‘‘ఏకాదశ రుద్రులలో శంకరుని నేను’’ అంటాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో విభూతియోగంలో. ఈ శంకరునికి ఎనిమిది రూపాలు. వాటిలో జలమూర్తి ఒకరు. ‘భవము’ అనగా ‘అగునది’ అని అర్థము. మన ప్రాణమునకు ఆధారము అగునది జలము. అందుకే జలమూర్తి అయిన శివుని ‘భవుడు’ అంటాము. ఈ భవుని భార్య ‘భవాని’. అందుకే అమ్మవారిని ‘భవానీ భావనా గమ్యా భవారణ్య కుఠారికా’’ అని శ్రీలలితా సహస్రనామాలలో స్తుతిస్తాం.
సకల ప్రాణికోటికి జీవాధారమైన నీటికి భారతీయ సంస్కృతిలో గల ఆధ్యాత్మిక ప్రాశస్త్యము ఇది.
భౌతిక అవసరాలకే గాక ఇంకా ఎన్నో రకాలుగా మన జీవితాలలో నీరు ప్రాధాన్యతను కలిగి ఉంది. ఆధ్యాత్మికంగా కూడా నీటికి గల ప్రాధాన్యత ఎంతో విశేషమైనది.
1. పూజ చేసేటప్పుడు ఆచమనం చేస్తాం.
2. సమర్పించేటప్పుడు నీళ్లు వదులుతాం.
3. దానాలు చేసేటప్పుడు నీళ్లను వదులుతూ ఆ కార్యాన్ని చేస్తాం.
4. మునులు శపించేటప్పుడు చేతిలోనికి నీళ్లు తీసుకుని విసిరేవారు.
5. భోజనం చేసేటప్పుడు నీళ్లతో పరిషేచనం చేస్తాం.
6. భోజనం ముగించిన తర్వాత కూడా చుట్టూ నీళ్లు జల్లుతాం.
7. దోసిట నీళ్లు తీసుకుని సూర్యునికి అర్ఘ్యమివ్వటం సంధ్యావందనంలో ప్రధానమైనది.
8. దేవాలయాలలోకి వెళ్ళేముందు కాళ్లు కడుక్కుని లోనికి ప్రవేశిస్తాం.
9. ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు కూడా కాళ్లు కడుక్కుని లోపలికి వెళ్ళడం మన ఆచారం.
10. ఏదైనా అశౌచం వచ్చినప్పుడు పసుపు నీళ్లు జల్లి శుద్ధి చేస్తాం.
ఇలా భారతీయ జీవనంలో అన్ని రకాలుగా విడదీయరాని ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది నీరు.
మనం ఉంటున్న గ్రహం భూమి. ఇందులో మూడింట రెండు వంతులు నీరే ఉంది. ఈ నీటిలో ఒక్క శాతం మాత్రమే ప్రాణికోటి మనుగడకు పనికి వస్తుంది. ఈ నీరు నదులలో, చెరువులలో, బావులలో మనకి లభ్యమవుతోంది.
నీరు లేకపోతే మనం బతకలేం. పక్షులు విలవిల్లాడిపోతాయి. చెట్లు మోడువారిపోతాయి. భూమి బీటలు వారిపోతుంది. ప్రకృతి మొత్తం జీవకళ కోల్పోతుంది.
తాగునీటి వనరులైన నదులు, చెరువులు, భూగర్భ జలాలు అనేక రకాలుగా కలుషిత మవుతున్నాయి.
మధ్య పసిఫిక్ సముద్రంలో గల కామన్వెల్త్ దేశాలలో ఒక స్వతంత్ర దేశం ‘‘కిరిబాటి’’. ఇది 33 పగడపు దీవుల సముదాయం. ఈ దీవులలోని స్వచ్ఛమైన జలాశయాలు ఈ దేశపు ప్రధాన వనరులు. ఇటీవలి కాలంలో పర్యావరణ కాలుష్యం వల్ల భూమి వేడెక్కుతోంది. ఫలితంగా సముద్ర జలాల మట్టం పెరిగి కిరిబాటీ దీవుల భూగర్భ జలాలు ఉప్పు మయమవుతున్నాయి. ఫలితంగా తాగు నీటి కొరతతో అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ఆఫ్రికాలోని కెన్యా దేశంలో ‘టర్కానా’ సరస్సు ఉంది. అక్కడి ప్రజల ప్రధాన జీవనాధారం పశుపోషణ. పెరుగుతున్న భూతాపం వల్ల ఆ సరస్సు ఎండిపోయి అక్కడ నీటి కొరత ఏర్పడింది. ఫలితంగా చుట్టుపక్కల చెట్లు ఎండిపోతున్నాయి. బతుకుతెరువు కోసం అక్కడి ప్రజలు పశువులను తీసుకొని చుట్టు పక్కల దేశాలకు వలసలు పోతున్నారు.
తాగునీటి వనరులు కలుషితమవుతున్నా, అంతరించిపోతున్నా ఎటువంటి సమస్యలు వస్తాయనడానికి పై రెండూ తాజా ఉదాహరణలు.
ఇప్పటికీ గుక్కెడు మంచినీళ్ల కోసం మైళ్ల కొద్దీ నడచి వెళ్లి ఇంటికి తెచ్చుకునే వారున్నారు. నీటి ఎద్దడి ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల ప్రజలు నేటికీ ఎదుర్కొంటున్న పరిష్కారం కాని సమస్య.
తాగునీరు అంటే కేవలం తాగడానికే కాదు; మన దైనందిన ఇతర అవసరాలకు ఉపయోగ పడే నీరు కూడా.
భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 2002లో భారత రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. అదే సంవత్సరం ఐక్యరాజ్య సమితి(ఐరాస) సదస్సును ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కలాంకు ఆహ్వానం వచ్చింది. ‘‘మై లవ్ లెటర్ టు 2070’’- 2070కి నా ప్రేమలేఖ పేరుతో ఐరాస వేదికపై చేసిన ప్రసంగంలో డా. కలాం 2070 నాటికి పర్యావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో వివరించారు. తన ప్రసంగంలో ఒక చోట ఆయన ఇలా అంటారు: ‘‘ఇప్పుడున్న పర్యావరణ కాలుష్యం ఇలాగే కొనసాగితే 2070 నాటికి ప్రపంచంలోని ఆడవాళ్లంతా శిరోజాలు లేకుండా ఉంటారు. ఎందుకంటే ఆ రకంగా వారానికి ఒకసారి తలస్నానం చెయ్యడానికి అయ్యే నీటి ఖర్చును నివారించవచ్చని!’’
ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది నీటి ఎద్దడి వల్ల ఆహార కొరత, అనారోగ్యం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి నీటి ఎద్దడి కారణంగా గ్లోబల్ జి.డి.పి.కి 8 శాతం నష్టం వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నీటి ఎద్దడికి ముఖ్య కారణాలు
1. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల సకాలంలో వర్షాలు కురవకపోవడం
2. అపరిమితమైన నగరీకరణ
3. బహుళ అంతస్తుల భవనాలలో నివసించే వారి కోసం అదే పనిగా భూగర్భ జలాలను తోడేయడం
4. వ్యవసాయ భూములను వ్యాపార పంటల కోసం అవసరానికి మించి వాడటం. ఆ క్రమంలో అధిక మోతాదులో నీటిని వినియోగించాల్సి వస్తోంది.
5. అడ్డూఅదుపు లేకుండా పెద్ద ఎత్తున పారిశ్రామిక వ్యర్థాలు నదీ జలాలను కలుషితం చేస్తున్నాయి. దీనిపై ఎలాంటి చట్టపరమైన పర్యవేక్షణ, నియంత్రణ లేదు.
6. ఆధునికత బాట పట్టిన ప్రజలు నీటిని ఒక విలాసవస్తువుగా చూస్తున్నారు. పార్కులు, ఖరీదైన రిసార్టులలో సరదా కాలక్షేపం పేరుతో నీళ్లు దుర్వినియోగం అవుతున్నాయి.
నీటి ఎద్దడి ప్రభావం
1. వ్యవసాయోత్పత్తులు తగ్గిపోతాయి. పంట భూములు బీడువారిపోతాయి.
2. ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతారు.
3. ఆహారోత్పత్తులలో సారం తగ్గిపోతుంది.
4. గ్రామాలు దీర్ఘకాలిక కరవుకాటకాలతో ఇబ్బందులు పడతాయి.
5. రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల శిశు మరణాల సంఖ్య పెరుగుతుంది.
6. ప్రపంచంలో పలు దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షో భాన్ని ఎదుర్కొంటాయి.
పరిష్కారాలు
1. భూగర్భ జలాల పెంపుదల దిశగా వర్షపు నీటిని ఆదా చేసేందుకు ఏర్పాట్లు చేయాలి.
2. ఇళ్లల్లో కూడా వర్షపు నీటిని ఆదా చేసే వ్యవస్థను ఏర్పాటు చెయ్యాలి.
3. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు తక్షణ అవసరంగా ట్యాంకర్ల ద్వారా మంచి నీటి సరఫరా చెయ్యాలి.
ప్రభుత్వ ఏర్పాట్లు
1. పైపుల ద్వారా గ్రామాలకు నీటి సరఫరా కోసం ‘‘జల్‌జీవన్’’ పథకం తోడ్పడుతోంది. ఆంధప్రదేశ్‌లో దీనికోసం రూ.630 కోట్లు కేటా యించారు.
2. ‘‘జల్ తారా’’ పథకం ద్వారా భూగర్భ జలాలను వృద్ది చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.
చివరిగా ఒక్క మాట! ప్రాణికోటి మనుగడకు నీరే మూలాధారం. ఈ నీటిపట్ల మన ఆలోచనల్లో సమూలమైన మార్పు రానిదే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది బూడిదలో పన్నీరు పోసిన తీరుగా వృథా ప్రయాసే అవుతుంది.
ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిశోర్