ఎక్కడ చూసినా ఇదే చర్చ.. ధురంధర్ చూశారా?.. చూడలేదా అని సానుభూతిగా చూస్తూ, వెంటనే చూడమని సలహా ఇస్తున్నారు. ఇలాంటి సాహసోపేత చిత్రం ఇప్పటి వరకూ రాలేదని ప్రశంసిస్తున్నారు. ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్థాన్ పరువును ఈ సినిమా తీసిందని అభినందిస్తున్నారు. చిత్రంలో భారత గూఢచారి హమ్జా సాహసంతో పాటు మరోపాత్ర అజయ్ సన్యాల్ నిజంగా ఎవరు? అని చర్చించుకుంటున్నారు. అదే సమయంలో ఇదంతా ప్రాపగాండా సినిమా అంటూ కొందరు తెగ బాధపడుతున్నారు. ధురంధర్, ధురంధర్: ది రివెంజ్ అనే రెండు సినిమాలు పొరుగు దేశం నగ్న స్వరూపాన్ని, మన కుహనా లౌకిక నాయకుల అసలు రూపాన్ని బయట పెట్టాయి. ఇంతకీ ఈ చిత్రంలో ఏముంది?


సినిమా అనేది శక్తిమంతమైన ఆయుధం. కోట్లాది మందిని ప్రభావితం చేసే బలమైన మాధ్యమం. ఎన్నో చిత్రాలు నిశ్శబ్దంగా వచ్చి అలాగే వెళ్లిపోతాయి. చాలా వరకూ చిత్రాలు వినోదానికి పరిమితమైతే, కొన్ని మాత్రం తీవ్రంగా ఆలోచింప జేస్తాయి. తాజాగా ఈ రెండు చిత్రాలు మాత్రం యావద్దేశాన్ని కదిలించేశాయి. ఇంకా చెప్పాలంటే కొందరికి నిద్రలేని రాత్రులను మిగుల్చాయి. మూడు నెలల క్రితం థియేటర్‌లోకి వచ్చే వరకూ ఆ సినిమాను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కొంత కాలంగా కొత్తదనం లేకుండా పోయిన బాలీవుడ్ చిత్రాలను దేశ ప్రజలు బొత్తిగా పట్టించుకోవడం మానేశారు. ఇలాంటి సమయంలో గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైన ధురంధర్ ప్రకంపనలు రేపింది.. ఎక్కడ చూసినా దాని గురించే చర్చ! తేరుకునే లోపే అదే చిత్రానికి రెండో భాగం ధురంధర్: ది రివెంజ్ వచ్చి ఆ ప్రకంపనలను మరింత తీవ్రం చేసింది. యాక్షన్, దేశభక్తి, ప్రతీకారం ఈ మూడు ప్రధాన అంశాలను అద్భుతంగా మేళవించిన ఈ చిత్రం కేవలం వినోదం మాత్రమే కాదు, ప్రేక్షకుల మనసుల్లో గాఢమైన అనుభూతిని మిగిల్చే సినీ ప్రయాణం.

యుద్ధంలో పాకిస్థాన్ మీద భారత్ సాధించిన విజయాలపై ఎన్నో చిత్రాలు వచ్చాయి. ప్రజల్లో దేశభక్తిని తట్టి లేపాయి. ఇప్పుడు యువ దర్శకుడు ఆదిత్యధర్ ఎంచుకున్న కథాంశం కాస్త వైవిధ్యంగా ఉండటం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఓ భారతీయ గూఢచారి మన శత్రు దేశంలోకి వెళ్లి సృష్టించిన విధ్వంసం చర్చనీయాంశంగా మారి పోయింది. దీన్ని కొన్ని వర్గాలు అసలు తట్టుకోలేక పోతున్నాయి. అర్థంపర్థం లేని విమర్శలు గుప్పిం చడంతో ‘ఇంతకీ ఈ సినిమాలో ఏముందో చూద్దాం’ అని చాలా కాలంగా థియేటర్లకు దూరంగా ఉన్న ప్రేక్షకులు కూడా వెళుతున్నారు. భారతీయ సినిమాల మీద పాకిస్థాన్‌లో కొన్నేళ్లుగా నిషేధం ఉంది. అయినా ధురంధర్ చిత్రాన్ని రహస్యంగా చూసేస్తున్నారు అక్కడి ప్రజలు. తమ దేశంలో జరుగుతున్న తతంగం తెరకెక్కడం చూసి పాకిస్థాన్ పాలకులు, అధికారులు తట్టుకోలేకపోతున్నారు. అదే సమయంలో మన దేశంలో లౌకికవాద ముసుగు వేసుకున్న జాతీయవాద వ్యతిరేకులకు, సంతుష్టీకర రాజకీయ నాయకులకు సహజంగానే ధురంధర్ విజయం మింగుడు పడలేదు.

 తెర మీద పచ్చి వాస్తవాలు

‘మా పోరాటం పాకిస్థాన్ మీద కాదు. ఆ దేశం పోషిస్తున్న ఉగ్రవాదుల మీద. ఆ ఉగ్రవాదం వల్ల మాకే కాదు… మీ దేశానికి కూడా నష్టం జరుగు తోంది కదా..’ హీరో నోట వినిపించిన డైలాగ్ ఇది.

ఆదిత్య ధర్ తెర మీదకు తెచ్చిన ధురంధర్ కేవలం ఒక స్పై థ్రిల్లర్‌గా చూడటం దాని ప్రాధాన్య తను తగ్గించినట్లే అవుతుంది. భారతీయ చిత్ర పరిశ్రమ ఎంతో కాలంగా తప్పించుకుంటూ వచ్చిన వాస్తవాలను నేరుగా ప్రశ్నించింది. బాలీవుడ్ సాధారణంగా వాస్తవానికి దూరంగా, పాటలు, భావోద్వేగాలను నిజాలను చూపించదు. అందుకు కారణం ఇస్లామిక్ ఫోబియో.. ధురంధర్ ఆ సంప్రదాయాన్ని బద్దలు కొట్టింది. వినోదం పేరుతో వాస్తవాలను దాచకుండా ఉగ్రవాదాన్ని ఒక ప్రపంచవ్యాప్త సమస్యగా చూపించింది. కొన్ని వర్గాలు దుష్ప్రచారం చేస్తున్నట్లు ఈ చిత్రంలో ఎక్కడా మత ప్రస్తావన లేదు. ఏ మతాన్ని కించపరచలేదు. మా మతం మాత్రమే గొప్పది అని చూపించే ప్రయత్నం చేయలేదు. జాతీయ భద్రతతో ముడిపడిన సున్నిత అంశాలను వాస్తవిక కోణంలో చూపిస్తూ కొందరికి నచ్చినా నచ్చకపోయినా, ఒక చర్చను ప్రారం భించింది.

ధురంధర్ ముస్లింలంతా దుష్టులని చిత్రించ లేదు. పాకిస్థాన్ కేంద్రంగా కొన్ని శక్తులు అధికారం కోసం, డబ్బు కోసం ఎలా పని చేస్తున్నాయనేది ఎత్తి చూపిస్తుంది. ఆ దేశంలో జాతులు, ముఠాల మధ్య జరుగుతున్న ఘర్షణలను తెరకెక్కింది. వీటన్నింటికీ ధురంధర్ సమాధానం కాదు. వాస్తవానికి ఇది ఒక ప్రశ్న. భారతీయ సినిమా వినోదానికే పరిమితమా, వాస్తవాలను వాస్తవికంగా చూపించే ధైర్యం తెచ్చు కుంటుందా అన్న ప్రశ్న. సమస్యను అంగీకరించడమే మొదటి అడుగు. ఆ అడుగే ధురంధర్.

కళ్లకు గంతలు తొలిగాయి

ధురంధర్ చిత్రాన్ని చూసి తట్టుకోలేని వారు ఇదో ప్రాపగాండా చిత్రం అని దుష్ప్రచారం చేస్తున్నారు. వాస్తవాలు చెప్పడం ప్రాపగాండా అవుతుందా? మరి ధురంధర్ ప్రాపగాండా అయితే గతంలో వచ్చిన కొన్ని చిత్రాలను ఏమనాలి? దశాబ్దాల పాటు బాలీవుడ్ పరిశ్రమ ఎవరి కన్నుసన్నల్లో నడిచింది? భారత వ్యతిరేకులు, మాఫియా నీడ నిజం కాదా? హిందీ చిత్ర పరిశ్రమ ఎలాంటి చిత్రాలను నిర్మించిందో గమనించండి. అనేక చిత్రాల్లో భారత సైన్యాన్ని, హిందూ మతాన్ని కించపరచడం లేదా తక్కువ చేసి చూపిస్తూ వచ్చారు. మన దేశం మీదకు ఉగ్రవాదులను పంపుతున్న పాకిస్థాన్‌ను గొప్పగా చూపిస్తూ, కశ్మీర్ వేర్పాటు వాదులను సమర్థిస్తూ కొన్ని చిత్రాలు వచ్చాయి. హిందూ మతం కన్నా ఇస్లాం గొప్పది అనే సందేశాన్ని పరోక్షంగా చొప్పించారు. హిందువులు సాధించిన విజయాలపై నిర్మించిన కొన్ని చిత్రాల్లో పాత్రల పేర్లు మారి పోయి వేరే మతం వారి పేర్లు కనిపిస్తాయి. ఇస్లామోఫోబియా కారణంగా భారతీయ సినిమాలు చాలాకాలం ఉగ్రవాదాన్ని స్పష్టంగా, వాస్తవికంగా చూపించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి తిరగబడింది.

గత దశాబ్దంలో దేశంలో జాతీయవాద భావజాలం బలపడింది. ఆ మార్పు సినిమా పరిశ్రమలోనూ ప్రతిబింబిస్తోంది. కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ, ఉరి, ఆరఆరఆర్, మేజర్ తదితర చిత్రాలు ఈ కోవలోనివే. ఆదిత్యధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర’ ఈ మార్పులో ఒక కీలక మైలు రాయి. ఇది ఉగ్రవాదాన్ని పేరు పెట్టి పిలవడంతో పాటు దాని మూలాలను ప్రశ్నించింది. అదే కారణంగా ఇది ప్రశంసలతో పాటు విమర్శలను కూడా ఎదుర్కొంటోంది. ఈ చిత్రంలో ‘ప్రతి ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ ఉంటుంది’ అని అజయ్ సన్యాల్ పాత్ర చెప్పిన డైలాగ్ కొన్ని వర్గాలకు ఎందుకు ఆందోళన కలిగించిందో మరి.

ధురంధర్ అంటే ఉలుకెందుకు?

ధురంధర్ సహజంగానే కాంగ్రెస్‌తో పాటు కొన్ని పార్టీలకు మంట పుట్టించింది. బీజేపీ ఎజెండా అని కాంగ్రెస్ ఎంపీ తారిఖ్ అన్వర్ దీనిని అభివర్ణించారు. దేశంలో ఒక సమాజానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు ఈ సినిమా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ధురంధర్ అతి జాతీయవాద ప్రచార చిత్రం అని, ఈ బోర్ చిత్రాన్ని చూడటం వృధా అంటూ సూచించారు కాంగ్రెస్ మాజీ ఎంపీ, నటి దివ్య స్పందన. రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, రాజకీయ వాతావరణాన్ని ప్రభావితం చేసేందుకు బీజేపీ, ఆరెస్సెస్ ఎజెండాతో ఈ చిత్రం విడుదల చేశారని ఉదిత్ రాజ్ ఉవాచ! బీజేపీ ఈ చిత్రానికి నిధులు మంజూరు సమకూర్చిం దని రషీద్ అల్వీ ఆరోపించారు. సమాజంలో చీలికలు తెచ్చే ఈ చిత్రాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అనుకూల రచయిత హుస్సేన్ దల్వాయ్.

ధురంధర్ చిత్రాన్ని చూసి సమాజ్ వాదీ పార్టీ ఉలిక్కిపడింది. చిత్రంలో కొన్ని చారిత్రక వాస్తవాలను వక్రీకరించారని, ఇది ఒక వర్గం ప్రజల భావాలను దెబ్బతీసేలా ఉందని ఆరోపించింది. ధురంధర్ చూడటం టైమ్ వేస్ట్ పని అంటున్నారు అసదుద్దీన్ ఓవైసీ. ముస్లిం పాత్రలను చిత్రీకరించిన విధానంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఒక వర్గాన్ని తప్పుగా చూపించే ధోరణి సినిమాల్లో పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక నిత్యం జాతీయవాదం, ప్రధాని మోదీ మీద పనిగట్టుకొని విమర్శలు చేసే కొందరు యూట్యూర్లు ధురంధర్ మీద సహజంగానే విషం కక్కారు. ఈ చిత్రం ప్రమాదకర ప్రాపగాండా అంటూ ధ్రువ్ రాఠీ విరుచుకుపడ్డారు. నిజమైన సంఘటనలను వక్రీకరించిందని, రెండో భాగం మరింత బహిరం గంగా బీజేపీ రాజకీయ ఎజెండాను ప్రమోట్ చేస్తోందని విమర్శించారు. ధురంధర్ విపరీతమైన జాతీయవాదం ప్రమోట్ చేసిందని సుచిత్ర త్యాగి ఆరోపిస్తే, కేఆర్కే జీరో స్టార్ రేటింగ్ ఇచ్చారు. కానీ విచిత్రంగా వీరి విమర్శలు ధురంధర్‌ను మరింత మంది చూసేలా చేశాయి.

భుజాలు తడుముకున్నారా?

అసలు కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు ధురంధర్ చిత్రాన్ని చూసి ఎందుకు భయపడ్డాయి? ఇందుకు సమాధానం ఈ చిత్రం కోసం ఎంచుకున్న కొన్ని వాస్తవ ఘటనలు అని చెబుతున్నారు. ముఖ్యంగా యూపీఏ ప్రభుత్వం కపటత్వాన్ని ధురంధర్ ఎండగట్టింది. ముంబై మీద ఉగ్రవాదుల దాడి తర్వాత కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన మెతక వైఖరి, పైగా హిందువులను ఉగ్రవాదులుగా చూపించే ప్రయత్నం విమర్శలకు దారి తీసింది. ముఖ్యంగా ఆనాడు అధికారంలో ఉన్న నాయకులకు నకిలీ కరెన్సీ వ్యవహారంతో ఉన్న సంబంధాలను ధురంధర్ బయటపెట్టి, పరోక్షంగా ఇరకాటంలో పడేసింది.

పాకిస్థాన్ మన దేశంలోకి నకిలీ భారత కరెన్సీని ముద్రించి పంపేందుకు చేసిన కుట్రను ధురంధర్ చూపించింది. చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో కరెన్సీ నోట్ల ముద్రణ కోసం భారత్, పాకిస్థాన్‌లకు ఒకే సంస్థ కాగితాన్ని సరఫరా చేయడం తెలిసిందే. నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాకిస్థాన్ మన దేశంలోకి అక్రమ మార్గంలో పంపేందుకు పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీని ముద్రించడం తెలిసిపోయింది. వెంటనే పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ధురంధర్ చిత్రంలో ఇదంతా చూడొచ్చు. ధురంధర్‌లో కనిపించిన మరో పాత్ర అతీఫ్ అహ్మద్. ఈ పాత్ర అచ్చం సమాజ్ వాదీ పార్టీ మాజీ ఎంపీ అఫ్జల్ అన్సారీని పోలి ఉంది. ఐఎసఐతో సంబంధాలున్న ఈ వ్యక్తి 2023లో హత్యకు గురయ్యాయి. ఈ పాత్రను చూసి సమాజ్ వాదీ పార్టీ భుజాలు తడుముకోక తప్పలేదు

చిత్ర పరిశ్రమ ఏమంటోంది?

భారతీయ చిత్ర పరిశ్రమను కుదిపేసిన ధురంధర్ రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టింది. మొదటి భాగం ప్రపంచ వ్యాప్తంగా రూ.1,300 కోట్ల గ్రాస్‌ను వసూలు చేయగా, రెండో భాగం ఇప్పటి వరకూ రూ.1,365 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అతి సునాయాసంగా ఈ సినిమా రెండు వేల కోట్ల క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే బాలీవుడ్ నుంచి ధురంధర్‌కు మిశ్రమ స్పందన వ్యక్తం కావడం చర్చనీయాంశంగా మారింది. ఇది సినిమా అనడం కంటే ఒక గొప్ప అనుభూతిగా అభివర్ణించారు రామ్‌గోపాల్ వర్మ. ఫిల్మ్ మేకింగ్‌ను, రణ్‌వీర్ నటనను ప్రశంసించారు కరణ్ జోహార్, సిద్ధార్థ్ ఆనంద్. ఈ చిత్రంలోని దేశభక్తిని కొనియాడారు అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్, బోమన్ ఇరాన్, రాణీ ముఖర్జీ, హృతిక్ రోషన్.

కాగా బాలీవుడ్ ‘ఖాన్ త్రయం’ ఏమంటున్నా రన్నదే అందరూ గమనించారు. తాను ధురంధర్ చూడకున్నా, అద్భుత విజయంపై అభినందిస్తున్నాన న్నారు అమీర్ ఖాన్. అయితే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ స్పందించకపోవడం చర్చనీయాంశమైంది. ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా అని రజనీకాంత్ వ్యాఖ్యానించారు.

అయితే టాలీవుడ్ మాత్రం ధురంధర్ మీద నిష్పాక్షికంగా ప్రశంసలు కురిపించింది. అక్కినేని నాగార్జున, ఎస్.ఎస్. రాజమౌళి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ తమ అభినందనలు తెలిపారు. కాగా తెలుగు చిత్ర పరిశ్రమ ధురంధర్‌ను ప్రశంసిం చడం చూసి ప్రకాశ్ రాజ్ తట్టుకోలేక పోయారు. ఈ సినిమాను కేవలం ఒక వర్గం ప్రయోజనాల కోసం తీసిన ప్రచార చిత్రంగా ఆయన అభివర్ణిం చారు.

ధురంధర్ చిత్రాన్ని ప్రశంసించిన వారిని కొన్ని వర్గాలు వేధించడం మొదలు పెట్టాయి. ఈ చిత్రాన్ని మెచ్చుకున్నందుకు సోషల్ మీడియాలో కొందరు తనను లక్ష్యం చేసుకున్నారని ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తెలిపారు. ఒక చిత్ర నిర్మాతగా ఆదిత్య ధర్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందేనని అన్నారు

పాకిస్థాన్‌ను వణికిస్తున్న ధురంధర్

ధురంధర్ పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కలవర పెడుతోంది. తమ దేశంలో నిజంగానే భారత ఏజెంట్లు ఉన్నారేమోనన్న అనుమానంతో పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. వీధుల్లో భిక్షాటన చేస్తున్న వాళ్లని, అనుమానాస్పదంగా తిరుగుతున్న వాళ్లని పట్టుకుని విచారణ చేస్తున్నారు. భారత్‌కు ఏమైనా సమాచారం పంపారా అని నిలదీస్తున్నారు. ముఖ్యంగా సైనిక స్థావరాలు, ప్రభుత్వ కార్యాలయాల దగ్గర కనిపించే ప్రతి ఒక్కరినీ అనుమానిస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా యాచకుల ఐడెంటిటీ కార్డులను తనిఖీ చేస్తున్నారు.

పాకిస్థాన్ భయానికి ముఖ్య కారణం భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గతంలో గూఢచారిగా పని చేశారు. తన కెరీర్ ఆరంభంలో దాదాపు ఏడేళ్ల పాటు పాకిస్థాన్‌లో ఉన్నారు. దీంతో పాకిస్థాన్ అధికారుల్లో వణుకు మొదలైంది. తమ రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకు భారత్ మళ్లీ ఇలాంటి వ్యూహాన్ని అనుసరిస్తోందా అనే దానిపై అక్కడ ఆందోళనలు మొదలయ్యాయి.

మరోవైపు ధురంధర్ పాకిస్థాన్ కు వ్యతిరేకంగా తీశారంటూ మన దేశంలోని సో కాల్డ్ లౌకికవాదులు చిటపటలాడుతుంటే అక్కడి జనాలు మాత్రం ఈ చిత్రాన్ని తెగ ప్రేమిస్తున్నారు. ఈ చిత్రంలో చూపిం చిన దృశ్యాలు నిజ జీవితానికి దగ్గరగా ఉన్నాయని వారంటున్నారు. కరాచీలోని ల్యారీ రాజకీయాలు, నేరాలు ఉన్నది ఉన్నట్లుగా చూపించారే తప్ప, తమను చెడుగా చూపలేదని అక్కడి జనం మెచ్చుకుంటు న్నారు. సినిమాను మళ్లీ మళ్లీ చూస్తామని చెప్తున్నారు. ఈ అభిప్రాయాలు దేశ గూఢచార సంస్థలకు, పోలీసులకు చెమటలు పట్టిస్తున్నాయి. నిజానికి ధురంధర్ సినిమా పాకిస్థాన్ థియేటర్లలో విడుదల కాలేదు. అయితే ప్రపంచ వ్యాప్తంగా ధురంధర్ రిలీజ్ అయిన ఎనిమిది వారాల తర్వాత జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ మొదలైంది. దాంతో పాకిస్థానీలు ఆ సినిమాను చూసే అవకాశం ఏర్పడింది. దాంతో అలా వచ్చిన కొన్ని రోజుల్లోనే మిగతా సినిమాలన్నింటినీ దాటేసి అగ్రస్థానానికి ధురంధర్ చేరింది. మరోవైపు ఈ సినిమా పైరసీ సీడీలు కూడా అక్కడ విపరీతంగా అమ్ముతున్నారు. నేనేం కొన్నానో చూడండి అంటూ ఓ యూట్యూబర్ తాను కొన్న సీడీ చూపించాడు.

ధురంధర్ కథాంశం ఏమిటి?

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన రహస్య గూఢచార నేపథ్య చిత్రాలు ధురంధర్, ధురంధర్: ది రివేంజ్. పాకిస్థాన్ లోని ఉగ్రవాద సంస్థల్ని మూలాలతో సహా పెకిలించి.. అంత మొందించేందుకు భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చేపట్టిన రహస్య ఆపరేషన్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.

1999 డిసెంబర్ 30 నాడు జరిగిన భారతీయ విమాన హైజాక్, 2001 డిసెంబర్ 13 నాటి భారత పార్లమెంటుపై ఉగ్రవాదుల దాడి తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యాన్ని కథాంశంగా తీసుకున్నారు. హైజాక్ చేసిన విమానాన్ని కాందహార్ ఎయిర్‌పోర్ట్ తీసుకెళ్లిన ఉగ్రవాదులు భారత దేశాన్ని కించపరచడం ఇంటెలిజన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ (మాధవన్)కు ఆగ్రహం తెప్పిస్తుంది. అప్పుడే పాకిస్థాన్‌లోకి వెళ్లి అక్కడున్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ‘ధురంధర’ అనే మిషన్ పురుడు పోసుకుంటుంది. పార్లమెంటు మీద దాడి ఘటన తర్వాత ధురంధర్ ఆపరేషన్ అమలులో పెడతారు.

పంజాబ్‌లోని జస్కరీత్ సింగ్ రంగీ (రణ్‌వీర్ సింగ్) తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుని మరణశిక్ష పడటం, ఆపై భారత గూఢచార సంస్థ రా అతన్ని రిక్రూట్ చేసుకోవడం వంటి సన్నివేశాలు ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతాయి. హమ్జా అలీ మజారీ పేరుతో పాకిస్థాన్ లోకి ప్రవేశించిన ఆ యువకుడు కరాచీలోని ల్యారీ ప్రాంతంలో అండర్ వరల్డ్ డాన్ రహమాన్ డకాయిట్ (అక్షయ్ ఖన్నా)కు దగ్గరవుతాడు.

ఎస్పీ అస్లాం చౌధురి (సంజయ్ దత్) అరాచకాలు, ఐఎస్ ఐ చీఫ్ మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) వ్యూహాలు స్థానిక రాజకీయ నాయకుడు జమీల్ జమాలి (రాకేష్ బేడి) ఎత్తగడలు, ఆయన కూతురు యెలినా జమాలి (సారా అర్జున్) హమ్జా అలీతో జరిపే ప్రేమాయణంతో ఆసక్తి రేగుతుంది. వీరందరితో మానసిక యుద్ధం చేస్తూ రహమాన్ డెకాయిట్ హత్య తర్వాత తానే డాన్ అయిపోతాడు హమ్జా. ముఖ్యంగా 26/11 దాడుల తర్వాత హమ్జాలో కలిగిన పరివర్తన, ఉగ్రవాద మూలాలను పెకిలించాలనే అతని సంకల్పం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. తన సొంత దేశం కోసం కన్నతల్లిని, సోదరిని వదులుకుని పరాయి దేశంలో గూఢచారిగా బతకడంలోని బాధను రణవీర్ తన నటనతో పండించారు.

ఇక తాజాగా వచ్చిన ధురంధర్ రెండో భాగం (రివెంజ్)లో హమ్జా విశ్వరూపం కనిపిస్తుంది. ఈ చిత్రం అంతటా ‘బడే సాబ’ ఎవరు అనే ఉత్కంఠ కొనసాగుతుంది. దావూద్ ఇబ్రహీం ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో చూపించారు. భారత ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత పెద్దనోట్లను రద్దు చేయడంతో ఉగ్రవాదులకు జరిగిన నష్టం, వారి శిక్షణా శిబిరాలను హమ్జా ధ్వంసం చేయడం ప్రేక్షకు లను ఉత్కంఠకు గురి చేస్తాయి. చివరకు హమ్జా భారత్ ఏజెంట్ అని తెలిసిన తర్వాత ఏం జరిగింది, ఆయన ఎలా తప్పించుకున్నాడు అనేది క్లైమాక్స్.

దర్శకుడు ఆదిత్యధర్ కథాంశాన్ని రెండు చిత్రాలుగా, పలు చాప్టర్లుగా చూపించారు. ధురంధర్ ఒక్కో భాగం మూడున్నర గంటలకు పైగా రూపొం దించినా ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకపోవడం మరో విశేషం. కాగా కథలో భాగమైన హత్యలు, నరికివేతలు, పేలుళ్లు, రక్తం చిమ్మడం కాస్త ఇబ్బంది కరంగా అనిపించవచ్చు. భారత గూఢచారి రవీంద్ర కౌశిక్ ప్రేరణతో హమ్జా పాత్రను రూపొందించారు. అయితే ధురంధర్ కల్పిత కథ అని దర్శకుడు వివరణ ఇచ్చారు.

క్రికెటర్ కాబోయి డైరెక్టర్

డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని సినీ పరిశ్రమలో చెప్పుకోవడం వినే ఉంటాం.. జీవితంలో ఏదో సాధించాలనుకుంటే ఇంకో పనిలో సత్తా చాటుకునేవారుంటారు. ధురంధర్ డైరెక్టర్ ఆదిత్య ధర్ అలాంటి వాడే. క్రికెటర్ కావాల్సిన ఇతడు సినీ డైరెక్టర్‌గా పెద్ద హిట్టే కొట్టాడు. కశ్మీర్ పండిట్ కుటుంబానికి చెందిన ఆదిత్య ధర్ క్రికెటర్ మీద మోజుతో ఢిల్లీ అండర్-19 టీమ్ తరఫున ఆడాడు. క్రికెట్‌లోని రాజకీయాల కారణంగా 2002లో భారత అండర్-19 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదు. దీంతో ఆ ఆటనే పక్కన పెట్టి ఆదిత్య ధర్ రచయిత అవతారం ఎత్తాడు. 2006లో వచ్చిన కాబుల్ ఎక్స్‌ప్రెస్‌కు పాటలు రాశాడు. తర్వాత హాల్ ఏ దిల్, ఆక్రోష్, తేజ్ తదితర చిత్రాలకు పని చేశాడు. అనంతరం సినీ దర్శకునిగా మారాడు. దర్శకునిగా 2019లో తీసిన తొలి చిత్రం ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక’తో ఆయన పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. అదే ఏడాది తన సోదరుడితో కలిసి బీ 62 స్టూడి యోస్ స్థాపించిన ఆదిత్య ధర్.. నటి యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఆర్టికల్ 370’ సినిమాను నిర్మించి, రచయితగానూ పనిచేసి విజయం సాధించాడు. ‘ఉరి`ది సర్జికల్ స్ట్రైక్ù’ తీస్తున్న టైంలోనే అందులో నటించిన యామీ గౌతమ్‌తో ప్రేమలో పడ్డ ఆదిత్య 2021లో పెళ్లి చేసుకున్నాడు. 2025 డిసెంబరు 5న ‘ధురంధర’ విడుదల కాగా, దాని రెండో భాగం 2026 మార్చి 19న రిలీజైంది. మూడు నెలల వ్యవథిలో వచ్చిన ఈ రెండు చిత్రాలు భారతీయ సినీ పరిశ్రమ చరిత్రను తిరగ రాశాయి.


అజిత్ దోవల్ పాత్రేనా అది?

ధురంధర్‌లో నటుడు మాధవన్ పోషించిన అజయ్ సన్యాల్ పాత్ర తెర మీద కనిపించగానే ప్రేక్షకులు ఒక్కసారిగా ఈలలు వేసి కేరింతలు కొడుతున్నారు. ఆ పాత్రను చూడగానే అందరికీ గుర్తుకు వచ్చేది ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. ఆయన గతంలో అత్యంత రహస్య నిఘా కార్యకలాపాలు నిర్వహించిన అధికారి. ఇందు కోసం పాకిస్థాన్‌లో 7 ఏళ్లు బిచ్చగాడిగా నటిస్తూ కీలక సమాచారాన్ని సేకరించారు. పాకిస్థాన్ అణు కార్యక్రమాన్ని పసిగట్టి భారత్‌కు సమాచారం చేరవేశారు. ఈ సమాచారంతో భారత్ తన జాతీయ భద్రతా వ్యూహాన్ని మార్చుకుంది. దోవల్ వల్ల పాకిస్థాన్ అణు సామర్థ్య పరీక్షలు దాదాపు 15 ఏళ్లు ఆలస్యమయ్యాయి. అజిత్ దోవల్ కాందహార్ హైజాకింగ్ (1999), 46 మంది భారతీయ నర్సులను కాపాడటం వంటి అనేక సున్నితమైన ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించారు. ఇప్పటికీ 81 ఏళ్ల వయసులోనూ దేశం కోసం సేవలు అందిస్తు న్నారు. ప్రస్తుతం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ప్రేక్షకులు అసలైన ధురంధరుడు అజిత్ దోవల్ అంటున్నారు. ఆయనను భారత ‘జేమ్స్ బాండ’ అని కూడా పిలుస్తుంటారు.


‘బ్లాక్ టైగర’ రవీంద్ర కౌశిక్

వెండి తెర మీద ధురంధర్ చిత్రం రెండు భాగాలు చూసిన తర్వాత రవీంద్ర కౌశిక్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఇంతకీ ఎవరీ వ్యక్తి, ధురంధర్‌తో పోలిక ఏమిటి అనే చర్చ జరుగు తోంది. పాకిస్థాన్ అసలు రూపాన్ని ప్రపంచానికి చూపించింది ధురంధర్ చిత్రం. కానీ మనం తెర మీద చూడని వ్యక్తే రవీంద్ర కౌశిక్. భారత గూఢచారిగా పాకిస్థాన్ సైన్యంలోకి చొరబడి, దశాబ్ద కాలం పాటు భారత్‌కు కీలక సమాచారాన్ని అందించిన వీరుడు ఆయన. నాటి ప్రధాని ఇందిరా గాంధీ చేత ‘బ్లాక్ టైగర’ అని పిలిపించుకున్న రహస్య సైనికుడి జీవితం చివరకు విషాదకరంగా ముగిసింది.

రవీంద్ర కౌశిక్ 1952లో రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో జన్మించారు. చిన్నప్పటి నుంచే నాటకాలంటే ఇష్టపడే వారు. ఆయన 1973లో లక్నోలో జరిగిన ఒక జాతీయ స్థాయి నాటక పోటీలో, శత్రువుల చిత్రహింసలను ఎదుర్కొనే భారత సైనికుడిగా చేసిన నటన భారత నిఘా విభాగం ‘రా’ అధికారులను ఆకర్షించింది. రవీంద్ర కౌశిక్ భాషా ప్రావీణ్యం, మానసిక దృఢత్వాన్ని గుర్తించిన ఇంటెలిజెన్స్ వర్గాలు, దేశం కోసం ఒక అత్యంత ప్రమాదకరమైన మిషన్‌ను ఆయనకు అప్పగించాయి. రెండేళ్ల కఠిన శిక్షణ తర్వాత రవీంద్ర కౌశిక్ తన గతాన్ని పూర్తిగా చెరిపేసుకున్నారు. ఉర్దూ భాష, ఇస్లామిక్ ఆచారాలు నేర్చుకుని ‘నబీ అహ్మద్ షకీర’గా మారి 23 ఏళ్ల వయసులో పాకిస్థాన్‌లోకి అడుగు పెట్టారు. కరాచీ యూనివర్సిటీలో లా పూర్తి చేసి, పాకిస్థాన్ సైన్యంలో చేరిపోయారు. తన తెలివితేట లతో మిలిటరీ అకౌంట్స్ విభాగంలో మేజర్ స్థాయికి ఎదిగారు. స్థానిక మహిళ అమానత్‌ను వివాహం చేసుకుని ఒక బిడ్డకు తండ్రి కూడా అయ్యారు.

 కౌశిక్ 1979 – 1983 మధ్య మన దేశానికి పంపిన సమాచారం అత్యంత విలువైంది. పాకిస్థాన్ సైనిక మోహరింపులు, వ్యూహాలు, రహస్య అణు కేంద్రమైన ‘కహూటా’కు సంబంధించిన సమాచారాన్ని భారత్‌కు చేరవేశారు. రవీంద్ర సేవలకు ముగ్ధురాలైన నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఆయనకు ‘బ్లాక్ టైగర’ అనే బిరుదును ఇచ్చి గౌరవించారు. ఒక గూఢచారికి అప్పట్లో లభించిన అత్యున్నత గౌరవం అది. దురదృష్టవశాత్తు 1983లో భారత్ పంపిన మరో ఏజెంట్ పొరపాటు పాకిస్థాన్ సైన్యానికి దొరికిపోయాడు. అతని ద్వారా రవీంద్ర కౌశిక్ అసలు నిజం తెలిసిపోయింది. దీంతో పాకిస్థాన్ సైన్యం ఆయనను అరెస్ట్ చేసి సియాల్‌కోట్, కోట్ లఖ్‌పత్ జైళ్లలో ఉంచి దారుణంగా హింసించారు. ఎన్ని చిత్రహింసలు పెట్టినా కౌశిక్ నోరు విప్పలేదు. 16 ఏళ్ల పాటు చీకటి గదుల్లో నరకం అనుభవించిన కౌశిక్, జైలు నుంచి తన కుటుంబానికి రాసిన లేఖలు కన్నీళ్లు తెప్పిస్తాయి.

భారత దేశం కోసం త్యాగాలు చేసే వారికి చివరకు లభించేది ఇదేనా? అని రవీంద్ర కౌశిక్ ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రమైన క్షయ వ్యాధి, గుండె జబ్బుతో బాధపడుతూ 2001 నవంబర్ 21న పాకిస్థాన్‌లోని మియాన్వాలీ జైలులో రవీంద్ర కౌశిక్ తుదిశ్వాస విడిచారు. అలాంటి అజ్ఞాత గూఢచారులకు ‘ధురంధర’ సినిమా గొప్ప నివాళిగా భావించొచ్చు.

– క్రాంతిదేవ్ మిత్ర

సీనియర్ జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE