వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతి పొందిన రచన

– కృపాకర్‌ ‌పోతుల

అవంతీదేశాన్ని పరిపాలిస్తున్న మహారాజు ‘మార్తాండతేజుని’ ఆంత రంగిక సమావేశ మందిరం. అత్యంత ముఖ్యులైన సహచరులతో అత్యవసర సమావేశం నిర్వహించ బోతున్నారు మహారాజు. ఆయనతో పాటు మహా మంత్రి, సేనాధిపతి, ఆరోగ్యశాఖా మాత్యుడు, ముఖ్య వేగు కొంతమంది అత్యున్నతాధి కారులు మాత్రమే పాల్గొంటున్నారు.

కిందిస్థాయి అధికారులు, కొందరు ఉద్యోగులు భవనం వెలుపల మహారాజు రాకకోసం ఎదురు చూస్తున్నారు. ఎవరి తలకాయ నేలరాలుతుందోనన్న భయాందోళనలు అందరి మొహాల్లోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. వారి భయాందోళనలకు కారణం…

కొద్దిరోజులుగా అవంతీదేశానికి సంబంధించిన దిగ్భ్రాంతికరమైన వార్త ఒకటి చుట్టుపక్కల రాజ్యా లన్నిటిలో దావానలంలా వ్యాపించసాగింది. మొదట్లో దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా, రోజులు గడిచేకొద్దీ అది సమసిపోకపోగా మరింత బలంగా వ్యాప్తి చెందేసరికి…

‘ప్రజారంజకమైన తమ సుపరిపాలనలో ప్రజలు అనుభవిస్తున్న సుఖసంతోషాలను చూసి ఓర్వలేని శత్రువులు చేస్తున్న కుట్ర’ అని ఖండించే అవకాశం లేకుండా పోయింది మహారాజు గారికి.

* * * * * * * *

హోరాహోరీగా జరిగిన వారసత్వపోరులో తండ్రితోపాటు సోదరులందరినీ హతమార్చి మరీ సింహాసనాన్ని అధిరోహించారు మార్తాండతేజులు.

పిమ్మట దాన, దండోపాయాల్ని ధారాళంగా ప్రయోగించి ప్రత్యర్ధ్దివర్గానికి చెందిన చాలామందిని తమకు తొత్తులుగా మార్చుకున్నారు. అలా మారడానికి నిరాకరించిన వారిని నేలమాళిగల్లో బందీలుగా చేసి చిత్రహింసల• పెట్టారు.

కాని… తమ అధికారం చిరస్థాయిగా నిలబడాలంటే అది మాత్రమే చాలదనీ, ప్రజలను తమ పక్షానికి తిప్పుకోవడం అత్యంత ఆవశ్యకమనీ గ్రహించిన అవంతీదేశాధీశులు ఆ దిశగా పావులు కదిపారు. లెక్కలేనన్ని ప్రజాకర్షణ పథకాలకు శ్రీకారం చుట్టారు. వాటిని అమలుపరచి, అనతికాలంలోనే, దేశప్రజల హృదయాలలో కోట కట్టుకొని నివసింప సాగారు.

* * * * * * * *

 మహారాజువారు సింహాసనాన్ని అధిష్ఠించి మరో మూడు నెలల్లో మూడేళ్ల కాలం పూర్తికాబోతోంది. అంతర్గత శత్రువులు అథః పాతాళానికి వెళ్లిపోయారు. సింహాసనం సుస్థిరంగా ఉంది. ప్రజలందరూ సుఖసంతోషాలతో తులతూగుతున్నట్టు వేగుల ద్వారా వార్తలు అందేవి. దేశం అంతటా శాంతి సౌభాగ్యాలు రాజ్యమేలుతున్నాయి.

గనుక మూడవ వార్షికోత్సవాన్ని నెలరోజుల పాటు ఘనంగా జరుపుకోవాలని మహా మంత్రి, ఇతర మంత్రులు మహారాజును గట్టిగా మొహమాట పెట్టారు. ఆయనా మొహమాటపడ్డారు. అందుకు కావలసిన ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఏర్పాట్లన్నీ శరవేగంతో జరిగి పోతున్నాయి.

అటువంటి కీలకదశలో పిడుగుపాటులా వచ్చిపడింది ‘వార్తా విపత్తు’. దాన్ని కొండంతలుచేసి రెచ్చిపోతున్నారు శత్రుదేశాధీశులు. ఏంచేయాలో, పాలుపోని విపత్కర పరిస్థితి నెలకొంది. మహామంత్రి సహా ఏ ఒక్కరూ సమస్యకు కారణాన్ని గాని, తగిన పరిష్కారాన్ని గాని సూచించలేకపోతున్నారు.

దానితో విపరీతమైన ఆగ్రహం చెందిన మహారాజు, సంప్రదాయాన్ని అనుసరించి సమస్య గూర్చి పట్టపురాణివారితో సుదీర్ఘంగా చర్చించారు. కారుచిచ్చులా వ్యాప్తి చెందుతున్న ఆ వార్తలో అసలు ‘వాస్తవమెంత’ అన్న విషయాన్ని ముందుగా తెలుసుకొని, ఆపై దానికి పరిష్కారం ఆలోచించడం ఉత్తమమన్న ఆమె సలహాను మన్నించారు. నిజాన్ని నిగ్గుతేల్చే బాధ్యతను మహామంత్రి భుజస్కంధాలపై మోపి, అప్పటికి శాంతించారు.

* * * * * * * *

నిజాన్ని తవ్వి వెలికి తీయడం ఎలాగో, తిమ్మ రుసును తలదన్నే మేధోసంపత్తి గల మహామంత్రికి కూడా సులువుగా స్ఫురించలేదు. రెండు రాత్రులు నిద్రలేకుండా, సుదీర్ఘంగా ఆలోచించాక గాని ఏంచెయ్యాలో తెలియలేదు. తెలిశాక ఆయన ఇక ఆగలేదు.

* * * * * * * *

సమస్యను లోతుగా అధ్యయనం చేసి, అందుకు గల కారణాలు అన్వేషించడానికిగాను ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరిని తక్షణమే నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వెంటనే దర్యాప్తు మొదలు పెట్టాలని, రెండు వారాలలో నివేదికను సమర్పించి తీరాలని, లేనిపక్షంలో ‘నీ శిరస్సు కోటగుమ్మానికి వేలాడుతుంది జాగ్రత్త’ అని గట్టిగా హెచ్చరించారు. తరువాత నిశ్చింతగా నిట్టూర్చి, ఆ రాత్రి సుఖంగా నిద్రపోయేరు.

* * * * * * * *

తన శిరస్సును కాపాడుకోవాలన్న సత్సం కల్పంతో విచారణాధికారి నిర్ణీత సమయం కంటే ముందే విచారణ పూర్తి చేసి నివేదికను సిద్ధం చేశాడు. తనకు అత్యంత విశ్వాసపాత్రులైన ఆంతరంగికులతో మరికొద్దిసేపట్లో దానిపై చర్చించబోతున్నారు మహారాజుగారు. అందుకే అందరిలోనూ ఆ ఆందోళనా, ఉత్కంఠా!!

* * * * * * * *

సమావేశం మొదలైంది. మహామంత్రి విచారణాధికారివైపు చూశారు ‘మొదలుబెట్టు’’ అన్నట్టు.

అతను తనముందున్న దస్త్రాన్నితెరిచి, ఒక్క క్షణం అందులోకి చూపుసారించి, గొంతు సవరించుకొని… ‘మహారాజా, తమ ఉత్తర్వులను అనుసరించి నేను చేపట్టిన దర్యాప్తులో వెలుగుచూసిన విషయాలను బట్టి ఇరుగుపొరుగు రాజ్యాలలో మన గురించి ప్రచారంలో ఉన్న వార్త నూటికి నూరు శాతం వాస్తవం అన్న విషయంలో ఎటువంటి సందేహానికి తావులేదు’’ అని విన్నవించగానే మహామంత్రి కల్పించుకొని…

‘‘నిజమే కావచ్చు. మనమేమీ కాదనట్లేదు. కాకపోతే మనకు మాత్రమే ఎందుకు ఇలా జరిగింది? మన శత్రుదేశాలలో ఎందుకు జరగలేదు? వీటికి కారణాలేంటి? ఇవికదా నిన్ను పరిశోధించి తెలుసుకోమని ఆదేశించినది?’’ అని ప్రశ్నించారు అసహనంగా.

‘‘ఆ విషయానికే వస్తున్నాను మహామంత్రివర్యా!’’ అన్నాడు అధికారి తడబడుతూ. ‘‘నేను గ్రహించినంత వరకూ ఈ విషమ సమస్య తలెత్తడానికి గల ఏకైక కారణం’’ అని చెప్పి, చిన్న విరామం ఇచ్చి, వణుకు తున్న చేత్తో అంగీలో నుంచి చేతిగుడ్డ తీసి నుదిటిమీద పట్టిన చెమటబిందువుల్ని తుడుచుకుంటూ చుట్టూ చూశాడు తత్తరపాటుతో.

అప్పటికి శాంతించిన మహామంత్రి అతని భయాన్ని గమనించి, ‘‘నువ్వు తెలుసుకున్న వాస్తవాలు చెప్పడానికేమీ భయపడకు. అసలు కారణం ఇదీ… అని తెలియకపోతే సమస్యకు పరిష్కారం ఎలా లభిస్తుంది చెప్పు?’’ అని అనునయించారు చిరునవ్వుతో.

దానితో ధైర్యం తెచ్చుకున్న విచారణాధికారి ‘‘ఈ సమస్య మన రాజ్యంలో మాత్రమే తలెత్తడానికీ, ఇంకే రాజ్యంలోనూ కనబడకపోవడానికీ గల ఏకైక కారణం… తమ సుపరిపాలనలో ప్రజలంతా దేనికీ ఎలాంటి కొరతా లేకుండా సుఖసంతోషాలతో హాయిగా జీవించడమే మహారాజా’’ అన్నాడు మొహం నిండా నవ్వు పులుముకొని.

అక్కడున్న వారందరూ… మహారాజు సహా… దిగ్భ్రాంతి చెందారు ఆ మాటలు విని. ‘‘ఆశ్చర్యంగా ఉందే!! నా ప్రజలు సుఖసంతోషాలతో జీవించడానికీ ఈ సమస్యకూ గల సంబంధమేంటి? ఒకవేళ నువ్వన్నదే నిజమైతే, ఈ విషయం ఇంతవరకూ మా దృష్టికి రాకపోవడానికి కారణమేంటి? వేగులంతా ఏం చేస్తున్నట్టు? ముఖ్యవేగు ఎక్కడ?’’ గర్జించారు మహారాజుగారు.

 ‘‘ఇంత చిన్న విషయం తమ దృష్టికి తీసుకొచ్చి తమర్ని ఇబ్బంది పెట్టడం…‘‘వాక్యం పూర్తి చెయ్యలేక నీళ్లు నమలసాగాడు ముఖ్యవేగు భయంతో.

 ‘‘ఏదైనా మా దృష్టికి తీసుకురావడం వరకే నీ బాధ్యత. అది చిన్నదా? పెద్దదా? అన్నది నిర్ణయించా ల్సింది మేము. ఇలాంటి పొరపాటు ఇంకొకసారి జరగడానికి వీల్లేదు జాగ్రత్త’’ అని హెచ్చరించి, ‘‘నువ్వు కానీవయ్యా’’ అని సెలవిచ్చేరు విసుగ్గా. విచారణాధికారి మరొకమారు గట్టిగా నిట్టూర్చి, పిడచగట్టుకుపోయిన గొంతును రెండు చుక్కల నీటితో తడుపుకొని, తన కథనాన్ని కొనసాగించాడు.

 ‘‘అసలు విషయమేమనగా మహారాజా, తమ సుపరిపాలనలో ప్రజలకు కావలసినది ప్రతిదీ, ఎటువంటి కొరతా లేకుండా పుష్కలంగా లభి స్తుండడంతో వారి జీవితాలు నిశ్చింతగా, ఎలాంటి ఇబ్బందీ లేకుండా…’’ అని చెప్తూ, ఎండిపోయిన గొంతును మరొకసారి తడుపుకోడానికి క్షణంసేపు ఆగాడో లేదో, ఆరోగ్యశాఖ మంత్రి మధ్యలో చొరబడిపోయి…

 ‘‘ఎలాంటి ఇబ్బందీ లేకుండా… అని నెమ్మదిగా అంటున్నావేంటి! సింహాసనం అధిష్ఠించాక మన ప్రియతమ మహారాజుగారు తను అమితంగా ప్రేమించే ప్రజలకు ఎలాంటి సదుపాయాలు ఎన్నెన్ని కలుగజేసేరో అందరికీ విదితమే కదా! ఏ రాజ్యంలో నైనా. ఏ రాజైనా ఇంతటి ప్రజారంజక పరిపాలన సాగిస్తున్నాడా?’’ అంటూ మహారాజుగారు ప్రజల సౌకర్యార్ధ ఏమేమి పథకాలు అమలు చేస్తున్నారో, ఎటువంటి పందేరాలు గావిస్తున్నారో, భవిష్యత్తులో గావించబోతున్నారో… అక్కడున్నవారికి అవన్నీ బాగా తెలిసిన విషయాలే అయినా… మరొకమారు మహోద్రేకంగా మనవి చేశారు, మహారాజుగారి వైపు భక్తిపూర్వకమైన దృక్కులు సారిస్తూ.

మంత్రిగారి ఉపన్యాసం వింటున్న మార్తాండ తేజుని ముఖారవిందం ముద్దబంతిపువ్వులా వికసించింది. ‘‘విషయానికి రండయ్యా. ఇంకా ఉపోద్ఘాతంలోనే ఉన్నారు’’ అన్నారు కోపాన్ని ప్రదర్శించే ప్రయత్నం బలంగా గావిస్తూ.

‘‘అదే మహారాజా. అసలు విషయమేంటంటే…’’ అంటూ తన నివేదనను కొనసాగించాడు విచారణాధి కారి ‘‘హమ్మయ్య’’ అని నిట్టూరుస్తూ.

‘‘కావలిసిన ప్రతిదీ తమరు ఉదారంగా అందిస్తున్నారు గ•నుక… దేనికీ శ్రమ పడాల్సిన అవసరం ఏ కోశానా మన ప్రజలకు కలగట్లేదు గనుక… వారంతా…’’

‘‘ఆ…ఉ… వారంతా…?’’

‘‘పని పాట్లు మానేసి…’’

‘‘అహా…మానేసి?

‘‘జీవితాల్ని… ఆస్వాదిస్తున్నారు… మహారాజా’’ అన్నాడు ప్రతి పదాన్నీ గట్టిగా ఒత్తి పలుకుతూ.

‘‘నా ప్రియప్రజలు తమ జీవితాల్ని ఆస్వాదించ డానికీ, ఈ సమస్యకూ గల బాదరాయణ సంబంధ మేంటి మహానుభావా? ప్రశ్నించారు మహారాజుగారు వ్యంగ్యంగా.’’ అంటే… అదీ… అదీ… అంటూ కొన్ని క్షణాలు నీళ్లు నమిలి, ‘‘అంటే మహారాజా, పనీపాట్లు చేయకపోయిన్పటికీ ప్రజలందరికీ కావలసిన దానికంటే తీరిక చాలా ఎక్కువ లభిస్తోంది గనుక…’’

‘‘ఆ.. ఉ… లభిస్తోంది గనుక…’’

‘‘సమయమూ, స్వేచ్ఛా వారి చేతులనిండా కావలసినంత ఉండుటవలన…’’

‘‘అహా… ఉండుట వలన…’’

‘‘పగలూ రాత్రీ భార్యాభర్తలు కలిసి గడిపే అవకాశం బహు ఎక్కువ కావడం వలన…’’

‘‘ఊఉ… కావడం వలన…?’’

‘‘వారు చా… లా ఎక్కువగా ఐహికసుఖాలలో మునిగితేలుతున్నారు మహారాజా. మన దేశజనాభా ఇలా తామరతంపరగా పెరిగిపోవడానికి ఇది తప్ప వేరే కారణమేదీ నాకు కనబడలేదు మహారాజా’’ అని తను పరిశోధించి తెలుసుకున్న విషయాన్ని నిరూపక సంఖ్యాశాస్త్ర సహాయంతో సవివరంగా తెలియజేసి, లోటాలో మిగిలిన నీరు గటగటా తాగేసి, కళ్లు రెండూ గట్టిగా మూసుకున్నాడు విచారణాధికారి.

* * * * * * * *

సభాభవనం అంతటా చీమ చిటుక్కుమంటే వినిపించేటంత నిశ్శబ్దం అలముకుంది. అందరికన్నా ముందు తేరుకున్న మహారాజుగారు చుట్టూచూస్తూ…

‘‘నిజమా! నమ్మలేకపోతున్నాను. నిజంగా ఇదే కారణమా’’ అంటూ ఆశ్చర్యం వెలిబుచ్చేరు. ‘‘ఔనౌను. నమ్మలేకపోతున్నాం, నమ్మలేకపోతున్నాం.’’ అని వల్లించేరు మిగిలినవారందరూ చిలకల్లా.

‘‘దీనికి పరిష్కారమేంటి?’’ అని ప్రశ్నించేరు మహారాజు గారు.

‘‘ఔనౌను. పరిష్కారమేమిటి? పరిష్కారమేమిటి?’’ అని ప్రశ్నించాయి చిలకలు.

ఇటువంటి అవకాశం కోసమే ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న ఆర్ధిక శాఖ మంత్రి.. లభించిన అవకాశాన్ని అందిపుచ్చుకొంటూ…

‘‘సందర్భం వచ్చింది గనుక మరొకమారు తమరికి మనవి చేసుకుంటున్నాను మహారాజా… గత కొన్నేళ్లుగా మనం అమలు చేస్తున్న పథకాల వలన ఖజానా ఇంచుమించు ఖాళీ అయిపోయింది. అర్థికపరిస్థితి దివాళాదిశగా శరవేగంతో పరుగులు పెడుతోంది. ఇంతకుముందే ఈ అంశాలను తమకు విన్నవించుకున్నాను. ప్రజలకు ఆయాచితంగా అందిస్తున్న వాటిలో కొన్నింటికైనా కోత పెట్టకపోతే బొక్కసం పూర్తిగా ఖాళీ అయిపోడానికి ఇంకెంతో కాలం పట్టదు మహారాజా! అది పూరించడానికి పక్క రాజ్యాలమీద దండయాత్రలు చేయడమో, రాజ్య ప్రజలపై మరిన్ని కొత్తపన్నులు విధించడమో తప్ప మార్గాంతరం కనబడట్లేదు’’ అని విన్నవించాడు వినమ్రంగా.

ఆ మాటలు విన్న మహారాజు గారి మొహం కోపంతో జేవురించింది. ఒక్క ఉదుటున సింహాసనంపైనుండి లేచి, పిడికిలి బిగించి,….

‘‘ఓయ్‌ ఆర్ధిక మంత్రీ! నేనీ సింహాసనంమీద మూడేళ్ళపాటు హాయిగా కూర్చోగలిగానంటే దానికి ఒకే ఒకకారణం..ఈ వెర్రిగొర్రెలకు…అదే నా ప్రియజనులకు విదిలిస్తున్న… అదే నా ప్రియప్రజలకి, నేను పంచిపెడుతున్న ఈ పందేరాలు తప్ప మరేదీ కారణం కాదన్న నిజం ఎప్పటికి బోధపడుతుందోయ్‌ ‌నీకు. ఆర్ధిక శాస్త్రంలో నిష్ణాతుడివి కదా! పాలితులు పాలకుల వద్ద నుండి నిజంగా కోరుకుంటున్నదేమిటో తెలుసుకునేందుకు ఏనాడైనా ప్రయత్నించావా? అని ప్రశ్నించారు తీక్షణంగా.

తలవంచుకున్నాడు ఆర్ధిక శాఖామాత్యుడు. మహారాజుగారు తమ ఉపన్యాసాన్ని మరింత కోపంగా కొనసాగించారు.

‘‘నా ప్రశ్నకి సమాధానం నేనే చెప్తాను విను. మనం ఎన్ని ఆనకట్టలు కట్టాం? ఎన్ని ఎకరాలు సస్యశ్యామలం చేసి, ఎన్ని పరిశ్రమలు స్థాపించాం? ఎంతమందికి జీవనోపాధి కల్పించేం? ఎంత నాణ్యమైన విద్యా, వైద్యం అందిస్తున్నాం? అవినీతి, లంచగొండితనాన్ని ఎంత మేరకు తగ్గించాం? ఇవి కాదయ్యా మేధావీ.. ప్రజలకు పట్టేవి’’

‘ఉచితంగా ఏమి పారేస్తున్నాం’ అన్నది ఒక్కటే వాళ్లకు కావలసినది. ఈ పరమసత్యాన్ని శిరసున ధరించి పరిపాలన సాగించినప్పుడే రాజైనా, మహారాజైనా నాలుగు కాలాలపాటు నిశ్చింతగా మనగలిగేది. తెలుసుకో’’ అని ఆర్థిక మంత్రికి జ్ఞానోపదేశం చేసి, ‘‘మీరేమంటారు. నేనన్నది నిజమా కాదా?’’ అని ప్రశ్నించేరు మహారాజుగారు. ‘‘నిజమే మహారాజా’’ అని ముక్తకంఠంతో ఏకీభవించేరు అక్కడున్న వారంతా.

అది విన్న మహారాజుగారు రెట్టించిన ఉత్సాహంతో తమ ఉపన్యాసాన్ని ఇంకా ఈ విధంగా కొనసాగించేరు.

‘‘నేను మళ్లీ చెప్తున్నాను… ఈనాడు ప్రజలకి కావలసినది… ఏమిటి? ఎవడు, ఎంతకాలం ఉచితంగా పారేస్తాడు అన్నది మాత్రమే. మిగిలినవి వారికి అవసరం లేదు. నేను వాటిని విదిలిస్తున్నాను గనుక, నన్నీ సింహాసనం మీద కూర్చోనిచ్చారు. ఇచ్చినంత కాలం కూర్చోనిస్తారు. ఆపేసిన మరుక్షణం నన్ను పదవీచ్యుతుడ్ని చేసి, మరొకడిని దీనిపై కూర్చోబెడతారు. దెబ్బతో నేనూ, నాతో పాటు మీరందరు శంకరగిరి మాన్యాలు పట్టిపోవాల్సి వస్తుంది. దానికి మీరంతా సిద్ధమా?’’ అని ప్రశ్నించారు నాటకీయంగా.

‘‘లేదు మహారాజా. మేము దానికి సిద్ధంగాలేం’’ అని భృత్యులంతా మహారాజుగారికి గట్టిగా తెలియచేశారు. మార్తాండతేజులు సంతృప్తిగా తలపంకించి…

‘‘కనుక… ‘వాటిని నిలిపివేద్దాం’ వంటి ఆచరణ యోగ్యంకాని సలహాలు కాదు… మనముందున్న సమస్యకు పరిష్కారం… అదీ నాకు కావలసినది. ప్రతి దానికీ ఉన్నట్టే దీనికీ ఒక పరిష్కారం కచ్చితంగా ఉండి తీరుతుంది. ప్రశాంతంగా ఆలోచిస్తే అది స్ఫురించి తీరుతుంది. ఆలోచించండి. ఇప్పుడే, ఇక్కడే అదేదో కనుగొనాలి’’ అని భృత్యులను ప్రోత్సహించి, కళ్లు మూసుకొని ధ్యానంలోకి జారిపోయేరు మహారాజుగారు. మిగిలిన వారంతా వారిని అనుసరించేరు భక్తి శ్రద్దలతో.

* * * * * * * *

పరిష్కారాన్ని అన్వేషిస్తూ మేధోమధనంలో మునిగిపోయిన మహారాజూ, పరివారమూ, తీవ్రమైన తపస్సు గావిస్తున్న, గెడ్డాలూ మీసాలూలేని మునీశ్వరుల్లా కనిపిస్తున్నారు బయట నిలబడి, గవాక్షాల్లోనుంచి లోపలకు తొంగిచూస్తున్న వారికి.

అతికష్టంమీద అరగంట గడిచింది. ఆపైన ఇంకొక అరగంట గడిచిందో లేదో ‘‘కనిపెట్టేసా నహో!!’’ అన్న పొలికేక వినిపించింది, అక్కడ పేరుకున్న చిక్కటి నిశ్శబ్దాన్ని ఛిన్నాభిన్నంచేస్తూ. అదిరిపడి కళ్లు తెరిచిన వారందరికీ ఆనంద తాండవం చేస్తున్న ఆరోగ్యమంత్రి దర్శనమిచ్చాడు నటరాజభంగిమలో.

‘‘చెప్పవయ్యా’’ అని మహారాజుగారు అడగ కుండానే… ‘‘మహారాజా! ప్రజలకు ‘నీరూ-నీరా’ సహా, ప్రతిదీ ఉచితంగా అందజేస్తున్న మనసున్న మహారాజు ప్రపంచంలో తమరు తప్ప మరొకడు లేడన్నది తిరుగులేని వాస్తవం’’ అని మరొకమారు ఉద్ఘాటించగానే అందరూ చప్పట్లు చరిచి తమ హర్షాన్ని తెలియజేసేరు.

‘‘కాని, పెద్దమనసుతో ఇన్ని ఇస్తున్న తమరు ‘ఆ ఒక్కటీ’ ఇవ్వడం మాత్రం పూర్తిగా విస్మరించేరు మహారాజా! అన్నింటితో పాటు ‘అది’ కూడా ఇచ్చి ఉంటే, అసలు ఈ సమస్యే ఉత్పన్నమయ్యేది కాదు.

‘‘అయినా మించిపోయినది లేదు. ‘ఆ ఒక్కటీ’ కూడా అందజేయడం వెంటనే ప్రారంభిస్తే, అనతి కాలంలోనే మనల్ని వేధిస్తున్న సమస్య మటుమాయ మైపోవడం, శత్రువుల నోళ్లు మూతపడడం జరిగి తీరతాయి మహారాజా! అలా జరగనినాడు మీ చేత్తో నా చెవి కోయించుకుంటాను’ అని శపథం చేశాడు. ఉద్రేకంతో ఊగిపోతూ.

‘‘చెవీ ముక్కూ కోయించుకోవడం కాదుగాని, ‘‘ఆ ఒక్కటీ’’ అంటే ఏంటో అర్థమయ్యేలా చెప్పి చావవయ్యా’’ ముద్దుగా విసుక్కున్నారు మహారాజు గారు.

ఆరోగ్యశాఖమంత్రి వారివేపు చిద్విలాసంగా చూస్తూ ‘‘ఆ ఒక్కటీ’’ అంటే…‘‘అదే’’ మహారాజా ‘అదే’’ అన్నాడు కళ్లెగరేస్తూ…

అక్కడున్న వారందరి మొహాలు వెయ్యిదీపాల కాంతితో ప్రకాశవంతంగా వెలిగేయి… ఒక్క మహారాజుగారి మొహం తప్ప!!!

అది గమనించిన మహామంత్రి, తన ఆసనంపైనుండి లేచి, నెమ్మదిగా వారి ఆసనం వద్దకు వెళ్లి, ‘‘ఆ ఒక్కటీ’’ అంటే ఏంటో వారి చెవిలో వివరించేరు గుసగుసగా.

విన్న మహారాజుగారి మొహం రెండువేల దీపాల కాంతితో ప్రకాశించింది. చూస్తున్న భృత్యులు జయజయధ్వానాలు చేశారు. అవి సద్దుమణిగాక…

‘దేశంలో పదహారు నుండి డెబ్బై సంవత్సరాల వయసున్న ప్రతి మగపురుషునికీ, ఉచితంగా ఇచ్చే సరుకులన్నింటితోపాటు నెలకు సరిపడా ‘ఆ ఒక్కటీ’ కూడా ఎటువంటి అంతరాయమూ లేకుండా అందజేయాలి. ఈ పథకాన్ని సమర్ధంగా అమలుచేసే బాధ్యత ఇంత చక్కని పరిష్కారాన్ని సూచించిన ఆరోగ్యశాఖ మంత్రి గారికే అప్పగిస్తున్నాం. దీని అమలులో ఎలాంటి అలసత్వాన్నీ, నిర్లక్ష్యాన్నీ సహించబోం’ అంటూ ఆదేశాలు జారీచేశారు మహారాజుగారు.

దానితోపాటూ… ‘‘ఈ కొత్తపథకం అమలుకు అవసరమైన అదనపు వనరులు సమకూర్చడానికి నా ప్రియప్రజలపై అదనపు పన్నులు విధించడం మినహా వేరే మార్గము కనిపించుటలేదు గనుక, వేటిపై ఎంత మేరకు పన్నులు విధించవచ్చో గణించి, వారంలోగా మహామంత్రికి నివేదించవలసినదిగా ‘మేధావి వర్గానికి’ చెందిన ఆర్థిక మంత్రిని ఆదేశిస్తున్నాం.’ అన్న ఆదేశాన్ని కూడా జారీ చేశారు. చప్పట్లతో సభాభవనం మరొకమారు మరింత దద్దరిల్లిపోయింది.

* * * * * * * *

చాలాకాలంగా పట్టిపీడిస్తున్న జటిల సమస్యకు పరిష్కారం లభించింది. మహారాజుగారి మనసంతా ఉపశాంతితో నిండిపోయింది. మాటలకందని ఆనందానుభూతికి లోనయ్యారు వారు. ఆ ఆనందాన్ని మరింత ఆస్వాదించే ఉద్దేశంతో అప్పటికి నెలరోజుల క్రిత•మే చేపట్టిన ‘చిన్నరాణీవారి’ అంతఃపురం వేపు అడుగులు వేశారు మార్తాండ  తేజులు మహా హుషారుగా!!!

(ఇది ఉచితాల పందేరంపై గౌరవనీయ ప్రధానమంత్రి వ్యక్తపరచిన అభిప్రాయాలకు ప్రభావితమై రాసిన వ్యంగ్యకథ.)

About Author

By editor

Twitter
Instagram