ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరఎసఎస్) సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబళే సంత్ శిరోమణి సద్గురు శ్రీ రవిదాస్ 650వ జయంతి సందర్భంగా భారతీయ ఆధ్యాత్మిక మార్గంలో వారి విశిష్టత, జీవన విశేషాలను ప్రస్తావిస్తూ ప్రత్యేక ప్రసంగం చేశారు. హరియాణాలోని సమాల్ఖాలో ఆరఎసఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాల్లో మార్చి 14వ తేదీన సర్‌కార్యవాహ ప్రసంగం యథాతథంగా…
“రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంత్ శిరోమణి సద్గురు రవిదాస్‌జీ 650వ జయంతి సందర్భంగా వారికి భక్తిపూర్వక నివాళులు అర్పిస్తోంది. మన గొప్ప సంత్ సంప్రదాయం భారత దేశానికి దేవుడు ఇచ్చిన విశిష్ట కానుక. మన సుదీర్ఘ చరిత్రలో, ఈ గొప్ప సంత్ సంప్రదాయం సమాజంలో దైవారాధన, భక్తి భావాన్ని మేల్కొల్పడమే కాకుండా, సామాజిక దురాచారాలను, వివక్షను నిర్మూలించి సామరస్య పూర్వక సమాజాన్ని బలోపేతం చేయడానికి కృషి చేసింది. అదే సమయంలో, విదేశీ పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడటానికి సమాజాన్ని చైతన్యవంతం చేసింది. ఈ గొప్ప సంత్ సంప్రదాయంలో సంత్ శ్రీ రవిదాస్‌జీ కి విశిష్ట స్థానం ఉంది. ఆయన కర్మశీల జీవితం, కృషి మనందరికీ స్ఫూర్తిదాయకం. గృహస్థుగా ఉంటూనే ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండి, సాధు-సంతుల పట్ల భక్తిని, దీనజనుల పట్ల సేవా భావాన్ని కలిగి ఉండటం ఆయన సహజ స్వభావం. ఆయన ఆధ్యాత్మి కతతో నిండినవారు. సమాజంలో శ్రమకు గౌరవాన్ని, స్వచ్ఛమైన, పారదర్శకమైన ప్రవర్తన ప్రాముఖ్యతను ఆయన పునఃస్థాపించారు.
సంత్ శ్రీ రవిదాస్ భక్తి మార్గంలో గొప్ప సంత్. ఆయన సమాజంలో కొత్త చైతన్యాన్ని నింపారు. పుట్టుక ఆధారంగా వచ్చే హెచ్చుతగ్గులను తిరస్కరించి, ప్రవర్తననే శ్రేష్ఠతకు కొలమానంగా భావించారు. మూఢనమ్మకాలు, దురాచారాల నుండి సమాజానికి విముక్తి కలిగించడంలోను, కాలం చెల్లిన సంప్రదాయాలను వదిలివేసి, సమకాలీన సామాజిక మార్పులను స్వీకరించేలా సమాజాన్ని సిద్ధం చేయడంలోను ఆయన చారిత్రక పాత్ర పోషించారు. సంత్ శ్రీ రవిదాస్ ఆలోచనల ప్రాముఖ్యతను గుర్తించి, శ్రీ గురు గ్రంథ సాహిబ్‌లో ఆయన రాసిన 41 వాణీలను (రచనలు లేదా స్వరకల్పనలు) ‘శబద’ రూపంలో చేర్చారు.
సాధారణ కుటుంబ నేపథ్యం నుండి వచ్చినప్పటికీ, సంత్ శ్రీ రవిదాస్ దైవభక్తి, సేవా భావం, సమాజం పట్ల నిష్కల్మషమైన ప్రేమ కారణంగా కాశీలోని విద్వాంసులు సహా సమాజం లోని అన్నివర్గాలవారు ఆయన గొప్పతనాన్ని అంగీక రించారు. కాశీ రాజు, ఝాలీ రాణి, సుప్రసిద్ధ కృష్ణ భక్తురాలు మీరాబాయి వంటి రాజకుటుంబీకులు కూడా ఆయనను తమ గురువుగా స్వీకరించారు. గురు-శిష్య సంబంధంగా సంత్ శ్రీ రవిదాస్ – మీరాబాయిల బంధం ‘నిర్గుణ’, ‘సగుణ’ భక్తి ధారల సమ్మేళనం. అలాగే కుల వివక్షను నమ్మే వారికి ఇది ఒక గొప్ప పాఠం.
ముస్లిం దురాక్రమణదారుల అరాచకాలు సాగుతున్న ఆ కఠిన కాలంలో, భక్తి ధారను ప్రవహింపజేస్తూ సంత్‌శ్రీ రవిదాస్‌జీ ధర్మం గొప్పతనాన్ని చాటి చెప్పారు, ప్రజలను ధర్మపాలన చేయమని కోరారు. సద్గురు సంత్ శ్రీ రవిదాస్ జీని ముస్లిం మతంలోకి మార్చడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆయన భక్తి, ఆధ్యాత్మిక సాధనకు ప్రభావితులై, ఆయనను మతం మార్చాలనుకున్న వారే ఆయనకు అనుయాయులుగా మారిపోయారు.
ప్రస్తుత కాలంలో వివిధ విభజన శక్తులు ప్రజలను కుల, వర్గాల పేరుతో విడదీయాలని చూస్తున్నప్పుడు, పూజ్య సంత్‌శ్రీ రవిదాస్‌జీ జీవిత సందేశాన్ని అర్థం చేసుకుని, మనమందరం దేశం, సమాజం ఐక్యత కోసం పనిచేస్తామని సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉంది.”