– దర్భా లక్ష్మీఅన్నపూర్ణ

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతికి ఎంపికైనది

పదహారురోజుల పండగ చేసుకుని నాలుగు రోజుల క్రితమే అత్తగారింటికి వచ్చిన కొత్త కోడలు లావణ్య.

కొత్త కొత్తగా ప్రేమ పాఠాలు చెబుతున్న ప్రియ సఖుడితో చెట్టాపట్టాలేసుకుని, పొంగుతున్న పాలలో ఉండే వేడివేడి ఉత్తేజంతో ఈ ప్రపంచాన్ని చూస్తోంది. ఈ ప్రపంచంలో ప్రతీదీ మరింత మోహనమయంగా, ప్రేమమయంగా అగుపిస్తోంది.

రోజూ కూసే కోయిల కొత్తగా తనకోసమే పాడుతున్నట్టు, విరబూసిన మల్లెల సౌరభం తనతో ప్రేమ ఊసులు చెబుతూ తన ప్రపంచాన్నంతటినీ సౌరభాలతో ముంచెత్తుతున్నట్టూ, ఊహలకందని పరవశమేదో మనస్సుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టుగా ఉంది. చందమామని ఇన్నాళ్లు మరో రాతి గ్రహంగా భావించిన లావణ్యకి ఇప్పుడు అది చల్లని మెరుపుల ముద్దలా, తన హృదయంలోకి తీపి వెలుగుల్ని పంపిస్తున్నట్టుగా ఉంది.

లావణ్య మదిలో రేగుతున్న మధురోహలు ఆమెను మరింత లావణ్యవతిని చేస్తున్నాయి. ఆమెను అనుక్షణం పులకితను చేస్తున్న ఆమె ప్రియసఖుడు అనిరుధ్‌!

‌కోడలి అందచందాలు అత్తగారు వసుంధరని సంతోష తరంగిణిని చేస్తున్నాయి. సత్యనారాయణ వ్రతమప్పుడు పెళ్లికూతుర్ని మరీ దగ్గరగా చూసిన బంధువులూ, స్నేహితులూ అందరూ లావణ్యకి నూటికి నూరు మార్కులు వేసేశారు.

ఆ హడావిడి అంతా అయిపోయాక వసుంధరలో ఏదో తెలియని గుబులు మొదలయింది. కొత్త కోడలితో నిత్యకృత్యంలో సర్దుబాటు ఎలాగన్న విషయంలో.

ఆమెకి అప్పటికే పెద్దకోడలితో ఎదుర్కొన్న చేదు అనుభవం మరీమరీ గుర్తుకి రాసాగింది. ఇప్పుడు ఆ పిల్లకి ఒక్క పనీరాదు, నేర్చుకొని చెయ్యాలన్న ఉత్సాహం, కోరిక రెండూ లేవు. ఎప్పుడెప్పుడు కట్టుకున్న వాడి చేత వేరు కాపురం పెట్టేద్దామా అన్న ఒకే ఒక్క ధ్యాస తప్ప!

అందుకే చిన్న కోడలి విషయంలో కూడా ఎటువంటి కోరికలూ, ముచ్చట్లూ మనసులో పెట్టుకోకూడదని ముందే నిర్ణయించేసుకుంది వసుంధర. ఇంట్లో పనివాళ్లు ఉండటంతో ఏదో సామెత చెప్పినట్టుగా ‘ఇటు చీపురుపుల్ల తీసి అటు పెట్ట్టే’ అవసరం లేదు. పెళ్లి సందర్భంగా ఉద్యోగానికి మూడు నెలలపాటు శెలవు పెట్టేసింది లావణ్య.

కొత్త కోడలు కళ్ల నిండా, ఒండి నిండా మెరుపులతో నట్టింట్లో లక్ష్మీ దేవిలా తిరుగుతుంటే వసుంధరకి కన్నుల పండువలా ఉంది.

అదిగో- అటువంటి సందర్భంలో జరిగిందా సంఘటన!

వసుంధరకి ఇద్దరు పినతల్లులు, ఒక పెద్దమ్మ, వాళ్లలో ఇద్దరి భర్తలు, పినతల్లుల తోటికోడళ్లు ఇద్దరూ- మొత్తం ఏడుగురు- ‘ఎల్లుండి ఉదయమే మీ ఇంటికి వస్తున్నాం’ అంటూ ఫోన్‌ ‌చేశారు.

అనిరుధ్‌ ‌పెళ్లి సమయంలోనే వాళ్లందరూ తీర్థయాత్రలంటూ బయలుదేరారు.

తమ ఇంట్లో పెళ్లి సమయానికే ఇలా తీర్థయాత్రలు పెట్టుకోవటం ఏమిటని తను చాలా బాధపడుతున్నాననీ, మీలాంటి పెద్దవాళ్లందరూ వస్తే పెళ్లి వేడుకలకి వచ్చే నిండుదనం ఎంత అద్భుతంగా ఉంటుందో వర్ణించి చెబుతూ- ఆ వైభవం లేకుండా చేస్తున్నందుకు మీమీద కినుక వహిస్తున్నానంటూ ప్రకటించింది వసుంధర.

‘‘నీ కొడుకు పెళ్లిని నువ్వు ఆగమేఘాల మీద ఏర్పాటు చేసుకున్నావ్‌! ‌మేం ఈ తీర్థయాత్రల ఏర్పాట్లన్నీ రెండు మూడు నెలల క్రితం చేసుకున్నవి తల్లీ!’’ అని వాళ్లు మెత్తగా నచ్చజెప్పారప్పుడు.

‘ఇప్పుడు అనుకోకుండా హైదరాబాద్‌ ‌చేరు కుంటాన్నామనీ- మీ ఇంటికి వచ్చి నూతన వధూ వరులకి ఆశీర్వాదం అందించి వెళ్తామ’నీ చెప్పారు.

వెంటనే వాళ్ల భోజనాలకి కావలసిన సరంజామా ఏర్పాటు చేసుకుంది వసుంధర.వాళ్లు వస్తున్నారన్న సంబరంలో అడుగు కాస్త వేగంగా వేసిందో ఏమో బాత్‌రూమ్‌లో జారిపడింది. డాక్టర్‌ ‌దగ్గరకి వెళ్తే పట్టీ వేసి కనీసం నెల రోజులు బెడ్‌రెస్ట్ ‌తీసుకోవాలన్నారు.

మరుసటి రోజు ఉదయమే ఆమె అనుంగు పిన్నమ్మలూ, బాబయ్యలూ వచ్చేది.

వారికి షడ్రశోపేతమైన భోజనాన్ని వండి వడ్డించటానికి వసుంధర కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంది. నిజం చెప్పొద్దూ-రుచికరంగా వంట చెయ్యటంలో వసుంధర మహా అందెవేసిన చెయ్యి. పదిమందికి వంట చెయ్యాలన్నా పరాచికాలాడుతూ మరీ- ఘుమఘుమలాడే వంటకాల్ని గుట్టుగానా అన్నట్టుగా సిద్ధం చేసెయ్యగల మహానేర్పరి! ఆప్యాయంగా కొసరి కొసరి వడ్డించి తినిపించటం కూడా మహా ఇష్టం. అందరూ తృప్తిగా భోజనం చేస్తే ఆమెకి తను తినకుండానే కడుపు నిండి పోతుంది. అటువంటి మహాఇల్లాలు వసుంధర.

అందుకే అందరికీ ఇష్టపాత్రురాలు!

ఆత్మీయతతో కూడుకున్న ఆ రుచులు అలవోకగా గొంతులోంచి జాలువారుతుంటే అప్రయత్నంగానే హృదయంలో ఆ అన్నపూర్ణేశ్వరికి పెద్దపీట •వేసేస్తారు ఎంతో ఇష్టంగా.

అలాంటి వసుంధరకి తన పిల్లలమీద కురిపించటానికి ఆశీర్వాదాలు మూటలు కట్టుకుని ఆ అనుభవరత్నాలు తన పెళ్లి ఇంటిని పావనం చెయ్యబోతున్న వేళ తను ఇలా అర్ధాంతరంగా అశక్తురాలయిపోవటం ఆవిడని కలవరపెట్టడమే కాకుండా కంగారు కూడా పెట్టేస్తోంది.

వసుంధర భర్త ప్రహ్లాదరావు తన మాటల్లో పరిహాసాన్ని, ధైర్యాన్నీ జోడిస్తూ ‘నువ్వు స్వయంగా వాళ్లందరికీ వండి వడ్డించలేకపోతున్నందుకు కలవర పడుతున్నా వంటే అర్థముంది! కంగారు ఎందుకు? ఎక్కడో అక్కడ ఫుడ్‌ ఆర్డర్‌ ‌చేద్దాం! నువ్వొండితే రెండు కూరలే చెయ్యగలవ్‌! అదే బయట ఆర్డరిస్తే నాలుగు కూరలు వడ్డించవచ్చు!’అని అనునయించాడు.

‘అయ్యో! వాళ్లు అలా బయట వండిన పదార్థాలు తినరండీ! అందుకే కూడా వంటవాడిని తెచ్చు కుంటారు! నియమనిష్ఠలతో బతికేవాళ్లు వాళ్లు! మనలా కాదు! మనింటికి వచ్చి వ్రతభంగం అయిందనిపించుకోవాలా మనం?’ వసుంధర బాధకి అంతులేకుండా పోయింది.

‘‘మరేం చెయ్యమంటావ్‌ ‌నన్ను? కొత్త కోడలా చిన్న పిల్లాయె! ఇప్పటి పిల్లలకి వంకాయేదో, బెండకాయేదో తెలియదు! ఆ అజ్ఞానాన్ని అదేదో గొప్ప వజ్రాభరణంలా మురిసిపోయే తల్లిదండ్రులు- ముఖ్యంగా ఈ కాలపు తల్లులు!’’ ప్రహ్లాదరావు ఆడవాళ్ల మీద ఎద్దేవేగా అన్నాడు.

‘‘వజ్రాభరణమో… వన్‌‌గ్రామ్‌ ‌గోల్డో! ఏమయితేనేం గానీ… మనకెలాగూ ఆడపిల్లలు లేరు! ఇంతకీ వాళ్లకి భోజనాల ఏర్పాట్లు ఎలా చెయ్యటం?’’ వసుంధర కాస్త విసుగు ప్రదర్శించింది.

‘‘ఇక వాళ్లే మనకి వండిపెట్టాలి! వాళ్లకోసం వండుకోవటమే కాకుండా!’’

‘‘ఆ వండి వడ్డిస్తారు! కూర్చుంటే లేవలేని స్థితిలో ఉన్నవాళ్లు!’’

‘‘సమస్యకి చక్కగా రంగులు పూస్తుంటే సరిపోదు! పరిష్కారం చెప్పాలోయ్‌! ‌పరిష్కారం!’’ ప్రహ్లాదరావు తమాషాగా చిటికెలు వేస్తూ అన్నాడు.

‘‘నాకేం తోచి చావకే కదా ఈ అఘోరింపంతా! పోనీ మీరయినా వండి పెడతారేమో అంటే మీకు తినటం తప్ప వంట రాదు!’’ భర్తకి కొసరి కొసరి వడ్డించే వసుంధర ఇప్పుడు బాధలో మాటలు వడ్డిస్తోంది.

‘‘నీలాంటి అన్నపూర్ణేశ్వరి భార్యగా దొరికితే నాకు తినటం తప్ప వండటం ఎలా వస్తుంది చెప్పు!’’ భార్య మమకారం తలుచుకుంటూ ఒక్క క్షణం మైమరచి పోయాడు ప్రహ్లాదరావు.

మురిపాలు తర్వాత గానీ ముందున్నది కర్తవ్యం! ఏం చేద్దాం చెప్పండి!

‘‘ఆయన ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్టుగా మొహం పెట్టి ఆ తర్వాత ‘వాళ్లే వండుకోవాలి! తప్పదు! కూడా ఉండి కూరలు తరిగివ్వటం దగ్గర్నుంచి అన్నీ చేస్తాం నేనూ, నీ కొడుకూ కలిసి! వంట సెక్షన్‌ ‌మాత్రం వాళ్లది!’’భరోసా ఇచ్చాడు.

భర్త మాటలతో వసుంధరకి కాస్త మనస్సు స్థిమితపడ్డట్టుగా అయింది. మళ్లీ అంతలోనే దిగులు మేఘాలు కమ్మేశాయ్‌ ఆవిడ వదనంలో. ‘‘మీకు కూరలు తరగటం అయినా సవ్యంగా వచ్చునా అని!’’

దుర్యోధనుడి పాత్రలో ఎస్‌.‌వి.రంగారావు ‘బానిసల కింత అహంభావమా!’ అని చేతిని గమ్మత్తుగా తిప్పుతూ అద్భుత నటన ప్రదర్శించి నట్టుగా ‘‘నాపై ఇంతటి సందేహమా? ప్రతి మనిషికీ కామన్‌సెన్స్ అం‌టూ ఒకటి ఉంటుంది! అది అన్నిటినీ మించిన బ్రహ్మాస్త్రం!

‘‘అవునండోయ్‌… ‌చాలా మంది గుడ్డెద్దు చేలో బడినట్టు చెయ్యటానికే ఇష్టపడతారు!’’ వసుంధరకి కాస్త ఎక్కువ నమ్మకం కుదిరింది ఇప్పుడు. ఎలాగో అలా గట్టెక్కెయ్య వచ్చులే అనుకుంది.

‘‘ఇంతకీ మన కోడలుపిల్ల ఎక్కడికి వెళ్లినట్టు?’’ భర్తని అడిగింది.

‘‘ఇప్పుడు అలా బజారులోకి వెళ్లి వస్తాం అని చెప్పి వెళ్లారు’’

‘‘అలాగే ఉంటుంది లెండి! వాళ్లదేం బాధ్యత! అనుకునేందుక్కూడా లేదు! ఇప్పటి పిల్లల తీరు అలాంటిది!’’ వసుంధర తనలో తనే అనుకుంది.

చూడచక్కని పిల్ల దొరికింది. అదే అదృష్టం! ఈ రోజుల్లో! ‘‘నలుగురిలో కలిసిపోయే పిల్లని అందరూ ప్రశంసలు కురిపించి మరీ వెళ్లారు. పనీపాటలదేం వుంది? ఇష్టమయితే నేర్చుకుంటారు. లేకపోతే లేదు! అనుకుంది.

చూద్దాం- ఏం జరుగుతుందో!

రాత్రి పడుకునే ముందు మర్నాడు వంట రణరంగంలో తామిద్దరూ కత్తులు పట్టువలసిన సంగతి గురించి కొడుక్కి చెప్పాడు ప్రహ్లాదరావు.

‘‘నువ్వేం భయపడకమ్మా! నేనూ, నాన్నగారూ ఉన్నాం కదా! వచ్చిన వాళ్లకేం ఇబ్బంది కలగకుండా, నీకు చెడ్డపేరు రాకుండా చూసుకుంటాం కదా!’’ అనిరుధ్‌ ‌తల్లికి ధైర్యం చెప్పాడు.

కొడుకు మాటలతో ‘హమ్మయ్య’ ఫరవాలేదు! అనుకుంది.

‘పిల్లల్ని ఎప్పటికీ తల్లిదండ్రులు చిన్నవాళ్లుగానే భావించటం వల్ల వాళ్ల శక్తియుక్తుల్ని సరిగ్గా అంచనా వెయ్యలేకపోతారు. అనుకుంది మనస్సులో.

లావణ్య పడుకునే ముందు అత్తగారి దగ్గరికి వచ్చి అడిగింది ‘‘నేను ఏమయినా చెయ్యగలనా అత్తయ్యగారూ- వాళ్లకి హెల్ప్ ‌చెయ్యటానికి!’’

‘అలా అడగటంతోనే అర్థం అయిపోతోంది నీకెంత పని తెలుసునో!’ అని మనస్సులో మురిపెంగా అనుకొని పైకి మాత్రం ‘‘నీకింకా ఇటువంటి పనులు తెలియవులే! నెమ్మదిగా అలవాటు చేసుకుందువు గానిలే! ఇప్పుడు వాళ్లేదో తంటాలు పడతారులే!’ అంది వసుంధర వాత్సల్యంగా.

సరేనని చెప్పి వెళ్లిపోయింది లావణ్య.

‘పిల్ల మనసు మంచిది! అది చాలు! నెమ్మదిగా అన్ని పనులూ తనే నేర్చుకుంటుంది!’ అనుకుంది మనసులో.

*  *  *  *

వసుంధరకి నిద్రపట్టడం లేదు. రేపు వాళ్లు వచ్చి భోజనాలు చెయ్యటం అయ్యేవరకూ తనకు కంటి మీదకి కునుకు రాదని అర్థమయిపోయింది. కళ్లు మూసుకుని దైవ నామస్మరణ చేసుకుంటూ ఉండిపోయింది.

తెల్లవారుజామున నాలుగు గంటలయ్యేసరికి వంటింట్లోంచి శబ్దాలు వినిపించటం మొదలెట్టాయ్‌. ‌తండ్రీకొడుకులు కూరగాయలతో కుస్తీ పట్టడం మొదలు పెట్టినట్టున్నారు అనుకుంది కించిత్‌ ‌బాధగా. సమయానికి దేవుడు తనని ఇలా మంచం మీద కుదేసేశాడు! లేచి వెళ్లి చూద్దామన్న ఆతృత, ఆరాటం లోపల గడబిడ చేస్తున్నా మంచం మీంచి లేవలేని స్థితాయె! ఇటువంటప్పుడు నిశ్శబ్దంగా ఉండటమే తను వాళ్లకి చెయ్యగలిగే మహోపకారం అనుకుని మిన్నకుండి పోయింది వసుంధర.

ముగ్గురి మాటలూ వినిపిస్తున్నాయ్‌. ‌పాపం లావణ్య కూడా లేచినట్టువుంది అనుకుంది సంతోషంగా.

కూరలు తరుగుతున్నట్టున్నారు – టక్‌టక్‌మన్న చాకుల శబ్దాలు!

వీళ్లన్నీ తరిగిపెట్టి ఉంచితే వాళ్లు స్టవ్‌ ‌మీద చెయ్యవలసిన పనులు చూసుకుంటారు. పెద్దచిన్న వాళ్లని కష్టపెట్టవలసి వస్తోంది. ఏమిటో…! మళ్లీ వసుంధరని విచారం ఆవరించేసింది. ఆ దేవుడు ఇంకొక్క రెండురోజుల తర్వాత తన కాలు విరగొట్టకూడదూ!

ఏం కూరలు తరిగారో-ఎలా తరిగారో- మధ్యలో వచ్చి చూపించవచ్చు కదా అని ఆత్రంగా అనుకుంది గానీ- వాళ్లు సరిగ్గా తరక్కపోతే తన మనసంతా పాడయిపోతుంది ఇప్పుడు! చెయ్య గలిగిందేం లేనప్పుడు నోరు మూసుకుని కూర్చోవటం ఉత్తమం అన్న నిర్ధారణకి వచ్చేసింది వసుంధర. అప్పుడు నెమ్మదిగా కునుకు పట్టింది.

ఒక గంట తర్వాత మెలకువ వచ్చేసరికి పోపుల ఘుమఘుమలూ, చుఁయ్‌ ‌చుఁయ్‌ ‌మన్న శబ్దాలు వినిపిస్తుంటే ఇదేవిఁటి… వీళ్లు వంట కూడా కానిచ్చేస్తున్నారా ఏవిటి? అన్న సంభ్రమం ఓ ప్రక్క… స్నానం చెయ్యకుండానే వంట కానిచ్చేస్తున్నారా ఏమిటి ఖర్మ…. అడగరూ… పెట్టరూ అనుకుంటూ కొడుకునీ, భర్తనీ పిలిచింది. పిలిచిన తీరులో వాళ్లిద్దరూ ఆగమేఘాల మీద వచ్చి తన ఎదురుగా హాజరు కావాలన్న సందేశం ఉంది.

ప్రహ్లాదరావు ముందుగా ఆవిడముందు ప్రత్యక్షం అయ్యాడు. ఒంటి చుట్టూ అటూ ఇటూ మలుపు కుంటుంటే ‘ఏవయిదండీ?’’ అడిగింది వసుంధర.

‘‘మీగడ తునకలు వంటినిండా అంటుకు పోయాయే!’’ అన్నాడు.

అప్పటికే భర్త నుదుటన విరాజిల్లుతున్న ఎర్రటి కుంకుమ బొట్టు తన సందేహాన్ని తీర్చేయటంతో చిన్నగా నవ్వేస్తూ ‘‘సరేలెండి వేళాకోళం గానీ… మీరు స్నానం చేశారో లేదో నన్న సందేహం వచ్చింది నాకు! పోపు వాసనలూ, శబ్దాలూ వస్తుంటే హడలి పోయాను!’’

‘‘సందేహ నివృత్తి అయిందా మరి! ఇక నేను నిష్క్రమించవచ్చునా?’’

‘‘అయినా మీకు రాని పని ఇప్పుడు ప్రయోగం చెయ్యటం ఎందుకండీ! వీటి రుచి ఎలా అఘోరి స్తుందోనని భయంగా ఉంది నాకు! పెద్దవాళ్లు- వాళ్లొచ్చి చూసుకుంటారులేండి! అన్నీ తరిగిపెట్టి సిద్ధం చేశారుగా!’’ మెత్తగా తన అయిష్టతని వ్యక్తం చేసింది.

‘‘పోపు ఘుమఘుమలు చెప్పటం లేదూ-వంట ఎంత బ్రహ్మాండంగా సాగిపోతోందో!’’ ప్రహ్లాదరావు ప్రసన్నవదనంతో అన్నాడు.

‘‘అవుననుకోండి…! కానీ!’’ ఆ ఘుమఘుమలను నిజంగానే కాదనలేక పోయింది వసుంధర.

‘‘కానీ… ఏవిటీ బఠాణీ!’’

‘‘ప్రాస కుదిరింది గానీ సందర్భం కుదరలేదు!’’ వసుంధర వదనంలో కూడా ప్రసన్నత వెలిగింది.

‘‘ఒక్క గంట ఆగు! నా ప్రతాపం ఏమిటో చూపిస్తాను! అంతా కామన్‌సెన్స్ ‌మహిమోయ్‌! ఇన్నాళ్ల నుంచి తింటున్నాను! ఈ జగత్తులో ప్రతి అణువునా ఆ విష్ణుదేవుడున్నాడని గ్రహించిన ప్రహ్లాద నామధేయుడ్ని… రోజూ తింటున్న పదార్థాల్లో ఏం వుండి ఉంటాయో తెలుసుకోలేనూ! నరసింహుడ్ని రాతి స్తంభంలో చూపించిన ప్రహ్లాదుడ్ని! కూరల్లోపల ఏం ఉంటాయో తెలుసుకోవటం నాకొక లేఖ్ఖా! ఖ వత్తుని మరీ గట్టిగా వత్తి పలుకుతూ అన్నారు.

వసుంధర పకపకా నవ్వేసింది. మనస్సు తేలిక పడిందేమో కాస్తంత- అందుకని! చాలా సమయం తర్వాత భార్య అలా నవ్వటం చూసి మురిపెంగా అడిగారు ప్రహ్లాదరావు గారు ‘‘ఎందుకోయ్‌ ఆ ‌నవ్వు?’’

‘‘చెప్పమంటారా?’’ మళ్లీ ఆపుకోలేని నవ్వు!

‘‘చెప్పమనేగా అడిగింది!’’

‘‘ప్రహ్లాదుడంటే ఎవరికయినా చిన్నపిల్లాడు గుర్తొస్తాడు! మీరేమో… ముసలి… ముసలి…!’’

ముసలి తొక్కూ అంటావ్‌!

‘‘అం‌తేగా మరి!’’

‘‘హమ్మయ్య! నువ్విలా నవ్వుతూ ఉంటే ఎంత పనైనా చిటికెలో చేసేస్తాం!’’ అంటూ వంటగదివైపు కదిలాడాయన.

మధ్యలో వసుంధరకి కాఫీ తెచ్చి ఇచ్చారు ఆయన.

ఇంకో రెండు గంటల్లో అనూహ్యంగా జరిగింది… ఆ… సంఘటన!

లావణ్య ఓ పెద్ద కంచంలో చిన్నచిన్న గిన్నెల్లో రెండు రకాల కూరలు, రెండు పచ్చళ్లు, సాంబారు పెట్టుకుని వచ్చి ‘‘అత్తయ్య గారూ… వంట సిద్ధం!’’ అంది.

వసుంధరకి ఆనందంతో కళ్లల్లో నీళ్లు చిప్పిల్లాయ్‌.

‌నమ్మలేనట్టుగా ఆ వండిన పదార్థాల వైపు చూస్తూ ఉండిపోయింది వసుంధర. ఇది కలా… నిజమా అని ప్రశ్నిస్తున్నాయ్‌ ఆవిడ కళ్లు సంభ్రమంగా!

‘‘ఇంకో ఆశ్చర్యం చెప్పనా మరి… ఇవ్వన్నీ చేసింది లావణ్య! మేం ఊరికే కూరలు తరిగి ఇచ్చాం! అది కూడా తను తరిగి చూపిస్తే!’’ అన్నాడు వెనకాలే వచ్చిన ప్రహ్లాదరావు.

‘‘ఇది… ఇది… నిజమా?’’ వసుంధరకి నోట మాట రానట్టుగా ఉంది.

లావణ్య అవునన్నట్టుగా నవ్వింది.

‘‘ఎంతో అనుభవం ఉంటేనే గానీ ఇంతమందికి వంట చెయ్యలేదు! మరి నీకు….’’

‘‘మా అమ్మ నేర్పించిందత్తయ్య గారూ! నాకు ఇరవై సంవత్సరాలు దాటిన దగ్గర్నుంచీ ఇంటిని నడిపించటం ఎలాగో- వంట చెయ్యటం ఎలాగో అన్నీ అమ్మ నేర్పించింది!’’

‘‘నిజంగా!’’ వసుంధరకి ఆనందంతో కళ్ల నీళ్లు వచ్చేశాయ్‌.

‌లావణ్య అవునన్నట్టుగా కళ్లతో నవ్వింది.

‘‘ఆవిడ అలా నేర్పించాలనుకోవటం నువ్వు నేర్చుకోవటం అన్నీ అద్భుతమే! ఒకసారి ఇలా నా దగ్గరగా రా తల్లీ!’’ అంది వసుంధర.

‘‘అన్నపూర్ణాదేవిలా కనిపిస్తున్నావ్‌ ‌తల్లీ!’’ అంది వసుంధర.

కాస్సేపటిలో ఇంటికి వచ్చిన పెద్దవాళ్లకి లావణ్య చకచకా మర్యాదలు చేస్తూ ప్రేమగా, చిరునవ్వుతో వండిన వంటల్ని ఆప్యాయంగా వడ్డిస్తూ ఉంటే….

వారి కనులలోంచి కురుస్తున్న ప్రశంసలజల్లులు, వారి మాటల్లోంచి ప్రవహించిన అభిమానపు వరద… లావణ్యని ముచ్చటగా ముంచెత్తి వేశాయ్‌.

‘‘‌తల్లీ… నువ్వు చల్లగా పిల్లాపాపలతో మీ ఆయన అనురాగంలో హాయిగా ఉండాలంటూ’’ ఆ పెద్దవాళ్లు మళ్లీ మళ్లీ ఆశీర్వదించారు.

పైగా ‘‘ఇన్నిసార్లు ఆశీర్వదించినా మనస్సుకి తృప్తి దొరకటం లేదు తల్లీ! చదువుకుని ఉద్యోగం చేస్తూ కూడా ఇవన్నీ నీకెలా చేతనయ్యాయ్‌ ‌తల్లీ! ఈ కాలప్పిల్లలు ఎప్పుడు ఫోన్‌ ‌పట్టుకుని కూర్చోవటమో, చెవుల్లో అవేవో పెట్టుకుని ఈ ప్రపంచంతో సంబంధం లేనట్టుగా ఉండటమో చూశాం గానీ- తేనెధారల్లా నీ మాటల్లో కురుస్తున్న మర్యాదా, మన్నింపూ… ఆశ్చర్యంగా ఉంది తల్లీ!’’ అన్నారు.

‘‘ఈ గొప్పదనమంతా మా అమ్మదేనండీ! మీ ఆశీర్వాదాల్లో చాలా భాగం మా అమ్మకే దక్కాలి!’’ హృదయం ఆనంద జలధియై పొంగుతూ ఉంటే అంది లావణ్య.

‘‘చెప్పే పెద్దలు ఉన్నా వినే పిల్లలు ఉండొద్దూ!’’ అంటూ మళ్లీ లావణ్యకే పట్టం కట్టారు ఆ పెద్దవాళ్లు.

వచ్చిన పెద్దవాళ్ల ఆశీర్వాదాలు తన పిల్లలకి ఎంత బాగా చేరాయో తిలకించిన వసుంధర ఆనందానికి అవధులు లేవు!

వాళ్లు వెళ్తూ వెళ్తూ ఒకమాట అన్నారు ‘‘ఇంటి ఇల్లాలికి ప్రారంభంలోనే ఇటువంటి నేర్పు ఉంటే జీవితంలో ఆనందహర్మ్యాలను అలవోకగా నిర్మించుకోవచ్చు! ప్రతి ఇంట్లోనూ పెళ్లయిన కొత్తలో అత్తమామలతో సమస్యలు ప్రారంభమయ్యేది ఇక్కడే! పిల్లలకి పనిచెయ్యటం రానప్పుడు విసుగు పుడు తుంది. ఆ విసుగులోంచి ఎడమొహం పెడమొహం… ఇలా గొలుసులా అల్లుకుపోతాయ్‌ ‌సమస్యలు! సమస్యలకి పరిష్కారం పనిలో నైపుణ్యతే!’’

వింటున్న అందరికీ అది అక్షరాలా నిజమని పించింది.

*  *  *  *

ఆరోజు రాత్రి తల్లికి ఫోన్‌ ‌చేసి ఎన్నెన్నో మాటలు, కృతజ్ఞతలూ వెల్లువలా చెప్పాలనుకున్న లావణ్యకి దుఃఖం పొంగుకు వచ్చింది. ముందు తనివితీరా ఏడ్చేసింది.

అటువైపునున్న భాగ్యలక్ష్మి ‘‘ఇంకా అత్తగారింటికి వెళ్లి ఎన్నో రోజులవలేదు కదా! ఇంటిమీద బెంగతో ఏడుస్తోందిలే’’ అనుకున్న ఆవిడ కూతురి దుఃఖం తెప్పరిల్లేదాకా మౌనంగా ఊరుకుంది.

‘‘అమ్మా- నేను ఆనందం తట్టుకోలేక ఏడుస్తున్నానమ్మా! నువ్వు నాకు ఇరవై సంవత్సరాలు నిండగానే వంట నేర్చుకుని తీరాలని పట్టుబట్టి నప్పుడు, నాకిష్టం లేకపోయినా బలవంతంగా నేర్పించినప్పుడు నీ మీద కోపం వచ్చేది! మా అమ్మ మరీ రాక్షసిలాంటిదని తిట్టుకునేదాన్ని! ఒక ఆరునెలల పాటు ఇంటి ఖర్చులు, నిర్వహణ అంతా నా భుజాల మీదనే వేసినప్పుడు ‘‘అబ్బబ్బా! అమ్మకి చాదస్తం పెరిగిపోతోంది!’’ అని ఎన్నిసార్లు మనస్సులో విసుక్కున్నానో చెప్పలేను! అయినా నువ్వు పట్టించుకో లేదు! నా పొగడ్తలనీ, మెప్పునీ ఆశించలేదు! నా విసుగునే భరించావ్‌!

ఇం‌టికి పదిమంది చుట్టాల్ని పిలిచి వంట బాధ్యతంతా నాకే అప్పగించేసే దానివి! అభ్యాసం కూసు విద్య అనేదానివి! అమ్మ రాక్షసి అని ఎన్నిసార్లు నాన్నగారితో నీమీద చాడీలు చెప్పానో లెక్కలేదు! నాన్నగారు నవ్వేసి ఊరుకునేవారు. కానీ అమ్మా! ఇవ్వాళ మా ఇంటికి వచ్చినవాళ్లు సాక్షాత్తూ నేను కాశీఅన్నపూర్ణాదేవిలా అనిపిస్తున్నానని అన్నారమ్మా! ఈ మాటలన్నీ నీకే ఇచ్చేస్తున్నానమ్మా…. అన్నీ నీకే!’’ ఉద్వేగంగా అంది లావణ్య!

భాగ్యలక్ష్మీ హమ్మయ్య అని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది.

About Author

By editor

Twitter
Instagram