‘భూమి’ అనేది తెలుగులో రెండక్షరాలే కానీ, వాస్తవంలో అనంతం. మొదలూ తుది తెలియనంత అపారం. జగజ్జేత అనేదీ నాలుగక్షరాలే అయినా అంతా శక్తి సంపన్నం. ఎందులోనైనా ఛాంపియన్లు ఉండవచ్చునేమో… భూతలానికైతే ఉంటారా? ఉండరు గాక ఉండరు. మరి ఇదే నేలమీద ఉన్న మూగప్రాణులు అదీ… చిట్టిపొట్టి పిట్టలకోసం ఒక వ్యక్తి ఓ సైన్యాన్ని తయారు చేస్తే! అరుదైన వాటిని కంటికిరెప్పలా కాపాడేందుకు తన జీవితాన్నే అంకితం చేస్తే!! ఛాంప్‌ అని ఎందుకు అనకూడదు? ఈ ప్రశ్నే వేసింది ఐక్యరాజ్యసమితి (ఐరాస). సమాధానాన్నీ తానే ప్రకటించింది అవార్డుల రూపంలో.

ఆ విజేతల్లో ఒకరైన పూర్ణిమాదేవి మన భారతీయురాలు. పవిత్ర బ్రహ్మపుత్ర నదీ ప్రాంతమైన అసోంలోని గ్రామీణురాలు. తన భావ ప్రభావాలతో వేలాది పక్షి ప్రేమికులను ఒకే తాటిపై నడిపిస్తున్న లలనామణి. ప్రకృతి వరప్రసాదాల పరిరక్షణి.

ఎప్పుడు కలకలా కిలకిలా నవ్వుతుండటమే పూర్ణిమకు తెలుసు. అంతర్జాతీయ వనితా దినోత్సవం సందర్భంగా నాలుగేళ్ల క్రితం మన రాష్ట్రపతి నుంచి ‘నారీశక్తి’ పురస్కారం అందుకున్న సంగతి విదితమే. అదే సంవత్సరంలో యునైటెడ్‌ ‌కింగ్‌డమ్‌ ‌నుంచి ఆమెకు ‘గ్రీన్‌ ఆస్కార్‌ ‌పురస్కారం’ కూడా ప్రకటితమైంది. ప్రతిష్టాత్మక విట్లే అవార్డు అన్నా అదే. ఐరాస కార్యాచరణలో భాగంగా భారత జీవవైవిధ్య పురస్కృతినీ సొంతం చేసుకున్నారు. రాయల్‌ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ‌స్కాట్లాండ్‌ ఆమెను ‘ఎర్త్ ‌హీరోయిన్‌’‌గా అభివర్ణించింది. గ్రీన్‌గురు, మహిళా సాధకురాలు లాంటి మరెన్నో అభివర్ణనలు, సన్మాన పరంపరలూ ముంచెత్తాయి. వీటన్నింటితోపాటు ప్రాంతీయ, జాతీయ అంతర్జాతీయ స్థాయుల్లో వరించిన బహుమానాలు పెద్ద సంఖ్యలో ఆమె ఇంట్లో, కార్యాలయ ప్రాంగణంలో ప్రత్యక్షమవుతుంటాయి. వీటన్నిటిలో కలికితురాయి అనేలా, ఐరాస ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం కింద వ్యవస్థాపక కేటగిరీలో ఈ ఏడాది మేటి గౌరవమూ ఆమెకే దక్కింది. ఎన్నెన్ని విజయాలు ఆమెను శిఖరంపైన నిలిపినా ఆమె చూపులు మాత్రం ‘హర్గిల’ (అక్కడి పరిభాషలో హర్గిల అంటే కొంగ) వైపే! ఎందుకో! అవి ఏమిటో తెలుసుకుందాం ఇప్పుడు.

కరుణ ప్రసరణ

అసలు పూర్ణిమ ఊళ్లోనే పక్షుల విహారం ఎక్కువ. చిన్నప్పటి నుంచీ వాటిని చూస్తూనే పెరిగింది. ఇంటి నుంచి పొలం పనికి వెళ్లిన ప్రతిసారీ వాటి కోసమే ఆకాశంవైపు చూస్తూండేది. కేవలం చూపులతోనే ఆగిపోలేదు. ప్రాణుల (జలచరాల, గగన విహారాల) తీరుతెన్నులను రోజంతా పరిశీలించేలా చేశాయి. ఆ శాస్త్రమే చదువుకుని పట్టభద్రులయ్యారు. అవే అంశాలపరంగా పరిశోధనకీ సంసిద్ధులయ్యారు. ప్రధానంగా ఒక తరహా కొంగలకు సంబంధించే ప్రత్యేక ఆసక్తి. అందునా అవి అరుదుగా కనిపించేవి. కాలక్రమంలో ఆ జాతి కనుమరుగవుతుందన్న నిజం ఆమెకు నిద్ర పట్టకుండా చేసింది. ఏ విధంగానైనా వాటిని కాపాడి తీరాలన్న పట్టుదల. ఊళ్లకు ఊళ్లు పెరిగిపోతున్నాయి. ఆకాశాన్ని తాకేలా భవనాలు లేస్తున్నాయి. ఎటుచూసినా బిగింపు వాతావరణమే! కొంగల స్వేచ్ఛాయుత జీవనం ఇంకెక్కడ? జనంలో కొంతమందికైతే పక్షులంటేనే పడదు. అవంటే లెక్కే ఉండదు. అవి కనిపిస్తేనే ఏదేదో ఊహించుకుని దూరం తొలగిపోయే వారున్నారు. వాటిని తాకితేనే జబ్బులొస్తాయని భ్రమపడే ఆలోచనలు మరికొందరివి. ఇంకా మరెన్నో కారణాలు కొంగల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. కాలగతిలో అంతరించేలా ‘పుణ్యం’ కట్టుకుంటున్నాయి. ఇదంతా చూస్తుంటే పూర్ణిమకు దుఃఖం పొర్లుకొచ్చేది. ఏదైనా చేసి ఆ కొంగల్ని కాపాడాలని బలంగా అనిపించేది.

గూడు కట్టి, ఊతమిచ్చి….

అంతటితో ఇల్లొదిలి ఇవతల కొచ్చిందామె. ఊరూ ఊరూ వెళ్లి చూసింది. అక్కడి వారితో…ప్రత్యేకించి ఆడవారితో పరిచయాలు పెంచుకుంది. పక్షుల సంరక్షణ అనే సరికి కొంతమంది నవ్వి ఊరుకునేవారు. మరికొందరు ‘వాటి సంగతి మాకెందుకూ’ అంటుండేవారు. ‘ఏమిటీ మాటలు’ అన్నట్లు ఇంకొందరు వింతగా చూసేవారు. ఎవరు ఎలా స్పందించినా పూర్ణిమ నిరాశ పడలేదు. రెట్టించిన ఆత్మ విశ్వాసంతో ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి కథలుగా చెప్పేది. ‘కొంగలే కదా అనుకోవద్దు.అవీ మనలాంటి ప్రాణమున్నజీవులేగా. పాపం…. అంతరించి పోతున్నాయి. మనం కలసికట్టుగా వాటన్నింటినీ పదిలంగా చూసుకుందాం. ఆ పక్షులంటూ ఉంటే, సంచరిస్తుంటే, ప్రకృతికి అందం, ఆనందం. ఇంత పెద్ద వాళ్లం అంత చిన్నవాటిని జాగ్రత్తగా చూసుకోలేమా…’అని వివరించి చెప్పడంతో కొద్దిమందిలో మార్పు కనిపించింది. అదిగో, అదే ఆమెను ముందుకు నడపింది. ఆ ఐరాస కార్యాచరణలో భాగంగా అరుదైన జీవాల ప్రాణాలు నిలవాలంటే ఆహారం, గూడు ఉండాలి. భద్రంగా ఒకచోట ఉండేలా చేస్తే, వాటి నివాసానికి ఆలంబన ఏర్పరిస్తే చాలని కార్యకర్తలంతా నిశ్చయించుకున్నారు. కొంగల గూళ్ల ఏర్పాటుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తూ వచ్చారు. హర్గిలను పరిరక్షించే వారు కనుక వారిని ‘హర్గిల ఆర్మీ’ అంటారు. వారంతా ఊళ్లలో గూళ్లు నిర్మించసాగారు. కొద్దిగా మొదలైనవి వేలకు విస్తరించాయి. మొదట ఉదాసీనంగా ఉన్న వ్యక్తులే ఆ తర్వాత ఉత్సాహంగా ముందుకొచ్చారు.

విస్తార సేవ

గాలిలో విహరించే కొంగలకు నేలమీద వెదురుబొంగులపైన ఉండే గూళ్లు కనిపించాయి. అవే వాటి నివాసాలుగా మారుతూ వచ్చి, భద్రతను సమకూర్చాయి. కాం గడుస్తున్నకొద్దీ సంతానోత్పత్తి తదితర దశకు చేరాయి.ఒకప్పుడు నిలువనీడే కరవైన వాటికి ఆ తోడు కల్పించడమే పూర్ణిమసేన ఘనత.అయితే ‘ఘనత’ అంటే మాత్రం ఒప్పుకోరు. ‘చేయాల్సినవే చేస్తున్నాం. నాతోపాటు మరికొంతమంది కలిసొచ్చి ఆ జీవాలకు తోడూనీడా అందిస్తున్నారు అంతే.. ఇది మానవత’ అంటారు వినయం ఉట్టిపడేలా. కొంతమంది అంటారే కానీ ఊరూరా ఎందరో విస్తరించారు. బృందాలుగా కదిలారు. ఆ ప్రాణి సంరక్షణకే పరిమితం చెట్ల నరికివేత ఎంత అనర్థమో, అది చిన్ని ప్రాణులకి అది ఎంత కీడు చేస్తుందో గ్రామ గ్రామాన విశదీకరించిదా ‘సేన’. పిట్టలు చేరని చెట్లు ఏ సంస్కృతికి నిదర్శనం? అని సూటిగా ప్రశ్నించింది. వనితా బృందాల ఉమ్మడి కృషి అసాధారణ ఫలితాల నిచ్చింది.

గుహవాటి విశ్వవిద్యాలయంలోవన్యప్రాణి శాస్త్రాన్ని అభ్యసించిన పూర్ణిమ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ ‘అరణ్యాయన్‌’ ‌నేతగా అద్భుతాలనే సృష్టించారు. పరిసరాల పరిరక్షక వనితా బృందం సంచాలకురాలిగా అనేక కార్యక్రమాలను చేపట్టి ఫలప్రదం చేయగలిగారు. గ్రామీణులను చైతన్య వంతం చేశారు. పట్టణ వాసుల ఆలోచనలకు మెరుగులు దిద్దారు. వన్యప్రాణాల్ని కాపాడు కోవాల్సిన అత్యవసరాన్ని వీధి నాటకాలు, ప్రదర్శ నలు, ప్రసంగాల ద్వారా జనావళికి విపులీకరిం చారు. చెట్లమీద గూళ్ల ఏర్పాటుకు ముందుకొచ్చిన ప్రాంతీయులు, కార్యకర్తలకు ప్రోత్సాకాలందిం చారు. ప్రభుత్వ ఉన్నతాధికారులను ఆహ్వానించి సందేశాలిప్పించి, ప్రజలందరినీ కార్యోన్ముఖులుగా రూపుదిద్దారు. సంబంధిత అటవీ, పోలీసుశాఖల సహాయ సహకారాలతో ఒక ప్రజా ఉద్యమంగా మలిచారు పూర్ణిమదేవి బర్మన్‌.

అన్నీ తానైన వనిత

సీనియర్‌ ‌ప్రాజెక్టు మేనేజరుగా, సేవాసంస్థ నిర్వాహక ప్రముఖురాలిగా, కార్యక్రమాల సమన్వయకర్తగా, ప్రకృతి ప్రేమిక సంస్థకు అన్నీ తానుగా ఆమె బహుముఖ పాత్ర నిర్వర్తించారు. ‘హర్గిలసేన’ వ్యవస్థాపకురాలిగా, పరిశోధక వేత్తగా, అంతకు మించి బాధ్యతాయుత పౌరురాలిగా విధుల నిర్వహించి శభాష్‌ అనిపించుకున్నారు. ఇంత చేసినా ఏనాడూ విశ్రాంతి కోరుకోలేదు. ఎప్పుడూ వన్య ప్రాణుల ఛాయాచిత్రాలు తీస్తూనో, వాటి పరిరక్షణ ప్రాముఖ్యాన్ని ఇతరులకు వివరిస్తూనో, పర్యటనలు కొనసాగిస్తూనో ఉంటారు. వ్యక్తిగత సమాచారం కన్నా సంస్థాగత వివరాలు తెలియజేసేందుకే ఇష్టపడుతుంటారు. పిల్లల మొదలు పెద్దల దాకా అన్ని వయసుల వారికీ పర్యావరణ సంరక్షణ గురించి తెలియజేస్తూ కనిపిస్తుంటారు. ఆమె సాగించినన్ని సందర్శనలు, చదివినన్ని పుస్తకాలు, చేసినన్ని పరిశోధనలు, నిర్వహించినన్ని వైవిధ్య కార్యక్రమాలు మరెవ్వరూ చేపట్టలేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. అసోంలోని మారుమూల గ్రామ ప్రాంతంలో మొదలైన యోచన అంతర్జాతీయ స్థాయికి విస్తృతమై ‘ఛాంపియన్‌’ అని పిలిపించిందంటే, అంతకంటే ఇంకేం కావాలి? నిజంగానే నిస్సందేహంగానే పూర్ణిమాదేవి ఒక ఛాంప్‌. ‌చిన్ననాటి అనుభవాన్ని ఆచరణగా మార్చి ‘అరుదైన ప్రాణి’కి అర్ధాన్నే మార్చిన కార్యశీలి. ఆలోచనలు అందరికీ ఉంటాయి. ఆచరణకు కొందరే తెస్తారు. అందులో విజయాన్ని కొంతమందే సాధిస్తారు. ఆ విజయం అంతర్జాతీయమైతే, ‘ఎర్త్ ‌ఛాంప్‌’‌గా బహూకృతమైతే, అదీ ఒక నారీమణి ఘనాతిఘన జీవనయానం. శాస్త్రవేత్తల సమాజానికి అన్ని విధాలా సగర్వ కారణం. శాస్త్రం, మానవత, పౌరధర్మాల మేళవింపుల సమీకృత రూపమే పూర్ణిమాదేవి… ఆదర్శజీవి.

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Twitter
Instagram