అరుణా మిల్లర్‌, ‌మేరీల్యాండ్‌. ఒకటి – ఆమె పేరు. మరొకటి-తాను లెఫ్టినెంట్‌ ‌గవర్నరుగా ఎన్నికైన ప్రాంతం. తెలుగునాట పుట్టి, సరిగ్గా అర్థ శతాబ్ది క్రితం అమెరికా వెళ్లిన కుటుంబంలో సభ్యురాలు. ఇక్కడి మన తెలుగు వనిత ఘనతను అక్కడ పతాక స్థాయికి చేర్చిన కార్యనిర్వహణశీలి. రాజకీయ, పాలనా రంగాలు రెండింటా ఒకేసారిగా చరిత్ర సృష్టించిన నిత్య ఉత్సాహి. భారతీయ సంతతి పడతి ఓ సాటిలేని మేటితనాన్ని కైవసం చేసుకుని, అగ్రదేశాన ఖ్యాతి కిరీటం ధరించడం పెను సంచలనం. వర్తమానంతో పాటు భవిష్యత్తుపైనా సరికొత్త ఆశలు రేకెత్తిస్తున్న తీరు ప్రపంచ దేశాలన్నింటినీ ఇప్పటికీ ఆకట్టుకుంటూనే ఉంది. ఈ మధ్య ముగిసిన మధ్యంతర ఎన్నికల్లో తానేమిటో చాటి చెప్పిన అరుణది అక్కడి గవర్నర్‌ ‌తదుపరి స్థానం. హోదా, బాధ్యత… రెండూ దేనికవే ప్రత్యేకం. మరో రెండేళ్లకు అరవయ్యో పడిలో ప్రవేశించే ఆమెకి ప్రజాభిమానం పొందడం తొలి నుంచీ అలవాటు! ‘పార్టీల పరంగా పౌరుల్ని విభజించడం కాదు. సామాజిక ప్రయోజనాల సాధన దిశగా వారిని ఏకోన్ముఖం చేయడమే ప్రథమ, ప్రధాన ధ్యేయం’ అంటున్నారు. విజయానందాన్ని సొంతం చేసుకున్న తరుణంలో ఆమె ప్రసంగం నిండా ‘మనం’ అనేదే ప్రతిధ్వనించింది తప్ప ‘నేను’లు లేవు. అదీ భారతీయత మూలం అంటే!

ఎక్కడి భారత్‌, ఎక్కడి అమెరికా? ఆ దేశ ఎన్నికల్లో భారతీయ అమెరికన్‌గా నిలిచి గెలవడం రికార్డు కాదా? అక్కడ ప్రతినిధుల సభకైనా, పలు రాష్ట్రాల చట్టసభలకైనా ఎన్నికైన ఇండియన్లు కొందరున్నారు. దాదాపు 33 కోట్ల మంది అమెరికా జనాభాలో భారత సంతతి కొంత శాతమే అయినా, గెలుపు పరంగా మాత్రం ముందడుగే. అరుణ ఎన్నిక ఎందుకు అత్యంత విశేషమంటే…ఆమె తెలుగు స్త్రీ, అత్యున్నత పదవిని అందుకున్న దీక్షాదక్షురాలు. ఆంధప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా ప్రాంతం నుంచి అమెరికా తరలివెళ్లినప్పుడు పట్టుమని పదేళ్లయినా లేని బాలిక. హైదరాబాద్‌ ‌ప్రాంతంలో బంధు మిత్రులున్నారు. స్వస్థలం పట్ల అపార ప్రేమాభి మానాలు. అదే తరహా ఆదరణ అగ్రరాజ్యం లోని అధినేతల నుంచీ లభించి, ఎన్నికలవేళ విస్తృత మద్దతుకు దారితీసింది. దశాబ్దాలుగా అమెరికావాసి అయిన తనకు ఆయా ప్రాంతాల జీవనరీతులన్నీ క్షుణ్ణంగా తెలుసు. బిడ్డల తల్లిగా, ఉద్యోగినిగా, కుటుంబ పెద్దల సంరక్షకురాలిగా విభిన్న పాత్రలు నిర్వర్తిస్తూ వస్తున్న తనకు బాధ్యతల నిర్వహణ సులభ సాధ్యమే. ఉన్న విధానాలు, వాటిల్లోని మార్పు చేర్పులు, ఆచరణ పద్ధతులు, ఎదురయ్యే పరిస్థితులు అన్నిటి మీదా ముందస్తు అవగాహన ఉంది. లభించిన అధికారిక హోదాను ఎంత ఉదాత్తంగా మలుచుకుంటే ఉన్నత ఫలితాలు సిద్ధిస్తాయో తెలిసినవారే. ఏవైనా అవరోధాలు ఎదురైతే వాటిని అధిగమించగలిగే ఓర్పు నేర్పూ అనుభవైక వేద్యాలే. ఇవన్నీ జతగూడి అరుణను ఎప్పుడూ ఒక మెట్టు ఎక్కువగానే నిలబెడుతూ వచ్చాయి.

ప్రజలకు ప్రాథమిక సదుపాయాల కల్పన పాలకుల మొదటి విధి. చదువులూ, ఉపాధులూ, రోజువారీ స్థితిగతులు, అత్యవసర సమయాల్లో ఆదుకోవడమన్నది కీలక కర్తవ్యమే. ‘వీటిని నెర వేర్చడంలో ‘నేను’ అనుకోను. ‘మేము’గా భావించు కుంటాను. అందరి సహాయ సహకార సమన్వయా లనూ సాధించి ‘నన్ను నేను’ అని కాకుండా ‘మనకు మనం’గా నిరూపించుకుందాం’ అంటున్నప్పుడు ప్రజల కరతాళ ధ్వనులు మారుమోగాయి. ఏది ఎప్పుడు మాట్లాడితే, ఏ పని ఎప్పుడు చేస్తే జనావళికి ఉపయోగమో ఆమెకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. అదే విలక్షణత.

ఇదీ ప్రజాసేవ

అరుణకు ముగ్గురూ అమ్మాయిలే. వారి ఆలనా పాలనపైన ఎంత శ్రద్ధాసక్తులో, ప్రాంత పరిపాలన మీదా అంతే ఉండేలా చూసుకుంటానంటున్నారు. వ్యక్తి, వృత్తిగత విధుల సంలీనంలో పూర్తి జాగ్రత్త వహిస్తానని చెబుతున్నారు. ఏ సమాజంలోనైనా దంపతుల కర్తవ్యాలు అనేకం ఉంటుంటాయి. ఏ ఒక్కరి వల్లనో కాదు.. ఉభయులూ అప్రమత్తంగా ఉంటనే పరిస్థితుల్ని అధిగమించగలరు. పాలనకు సంబంధించి కూడా మేలిమి రాజకీయ అంతరార్థం ప్రస్ఫుటంగా ఉండాలి. ప్రయోజనాలూ, ప్రజల ప్రయోజనాలూ వేరు కారాదు, కానివ్వకూడదు. ఏ రాజకీయమైనా ఎన్నికల వరకే ఉండాలి తప్ప, ఆ తర్వాత కొనసాగటం తగదు. తేడా ఎంత ఉత్తమంగా ఉందన్నది అందరి అనుభవానికీ రావాలి. మాటలతో సరిపెట్టుకోవడం కాకుండా, చేతల్లో చూపగలిగే పాలనా నాయకత్వం కావాలన్నది ఆమె ఆకాంక్ష. అవకాశాలు పెరగాలి, వాటిని పెంచాలి. అవకాశాల వినియోగం విస్తారం కావాలి, దానిపై పాలకులు ఓ కన్నేసి ఉంచాలి. ప్రణాళిక, ముందు జాగ్రత్త, ఆచరణ, సమీక్ష, విశ్లేషణలు – ఇవన్నీ విస్తృతమైన ప్పుడే ఆశించినవి నెరవేరతాయని తనకు గట్టి నమ్మిక. ‘ప్రజాసేవకు మీ నిర్వచనం ఏమిటి?’ అని విలేకరులు అడిగి నప్పుడు, ‘కావాల్సింది వచనాలు కాదు; ఆచరణలు’ అంటూ కచ్చితత్వాన్ని తేటతెల్లం చేశారామె. ఇదంతా చూస్తున్నప్పుడు /వింటున్నప్పుడు / చదువుతున్నప్పుడు / తెలుసుకుంటున్నపుడు ‘పాలకుల ఎన్నిక – ప్రజల బాధ్యత’ అనేది మనందరి మదిలో మెదులుతుంది.

మక్కువతో ముఖాముఖీ

వచ్చే సంవత్సరం తొలినెల జనవరిలో ప్రజలతో ముఖాముఖిని అరుణ నిర్వహిస్తారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై తనవైన అభిప్రాయాలు వెల్లడిస్తూ, పాలితులు కోరుకుంటున్నవాటిని అడిగి తెలుసుకుంటారు. వివిధ సామాజిక సంస్థల్లో పనిచేసిన అనుభవం ఆమెది. అవన్నీ విద్య, వైద్యం, సంఘసేవ, వికాసం, మానసిక ఆరోగ్యం వంటి విభిన్న రంగాలకు సంబంధించి నవి. మిస్సోరి విశ్వ విద్యాలయంలో శాస్త్ర, సాంకేతిక అంశాలు చదువు కున్న ఆమెకు… వాటిని మాధ్యమాల ద్వారా ప్రజా బాహుళ్యంలోకి తీసుకువెళ్లడంపై కూడా మక్కువ ఎక్కువ. తొలి నుంచీ తన ఇద్దరు తోబుట్టువులతోనూ శాస్త్ర సంబంధ చర్చలు సాగిస్తుండేవారు. వాటితో సమంగా రాజకీయాల చర్చలూ కొనసాగిస్తూ పరిధిని విశాలం చేసుకునేవారు. తాను మొదటగా అమెరికా పౌరసత్వం పొంది ఓటువేసింది 22 సంవత్సరాల కిందట. తన దృష్టిలో రాజకీయం అంటే పౌరులకు సేవచేయడమే! పాలకులు మొదటగా దేనికి ప్రాధాన్యమివ్వాలి? అనే ప్రశ్నకు ఆమె ఇచ్చే సమాధానం ‘వైద్యానికి’ అని. ప్రజా రోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వాల బాధ్యత. ఆరోగ్య సంరక్షణ తర్వాతే మిగతావి ఏమైనా. అటు తర్వాత స్థానం పర్యావరణ పరిరక్షణకి ఇవ్వాలంటారు. విద్య, రవాణా, రెవిన్యూ రంగాలకు వరసవారీ ప్రాముఖ్యం కల్పించాలంటారు. అధికారం విషయానికొస్తే ‘జీవితంలో అన్నింటికీ సమప్రాధాన్యముంది. ఎక్కువ, తక్కువ అని ఏవీ ఉండవు. కానీ పౌరులందరూ కోరుకునే భద్రత పట్ల ప్రభుత్వం, అధికార యంత్రాంగానికి ఒక స్పష్టత అంటూ ఉండాలి. రూపొందించిన నియమ నిబంధనలు, వాటిని ఆచరణకు తెచ్చే విధానాలు, అవసర సందర్భాల్లో చేయాల్సిన సమీక్షల గురించీ పూర్తిస్థాయి అవగాహన అవసరం. అప్పుడే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. ఎప్పుడు ఏ విధంగా స్పందించాలన్న తెలివిడి లభిస్తుంది. దీనికోసం శాస్త్రం, కళ- రెండింటినీ సమ్మిళితం చేయాల్సి ఉంటుంది’ అంటారు అరుణ. ఇంతటి ప్రస్ఫుట దృష్టి తనకు అలవడటానికి మూలం – శాస్త్రీయ పరిజ్ఞానం, కళాత్మక దృష్టికోణం. వీటితోనే పౌరజీవితాలు నల్లేరుమీద బండి నడకలా సాగుతాయని ఆమె దృఢ విశ్వాసం. ఈ అంశాలనే ఎన్నికల ముందు, తర్వాత కూడా సందర్భాను సారంగా వివరిస్తూ జనం మన్ననలు అందుకుంటు న్నారీమె.

మార్పు చేర్పుల పరంపర

రాజకీయవేత్తగా, పాలనాదక్షురాలిగా పేరెన్నిక పొందారు అరుణ. అమెరికా వెళ్లిన కొత్తల్లో మొదట న్యూయార్క్ ‌నివాసం. అక్కడే తన తండ్రి మెకానికల్‌ ఇం‌జనీరుగా పనిచేసేవారు. పబ్లిక్‌ ‌స్కూళ్లలో చదువు కున్న ఆమె అనంతరం సివిల్‌ ఇం‌జనీరింగ్‌ ‌మీద మక్కువ పెంచుకున్నారు. తదుపరి పరిణామాల్లో మేరీల్యాండ్‌కు పయనం. ఇది 1990 నాటి మాట. అక్కడ ముందుగా రవాణా విభాగంలో ఉద్యోగ విధులు తర్వాత 2012లో డెమోక్రటిక్‌ ‌నేషనల్‌ ‌కన్వెన్షన్‌ ‌ప్రాతినిధ్యం జీవితాన్ని మలుపు తిప్పింది. మరో ఏడాది తిరిగేసరికి, ఒక అధ్యయన సంఘంలో కీలకపాత్రను నిర్వర్తించారు.

పదిమందిలో ఒకరిగా ఉంటూనే, సంబంధిత నియమావళి రూపకల్పనను సమర్థంగా చేయ గలిగారు. సాంస్కృతిక రంగ పురోగమనానికీ తనవంతు చేయూతనందించారు. భర్త డేవిడ్‌ ‌మిల్లర్‌ అం‌డదండలు మరికొన్ని సేవా కార్యక్రమాలకు పురికొల్పాయి. భారత- అమెరికన్‌ ఒప్పందపరంగా, సరికొత్త సంస్థ కార్యనిర్వాహక డైరెక్టరుగా 2019లో నియమితులయ్యారు. నిరుడు డిసెంబరులో రాజకీయ పరిణామాలు అనేకానేక మార్పు చేర్పులకు కారణమయ్యాయి. ఎన్నికల రాజకీయాలు, సవాళ్లను ఎదుర్కో వడం, ప్రత్యర్థులకు దీటుగా బదులివ్వడం… ఇలా ఎన్నో గడిచి తుది విజయం అరుణనే వరించింది.

అభినందనీయ

అక్కడి తెలుగుతేజం అక్కడా ఇక్కడా కూడా ఆశల వాకిళ్లు తెరుస్తోంది. తన హయాంలో అరుణ విస్తృతరీతిన కార్యక్రమాలు చేపట్టి, ఆశయాలు నెరవేర్చు కుంటారన్న విశ్వాసం అందరిలోనూ ఉంది. అనంత పరిజ్ఞానం, అపార అనుభవం, క్రియాశీలత, ఎటువంటి స్థితినైనా ఎదుర్కొని నిలిచే స్వభావమున్న ఆమె తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా పనిచేస్తారు. పరిపాలనా రంగాన తనదైన ముద్రవేసి, పేరును సార్థకం చేసుకుంటారని మనసారా ఆశిద్దాం, నోరారా ఆశీర్వదిద్దాం. మహిళాశక్తిని అభినందిస్తూ, మరిన్ని విజయాభినందనలను అందరము అందిద్దాం.

– జంధ్యాల శరత్‌బాబు,  సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram