యుద్ధం అనే చిన్నపదం ప్రపంచానికి మాత్రం చాలా ప్రమాదం. మహాభారత యుద్ధానికి ముందు పాండవుల తరపున శ్రీకృష్ణుడు రాయబారానికి కౌరవుల వద్దకు దూతగా వెళ్తాడు. ఆ సందర్భంలో ‘‘నీ పిల్లలు పాపలున్ ప్రజలు పెంపు వహింపగ పొందు సేసెదో / ఎల్లి రణం బెగూర్చెదవో ఏర్పడజెప్పుము కౌరవేశ్వరా’’ అని హితవు పలుకుతాడు. (దుర్యోధన నీ పిల్లలు, పాపలు, ప్రజలు వృద్ధి చేసెడి శాంతి కావాలా, నాశనాన్ని తెచ్చే యుద్ధం కావాలా అని అర్థం), కాని కౌరవేశ్వరుని బుద్ధి యుద్ధానికే మొగ్గు చూపింది. సమరం ముగిసే నాటికి సర్వనాశనమైంది. బూడిద మిగిలింది. ‘‘నీ ఒంట్లో నువ్వుండాలంటే – నీ ఇంట్లోనే నువ్వుండు’’ అని యుద్ధం మనిషిని శాసిస్తుంది.
శ్రీనాధుడు చెప్పినట్లు ‘‘పోరు మంచిది కాదు భూమి నెక్కడను, పాడౌను దేశమ్ము పగమించెనేని’’ ఇది త్రికాల సత్యం. ధర్మరాజు చెప్పినట్లు మొత్తం దొరకేదంతా నెత్తురు కూడే, పారేదంతా రక్తపుటేరే. మనిషి భవిష్యత్తు మాడిపోతుంది. ఇది కసి చేసే కరాళ నృత్యం, మసిచేసే విషాద కృత్యం. దీనిలో గెలిచేది ఎవరైనా ఓడేది మాత్రం మనిషి.
విశ్వ ఆర్థిక, సామాజిక, రాజకీయ పునాదులు కుదేలవుతాయి. ఒకప్పుడు యుద్ధమంటే ఇద్దరు రాజులకో, రెండు రాజ్యాలకో పరిమితం. ఇప్పుడలా కాదు ‘‘ధరణీ చక్రంబు తల్లడ మందగ, పృధు గోత్ర శైలముల్ పెల్లగిల్లె’’ అని భాస్కర రామా యణంలో చెప్పినట్లు భూమండలమంతా కంపిస్తు న్నది. ‘‘విలయ పయోది మగ్నమయె విశ్వమహీ వలయంబు’’ అని భారతంలో ఎర్రా ప్రగడ చెప్పిన మాట మన కళ్ల ముందు బొమ్మలా కదులుతుంది. మనిషి భవిష్యత్తు మాడిపోతుంది. అమీర్ మినాయ్ అనే ఉర్దూ కవి చెప్పినట్లు ‘‘కత్తి పోటు ఎవరి మీద పడిన కొట్టుకొనేది నేనే, లోకంలోని శోకమంతా నా ఎదలోనే కొట్టుకొంటుంది’’ అనేది మానవ జాతి మొత్తానికి వర్తిస్తుంది.
ఎపిరస్‌కు చెందిన పైరస్ (క్రీ।।పూ।। 319-272) ఒక ప్రఖ్యాత హెలెనిస్టిక్ జనరల్ అతనికి పై పళ్లు విడిగా కాకుండా ఒకే ఎముకలా ఉండేది. దానితో భయంకరంగా ఉండేవాడు. శత్రువులకు అతడంటే భయం అని ప్రచారం చేసుకునేవాడు. ఇతడు చేసిన యుద్ధ్దాలు ఇప్సన్ యుద్ధం(బి.సి.301), పిరిక్ యుద్ధం(బి.సి.280-275), హెరాక్లియా యుద్ధం (బి.సి.280) అస్కుల యుద్ధం (బి.సి.279) బెనెవెంటమ్ యుద్ధం (క్రీ.పూ.275) సిసిలియన్ ప్రచారం (బి.సి. 278-276). సిసిలియన్ ప్రచారం, గ్రీకు ప్రచారంతో సంపద మొత్తం ఖర్చు అయిపోయి అప్పుల పాలయ్యాడు. అందుకే ‘‘పెరిక్ విక్టరీ’’ అనే పదం పుట్టింది. అంటే గెలిచినా దేశాన్ని బూడిద చేసుకోవడం. యుద్ధాలలో గెలిచాడే గాని అప్పుల పాలయ్యాడు. అయినా గొప్ప వ్యూహకర్త (అలెగ్జాం డర్ తరువాత 2వ గ్రేట్ జనరల్). దేశ సంపద, జన సంపద నాశనం చేసిన మహావ్యక్తి. గెలిచి బూడిద మిగిల్చాడు. ఇప్పుడు జరిగేవన్నీ పెరిక్ విక్టరీలే, గెలిచిన వారికి, ఓడిన వారికి అతి భారీ ధన, ప్రాణ నష్టాలతో దివాలాతీసి ప్రజలను వీధిన పడేస్తారు.
యుద్ధానికి• కొన్ని ధర్మాలను నిర్దేశించారు. ఈ క్రింది వారిని చంపరాదు. వెరచిన వాని (భయపడే వాడిని) ధైన్యము వెదురు నొందిన (ఆలోచన తోచని) వానిని, నిద్రలో ఉన్న వారిని, స్త్రీ, బాల, వృద్ధ జనాన్ని హింసించడం, చంపడం మహా అపరాధమని భాగవతం చెప్పిన సూక్తి నేడు బధిర శంఖారావం అవుతున్నది.
యుద్ధాలూ, సాయుధ ఘర్షణలతో మానవజాతి చరిత్ర నెత్తుటితో తడిసిపోతుంది. అగ్రరాజ్యాల సామ్రాజ్య వాదానికి ముష్కర మూకల పైశాచికత్వం జతకలిసి నిండు జీవితాలను నిలువునా కబళిస్తు న్నాయి. 1989-2024 మధ్యలో ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక మారణకాండల్లో 39 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని అంచనా. వీరిలో ఆఫ్రికా, పశ్చిమాసియా, ఆసియా, ఓషియానియా లలో అత్యధికంగానూ, ఐరోపా, అమెరికా ఖండాలలో అల్పంగాను నష్టపోయారు. యుద్ధాలు మిగిల్చే చేదు గాయాలు చిన్నారులను అనునిత్యం వెంటాడుతూ, వారి జీవితాలను నరకప్రాయం చేస్తాయి. బాలలకు భద్రమైన భవిష్యత్తు అందించలేనప్పుడు ప్రపంచం ఎంత ప్రగతి సాధించీ నిష్ప్రయోజనమే. స్వార్థ ప్రయోజనాలకోసం యుద్ధ్ద రక్కసి కోరలకు పదును పెడుతున్న దేశాలు ఈ సత్యాన్ని గుర్తించ ట్లేదు. అసహాయ చిన్నారుల ఆక్రందనలను ఆలకించ ట్లేదు. అదే దౌర్భాగ్యం, ఎన్నో సంసారాలు చల్లారి పోయాయి. జన సందోహం మరణించగా అసహాయులు హా హా కారాలు చేస్తున్నారు.
రెండవ ప్రపంచయుద్ధంలో అమెరికా, జపాన్ లోని హిరోషిమా (ఆగస్టు 6, 1945) నాగసాకి (ఆగస్టు 9, 1945)పై జరిపిన అణుదాడిలో లక్షల్లో అమాయక ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అణుబాంబుల ప్రభావం నేటికి కనపడుతున్నది. జపాన్ అమెరికా ఓడరేవు పెరల్ హార్బర్‌పై జరిపిన దాడి (డిసెంబర్ 7, 1941)లో 2,400 మంది అమెరికా సైనికులు, పౌరులు మరణించారు.
రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఎనిమిది కోట్ల ప్రాణాలు బుగ్గిపాలు అయ్యాక 1945, జూన్ 26న అంతర్జాతీయ శాంతి, భద్రతను కాపాడటానికి ప్రాధమిక చట్టపరమైన పత్రం ఐక్యరాజ్యసమితి చార్టర్ (కానిస్టిట్యూషన్) రూపొందింది. 193 సభ్యదేశాలతో 6 ప్రధాన విభాగాలతో న్యూయార్క్ నగరంలో ప్రధాన కార్యాలయము ఉంది. నేటి కార్యదర్శి ఆంటానియో గుట్టెర్స్. యు.ఎన్. ప్రియాం బుల్‌లో ‘‘ఐక్యరాజ్య సమితి మా తరం వారిని యుద్ధ భయం నుండి రక్షించి యుద్ధాలను నివారించడానికి, సమాన హక్కులను గౌరవించడానికి, అంతర్జాతీయ సహకారంతో మెరుగైన జీవన ప్రమాణాలను సాధించడానికి ఏర్పడిన సంస్థ’’ అని ఉంది. ఇదే విధంగా మొదటి ప్రపంచ యుద్ధానంతరం నాలుగు కోట్ల మందిని పొట్టన పెట్టుకున్నాక నానాజాతి సమితి ఏర్పడింది. ఏమి సాధించలేని పరిస్థితుల్లో దాన్ని మూసేశారు.
యుద్ధాల వల్ల విపరీత ప్రాణనష్టమే కాకుండా తరాల మానవ శ్రమ ఫలితమంతా నాశనమవు తుంది. సహజ వనరులు, మౌలిక వసతులతో పాటు శాంతియుత జీవనము ఛిద్రమవుతుంది. కరవులూ, వ్యాధులను సైతం మోసుకొచ్చే వినాశకర సమరాలు సాయుధ ఘర్షణలు. గడచిన వందేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా 23 కోట్ల మందిని పొట్టన పెట్టుకున్నాయి. 2003-2011 మధ్యకాలంలో ఇరాన్-ఇరాక్ యుద్ధం 10 లక్షల మంది ఉసురు తీసింది. సుదీర్ఘంగా సాగిన వియత్నాం పోరు సుమారు 30 లక్షల మంది, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇరు వైపులా సుమారు 5 లక్షల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
మాస్కో విచ్చలవిడి దాడి మూలంగా ఉక్రెయిన్ పంట భూముల్లో 16 శాతం దెబ్బతిన్నాయి. ధాన్యం, నూనెగింజల దిగుబడులు 18 శాతం క్షీణించాయి. కీవ్ నుండి గోధుమ, పొద్దు తిరుగుడు ఎగుమతులు సన్నగిల్లడంతో చాలా ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఆహార అభద్రత నెలకొన్నది. ముష్కర మూకల అంతమే ధ్యేయమంటూ హమాస్ భారీ హత్యల తరువాత గాజాను చెరబట్టిన ఇజ్రాయెల్ అక్కడ 67 వేల మంది పాలస్తీయన్లను చంపేసింది. 92 శాతం గృహాలు కూలిపోయాయి.
ఉక్రెయిన్‌పై కయ్యానికి దిగిన రష్యా సైతం మానవతను మంటగలుపుతుంది. ఇప్పుడు ఇరాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా, ఇజ్రాయెల్ కూడా నీతి నియమాలకు నీళ్లొదిలి నెత్తుటేళ్లను పారిస్తు న్నాయి. పాఠశాలలపై మరణాయుధాలు ఎక్కు పెడు తున్నాయి. మొన్న అమెరికా-ఇజ్రాయిల్ అమానుష దాడిలో దక్షిణ ఇరాన్‌లోని ఓ పాఠశాల శిథిలాల కుప్పగా మారి 165 మంది బాలికలు కడ తేరిపోయారు. ఈ కిరాతకంపై బాలల హక్కుల పరిరక్షణపై ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి నిపుణుల సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతకన్నా ఏమి చేయగలరు. (జంధ్యాల పాపయ్య శాస్త్రి) కరుణశ్రీ, పుష్ప విలాప పద్యాలే గుర్తుకు వస్తున్నాయి. అక్కడ పుష్పాలు, ఇక్కడ ప్రాణాలు అంతే తేడా.
జార్జ్ ఆర్వెల్ 20వ శతాబ్దపు ఆంగ్లేయ రచయిత. ఈయన అసలు పేరు ఎరిక్ ఆర్ధర్ బ్లెయిర్. 1903, జూన్ 25న బీహార్‌లోని మోతీహారిలో జన్మించాడు. యానిమల్ ఫార్మ్ అనే వ్యంగ్య నవలను రాసాడు. సుమారుగా ఇది పంచతంవ్రత కథలను పోలి ఉంటుంది. 2వది అయిన నైన్‌టీన్ ఎయిటీ ఫోర్ (1984) యుద్ధమే శాంతి (ఔ•తీ ఱ వ•మీవ) నవల బాగా ప్రజాదరణ పొందిన పుస్తకం. యుద్ధాలు, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రాసిన నవల.
‘‘యుద్ధమే శాంతి’’ అనేది ఒక నిరంకుశ రాజకీయ పార్టీ నినాదము. ఆర్వెల్ ‘‘ఓషియానియా’’ పేరిట ఒక ఊహాజనిత దేశాన్ని సృష్టించాడు. దానిలో ఒక నిరంకుశ రాజకీయ పార్టీని ప్రారంభిం చారు. దీనిలో ముఖ్యపాత్ర విన్‌స్టన్ స్మిత్. ప్రజలను నిరంతరం భయభ్రాంతులకు గురిచేస్తూ, ఉమ్మడి శత్రువుపై ద్వేషాన్ని పెంచడం ద్వారా అంతర్గత స్థిరత్వాన్ని (శాంతిని) కాపాడుకో వచ్చని, తద్వారా అధికారాన్ని నిలబెట్టు కోవచ్చని ఈ పార్టీ సూచన. ఓషియా నియా రాజ్యం నిరంతరం ఎప్పుడూ వేరే దేశంతో యుద్ధం చేయాలి. గెలుపు కోసం కాదు ప్రజల ఆలోచనలను నియంత్రిం •డానికి ఎదురు తిరిగితే అణచివేయడా నికి ఉపయోగపడుతుంది.
నిరంతర యుద్ధం వలన వనరులు సైనిక అవసరాలకే ఖర్చు అవుతాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెరగవు. దీనివల్ల ప్రజలు తమ సమస్యల గురించి కాకుండా శత్రువు గురించి ఆలోచిస్తారు. యుద్ధం జరిగినంత కాలం అంతర్గత తిరుగుబాట్లు ఉండవు. అదే పార్టీకి శాంతినిస్తుంది.
రాజకీయ పార్టీకి చెందిన ఒక వక్త ప్రసంగిస్తు న్నాడు. తన ప్రసంగంలో ద్వేషాన్ని నూరిపోస్తున్నాడు. దారుణాలు, ఊచకోతలు, బహిష్కరణలు, దోపిడీలు, అత్యాచారాలు, ఖైదీలను హింసించడం, పౌరులపై బాంబుల దాడి, అబద్ధపు ప్రచారం, అన్యాయమైన దురాక్రమణలు, విచ్ఛిన్న ఒప్పందాలు ఇవే పదాలు ప్రజల చెవులకు ఇంపుగా వినిపిస్తున్నాడు. జన సమూహం కోపంతో ఉప్పొంగింది. వేలాది గొంతుల నుండి అదుపులేని క్రూర గర్జన. ముఖ్యంగా పాఠశాల పిల్లలు గోడలపైకి ఎక్కి పోస్టర్లు చించేశారు. ద్వేషంతో బ్యానర్లను ముక్కలు చేశారు(పేజీ 72). ‘‘ప్రజల అజ్ఞానమే వీరికి బలం’’ అంటాడు ఆర్వెల్.
సాయుధ ఘర్షణల ప్రజ్వలనంతో గతేడాది చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రతీ అయిదుగురు చిన్నారులల్లో ఒకరు అభద్రత, అవిద్య, అనారోగ్యాల బారినపడ్డారు. నిత్యం నెత్తురోడుతున్న ప్రాంతాలలో చిన్నారులపై లైంగిక దాడులు, వారి అపహరణ, హత్యలు, అవయవచ్ఛేదన వంటివి జరుగుతున్నాయి. ఇవి 2024లో 30 శాతం పెరిగాయి. జన సమ్మర్థన ప్రదేశాలను, పిల్లలను కావాలనే లక్ష్యంగా చేసుకుని యుద్ధ వ్యూహాలను రచిస్తున్నారు. వినాశకర సమరాలు బాలల్లో భయాందోళనలు కలిగించి వారి ఎదుగుదలను దెబ్బతీస్తున్నాయి. యుద్ధాలు
మిగిల్చే చేదు గాయాలు చిన్నారులను అను నిత్యం వెంటాడుతున్నాయి. వారి జీవితాలను నరక ప్రాయం చేస్తున్నాయి.
ఏ యుద్ధంలో చనిపోయాడు మీ వాడు, క్రిమియా యుద్ధం, కొరియా యుద్ధం, ప్రథమ, ద్వితీయ ప్రపంచ యుద్ధాలు బిస్మార్క్ నడుగు హిట్లర్‌ను అడుగు అంటూ ఎందుకిలా వొంగి వొంగి కుంగి కుంగి ఈ సమాధుల చుట్టూ వెతుక్కుంటూ తిరుగుతావు. శవాలు మాట్లాడవు సమాధులు చూపించవు / మృత్తిక గుర్తించదు / మిత్తికి దయఉండదు / మీ రోదన మీలోనే అణుచుకుని / ఇలాగ యిలాగ ఈ పాముల పుట్టమ్మట / ఈ మొండి చెట్లమ్మట ఈ కూలిన గట్లమ్మట / వెళ్లి పొండి, వెళ్లిపొండి, వెళ్లిపొండి, వెళ్లిపొండి అంటాడు తిలక్ తన వెన్నెల కురిసిన రాత్రిలో.

డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు