శాంతా మహాంతో నివసంతి సంతః వసంతవల్లోక హితం చరంతః।
తీర్ణాః స్వయం భీమ భవార్ణవం జనాన్ అహేతునా-న్యానపి తారయంతః ॥ – వివేకచూడామణి
శాంతచిత్తులయిన మహాత్ములు వసంత రుతువు లాగా లోక హితాన్ని కోరుతూ, వ్యవహరిస్తూ, తాము స్వయంగా అతి భీకరమైన సంసార సాగరాన్ని దాటి, ఏ కారణము, ఏ ప్రయోజనము లేకుండానే ఇతరులను కూడా దాటిస్తారట. – వివేకచూడామణిలో శ్రీ శంకర భగవత్పాదుల ఉపదేశం ఇది.
దీనికి ప్రత్యక్ష ఉదాహరణమే సప్త మోక్ష నగరాలలో ఒకటి అయిన శ్రీ కాంచీపురంలోని శ్రీ ఆదిశంకర ప్రతిష్ఠిత మూలామ్నాయ కామకోటి పీఠంలో అక్షరాల ఆచరణలో ఉన్నది. యావత్ హైందవ సమాజాన్ని సమైక్యపరచటానికి 2,500 సంవత్సరాలుగా ఈ పీఠం మహాచార్య పరంపర అనుగ్రహ దృష్టి, వారి ఆచరణ యోగ్యములైన ఉపదేశాలు ఎంతో అమూల్యమైనవి. వారు చూపించిన దారి సామాన్య ప్రజానీకానికి కూడా భక్తి, ముక్తులను ప్రసాదించగలిగిన ఎంతో ప్రశస్తమైన విధానాలు అవి. ప్రజల భాగ్యవశాత్తు కాంచీపురం ఆలయంలోని కామాక్షి అమ్మవారి చల్లని ఒడిలో సమస్త ఆస్తికలోకానికి సేద దీరే మార్గం ఈ మహాత్ముల బోధనలలో లభిస్తుంది. ఆ బోధనలు ఒక ఎత్తు. ఈ మఠం ద్వారా ప్రజలకు అందుతున్న జ్ఞాన భిక్ష మరొక ఎత్తు. మోక్షనగరపు గుడి నీడలో, ఆ జగన్మాత ఒడిలో, పారమ్యాన్ని దర్శింపచేసే చదువుల బడిలో జీవితాన్ని సనాతన ధర్మమార్గంలో ఆదర్శవంతంగా చక్కదిద్దుకోవాలి అనుకునే వారికి ఒక దివ్యమైన మార్గాన్ని చూపే స్థానం శ్రీ కామకోటి పీఠం. భారతీయ సంస్కృతి పరిరక్షణలో శ్రీ కాంచీ కామకోటి పీఠం విశిష్టమైన స్థానం కలిగిన ఆధ్యాత్మిక సంస్థ. జగద్గురు ఆదిశంకరభగవత్పాదుల ఆధ్యాత్మిక పరంపరలో కొనసాగుతున్న ఈ పీఠం శతాబ్దాలుగా ధర్మప్రచారం మాత్రమే కాకుండా సమాజ నిర్మాణంలో కూడా కీలకపాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా వేదాలు, శాస్త్రాలు, ఆగమాలు, సంప్రదాయ కళలు, సంస్కార విలువలను పరిరక్షిస్తూ విద్యా రంగంలో అనేక కార్యక్రమాలను నిర్వహి స్తోంది. సమాజాన్ని ధార్మికంగా, సాంస్కృతికంగా, నైతికంగా బలపరచడానికి శ్రీ కాంచీ కామకోటి పీఠం ఒక గొప్ప దార్శనికతను ప్రతిపాదించింది. అది “బడి – గుడి – తల్లి ఒడి” అనే సూత్రం. ఈ సూత్రం వ్యక్తి జీవిత నిర్మాణానికి అవసరమైన మూడు ప్రధాన ఆధారాలను సూచిస్తుంది.
బడి – విద్య ద్వారా వ్యక్తిత్వ వికాసం
ఇక్కడ బడి అంటే విద్యావ్యవస్థ. విద్య మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ప్రధాన సాధనం. జ్ఞానం మాత్రమే కాకుండా నైతిక విలువలు, సంస్కారం, కర్తవ్యబోధ కూడా విద్య ద్వారానే అభివృద్ధి చెందుతాయి. ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రీ కాంచీ కామకోటి పీఠం అనేక విద్యాసంస్థలను నిర్వహిస్తోంది. వేద పాఠశాలలు, శాస్త్ర పాఠశాలలు, ఆగమ శిక్షణ కేంద్రాలు, నాదస్వర పాఠశాలలు వంటి అనేక విద్యాసంస్థలు పీఠం ఆధ్వర్యంలో కొన సాగుతున్నాయి. వీటిలో విద్యార్థులకు సంప్రదాయ గురుకుల విధానంలో విద్యను బోధిస్తున్నారు. వేదాధ్యయనం, సంస్కృత శాస్త్రాలు, దేవాలయ ఆగమ సంప్రదాయాలు, దేవాలయ సంగీతం వంటి అంశాలలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇవే కాకుండా సమాజంలోని యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి వృత్తి విద్యా పాఠశాలలను కూడా నిర్వహిస్తున్నారు. కుంభకార కళ వంటి సంప్రదాయ వృత్తులను పరిరక్షించడానికి కుంభకార పాఠశాలలను నడుపుతున్నారు. అదేవిధంగా గోసంరక్షణకు సంబం ధించిన శిక్షణ కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఈ విధంగా విద్యా రంగంలో సంప్రదాయం, ఆధునిక అవసరాలను సమన్వయపరచే ప్రయత్నం జరుగుతోంది.
గుడి – ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రం
గుడి భారతీయ సమాజానికి ఆధ్యాత్మిక కేంద్రం. దేవాలయాలు భక్తి, ధర్మం, సాంప్రదాయ విలువలను ప్రజల జీవితంలో నిలబెట్టే ప్రధాన స్థావరాలు. దేవాలయాల ద్వారా సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందుతుంది. ఈ కారణంగా శ్రీ కాంచీ కామకోటి పీఠం దేవాలయ సంప్రదాయాల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యాన్ని ఇస్తోంది. ఆగమ పాఠశాలల ద్వారా దేవాలయాలలో జరిగే పూజా విధానాలు, ఆచారాలు, ఆగమ శాస్త్రాలను బోధిస్తోంది. దీని ద్వారా శాస్త్రోక్తంగా దేవాలయ సేవ చేయగల అర్చకులు, పండితులు తయారవుతున్నారు. దేవాలయ సంప్రదాయం సమాజంలో ఆధ్యాత్మిక విలువలను బలపరచే శక్తిగా కొనసాగుతోంది.

తల్లి ఒడి – సంస్కారాల మొదటి పాఠశాల
కుటుంబం మనిషి జీవితానికి మొదటి పాఠశాల. తల్లి ఒడిలోనే పిల్లలు ప్రేమ, కరుణ, సేవాభావం, ధర్మబోధ వంటి విలువలను నేర్చుకుంటారు. తల్లి ఒడి అనేది కేవలం కుటుంబాన్ని సూచించడమే కాకుండా సంస్కారపూర్వకమైన జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుంది.
జగద్గురు ఆదిశంకరాచార్యుల పరంపరలోని ఆచార్యులు విద్యా రంగంలో విశేష కృషి చేశారు. సంక్షిప్తంగా ఈ పీఠం చేస్తున్న విద్యాసేవలు ఇలా ఉన్నాయి.
- వేద పరిరక్షణ
దేశవ్యాప్తంగా అనేక వేదపాఠశాలలను స్థాపించి నిర్వహిస్తోంది.రుగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణవేదం పాఠాలను గురుకుల విధానంలో బోధిస్తోంది.వేదాధ్యయనానికి విద్యార్థులకు ఉచిత విద్య, భోజనం, వసతి కల్పిస్తోంది. వేదపండితులకు సన్మానాలు, వేతనాలు, వేదరక్షణ నిధులు అందిస్తోంది.
- శాస్త్ర విద్యా అభివృద్ధి
సంస్కృత వ్యాకరణం, మీమాంస, న్యాయ, వేదాంత, సాహిత్య శాస్త్రాలు బోధించే పాఠశాలలు, విద్యా కేంద్రాలను నిర్వహిస్తోంది. శాస్త్ర పండితుల తయారీలో పీఠం కీలక పాత్ర పోషిస్తోంది. శాస్త్రసదస్సులు, ఉపన్యాసాలు నిర్వహించి సంస్కృత పాండిత్యాన్ని ప్రోత్సహిస్తోంది.
- ఆగమ విద్య
దేవాలయ ఆరాధనకు అవసరమైన శైవ, వైష్ణవ, శాక్త ఆగమ సంప్రదాయాలపై శిక్షణ అందిస్తోంది. అర్చకులు, ఆగమపండితుల తయారీకి ప్రత్యేక శిక్షణ కేంద్రాలు నిర్వహిస్తోంది.
- సంస్కృత విద్యా ప్రచారం
సంస్కృత పాఠశాలలు, కళాశాలలు స్థాపించి భాషాభివృద్ధికి కృషి చేస్తోంది. సంస్కృత గ్రంథాల ప్రచురణ, పునర్ముద్రణ, వ్యాఖ్యానాలు చేయిస్తోంది. విద్యార్థులకు విద్యాబహుమతులు, ఉపకారవేతనాలు ఇస్తోంది.
- గ్రంథరక్షణ, పరిశోధన
పూర్వకాలపు పాండులిపుల సంరక్షణ, సేకరణ, ప్రచురణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వేద, ఆగమ, శాస్త్ర విషయాల్లో పరిశోధనను ప్రోత్సహిస్తోంది.
- ఆచార్యుల ప్రేరణ
మహాపెరియవా శ్రీశ్రీశ్రీ జగద్గురు చంద్ర శేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు వేదరక్షణకు విశేష ఉద్యమం చేశారు. తదనంతర జగద్గురుశ్రీ శ్రీ శ్రీ శంకర జయేంద్ర సరస్వతీ మహా స్వామివారు, శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతీ మహాస్వామి వారు కూడా వేద`శాస్త్ర విద్యాభివృద్ధిని ధర్మకార్యంగా కొనసాగిస్తున్నారు.
యావత్ హైందవ సమాజాన్ని ఒక్క తాటిపై నడపడానికి శ్రీ కాంచీ కామకోటి పీఠం వేద-శాస్త్ర విద్యతో పాటు సామాన్యులకు ఉపయుక్తమయ్యే వృత్తి విద్య (Vocational Education) అభివృద్ధికి కూడా సేవ చేస్తోంది. ఈ పీఠం నిర్వహిస్తున్న లేదా ప్రోత్సహిస్తున్న వృత్తి విద్యా కార్యక్రమాలు ముఖ్యంగా సమాజంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ఉంటాయి.
- శిల్పకళాశిక్షణ
దేవాలయ నిర్మాణానికి అవసరమైన శిల్పకళ, స్థపత్యశాస్త్రం, ప్రతిమా నిర్మాణం వంటి విద్యల్లో శిక్షణ.రాయి, లోహం, చెక్కలతో విగ్రహాలు తయారు చేసే కళాకారులకు ప్రోత్సాహం.
- చేతివృత్తులు (Handicrafts)
హస్తకళలు, చేతిపనులు, సంప్రదాయ కళలు నేర్పించే శిక్షణ కేంద్రాలు. గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు కుట్టు, నేయడం వంటి నైపుణ్య శిక్షణ.
విద్యా క్షేత్రంలో సేవలు
వేద పాఠశాలలు
దేశంలోని అనేక ప్రాంతాలలో వేదపాఠశాలలను స్థాపించి గురుకుల విధానంలో విద్యను అందిస్తున్నారు. రుగ్వేద, యజుర్వేద, సామవేద మొదలైన వేదశాఖలలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. సంహితా పఠనం మాత్రమే కాకుండా బ్రాహ్మణ, ఆరణ్యక, ఉపనిషత్తులు, వేదాంగాల అధ్యయనం కూడా జరుగుతుంది. విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం, విద్యాసామగ్రి, అవసరమైన ఇతర సౌకర్యాలను పీఠం సమకూర్చుతోంది. గురువుల సన్నిధిలో విద్యార్థులు నివసిస్తూ విద్యా భ్యాసం చేయడం వల్ల వేదాధ్యయనం సంపూర్ణతను పొందుతుంది. బెంగళూరు, ఆంధ్రప్రదేశ్‌లోని ముక్కామల వంటి ప్రాంతాలలో కూడా పీఠం నిర్వహిస్తున్న వేద పాఠశాలలు కొనసాగుతున్నాయి.
- కామకోటి వేద పాఠశాల, తిరుపతి, ఆంధ్రప్రదేశ్
- శుక్ల యజుర్వేద పాఠశాల, విజయనగరం, ఆంధ్రప్రదేశ్
- వేద పాఠశాల, చెరుకుపల్లి, హైదరాబాద్, తెలంగాణ
- వేద పాఠశాల, అమర్‌కంటక్, మధ్యప్రదేశ్
- వేద పాఠశాల, జగ్గయ్యపేట, ఆంధ్రప్రదేశ్
- వేద పాఠశాల, మహేంద్ర మంగళం, తమిళనాడు
- వేద పాఠశాల, రాణీపూల్, సిక్కిం
- వేద పాఠశాల, తండలం, తమిళనాడు
- యజుర్వేద పాఠశాల, ముక్కామల, ఆంధ్రప్రదేశ్
- కాంచీ కామకోటి పీఠం వేద పాఠశాల, తిరువానైకోయిల్, త్రిచీ
శాస్త్ర పాఠశాలలు
వేదాధ్యయనానికి అనుబంధంగా సంస్కృత శాస్త్రాలలో కూడా పీఠం ప్రత్యేక పాఠశాలలను నిర్వహిస్తోంది. వ్యాకరణం, మీమాంస, న్యాయ, వేదాంత, సాహిత్యం మొదలైన శాస్త్రాలలో ఉన్నత స్థాయి అధ్యయనం ఈ పాఠశాలలలో జరుగుతుంది. పాణినీయ వ్యాకరణం, మీమాంస సూత్రాలు, న్యాయ తర్కశాస్త్రం, ఉపనిషత్తులు, వేదాంత సిద్ధాంతాలు వంటి విభాగాలలో విద్యార్థులకు గాఢమైన శిక్షణ ఇవ్వబడుతుంది.
11.శంకర సంస్కృత పాఠశాల, బెంగళూరు, కర్ణాటక
10.శంకర సంస్కృత పాఠశాల, తిరుపతి, ఆంధ్రప్రదేశ్
12.శంకర సంస్కృత పాఠశాల, గదౌలి ధామ్, ఉత్తరప్రదేశ్
13.శాస్త్ర సరణి పాఠశాల, కాంచీపురం, తమిళనాడు
14.కామకోటి త్రివేణి విద్యార్థి వసతి గృహం, పొదిలి, ఆంధ్రప్రదేశ్
15.కాంచీ కామకోటి సుందర హనుమాన్ పాఠశాల,విజయవాడ, ఆంధ్రప్రదేశ్
- శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి రామాయణ పాఠశాల, పూనమల్లీ, చెన్నై
- వేదిక్ హయ్యర్ లెర్నింగ్ సెంటర్, నెరూర్, తమిళనాడు
ఆగమ, పౌరోహిత్య పాఠశాలలు
దేవాలయ ఆరాధన విధానాలు ఆగమ శాస్త్రాల ఆధారంగా జరుగుతాయి. ఈ సంప్రదాయాన్ని పరిరక్షించడానికి శ్రీ కాంచీ కామకోటి పీఠం ఆగమ విద్యకు ప్రత్యేక ప్రాధాన్యాన్ని ఇస్తోంది. శైవ, వైష్ణవ, శక్త ఆగమాల ప్రకారం ఆలయాలలో జరిగే పూజా విధానాలు, ఆలయ నిర్వహణ పద్ధతులు, ఆచార సంప్రదాయాలను బోధించే శిక్షణా కేంద్రాలను నిర్వహిస్తోంది.ఈ పాఠశాలల ద్వారా దేవాలయాలలో శాస్త్రోక్తంగా సేవ చేయగల అర్చకులు, ఆగమ పండితులు తయారవుతున్నారు. అలాగే గృహ సంస్కారాలన్నీ ధర్మశాస్త్రములపై ఆధారపడి ఉంటాయి. వాటికోసం పౌరోహిత్య పాఠశాలలు అవసరం.
- కామకోటి ప్రసాద పాఠశాల,కొడిగుడెం, ఆంధ్రప్రదేశ్
- ఆగమ పాఠశాల, మాయవరం, తమిళనాడు
- రుషి కృషి పాఠశాల, కావేరిపుంపట్టణం, తమిళనాడు
- పాంచరాత్ర పాఠశాల, తిరుపతి, ఆంధ్రప్రదేశ్
- సంగీత పాఠశాల, చెన్నై, తమిళనాడు
- శంకర పురోహిత పాఠశాల, పరుటిపట్టు, చెన్నై
- శంకర పురోహిత పాఠశాల తిండివనం, తమిళనాడు
- శైవాగమ పాఠశాల, తిరుపతి, ఆంధ్రప్రదేశ్
- శివాగమ పాఠశాల, ముక్కామల, ఆంధ్రప్రదేశ్
- స్మార్త పాఠశాల, వూలపల్లి, ఆంధ్రప్రదేశ్
- స్మార్త పాఠశాల, తిరుపతి, ఆంధ్రప్రదేశ్
- స్మార్త పాఠశాల, సామర్లకోట, ఆంధ్రప్రదేశ్
- వైఖానస పాఠశాల, అవడి, చెన్నై, తమిళనాడు
- మహా ప్రసాద పాఠశాల, తిరుపతి, ఆంధ్రప్రదేశ్
సంప్రదాయ పాఠశాలలు
భవిష్యత్ తరాలు తల్లి ఒడికి దూరం కాకూడదనే సదాశయంతో పీఠం ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా సంప్రదాయ పాఠశాలలను నిర్వహిస్తోంది. ఈ పాఠశాలలలో విద్యార్థినులకు సాధారణ విద్యతో పాటు భారతీయ సంస్కృతి ఆధారిత శిక్షణను అందిస్తున్నారు. చదువుతో పాటు సంస్కారం, సద్గుణాలు, కుటుంబ విలువలను బోధిస్తున్నారు. ఈ పాఠశాలలలో సంగీతం, నృత్యం, చిత్రలేఖనం వంటి కళలలో నైపుణ్యాన్ని పెంపొందించడంతో పాటు భారతీయ సంప్రదాయాలపై అవగాహన కల్పిస్తున్నారు.
- సంప్రదాయ పాఠశాల, మహబూబ్‌నగర్, తెలంగాణ
- సంప్రదాయ పాఠశాల, విజయవాడ, ఆంధ్రప్రదేశ్
- సంప్రదాయ పాఠశాల, పూణే, మహారాష్ట్ర
- సంప్రదాయ పాఠశాల,హైదరాబాద్, తెలంగాణ
- సంప్రదాయ పాఠశాల, నాసిక్, మహారాష్ట్ర
- సంప్రదాయ పాఠశాల, తిరుపతి, ఆంధ్రప్రదేశ్
- సంప్రదాయ పాఠశాల, తిరువానైకోయిల్, తమిళనాడు
వృత్తి విద్యా పాఠశాలలు
పీఠం విద్యా కార్యక్రమాలు కేవలం వేద-శాస్త్ర విద్యలకే పరిమితం కాకుండా సమాజంలోని యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే వృత్తి విద్యకు కూడా విస్తరించాయి. సంప్రదాయ కళలు, చేతివృత్తులు, సాంకేతిక నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చే వృత్తి విద్యా కేంద్రాలను నిర్వహిస్తున్నారు.ఈ శిక్షణ ద్వారా గ్రామీణ యువత స్వయం ఉపాధి సాధించ డానికి అవసరమైన నైపుణ్యాలను పొందుతున్నారు.
నాదస్వర పాఠశాలలు
దక్షిణ భారత దేవాలయ సంస్కృతిలో సంగీతానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా నాదస్వర వాయిద్యం దేవాలయ ఉత్సవాలలో, నిత్యసేవలలో ప్రధానపాత్ర పోషిస్తుంది. ఈ సంప్రదాయాన్ని పరిరక్షించడానికి పీఠం నాదస్వర పాఠశాలను నిర్వహిస్తోంది. ఈ పాఠశాలలో విద్యార్థులకు నాదస్వర వాయిద్యం, సంగీతశాస్త్రం, దేవాలయ సంగీత విధానాలలో శిక్షణ ఇస్తారు. ఈ విద్యను అభ్యసించిన విద్యార్థులు తరువాత దేవాలయాలలో సంగీత సేవను కొనసాగించడమే కాకుండా ఉన్నత విద్యను కూడా అభ్యసించే అవకాశాలను పొందుతున్నారు. కొంతమంది విద్యార్థులకు ఉపకారవేతనాల ద్వారా ఆర్థిక సహాయం కూడా అందుతోంది.
39. నాదస్వర పాఠశాల-బాలురు, కార్వేటి నగరం, ఆంధ్రప్రదేశ్
40. నాదస్వర పాఠశాల -బాలికలు, కార్వేటినగరం, ఆంధ్రప్రదేశ్
41. నాదస్వర పాఠశాల, బెంగళూరు, కర్ణాటక
42. నాదస్వర పాఠశాల, ముక్కామల, ఆంధ్రప్రదేశ్
కుంభకార పాఠశాల
భారతీయ సంప్రదాయంలో కుంభకార కళకు ప్రత్యేక స్థానం ఉంది. మట్టి పాత్రలు, దీపాలు, యజ్ఞకుండాలు, ఆలయ అవసరాలకు సంబంధించిన అనేక వస్తువులు ఈ కళ ద్వారా తయారవుతాయి. ఈ సంప్రదాయ కళను పరిరక్షించడానికి పీఠం కుంభకార పాఠశాలను కూడా నిర్వహిస్తోంది.ఈ పాఠశాలలో మట్టితో వివిధ రకాల పాత్రలు తయారు చేసే విధానం, సంప్రదాయ రూపకల్పన పద్ధతులు, కళాత్మక నైపుణ్యాలను విద్యార్థులకు బోధిస్తున్నారు.
43.కాంచీ కామకోటి ప్రజాపతి కుంభకార పాఠశాల, కార్వేటినగరం, ఆంధ్రప్రదేశ్
గోసంరక్షణ పాఠశాల
భారతీయ సంస్కృతిలో గోమాతకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. గోసంరక్షణ, గోపోషణ భారతీయ ధార్మిక సంప్రదాయంలో ముఖ్యమైన అంశం. ఈ నేపథ్యంలో పీఠం గోసంరక్షణకు సంబంధించిన శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. గోపోషణ, పశుసంరక్షణ, గోశాల నిర్వహణ, గో ఉత్పత్తుల వినియోగం వంటి అంశాలలో శిక్షణ ఇస్తోంది. ఇది వ్యవసాయ ఆధారిత జీవన విధానాన్ని బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతోంది.
- భారతీయ గో విజ్ఞాన పాఠశాల, అదవిపల్లి, ఆంధ్రప్రదేశ్
విద్యార్థి సహాయ కార్యక్రమాలు
విద్యాసంస్థల నిర్వహణతో పాటు విద్యార్థులకు పీఠం వివిధ సహాయ కార్యక్రమాలను అమలు చేస్తోంది. వేదపాఠశాల విద్యార్థులకు పోషణ, వసతి, విద్యాసామగ్రి ఉచితంగా అందిస్తోంది. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఇతర ఆర్థిక సహాయాన్ని కూడా సమకూరు స్తోంది. సారాంశంగా చెప్పాలంటే, శ్రీ కాంచీ కామకోటి పీఠం ప్రతిపాదించిన “బడి-గుడి-తల్లి ఒడి” అనే సూత్రం భారతీయ సమాజ నిర్మాణానికి సమగ్ర మార్గదర్శకంగా నిలుస్తోంది. విద్య, ఆధ్యాత్మికత, కుటుంబ సంస్కారాలను సమన్వయ పరుస్తూ భవిష్యత్ తరాలను సంస్కారవంతమైన, ధార్మికమైన జీవన విధానంలో తీర్చిదిద్దే మహత్తర ప్రయత్నాన్ని ఈ పీఠం కొనసాగిస్తోంది. భారతీయ సంస్కృతి పరిరక్షణలో ఈ సేవలు చిరస్మరణీయ మైనవిగా నిలుస్తాయి.

ఆచార్య రాణి సదాశివమూర్తి
ఉపకులపతి,
శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, తిరుపతి