ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ

గత యేడాదిగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సంస్థాగతంగా బాగా విస్తరించిందని సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబసలె అన్నారు. యేడాదిలోనే 6 వేల శాఖలు పెరిగాయని, 88 వేలకు చేరుకున్నాయని అన్నారు. అలాగే స్థలాలు కూడా వృద్ధి చెందాయని తెలిపారు. వీటితో పాటు సాప్తాహిక్ మిలన్‌ల సంఖ్య కూడా పెరిగిందన్నారు. అండమాన్, అరుణాచల్‌ప్రదేశ్, లేహ్ లాంటి  మారుమూల సరిహద్దు ప్రాంతాలలో కూడా దైనందిన శాఖలు నడుస్తున్నాయని ప్రకటించారు. సంఘ కార్య శతాబ్దిలో ఈ విస్తరణ ప్రస్ఫుటంగా ద్యోతకం అవుతూనే ఉందన్నారు. అలాగే మారుమూల, సంక్లిష్ట గిరిజన ప్రాంతాలలో ఆరఎసఎస్ విస్తరించింద న్నారు.

ఆర్ఎస్ఎస్ మూడు రోజుల అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాన్ని మార్చి 13న హరియాణా లోని పట్టి కల్యాణ (సమల్ఖా)లోని మాధవ్ సృష్టి ప్రాంగణంలో పరమపూజనీయ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్‌జీ, సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబళే భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి సమావేశాన్ని ప్రారంభించారు.

మార్చి 15న సమావేశాలు ముగిసిన సందర్భంగా దత్తాత్రేయ హోసబళే, అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశాలకు 1,487 మంది ప్రతినిధులు వచ్చారని, దేశ వ్యాప్తంగా 46 ప్రాంతాల నుంచి ప్రతినిధులు వచ్చారన్నారు. ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల విస్తరణను సమీక్షించామని, ఆరఎసఎస్ శతాబ్ది సంవత్సరం సందర్భంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలపై సమీక్ష కూడా జరిగిందన్నారు.ఈ చర్చ జరుగుతున్న సమయంలో ఆరఎసఎస్ సంస్థాగత దృక్పథం, సామాజిక అంశాలను కూడా పరిగణనలోకి తీసు కున్నామని వివరించారు. అలాగే పంచ పరివర్తన మాధ్యమంగా సమాజంలో సానుకూల మార్పును ప్రేరేపించడం కూడా చాలా ముఖ్యమన్నారు.

 ప్రస్తుతం 55,683 స్థానాలలో 88,949 ఆర్ఎస్ఎస్ శాఖలు నడుస్తున్నాయని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆరఎసఎస్ పరిభాషను వివరించారు. పట్టణ ప్రాంతాలలో సాధారణంగా 10 వేల నుంచి 12 వేల జనాభా ఉన్న ప్రాంతాన్ని బస్తీ అని పిలుస్తామని, అలా అయినా ఒక నగరంలో దాదాపుగా 30 వేల నుంచి లక్షల వరకూ జనాభా ఉంటుందన్నారు. ఐదు లక్షలకు పైగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లను మహానగర్‌గా పిలుస్తామని, ఆర్ఎస్ఎస్ సంస్థాగత దృక్పథంలో, జనాభా పరిమాణం కూడా ఒక కారకంగా ఉన్నప్పటికీ, కనీసం 50 శాఖలు అక్కడ పనిచేస్తున్నప్పుడు ఆ నగరాన్ని మహానగర్‌గా పరిగణిస్తామని వివరించారు.

అయితే శాఖలను విస్తరించడం అంటే కేవలం సంఖ్యను మాత్రమే పెంచడం తమ ఉద్దేశం కాదని నొక్కి చుప్పారు. శాఖ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వయంసేవకులు జాతీయ దృక్పథాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటారన్నారు. స్వయంసేవకులు ఒకే భాష, ప్రాంతీయ గుర్తింపునకు పరిమితం కారని, దేశం మొత్తాన్ని సమగ్రంగా చూస్తారన్నారు. స్వయంసేవకులు కుల, సమాజ గుర్తింపులకు అతీతంగా ఆలోచిస్తారని, మొత్తం సమాజం పట్త విస్తృత శ్రద్ధను పెంపొందించుకుంటారని తెలిపారు. దేశం మనకు ప్రతిదీ ఇస్తుందని, మనం కూడా దేశానికి ఏదైనా తిరిగి ఇవ్వాలి అన్న దృక్పథంతో ఉంటారన్నారు. ఈ సేవా స్ఫూర్తి నిత్య శాఖ ద్వారానే వృద్ధి చెందుతుందని తెలిపారు.

అయితే విస్తరణ మాత్రమే సరిపోదని, స్వయంసేవకుల నాణ్యతా ప్రమాణాలు కూడా పెరగాలని నొక్కి చెప్పారు. స్వయంసేవకులు లోతైన సామాజిక దృక్పథాన్ని పెంపొందించుకోవాలని, అనేక మందితో సంబంధాలను ఏర్పర్చుకోవాలని, నిర్మాణాత్మక సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని సూచించారు.

అలాగే భారత దేశ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక జీవితం గురించి సరైన దృక్పథాన్ని కూడా అలవర్చుకోవడం మరో ముఖ్య లక్ష్యమని తెలిపారు. వలసవాద ఆలోచనా వారసత్వాన్ని ఈ సమాజం అధిగమించాలని, విశ్వవిద్యాలయాలు, పాఠ్యపుస్తకాలు, మేధో వేదికలు, మీడియా, సాహిత్యంలో ఇటువంటి చర్చలు జరగాలని అభిప్రాయపడ్డారు.

 భారతీయత, హిందూత్వ వంటి భావనలను కేవలం తాత్విక ఆలోచనలుగా కాకుండా నాగరిక జీవన విధానంగా అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.స్వామి వివేకానంద, దయానంద సరస్వతి వంటి ఆలోచనాపరులు పూర్వ కాలంలోనే ఇటువంటి మేధోపరమైన మేల్కొలుపును ప్రారంభించారని గుర్తు చేశారు.

ప్రపంచానికి ఆవశ్యకమైన, సకారాత్మకమైన ఆలోచనా విధానం మనం కలిగి ఉండాలి. ఉదాహరణకు జీ-20 సదస్సు వేదికగా వసుధైక కుటుంబకం అన్న సందేశాన్ని భారత్ పంపిందన్నారు. కేవలం స్వయంసేవకులు మాత్రమే దేశం పట్ల అంకిత భావంతో ఉన్నారని తామెన్నడూ చెప్పుకోవడం లేదని, అలా భావించడమూ లేదని స్పష్టతనిచ్చారు. దేశ వ్యాప్తంగా అనేక సంస్థలు, వ్యక్తులు తమ మేధస్సును, ప్రతిభను, తెలివితేటలను సామాజిక, జాతీయ ప్రయోజనాలకు అంకితం చేస్తున్నారన్నారు. ఈ సజ్జన శక్తిగా పిలువబడే వీరందరి మధ్య సమన్వయం పెరిగితే సామాజిక పరివర్తన మరింత బలోపేతం అవుతుందన్నారు.

2025 విజయదశమి నుండి దేశమంతటా శతాబ్ది కార్యక్రమాలు చాలా చోట్ల ప్రారంభమైనాయి. అనేక స్థలాలలో ప్రతిష్టిత వ్యక్తులతో చర్చా గోష్టి జరిగింది. ఇప్పటివరకు జరిగిన హిందూ సమ్మేళనాలలో సాధుసంతులు మొదలుకొని, సామాన్య ప్రజలవరకు అందరూ విశేషంగా పాల్గొంటున్నారు. పరమపూజనీయ సర్‌సంఘచాలక్ పోర్టుబ్లెయిర్‌లో పాల్గొన్న హిందూ సమ్మేళనంలో అండమాన్‌లోని 9 ద్వీపాల నుండి 13వేల మంది పాల్గొన్నారు.

అరుణాచల్‌ప్రదేశ్‌లో ఇప్పటివరకు 21 సమ్మేళనాలు జరుగగా 37 వేమంది పాల్గొనడం విశేషం. ఎందుకంటే అండమాన్, అరుణాచల్ లాంటి చోట్ల సుదూర గ్రామాల నుంచి రావాలి, రవాణా సౌకర్యం చాలా తక్కువ. అలాంటి చోట కూడా శతాబ్ది కార్యక్రమాలకు మంచి స్పందన కలగడం గొప్ప విశేషం. యువకుల కొరకు కూడా అనేక కార్యక్రమాలు కూడా యోజన చేయబడు తున్నాయి.

ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్  వరకు దేశమంతా 75 చోట్ల ప్రశిక్షణ వర్గ(ట్రైనింగ్ క్యాంప్)లు జరుగబోతున్నాయి.

శ్రీ సంత్ రవిదాస్ 650వ జయంతితో ముడిపడి ఉన్న కార్యక్రమాలను కూడా ఆయన ప్రస్తావించారు, సాధువులను స్మరించుకోవడం అంటే కేవలం భక్తితో కూడినది కాదని, వారి బోధనలను సమాజంలో అమలు చేయడం అని అన్నారు. అలాంటి వ్యక్తిత్వాలు కేవలం చిత్రపటాలలో లేదా చరిత్ర పుస్తకాలలో మాత్రమే ఉండడం కాదని, నేటికీ ప్రజలకు స్ఫూర్తిమంతం అని అన్నారు.

About Author

By editor

Twitter
YOUTUBE