– కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు

‘మై పాన్‌ ‌బానే దీన్‌ ‌హూఁ!

కుఫర్‌ ‌కా జల్లాన్‌ ‌హూఁ!’

(నేను ఇస్లాం రక్షకుడిని, ముస్లిం కాని వాని తల నరికే వాడిని) అని హైదరాబాద్‌ ‌చివరి నిజాం కవితా పంక్తులు ఆయన మనస్తత్వానికి అద్దం పడతాయి. ఇలాంటిదే ఆయన రాసుకున్న మరో కవిత.

‘బందే నా కూస్‌ ‌హువా మనకే నారాయేట్‌ ‌బీర్‌

‌జల్‌ ‌జలా ఆ హీ గయా రిశ్తోయే జున్నార్‌ ‌పర్‌’

(అల్లాహో అక్బర్‌ అనే కల్మాధ్వని వినబడటం తోనే శంఖనాదం ఆగిపోయింది. ఇది హిందువుల జంధ్యాల్ని, మతచిహ్నాల్ని భూకంపం నుండి లేచిన మట్టి కప్పేసింది).

పోలీసు చర్య అనంతరం సర్దార్‌ ‌వల్లభభాయ్‌ ‌పటేల్‌తో ‘హిందూ ముస్లింలు నాకు రెండు కళ్లులాంటి వారు’ అని నిజాం బొంకినప్పుడు పైన తెలిపిన కవితా పంక్తులను పటేల్‌ ‌తన కార్యదర్శి మీనన్‌తో చదివించి వినిపించారట.

సాధారణంగా ‘ఏలినాటి శని ఏడు సంవత్సరాలు’ అంటారు. కాని హైదరాబాద్‌ ‌సంస్థానానికి మాత్రం ఏడుగురు నిజాంల ఏడు తరాల శని పట్టింది. ఆ శని ప్రభావం 224 ఏళ్లుంది. అందులో 1911 నుండి 1948 వరకూ శని ప్రభావం తీవ్రంగా ఉంది. సుమారు 37 సంవత్సరాలు హిందువులను ఔరంగ జేబును మించి ఏడిపించి ఏడిపించి వదిలాడు. తాను నిజాం కాగానే తండ్రి కాలం నుంచి హైదరాబాద్‌ ‌సంస్థానానికి ప్రధానిగా వున్న సర్‌ ‌కిషన్‌ ‌ప్రసాద్‌ను తొలగించి ఓ ముస్లింను నియమించాడు.

ముస్లిం మత తత్త్వవాదులు ఖాక్సర్‌ ‌పార్టీని ప్రారంభించారు. దీని సభ్యులను బేల్పాపౌజ్‌ (‌బేల్పాలంటే గొడ్డలి) అనే వారు. వారంతా గొడ్డళ్లను ధరించేవారు. హిందువులపై హింస, దోపిడీ కొనసాగించేవారు. వారికి నిజాం సంపూర్ణ మద్దతు ఉండేది. నిజాం ప్రభుత్వంలో విద్యాశాఖాధికారి ‘అల్లమామశ్రకి’ దీని కార్యకలాపాలను పర్యవేక్షించ డమే అందుకు ఉదాహరణ. బహదూర్‌ ‌యార్జంగ్‌ 1927‌లో ఇత్తేహదుల్‌ ‌ముస్లిమీన్‌ ‌సంస్థను స్థాపించగా, అటు తర్వాత అది కాశీం రజ్వీ ఆధ్వర్యంలోని రజాకార్ల సైన్యంగా మారి, నిజాం సైన్యంతో కలిసింది. ‘ఇస్లాం రాజ్యస్థాపన’ దాని ముఖ్య ఉద్దేశ్యం. మరోవంక సిద్దిక్‌ ‌దీనార్‌ ఉద్యమం (1929) హైదరాబాద్‌ అసిఫ్‌నగర్‌ ‌కేంద్రంగా ప్రారంభమైంది. సిద్దిక్‌ ‌తనను తాను చెన్న బసవేశ్వరుని అవతారంగా ప్రచారం చేసుకుంటూ వేలాది హిందువుల్ని మోసం చేసి నిజాం అండతో మత మార్పిళ్లు చేశాడు. నిజాంను పాండురాజు అవతారంగా చిత్రించాడు.

హైదరాబాద్‌ ‌సంస్థానంలో ముస్లిం జనాభా పెంపుకోసం వివిధ ప్రాంతాల నుండి ముస్లింలను దిగుమతి చేసుకున్నాడు. 1948 నాటికి సంస్థానంలో ఎనిమిది లక్షల మంది ముస్లింలను రప్పించారు. వారిలో వేలాదిగా నిజాం సైన్యంలో, మిగిలినవారు రజాకార్లలో చేరారు. భారత ప్రధానమంత్రి, హోంమంత్రి పార్లమెంటులో ఈ విషయం ప్రకటించారు. ముస్లిం విద్యార్ధులను పెద్ద సంఖ్యలో రజాకార్లలో చేర్చుకున్నారు. ‘…అనే పేరు గల నేను నా నాయకుడు ఎన్నడు నన్నాజ్ఞాపించినా, పార్టీ శ్రేయస్సు కోసం, నా జీవితం అంకితం చేయడానికి ఇందుమూలంగా పవిత్ర శపథం చేస్తున్నాను’ వారితో ప్రతిజ్ఞ చేయించేవారు. ‘1940లో రజాకారదళం ఏర్పడింది. అందులోని వారికి సైనిక శిక్షణ ఇప్పించాలని 1947 జూలైలో నిర్ణయించిన మేరకు సంస్థానమంతటా భారీ ఎత్తున రజాకార్ల రిక్రూట్‌ ‌మెంట్‌ ‌జరిగింది. పెద్దలు, పిల్లలు, స్త్రీలను కూడా రిక్రూట్‌ ‌చేసుకున్నారు. నవంబర్‌ 3, 1947  ‌నాటికి సర్కార్‌ ‌లెక్కల ప్రకారం రజాకార్ల సంఖ్య 50 వేలు కాగా, ఆ సంఖ్యను ఐదు లక్షలకు పెంచనున్నట్లు కాశీం రజ్వీ ప్రకటించాడు’ అని ప్రొఫెసర్‌ ‌సరోజినీ రేగానీ నివేదిక పేర్కొంటోంది. రజాకార్ల రోజువారీ ఖర్చు 30 వేల రూపాయలకు మించి ఉండేది. మేజర్‌ అమీరుద్దీన్‌, ఎల్‌ ‌కల్నల్‌ ‌గులాం మొహియుద్దీన్‌ ఆయుధ శిక్షణ ఇచ్చేవారు. రజాకార్లకు కావలసిన ఆయుధాలు, వాహనాలు, తర్ఫీదు, డబ్బు సకలం నిజాం సమకూర్చేవాడు. 1935 నుండి 1948 వరకు ఇటు రజాకార్లూ, అటు నిజాం సైన్యం వారి అనుయాయులు హిందూ సమాజంపై ఎడతెరిపి లేకుండా దమనకాండ సాగించారు.

‘రజాకార్ల మూకలు 70 గ్రామాలపై దాడులు జరిపి వందలాది మందిని హత్య చేశారు. వేలాది మందిని గాయపరిచారు. అనేకమంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. పన్నెండు రైలు దోపిడీలు జరిగాయి. కోట్ల రూపాయలు ఆస్థి లూటీ అయ్యింది. మాన, ప్రాణాలను కాపాడుకునేందుకు లక్షలాది మంది సరిహద్దు ప్రాంతాలకు వెళ్లిపోయారు’ అని సెప్టెంబర్‌ 7, 1947‌న నాటి ప్రధానమంత్రి పార్ల మెంట్‌కు వివరించారు. హైదరాబాద్‌ ‌సంస్థానంలో రజాకార్లు హిందువుల నుంచి దోచుకున్న సొమ్ము 70 కోట్ల రూపాయల కంటే ఎక్కువే, నిజాం వాటా పోగా 40 కోట్లు ముట్టి వుంటుంది అని వందేమాతరం రామచంద్రరావు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

 సంస్థానాభివృద్ధికి పెద్దగా ఖర్చు చేయకుండా, ప్రపంచవ్యాప్తంగా అనేక ముస్లిం సంస్థలకు విరివిగా విరాళాలిచ్చాడు. మక్కా, మదీనా, టర్కీ, పాలస్తీనా, ఈరాక్‌, ‌బస్రాలోని ముస్లింలకు, ఢిల్లీ జామా మసీదుకు, ఆలీఘర్‌ ‌ముస్లిమ్‌ ‌యూనివర్సిటీకి, ఆజ్మీర్లో ముజాఫర్లు, బాల్కన్‌ ‌యుద్ధంలో రక్తపాతం సృష్టించిన జిన్నాకు రూ.20 కోట్లు సాయం చేశాడు.

రజాకార్లు హిందువులపై దురాగతాలు సాగించి నప్పటికీ తమను విమర్శించేవారు ముస్లీంలనైనా వదిలేవారు కారు. రయ్యత్‌ ‌పత్రిక సంపాదకుడు షోయబుల్లా ఖాన్‌ ‌హత్యోదంతం అందుకు ఉదాహరణ. ఎదిరించిన, స్వేచ్ఛ గురించి మాట్లాడిన, పోట్లాడిన వేలాదిమంది విద్యార్థుల్ని, సత్యాగ్రాహుల్ని, సాయుధ దేశభక్తుల్ని అతి కర్కశంగా హత్య చేశారు.

బ్రిటీష్‌ ‌వారు ఈ దేశం విడిచి వెళ్లిన వెంటనే హైదరాబాద్‌ ‌స్వతంత్ర రాష్ట్రమవుతుందని జూన్‌ 12, 1947‌లో నిజాం ఫర్మానా జారీ చేశాడు. ఆ ఏడాది ఆగస్టు 14న బ్రిటీష్‌ ‌రెసిడెంటుకు వీడ్కోలు విందు ఇస్తూ తన ఉద్దేశాన్ని పునరుద్ఘాటించాడు. 17న హైదరాబాద్‌ ‌సంస్థానాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించి అంతర్జాతీయ మద్దతు కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు, ‘హైదరాబాద్‌ ‌సంస్థానం భారత దేశంలో అంతర్భాగమవుతుందని అనుకోవడం అర్థరహితం’ (జనవరి 26, 1947 ‘సుబా-ఎ- దక్కన్‌’ ఉర్దూ పత్రిక) అని ప్రకటించాడు. పాకిస్థాన్‌ ‌విదేశాంగ మంత్రి జఫరుల్లా ఖాన్‌ ‌చేత హైదరాబాద్‌ ‌రాష్ట్రానికి మద్దతు ప్రకటింపచేశాడు. నాటి బ్రిటిష్‌ ‌ప్రధాని విన్ట్సన్‌ ‌చర్చిల్‌ ‌జూలై 30, 1948న హౌస్‌ ఆఫ్‌ ‌కామన్స్‌లో ప్రసంగిస్తూ… ఐక్యరాజ్యసమితిలోని 52 దేశాల్లో 20 దేశాలు హైదరాబాద్‌ ‌కంటే పెద్దవని, 16 దేశాలు దాని కంటే తక్కువ ఆదాయం కలిగినవని నిజాం అంతరంగాన్ని సమర్థించాడు.

ఉస్మాన్‌ ఆలీఖాన్‌ ‌తన పైశాచిక కామ ప్రవృత్తిని సంతృప్తి పరచుకోవడం కోసం 360 మంది అందమైన స్త్రీలను తన రాజప్రసాదంలోనే ఉంచు కున్న ఘనుడు. వారికి పుట్టిన సాహెబ్‌ ‌జాదాల్ని (రాజకుమారుల్ని) రాజ్యం మీదికి వదిలి వేయడం, వారు, వారి బంధువర్గం, సైన్యం రజాకార్లు కనపడ్డ కన్నె, వివాహిత, పిల్లలు, వృద్ధులు అనే వయోభేదం లేకుండా ఎత్తుకొని పోయి మానభంగం చేయడం, ఇష్టమైతే ఉంచుకోవడం, లేకపోతే చంపేయడమనేది అతి సామాన్యమైన విషయంగా ఉండేది.

నిజాం ఏటా పుట్టినరోజు (సాల్గిరా)చేసుకుంటూ కానుకలు స్వీకరించడం ఆచారంగా మారింది. తన ఇష్టం వచ్చినప్పుడల్లా ఎవరినో ఒకరిని పిలిచి ‘నజరానా’లు అందుకుని బిరుదులిచ్చేవాడు. జాగీరులెవరైనా చనిపోతే వారి వారసుల పేర ఆస్థి మార్పిడికి పెద్ద మొత్తం నజరానాగా ఇచ్చుకోవాలి. వారసులు లేకపోతే ఆస్థిని తానే ఉంచుకుంటాడు.

‘సర్‌ ‌వాల్టర్‌ ‌మాక్టన్‌’ అనే బ్రిటీషీయుడు సంస్థానంలో రాజ్యాంగ సలహాదారు ఉండే వాడు. అతనికి సంవత్సరానికి ఏడు లక్షల రూపాయల వేతనం లభించేది అతడు హైదరా బాదులో సుమారు ముప్పయేళ్లు హాయిగా గడిపేశాడు. 1948లో పోలీసు చర్య అనంతరం అతడు లండన్‌ ‌వెళ్లి పోయాడు.

కమాల్‌ ‌ఖాన్‌ అనే జాగీరుదారు హైదరాబాద్‌లో అందమైన బంగ్లా నిర్మించుకుని నిజాంను ప్రత్యేక విందుకు పిలిచాడు. అది నచ్చిన నిజాం ‘దీన్ని మేం రాజభవనం చేసుకుంటాం’ అనడంతో చేసేది లేక ఆయన దానిని నిజాంకు ఇచ్చాడు. అదే నేటి కింగ్‌ ‌కోఠి.

రెండు అష్రపీలు (తులం బంగారం)కు ‘జంగ్‌, ‌నవాబ్‌, ‌జంగ్‌, ‌యార్‌ ‌జంగ్‌’ ‌బిరుదులిచ్చేవాడు. నిజాం మీర్‌ ఉస్మాన్‌ ఆలీఖాన్‌ ‌తరచూ అమీర్లు, జమీందార్ల ఇళ్లకు వెళ్లి ఇంటిల్లిపాది నుండి నజరానాలు స్వీకరించే వాడు. తన తోటలో పండిన మామిడి, అరటిపండ్లను కచేరీలకు పంపుతూ, దానితో పాటు చీటీలు కూడా జత చేసేవాడు. ఆయా కచేరీలు నిజాంకు ఎంత సొమ్ము పంపాలో వాటిలో రాసి వుండేది. భూమి శిస్తు రూపాయికి ఒక అణా చొప్పున లోకల్‌ ‌ఫండుకు, అర్థ అణా బంచరాయి కోసం, ఒక అణా నిజాం నజరానా కోసం ప్రజల దగ్గర నుండి వసూలు చేసి నిజాంకు పంపేవారు.

సాంస్కృతిక దురాక్రమణలో భాగంగా తెలుగు భాష నిర్లక్ష్యానికి గురైంది. దక్షిణాపథం దక్కన్‌గా మారింది. పాలమూరు మహబూబ్‌నగర్‌, ఇం‌దూరు నిజామాబాద్‌ అయ్యాయి. ఇలా తెలంగాణా ప్రాంతంలోని ఎన్నో పేర్లు మారిపోయాయి.

‘లూఅబద్‌ ‌ఖాలి అలం యే తియాసత్రఖే

తుఝుకో ఉస్మాన్‌ ‌బసదా ఇజ్ఞాల్‌ ‌సలామత్‌ ‌రఖే?’

(జగత్కర్త ప్రళయం వరకు నీ రాజ్యాన్ని ఉంచనీ, ఓ ఉస్మాన్‌ ‌నిన్ను నిండు దర్పంతో ఉంచని…) అని పాఠశాలలో మీరే ఉస్మాన్‌ ఆలీఖాన్‌ను కీర్తిస్తూ ప్రార్థన చేయాలి. విద్యార్థులందరూ పైజమా, నీలిరంగు షెర్వానీ మాత్రమే ధరించి కాలేజీలకు వెళ్లాలనే నిబంధన ఉండగా, చాలా మంది విద్యార్థులు ధోవతులు, చొక్కాలతో తరగతులకు హాజరయ్యేవారు. అలాంటి వారిని విశ్వవిద్యాలయం నుంచి పంపివేయడంతో (నవంబర్‌ 29,1938) ‌వారు నాగపూర్‌ ‌వెళ్లారు.

1920లో 46వ నెంబర్‌ ‌పర్మానా ప్రకారం హిందూ సార్వజనిక కార్యక్రమాలపైన నిషేధం విధించారు. దీని ప్రకారం జాతీయ నాయకుల ఫోటోలు ప్రదర్శించకూడదు. జాతీయ గీతాలు, ‘వందేమాతరం’ పాడకూడదు. ఆర్య సమాజం నిజాం నిరంకుశత్వాన్ని సవాల్‌ ‌చేసింది.. అనుమతి లేకుండా ఏ శుభకార్యాలు, ఊరేగింపులు, చివరకు శవయాత్రలపై కూడా నిజాం ప్రభుత్వం నిషేధం ఉండేది.

1947 ఆగస్టు 15 తర్వాత భారతావని స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకుంటూ సంబరాలు జరుపు కుంటుండగా, హైదరాబాద్‌ ‌సంస్థానంలోని హిందూ ప్రజానీకం నిజాం నియంతృత్వానికి, రజాకార్ల పైశాచికత్వంతో తల్లడిల్లిపోయారు. నిజాం ఆటకట్టిం చేందుకు ‘సైన్యాన్ని కదిలిద్దాం-నిజాం దుమ్ము దులిపేద్దాం’ అన్న నాటి హోంమంత్రి సర్దార్‌ ‌వల్లభభాయ్‌ ‌పటేల్‌ ‌మాటలను పట్టించుకోకుండా, ప్రధాని ఏడాది పాటు చేసిన కాలయాపన ఫలితంగా అనేక దురాగతాలు చోటుచేసుకున్నాయి.

అందుకు ఉదాహరణలు కొన్ని: ఆగస్టు 8, 1947న వరంగల్‌లో త్రివర్ణ పతాకం ఎగుర వేసినందుకు మొగలయ్యను రజాకార్లు కత్తులతో పొడిచి చంపగా, హంతకుడు ఖాసిమ్‌ ‌షరీఫ్‌కు పూలదండలు వేసి వరంగల్లో నాటి సుబేదార్‌ ఊరేగించాడు.

‘వాడి’ రైల్వే స్టేషన్‌ ‌పక్క గ్రామంలో బతుకమ్మ పండుగ చేసుకొని రైలుల్లో తిరిగి వస్తున్న వందలాది మంది హిందూ స్త్రీలను గాండ్లాపూర్‌ ‌వద్ద నిజాం మూకలు రైలును ఆపి, మగవారిని కాళ్లుచేతులు కట్టి పడేసి, స్త్రీలను సమీపంలోని పోలీస్‌ ‌స్టేషన్‌కు తీసుకువెళ్లి నగ్నంగా బతుకమ్మను ఆడించారు. ఆగస్టు 21, 1948 ఇమ్రోజ్‌ ‌పత్రికా సంపాదకుడు షోయబుల్లా ఖాన్‌ ‌హత్య జరిగింది.

ఆగస్టు 25, 1948న చేర్యాల తాలూకాలోని బైరాన్‌ ‌పల్లి గ్రామంపై ఉదయం నాలుగున్నర గంటలకు నిజాం ముష్కర మూకలు దాడికి దిగి 92 మంది హిందువుల్ని వరుసగా నిలబెట్టి కాల్చేశారు. కనపడ్డ స్త్రీల నెల్లా బలాత్క రించారు.

సూర్యాపేట తాలూకాలోని పాతర్లపహాడ్‌ ‌గ్రామస్థులు నిజాం సర్కార్‌కు పన్ను చెల్లించ బోమంటూ ఎదురు తిరిగినందుకు ఆగస్టు 28, 1948 ఆ పల్లెపై దాడిచేసి 17 మంది ప్రాణాలు తీశారు. ఎందరినో ఘోరంగా హింసించారు. నల్లగొండ జిల్లాలోని రహీంఖాన్‌ ‌పేట, బాడ, వేముల యాదగిరిపల్లి, మల్లాపురాయి, రేణిగుంట, భువనగిరి, ఎర్రంపల్లి, కొలపాక తాలూకాలోని దూది వెంకటాపురం మొదలగు ప్రాంతాల్లో కనీసం రెండు వేల మంది హత్యకు గురయ్యారు. అత్యాచారాలకు అంతే లేదు.

నిజాం నియంతపాలనకు వ్యతిరేకంగా ఆర్యసమాజం సత్యాగ్రహాన్ని ప్రోత్సహించింది. అనేకమంది ఆర్యవీరులు సత్యాగ్రహం చేసి జైలుకు వెళ్లారు. ఆ సత్యాగ్రహానికి అద్భుతమైన స్పందన లభించగా, ఈ ఉద్యమంలో చేరవద్దని గాంధీజీ కాంగ్రెసు కార్యకర్తలకు సలహా ఇచ్చారు. మరోవంక రాష్ట్రీయ స్వయం సేవక సంఘం సభ్యులు వందల సంఖ్యలో ఉద్యమంలో పాల్గొన్నారు. పోలీసు చర్యకు ముందు నిజాం జ్యేష్ఠ పుత్రుడు బీరార్‌ ‌యువరాజు అజింజా 8వ నిజాం కావాలనే కోరికతో హైదరాబాద్‌ ‌సంస్థాన సేనను సరిహద్దు నుండి వెనుకకు రప్పించాలను కున్నాడు. దానిని పసిగట్టిన 7వ నిజాం అతనికి కావలసినంత డబ్బు ఇచ్చి పారిస్‌ ‌లాంటి ప్రదేశాలకు విహారయాత్రకు పంపాడు. వ్యసనపరుడైన అజంజా సర్వసేనాని పదవి, బీరార్‌ ‌గవర్నర్‌ ‌పదవి వదులుకొని జల్సాలు చేసుకుంటూ ప్రపంచ విహారయాత్రలో నిమగ్నమయ్యాడు. మిలటరీ చర్య జరిగే వరకూ అధికారాన్ని కాపాడు కునేందుకు ఉస్మాన్‌ ‌ఖాన్‌ అం‌తర్గతంగా, అంత ర్జాతీయంగా తనకున్న అవకాశాల్ని వినియోగించు కునేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. సర్దార్‌ ‌పటేల్‌ ‌చొరవ, పట్టుదలతో ముందు ఆ యత్నాలు విఫలమై నిజాం దిగిరాక తప్పలేదు.

అయితే నిజాం సైన్యం సహకారంతో రజాకార్లు దోపిడీ చేసిన సొమ్ము ఎక్కడికి వెళ్లింది? వారి ఆయుధాలు ఎక్కడ ఉన్నాయి? లొంగిపోయిన రజాకార్లు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎందరు సజీవులుగా ఉన్నారు? వారి వారసుల పరిస్థితి ఏమిటి? ఇలా సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో వున్నాయి.

By editor

Twitter
Instagram