ఈ ప్రశ్న ఇప్పుడు ఒకరిద్దరు రచయితల పెదవుల నుంచి ఉరికి వచ్చి ఉండవచ్చు. కానీ అది ప్రపంచంలో చాలామంది మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. విమర్శకు అతీతమని కొన్ని వ్యవస్థల విషయంలో ప్రపంచం ఎందుకు భావించాలి? అలాగే ఇస్లాం విమర్శకు అతీతమైనదంటూ ఆ వర్గంలో కొందరు మాత్రమే చేస్తున్న పిడివాదాన్ని యావత్తు మానవాళి ఎందుకు మౌనంగా వింటూ ఉండిపోవాలి? ఈ ప్రశ్న ఎందుకు అంటే, ‘గుస్తాకే రసూల్‌ ‌కా ఎక్‌ ‌హి సాజా… సర్‌ ‌తన్‌ ‌సే జుదా’ (ప్రవక్తను అవమానించినందుకు ఒకటే శిక్ష- తల, మొండెం వేరు చేయడం) అన్న రక్తదాహంతో కూడిన ఒక నినాదం ఇటీవల ప్రపంచమంతటా వినిపిస్తూ ఉండడం వల్లనే. ఈ నినాదం, ఈ ధోరణి ఇస్లాంకు వ్యతిరేకమని కొందరు ముస్లిం పండితులే చెబుతున్నా రోజురోజుకూ అది గొంతు పెంచుకోవడమే కలతపెట్టే విషయం. ఇస్లాంనూ, ప్రవక్తనే కాదు, ఆ మత వర్గీయులు చేస్తున్న అకృత్యాలను విమర్శించినా, వాటిని కూడా మతంతో ముడిపెడుతూ అదే నినాదం ఇవ్వడం ఇప్పుడొక వాస్తవం. రాజ్యాంగాలు, మానవహక్కులు, వాస్తవాలు ఇలాంటి వాటితో నిమిత్తం లేకుండానే విమర్శ వినిపిస్తే తల, మొండెం వేరు చేస్తామంటూ బయలుదేరుతున్నారు. ఆగస్ట్ 22 ‌రాత్రి నుంచి హైదరాబాద్‌ ‌పాతబస్తీ ఇదే నినాదంతో నాలుగైదు రోజుల పాటు దద్దరిల్లింది. ఇతర మతాల మీద, ముఖ్యంగా హిందూధర్మం మీద ముస్లిం మతోన్మాదులు యుద్ధానికి కాలు దువ్వడానికి ఎంచుకున్న నినాదమే సర్‌ ‌తన్‌ ‌సే జుదా అని అనుమానించక తప్పదని పరిణామాలే తరుచూ జరుగుతున్నాయి.


స్టాండప్‌ ‌కమేడియన్‌ ‌మునావర్‌ ‌ఫారూకిని తెరాస నాయకుడు, తెలంగాణ ఐటీ మంత్రి తీసుకువచ్చి హైదరాబాద్‌లో ప్రదర్శనకు అవకాశం ఇవ్వడం దగ్గరే ఈ వివాదం రాజుకోవడం మొదలయిందని కాస్త ఆలస్యంగా ఇప్పుడు మొత్తం మీడియా ఘోషిస్తున్నది. దేశంలోని సగం రాష్ట్రాలలో ఈ కమేడియన్‌కి ప్రవేశం లేదు. అయినా పట్టుపట్టి ఇప్పుడు ఎందుకు తీసుకురావాలి? తెరాస నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత మీద వచ్చిన లిక్కర్‌ ‌స్కాంలో ప్రమేయం ఉందనే ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఇదంతా చేయించారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇక మజ్లిస్‌ ‌నాయకుడు అసదుద్దీన్‌ ఒవైసీ అల్లర్లకు ఎక్కువ బాధ్యత వహించవలసి ఉంటుందని కూడా విమర్శలు వచ్చాయి. సర్‌ ‌తన్‌ ‌సే జుదా వంటి నినాదాలు రాజ్యాంగ విరుద్ధమంటూనే, తరువాత ఆ నినాదాలు చేసిన 90 మందిని పోలీసు స్టేషన్‌ ‌నుంచి విడిపించి ఆయన మీద ఉన్న అనుమానాలను రూఢి చేసుకునే అవకాశం ఆయనే ఇచ్చారు. ఆ 90 మందిని తాను విడుదల చేయించినట్టు స్వయంగా ఆయన అంగీకరించడం కొసమెరుపు. అలాగే ఈ మొత్తం వ్యవహారంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌పాత్ర ఎంత అన్నది కూడా ఒక ప్రశ్నగా మారింది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలలో తెరాస విజయం కోసం పీకే ఎంతటి చౌకబారు ఎత్తుగడ వేయడానికైనా సిద్ధంగానే ఉంటారన్నది నిజం.

వీడియో వివాదం

హైదరాబాద్‌లోని గోషామహల్‌ అసెంబ్లీ నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే టి. రాజాసింగ్‌ ‌లోధీ మహమ్మద్‌ ‌ప్రవక్త మీద చేసినట్టు చెబుతున్న వ్యాఖ్యల నేపథ్యంలో ఆగస్ట్ 23‌న ఉదయం ఆయనను అరెస్టు చేశారు. అంతకు ముందు రోజు ఆయన ఒక వీడియోను విడుదల చేయడం, అది ఇస్లాంను, ప్రవక్తను కించపరిచే విధంగా ఉన్నదంటూ పాతబస్తీ ముస్లిం మతోన్మాదులు అల్లర్లు ప్రారంభించడం తెలిసిందే. విధివిధానాలు సరిగా లేవన్న కారణంగా కోర్టు రాజాసింగ్‌కు వెంటనే బెయిల్‌ ఇచ్చినా, మళ్లీ 25న ఆయనను అరెస్టు చేశారు. ఆయన మీద కేసు పెట్టాలంటూ ముస్లింలు భారీ ఎత్తున పోలీసు స్టేషన్ల దగ్గర నిరసనలు మొదలు పెట్టారు. కొంతమంది అతివాద ముస్లింలు ‘గుస్తాకే రసూల్‌ ‌కా ఎక్‌ ‌హి సాజా… సర్‌ ‌తన్‌ ‌సే జుదా’ (ప్రవక్తను అవమానించినందుకు ఒకటే శిక్ష- తల మొండెం వేరు చేయడం) అంటూ హైదరాబాద్‌ ‌పాత బస్తీలో విధ్వంసక ఘటనలకు దిగారు. అల్లర్లు పెచ్చరిల్లడానికి మజ్లిస్‌ ‌కార్పొరేటర్లు శక్తివంచన లేకుండా తమ వంతు పాత్ర నిర్వహించారు. ఇవన్నీ మీడియాలో వార్తలుగా వచ్చాయి. జాతీయ మీడియా ఈ అంశం మీద తీవ్రంగానే స్పందించింది. తనను చంపేస్తామంటూ 4000 ఫోన్‌ ‌కాల్స్ ‌వచ్చాయని రాజాసింగ్‌ ‌చెప్పినట్టు హిందుస్తాన్‌ ‌టైమ్స్ ‌వెల్లడించింది.

23వ తేదీన, మళ్లీ 25న రాజాసింగ్‌ను అరెస్టు చేశారు. రెండోసారి అరెస్టు చేయడం ఎందుకంటే, అది ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నపుడు ఆయన ఓటర్లను బెదిరించారన్న ఆరోపణకు సంబంధించినది. కేసు మాత్రం హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్‌ ‌స్టేషన్‌లో నమోద యింది. ఏప్రిల్‌లో షాజీనయతాగంజ్‌లో మరొక కేసు నమోదయింది. అప్పుడు జరిగిన శోభాయాత్రలో రెచ్చగొట్టే విధంగా రాజాసింగ్‌ ఉపన్యసించారన్న ఆరోపణకు సంబంధించిన కేసు ఇది. ఆ రెండు కేసులతోనే ఇప్పుడు అరెస్టు చేశారు. ఆయనను చర్లపల్లి జైలులో జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసిన ఉగ్రవాదులు ఉన్న ప్రాంతంలోనే ఉంచారన్న వార్త ఆయన అభిమానులను కలవరపరిచేదే. ఇదంతా చూస్తే రాజాసింగ్‌ను ఏదో విధంగా నిర్బంధంలో ఉంచాలన్న తెరాస ప్రభుత్వ తపన స్పష్టంగా కనిపిస్తుంది. పైగా ఆయనపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని మీద రాజాసింగ్‌ ‌సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

రాజాసింగ్‌ ‌వీడియో విడుదలైన తరువాత పాతబస్తీలో అల్లర్లు చెలరేగాయి. హిందువుల మనోభావాలను గాయపరచడమే ధ్యేయంగా ప్రదర్శనలు ఇస్తున్న స్టాండప్‌ ‌కమేడియన్‌ ‌మునావర్‌ ‌ఫారూకిని కావాలని తీసుకువచ్చినందుకు నిరసనగా తాను ఈ వ్యాఖ్యలు చేశానని తాను ఏ మత విశ్వాసాలను గాయపరచలేదని, ఎలాంటి దైవదూషణకు పాల్పడలేదని ఆయన చెప్పారు. తన ఎనిమిదేళ్ల పాలనలో ఒక్క మత ఘర్షణ కూడా చోటు చేసుకోలేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక బహిరంగ సభలో ఈ గొడవల నేపథ్యంలో చెప్పడం ప్రజలను వంచించడమే. తనను తాను వంచించుకోవడం కూడా. రెండేళ్ల క్రితం భైంసాలో జరిగిన అల్లర్లు, అందులో హిందువులు ప్రాణాలరచేతపట్టుకుని వెళ్లిన ఉదంతం ఆయనకు గుర్తు లేకపోవడం హాస్యాస్పదంగా ఉంది.


ఎం‌దరో బాధితులు

నుపూర్‌ ‌శర్మ వ్యాఖ్యల తరువాత ఆరుగురు ముస్లిం మతోన్మాదుల దౌష్ట్యానికి గురయ్యారు. ఐదేళ్ల క్రితం లక్నోలో కమలేశ్‌ ‌తివారీని ఇదే కారణంతో చంపారు. మొన్న జూన్‌లోనే మహారాష్ట్రలోని అమరావతి నగరంలో మందుల దుకాణం నడిపే ఉమేశ్‌ ‌కొల్హాను కత్తితో పొడిచి చంపారు. నుపూర్‌ ‌వ్యాఖ్యలను సమర్ధిస్తూ వేరెవరో పెట్టిన పోస్టును ఈయన బదలీ చేయడమే కొల్హా చేసిన పాపం. ఈయన వయసు 54 ఏళ్లు. బీజేపీకి చెందిన మరొక కార్యకర్తను కూడా ఇలాగే చంపారు. అదే నెలలో కన్హయాలాల్‌ను రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో చంపారు. ఈయన ఒక దర్జీ. కత్తితో పీక కోసి వెళ్లిపోతూ అదే నినాదం ఇచ్చారు దుండగులు. నిషాంక్‌ ‌రాథోడ్‌ అయితే 20 ఏళ్ల ఇంజనీరింగ్‌ ‌విద్యార్థి. ఇతడి శవం రైలు పట్టాల మీద కనిపించింది. మొదట పోలీసులు వేరే కేసుగా నమ్మించడానికి చూశారు. కానీ రాథోడ్‌ ‌తండ్రికి ఉగ్రవాదులు అదే నినాదాన్ని ఫోన్‌లో మెసేజ్‌ ‌చేసి, అది తమ పనేనని రూఢి చేశారు. మునీశ్‌ ‌భరద్వాజ్‌, అం‌కిత్‌ ‌ఝా, షాను పాండే ఇదే తరహాలో హత్యకు గురయ్యారు.

శృంగారగౌరి-జ్ఞాన్‌వాపి ఆలయం వివాదంలో ఉన్న మహిళ సోహన్‌లాల్‌ ఆర్య భర్తకు కూడా సర్‌ ‌తన్‌ ‌సే జుదా బెదిరింపులు వచ్చాయి. పైగా ఇది పాకిస్తాన్‌ ‌నంబర్‌తో రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీని మీద వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. ఆగస్ట్ 18‌న ఈ వివాదం విచారణకు రావడానికి కొంచెం ముందు ఆ బెదిరింపు రావడం ఇంకా ఆశ్చర్యం. ఇందులో ప్రవక్తకు సంబంధించిన అంశమే లేదు. అయినా దైవ దూషణ విషయంలో ఉన్మాదులు చేసే ఈ బెదిరింపును ఉపయోగించడం తెంపరితనమే. నిజానికి ఇప్పుడే కాదు, మార్చి 19న, జూలై 20న కూడా ఇలాంటి కాల్స్ అదే నంబర్‌ ‌నుంచి వచ్చాయని ఆమె పోలీసులకు తెలియచేశారు.


పౌరహక్కుల నేత నోటా అదే నినాదం

జాతీయ టీవీ చానళ్లలో చర్చలు చూసేవారికి ఇప్పటికే ఒక విషయం అర్థమై ఉంటుంది. అందులో ముస్లింల తరఫున వాదించే వారంతా వాస్తవం కంటే, తమ వర్గాన్ని అడ్డగోలుగా సమర్థించడానికే శతథా ప్రయత్నిస్తారు. వారు మొదట ముస్లింగాను, ఆ తరువాత పౌరహక్కులవాదిగాను కనపడేందుకు ప్రయత్నిస్తారు. మేధావి ముద్రో, ఉదారవాది అన్న భుజకీర్తో తమకు అవసరం లేదన్న పంథాలోనే మాట్లాడతారు. అది కూడా ముస్లింల పౌరహక్కుల రక్షకులుగానే. హైదరాబాద్‌లో ఇదే జరిగింది. రాజాసింగ్‌ ‌దిష్టిబొమ్మలు తగలబెడుతూ, సర్‌ ‌తన్‌ ‌సే జుదా నినాదాలు చేశారు ముస్లింలు. ఇలాంటి నినాదాలు ఇవ్వడానికి ఎవరు ప్రేరేపించారో పరిశీలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇక్కడ ఆ నినాదం ఇచ్చినవాళ్లలో ఒకడు సయ్యద్‌ అబ్దాహు కషఫ్‌. ఊరేగింపులను ప్రేరేపించినవాడు కూడా ఇతడేనని కొందరు నివేదించారు. సౌత్‌జోన్‌ ‌డీసీపీ కార్యాలయం దగ్గర ఆందోళనకు ఇతడే నాయకుడు. ఒక్కమాట చెబితే చాలు కషఫ్‌ ఏమిటో తెలిసి పోతుంది. అతడు జేఎన్‌యూలో చదివాడు. 2012-2019 మధ్య ఎంఐఎం సామాజిక మాధ్యమాల వ్యవస్థకు అధిపతిగా పనిచేశాడు. ఇతడు పౌరహక్కుల కార్యకర్తనని చెప్పుకుంటాడట. అలాగే సామాజిక మాధ్యమాల్ని ప్రభావితం చేసేవానిగా తనకు తాను ప్రకటించుకున్నాడట. ఈ పౌర హక్కుల కార్యకర్త అచ్చంగా ఒక ముస్లిం మతోన్మాది అవతారం ఎత్తాడు. తన నినాదానికి భాష్యం కూడా వెలగబెట్టాడు. ప్రవక్తకు వ్యతిరేకంగా ఎవరు అవమానకరమైన భాషలో మాట్లాడినా వారికి శిక్ష శిరచ్ఛేదనమేనని నా భావన అన్నాడు. ఆగస్ట్ 23‌న రాజాసింగ్‌ అరెస్టు కాగానే ఇతడు ఇస్లామిస్టులందరికీ అభినందనలు తెలియచేస్తూ ఒక సందేశం అందించాడు. ‘మనం దీనిని జాతీయ వివాదం చేయాలని అనుకున్నాం, అదే జరిగింది’ అని కూడా పేర్కొన్నాడు. కషఫ్‌ ‌ఘనకార్యాలన్నీ బయటపడి, పెద్ద ఎత్తున రగడ జరిగాక ఇక తప్పక అరెస్టు చేశారు. వెంటనే బెయిల్‌ ‌కూడా ఇచ్చారు. ఈ విషయంలో ఎంఐఎం నేతల నుంచి ఇంతకు మించిన ప్రవర్తనను, జవాబుదారీ తనాన్ని ఎలాగూ ఆశించలేం. కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన ముస్లిం నేతలు కూడా మజ్లిస్‌ ‌నాయకుల బాటలోనే, అదే భాషతో రోడ్డెక్కారు. ఇద్దరూ ఒకే తీరులో స్పందించడమే విశేషం. కాంగ్రెస్‌ ‌నాయకుడు ఫిరోజ్‌ ‌ఖాన్‌ ‌కూడా రెచ్చిపోయి, ‘రాజాసింగ్‌ ‌క్షమాపణ చెప్పాలి. లేకపోతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని, ఆయన ఎక్కడ కనపడితే అక్కడ దాడి చేయాలని హైదరాబాద్‌ ‌ముస్లింకు పిలుపునిస్తాన’ని ఒక వీడియో ద్వారా ముఖ్యమంత్రిని హెచ్చరించాడు. పిల్లలు, స్త్రీలు కూడా రాళ్లు విసురుతూ, అదే నినాదం ఇస్తూ ఊరేగారు. మరునాడు కూడా కొందరు ఎంఐఎం నాయకులు, ఇంకొందరు ముస్లింలు సిటీ కాలేజీ ఎదురుగా అవే నినాదాలు చేశారు. వాళ్లని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బీజేపీయే లక్ష్యం

ప్రవక్త పట్ల అపచారానికి పాల్పడ్డారంటూ ఈ సంవత్సరం జూన్‌లో ఇదే తరహాలో బీజేపీ జాతీయ మాజీ అధికార ప్రతినిధి నుపూర్‌శర్మ కోసం సర్‌ ‌తన్‌ ‌సే జుదా నినాదం ఇచ్చారు. కొందరు అతివాద ముస్లింలు ఆమెను హత్య చేసి వస్తే కోటి రూపాయలు నజరానా ప్రకటించారు. ఈ మేరకు ఫత్వా కూడా జారీ అయింది. పలు రాష్ట్రాలలో ఆమె దిష్టి బొమ్మను దహనం చేశారు. ఆమెకు అనుకూలంగా వచ్చిన మద్దతు తక్కువేమీ కాదు. కానీ ఆ క్రమంలో రాజస్తాన్‌లో కన్హయ్యలాల్‌, ‌మహారాష్ట్రలో ఉమేశ్‌ ‌కొల్హే అనే ఇద్దరి హత్యలు జరిగాయి. ఇది అంతర్జాతీయ ముస్లిం సమాజ సమస్యగా కూడా మార్చేశారు. కొన్ని దేశాలు భారతీయ ఉత్పత్తులను బహిష్కరించనున్నట్టు ప్రకటనలు కూడా చేసేశాయి. నుపూర్‌ను చంపడానికి రష్యా నుంచి బయలుదేరిన ఒక ఐసిస్‌ ఉ‌గ్రవాదిని అక్కడే నిలువరించారు. అదే ధ్యేయంతో పాకిస్తాన్‌కు చెందిన తెహ్రీక్‌ ఇ ‌లబైక్‌ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన రిజ్వాన్‌ అ‌ష్రఫ్‌ అనే ఉగ్రవాది ఈ జూలైలో వచ్చాడు. ఇతడిని రాజస్తాన్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఇంతకీ నుపూర్‌ ‌చేసిన వ్యాఖ్యలు కొత్తవేమీ కాదు. పీకల్లోతు వివాదాల్లో మునిగినా కూడా నేటికీ ముస్లిం ఉగ్రవాదాన్ని ప్రపంచమంతటా విస్తరింపచేయడానికి పాటు పడుతున్న జకీర్‌ ‌నాయక్‌ ‌వంటివారు స్వయంగా వివరించినవే. అవి ముస్లింలకు తెలిసినవే. అయినా ఇప్పుడు ఈ విధ్వంసక ధోరణి ఎందుకు? ఇక్కడ నుపూర్‌ ‌లేదా రాజాసింగ్‌, ‌వారి వ్యాఖ్యలు కేవలం సాకు. అసలు లక్ష్యం బీజేపీ. పెరుగుతున్న జాతీయవాదం. హిందువులలో వస్తున్న చైతన్యం. రాజాసింగ్‌ ‌వ్యాఖ్యల నేపథ్యంలో జరిగిన అల్లర్లలోనే కలీముద్దీన్‌ అనే వ్యక్తి అరెస్టు ఇందుకు సరైన రుజువు. ఆగస్ట్ 24‌న కలీముద్దీన్‌ను అరెస్టు చేశారు. ఇతడు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వారిని ముక్కలు ముక్కలుగా నరికి చంపమని నినాదాలు చేశాడు. స్మలాన్‌ ‌రష్దీ మీద దాడికి కూడా ఆ నినాదమే కారణం. 1989లో ఇరాన్‌ అధినేత అయితుల్లా ఖొమైని జారీ చేసిన ఆ ఫత్వాను 30 ఏళ్ల తరువాత హదీ మతర్‌ ‌షియా ముస్లిం అమెరికాలో అమలు చేశాడు.

జన్మనిచ్చినది పాకిస్తాన్‌

ఈ ‌నినాదం పాకిస్తాన్‌లో 2011లోనే పుట్టింది. అక్కడి తెహ్రీక్‌ ఇ ‌లబైక్‌ అనే ఉగ్రవాద సంస్థ కఠినంగా అమలు చేస్తోంది. అందులో ప్రాణాలు విడిచిన వాళ్లని ఘాజీ (ముస్లిం యోధుడు)గా భావించి దర్గాలు నిర్మిస్తారు. 2011లో పాకిస్తాన్‌ ‌పంజాబ్‌ ‌ప్రావిన్స్ ‌గవర్నర్‌ ‌సల్మాన్‌ ‌తసీర్‌ అక్కడి దైవదూషణ చట్టాలను వ్యతిరేకించినందుకు భద్రతా అధికారి ముంతాజ్‌ ‌ఖాద్రి చంపేశాడు. తరువాత ఐదేళ్ల క్రితం భారత్‌లో వినిపించింది. కమలేశ్‌ ‌తివారీ (లక్నో)ని దైవదూషణ పేరుతో ఇస్లామిస్టులు చంపేశారు.

వేగంగా విస్తరిస్తున్న వాదం

సర్‌ ‌తన్‌ ‌సే జుదా వాదం భారత్‌లో వేగంగా విస్తరించడానికి ప్రధాన కారణం పోలీసులు చూసీ చూడనట్టు ఉండిపోవడమేనన్న వాదన ఉంది. ఇందుకు కుహనా సెక్యులరిస్టు పార్టీలు కూడా కారణమే. ఈ రెండు కారణాలు ఈ వాదం ఇంకాస్త పెచ్చరిల్లడానికే దోహదం చేయవచ్చు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ పౌరులందరికీ ఒకే చట్టం అమలు జరగాలి. మతాలకు సంబంధించిన స్మృతులు అమలు చేస్తామనడం సరికాదు. వాటికి తావు లేదు. వాటికి చోటు కల్పించడం, కల్పించాలని కోరడం, లేదా రుద్దడం ఘోర తప్పిదం. తమ మత చట్టాన్ని అమలు చేయాలంటూ మైనారిటీలు ప్రజస్వామ్య దేశంలో వీరంగం వేయడం ఏమిటి? అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు.

‘సర్‌ ‌తన్‌ ‌సే జుదా’… ప్రస్తుతం ఈ నినాదం హైదరాబాద్‌, ‌జమ్ముకశ్మీర్‌, ‌వారణాసి, కాన్పూర్‌, ‌రాంచీ, కోల్‌కతా వరకు యథేచ్ఛగా వినిపిస్తూనే ఉంది. ఎక్కడ ఏ స్థాయిలో ముస్లింలు సమావేశమైనా కావచ్చు, చిన్నదో పెద్దదో ఊరేగింపు జరిపినా అందులో ఈ నినాదంతో ముస్లింలు గొంతు చించుకుంటున్నారు. అంతేకాదు, ఆ నినాదంతోనే రాళ్లు కూడా విసురుతున్నారు. కారణం ఏమిటి? హిందువులు, రాజకీయ నాయకులు, పార్టీలు, ప్రధాన స్రవంతి మీడియా, భద్రతా దళాలు, ప్రముఖ వ్యక్తులు ఈ నినాదం పట్ల మౌనం పాటించడమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ నినాదం భారతదేశంలో సర్వసాధారణంగా వినిపిస్తున్నదని అంతా ఒప్పుకుంటున్నారు. ఒక ప్రజాస్వామిక దేశంలో ముస్లింలు ఎప్పుడో, అదైనా పాక్షికంగా పాటించిన ఈ శిక్షకు ప్రాణప్రతిష్ట చేయడమంటే షరియాను రుద్దడానికేనని కూడా కొందరు ప్రముఖులు నిర్ద్వంద్వంగా చెబుతున్నారు. కొందరు ముస్లింలలో పెరిగిపోతున్న అతివాద పోకడలను, వాటి వెనుక ఉన్న మత కారణాలను విశ్లేషించే, విమర్శించే ప్రయత్నం చేసేవారు ఎవరైనా దైవ దూషణ ముద్రకు సిద్ధంగా ఉండవలసి వస్తున్నది. మీడియాలో పెద్దగా స్థానానికి నోచుకోని జూన్‌ 10, 2022 ‌నాటి ఘటనలను తలుచుకుంటే ఇంకాస్త ఆందోళన తప్పదు. ఆ రోజు శుక్రవారం. ప్రార్థనలు పూర్తయిన తరువాత దేశంలోని పలు చోట్ల మసీదుల నుంచి ముస్లింలు బయటకు వచ్చి దాడులకు దిగారు. పోలీసుల మీదకి రాళ్లు విసిరారు. త్రివర్ణ పతాకంలో అశోకచక్రం స్థానంలో కల్మా ఉంచారు. నుపూర్‌ ‌శిరస్సు ఖండించాలంటూ అరిచారు. బెల్గావి (కర్ణాటక) ఫోర్డ్ ‌రోడ్‌లో ఆమె దిష్టి బొమ్మకు ఉరి వేశారు. హిందూ ఆలయాలమీద దాడులు జరిగాయి.

ఆగస్ట్ 10‌న మొహర్రం సందర్భంగా కొందరు ముస్లింలు మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో జరిపిన ఒక ఊరేగింపులో అవే నినాదాలు చేశారు. అదే రోజు ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో కూడా సర్‌ ‌తన్‌ ‌సే జుదా, పాకిస్తాన్‌ ‌జిందాబాద్‌ ‌నినాదాలు వినిపించాయి. ఇక్కడ మాత్రం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని ఒక అమ్మవారి ఆలయంలో పూజారి యతి నరసింహానంద సరస్వతిని తల నరుకుతానని ఆప్‌ ఎమ్మెల్యే అమానుల్లా ఖాన్‌ ‌బాహాటంగానే బెదిరించాడు. ఖాన్‌కు సంఘీభావంగా వేలాది మంది ముస్లింలు కాన్పూర్‌, ‌బరేలీలలో ఊరేగింపు జరిపి అదే నినాదం ఇచ్చారు. నిరుడు ఏప్రిల్‌ 15‌న ఉత్తర ప్రదేశ్‌లోనే బరేలీలో ఇవే నినాదాలు వినిపించాయి.

ఒవైసీ- నోటిలో చక్కెర, కడుపులో కత్తెర

హైదరాబాద్‌ ఎం‌పీ, అఖిల భారత మజ్లిస్‌ ఇత్తేహాదుల్‌ ‌ముస్లిమీన్‌ (ఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ నోరు విప్పితే మొదట వెలువడిదే భారత రాజ్యాంగం గురించే. తరువాత వరసగా చట్టం, సౌభాత్రం, శాంతి, మత సామరస్యం, అభివృద్ధి అంటూ ఒకదానిని ఒకటి తరుముకుంటూ వెలువడతాయి. రాజ్యాంగ సూత్రాలు ఆయన మెదడంతా ఖాళీ లేకుండా పరుచుకుని ఉన్నాయని నమ్మిస్తాడు. కానీ అదంతా ఒట్టి బూటకమని రాజాసింగ్‌ ఉదంతంతో మరొకసారి బట్టబయ లయింది. ముస్లింలకు అనుకూలంగా తీర్పు రాకుండా ఆఖరికి సుప్రీంకోర్టు మీదనైనా సరే ఈ బారిస్టర్‌ ‌నిప్పులు కురిపిస్తాడు. యథా రాజా తథా ప్రజ. ఇదే రెండు నాల్కల ధోరణి ఆయన పార్టీ నేతలలో ఉంది. దానినే కార్యకర్తలు సమయం వచ్చినప్పుడు అమలు చేసి చూపుతూ ఉంటారు. తెరాస ప్రభుత్వం వీళ్ల చేతిలో కీలుబొమ్మ కాబట్టి సాగిపోతోంది. రంజాన్‌ ‌నెలలో నిర్దేశించిన వేళకు దుకాణాలు మూయాలని వచ్చిన పోలీసుల మీద ఎంఐఎం నేతలు, కార్పొరేటర్లు యుద్ధానికి దిగుతారు. ట్రాఫిక్‌ ఇబ్బంది గురించి దర్యాప్తుకు వచ్చిన పోలీసు అధికారి మీద కార్పొరేటర్లు వీరంగం వేస్తారు. ఇప్పుడు సర్‌ ‌తన్‌ ‌సే జుదా నినాదంతో తాలిబన్‌ను మరిపించారు. వీరికి మజ్లిస్‌, ‌కాంగ్రెస్‌ ‌మద్దతుగా నిలుస్తున్నాయి. రాజ్యాంగ వ్యతిరేకమైన ఆ నినాదం ఇచ్చిన 90 మందిని ఒవైసీ విడిపించారు. సీఏఏ ఆందోళనలలో చేతులలో త్రివర్ణ పతాకంతో ఊరేగుతూ, రాజ్యాంగాన్ని రక్షించాలంటూ గొంతు చించుకున్న ఒవైసీ ఇతడే సుమ! అదంతా నాటకమని అర్ధం చేసుకుంటే చాలు. మోదీ మీద దాడికి త్రివర్ణపతాకాన్ని అడ్డు పెట్టుకున్నారు. నిజానికి ఆ మహోన్నత పతాకం మీద వారి గౌరవం ఎంతటిదో వాళ్ల చర్యలతో వాళ్లే ప్రశ్నార్థకం చేసుకుంటున్నారు. తల, మొండెం వేరు చేస్తామని అరిచిన 90 మందిని అరెస్టు చేస్తే, ఈ గౌరవ పార్లమెంటు సభ్యుడు విడిపించుకురావడాన్ని ఎలా చూడాలి? ఒవైసీ ఎంత తెంపరితనం ప్రదర్శించారంటే, మీడియా ఎదుట అలాంటి నినాదాలు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించారు. తరువాత ఆ నినాదాలు చేసిన వారిని విడిపించిన విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. అయినా మీరేం చేయగలరన్న సవాలు ఇందులో ఉంది.


భావితరాలను వదిలిపెట్టరా?

హైదరాబాద్‌ ‌పాతబస్తీలో మతోన్మాదం కలకాలం కొనసాగడానికి వీలుగా బాలలను కూడా తయారు చేస్తున్నారు. రాజాసింగ్‌కు వ్యతిరేకంగా అల్లర్లు జరిగిన సమయంలో బాలల చేత కూడా సర్‌ ‌తన్‌ ‌సే జుదా నినాదాలు చేయించడంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సమితి మండిపడింది. పిల్లలను రాజకీయాల కోసం వాడుకోవడం సహించరానిదని, తక్షణమే చర్యలు తీసుకోవాలని నగర పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సీవీ ఆనంద్‌ను బాలల హక్కుల పరిరక్షణ సమితి ఆదేశించింది. పాఠశాలలకు వెళ్లే పిల్లలను రాజకీయ అస్త్రాలుగా ఉపయోగించడం, నిరసనలకు తీసుకురావడం పట్ల సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజాసింగ్‌ను మొదటిసారి అరెస్టు చేయడం, వెంటనే బెయిల్‌ ‌రావడం తెలిసిందే. ఆ తరువాతే పాతబస్తీ రెచ్చిపోయింది. నల్లజెండాలతో పర్యాటక స్థలాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.


కాంగ్రెస్‌ ‌ముస్లిం నేతలదీ అదే దారి!

రాజాసింగ్‌ ఎక్కడ కనిపించినా దాడి చేయాలంటూ ఫిరోజ్‌ ‌ఖాన్‌ అనే కాంగ్రెస్‌ ‌నాయకుడు వీడియో విడుదల చేశాడు. ఒక జాతీయ చానల్‌లో తన వాదనను సమర్థించుకున్నాడు. మరొక కాంగ్రెస్‌ ‌నాయకుడు రషీద్‌ ‌ఖాన్‌ ఈ ‌వ్యవహారంలో ఆగస్ట్ 22‌న సింగ్‌ను అరెస్టు చేయకుంటే గోషామహల్‌ ‌మొత్తం దహనం చేస్తానని ముఖ్యమంత్రిని హెచ్చరిస్తూ ఒక వీడియో విడుదల చేశాడు. రాజాసింగ్‌ను బీజేపీ బహిష్కరించింది. కానీ తెరాస, మజ్లిస్‌ ‌పార్టీలు వాళ్ల కార్యకర్తలు ఇంత బరితెగించి మాట్లాడినా ఎలాంటి చర్య తీసుకోలేదు.

ఇది ఇస్లాంకు విరుద్ధం

ప్రవక్త మహమ్మద్‌ను అగౌరవ పరిచారంటూ ఈ జూలై మధ్యలో ఉదయ్‌పూర్‌ (‌రాజస్తాన్‌)‌కు చెందిన దర్జీ కన్హయలాల్‌ను ఇద్దరు ముస్లింలు హత్య చేశారు. మరొక వ్యక్తి అమెరికాలో స్మలాన్‌ ‌రష్దీ మీద అదే కారణంతో హత్యా ప్రయత్నం చేశాడు. నుపూర్‌ ‌శర్మ తల నరకవలసిందంటూ ఈ కారణాన్ని చూపించి ఇంకొందరు కూడా పిలుపులు ఇచ్చారు. తాజాగా అదే పిలుపు, అదే కారణంతో రాజాసింగ్‌ ‌మీద ఇచ్చారు. ఇక సామాజిక మాధ్యమాలలో ఇదే పిలుపు ఇస్తున్న ముస్లిం యువత ఎంతో లెక్క లేదు. చంపరాన్‌కు చెందిన తారిక్‌ అన్వర్‌ అడిగిన ప్రశ్నకు సక్విబ్‌ ‌సలీం అనే ఒక చరిత్రకారుడు ఒక వివరణ ఇచ్చారు. ఇది ఆవాజ్‌ ‌రేడియో (ఆగస్ట్ 27) ‌ప్రసారం చేసింది. ఆయన మాటలలోనే- ‘నా పరిశోధనలో తేలినది ఏమిటంటే, ఇలాంటి పిలుపు 19వ శతాబ్దానికి ముందు లేనేలేదు. ప్రవక్తను అవమానించినంత మాత్రాన ఇతర మతాల వారిని చంపడం సరికాదని ఇమామ్‌ అబూ హనీఫ్‌ ‌నిర్ద్వంద్వంగా చెప్పారు. హనీఫ్‌ ‌సిద్ధాంతాన్ని నమ్మేవారు ఉపఖండంలో గణనీయంగానే ఉన్నారు. అయితే 19వ శతాబ్దంలోనే హనీఫ్‌ ఆలోచనా విధానాన్ని సవాలు చేస్తూ కొన్ని సైద్ధాంతిక వివాదాలు చెలరేగాయి. అందులో దేవబంది, బరేల్వీ కూడా ఉన్నాయి. అహి ఇ హదిత్‌ అయితే హనీఫ్‌ ‌భారతీయ సంస్కృతితో అసలు ఇస్లాంను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. అహ్మదీయా వర్గం హనీఫ్‌ ఇస్లాం మార్గం నుంచి తప్పారని కూడా ఆరోపించింది. ఒకరు ప్రవక్తను గౌరవప్రదం కాని భాషలో వ్యాఖ్యానించారంటే, వాళ్లు ఇస్లాంను ఆచరించడం లేదని మరొక పద్ధతిలో చెప్పడమే, అలాంటి వాళ్లను మనం ప్రవక్తను గౌరవించమని చెప్పలేమని కూడా హనీఫ్‌ అభిప్రాయపడ్డారు.

1920లో రంగీలా రసూల్‌ ‌పేరుతో రాజ్‌పాల్‌ అనే ప్రచురణకర్త ఒక కరపత్రాన్ని అచ్చు వేయించాడు. అది ముస్లింలలో అసంతృప్తిని రేపింది. దీనిని ఆసరా చేసుకుని కదియానా అహ్మదీయాలు ఆ ప్రచురణకర్తకు వ్యతిరేకంగా ముస్లింలను ఏకం చేయడం మొదలుపెట్టారు. దేవబంది, బరేల్వీ ఉలేమాలు క•డా రంగంలోకి దిగారు. చివరికి 1929లో రాజ్‌పాల్‌ను ఇలాం దిన్‌ అనే ముస్లిం యువకుడు హత్య చేశాడు. ముస్లింలీగ్‌, ‌కదియానీలు అతడిని హీరో అంటూ కీర్తించారు. అయితే దేవబంది వర్గ పండితుడే అయినప్పటికి మౌలానా అష్రఫి అలీ తన్వి ఇలాంటి సంప్రదాయం మంచిది కాదనే అప్పుడు అభిప్రాయపడ్డారు. ఇక ప్రవక్త గురించి అగౌరవంగా మాట్లాడితే మరణ దండన సరికాదన్న హనీఫ్‌ ‌వాదనను తోసి పుచ్చడమే కాకుండా తన వాదాన్ని నెగ్గించుకునే పనిలో అహి ఇ హడిత్‌ ‌పడింది. అప్పుడే కనీవినీ ఎరుగుని రీతిలో భారతీయ, విదేశీ పండితులు దాదాపు 450 మంది అహి ఇ హడిత్‌ ‌వాదనను సవాలు చేస్తూ తమ సంతకాలతో ఒక ఫత్వాను విడుదల చేశారు. హడిత్‌ ఇలాంటి విషయాన్ని ప్రస్తావించినా, అది పదే పదే దైవ దూషణకు పాల్పడినవారి గురించేనని, అది కూడా శిరచ్ఛేదనం గురించి అసలు చెప్పలేదని ఆ ఫత్వా పేర్కొన్నది. ఒక వేళ రాజకీయ కారణాలతో అలాంటి శిక్ష విధిస్తే దానిని మత కోణం నుంచి చూడరాదు.’

20వ శతాబ్దం ఆదిలోనే కాదు, 21వ శతాబ్దం ఆరంభంలో కూడా దైవ దూషణ పేరిట అవతలి మతం వారిని చంపడం తప్పేనని చెబుతున్నవారు ఇస్లాం పండితులలో ఉన్నారు. ఉదయ్‌పూర్‌ ‌దర్జీ కన్హయాలాల్‌ ‌హత్య (రియాజ్‌ అన్సారీ, గౌస్‌ ‌మహమ్మద్‌ ఈ ‌హత్య చేశారు) తరువాత కొన్ని ముస్లిం సంఘాలు ఆ చర్య ఇస్లాంకు వ్యతిరేకమేనని చెప్పాయి. కన్హయాలాల్‌ ‌హత్య మన దేశ చట్టాల దృష్ట్యానే కాదు, ఇస్లాం చట్టాల ప్రకారం కూడా అన్యాయమేనని జమాయిత్‌ ఉలేమా ఎ హింద్‌ ‌ప్రధాన కార్యదర్శి మౌలానా హకీముద్దీన్‌ ‌కాసిం ఒక పత్రికా ప్రకటన ద్వారా చెప్పారు. ఆలిండియా ముస్లిం పర్సనల్‌ ‌లా బోర్డు కూడా ఇదే చెప్పింది. అజ్మీర్‌ ‌దర్గా ప్రధాన పూజారి జైనుల్‌ అబీదిన్‌ అలీ ఖాన్‌, ‘ఏ ‌మతం కూడా హింసను ప్రోత్సహించదు. ముఖ్యంగా శాంతిని ప్రబోధించే ఇస్లాంలో అన్నీ శాంతి ఆధారిత బోధనలే ఉంటాయి’ అన్నారు. హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని షియా ముస్లిం పండితుడు కాల్బే జావెద్‌ ‌నక్వి వ్యాఖ్యానించారు. అసలు తనను దూషించారన్న ఆరోపణతో ప్రవక్త కూడా ఎవరినీ చంపలేదని లక్నోకు చెందిన పండితుడు సల్మాన్‌ ‌నద్వి అన్నారు. సర్‌ ‌తన్‌ ‌సే జుదా అనే నినాదం కేవలం మూర్ఖత్వం నుంచి జనించింది అని కూడా చెప్పారు.

ఇదంతా పరిశీలించిన తరువాత సర్‌ ‌తన్‌ ‌సే జుదా అనేది హిందూ వ్యతిరేక యుద్ధనాదంగా ముస్లిం మతోన్మాదులు తీసుకుంటున్నారని అనిపిస్తుంది. దీని వెనుక పాకిస్తాన్‌ ఉం‌ది. ఉదయ్‌పూర్‌లో కన్హయాలాల్‌ను చంపిన ఇద్దరు గౌస్‌ ‌మహమ్మద్‌, ‌రియాజ్‌ ఇద్దరికీ పాకిస్తాన్‌ ‌కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రసంస్థ దవాత్‌ ఎ ఇస్లామితో సంబంధాలు ఉన్నట్టు తేలింది. ఇస్లాం ప్రమాదంలో ఉన్నదంటూ ప్రచారం చేసి ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం, హదిత్‌ ‌సూత్రాల ప్రకారం ఇస్లాంను ఛాందస మార్గంలోనే నడిచేటట్టు చేయడం ఆ సంస్థ ధ్యేయాలు.

ఇంతకీ ఆ మార్గం ఏడో శతాబ్దంలో అరేబియాలో ఆచరించినది కావడమే వింత. దీనినే ప్రపంచం నెత్తిన రుద్దాలన్నది వాళ్ల ఆశయం. ఏ విధంగా చూసినా ఇస్లాం మతోన్మాదం నేడు ప్రపంచ సమస్య. దానిని మాత్రం ఎదుర్కొనవలసిందే. వాళ్ల మతాచారాలు వాళ్లవే. కానీ అవి ప్రపంచం కూడా పాటించాలంటే ఘర్షణ తప్పదు. మైనారిటీలు చట్టాలకు అతీతులు కాదు. ప్రజాస్వామిక దేశంలోని చట్టాలు మైనారిటీల దగ్గర తలొంచాలన్నా కూడా సాధ్యం కాదు. భారతదేశంలోని సాంస్కృతిక, సామాజిక వైవిధ్యాన్ని అన్ని మతాలు వారు అంగీకరించాలి. మరీ ముఖ్యంగా చాలామంది ముస్లింలు ఈ వాస్తవం త్వరగా గ్రహించాలి.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
Instagram