– మత్తి భానుమూర్తి

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతికి ఎంపికైనది

‘‘బుద్ధం శరణం గచ్ఛామి

ధర్మ్మం శరణం గచ్ఛామి

సంఘం శరణం గచ్ఛామి ’’

‘‘నేను ప్రార్థ్ధనలకై దేవాలయాలకు పోను. తపస్సుకై అరణ్యము చేరను. నా సహచర మానవుల సంఘ•త శక్తిని మనసారా వేడెదను’’ ‘‘నేను దళారు లైన పూజారులను ఆశ్రయించను. అంధ విశ్వాసా లకు బందీని కాను. జ్ఞానమును జ్ఞానవంతులను శరణు జెచ్చేదను’’. ‘‘నేను క్రతువుల యజ్ఞములను ఆశ్రయించను. న్యాయానికెల్లా న్యాయమైన ధర్మానికి, సర్వవ్యాపిత కరుణకు విధేయుడనై ఉంటాను’’

నిమీలిత నేత్రుడై విపస్యన యోగముద్రలో ఉన్నాడు సంబుద్ధి. కళ్లు మూసుకున్నా, నిత్యమూ మాదిరిగానే త్రిరత్నాలను వల్లెవేస్తున్నా ఇటీవల ఏకా గ్రత తగ్గింది. ఈరోజూ అదే పరిస్థితి.. ఇంట్లోవారి మాటలు.. వీధిలో వచ్చే పోయేవారి ముచ్చట్లు కూడా వినిపిస్తున్నాయి. మనసు వాటిపైకి మళ్లుతోంది. ఇప్పుడు సమాజపు పోకడలు.. యవ్వనంలో బౌద్ధానికి పూర్తిగా అంకితమైనకాలం నాటి సంఘటనలు.. అన్నింటిని బేరీజు వేసే ధోరణి ఎక్కువైంది. అందుకు కారణం ఉపాలి!!

పాతికేళ్ల క్రితం జరిగిన సంఘటన ఇప్పుడు పదేపదే గుర్తుకొస్తోంది.

ఆరోజు విహారం వద్ద సమావేశ పరచాడు ఉపాలి. చైత్యాన్ని పడగొట్టాలని కొంతకాలంగా యత్నిస్తున్న ఓ వైదిక ఉన్మాదుల బృందం ఈ రాత్రి దాడిచేయ బోతుందని, ఆ బృందాన్ని అడ్డుకోవాలని మిత్రులను ఆయుధాలతో సమాయత్తం చేశారు.

ఉపాలితో పాటు సంబుద్ధి, భల్లిక, చుండుడు, తపుస్స..

దాదాపు అర్ధరాత్రి. చిమ్మచీకటి.. కళ్లు పొడుచు కున్నా ఎదురుగా ఉన్నదేదో కానరావడం లేదు.

‘‘ఈ చీకటే మనకు ప్రధాన అస్త్రం. ధ్యానం తెలియని వాడెవ్వడూ ఈ చీకటిలో చూడలేడు. కేవలం విపస్యన ధ్యానం తెలిసిన బౌద్ధుడు మాత్రమే ఈ చీకటిలో కూడా ఎదురుగనున్నది చూడగలడు. కాబట్టి ఎవరు ఈ చైత్యాన్ని పడగొట్టడానికి వస్తారో రానివ్వండి. వాళ్లనందరిని అడ్డంగా కొట్టి చంపేద్దాం..’’ ప్రక్కనున్న నలుగురికి మాత్రమే వినిపించేలా గుసగుసగా గట్టిగా స్థిరంగా అన్నాడు ఉపాలి. ఐదుగురు తమ ఆయు ధాలు. నాగలి కర్రులు, పలుగులు, దుడ్డుకర్రలను గట్టిగా బిగించి పట్టుకుంటున్నారు. ఇదంతా విహారం ముందున్న ఆవరణలో జరుగుతోంది. విహారం నిర్మాణం గుర్రపునాడాలా ఉంటుంది. అంచుల వద్ద కాపు కాస్తే లోపలికి వచ్చినవాళ్లను నిర్బంధించి చంపవచ్చు.

‘‘సంబుద్ధీ..! మనం చేస్తోంది సబబేనంటావా.. బౌద్ధులు అహింసావాదులే గాని ఇలా..’’ సంశయం వెలిబుచ్చిన వాడు భల్లిక. సంబుద్ధి సమాధానం చెప్పేలోగా కసిరాడు ఉపాలి. ‘‘నోర్ముయ్‌.. ‌కొట్టడానికి వచ్చేవాడికి మరో చెంప చూపించు అన్నాడు గాని చంపేవాడు వస్తే వాడిచేతిలో ఆనందంగా చావు అనలేదు శాస్త. వాళ్లు నిన్ను నన్ను చంపడానికి.. ఈ చైత్యాన్ని నేలమట్టం చెయ్యడానికి వస్తున్నారు. అది గుర్తుపెట్టుకో..’’ అన్నాడు. బౌద్ధాన్ని చిన్న మాటన్నా భరించలేడు ఉపాలి.

అందరూ ఆవరణలోని చెట్ల చాటున దాగి చూస్తున్నారు నిశితంగా కళ్లు చికిలించి.

మరి కాసేపటికి అడుగుల సవ్వడి..

సంబుద్ద్ధితో అన్నాడు తపుస్స గుసగుసగా, ‘‘మామా.. మన దగ్గరగా ఎవరో అపరిచితులు..’’ సంబుద్ధితో పాటు అందరికి తెలుస్తోంది దగ్గరగా ఆగంతకుల ఉచ్ఛ్వాసనిశ్వాసాలు. ఒక్కసారిగా వాళ్ల పైకి దూకారు ఐదుగురు బౌద్ధులు. చీకట్లో బౌద్ధులు కొట్లాటకు సిద్ధమై ఉన్నారని ఊహించని ఆగంతకులు కొన్ని ఘడియలు వెనక్కు తగ్గారు. వాళ్లు చీకట్లో తడుముకునే లోపలే బౌద్ధులు చీకట్లో విచక్షణా రహితంగా కొట్టిన దెబ్బలతో ఆగంతకులు కంగు తిన్నారు. చావుకేకలు వేశారు. చీకట్లో పారిపో బోయారు. బౌద్ధులు వాళ్లను వెంటపడి విచక్షణా రహితంగా కొట్టడంతో వచ్చిన పదిమంది అక్కడి కక్కడే చనిపోయారు.

కొన్ని లిప్తల కాలం అంతా నిశ్శబ్దం. సంబుద్ధి కదిలి చెకుముకి రాళ్లతో దీపం వెలిగించాడు. అందరూ శవాలై పడి ఉన్నారు. శత్రువులను చంపామన్న ఆనందం.. బౌద్ధ్దతత్వానికి విరుద్ధంగా హింసిచామన్న అపరాధ భావన. విరుద్ద భావాలతో సంబుద్ధి విచలితుడయ్యాడు. మిగిలిన నలుగురి శరీరభాష కూడా అలాగే ఉంది.

‘‘ఊ.. కదలండి. ఈ శవాలను మాయం చెయ్యాలి. కదలండి సమయం లేదు..’’

అందరూ గబగబా శవాలను ఎత్తుకున్నారు. మరో గంట సమయానికి శవాలను నిండుకాలువలో పారవైచారు. వచ్చి విహారమంతా పరిశుభ్రం చేశారు. తర్వాత నిశ్శబ్దంగా నిష్క్రమించారు.

ఇది జరిగి పాతికేళ్లయింది. అప్పుడు ఇంత పెద్ద పూర్తిస్థాయి విహారం లేదు. కేవలం ఓ చైత్యం మాత్రమే ఉండేది. కర్మ రాష్ట్రంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పెదపల్లి ఓడరేవు దగ్గరగా అటు ప్రతీపాల పురం (భట్టిప్రోలు) ఆరామానికి యోజన దూరంలో కృష్ణానది చీలి వచ్చిన పెద్ద నీటిపాయ వద్ద ఉన్న ఈ అహదన నకరం (వాణిజ్య కూడలి) అప్పుడప్పుడే పెద్దగా విస్తరిస్తోంది. వైశ్యులు, బలిజ వ్యాపారులు ఈ నగరం వద్ద పెద్ద పెద్ద కోష్టాగారాలు నిర్మించడం.. పెద్దపెద్ద విదేశీ నౌకలు పెద్దపల్లి ఓడరేవుకు రావడం.. ఎగుమతి దిగుమతులు పెరగడం.. తదనుగుణం గానే వర్తకులంతా ఆరామానికి విరివిగా దానధర్మాలు చేస్తుండటంతో అహదన నకరం వ్యాపారం ఎలా పెరిగిందో విహారం కూడా అలాగే చైత్య, విహార, స్తూపాలతో పూర్తిస్థాయిలో విస్తరించింది.

ఇప్పుడు ఇది క్రీ.శ.616 సంవత్సరం.. క్రీ.పూ.563లో పుట్టిన బుద్ధుని బోధనలు అనే బౌద్ధం ఈ వెయ్యేళ్లలో ఎన్నెన్నో చారిత్రాత్మక మార్పు చేర్పులను చూసి అత్యున్నతస్థాయికి వెళ్లి శాఖోప శాఖలుగా విడిపోయి భరతఖండాన్ని ఊగించి శాసించి, సమాజ పోకడలనే విప్లవాత్మకంగా ప్రభావితం చేసింది. ప్రముఖంగా ఆంధ్ర రాజ్యపు మూలమూలాకు చొచ్చుకుని పోయి సమ సమాజానికి బాటలు వేసింది. అలాంటి బౌద్ధ్దమతం ఇప్పుడు

ఈ ఆంధ్ర రాజ్యంలోనే రానురానూ ఆదరణ కోల్పోతోందని సంబుద్ధి విచారం!

ప్చ్.. అప్పుడు రాత్రిపూట రహస్యంగా వచ్చి బౌద్ధ్ద కట్టడాలను ధ్వంసం చేసేవారు. ఇప్పుడు పట్టపగలే చైత్యాలను, విహారాలను, స్తూపాలను పడగొడుతుంటే కాపాడేవాడే లేడు. ఆ నలుగురు స్నేహితుల్లో ముగ్గురు హైందవులుగా మారిపోగా మరొకడు అటూ ఇటూ ఊగిసలాడుతున్నాడు. వాడే ఉపాలి. ఆ ముగ్గురూ మారినా సంబుద్ధి చలించలేదు. కాని ఉపాలిలో కనిపిస్తోన్న ద్వంద్వ ప్రవృత్తి అతనికి మనోక్లేశం కలిగిస్తోంది. కారణం సంబుద్ధి, ఉపాలి అత్యంత ఆప్తులైన స్నేహితులు. కేవలం శరీరాలు మాత్రమే వేరు కాని ఆత్మలు, ఆలోచనలు ఒక్కటే. స్వయంగా తన చెల్లెలు సంఘరఖితను సంబుద్ధికి ఇచ్చి వివాహం జరిపించి తమ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకున్న నిజమైన మిత్రుడు ఉపాలి.

 బౌద్ధం పట్ల ఉపాలికి రోజురోజుకూ గౌరవం తగ్గడమే కాదు విరుద్ధ భావనలు కూడా పొడ చూపుతున్నాయి. అలాగే సంఘరఖిత కూడా రోజురోజుకు వైదికం వైపు మొగ్గుతోందా? ఆ మధ్య ఇలాగే విపాసనలో ఉండగా వినిపించిన సంఘటన గుర్తొచ్చింది.

‘‘అమ్మా గృహలక్ష్మీ.. ఈ రోజు ఆదివారం. ఆశ్వీయుజ మాసం.. ఇది కృష్ణపక్షం. తిథి ద్వాదశి.’’

గుమ్మంలో ఎవరో బ్రాహ్మణుడు చెబుతున్నాడు. ఇది ఒక కొత్త పరిణామం. గతంలో ఎవ్వరూ ఇలా ఇంటింటికి వచ్చి దినవారాలు చెప్పడం లేదు. కాబట్టి విచిత్రంగా ఉంది. వివాహాలు, పిల్లలకు నామకరణం తదితర శుభకార్యాలను కూడా భిక్షువులే నిర్వహించి ఆశీర్వాదాలు అందించేవారు. ఇప్పుడు వైదికులు అన్ని బౌద్ధ పద్ధతులు అనుసరిస్తూ బౌద్ధ భిక్షువుల కంటే మిన్నగా ఉపాసకులైన గృహపతులను ఆకర్షిస్తున్నారు.

సంబుద్ధికి వినపడుతోంది. ఆలోచనల్లోని ఉపాలి ప్రక్కకు పోయాడు. గుమ్మం వద్ద అతని గొంతు వినగానే గబగబా బయటకు పరిగెత్తుకు వచ్చిన రఖిత చేతులు జోడించి నమస్కరించినట్లుంది. ‘‘నమస్కారమమ్మా..’’

ఈ నమస్కారం చెయ్యడం కూడా బౌద్ధుల పద్ధతి. హైందవులు అనుకరిస్తున్నారు. ఇదే కాదు అనేకం.

‘‘శిరోముండనం చేసుకున్నారు. బౌద్ధం స్వీకరిస్తు న్నారా ఏమిటి?’’ అది సంఘరఖిత గొంతు.

‘‘అబ్బెబ్బే.. బౌద్ధం నుండి హైందవం స్వీకరించినవాడిని.. అమ్మవారికి తలనీలాలు సమర్పించుకున్నాను.’’

ఇది కూడా బౌద్ధుల విధానమే. ‘తలనీలాలు.. భలే.. పదం బావుంది. జుట్టును తలనీలాలు అనడం..’

‘‘ఈ రోజు తిథి ద్వాదశి అన్నారు.. అంటే..?’’ రఖితలోని ఉత్సుకత సంబుద్ధి కి తెలుస్తోంది. బౌద్ధురాలైన రఖితకి ఈ తిధులు, రాశులు, నక్షత్రాలు వాటి కదలికల ఆధారంగా ఏర్పడ్డ ఈ శుభాశుభాలు క్రొత్త.. ఆమెకే కాదు ఆ ఊరికి.. ఆ ప్రాంతానికి.. ఆంధ్రదేశానికి.. ఆమాట కొస్తే భరతవర్షానికే క్రొత్త. ఎవరు రూపొందించారో గాని అనతి కాలంలోనే భరతఖండమంతటా ప్రాకిపోయింది.

‘‘అవునమ్మా ఇవ్వాళ తిథి ద్వాదశి.. అంటే దగ్ధ యోగం. ఏది ముట్టుకున్నా దగ్ధమే. అంటే ఏ పని అయినా తగలబడిపోతుంది. ఇవ్వాళ ముఖమైన ఏ పనీ ప్రారంభించకండి.. శుభం జరగదు..’’

‘‘అమ్మో.. అలాగా.. అయితే అలాగలాగే..’’

‘‘అమ్మా.. మీ ముఖం చూస్తుంటే గొప్ప తేజస్సు కనిపిస్తోంది తల్లీ. అదే సమయంలో కొన్ని దుష్ట శక్తులు మిమ్మల్నే కేంద్రంగా చుట్టుముడుతున్నాయి. త్వరలో ఏదో కీడు మీకు జరుగబోతోంది..’’

‘‘ఆ?.. నిజమా.. ఏవిటది పంతులుగారూ..’’

‘‘ఒక్క క్షణం.. పంచాంగం చూసి..’’

‘‘ఇలా కూర్చోండి.. వసారాలోకి రండి. అరుగుపై కూర్చుని చూసి చెప్పండి..’’ ఆమె గొంతులో ఆదుర్దా..

ధ్యానంలో ఉన్న సంబుద్ధి కూడా ఇబ్బందిగా కొంచం కదిలాడు. ‘ఆ కీడు ఏవిటో.. ఆమధ్య ఉపాలి కూడా జాతకాలు.. చక్రం వేసి భవిష్యత్తు చెప్పడం.. హస్త సాముద్రికం.. చేతి రేఖల్లో భవిష్యత్తు.. అంటూ ఏవేవో చెప్పుకొచ్చాడు.. ఇప్పుడు గుర్తొస్తోంది..’

‘‘మీ దాంపత్యం అద్భుతం. కాని కాల పరిణా మంలో మీ దాంపత్యంలో.. పొరపొచ్చాలు ఏర్పడే అవకాశాలున్నాయి. ఇలా అంటున్నానని అన్యథా భావించవద్దు. వారు మహోన్నత వ్యక్తి. కాని శని ఏడవ గడిలోకి ప్రవేశించ బోతున్నాడు. అందువల్ల మీ ఇద్దరి మధ్య ఎడబాటు.. కొద్ది కాలమో ఎక్కువ కాలమో.. ఉండే అవకాశం ఉంది..’’

రఖిత ఏమంటుందో సంబుద్ధికి తెలియడంలేదు కాని అతని మనసు మొద్దుబారిపోయింది. కదిలి కళ్లు తెరిచాడు. అసలు ఈ జాతకాలు.. భవిష్యత్తు చెప్పడం బౌద్ధంలో ఉన్నట్లు కూడా సంబుద్ధి వినలేదు.

లేచాడు నిటారుగా. అతనిలో వచ్చిన మార్పు అతనికే తెలుస్తోంది. ఆ జాతకాలవాడు చెప్పింది తనను కూడా ప్రభావితం చేస్తోందా? త్రిపిటకాలు.. బౌద్ధ్ద భావనలు ప్రక్కకు పోయి రఖితతో ఎడబాటు అనే పదం చాలా కలవరపరుస్తోంది. ఎప్పుడూ ఆ ఊహే కలగలేదు ఈ ముప్పైఏళ్ల సంసార జీవనంలో. ఎంతోమంది బహు భార్యాత్వం స్వీకరించినా తను మాత్రం ఏకపత్నీ సిద్ధ్దాంతానికే కట్టుపడ్డాడు. కారణం సిద్ధాంతం కాదు జీవన అనుభవం. ఇద్దరు ముగ్గురు భార్యలున్న కుటుంబాలు చూశాడు.. ఆ గొడవలు తగవులు కొట్లాటలు.. పెద్దల తీర్పులు.. ఛ ఛ.. అతనికి జుగుప్స కలిగించేవి. అంతేకాదు.. రఖిత కూడా ఎంతో అన్యోన్యమైన భార్య. ఆమె కూడా బౌద్ధ ప్రముఖుల కుటుంబం నుంచి వచ్చింది. పైగా ఉపాలి చెల్లెలు. తనను కోరి పెళ్లి చేసుకుంది. ఆమె లేకుండా అతనికి ఒక్క క్షణం గడవదు. ఆమెతో చర్చ.. ఆలోచనలు పంచుకోవడం మధుర మాధుర్యం! తన భావాలకు నగిషీలు తీర్చిదిద్దుతుంది గాని ఖండించడం, ఎగతాళి చేయడం ఆమెకు తెలియదు. భర్త తోడితే లోకం.

‘‘మీతోనే మతమయినా.. జీవితమయినా..’’

అలాంటి రఖితతో ఎడబాటు అంటే.. మనస్సంతా కలవరపెట్టింది. కాసేపటికి కొంత ఉపశమించాడు. ఓ బౌద్ధుడు ఇలాంటివి నమ్మడం..! నవ్వొచ్చింది. ఎవరికైనా చెప్పినా నవ్విపోతారు.

బౌద్ద త్రిపిటకాలతో మమేకమైన జీవితం ఆయనది. శరీరంలోని అణువణువూ బౌద్ధ ధర్మాలనే స్మరిస్తుంది. దాదాపు పదితరాలుగా బౌద్ధంలో జీవిస్తూ బౌద్ధాన్ని శ్వాసిస్తూ ఎవరు ఏ బౌద్ధ్దశాఖను అభిమా నించినా అందరం బౌద్ధులమనే నినాదంతో అందరిని తన విహారంలో సమాదరిస్తూ సాగుతున్న పరిపూర్ణ జీవితం సంబుద్ధిది.

కాని ఇటీవల అటు సమాజంలో ఇటు కుటుంబంలోనూ సంభవిస్తున్న సంఘటనలు.. గ్రామ పెద్దలు, ఉపాసకులు, కుటుంబ సభ్యులు మాట్లాడు తున్న మాటలు, మారుతున్న అభిప్రాయాలు ఆయ నను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఏమీ అనలేక నివ్వెరబోయి చూస్తున్నాడు. నిన్నటిదాకా హైందవాన్ని అసహ్యంచు కున్నవాళ్లు, కులీనులచే సంఘ బహిష్కృతులై• బౌద్ధంలో చేరి పూర్తిస్థాయి గౌరవం పొందుతున్న వృత్తి కులాలవారు, బానిసలు, ఇతర నిమ్నవృత్తులవారు కూడా ఇప్పుడు అరామాల వంక చూడటంలేదు.

అప్పుడప్పుడూ భార్య రఖితతో తన ఆవేదనను పంచుకుంటాడు. ఆమె అదే అయోమయంతో ఉంటూ కూడా, ‘‘కాలధర్మం! సాక్షాత్తూ తథాగతుడే బతికివున్నా ఊళ్లో కనిపిస్తున్న మార్పులు.. మనుషుల మాటల్లో తేడాలు చూసి మీలాగే ఆశ్చర్యపోయే వాడేమో..’’ అంది. ఆమె మాటలు అతనికి కొంతలో కొంత సాంత్వన.

అతని ధ్యానాన్ని భంగపరుస్తూ నలుగురైదుగురు యువతీ యువకులు ఇంట్లోకి వచ్చినట్లు ఉత్తేజమైన హడావిడి.. గోలగోలగా నవ్వులు అతని ఆలోచనలను భంగపరచాయి.

సంబుద్ధి కుమారుడు అలవకుడు బంధుమిత్ర సపరివారసమేతంగా ఇంట్లోకి వచ్చాడు. ఆ బృందంలో ఉద్వేగం, ఉత్సాహం తేజరిల్లుతున్నాయి.

లేచి పెరట్లోకి వెళ్లి ముఖప్రక్షాళన చేస్తూ ఇంట్లో జరుగుతున్న తతంగం మౌనంగా చూస్తున్నాడు సంబుద్ధి.

అలవకుని బంధువులు అంటే మేనమామ, ఉపాలి కొడుకు యశుడు, కూతురు దంతిక, మిత్రులు విమలుడు, సుబాహు, గవంపతి.. మరికొందరి పేర్లు తెలియదు సంబుద్ధికి•. అలవకుని చేతిలో ఏదో చిన్న విగ్రహం.. కిటికీ నుండి చూసిన అతనికి ఆ విగ్రహం ఏవిటో తెలియలేదు.

అప్పుడే రఖిత అడిగింది, ‘‘అరె.. ఇది అచ్చు బుద్ధదేవుని విగ్రహం లాగానే ఉంది.. ఏ దేవుడు?’’

‘‘విష్ణుమూర్తి.. అవును.. బుద్ధ్దుడు కూడా విష్ణుమూర్తి అవతారమే కదా అమ్మా..’’

అవును..ఈ కట్టుకథే ఇప్పుడు లోకాన్ని మోహ పరుస్తోంది. ముఖ్యంగా గ్రామీణులు అది నమ్మి ఆరామానికి వెళ్లినట్లే గుడికి వెళుతున్నారు. సగం బౌద్ధం నాశనానికి ఈ ప్రచారమే కారణం. అందుకే ఆరామాలను పడగొట్టి ఆ శిథి•లాలపైనే శివాల యాలు, వైష్ణవాలయాలు కట్టేస్తున్నారు. అడ్డుకోవా ల్సిన పాలకులు కూడా వైదికులే. ఇక ఆపేవారేవ్వరు? అడిగితే విహారానికి కొంత విరాళం ప్రకటిస్తారు. దాంతో భిక్షువులు కూడా నోరెత్తలేని పరిస్థితి. ముఖ్యంగా రాజకుటుంబాల్లో పనిలేని మహిళలకు బౌద్ధం ఓ కాలక్షేపం!

ఇవ్వాళ ఏదో తిథి ప్రకారం పండుగట. అందరూ పూజ చెయ్యాలట. అందుకే ఇల్లంతా శుభ్ర పరుస్తున్నారు.

గుమ్మాలకు, తలుపులకు పసుపు పూయడం, కుంకుమతో బొట్లు పెట్టడం, అలాగే బట్టలన్నీ.. దుప్పట్లు, చీవారములు, తువాళ్లు ఉతికేశారు. ఇల్లంతా తాళపత్ర గ్రంథాల, చెక్క భోషాణాలు, ఉట్టెలు, మజ్జిగ కవ్వాలు, బట్టల దండేలు, కోళ్ల గంపలను శుభ్రం చేశారు. ఎడ్లబళ్లను, ఎడ్లను, ఆవులు గేదెలను కడిగి, పలుపు తాళ్లు, పట్టేళ్లు కడిగి పసుపు కుంకుమలతో అలంకరించారు. గోడలన్నీ అలికారు. తడి ఆరకముందే రంగురంగుల ముగ్గులతో గోడలకు ఏవేవో ఆకులు, లతలు, తీగెల బొమ్మలు గీశారు. వాళ్ల పొత్తాలకు, ఘంటాలకు పసుపురాసి కుంకుమబొట్లు పెట్టుకున్నారు. దంతిక వంటింట్లోకి వెళ్లి రఖితకు వంటలో సహాయపడింది. ఏవేవో పిండివంటలు చేస్తున్నారు. అందరూ ఎంతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, అరచుకుంటూ ఉత్సాహంగా ఆత్మీయంగా కలసిమెలసి ఉన్నారు. ర•ఖిత కూడా ఈ పిల్లలతో కలసి ఉత్సాహంగా చిందులు వేస్తున్నట్లుంది అనుకున్నాడు సంబుద్ధి.

ఇంత ఉత్సాహంగా అందరూ కలసిమెలసి కోలాహలం చేయడం విహారాలలో చైత్యాలలో కూడా ఉండేది వొకప్పుడు. అవన్నీ చేస్తూ చూస్తూ పెరిగాడు తను. ప్చ్.. ‌కానీ ఇప్పుడు అక్కడ ఈ సరదాలు ఆటపాటలు లేవు. కేవలం బుద్ధుని విగ్రహాల్లా మౌనంగా ధ్యానం చేయడమే ఎక్కువ. అందుకే కుర్రజనం ఎక్కువగా రావడం లేదేమో..

 అలంకారం అయ్యాక పూజ ప్రారంభించేసరికి ఆ గది ప్రాంతం అగరు ధూపాలతో పరిమళిస్తోంది.

* * * * * *

అందరిలో ఉపాలి పిల్లలు యశుడు, దంతిక పూజా విధానం, అలంకరణ అంశాలలో పూర్తి ఆధిక్యత చూపిస్తున్నారని సంబుద్ధి గుర్తించాడు. ఒకడు అడిగాడు, ‘‘ఈ పూజా విధానాలన్నీ నీకు ఎలా తెలుసు దంతికా?’’

‘‘మా ఇంట్లో మా అమ్మ, నాన్న నిత్యం ఆర్చన చేస్తుంటారు విమలా..’’

మతిపోయింది సంబుద్ధికి. నిజమా..?? బౌద్ధం పట్ల అచంచల విశ్వాసం గల ఓ ఉపాసకుడు.. బౌద్ధ్ద ఉపాధ్యాయుడు.. ఎలా ఈ వైదికమత పద్ధతులను పాటిస్తున్నట్లు. బౌద్ధుల్లోని మార్పు రానురానూ ఎలా వై•దికం వైపు అడుగులు పడుతున్నాయి??

ముఖ్యంగా క్రొత్తగా వచ్చి తీవ్ర ప్రభావం చూపిస్తున్న పదం ‘భక్తి..’ గతంలో వైదికంలో.. బౌద్ధంలో కూడా లేని మాట ఇది. ఇప్పుడు బౌద్ధంలో కూడా బలపడిపోయింది. తొలుత బుద్ధుని పాదాలు, బోధివృక్షం, సింహాసనం, ధర్మచక్రం, స్వస్తిక, త్రిరత్నం, స్తూపం మొదలైన బౌద్ధ పవిత్ర రూపాలను పూజించడం మొదలెట్టి చివరగా బుద్ధుడే దైవాంశ సంభూతునిగా ఆయన విగ్రహాలను పూజించడం సర్వసాధారణమై పోయింది. ఆయన పరి నిర్వాణం తర్వాత వందల ఏళ్లపాటు ఆయన రూపం ఎవ్వరికి తెలియదు. మహాయానం అనే శాఖ ఏర్పడ్డాక బౌద్ధ సాహిత్యం, జాతక కథ•లు తదితరాలు ఉధృతంగా వచ్చాయి. బౌద్ధం విస్తృతంగా వ్యాపించిపోయింది. కాని రానురానూ బౌద్ధం తన మౌలిక పద్ధ్దతులను వదలి వైదికాన్ని అనుసరించడం అనే తప్పుచేస్తోంది.. అని సంబుద్ధి అభిప్రాయం. పుంఖానుపుంఖాలుగా వస్తోన్న భారత రామాయణాలు తదితర వైదిక పురాణకథలు, కాకరకాయలను బౌద్ధ్దం కూడా వైదికంతో పోటీపడి సృష్టిస్తూ ఆ పోటీలో వెనుక పడిపోతోంది అన్నది సంబుద్ధి ఆవేదన.

ఒకప్పుడు ఆంధ్ర రాజ్యంలో బౌద్ధ ప్రాబల్యం ముందు వైదికం ఎక్కడా కనబడేది కాదు.

అశోకుడే ‘బౌద్ధాన్ని ఆంధ్రలో ప్రచారం చేసేదే ముంది? మిగతా ప్రాంతాలకు వెళ్లండి’ అన్నాడట బౌద్ధ ప్రచారకులతో. అది తన పదమూడవ శాసనంలో కూడా వ్రాయించాడు. అలాంటి ఆంధ్ర ప్రాంతాలలో రానురానూ బౌద్ధ్దాన్ని అనుసరించడం మానేస్తున్నారు. కొత్త కొత్త హంగులతో కనిపిస్తోన్న హైందవాన్ని నెత్తికెక్కించుకుంటున్నారు. అందులో ముప్పాతిక బౌద్ధం నుండి సంగ్రహించినవే.

కాషాయదుస్తులు, గుండు, భిక్షాపాత్ర, ఇంటిం టికి వెళ్లి భిక్ష అడగడం.. ముఖ్యంగా బుద్ధుడు ప్రారంభించిన చైత్యాలు, విహారాలు, ఆరామాలు, స్తూపాల నిర్మాణం మానవ పరిణామంలో అద్భుతం. కులీన, బానిస తేడా లేకుండా బౌద్ధ్దులైన మానవు లంతా కలసి ఓ సంఘం అంటూ ఉపాసించే ఆరామా లను నిర్మించడం ప్రపంచ నాగరికతలో భరత ఖండం లోనే ప్రారంభం. హైందవ ప్రముఖులు ఇప్పుడు వాటినే పడగొట్టి ఆ శిథి•లాలపై నిర్మిస్తున్న గుడులు, దేవాలయాలు బౌద్ధులను సైతం ఆకర్షిస్తున్నాయి. విహారాల్లాగే గుడులు కూడా అన్ని ధార్మిక, ఆర్థిక కార్యకలాపాలకు నిలయాలు అవుతున్నాయి.

పిల్లల కేరింతలతో ఆలోచనలు ఆగిపోయాయి.

పూజ చేయడంలో అనుభవమున్న దంతిక అందరికి వివరంగా చెబుతూ.. తను చేస్తున్న పద్ధతినే అందరూ అనుసరించాలని కోరగా, అందరూ ఆమెను అనుసరిస్తున్నారు రఖిత సహా. ‘‘ఉత్తిష్టంతు భూత పిశాచాః’’ అంటూ భూశుద్ధ్ది.. అక్షి•ంతలు వాసన చూసి వెనక్కివేసి ముక్కు మూసుకుంటూ తెరుస్తూ ‘‘ఓం.. భూర్భువః’’ అంటూ ఆచమనం చేయించి గోత్ర నామాదులతో సంకల్పం చెప్పించింది. గోత్ర నామాదులు తెలిసిన పిల్లలు దేవునితో అవి చెప్పడం వారికి బాగా నచ్చింది.

తర్వాత కలశపూజ అట.. తర్వాత షోడశోపచార పూజ.. ఆనక అథాంగ పూజ అయ్యాక దేవుడి అష్టో త్తర శత నామావళి దంతిక చదువుతుంటే అందరూ పువ్వులతో ఏకవింశతి పత్రాలతో పూజించారు. తర్వాత ప్రసాదాలు స్వామికి నైవేద్యమట.. సమర్పించి కర్పూరంతో మంగళహారతిచ్చింది దంతిక. కొబ్బరి కాయ కొట్టాడు యశుడు. చివరగా ‘‘యానికానిచ పాపాని..’’ అంటూ ఆత్మ ప్రదక్షిణతో పూజ పూర్తి చేసి పులకరించారు.

ఇవన్నీ రెండు మూడేళ్లుగా ఊరిలో అటూఎటూ వెళుతూ వస్తూ ఎక్కడో ఓ ఇంట్లో చూస్తూనే ఉన్నాడు సంబుద్ధి. ఇవ్వాళ తన ఇంటికి కూడా వచ్చాయి.

ప్రసాదాలు తింటుండగా ‘‘ఏం కోరుకున్నావోయ్‌ ‌విష్ణుమూర్తిని?’’ అడిగాడు యశుడు అలవకుని. ‘‘మా నాన్న ఆరోగ్యం ఇటీవల బావుండటం లేదు. ఆయనకు మంచి ఆరోగ్యం ఇవ్వు దేవుడా అని కోరుకున్నాను’’ అన్నాడు.

కదిలిపోయాడు సంబుద్ధి. కనుకొలుకుల్లో నీరు ఉబికింది. అంతలోనే ఆశ్చర్యచకితంతో భ్రృకుటి ముడిపడింది. ‘నాకు ఆరోగ్యంలో తేడాలున్నట్లు వీడికెలా తెలుసు..? నేను వాడితో చెప్పలేదే.. అసలు ఇంట్లో రఖితతో కూడా అనలేదు.’

ఆరామం భిషక్కు తనతో మాట్లాడినప్పటి సంగతి గుర్తుచేసుకున్నాడు. గుర్తొచ్చింది.. అప్పుడు ప్రక్కను న్నది ఉపాలి. అంటే… ఉపాలి అలవకుడితో చెప్పి ఉంటాడు.. ఉపాలి.. ఉపాలి!!

* * * * * *

ఆరోజు ఆరామంలో ‘ఉపోసత’. అంటే ఉపవాస దినం. కార్తిక•మాసం మొదటి పక్షంలో ఎనిమిదవ రోజు. ప్రతినెలా రెండుపక్షాలలో ఎనిమిది లేదా పద్నాలుగవ దినాన్ని ఉపోసత దినంగా బుద్ధుని కాలంనుండి పాటిస్తున్నారు. రోజంతా ఉపవాస ముండి ‘పతిమోఖ’ను పఠించాలి. ఆరోజు ఆరామాన్ని మొత్తం శుభ్రంచేసి చక్కగా అలంకరించాలి. ఆ బాధ్యతను భదంతానంద అనే ధేరీకి అప్పగించాడు సుబుద్ధి. నట్టిని కూడా ఆయననే రూపొందించమని ఆదేశించాడు కూడా. మధ్యాహ్నవేళకు ఆరామం వైపు కదిలాడు.

ఆరామంలో భిక్షువులు ఎందరున్నారో.. భిక్షణీలు ఎందరున్నారో.. ఎందరు ఉపాసకులు, గృహపతులు వచ్చారో.. ఎందరు సిద్ధ విహారికులు ఉన్నారో.. భదంతానందుని మాట అందరూ వింటున్నారో లేదో..

వెళ్లబోతూ రఖిత కూడా వస్తుందేమోనని ఆమె కోసం అన్ని గదులూ వెదుకుతూ పెరట్లోకి వెళ్లాడు. పెరట్లో చుట్టిల్లు గోడలను మట్టి, పేడ కలిపి కాళ్లతో తొక్కిన మట్టిసుద్దలతో అలుకుతోంది రఖిత. కట్టుకున్న చీవారం అంతా అంటుకున్న మట్టి.. తడిసిన ముంగురులను వెనక్కు తోసుకుంటూ ప్రక్కనున్న నీళ్లకుండలో నీళ్లతో గోడకు తడి చేస్తూ.. వేగంగా అలుకుతున్న రఖితను చూసి అడుగు వెనక్కు వేశాడు సంబుద్ధి. ఆమెను చూస్తే ఆరామానికి వస్తావా అని అడగలేకపోయాడు. అడిగితే ఈపనంతా ఎవడు చేస్తాడు? అంటూ చికాకు చూపుతుంది. ఆరామ నిర్వాహకుడిగా తన ఇంట్లో దాసులను, బానిసలను తొలగించి ఆమెతో పాటు ఇంటి పనులన్నీ చేయిస్తు న్నాడు. తొలుత అంగీకరించినా ఇప్పుడిప్పుడు ఓపిక నశించి బానిసలను పెట్టుకుందామని పోరుతోంది రఖిత. ‘పాపం.. పనంతా చేసుకోలేకపోతోంది. ఒకరిద్దరు పనివాళ్లను పెట్టుకోవాలి. అసలు ఉపోసత చేస్తోందో లేదో..

‘పతిమోఖ’ అంటే ఉపాసకులు, భిక్షువులు, భిక్షుణీలు పాటించాల్సిన నియమ నిబంధనావళి. గతంలో అందరికి ఒకటే ఉండేది. ఇటీవల 227 నియమావళితో భిక్షువులకు, 311 నియమావళితో భిక్షుణీలకు వేరువేరు పతిమోఖలను రూపొందిం చారు. మొత్తం 538 నియమాలు కంఠోపాఠంగా శ్రుతిశుద్ధంగా పఠించగలడు సంబుద్ధి. కాని తనకంటే ఉపాలి మరింత అద్భుతంగా గొంతెత్తి గానం చేయగలడని సంబుద్ధి అభిప్రాయం. ఆవరణలోకి ఆడుగుపెట్టి ఎదురుగా కనిపిస్తున్న దృశ్యం చూసి మ్రాన్పడిపోయాడు.

ప్రవేశద్వారం వద్ద ఉపాలి!!

అందుకే ఆరామం ప్రవేశద్వారం వద్ద హడావిడి ఎక్కువగా ఉంది. అతని చుట్టూ మూగి అనేకమంది ఉపాసకులు, భిక్షువులు, సిద్ధ విహారికలు, గృహ పతులు ఉన్నారు. ఎంతమందినైనా తన కబుర్లతో, జాతక కథలతో అలరించగలడు ఉపాలి.

 గత పక్షం రోజులుగా కోల్పోయిన ఉత్సాహం, ఓపిక, చురుకు ఉపాలిని చూడగానే సుబుద్ధిలో జలపాతంలా జాలువారాయి. అంతమందితో ముచ్చటిస్తున్నా రహదారి వైపు ఓ కన్నేసి ఉన్న ఉపాలి ముఖంలో సంబుద్ధి కనిపించగానే ఓ వెలుగు అలా మెరిసింది. దానిని సంబుద్ధి కూడా గుర్తించక పోలేదు.

ఇద్దరూ మందస్మిత వదనులయ్యారు. చిరునవ్వే పలకరింపుగా లోపలికి వెళ్లారు. ధేరీ భదంతా నందుడు సంబుద్ధికి నమస్కరించాడు. ఆరామం ప్రధాన చర్చా మందిరమంతా చక్కగా అలంకరించి ఉంది. అవన్నీ క్రీగంట గమనించాడు సంబుద్ధి. ఆనందుని అభినందనగా చూశాడు. మందిరం సగం నిండింది. గతవారం కన్నా ఈరోజు కొంచం నయ్యం.. ఎక్కువగానే వచ్చారు అనుకుంటుం డగా అతనిచూపు గద్దె పై ఓప్రక్కగా చెక్కబల్లపై పేర్చి పెట్టివున్న కొత్త చివారముల దొంతరపై పడింది. అంటే ఈ రోజు కతిన కూడా ఉన్నది కదూ.. తనే మర్చి పోయినట్లు గుర్తొచ్చింది సంబుద్ధికి. ఇటీవల మనసులో కలుగుతున్న అలజడితో అన్ని మరచి పోతున్నాడు కూడా.

* * * * * *

సంబుద్ధే తన స్నేహితుడు, రఖితకు అన్నవరస అయిన వణిజుడు ధమ్మకీర్తి ఇంటికి వెళ్లి మరీ అభ్యర్ధించాడు. ‘‘మిత్రమా ఈనెల కతిన కార్యక్రమం ఉంటంది. పేదలకు చీవారములు ఇచ్చే దాతలు తగ్గి పోతున్నారు గాని వాటి కోసం ఆశగా దాసులు తప్ప కుండా వస్తారు.. కాస్త ఈ నెలకు కొన్ని చీవారములు దానం చెయ్యి మిత్రమా..’’

‘‘అయ్యయ్యో అలాగా..నువ్వు అభ్యర్ధ్దించడమూ నేను కాదనడమా… తప్పక ఏర్పాటు చేస్తాను. కాని సంబుద్ధీ! రానురానూ బౌద్ధం పాటించే వాళ్లు తగ్గి పోతున్నారని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. మా శ్రేణిలో కూడా ఇదే చర్చ.. ఎందుకంటావ్‌?’’

ఏమి చెప్తాడు? కరుడుకట్టిన బౌద్ధులు.. బౌద్ధ శ్రమణకులు, అర్హంతలు, భిక్షుకులు.. భిక్షుణిలు, ధేరీలు కూడా దేవాలయాల వైపు, దేవతల వైపు దృష్టి సారిస్తున్నారని ఎలా చెప్తాడు.. ఉపాలి గుర్తొ చ్చాడు.. ఉపాలి దమ్మకీర్తికి అన్న వరస. అలాంటి ఉపాలే విహారానికి రావడం తగ్గించాడని చెప్పడం.. ఎంత అవమానకరం?

‘‘బౌద్ధంలో చెప్పే ఇహలోకం కంటే వైదికంలో చెప్పే మరుజన్మపైనే ప్రజలకు నమ్మకం పెరిగి పోతోంది దమ్మా..’’

అన్నాడు నవ్వలేక నవ్వుతూ.

‘‘అదేమో గాని గుళ్లవద్ద కోలాహలం.. ఆ గంటల మ్రోత.. ఆ పాటలు.. ఆ చిందులు.. భలే.. మనకూ వాళ్లతో ఆడిపాడ బుద్ధ్దౌతుంది. కాని చైత్యం వద్ద ఏముంది? అందరూ ముక్కుమూసుకుని ధ్యానం చేస్తుంటారాయే.’’

ఛ•ళ్లున కొట్టినట్లయింది. బుద్ధుని బోధనలోని ఔన్నత్యం తెలియనివాళ్లు కాదు వీళ్లు. ఎన్నో తరాలుగా బౌద్ధ ధర్మాలను పాటిస్తూ సమసమాజాన్ని గౌరవిస్తున్న ఇలాంటి వాళ్లు కూడా ఇప్పుడు బౌద్ధం కన్నా వైదికమే కాస్తంత మిన్న అన్న ధోరణిలో మాట్లాడటం సంబుద్ధిని నిరుత్తరుని చేసింది. వెంటనే ఏమీ అనలేక పోయాడు.

సంబుద్ధి ముఖంలోని విచార చారికలు చూశా డేమో వెంటనే, ‘‘ఆ.. సంబుద్ధీ తప్పుకుండా ఓ వందమందికి చీవారాలు పంపిస్తాను. సరేనా..!’’ అంటూ రఖిత గురించి కుశలప్రశ్నలు వేశాడు దమ్మకీర్తి.

దమ్మకీర్తి చీవారములు పంపించాడు కాబోలు. ఈరోజు కతిన ఉన్నదని, కొత్త చీవారములు పంపిణి చేస్తారని తప్పకుండా ఊళ్లో ప్రచారం అవుతుంది. వాటి కోసమే కొందరు వచ్చినట్లున్నారు. అసలు చీవారములు చెట్ల వద్ద, పెంట కుప్పలవద్ద దొరికిన గుడ్డపీకలను ఏరుకుని బట్టలా కుట్టుకుని ధరించా లన్నది బౌద్ధపు ఆదిసూత్రం. తన ముత్తాత అలా జీవించాడని సంబుద్ధి తాత చెబుతుండే వాడు. కాని తానెప్పుడు ఆ ఆచారాన్ని పాటించే భిక్షువులను చూడలేదు. ఎంతో మంది ధనవంతులు శ్రమణులకు ఎంతో ఖరీదైన చీవారములు అందజేయడం వారి బౌద్ధభక్తికి చిహ్నంగా భావించేవారు.

ఆ స్వర్ణయుగం అంతమై వణిజులు కూడా బతి మిలాడితే గాని దానం చెయ్యని కాలం వచ్చేసింది. ఇతర దేశాలలో బౌద్ధం ఆయా సమాజాలను పూర్తిగా ఆవహించి ఉన్నదని దమ్మకీర్తిలాంటి విదేశీ వర్తక మిత్రులు చెబుతుంటే పులకిస్తుంటాడు సంబుద్ధి. అవన్నీ నిజమైతే మరి ఇక్కడ ఎందుకింత అధః పాతాళం వైపు పయనిస్తోందన్నదే ఆతని విచారం.

వేరువేరు రాజ్యాలలో బౌద్ధ జీవనం ఎలా ఉందో ఇక్కడి వాళ్లకు తెలియదు. ప్రక్క గ్రామంలో జరిగింది ఇక్కడ తెలియడానికే మళ్లీ సంత రావాలి. విజయపురి విహారానికి వచ్చే దేశదేశాల శ్రమణకులు, భరత ఖండంలోని రాజ్యాలలోని ప్రముఖ బౌద్ధ్దగురువులు ఈ అహదనకరంలోని విహారానికి కూడా వస్తూనే ఉంటారు. ఎక్కడో హిమాలయ సానువుల్లో, మగధలో, ఆర్యావర్తంలోని ఉదంతాలు ఇక్కడ తెలుస్తుంటాయి. అవన్నీ సంబుద్ధి నగ•ర పౌరులతో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల గృహపతులకు వివరిస్తూనే ఉంటాడు. ఒకప్పుడు విన్నది విన్నట్లుగా పాటించేవారు. ఇప్పుడు విన్నది ఎంతవరకు పాటిస్తున్నారో.. సందేహమే.

మరి కాసేపటికి సమావేశమందిర వేదిక పైకి ఉపాలి రావడంతో అందరూ ముచ్చట్లు కట్టిపెట్టి ధ్యానముద్ర వేసుకుని నిటారుగా కూర్చున్నారు. ఆజాను బాహువు, పచ్చని వర్ణంతో విపాసనవల్ల వచ్చిన తేజోమయముఖంతో అందరిని ఇట్టే ఆకర్షించగల ఉపాలి దీర్ఘంగా శ్వాస తీసుకుని ఉప న్యాసం ప్రారంభించాడు. యోగముద్రలో నిటారుగా కూర్చున్న ఉపాలిని చూడటం ఉపాసకులందరిలాగే సంబుద్ధికి కూడా చూడ ముచ్చట!

‘‘సంఘ సభ్యులంతా నేను చెప్పబోయేది శ్రద్ధ్దగా వినండి. ఈరోజు ఉపోసతదినం. సంఘం సిద్ధంగా ఉన్నట్లయితే ఉపోసత కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సరేనా?

అందరూ ముక్త కంఠంతో, ‘‘అలాగే ఉపాధ్యాయా..’’

‘‘మనకు అత్యంత ఆదరణీయ గ్రంథ పతిమోక్ఖను చదవడం ప్రారంభిస్తాను..’’

‘‘సంతోషం ఉపాధ్యాయా.. మీరు చెప్పేది మాకు స్పష్టంగా వినబడుతున్నది. మా మనసుల్ని పూర్తిగా కేంద్రీకరించి మీ మాటలను శ్రద్ధగా వింటున్నాం ఉపాధ్యాయా.. ’’

‘‘పతిమోక్ఖ ఒక్కొక్క నియమాన్ని చదువుతాను. ఆ నియమాన్ని మీలో ఎవరైనా ఉల్లంఘించినట్లయితే లేచి నియమోల్లంఘన మందిరంలోకి వెళ్లండి. ఉల్లంఘించనివారు మౌనంగా తదుపరి నియ మాలను వినండి. తదుపరి నియమాన్ని చదువుతాను. ఇది మనం ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పాటిస్తున్నది ఆ బుద్ధ్దదేవుడు నిర్ణయించిన నియమావళి..’’

‘‘అలాగే ఉపాధ్యాయా..’’

ఇది ప్రారంభోపన్యాస విధానం. అనంతరం ఉపాలి ఒక్కొక్క నియమం చదివి ఆపుతున్నాడు. ఆ నియమం ఉల్లంఘించినవారు లేచి ప్రక్కనే గల ఉల్లంఘన గదిలోకి వెళ్లాలి. ఎవ్వరూ లేవలేదు. రాను రానూ ఉల్లంఘన చేసినట్లు అంగీకరించేవారు తగ్గి పోతున్నారు. అంతా గుంభనంగా ఉండిపోతున్నారు. మొత్తం పతిమోక్ఖ చదవడం అయ్యింది కాని ఒక్కరూ నియమోల్లంఘన చేసినట్లు అంగీకరించలేదు.

ఉపాలి పతిమోక్ఖ చదువుతుండగా వినడం ఓ అద్భుత అనుభవం. ఎన్నోసార్లు విన్న సంబుద్ధికి కూడా మరింత వినాలనిపిస్తుందే కాని విసుగు కలగదు. ఈరోజు అందరి ముఖాలలో కూడా అదే భావన.. ‘ఉపాలి అద్భుతంగా పఠించాడు.’ సంబుద్ధి మహాదానంద సంభరితుడైయ్యాడు. కాని ఉపాలి అతని ఆనందాన్ని ఒక్కమాటతో తుడిచి పెట్టేశాడు.

‘‘అద్భుతంగా చదవడం ఏవిటి బావా!. ఎవ్వడూ ఒక్క.. ఒక్కటంటే ఒక్క నియమాన్ని కూడా ఉల్లంఘించినట్లు లేవలేదు. పైగా భలే చదువుతున్నాడే అని పురాణం విన్నట్లు మైమరచి విన్నారు. ఇదేనా ఆ బుద్ధదేవుడు పతిమోక్ఖలో కోరుకున్నది?! ఇంత కంటే గుడికి వచ్చే భక్తులు నయం. బయటకు చెప్పక పోయినా లోలోన చెప్పుకుని లెంపలు వాయించు కుంటారు. ఇప్పుడు వినాయకుడి గుడిలో కొత్త పద్ధతి ఒకటి వచ్చింది. చెవులు పుచ్చుకుని గుంజీలు తీయడం.. భలే..’’ చటుక్కున ఆగిపోయాడు ఉపాలి.

ఉపాలిలో వచ్చిన మార్పులు వినడమే కాని అతని నోటినుండి ఎప్పుడూ వినలేదు. సంబుద్ధి ముందు ఇతర మతపద్ధతులను ప్రశంసించడం ఉపాలి జీవితంలో ఎప్పుడూ చెయ్యలేదు. అత్యుత్సా హంతో చెప్పి నాలిక కరుచుకున్నాడు. ఉపాలిని చూసిన దగ్గరనుండి పొంగి పొరలిన ఉత్సాహం తుస్సున తగ్గిపోయింది సంబుద్దికి.

ఇద్దరూ మౌనంగా ఆరామం అంతా కలయ దిరిగారు. వైద్యశాలను పరికించారు.

తిరిగి ప్రవేశ ద్వారం వద్దకు వచ్చారు. ఇక దారులు వేరవ్వాలి. అప్పుడన్నాడు ఉపాలి, ‘సంబుద్ధీ.. ఆరోగ్యం ఎలా ఉంది? ఏమైనా మందులు వాడుతు న్నావా?నువ్వు ఏమీ అనుకోనంటే నీ జాతకరీత్యా నీకు కొంతకాలం అనారోగ్యం తప్పదు. ఇదిగో.. ఇది రుద్రదేవుడి విభూతి. రోజూ ఆరుసార్లు కొంచం కొంచం నోట్లో వేసుకుంటూ ఉండు. చెడు ప్రభావం తగ్గుతుంది..’ గుండె చిక్కబట్టుకుని చెప్పాలనుకున్నది చెప్పేసి ఆ విభూతి పిడత సంబుద్ధి చేతిలో పెట్టి మరో వైపు వడివడిగా సాగిపోయాడు.

* * * * * *

ఉపాలి కలిగించిన దిగ్భ్రమతో ఎక్కడెక్కడో తిరిగాడు సంబుద్ధి. ఏదేదో సణుగుడు.. ఏవేవో పిచ్చినవ్వులు.. దేవతలు చుట్టుముడుతున్నట్లు.. ఏనుగు తల వినాయకుడట.. మెళ్లో పాము, తలలో నీళ్లు, విబూది పూసుకుని రుద్రుడట.. వీణ వాయిస్తోంది సరస్వతి అట.. పువ్వులో కూర్చుంది లక్ష్మి అట..

తను చిన్నప్పుడు చూసింది ఇప్పటికీ కాస్త భక్తిలాంటిది కలిగేది అమ్మ దేవతలను చూసినప్పుడు. తమ గ్రామదేవత పక్కలమ్మ. ఆమెకు కొలుపులు జాతరలు చెయ్యడం.. దున్నపోతులను, గొర్రె పోతులను బలిఇవ్వడం.

ఆ గ్రామక్రతువు అమ్మానాన్నల చాటునుంచి భయం భయంగా చూడటం ఇప్పటికీ గుర్తే. అమ్మా నాన్నలు పూర్తిగా బౌద్ధులు. కాని గ్రామాల్లో జరిగే ఇలాంటి గ్రామోత్సవాలకు హాజరయ్యేవారు. అక్కడ గ్రామపెద్దలు దాదాపు అందరూ బౌద్ధులు అయినా ఎన్నోతరాలుగా పూజలు అందుకుంటున్న గ్రామ దేవతలకు కొలుపులు జరిపేవారు. దానిని ఎవరూ తప్పుపట్టేవారు కాదు. కాని తర్వాత తర్వాత వచ్చిన ఈ వైదిక పెద్దలు, పురాణ దేవతల పురోహిత వర్గాలు వాటిని అసహ్యించుకోవడం మొదలెట్టారు. వీరి ఆధిక్యతా భావనలను, కొందరికే పరిమితమైన దేవతారాధనలను బౌద్ధులు నిస్సంకోచంగా ఎదిరి స్తున్నారు. కాని రానురానూ ఈ లాగుడు పీకుడులో వాళ్లదే పైచేయి అవుతోంది. అదే సంబుద్ధిని కలవర పరుస్తున్న అంశం.

తిరిగి తిరిగి ఇంటికి వచ్చాడు. ఎదురుగా గుమ్మంలో రఖిత. ఆమెను చూసి అలా నిలబడి పోయాడు. మూర్తీభవించిన హైందవ స్త్రీల ముఖాన పసుపు, నుదుటన కుంకుమ బొట్లు.. దవడల ప్రక్కన చందన లేపనం.. చీవారము బౌద్ధ్ద పద్ధతిలో కాకుండా చీరే పద్ధతిలో నడుము చుట్టూ తిప్పి బొడ్డువద్ద దోపి.. పైట వేసి.. నడుముకు బంగారు వడ్డాణం.. మెడ నిండా నగలు.. కాళ్లకు అందియలు, కంకణాలు.. మొత్తంగా హైందవ స్త్రీలు ఇటీవల ముచ్చటగా పిలుచుకుంటున్న ‘ముత్తైదువు’లా అసలే అందమైన స్త్రీయేమో మరింత అందంగా మెరిసి పోతోంది.

దగ్గరగా వచ్చి, ‘‘పక్కింటి కొడబలిసిరి వదినగారు ఈరోజు మంగళగౌరి వ్రతమట.. నోచుకుంది. భలే ఉంది ఆ పూజ. ఇవిగో ఇవి అక్షంతలట. ఇవి నా తలపై వేసి ఆశీర్వదించాలట. భర్తకు పరిపూర్ణ ఆయుష్షు.’’ అంటూ భర్త చేయిపట్టి అక్షంతలు చేతికిచ్చింది. ఆనందంతో మెరిసి మురిసిపోతున్న రఖిత నుంచి అందుకున్న అక్షంతలు ఆమె ముఖాన విసిరి చాచి లెంపకాయ కొట్టాడు సంబుద్ధి. ‘నీక్కూడా నేను లోకువయ్యనా.. మనం బౌద్ధులం.. ఇవి బౌద్ధ పద్ధతులు కావని నీకూ నీ అన్నకు తెలియదా.. నాకు నచ్చవని నేను పాటించనని తెలిసి కూడా మీరు ఇవన్నీ నా వద్దే చెయ్యడం.. ఛ..ఛ..’’ ఆవేశంతో ఊగిపోయాడు. రఖిత మ్రాన్పడిపోయి రెండడుగులు వెనక్కు వేసింది. భర్త ఎప్పుడూ తనతో ఇలా ప్రవర్తించడం ఆమెకు అనుభవంలో లేదు.

* * * * * *

మరి కొద్దిరోజులకు మరో సమస్య వచ్చి పడింది. నాలుగేళ్లనాడు ఏకైక కుమారుడు అలవకునికి దగ్గరగా ఉన్న పల్లవ పట్టణానికి చెందిన మరో గొప్ప బౌద్ధా చార్యుడు అనంత పిండకుని కుమార్తెతో వివాహం జరిపించాడు సంబుద్ధి. ఇటీవల ‘అమ్మాయి ఈరే డింది. తమరి అనుజ్ఞ అయితే కాపురానికి పంపిస్తా’ నని పిండకుడు వార్త పంపించాడు. అది చదివి నొసలు చిట్లించాడు సంబుద్ది. ఇదేదో వైదిక పద్ధతిలా ఉందే అనే శంక మనసులో కలిగింది. ఇలా కోడలిని కాపురానికి తీసుకువచ్చేందుకు ఓ విధానం బౌద్ధంలో ఉన్నదో లేదో.. బుద్ధ భగవానుడు ఈ విషయమై ఏమి చెప్పాడో.. సంశయం కలిగింది. తనే అందరికి వచ్చే సంశయాలు తీర్చే బౌద్ధాచార్యుడు.. ఇక తనకే శంకలు కలిగితే తీర్చే వాడెవ్వడూ.. ఏమి చెప్పాలో తెలియక ఉండిపోయాడు. కాని కొడుకు అలవకుడు ఉండిపోలేదు. సరాసరి వెళ్లి అత్తవారి ఊళ్లో పురోహితుడు చెప్పిన ముహూర్తానికి శోభన సంబరం గట్రా జరిపించేసి బంధుమిత్ర సపరివారసమేతంగా మేళ తాళాలతో అట్టహాసంగా ఊరంతా చెప్పుకునేలా ఇంటికి తీసుకువచ్చాడు.

‘‘బావగారూ.. నమస్కారం..’’ అన్నాడు అనంత పిండకుడు. అదే గుండు.. కాకపొతే వెనక గోష్పాదమంత జుట్టు ముడి. అవే కాషాయదుస్తులు. కానీ చీవారములు కాదు. చీవారము అంటే మూడు వస్త్రాల దొంతర. లోపలి వస్త్రం.. పైన తొడుగుకుని నడుమువద్ద ముడి వేసుకునేది.. పైన భుజంపై వేసుకునేది. అనంత పిండకుడు హైందవ పంచే కట్టి మూడవ వస్త్రం భుజాన వేసుకున్నాడు. అతని కుటుంబం పూర్తి హైందవులుగా మారిపోయినట్లు సంబుద్ధికి తెలియదు. ఒకనాడు అతడు ఓ నిమ్నవర్గ బానిస. బౌద్ధుడుగా మారి గొప్ప భిక్షువుగా ఎదిగి మహారాజు చేత కాళ్లు కడిగించుకున్నాడు.

‘‘ఎలా ఉన్నావు అనంత పిండకా..?’’అడిగాడు సంబుద్ధి.

‘‘ఇప్పుడు మావయ్యగారి పేరు ఈశ్వరయ్య.. నాన్నా..’’ అన్నాడు కొడుకు అలవకుడు.

అప్రతిభ్రుడై చూశాడు సంబుద్ధి. గతంలో చెరువు తవ్విస్తే ‘చలమయ’ అని.. వరదలు రాకుండా ఉండా లని మొక్కుకుని ‘వరదయ్య’ అని పేర్లు పెట్టేవారు పిల్లలకు. బౌద్ధం వ్యాప్తి చెందాక బౌద్ధ వాఙ్మయంలో బుద్ధని జాతక కథ•ల్లోనూ కనిపించే వినిపించే అత్యు త్తమ బుద్ధభక్తుల పేర్లను పుట్టిన పిల్లలకు పెట్టు కోవడం ఇక్కడి బౌద్ధ కుటుంబాల్లో ఐదుతరాలుగా ఆకర్షణ. ఇప్పుడు మతంతో పాటు పేరు మార్చు కోవడంలో తప్పేముంది.. ఆశ్చర్యపోతేనే తప్పు!!

‘‘అవును స్వామీ! ఇప్పుడు నేను పూర్తిగా హిందువును కావడంతో హిందు పేరు మార్చు కున్నాను..’’ అన్నాడు ఈశ్వరయ్య అనబడే అనంత పిండకుడు చేతులు జోడించి.

‘‘మావయ్య పల్లవ పట్టణంలో ఆరామం పడగొట్టి లకులీసుని గుడి కట్టించాడు నాన్నా..’’ అదేదో గొప్ప అంశంగా చెప్పాడు అలవకుడు. ‘‘ఊర్కోండి అల్లుడు గారు. మీ నాన్నగారికి రుచించే అంశం కాదు..’’ అన్నాడు నవ్వుతూ. అంటే పల్లవుల కాలంలో ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా వెలిగిన పల్లవ పట్టణంలో బౌద్ధ ఆనవాళ్లను ఒకనాటి బౌద్ధులే పూర్తిగా చెరిపేశారన్న మాట! ఈ చుట్టుప్రక్కల దాదాపు పాతిక గ్రామాలలో స్తూపాలు పూర్తిగా పోయి అన్ని గుడులయ్యాయని విన్నాడు. ఈ సంఖ్యా రోజురోజుకు పెరుగుతోంది.. అది నచ్చినా నచ్చకపోయినా నిజం!!

 కొత్తకోడలు వచ్చినప్పుడు నిర్వహించే హైందవ తంతు, పూజలు అయ్యాక అందరూ కూర్చుని ఇల్లు దాటి వీధి వీధి హోరెత్తిపోయేలా భజన చేయ సాగారు. పిచ్చెక్కి పోయింది సంబుద్ధికి. భరించలేక గబగబా బయటకు వెళ్లిపోయాడు. ఆరామం చేరి అక్కడే ఉండిపోయాడు ఆరోజే కాదు.. దాదాపు మరో పక్షం రోజులు.

ప్రశాంతమైన వాతావరణం. అంతా బౌద్ధ భిక్షువులు, భిక్షుణిలు.. అంతటా మార్మోగుతున్న బౌద్ధ త్రిపిటకాలు.. ఎదురుగా మహాగురువు బోధిసత్వుని నిలువెత్తు మృణ్మయశిల్పం.. ధ్యానముద్రలో.. అర్ధనిమీలిత లోచనాలతో.. ఆ మహామానవుని పాదాలవద్దే తనకు ప్రశాంతత!

ఇంటి కంటే ఆరామం పదిలం అన్నట్లుంది సంబుద్ధికి. ఇంటికి వెళితే చూసేవి.. కళ్లముందు జరిగేవి నచ్చకపోయినా ఏమీ చేయలేని నిస్స హాయత.. అసంతృప్తి.. చికాకు..

‘భార్య, కొడుకు.. కనీసం వీడు ఏమయ్యాడు అని కూడా ఆందోళన చెందడం లేదనుకుంటా.. ఎక్కడికి పోతాడు ఆరామంలోనే ఉండి ఉంటాడు అనుకుని ప్రశాంతంగా ఉండి ఉంటారు..’ అను కున్నాడు.

పక్షం రోజుల అనంతరం రఖిత.. విహారం మధ్యగా నిలబడి చూస్తోంది.. దీనంగా ఆర్తిగా.

చటుక్కున కదిలి లేచాడు. ఆమె పరుగు పరుగున వచ్చి హత్తుకుంది. ఒక్కసారిగా పొంగింది దుఃఖం. ఇద్దరూ అలా మౌనంగా దుఃఖిస్తూనే ఉన్నారు. మరి కాసేపటికి అలికిడి విని గాఢ పరిష్వంగంలోంచి విడివడ్డారు.

‘‘ఇంటికి వెళదాం.. పదండి’’ అంది రఖిత కళ్లు తుడుచుకుంటూ. తిరిగి బుద్ధుని పాదాలపై తలవాల్చి ‘‘ఇంతకంటే.. సుఖం.. గొప్పశాంతి అక్కడలేదు రఖితా..’’ అన్నాడు. ‘‘అయితే ఇంటికి రానంటారు..?’’ అంది గట్టిగా.

‘‘నువ్వూ ఇక్కడికి నాతో వచ్చేయి.. రఖితా! నువ్వుంటే చాలు రఖితా నాకు..’’ అన్నాడు. అతని గొంతులో తడి.. ‘‘కాని కానీ.. ఇల్లు పిల్లలు..’’

‘‘భగవానుడు ఎందుకు అంత ప్రశాంతంగా ఉంటారో ఈ పక్షం రోజుల్లోనే తెలిసింది నాకు..’’ అన్నాడు. ఆమె ఏదో అనబోయింది. అప్పుడే ఆరామం బయట పెద్దరోద.. ఏదో ప్రకటన. ‘‘ అందరికి తెలియజేసేదేమంటే.. యుద్ధం. మన మహా రాజులుంగారు శీశీశ్రీ మంచన్య భట్టారకుల వారు యుద్ధం ప్రకటించారు. కాబట్టి గ్రామంలోని సైనికు లంతా సమాయత్తం కావాలని గ్రామ తలారి చిము కుల వారు యావన్మందికి తెలియజేస్తున్నారోహో…’

ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సంబుద్ధి లేచి నిలబడ్డాడు. బయటవైపు చూస్తూ, ‘‘రండి రండి.. ఇంటికి పోదాం..’’ అంటూ బయటకు వేగంగా వెళ్లింది రఖిత.

ఆరామం, చైత్యం, విహారం లోలోపల వేరువేరు మందిరాలలో, గదుల్లోవున్న భిక్షువులు, భిక్షుణిలు, థెరీలు, వైద్యులు, ఉపాధ్యాయులు.. తదితర బౌద్ధ సమూహం అంతా గందరగోళంగా అటూఇటూ పరుగులు పెడుతున్నారు. ఏమైందో అనుకుంటూ బయటకు వచ్చాడు సంబుద్ధి.

బయట రఖిత, ఉపాలి, అలవకుడు.. ముగ్గురూ ఏదో తీవ్రంగా మాట్లాడుకుం టున్నారు. చటుక్కున లోపలికి తప్పుకున్నాడు సంబుద్ధి. ఆమె వెంట వాళ్లిద్దరూ కూడా వచ్చారన్నమాట. కానీ లోపలికి రాలేదు. దవడ బిగుసుకుంది. ముగ్గురూ సంబుద్ధిని చూడలేదు. వెనుదిరిగి శకటం ఎక్కి వెళ్లిపోయారు.

గ్రామ దైనందినంలో ఆహార పోరాటమే ప్రధానం. కాని యుద్ధం అంటే మాత్రం అందరూ తీవ్రంగా స్పందిస్తారు. పౌరషాగ్ని రగుల్కొంటుంది. రాజులు యుద్ధానికి గ్రామగ్రామానా చాటింపు వేసి పిలుస్తారు. దాదాపు అందరూ యుద్ధ్ద సన్నద్ధులౌ తారు. ప్రస్తుత మహారాజు మాధవవర్మ. విష్ణుకుండిన వంశస్థుడు. బ్రాహ్మణుడు. కాని సర్వమత ప్రోత్సాహి. అనవసరంగా మతం రుద్దని మంచిరాజుగా బౌద్ధులు కూడా అభిమానిస్తారు. కాని తన పాలనా కాలంలో అశ్వమేధ యాగాలు లాంటివి చేసి చాలామంది సైనికుల చావుకు కారణ మయ్యాడు. దీర్ఘకాలం పాలించిన ఆయన ఇటీవలే మరణించాడు. ఆయన కొడుకు మంచన్య భట్టారకుడు రాజయ్యాడు. వీడో చవట. వీడి ప్రతాపం తెలిసి శత్రువులు కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ఇప్పుడు కర్ణాటకం నుండి చాళక్యులట.. యుద్ధభేరి మ్రోగించారు.

బౌద్ధ్ద సంఘానికి యుద్ధం ఓ విచిత్రమైన అంశం. యుద్ధ్దాన్ని ఓ గ్రామ దృక్కోణం నుండి చూసినప్పుడు అదొక ఉద్వేగభరిత కార్యకలాపం. అప్పుడు కుల మతాలు ఉండవు. కులీన బానిస తారతమ్యాలుం డవు. ఎవరు గెలుస్తారు? శత్రువు శక్తియుక్తులేవిటి? మన సైన్యం పరిస్థితి ఏవిటి? మన గ్రామంలో మంచి యోధులు ఎవరున్నారు? ప్రతి ఇంటిలో.. ఆఖరికి విహారంలో కూడా ఇదే చర్చ.

‘‘మన ఉపాధ్యాయుడు ఉపాలి గ్రామసైనికుల బృందానికి నాయకుడట.. చెప్పుకుంటున్నారు ఊళ్లో..’’ చురుక్కున చూశాడు సంబుద్ధి. నిజమే.. కౌమారం నుండే కత్తి పట్టి తిప్పుతూ ‘‘నేను యుద్ధానికి పోతా..’’ అంటుండే వాడు ఉపాలి. ఓ యుద్ధంలో పాల్గొన్నాడు కూడా. తర్వాత తన సాహచర్యంలో బౌద్ధ్దోపాధ్యాయుడుగా మారాడు.

‘‘ఇవ్వాళ రుద్రదేవుడి గుడి వద్ద కొలుపులట..’’

మెల్లగా కదిలి సందుల గొందుల్లో రుద్రుడి గుడి వద్దకు వెళ్లాడు సంబుద్ధ్ది. అక్కడున్న జనసందోహాన్ని చూసి నివ్వెరపోయాడు. ఊరు ఊరంతా అక్కడే ఉంది. సైన్యంలోకి వెళ్లబోయే యువకులు కత్తులు తిప్పుతూ వీరనాట్యాలు చేస్తున్నారు. వైదిక పురోహి తులు ఏవేవో మంత్రాలు చదువుతున్నారు. సాంబ్రాణి అగరుధూపాలతో పసుపు కుంకుమలు జల్లుతూ, వేపమండలు చేబూని ఎగిరెగిరి దూకుతున్నారు సైనికులు. ఊరి పెద్ద కాపు చలమయ్య వేపమండ లతో ఊగిపోతున్నాడు. మహిళలు చీవారములు చీరె పద్ధతిలో కట్టుకుని నెత్తిన నీటి కుండలతో గుడిచుట్టూ ప్రదక్షిణలు చేస్తూ యుద్ధానికి వెళ్లబోతున్న వారి భర్తో.. కొడుకో.. తండ్రో.. నాట్యాలు చేస్తున్న అతనిపై నీరు కుమ్మరిస్తున్నారు.

అప్పుడే ప్రదక్షిణ చేస్తూ గుడి వెనక నుండి నీటి కుండతో వచ్చింది రఖిత. పూర్తిగా పసుపులో మునిగి తేలుతున్నట్లుంది. గుడి ముందున్న యువకుల్లో ఎవరిమీద ఆమె నీళ్లు కుమ్మరించబోతోంది. గబగబా కళ్లతో వెదికాడు. అలవకుడు!

 అప్పుడే ఆమె భర్తను చూసింది. అంతే.. చటు క్కున కుండ పడేసి వెనక్కు పరుగుపెట్టింది. అందరూ సంబుద్ధ్ది వైపు చూశారు. అదీ కొద్దిసేపే. తిరిగి డప్పులు మ్రోగాయి. నాట్యాలు పెరిగాయి. ఉద్వేగం తిరిగి తారస్థాయికి ఎగసింది. అక్కడ ఉండలేక వెనక్కు తిరిగి ఆరామానికి చేరాడు సంబుద్ధి, రఖిత. రఖిత.. ఆమె తనను అర్థ్ధం చేసుకుంటుందని భావించాడు. ఎప్పటికి ఒకే ఆత్మగా ఉంటామని ఎన్నో రాత్రులు గాఢ పరిష్వంగంలో చెప్పుకున్నారు. తను ఆరామంలో ఉంటున్నా ఆమె తన వద్దకు వచ్చేస్తుం దని ఎక్కడో ఓ చిన్న ఆశ.. కాని కాని ఇవ్వాళతో ఆ ఆశ అడుగంటింది. దిగులుగా ముడుచుకుపోయి బోధిసత్వుని ముందు మోకరిల్లాడు.

మూడోరోజు వచ్చినవాడు ఉపాలి!

‘రఖిత ఇంట్లో నుండి వెళ్లిపోయి లంక అడవుల్లో నాగమయ్య రుషి ఆశ్రమంలో చేరింది బావా!. బావకు అక్కడ ప్రశాంతంగా ఉంటే, ఇక్కడ నాకు ప్రశాంతంగాఉంది. నన్ను ఇబ్బందిపెట్టకు అన్నా అంది..’’ ఆమె ఆచూకి తెలియజేసినట్లు చెప్పాడు.

తలవంచుకుని ఉన్న సంబుద్ధి మాట్లాడలేదు. కాని ఆమె ఆచూకీ తెలిసినందుకు లోన అలజడి కాస్త తగ్గింది. ఇంటికి రమ్మని పిలవాలని ఉపాలి.. యుద్ధానికి వెళ్లొద్దు అనాలని సంబుద్ధి. లోలోన భావిస్తున్నారు కాని పైకి ఏమీ చెప్పలేని ఏదో దూరం తెలుస్తోంది.

గ్రామ సైనికులంతా మేళతాళాలతో కుటుంబ సభ్యుల వీడ్కోలు ఏడ్పులతో వెళ్లిపోయారు. ఊరంతా శ్మశాన నిశ్శబ్దత. ఆరామం కూడా అంతే. ఏ కార్య క్రమం జరగడంలేదు. యుద్ధం వల్ల వచ్చేపోయే భిక్షువులు కూడా తగ్గి పోయారు. ఉన్న వస్తువులతో వండుకుతింటూ బుద్ధస్మరణ..

తానిప్పుడు ఒకరకంగా భిక్షువు.. భార్య సన్యాసా శ్రమానికి వెళ్లిపోయింది. అలవకుడు, ఉపాలి యుద్ధ్దభూమికి తరలిపోయారు. బ్రతికి వస్తారో లేదో తెలియదు! విపస్యన మినహా మరేమీ లేదు. ‘‘బుద్ధం శరణం గచ్ఛామి..’’

మరో ఆరునెలలు పూర్తిగా ఉత్కంఠతో.. దిగు లుతో గడిచాయి. ఏ చెడువార్త వినాల్సి వస్తుందో.. ఏదైనా శుభవార్త చెవికి చేరుతుందో లేదో.. ఊరంతా.. రాజ్యమంతా కూడా అదే మానసిక స్థితి.

చివరికి ఓడిపోయాం అన్న వార్త.. మహారాజు మంచన్య భట్టారకుడు మరణించాడట. విష్ణుకుండిన వంశం అంతరించింది. మరో కొత్త రాజవంశం పాలనాకళ్లేలు అందుకుంది. ఊరంతా నిట్టూర్చింది. ఎవరు వీరస్వర్గం అలంకరించారో! ఎవరు బ్రతికి బయట పడ్డారో! కొన్ని ఇళ్లల్లో కేరింతలయితే ఎక్కువ ఇళ్లనుండి ఏడుపులు.. అలవకుడు, ఉపాలి ఏమ య్యారో.. చెప్పేవారెవరూ.. వైరాగ్యం ఆవహించింది సంబుద్ధికి. ఇలా ఎంతకాలం?

* * * * * *

కృష్ణానది పెద్దపాయ. ఒడ్డున నిలబడి సుదూ రంగా పెద్దపల్లి సముద్రరేవులో కనిపిస్తున్న మహా నౌకల వొయ్యారపు ఊగిసలాటలను చూస్తున్నాడు సంబుద్ధి. స్పష్టమైన నిర్ణయం తీసుకున్న అతను స్తబ్దుగా ఉన్నాడు.

నగరం మహాకోష్టాగారం నుండి సరుకుల పెరికె సంచులతో నిండిన బళ్లు్ల వరుసగా కృష్ణానది పెద్ద కాలువ వద్దకు వస్తున్నాయి. అక్కడ సంచులు దింపి బానిసలు పడవల్లోకి మోస్తున్నారు. ఆ పడవలు కదిలి సాగరం వైపు పోతున్నాయి. చివరికి అన్ని సరుకుల సంచులు యోజన దూరంలో రేవులోని మహా నౌకలోకి చేరుతున్నాయి. నౌక ఉద్యోగులు, సుంకాధి కారులు సరుకు నౌకలో చేరడం పర్యవేక్షిస్తున్నారు.

‘‘అయ్యా.. తమరి సంచులు పడవలో పెట్ట మంటారా..’’ అన్నాడో బానిస సంబుద్ధితో. బట్టలు, తాళపత్ర గ్రంథాలున్న పది సంచులు బానిస పడవలోకి చేర్చగా ఒక్కసారి వెనుకకు చూసి నిట్టూర్పు విడిచాడు. సెలవు ఈ బుద్ధ భూమికి.. మళ్లీ జన్మభూమికి వస్తాడో లేదో..

రెండడుగులు వేశాడో లేదో దూరంగా అరుపు.. ‘‘సంబుద్ధి.. బావా.. ఆగు ఆగు..’’

దూరంగా గుర్రంపై వేగంగా వస్తూ చేయి ఊపుతూ ఉపాలి.

చిన్నపాటి ఆనందపు కెరటం.. ఉపాలి బ్రతికే ఉన్నాడు.. తనకోసం వస్తున్నాడు.. రఖిత, అలవకుడు.. ప్చ్..

‌గుర్రం దిగి, ‘‘ఏవిటీ నిర్ణయం సంబుద్ధీ.. విజయ పురి ఆరామానికి తెలియపర్చావని.. సువర్ణభూమికి వెళ్లిపోతున్నావని..’’ అలుపుతో రొప్పుతున్నాడు. ముఖమంతా ఉత్కంఠతో జేవురించి ఉంది. కళ్లనిండా నీరు.. అతన్నే చూస్తున్నాడు సంబుద్ధి. మళ్లీ చూస్తాడో లేదో..

‘‘నువ్వెళితే రఖిత సంగతి ఏవిటి? ముందు ఆశ్రమానికి వెళ్లాను. అక్కడ లేదు. అలవకుడు కూడా ఇంట్లో లేడు. వాడి భార్య నీళ్లోసుకున్నదట.. అత్తారింటికి వెళ్లాడట..’’

శుభవార్త! చాలు.. వీడ్కోలు వేళ ఈ మాత్రం సంతోషం చాలు!! రఖిత మరో ఆశ్రమానికి వెళ్లిందేమో..

‘‘తప్పదు.. మీరంతా మనసులు మార్చు కుంటున్నవేళ నేను.. ఈ మార్పులు చూస్తూ ఇక్కడ ఉండలేను. ఆ మహాగురువును వదలలేను ఉపాలి! సువర్ణభూమే నాకు తగిన ప్రదేశం అని దమ్మకీర్తి చెప్పాడు. దాంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. రఖిత కూడా.. నన్ను..’’ గొంతు గద్గద•మయ్యింది.

చేతులతో ముఖాన్ని కప్పుకుని గబుక్కున ఏడ్చాడు ఉపాలి.

చిన్ననాటి నుండి ఎన్నో సంఘటనల్లో కలిసి బ్రతికిన ఇద్దరూ ఈ శాశ్వత ఎడబాటును భరించలేక పోతున్నారు. ముందు తెప్పరిల్లినవాడు సంబుద్ధి. చేతులు జోడించి ‘బుద్ధం శరణం గచ్ఛామి..’

నేను మాత్రం ‘సంఘం చరణం గచ్ఛామి..’ అన్నాడు ఉపాలి అర్థవంతంగా. చెప్పకుండానే చాలా చెప్పాడు.

ఉపాలి కూడా స్పష్టమయ్యాడు. తనతో వచ్చే వాళ్లు ఇక ఎవ్వరూ లేరు. వెనక్కు తిరిగి కదిలాడు. వెనక్కు చూడటం అనవసరం! వెళ్లి పడవ ఎక్కాడు. పడవ కదిలి నౌక వద్దకు చేరింది. చేయిపట్టి నౌకలోకి ఆహ్వానించాడు దమ్మకీర్తి.

‘‘నిన్ను దూరం చేసుకోవడం ఈ పుణ్యభూమి చేసుకున్న దురదృష్టం సంబుద్ధ్ది..!’’ లోపలికి నడుస్తూ అన్నాడు దమ్మకీర్తి. నిర్వికారంగా నడిచాడు ప్రయాణి కులతో పాటు. ఎక్కడో కూర్చోవాలి.. ప్రయాణికులు బల్లలపై కూర్చోడానికి తోసుకుంటున్నారు. ఎవరో కాస్త జరిగి చోటిచ్చారు.

తల ఎత్తి చూశాడు. బట్టలసంచి ఒడిలో పెట్టు కుని సజలనయనాలతో రఖిత.. ఈవల దమ్మకీర్తి. ్థ్దఅమైంది..

క్షణంలో వెయ్యోవంతు కాలం ఆమెను పరిశీల నగా చూసి ఫక్కున నవ్వాడు సంబుద్ధి కూర్చుంటూ.

‘‘ఎందుకూ??’’ అన్నదామె కళ్లు తుడుచు కుంటూ.

‘‘జాతకం తప్పయినందుకు..’’

* * * * * *

వివరణలు:

ఉపోసత -ఉపవాసం పాటించవలసిన రోజు

ఉపాసకులు/ గ్రహపతులు – బౌద్ధ మతావలం బులయిన సాధారణ గృహస్తులు.

పతిమోఖ – విషయ పీఠికలోని ఓ అధ్యాయం/ భాగం. ఆరామ జీవనానికి చెందిన నియమ నిబంధనలన్ని

క్రోడీకరించి ఉన్న అధ్యాయం పేరు పతిమోఖ.

ధేరీ – సీనియర్‌ ‌లేదా వృద్ధులైన భిక్షువులు / భిక్షుణిలు

నట్టి – పోగ్రాం అజెండా

సిద్ద విహారికులు – బౌద్ధ దీక్ష కోసం వచ్చే వారిని తొలి దశలో సిద్ద విహారికులు అంటారు.

కతిన – వస్త్రాలు పంపిణి చేసే కార్యక్రమం.

చీవారములు – బౌద్ధ్దులు ధరించే 3 వస్త్రాల సెట్‌ (‌లోపల ధరించేది, నిలువెల్లా తొడుగుకుని నడుము వద్ద

 ముడివేసుకునేది. భుజంపై వేసుకునేది లేదా కప్పుకునేది)

శ్రేణి – వర్తక సంఘం

About Author

By editor

Twitter
Instagram