భువనేశ్వర్ అంటే ఆలయాల నగరం. వాటి సంఖ్య వందల్లో ఉంది. లింగరాజ, ముక్తేశ్వర, పరమేశ్వర, రాజారాణి ఆలయాలు ప్రసిద్ధాలు.

త్రిభువనేశ్వర్‌గా లింగరాజ్‌కు పేరు. నిర్మాణ కాలం సహస్రాధిక సంవత్సరాల నాటిది. గుడిచుట్టూ ప్రహరీ ఎంతెంతో విశాలం.

ఒడిస్సీ వాస్తు శిల్పకళకు అద్దం పడుతుంది ముక్తేశ్వర దేవస్థానం.

పరమేశ్వర / పరశురామేశ్వర దేవాలయం బహు పురాతనం.

కళింగ ఆలయ శైలికి తలమానికంగా ఉంటుంది రాజారాణి దైవమందిరం. ఏటా సంగీత, సాహిత్య, నృత్య ఉత్సవాలకు ఈ ఆవరణలోనే వేదిక

అక్కడి ఆలయ నృత్యకళను ఆమె శాస్త్రీయ అధ్యయనం చేశారు. కళింగశైలి కోవెలల గురించిన పరిశోధనలు సాగిస్తూ వచ్చారు.

ఒడిశాతోపాటు ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు కళింగ ఆలయ శిల్ప కళారీతిని ప్రతిఫలిస్తుంటాయి. ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ప్రాంతాల్లోనూ అది కనిపిస్తుంది. భువనేశ్వర్ సహా కోణార్క, పూరి ప్రాంతాల గుడి నిర్మాణ సంప్రదాయాల¿, నత్యవిధానాలకీ అవినాభావ సంబంధముంది.

చారిత్రకంగా పరిశీలిస్తే.. సాధరణ శకం 11వ శతాబ్ది నాటి ముక్తేశ్వర, అదే శతాబ్దంలోని లింగరాయ ఆలయాల నేపథ్యం విఖ్యాత నర్తనరీతితోనే ముడివడి ఉంది. అటు తర్వాత 12వ శతాబ్దం నాటి బాకేశ్వర, వరాహి ఆలయ చరిత్రలకు సంబంధించీ… కళాత్మకత వెల్లివిరిసింది.పలు ఆలయాల మహా మండపాలు సైతం శోభాయమానంగా ఉంటుండేవి. వాటికి జగన్మోహనాలుగా ప్రసిద్ధత.

అక్కడి నాట్య మందిరాలు పూర్ణ కళాత్మకాలు. ఈ అంశాలన్నింటినీ విద్యార్థిని దశ నుంచీ పరిశీలన చేస్తుండేవారు అరుణ.

ముక్తేశ్వర నర్తనోత్సవం భువనేశ్వరంలోనే. ఒడిస్సీ నర్తకీమణులకు ప్రతిష్టాత్మక వేదిక. అక్కడి అనంత వసుదేవ ఆలయంలోని నాట్యమండపం ప్రత్యేక ఆకర్షణ.

ఇటువంటి సమాచార సమీకరణకు తోడు, నర్తన విధానాల మేళవింపుపైన అవగాహన కలిగించారు ఆమె తండ్రి కమల లోచన మొహంతి. ఆయన రచయిత, కళాకారుడు. చిన్నప్పుడే అరుణతో నాట్య అభ్యాసం ప్రారంభింపచేశారు. అప్పట్లో శిక్షకులు శ్రీనాథ్, గోవింద్. ఆమెకి 12 సంవత్సరాల వయసులో (1972) ఉన్నత స్థాయి నృత్య శిక్షణ లభించింది. నాటి గురువు గంగాధర్ ప్రధాన్. పద్మశ్రీ పురస్కార గ్రహీత.

(గురువులానే శిష్యురాలు అరుణ కూడ పద్మశ్రీ పురస్కార స్వీకర్త-2016). అంతకు రెండేళ్ల ముందే ఆ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ నుంచి కూడా అవార్డు. అంతకు నాలుగేళ్ల ముందరే కేంద్ర సంగీత నాటక అకాడమీ గుర్తింపు, గౌరవం. 2001లో గురువు సంయుక్త పేరిట గల పురస్కృతి అందుకోవడం మరెంతో విశేషం. మరో గురువు పంకజ్‌కి చెందిన రీసెర్చి ఫౌండేషన్‌వారి బహుమతినీ అందుకున్నారు అరుణ. జగన్నాథ సంస్కతీ వికాసపరిషత్ నుంచి బహూకృతి. అత్యంత విశిష్టాత్మక పురస్కారం ‘భారత భవన’. దీన్ని నాటి భారత రాష్ట్రపతి నుంచి అందుకున్నారామె.ఎంతో అనుభూతి కలిగించినవి ఇవన్నీ. వీటి గురించే ఎన్నో మార్లు సభల్లో చెప్పడం గమనార్హం.

నర్తకిగా, నర్తన శిక్షకురాలిగా అరుణకి ఐదు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం. ఇన్నేళ్లలో ఎన్నెన్నో సాధించారు. భారతీయ పురాణ పాత్రలు (మహిళలు) ఎంత విలక్షణమో ప్రసంగాల్లో, రచనల్లో వివరించారు. స్త్రీల స్థితిగతుల మీద దృష్టిని పూర్తిగా కేంద్రీకరించారు. ‘నారి’ అనే ప్రఖ్యాత ప్రదర్శన ప్రక్రియను రూపొందించారు.

నత్యానికి సరిజోడుగా సాహిత్య, ధార్మిక విషయాలను పరిశోధించారు. శాస్త్రీయ శిల్పకళను అంటిపెట్టుకుని ఉన్న నాట్య పద్ధతులను విస్తత ప్రాచుర్యంలోకి తెచ్చారు. స్వాతంత్య్రం తదుపరి ఒడిస్సీ నాట్యకళ ఎన్ని పరిణామాలకు నెలవుగా మారిందో పరిశీలనలు జరిపారు. విభిన్న నత్య సంవిధానాలను వీక్షకుల అవగాహనకు తేగలిగారు.

ఆమెలో ఎంత శాస్త్రీయతో, సాంప్రదాయకతో… అంతటి ఆధునికత, విశ్లేషణాత్మకతా పరిమళించింది.

కాలిఫోర్నియా, సౌత్ కరోలినా, కార్నెల్ విశ్వవిద్యాలయాలకు అరుణ సేవలు విస్తరించాయి. అతిథి అధ్యాపకురాలిగా అక్కడ విద్యార్థినీ విద్యార్థులెందరో పాఠాలు చెప్పారు. నాట్యశిక్షకురాలిగా యువ కళాకారులనేకమందికి మెళకువలు నేర్పించారు.

ఆమె దృష్టిలో

  1. సమాజ రీతులను ప్రతిబింబించేదే కళ.
  2. కళ పరమార్థం మనోవికాసం, సామాజిక పురోగమనం.
  3. పురోగమనం నాట్యకళతో సులభసాధ్యం.
  4. ‘సులభసాధ్యం’ అనేది నర్తకులకు బాగా అనుభవం.

నాట్య ప్రదర్శనలు ఇచ్చే సందర్భాల్లో ఇంటా బయటా పలు సమస్యలు వస్తుంటాయి. వాటన్నింటినీ అధిగమించి, రంగస్థలం మీద ప్రతిభా సామర్థ్యాలు కనబరచడమే నృత్యకారిణుల అంతిమ లక్ష్యం. ఎన్ని కష్టనష్టాలనైనా భరించి, సహించి, చివరకు వేదికమీద చక్కని ప్రదర్శన ఇవ్వడమే వారి లక్ష్యం.

ఈ అన్ని అరుణా మొహంతి నిబద్ధతను సూచించేవే. సాక్ష్యాధారాలు లెక్కకు మిక్కిలి ఉన్నాయి. మచ్చుకు ఒకటి :

 ఎప్పుడో పాతికేళ్ల కిందట (1999) ఒడిశాను అతాకుతలం చేసింది సూపర్ సైక్లోన్. ఆ శతాబ్దపు అత్యంత భీకర ప్రకృతి విపత్తు అది. జనజీవనం పూర్తిగా అల్లకల్లోలమైంది. అటువంటి విపత్కర స్థితిలో ప్రజలందరికీ సహాయం, సేవ అందించేందుకు ఉదారులంతా కదిలి వచ్చారు. వారిలో అక్కడ అగ్రభాగాన నిలిచినవారు అరుణ!

కళలన్నీ సమాజ హితం కోసమే అన్నది ఆమె భావన. సమాజంలోనే కల్లోలం రేగి, ప్రకృతే విరుచుకుపడితే, వెన్నుదన్నుగా నిలవాల్సింది కళాత్మక హృదయమే అని నిరూపించగలిగారు. సాంస్కృతిక ప్రదర్శనలతో వచ్చిన మొత్తాన్ని ఆర్తులకు అందించారు.ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక బాధ్యతలను పూర్తిగా నెరవేర్చారామె.

జయదేవ ‘గీతగోవిందం’ నర్తనతో ఎంతో కీర్తి అందుకున్నారు.

‘కృష్ణశరణం’ ప్రదర్శనతోనూ అంతే ఖ్యాతి సంపాదించారు.

` అవన్నీ జాతీయంగా.

అంతర్జాతీయంగా….

జర్మన్ నవలా రచనకు అనుబంధంగా నృత్యదర్శకత్వం వహించారు.

ప్రాంతీయంగా ఒడిశా డ్యాన్స్ అకాడమీకి నేతృత్వ బాధ్యత స్వీకరించారు అరుణ. కార్యక్రమాల్లో భాగంగా, యువనర్తకులను బాగా ప్రోత్సహించారు. సాంస్కృతిక రాయబారిగా ఎన్నో విజయాలు సాధించారు. శిఖరాగ్ర సదస్సుల వేదికల నుంచి ప్రసంగించారు.

నాట్య రీతుల గురించిన కార్యశాలలను వందలాదిగా నిర్వహించారు. సంప్రదాయ పరిరక్షణకు కళింగ లిటరరీ ఫెస్టివల్‌ను వినియోగించారు. సాహిత్య, సంగీత, నృత్య ప్రక్రియలకు సమ ప్రాధాన్యమిచ్చారు.

భాషా సంబంధ పర్యటనలను సమధికంగా ప్రోత్సహించారు అరుణా మొహంతి. సంస్కృతి, నాగరికతలకు కీలకం కళల్లోనే ఉందని ఆచరణాత్మకంగా రుజువు చేసిన ఘనత తనది. ఆమె మాటలు, చేతలు అంతటా స్ఫూర్తినింపాయి. నింపుతున్నాయి. ప్రాంతీయం నుంచి అంతర్జాతీయంవరకు ఆ నృత్యకారిణి కృషి ఫలితాలనిచ్చింది, ఇస్తోంది.

ఎంత ఎదిగినా, మూలాల్ని మరువని వ్యక్తిత్వం తనది. అందుకే ఎప్పుడు ఏ వేదికమీద నర్తించినా ఒడిశా కళాప్రాభవాన్ని స్మరించకుండా ఉండలేదు. లిటరరీ ఫెస్టివల్‌ను ప్రశంసించకుండా ఏ కార్యక్రమంలోనూ లేరు ఆమె. అంతటి వృత్తి నిబద్ధత, అంకిత భావన అరుణ అణువణువునా నిండి ఉంది.

గురువుల పేరు నిలిపిన శిష్యురాలు.

వందల శిష్యులను రూపొందించిన గురుప్రముఖులు. ఆ కారణంగానే ‘అరుణ’ పేరు సార్థకమైంది.

జంధ్యాల శరత్‌బాబు

సీనియర్ జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE