– బంకించంద్ర చటర్జీ

‘‘కర్మాగారం ఎక్కడ ప్రారంభిస్తారు?’’

‘‘పదచిహ్న గ్రామంలో!

‘‘ఎలా సాధ్యం? అక్కడెలా కుదురుతుంది?’’

‘‘కుదరదనుకుంటే, నేను మహేంద్రసింహుడిని వ్రత స్వీకారానికి ఎందుకు తయారు చేశానను కుంటున్నారు?’’

‘‘మహేంద్రుడు వ్రత గ్రహణం చేశాడా?’’

‘‘ఇంకా చేయలేదు. ఈరోజు రాత్రి అతడికి దీక్ష ఇస్తున్నాను.’’

‘‘మహేంద్రుడు వ్రతగ్రహణం ఎలాచేస్తాడో నాకు అవగాహన కావడం లేదు. అతడి భార్యాపిల్లలు ఏమైనారు? వారిని ఎక్కడ ఉంచారు? అప్పుడు, ఒకరోజు నది ఒడ్డున ఓ పసిపాప పడివుండడం నేను చూశాను. ఆ పసిదాన్ని తీసుకువెళ్లి నా చెల్లెలికి ఇచ్చాను. ఆ పిల్ల పక్కనే ఒక అందమైన స్త్రీ కూడా పడివుంది. వారే మహేంద్రుని భార్య, కూతురు కాదుగదా! నాకు ఈ విషయం ఇప్పటికీ అనుమా నంగానే ఉంది!’’

‘‘వారే మహేంద్రుని భార్య, కుమార్తె!’’

భవానందుడు దిగ్భ్రమచెందాడు. ఏ స్త్రీకి తాను పునర్జన్మ ప్రసాదించినాడో, ఆమే మహేంద్రుని భార్య కల్యాణి అన్నమాట! అయినా ఈ విషయం ఇప్పుడు ప్రస్తావించడం అంత ఉచితమైన పనికాదని మౌనం దాల్చాడు.

 ‘‘మహేంద్రుని భార్య ఎలా చనిపోయింది?’’ అని అడిగాడు, జీవానందుడు.

‘‘విషం తిని!’’

‘‘ఎందుకు తిన్నది?’’

‘‘భగవంతుడు ఆమెకు స్వప్నంలో కనిపించి, ప్రాణత్యాగం చేయమని ఆదేశమిచ్చాడు.’’

‘‘ఈ స్వప్న ఆదేశం సంతానుల కార్య సాఫల్యానికే జరిగిందంటారా?’’ ‘‘నేను మహేంద్రుని నోటివెంట ఇదే విన్నాను. ఇప్పుడు సంధ్యా సమయమయింది. నేను సంధ్యావందనం వగైరా నిత్యనైమిత్తిక విధులకి వెళతాను. వాటి తరువాత కొత్త సంతానులకు దీక్ష ఇచ్చే కార్యక్రమం ఉంది!’’

‘‘సంతానులు అంటున్నారు. మహేంద్రుడు కాక ఇంకా ఎవరేనా ఈ సంప్రదాయంలో చేరాలని అభిలషిస్తున్నారా?’’

‘‘అవును. ఒక కొత్త వ్యక్తి కూడా ఉన్నాడు. ఇంతకుముందు అతడిని నేను ఎక్కడా చూడలేదు. ఇవాళే నా దగ్గరకు వచ్చాడు. తరుణ యువకుడు. అతడి భావభంగిమలు, మాటలు నన్ను ప్రసన్నుడిని చేసినాయి. బంగారం లాంటి కుర్రవాడు అనిపిం చింది నాకు. అతడిని సంతానదీక్షితుడిగా తయారు చేసే బాధ్యత జీవానందుడిది. సంతానులు విధులేమిటో వారికి నేర్పటంలో, వారిని ఆకర్షించి అట్టే ఉంచడంలో జీవానందుడు దిట్ట. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. జాగ్రత్తగా వినండి.’’

‘‘సెలవివ్వండి’’ అన్నారు ఇద్దరూ.

‘‘మీ ఇద్దరిలో ఎవరేనా, ఏదేనా అపరాధం చేసి ఉన్నా, ఇకముందు చేసినా, దానికి ప్రాయశ్చిత్తం నేను తిరిగి వచ్చిన తరువాత చేసుకుందురుగాని! నేను ఇక్కడ లేనప్పుడు మాత్రం ప్రాయశ్చిత్తం చేసుకునే పని తలపెట్టకండి.’’

ఈ మాటలు చెప్పి సత్యానందస్వామి అక్కడ నుండి వెళ్లిపోయాడు. భవానంద జీవానందులు ఒకరివైపు మరొకరు చూచుకున్నారు. ఈ భవానందుడు ‘‘నీమీద ఏదైనా అపరాధం ఉన్నదా ఏమి?’’ అన్నాడు.

‘‘అలాగే అనిపిస్తోంది. మహేంద్రుని కుమార్తెను మా ఇంటివద్ద దిగవిడిచి రావడానికి వెళ్లాను.’’

‘‘ఇందులో దోషం ఏముంది? అదేమీ తప్పుకాదే! అయితే, ఈ ప్రయాణంలో నీవు నా సోదరిని కలుసుకున్నావా ఏమిటి?’’

‘‘గురుదేవులు ఈ విషయం కూడా పసిగట్టినారని పిస్తోంది!’’

4

మహేంద్రునితో చాలాసేపు మాట్లాడాడు సత్యా నందుడు. అప్పుడు మహేంద్రుడితో పాటు దేవాలయంలోనికి వెళ్లాడు. ఆ సమయానికి దేవాలయం అత్యంత శోభతో అలరారుతున్నది. రజిత, స్వర్ణ, రత్న రంజిత శోభలతో ప్రకాశిస్తోంది. పుష్పరాశులతో దేవాలయమూర్తిని  అలంకరించారు. సుగంధిత మధుర ధూమరాశివల్ల దేవ సాన్నిధ్యం ఇక్కడ చేకూరినట్లు అనిపిస్తోంది. మందిరంలో మరో పురుషుడు కూర్చుని ఉన్నాడు. ‘హరే మురారే…’ అనే స్తోత్ర పాఠాలు వల్లిస్తున్నాడు. సత్యానందుడు అతడిని గుర్తించి ‘‘నీవు దీక్ష పుచ్చుకుంటావా?’’ అని అడిగాడు.

 ‘‘నా మీద దయ చూపితే పుచ్చుకుంటాను.’’

తరువాత నుంచి స్వామి మహేంద్రుడినీ, ఆ యువకుడినీ కలిపి సంబోధించి మాట్లాడారు.

‘‘మీరు యథావిధిగా స్నానం చేయండి. నియమం ప్రకారం ఉపవాసం చేశారుగదా!’’

 ‘‘ఆ!’’

‘‘సంతాన ధర్మాన్ని అనుసరిస్తామని భగవంతుని ముందు ప్రమాణం చేసి చెప్పండి.’’

‘‘అనుసరిస్తామని చెబుతాము.’’

‘‘మాతను ఉద్ధరించడం ఎన్ని రోజులుపడితే, అన్ని రోజుల వరకు గృహ ధర్మాన్ని విసర్జిస్తారుగదా!’’

‘‘అలాగే చేస్తాము.’’

 ‘‘ఇంద్రియాలను జయించి, స్త్రీతో కలిసి ఏకాసనం మీద కూర్చోకుండా ఉంటారా?’’

‘‘కూర్చోము. ఇంద్రియాలను వశంలో వుంచు కుంటాము.’’

 ‘భగవంతుని ముందు ప్రతిజ్ఞ చేయండి. మీకోసం, మీ స్వజనం కోసం, ధనోపార్జనలో మునిగి పోకండి. ఏదైనా సంపాదన చేసినా, వైష్ణవ ధనాగారానికే చెందుతుంది.’’

‘‘అలాగే!’’

‘‘జాతి విషయం కూడా ఒకమాట ఉంది. మీది ఏ జాతి? మహేంద్రుడు కాయస్తుడు. నీవు?’’

‘‘నేను బ్రాహ్మణుడను’’

‘‘మీరు మీ కులాన్ని ఒదులుకుంటారా? సమస్త సంతానులు ఒకే కులానికి చెందినవారు. ఈ మహా వ్రతంలో బ్రాహ్మణులు, శూద్రులు అనే తేడా లేదు. మీది యే మతం?’’

‘‘మేం జాతి మతాల విషయం ఏ పట్టింపులకు వెళ్లం. మాత సంతానం అంతా ఒకటే జాతి.’’

‘‘అయితే మీరిద్దరూ ఇప్పుడు దీక్షితులు కావటానికి అర్హులు. మీరు చేసిన ప్రతిజ్ఞలను భంగపరుచుకోకండి!’’

‘‘అలాగే!’’

 ‘‘వందేమాతరం అని పాడండి.’’

ఇద్దరూ గొంతు కలిపి ఏకాంతమందిరంలో భక్తి భావ పూర్వకంగా మాతృగీతం పాడినారు. దీని తరువాత బ్రహ్మచారి వారికి యథావిధిగా దీక్ష ఇచ్చాడు.

5

దీక్ష సమాప్తమైన తర్వాత, సత్యానందుడు మహేంద్రుడిని ఏకాంత స్థలానికి తీసుకు వెళ్లాడు. ఇద్దరూ కూర్చున్న తరువాత సత్యానందుడు ఇలా ప్రారంభం చేశాడు సంభాషణ :

‘‘వత్సా! నీవు వ్రత గ్రహణం చేశావు. భగవానుడు సంతానులపట్ల అనుగ్రహం చూపినాడనిపిస్తోంది నాకు. నీవు ధ్యాస ఉంచి నా మాటలు విను. నీవు జీవానంద, భవానందుల వలె అరణ్యం అంతా చుట్టి యుద్ధం చేయనవసరం లేదు. నీవు పదచిహ్న గ్రామానికి తిరిగి వెళ్లు. నీ ఇంటిలో ఉండి, నీ సంతానధర్మాన్ని పాలించుకో!’’

ఈ మాటలకి మహేంద్రుడు విస్తుపోయాడు. కాని ఏమీ మారు మాట్లాడలేక•పోయాడు. బ్రహ్మచారి ఇలా కొనసాగించాడు. ‘‘ప్రస్తుతం మనకు ఎటువంటి ఆశ్రయం లేదు. ప్రబలమైన సేన వచ్చి యుద్ధానికి తలపడితే, పది రోజులకు సరిపడ భోజన సంబారాలు నిలువ చేసుకుని, తీరికగా నిరామ యంగా యుద్ధం చేయగల అవకాశం మనకు లేకుండా పోయింది. మనకు మంచి కోట ఏదీ లేనేలేదు. నీ గ్రామంలో, నీకు ఇల్లు ఉంది. గ్రామం కూడా నీ అధికారం కిందనే ఉంది. అందుచేత నా కోరిక ఏమంటే, నీవు నీ ఇంటిని కోటగా తయారు చేయి. ఈ కోటలో యుద్ధానికి ఉపయోగకరమైన పరికరాలు తయారు చేయించు. ఈ బాధ్యతని నీవు ఉత్తమంగా నెరవేర్చగలవు. ముందు నీవు ఇంటికి వెళ్లు. నీ వెనుక రెండువేలమంది సంతానులు వస్తారు. వారిచేత నీవు కర్మాగారంలో పని జరిపించు. కోటను పకడ్బందీగా తయారు చేయించు. నీకు అవసరమైన ధనమంతా నేను సమకూరుస్తూ ఉంటాను. నేను పరదేశం వెడుతున్నాను. అక్కడ నుండి యుద్ధ సామగ్రి తయారు చేయగల నిపుణు లను తీసుకు వస్తాను. వారు రావడానికి ముందు, పని ప్రారంభించటానికి ముందు, పదచిహ్నంలో జరగవలసిన ఏర్పాట్లన్నీ నీవు జాగ్రత్తగా, త్వరగా చేయించు. అందుకనే నేను నిన్ను ఇంటికి వెళ్లమని చెబుతున్నాను.’’ మహేంద్రుడు బ్రహ్మచారి ఆజ్ఞకు అంగీకారం తెలిపాడు.

6

మహేంద్రుడు వెళ్లిపోయిన తర్వాత ఆరోజు దీక్ష పుచ్చుకున్న రెండవ యువకుడు సత్యానంద బ్రహ్మచారి దగ్గరకు వచ్చాడు. ప్రణామం చేశాడు.

సత్యానందుడు అతడిని ఆశీర్వదించి ఆసనం చూపించాడు. ఉభయ కుశలోపరి అయిన తర్వాత స్వామీజీ ‘‘కృష్ణ భగవానుడంటే నీకు ప్రగాఢమైన భక్తిశ్రద్ధలున్నాయి కదూ?’’ అని అడిగాడు.

‘‘ఎలా చెప్పగలను? భక్తి అని నేను అనుకుంటు న్నది కేవలం ఆత్మ ప్రలోభమేనేమో!’’

సత్యానందుడు సంతుష్టహృదయుడై ‘‘సరిగా చెప్పావు. ఏ ప్రయత్నంతో హృదయవికాసం సాధ్య మవుతుందనుకుంటే దానినే ఆచరించవచ్చును. వత్సా! నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నీ పేరు ఏమిటి? నిన్ను ఏమని పిలవమంటావు… నేనింత వరకూ ఈ విషయమే అడగలేదు, చెప్పు.’’

నవసంతానుడు ‘‘మీరు ఎలా పిలవదల్చుకుంటే అలాగే పిలవండి. నేను వైష్ణవ దాసాను దాసుడను!’’ అన్నాడు.

 ‘‘నీ నవయౌవనం చూస్తూ వుంటే, నవీనా నందుడు అని పిలవాలని అనిపిస్తున్నది. అందుచేత నీవు ఈ పేరుతోనే ఉండు. అయినా, పూర్వం నీ పేరు ఏమిటి? ఆ పేరు చెప్పడం వల్ల ఏదైనా ఇబ్బంది అనుకుంటే నాదగ్గర దాచవద్దు. నేను ఇంకెవరికీ చెప్పను. సంతాన ధర్మంలో వున్న ఏర్పాటు ఏమిటంటే, ఏదైతే అవాచ్యమో దానిని మన గురువు దగ్గర నిస్సందేహంగా చెప్పాలి! నీ పేరు చెప్పడం వల్ల నీకు ఎటువంటి హాని జరగదని హామీ ఇస్తున్నాను.’’

‘‘నా పేరు శాంతిదేవశర్మ!’’

‘‘ ఓ మాయలమారీ! నీ పేరు శాంతిమణి!’’ అంటూ సత్యానందుడు నల్లటి  దట్టమైన శిష్యుడి గడ్డాన్ని ఒక చేతితో లాగి వేశాడు. అవి ఊడి వచ్చాయి. అసలు రూపం బయటపడింది. సత్యా నందుడు ‘‘సిగ్గు సిగ్గు అమ్మాయి! ఈ వయసులో ఈ గడ్డాలు, మీసాలు ఏమిటి? దేన్నయినా దాచగలవుగాని ఈ కంఠంలోని మృదుత్వం, కళ్లలోని చంచలత్వం ఎలా దాచగలవు? నేను గ్రహించలేనంత మూర్ఖుడిని అయితే ఇన్ని పనులు ఇలా ఎలా చేయగలుగుతున్నాననుకున్నావు?’’

శాంతి ముఖం నల్లబడింది. కళ్లు మూసుకుని, తల వాల్చుకుని కూర్చుంది కొంతసేపు. తరువాత తల ఎత్తి ‘‘నేను చేసినదానిలో దోషం ఏమిటంటారు?  ప్రభూ! స్త్రీల భుజాలలో బలదర్పాలు లేవంటారా?’’ అంది.

‘‘గోష్పాదంలో ఎన్ని నీళ్లు నిలుస్తాయో, స్త్రీల బాహువులలో అంతే బలం ఉంటుంది!’’ అన్నాడు సత్యానంద బ్రహ్మచారి.

‘‘ఎప్పుడైనా సంతానుల బలప్రదర్శన జరుగుతూ ఉంటుందా? వారికి బలపరీక్ష పెడతారా?’’

 ‘‘ఆ! వారి బలం పరీక్షిస్తాం!’’

సత్యానందుడు ఉక్కు ధనుస్సు, ఉక్కు తీగ తీసుకు వచ్చి శాంతితో ఇలా చెప్పాడు. ‘‘ఈ తీగను ధనుస్సుకు నారిగా ఎక్కించాలి. ఇలా ఎక్కిస్తూ ఉండగా ధనుస్సు తిరుగబడి మనిషిని దూరంగా విసరివేస్తుంది. ఈ ప్రయత్నంలో నీవు గెలుపొందితే, బలవంతురాలవని అంగీకరిస్తాను.’’

‘‘సంతానులందరూ ఈ పరీక్షలో నెగ్గారా?’’

‘‘నలుగురు నెగ్గారు.’’

 ‘‘ఎవరువారు? నేను తెలుసుకోవచ్చునా?’’

‘‘నేను, జీవానందుడు, భవానందుడు, జ్ఞానానందుడు.’’

శాంతి ధనుస్సు చేతిలోనికి తీసుకుంది. విల్లు ఎక్కుపెట్టింది. అతి తేలికగా పరీక్షలో నెగ్గి నారి సారించిన ధనుస్సును సత్యానందుని పాదసన్నిధిలో పడవేసింది. సత్యానందుడు ఆశ్చర్యపోయాడు. కొంత తడవు గడచిన మీదట ‘‘నీవు మానవ స్త్రీవా? రాక్షసస్త్రీవా?’’ అని అడిగాడు.

శాంతి చేతులు జోడించి ‘‘నేను అతి సామాన్యు రాలయిన స్త్రీని. అయితే బ్రహ్మచారిణిని!’’

‘‘అయితేమటుకు? నీవు బాలవితంతువువా? ఉహుఁ, వారిలో కూడా ఇంత బలం వుండదు. వారు ఒకపూటనే కదా భోజనం చేస్తారు!’’ .

‘‘నేను పునిస్త్రీని!’’

‘‘అయితే నీ భర్త ఎవరు? అతని జాడ తెలియదా? నాకు స్పష్టంగా చెప్పు.’’ ‘‘నాకు వారి జాడ తెలుసును. వారి అనుమతి తీసుకునే ఇక్కడికి వచ్చాను.’’

అకస్మాత్తుగా ఏదో ఆలోచన సత్యానందుని మదిలో మెదిలినట్లుంది. ‘‘ఇప్పుడే గుర్తువచ్చింది. మా జీవానందుని భార్య పేరు శాంతిమణి! నీవేనా ఏమి అతని సతివి?’’ అని అడిగాడు.

శాంతి తలవాల్చుకుంది ఏమీ బదులు పలుకలేదు.

‘‘ఇంత పాపిష్టికార్యం ఎలా చేశావు?’’

‘‘ఇందులో పాపాచారం ఏముంది ప్రభూ? పత్ని పతిని అనుసరించాలి కదా! అలా అనుసరించడం పాపాచారం ఎందుకు అవుతుంది? అలా అయితే, సంతాన ధర్మమే అధర్మం అవాలి! నేను వారికి సహధర్మచారిణిని. వారు ధర్మాచరణంలో మునిగి ఉన్నారు. నేను వారితో పాటు ధర్మాచరణ చేయడానికి వచ్చాను.’’

శాంతి వాడి గొంతు విని సత్యానందుడు ప్రసన్ను డయినాడు. ‘‘నీవు సాధ్వీమణివి! కాని, చూడు అమ్మాయీ! వీరధర్మంలో స్త్రీలు చేయవలసింది ఏముంటుంది?’’

‘‘మహావీరులందరికీ పత్ని అనుసరణీయమేనని మనవి చేస్తున్నాను, సీత లేకుండా రాముడు వీరుడెలా అయినాడు? అర్జునునకు ఎన్ని వివాహాలు అయినాయి? అలాగే భీముడు? ఇవన్నీ తమకు తెలియనివి కావు ఆలోచించండి!’’

‘‘కాని సామాన్య స్త్రీలు వీరధర్మంలో అనాసక్తులై ఉంటారు. వారు సాహస కార్యాలు చేయడానికి ముందుకు రారు. అందుచేత సంతానులు తమ ధర్మాన్ని ఇంతవరకు స్త్రీలకు ఇవ్వలేదు. సంతానులు స్త్రీలతో ఏకాసనంపైన కూర్చోరు. జీవానందుడు నాకు దక్షిణహస్తం వంటివాడు. నీవు నా దక్షిణ హస్తాన్ని నరికివేయడానికి వచ్చావా?’’

‘‘లేదు. మీ దక్షిణహస్తానికి మరింత బలం చేకూర్చటానికి వచ్చాను. బ్రహ్మచారిణిని. భర్తవద్ద కూడా బ్రహ్మచారిణిగానే ఉంటాను. నేను కేవలం ధర్మాచరణ కోసమే వచ్చాను. స్వామి దర్శనం కోసం రాలేదు. నాకు విరహ బాధ లేదు. పతిదేవులు ఏ ధర్మాన్నయితే ఆశ్రయించారో ఆ ధర్మాన్ని నేను కూడా పాలించాలనే తలంపుతో వచ్చాను.’’

‘‘సరే. నిన్ను కొన్నాళ్లు పరీక్షించి చూడాలి!’’

 ‘‘నేను ఆనందమఠంలోనే ఉండవచ్చునా?’’

‘‘కాక ఇంకెక్కడికి వెడతావు?’’

‘‘పరీక్షానంతరం.’’

‘‘భవానీమాత వలెనే నీ లలాటంలో కూడా అగ్ని తేజస్సు ఉంది. సంతాన ధర్మాన్ని భస్మం చేయవుగదా!’’

శాంతిని ఆశీర్వదించాడు సత్యానందుడు. ఆమెకు సెలవు ఇచ్చాడు.

(సశేషం)

About Author

By editor

Twitter
YOUTUBE