కాలంతో పాటు భారతీయ సమాజం అతి వేగంగా మారుతోంది. ముఖ్యంగా హిందూ యువత, అబ్బాయిలు, అమ్మాయిలు, తమ ఆలోచనల్లో, జీవన విధానంలో, విలువలలో గణనీయమైన మార్పులను అనుభవిస్తున్నారు. ఈ మార్పులు ఒకవైపు అవకాశాలను తెస్తుంటే, మరోవైపు కొన్ని ఆందోళనలను కూడా కలిగిస్తున్నాయి. ఆధునిక విద్య, సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచీకరణ ప్రభావంతో వచ్చిన ఈ మార్పులను సమతుల్యంగా అర్థం చేసుకోవడం అవసరం.

ఆధునిక పెంపకం, విలువల మార్పుల ప్రభావం వలన ఇప్పటి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్య, స్వతంత్ర ఆలోచన, సమానత్వ భావనలు నేర్పిస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న పిల్లలు సంప్రదాయాలకంటే తార్కికతకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నారు. మరోవైపు పల్లెటూరి యువత పట్టణజీవన విధానం వైపు మక్కువ చూపుతోంది. ఇది ఆరోగ్యకరమైన మార్పు అయినప్పటికీ, కొన్నిసార్లు తమ సంస్కృతి, ఆచారాలపై అవగాహన తగ్గిపోవడం గమనించదగిన విషయం. పిల్లలకు సంప్రదాయాలను సరైన సమయంలో తెలియచేయక పోవడంవల్ల యుక్త వయసు వచ్చాకా విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా స్పష్టమౌతుంది.
సంప్రదాయాలను, మన అలవాట్లను చిన్నతనం నుంచే అనుసరించకపోతే, యుక్తవయసులో వాటిని నలుగురి మధ్యలో అనుసరించటానికి ఎబ్బెట్టుగా తోస్తోంది. మన కట్టు, బొట్టు నామోషీగా అగుపడుతున్నాయి. మనం జరుపుకునే పండుగలు, పర్వదినాల విలువలు తెలియని యువత, నడి వయసువారు వీటిని మూఢాచారాలుగా కొట్టి పడేస్తున్నారు. హిందూ సంప్రదాయాలు చాలా విస్తృతమైనవి. అయితే వీటిని అర్థం చేసుకోవడానికి బదులు, కొందరు యువకులు వాటిని ‘పాతవే’ అని పక్కన పెట్టే ధోరణి కనిపిస్తోంది. ఫలితంగా సాంస్కృతిక అనుబంధం కొంతమేర తగ్గుతోంది.
లౌకిక భావాలు, సామాజిక సమతుల్యత పెద్ద సమస్యగా మారింది. భారతదేశం ఒక లౌకిక దేశం. అందువల్ల అన్ని మతాల పట్ల గౌరవం చూపడం మన బాధ్యత. ఈ నేపథ్యంలో హిందూ యువతలో కూడా లౌకిక భావాలు పెరుగుతూ, మతం కంటే మానవత్వాన్ని ప్రాధాన్యంగా భావిస్తున్నారు. ఇది సమాజంలో సామరస్యాన్ని పెంపొందించే మంచి లక్షణం. అయితే, ఈ లౌకిక భావాలు కొన్ని సందర్భాల్లో సొంత మతపరమైన గుర్తింపును నిర్లక్ష్యం చేసే స్థాయికి వెళ్లకూడదు. ఇతర మతాల పట్ల గౌరవం చూపడమే కాకుండా, తమ సంస్కృతిని గౌరవించడం కూడా అవసరం.
సామాజిక భయాలు, అస్థిరత
ప్రస్తుత సమాజంలో కొన్ని వర్గాల మధ్య అపోహలు, అనుమానాలు పెరుగుతున్నాయి. సామాజిక మాధ్యమంలో అసత్య ప్రచారం, పాక్షిక సమాచారంతో యువతలో భయాలు పెరుగు తున్నాయి. ‘మన సంస్కృతి ప్రమాదంలో ఉంది’ అనే భావన కొందరిలో కనిపిస్తోంది. అయితే తమ సంస్కృతిని నిర్లక్ష్యం చేస్తే తమ ఉనికికి స్వయంగా తామే సమాధి కడుతున్నారని యువత తెలుసుకోవాలి. ఈ విషయం చరిత్ర మనకు ఎన్నోసార్లు రుజువు చేసింది. ఇలాంటి భయాలు చాలావరకు స్పష్టమైన అవగాహన లేకపోవడం వల్లనే వస్తాయి. చరిత్రను, సమాజాన్ని సమగ్రంగా అర్థంచేసుకుంటే, ఈ భయాలు తగ్గే అవకాశం ఉంటుంది. భయం కంటే చైతన్యం ముఖ్యమైనది.
ఇతర సమాజాలు వారి ఆచారాలను బహిరంగంగా ప్రదర్శిస్తుంటే హిందూ సమాజంలోని యువత తమ సంప్రదాయాలను అనుసరించకపోవడంవల్ల సందిగ్ధంలో పడి తప్పుదోవలో వెళ్లటం మనం ఈనాడు ఎక్కువగా చూస్తున్నాము. నేటి యువత ఇతర మతాల, సంస్కృతుల వ్యక్తులతో కలిసిమెలసి జీవించడం సాధారణంగా తోస్తోంది. పాఠశాలలు, కార్యాలయాలు, నగర జీవనంలోని ఒత్తిళ్లకు లోనవుతుంటారు. కొన్ని సందర్భాల్లో మీడియా లేదా వ్యక్తిగత అనుభవాల ప్రభావంతో ఇతర సమాజాల పట్ల అపోహలు కూడా పెరుగు తాయి. ఈ పరిస్థితుల్లో యువత విమర్శ నాత్మకంగా ఆలోచించడం, నిజానిజాలను గుర్తించడం చాలా అవసరం.
చరిత్రపై అవగాహన అవసరం.
‘మరుగునపడ్డ చరిత్ర’ అనే భావన చాలా మందిలో ఉంటుంది. నిజంగా చూస్తే, భారతదేశ చరిత్ర చాలా విస్తృతమైనది. దానిని వివిధ కోణాల్లో అధ్యయనం జరిగింది. అయితే ఒకే కోణంలో మాత్రమే చరిత్రను అర్థం చేసుకుంటే, పూర్తి చిత్రం కనిపించదు. హిందూ యువత చరిత్రను చదవడం, వివిధ వనరుల ద్వారా తెలుసుకోవడం, విశ్లేషణాత్మక దృక్కోణం పెంపొందించుకోవడం అవసరం. చరిత్రను భావోద్వేగంగా కాకుండా, బుద్ధిపరంగా అర్థం చేసుకోవడం ద్వారా సమాజంపై స్పష్టమైన దృక్కోణం ఏర్పడుతుంది.
నేటి సమాజానికి ఉన్న సవాళ్లు ఎన్నో ఎన్నెన్నో. ప్రపంచీకరణ, సాంకేతిక మార్పులు, ఉద్యోగ పోటీ, ఇవి అన్నీ యువత ముందున్న ప్రధాన సవాళ్లు. ఈ నేపథ్యంలో మతం, సంస్కృతి గురించి ఆలోచించ డానికి సమయం తక్కువగా ఉంటుంది. అయిన ప్పటికీ, యువత వ్యక్తిగత గుర్తింపులో సంస్కృతి ఒక ముఖ్యమైన భాగంగా గుర్తించి మెలగాలి.
సమాజంలో విభజనలకంటే ఐక్యత అవసరం. మతపరమైన విభేదాలు పెరిగితే, దేశ అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. అందువల్ల యువత సమతుల్య దృక్కోణంతో ముందుకు సాగుతూ తమ సంస్కృతిని అనుసరించాలి. ఈ ఆలోచన అన్ని మతాలవారు అలవరచుకోక పోవడం వల్ల హిందూ యువత సందిగ్ధంలోను, వారి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. ముందుకు వెళ్లే మార్గం అందరం కలసి ఆలోచించాలి.
స్వతంత్ర ఆలోచనతో పాటు, తమ మూలాలను అర్థం చేసుకోవడం హిందూ యువతకు ఉండవలసిన ముఖ్యమైన లక్షణం. ఆధునికతను అంగీకరించడంలో తప్పు లేదు. కానీ అదే సమయంలో సంప్రదా యాలను పూర్తిగా విస్మరించడం కూడా సరైనది కాదు.
హిందూ యువత తక్షణం చేయవలసినది
1. తమ సంస్కృతిపై అవగాహన పెంచుకోవాలి
2. ఇతర మతాల పట్ల గౌరవం చూపాలి
3. తమ మతం, సంప్రదాయం అందరూ గౌరవిస్తున్నారా లేదా తెలుసుకుని మెలగాలి.
4. తమ మతం గురించి అవగాహన పెంచుకోవాలి.
5. అసత్య ప్రచారాలను నమ్మకుండా, నిజాలను తెలుసుకోవాలి.
6. సమాజంలో ఐక్యతను పెంపొందించే విధంగా ఆలోచించాలి, ఇది అందరి బాధ్యతా అని ప్రచారం చేయాలి.
7. రాజకీయ ప్రలోభాలకు లోబడకుండా తమ ఉనికిని చాటాలి.
8. కుల, వర్గాలకు అతీతంగా హిందూ మతాన్ని గౌరవించి, అందరినీ కలుపుకునే మార్గంలో ముందుకు సాగాలి.
9. మన దేవాలయాలను గౌరవించి సంప్రదాయ దుస్తులను ధరించడం అలవాటుచేసుకోవాలి.
10. స్వధర్మం శ్రేయం, పర ధర్మం భయం అని తెలుసుకోవాలి.
ప్రస్తుత కాలంలో హిందూ యువత ఒక కీలక దశలో ఉంది. ఒకవైపు ఆధునిక ప్రపంచం, మరోవైపు సంప్రదాయ విలువలు, ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడం వారి ముందున్న ప్రధాన సవాలు. భయాలు, అపోహలు కాకుండా, అవగాహన, సహనం, చైతన్యం ఆధారంగా ముందుకు సాగితే, సమాజం మరింత బలంగా మారుతుంది. ఏ సమాజమైనా తన యువత చేతుల్లోనే భవిష్యత్తును నిర్మించుకుంటుంది. అందువల్ల హిందూ యువత సమగ్ర దృక్కోణంతో, బాధ్యతతో ముందుకు సాగితే, అది కేవలం ఒక మతానికే కాదు, మొత్తం భారతదేశానికి మేలును చేకూరుస్తుంది. తిరిగి భారత దేశం విశ్వగురువుగా వెలుగుతుంది.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE