రాజ్యంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే న్యాయపాలనలో కుల, మత, వర్గ విభేదాలు ఉండకూడదని, న్యాయం అందరికీ సమానంగా అందాలని, కులమతాలతో సంబంధం లేకుండా పాలన ఉండాలని అపర చాణుక్యుడు చెప్పిన రాజనీతి సూత్రం మన దేశంలో కచ్చితంగా అమలు చేయాల్సిన పరిస్థితు లున్నాయి. ఇటీవల అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తూ… “భారత్‌లో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు సమయం ఆసన్నమైంది..” అని వ్యాఖ్యానించింది. అయితే ఈ వ్యాఖ్యలు ఓట్ల కోసం బుజ్జగింపు రాజకీ యాలు చేసే శక్తులకు మింగుడు పడవు. లౌకికవాదాన్ని భుజానకెత్తుకొని మత వివక్ష చూపే కుహనా సెక్యులరిస్టులు ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్ ‘యూసీసీ’) పేరు వింటేనే మన దేశంలో మైనార్టీలకు తీవ్రం అన్యాయం జరిగి పోతుండంటూ పూనకంతో ఊగిపోతారు. దీర్ఘకాలంగా యూసీసీ చట్టం అమలు కోసం ఎదురు చూస్తున్న దేశ ప్రజల్లో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. మన దేశంలో మత వివక్ష లేకుండా అందరికీ సమానమైన హక్కులు కల్పించినప్పుడే ప్రజలకు ప్రజాస్వామ్యం ఫలాలు అందుతాయి.


స్వాతంత్య్రానికి పూర్వం దేశంలో బ్రిటిష్ పాలకులు హిందూ, ముస్లిం సామాజిక వర్గాలకు వేర్వేరు చట్టాలు అమలు చేస్తూ ముస్లింల కోసం ప్రత్యేకంగా 1937లో షరియత్ చట్టం తీసుకొచ్చారు. దేశ స్వాతంత్య్రం అనంతరం ప్రజల మధ్య విభేదాలు లేకుండా అన్ని మతాల వారికి ఒకేరకమైన చట్టం ఉండాలనే భావనతో యూసీసీ ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. కానీ మొదటి నుండి ముస్లిం మైనార్టీలు ఎక్కడ నొచ్చుకుంటారో అనే భయంతో మెజార్టీ హిందువులపై వివక్ష చూపించే కాంగ్రెస్ పార్టీ నాటినుండి నేటివరకూ అదే పంథాను కొన సాగిస్తూ యూసీసీకి అడ్డుపుల్లలు వేస్తోంది. కాంగ్రెస్‌కు కమ్యూనిస్టులు, ఇతర కుహనాశక్తులు కూడా తోడవడంతో పరిస్థితులు ఎలా మారాయంటే యూసీసీ పేరు ఎత్తితేనే దేశం అల్లకల్లోలం అవుతుందనే ఆందోళనలు రేగుతున్నాయి. నిజానికి యూసీసీ ఏ ఒక మతానికి వ్యతిరేకం కాదు. అనుకూలం కాదు. దేశంలోని అన్ని మతాల ప్రజలకు ఒకే రకమైన న్యాయం కలిగించడమే దీని ప్రధాన ఉద్దేశం. బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడే శక్తులు యూసీసీ అమలయితే ముస్లింలకు అన్యాయం జరిగిపోతుందని విష ప్రచారం చేయడంతో వాస్తవాలు మరుగున పడిపోయి అవాస్తవాలు, అసత్యాలతో మైనార్టీల్లో భయాందోళనలు పెరిగిపోయాయి.

యూసీసీతో ప్రత్యేకంగా ఏ ఒక్క మతానికి నష్టం జరగదు. సెక్యులర్ దేశంగా చెప్పుకునే భారత్‌లో అన్ని మతాల ప్రజలకు ఒకే విధమైన వ్యక్తిగత చట్టాలు ఉండాలని చెప్పే ప్రతిపాదనే యూసీసీ. ప్రస్తుతం ఒక్కో మతానికి వేర్వేరు చట్టాలు ఉండడంతో ప్రధానంగా మహిళలకు నష్టం జరుగుతోంది. యూసీసీతో మహిళలకు సమాన హక్కులు లభిస్తాయి. దేశంలో ఏకత్వం పెరుగు తుంది. ఒకే చట్టం ఉంటే అందరూ సమానంగా ఉంటారు. యూసీసీతో మహిళల హక్కులకు పూర్తి రక్షణ లభిస్తుంది. ప్రస్తుతం విడివిడి చట్టాలతో ముఖ్యంగా వివాహం, విడాకులు, వారసత్వ హక్కులు, దత్తత, భరణం వంటి అంశాల్లో గందరగోళం నెలకొంటుంది. దీంతో ముస్లిం మహిళల హక్కులపై ఇప్పటికే పలు కేసుల్లో న్యాయస్థానాలు యూసీసీ చట్టాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకతపై వ్యాఖ్యలు చేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేశాయి. గతంలో సుప్రీం కోర్టు 1985లో మహ్మద్ అహ్మద్‌ఖాన్ వర్సస్ షాబానో బేగం కేసులో, 1995లో సర్లా ముద్గల్ వర్సస్ కేంద్ర ప్రభుత్వం కేసులో యూసీసీ అమలు చేయాల్సిన ఆవశ్యకతను నర్మగర్భంగా చెప్పింది. ఇప్పుడు సుప్రీం కోర్టు తాజాగా ఉమ్మడి పౌరస్మృతి గురించి వ్యాఖ్యానించడంతో దేశ వ్యాప్తంగా మరోసారి యూసీసీపై చర్చ ప్రారంభమైంది.

మార్చి 10, 2026న సుప్రీం కోర్టులో షరియా చట్టంలోని కొన్ని నిబంధనలు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోమాల్య బాగ్చీ, జస్టిస్ ఆర్.మహదేవన్‌లతో కూడిన త్రిసభ్య బెంచ్ విచారణ జరుపుతున్న సందర్భంలో సీజేఐ వ్యాఖ్యనిస్తూ ఉమ్మడి పౌరస్మృతి దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతూ షరియా చట్టంలో మహిళల పట్ల వివక్ష చూపుతున్న నిబంధనలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను స్వాగతిస్తూ ఇది చాలా మంచి కేసు అన్నారు. ముస్లిం పురుషులతో సమానంగా ఆ మతంలోని స్త్రీలకు కూడా వారసత్వ హక్కులు కల్పించాలని, షరియాలో నిబంధనలు తొలగించి ముస్లిం మహిళలను భారతీయ వారసత్వ చట్టం పరిధిలోకి తీసుకురావాలనే పటిషినర్ల అభ్యర్థనపై సుప్రీం కోర్టు వ్యాఖ్యానిస్తూ ఇది శాసన వ్యవహారాలతో ముడిపడిన విషయమని, తాము నిర్ణయం తీసుకుంటే న్యాయ సంబంధ చిక్కులకు దారి తీయవచ్చునని తెలిపింది. ఈ సమస్యకు ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావడమే సరైన పరిష్కారమని అభిప్రాయం వ్యక్తం చేయడంతో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న యూసీసీ చట్టంపై ఆశలు చిగురించాయి.

దేశంలో అందిరికీ ఒకే చట్టం ఉండాలనే అభిప్రాయం స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి వెలువడుతున్నా అడుగు ముందుకు పడలేదు. ముస్లిం ఓట్ల కోసం బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడే కాంగ్రెస్ పార్టీయే ఇందులో ప్రధాన ముద్దాయి. రాజ్యంగా రూపకర్త డా.బీఆర్ అంబేద్కర్ యూసీసీ అమలు చేయాలని గట్టిగా కోరుకున్నా తొలి ప్రధాని నెహ్రూ సెక్యూలరిజం పేరుతో వెనకడుగు వేయడంతో అది నేటికీ అపరిష్కృతంగానే మిగిలి పోయింది. దేశ విభజన అనంతరం ముస్లింలు యూసీసీ అమలును వ్యతిరేకిస్తారనే భయంతో నెహ్రూ దాటవేత వైఖరి ప్రదర్శించారు. ముస్లింలకు ఆగ్రహం వస్తుందని యూసీసీ పేరు ఎత్తడానికే ఇష్టపడని నెహ్రూ సంస్కరణల పేరుతో ఎంతో ఉత్సాహంతో హిందూ కోడ్ బిల్లు తీసుకొచ్చారు. 1950వ దశకంలో హిందువులకు వర్తించేలా హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వ చట్టం, హిందూ మైనర్ల సంరక్షణ, హిందూ దత్తత, మనోవర్తి చట్టం, హిందూ ఆస్తి స్వాధీనతా చట్టం.. ఇలా అయిదు చట్టాలు తీసుకొచ్చారు. ఈ చట్టాలే సిక్కు, బౌద్ధ, జైన్ మతస్తులకు కూడా వర్తింపచేస్తున్నారు. అయితే ముస్లిం, క్రైస్తవ, పార్సీ మతస్తులకు మాత్రం వేర్వేరు చట్టాలు ఉండడంతో వివాదం మొదలైంది. అయితే హిందూ మహిళలకు న్యాయం చేయడానికి హిందూ కోడ్ బిల్లు తీసుకురావడాన్ని తప్పు పట్టలేము కానీ ఇదే ఉత్సాహం, నిబద్దత ఇతర మతాల వద్దకు వచ్చేసరికి ఎందుకు కనిపించలేదో కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పాలి. హిందూ కోడ్‌తో ఆ వర్గంలోని మహిళలకు సమన్యాయం చేశామని చెప్పుకునే కాంగ్రెస్ ముస్లిం మహిళలకు అదే న్యాయం ఎందుకు చేయడం లేదు. సెక్యులరిజం అంటే ఒక మతానికే అన్నీ వర్తిస్తాయా..? వివాహ చట్టం అందరికీ ఒకేలా లేకపోవడంతో బహుభార్యాత్వం, సంతానం విషయంలో నిబంధనలు ఒకేలా లేకపోవడంతో ముస్లింల షరియా చట్టంలో నిబంధనలపై అనేక వివాదాలు రేగుతున్నాయి.

ముస్లింలను ఓటు బ్యాంకుగా చూస్తున్న కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇతర కుహనా సెక్యులరిస్టులు పరోక్షంగా ఆ వర్గానికి తీవ్ర అన్యాయమే చేశారు. యూసీసీపై ముస్లింలను చైతన్యపరచాల్సిందిపోయి వారిని తప్పుదోవ పట్టించారు. మత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని, సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చినట్టవుతుందనే తప్పుడు ప్రచారానికి వీరు మద్దతిచ్చారు. హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు వేర్వేరు చట్టాలుండే బదులు యూసీసీతో దేశంలో ఒకే చట్టం అమలులో ఉంటే అందరికీ సమన్యాయం లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ఒప్పించలేకపోయింది. యూసీసీతో దేశంలో వివాహం, పునర్వివాహం, కుమారులకు, కుమార్తెలకు సమాన హక్కులు, సామాజిక ప్రయోజనాలు, మతం, లింగం ఆధారంగా భేదాలు లేకుండా చట్టాలు చేసే ప్రయోజనాలు యూసీసీ ద్వారా లభిస్తాయని తెలిసినా ముస్లింలను కొంత మంది తప్పుదోవ పట్టిస్తూ, ఈ చట్టాన్ని బూచిగా చూపుతూ స్వార్థ రాజకీయాలకు పాల్పడ్డారు. విభిన్న సంప్రదాయాలు, సంస్కృతులు, ఆచారాలు ఉన్న భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం తెచ్చేందుకు యూసీసీ ఉపయోగపడుతుందని తెలిసినా కూహనా సెక్యులరిస్టులు ముందడుగు వేయలేదు. ప్రజా స్వామ్యానికి లౌకికవాదం పునాది అని ఢంకా భజాయించే ఈ పెద్దలు బ్రిటిష్ వారి విభజించు, పాలించు సూత్రాలను అనుసరిస్తూ గందరగోళం చట్టాలతో ముస్లిం మహిళలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చూపిస్తున్న ఈ వివక్ష నెహ్రూ కాలం నుండి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వరకు కొనసాగింది.

డా.బి.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగం రూపొందించి నప్పుడు యూసీసీపై తన వాదనలు గట్టిగానే వినిపించినా నెహ్రూ వైఖరితో చట్టం సాధ్యం కాలేదు. దేశంలో కాంట్రాక్టు, క్రిమినల్ లా వంటి సివిల్ విషయాల్లో ఒకే చట్టం సాధ్యమైనప్పుడు వ్యక్తిగత చట్టాలకు కూడా ఒకే కోడ్ ఉండడం అసాధ్యం కాదని అంబేద్కర్ భావించారు. రాజ్యంగం రూపొందించే సందర్భంగా రాజ్యాంగ నిర్ణాయక సభలో యూసీసీపై లోతైన చర్చే జరిగింది. రాజ్యంగసభ అధ్యక్షులు అంబేద్కర్ యూసీసీ ఉండాలని కోరుకున్నా నెహ్రూతో ఆయన మద్దతుదారులు వ్యతిరేకించడంతో గొప్ప ప్రయత్నానికి బ్రేకులు పడ్డాయి. యూసీసీపై ముస్లింలను ఒప్పించే దిశగా ప్రయత్నించాలని అంబేద్కర్ భావించినా కాంగ్రెస్ పెద్దలు అందుకు సమ్మతించలేదు. ముస్లింలు ఎక్కడ బాధపడతారో, ఎక్కడ తిరగబడుతారో అనే జంకుతో రాజ్యాంగం హక్కుల్లో భాగం కావాల్సిన యూసీసీ అంశాన్ని 44వ అధికరణ కింద ఆదేశిక సూత్రాల్లో చేర్చి ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావడానికి రాజ్యం కృషి చేయాలని ఆ అధికరణ నిర్ధేశించింది. దీన్ని అడ్డుపెట్టుకొని 25 నుండి 28వ అధికరణ వరకూ పౌరులకుండే మత స్వేచ్ఛ హక్కులను ప్రస్తావిస్తూ 44వ అధికరణలో ఉన్న యూసీసీపై గత కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించాయి.

కేంద్రంలో 2014 నుండి మోదీ అధికారం చేపట్టాక యూసీసీపై ఆశలు చిగురించాయి. బీజేపీ ఎన్నికల నినాదమైన ఒకే దేశం ఒకే చట్టం వారు అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందనే భావన ప్రజల్లో ఏర్పడింది. 2024 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ యూసీసీ గురించి ప్రస్తావించారు. దేశంలో ప్రస్తుతమున్న ‘మతతత్వ పౌరస్మృతి’ స్థానంలో ’సెక్యులర్ పౌరస్మృతి’ ఉండాలని పిలుపు నిచ్చారు. సీఏఏ, త్రిబుల్ తలాక్, కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు వంటి కీలక నిర్ణయాలు తీసుకొని తన ప్రత్యేకతను నిరూపించుకున్న మోదీ యూసీసీపై వ్యూహాత్మంగా అడుగులేస్తారని దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరా ఖండ్‌లో యూసీసీ చట్టం అమలు చేస్తుండడంతో కేంద్రంలో కూడా మోదీ ప్రభుత్వం అదే దిశలో పయనిస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఉత్తరాఖండ్‌లో బీజేపీ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామీ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆ రాష్ట్రంలో 2024లో యూసీసీ చట్టాన్ని తీసుకొచ్చారు.

దేశంలో యూసీసీ చట్టాన్ని అమలు చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. అంతకు ముందు నుండే గోవాలో యూసీసీ చట్టం అమల్లో ఉంది. 1867లో అక్కడ పోర్చుగీస్ ప్రభుత్వం యూసీసీ తీసుకొచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం యూసీసీ చ{్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ చరిత్రలో నిలిచిపోయింది. మరోవైపు బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, అసోం రాష్ట్రాల్లో కూడా యూసీసీ చట్టం తెచ్చే ప్రయత్నాలు జరుగు తున్నాయి. తాజాగా మరోసారి సుప్రీం కోర్టు యూసీసీ చట్టం ఆవశ్యకతపై వ్యాఖ్యానించడంతో కేంద్రంతో పాటు ప్రధానంగా బీజేపీ పాలిత రాష్ట్రాలు దీనిపై దృష్టి సారించే అవకాశాలున్నాయి.

లౌకికవాద దేశం కాబట్టి భారత్‌లో యూసీసీ అమలు చేయకూడదని వాదిస్తున్న సెక్యులరిస్టులు కుహనా లౌకికవాదులని బలంగా చెప్పవచ్చు. భారత రాజ్యాంగం రూపొందించినప్పుడు లేని సెక్యులరిజం పదాన్ని తమ స్వార్థ, బుజ్జగింపుల రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ చేర్చింది. ఇంకా దురదష్టకరమైన విషయం ఏమిటంటే లౌకికత్వాన్ని వల్లెవేస్తూ లౌకికత్వానికి కుహనా సెక్యులరిస్టులు తిలోదకాలిస్తు న్నారు. దేశంలో ఏ మతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వకుండా అన్ని మతాల్ని సమానంగా గౌరవించడ మనే లౌకికత్వం ప్రాథమిక సూత్రానికి విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. దేశంలో మెజార్టీలైన హిందూ చట్టాల్లో సంస్కరణలు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీలైన ముస్లిం షరియా చట్టం వైపు చూడడానికే భయపడడం లౌకికవాదమవుతుందా..? అందరికీ సమానమైన హక్కులు, చట్టాలు లేకుండా వివక్ష చూపడం సెక్యులరిజమా..? సెక్యులరిజం పేరుతో సెక్యులరిజం సిద్దాంతాలకు తూట్లు పొడవడం సెక్యులరిస్టుల దిగజారుడుతనం రాజకీయాలకు నిదర్శనం.

భారత దేశంలో ప్రజల మధ్య విభేదాలు లేకుండా యూసీసీ చట్టం అమలుకు ఇదే సరైన సమయమని సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మార్గదర్శకంగా తీసుకొని ముందడుగు వేయాలి. వందేళ్లకు పైగా చరిత్ర గలిగిన పార్టీగా బాజాలు కొట్టుకునే కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు ధోరణితో దేశ పౌరుల ప్రయోజనాలను విస్మరించింది. లౌకికవాదం పేరుతో ఆ పార్టీ చేసిన రాజకీయాలను ఎండగడుతూ మోదీ ప్రభుత్వం యూసీసీ చట్టం కోసం కంకణం కట్టుకోవాలి. ఇప్పటికే సీఏఏ, త్రిబుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు సున్నితమైన అంశాలపై ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయవంతమైన బీజేపీ ప్రభుత్వం అదే స్ఫూర్తితో యూసీసీ చట్టం తీసుకొస్తుందని ప్రజలు వారిపై భరోసాతో ఉన్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం కేంద్రంలో గట్టి నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం అధికారంలో ఉండడంతో సుప్రీం కోర్టు చెప్పినట్టు ఒక మంచి పనికి సమయం ఆసన్న మైందనే విశ్వాసం దేశ ప్రజల్లో కలుగుతోంది.

– శ్రీపాద

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE