సెప్టెంబర్‌ 01-07 ‌జాతీయ పోషకాహార వారం

– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌నోబెల్‌ ‌బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అంగస్‌ ‌డియోటన్‌ ‌భారత్‌లో పోషకాహార లోపానికి ప్రధాన కారణాన్ని ఈ విధంగా వివరించారు- ‘భారత్‌లో పోషకాహార లోపం కేవలం తగినన్ని కేలరీలు తీసుకోకపోవడం వల్ల కాదు. కార్బొహైడ్రేట్‌లతో కూడిన ఆహారాన్నే అధికంగా తీసుకోవడం వల్ల! ఇందులో ప్రొటీన్‌, ‌కొవ్వు పదార్థాలు చాలా తక్కువ. పారిశుద్ధ్య లేమి కూడా పోషకాల లోపాలకు తోడై, వివిధ రకాల ఇన్‌ఫెక్షన్‌లకు కారణమవుతోంది’.

మన దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 33 లక్షల మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతుండగా వీరిలో సగానికంటే ఎక్కువమంది బిహార్‌, ‌గుజరాత్‌, ‌మహారాష్ట్రల్లో ఉన్నట్లు కేంద్ర మహిళా శిశుసంక్షేమ శాఖ ఇచ్చిన సమాచారం తెలియజేస్తోంది. 2021, అక్టోబర్‌ 14 ‌వరకు 17.76 లక్షలమంది పిల్లల్లో అత్యధిక పోషకాహార లోపం ఉండగా, 15.46 లక్షల మంది ఒక మాదిరి పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. బిహార్‌లో 4.75 లక్షలు, గుజరాత్‌లో 3.20 లక్షలు, ఆంధప్రదేశ్‌లో 2.76 లక్షలు, కర్ణాటక 2.49 లక్షలు, ఉత్తరప్రదేశ్‌ 1.86 ‌లక్షలు, తమిళనాడు 1.78 లక్షలు, అస్సాం 1.76 లక్షలు, తెలంగాణ 1.52 లక్షల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టు గణాంకాలు తెలుపుతున్నాయి.

గ్లోబల్‌ ‌హంగర్‌ ఇం‌డెక్స్ (‌జీహెచ్‌ఐ)

2021 ‌గ్లోబల్‌ ‌హంగర్‌ ఇం‌డెక్స్ (‌జీహెచ్‌ఐ)‌ను మొత్తం 116 దేశాలకు సంబంధించి రూపొందించగా, భారత్‌ 101‌వ స్థానంలో ఉంది. 2020లో మొత్తం 107 దేశాల్లో భారత ర్యాంకు 94. 2021లో మొత్తం స్కోరు విలువ 50 కాగా, భారత్‌ ‌జీహెచ్‌ఐ ‌స్కోరు 27.5. విచిత్రమేమంటే మన పొరుగు దేశాలైన నేపాల్‌ (76), ‌బంగ్లాదేశ్‌ (76), ‌మయన్మార్‌ (71), ‌పాకిస్తాన్‌ (92) ‌మన కంటే జీహెచ్‌ఐ ‌ర్యాంకుల్లో ముందుండటం గమనార్హం. అయితే భారత ప్రభుత్వం ఇది తప్పుడు నివేదిక అంటూ కొట్టి పారేసింది. ఏది ఏమైనప్పటికీ జీహెచ్‌ఐ ‌సూచిక దేశంలో విపరీతమైన స్థాయిలో ఉన్న పోషకాహార లోపాన్ని మరోసారి ఎత్తిచూపినట్లయింది. ఇదిలా ఉండగా చైనా, కువైట్‌, ‌బ్రెజిల్‌ ‌సహా 18 దేశాలు పోషకాహారం విషయంలో అగ్రస్థాయిలో ఉండటం గమనార్హం. వీటి ర్యాంకు 5 కంటే తక్కువే. అంటే ఈ దేశాల్లో ఆకలి, పోషకాహారలోపం చాలా తక్కువ స్థాయిలో ఉన్నదని అర్థం. గ్లోబల్‌ ‌హంగర్‌ ఇం‌డెక్స్ ‌ప్రకారం 2030 నాటికి ఆకలిని అరికట్టడంలో 47 ప్రపంచ దేశాల వైఫల్యం కొనసాగుతోంది. సంఘర్షణలు, కొవిడ్‌-19, ‌వాతావరణ మార్పులు అనే మూడు అంశాలు ప్రపంచ దేశాల్లో ఆకలి, పేదరికం పెరగడానికి కారణమవుతున్నాయి. అంతేకాదు అసమానతలు, అస్థిర ఆహార వ్యవస్థలు, వ్యవసాయంపై పెట్టుబడులు తగ్గిపోవడం, గ్రామాల అభివృద్ధి కుంటుపడటం, పాలనాపరమైన వైఫల్యాలు, ఆరోగ్య భద్రతా వ్యవస్థలో లోపాలు కూడా ఆకలి, పేదరికం పెరగడానికి కారణమవుతున్నాయి.

ఈ గ్లోబల్‌ ‌హంగర్‌ ఇం‌డెక్స్ ‌ముఖ్యంగా నాలుగు అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది. 1. పోషణస్థాయి తక్కువ (తగినంత కేలరీలను తీసుకోక పోవడం), 2. ఐదేళ్లలోపు పిల్లల్లో పోషకాహార లోపం (ముఖ్యంగా తక్కువ బరువు) 3. ఐదేళ్లలోపు పిల్లలు వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడం. ముఖ్యంగా దీర్ఘకాల పోషకాహార కొరతను ఎదుర్కోవడం, 4. చిన్నపిల్లల్లో మరణాలు (ఐదేళ్లలోపు పిల్లల్లో మరణాలు. పోషణ కొరత, అనారోగ్య వాతావరణం). వీటి ఆధారంగా హంగర్‌ ఇం‌డెక్స్‌ను తయారుచేస్తారు.

మీకు తెలుసా?

మానవ శరీరానికి ఏడు రకాల ప్రధాన పోషకాలు అవసరం. అన్ని పోషకాలు తగినంత శక్తినివ్వకపోయినప్పటికీ నీరు, పీచు పదార్థాల మాదిరిగా అవి కూడా చాలా అవసరం. సూక్ష్మ పోషకాల ప్రాధాన్యం తక్కువేమీ కాదు. కానీ అవి సూక్ష్మ పరిమాణంలో అవసరం కనుక వీటిని సూక్ష్మ పోషకాలని పిలుస్తున్నాం. మనకు అత్యవసరమైన కర్బన సంయోగ పదార్థాలు విటమిన్లు. వీటిని మన శరీరం తయారుచేసుకోలేదు.

పోషకాహార వారోత్సవాలు

ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడని నిర్ధారించే కారకాల్లో కీలకమైంది పోషకాహారం. ఇది వ్యక్తుల ఆరోగ్యానికి, ఎదుగుదలకు, అభివృద్ధికి దోహదం చేస్తుంది. పోషకాహారంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా సెప్టెంబర్‌ 1 ‌నుంచి 7వ తేదీ వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలు (ఎన్‌ఎన్‌డబ్ల్యు) నిర్వహించడం మనదేశంలో ఆనవాయితీగా వస్తున్నది. భారత ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధీనంలో పనిచేసే ఆహారం, పోషకాహార బోర్డు ఈ వారోత్సవాలను నిర్వహిస్తుంది. ప్రజల్లో మంచి ఆరోగ్యం పెంపొందేందుకు, హితకరమైన ఆహారాన్ని స్వీకరించాలన్న అంశాన్ని ఎన్‌ఎన్‌డబ్ల్యు నొక్కి చెబుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం వ్యక్తుల భౌతిక, మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. హితకరమైన, విభిన్న రకాల ఆహారం తీసుకోవడం వల్ల జీవన నాణ్యత పెరుగుతుంది. అదే తగిన పోషకాలు లేని ఆహారం అనారోగ్యానికి, వ్యాధిగ్రస్తతకు దోహదం చేస్తుంది. జాతీయ పోషకాహార వారోత్సవాలను పురస్కరించుకొని వివిధ ప్రభుత్వ సంస్థలు సెమినార్లు, ప్రచార కార్యక్రమాలు, రోడ్‌షోల ద్వారా ప్రజల్లో పోషకాహార ప్రాధాన్యంపై అవగాహన కల్పిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజల్లో పోషకాహార అలవాట్లను పెంపొందింపజేయడమే ఎన్‌ఎన్‌డబ్ల్యు ప్రధాన లక్ష్యం.

పోషణ్‌ అభియాన్‌

2018-22 ‌వరకు ప్రభుత్వం అమలుచేస్తున్న పోషణ్‌ అభియాన్‌ ‌కింద తక్కువ బరువుతో జన్మించే, పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల సంఖ్యను 2 శాతానికి తగ్గించడానికి, అదేవిధంగా రక్తహీనతతో బాధపడుతున్న అన్ని వయసుల పిల్లల సంఖ్యను 3 శాతానికి తగ్గించడానికి కృషి జరుగుతోంది. ఇటువంటి పిల్లలు తేలిగ్గా ఇన్ఫెక్షన్లకు, వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఇటువంటి వారు మరణాలకు గురవుతారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే దేశం యావత్తూ పోషకాహారం ద్వారా సంపూర్ణ స్వాస్థంతో మెలగాలి. ఈ పోషణ్‌ అభియాన్‌ ‌కింద చేపట్టే ప్రధాన కార్యక్రమం ‘జన్‌ ఆం‌దోళన్‌’. ‌సెప్టెంబర్‌ ‌నెలలో చేపట్టే ఈ కార్యక్రమం సోషల్‌ ‌డ్రైవ్‌ను సృష్టించేందుకు దోహదం చేస్తుంది. సామాజిక ప్రవర్తన, కమ్యూనికేషన్‌లో మార్పు, అత్యవసర పోషకాహార ప్రమేయాలపై మరింత చైతన్యం కలగజేసేందుకు జనసమీకరణ వంటివి ‘జన్‌ ఆం‌దోళన్‌’ ‌కింద చేపట్టే కార్యక్రమాలు. నవజాత శిశువులకు తొలి రెండేళ్ల కాలం తగినన్ని పోషకాలు తప్పనిసరిగా అందాలి. తల్లిపాలల్లో బిడ్డకు కావలసిన అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి ఈ రెండేళ్ల కాలం తల్లిపాలు అందించడం సర్వదా శ్రేయస్కరం. ఆరు నెలలు దాటిన తర్వాత పిల్లలకు అదనపు పోషకాహారాన్ని అందించాలి. వయసు పెరుగుతున్నకొద్దీ పోషకాహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించవచ్చు. కాగా ఈ పోషణ్‌ అభియాన్‌కు తోడు నీతి ఆయోగ్‌ ‘‌కుపోషన్‌ ‌ముక్త్ ‌భారత్‌’‌ను 2022 చివరి నాటికి సాధించాలని లక్ష్యంగా నిర్దేశించింది. అయితే ప్రస్తుతం పిల్లల్లో కొనసాగుతున్న ఎదుగుదల లోపాలను అనుకున్నదానికంటే రెట్టింపు స్థాయిలో తగ్గిస్తేనే ఈ లక్ష్యాన్ని సాధించడం సాధ్యం. ముఖ్యంగా వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయ లోపం, కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించకపోవడం, సమాచార నిర్వహణ సక్రమంగా లేకపోవడం వంటి సమస్యలు లక్ష్యసాధనకు ప్రధాన అవరోధంగా ఉన్నాయి. ఇప్పటికీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ పథకం కింద కేంద్రం కేటాయించిన నిధుల్లో కేవలం 16% మాత్రమే వినియోగించాయంటే అమలులో నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉన్నదీ అర్థమవుతుంది. నిజానికి పోషణ్‌ అభియాన్‌ను అమలుపరచేది క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీ కేంద్రాలు. పోషకాహారం విషయంలో అట్టడుగునున్న బిహార్‌, ఒడిశా రాష్ట్రాల్లో పనిచేసే అంగన్‌వాడీల సంఖ్య చాలా తక్కువ. వీటిల్లో సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వాలు శ్రద్ధ చూపడంలేదు. పోషకాహార లోపంతో బాధపడే ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టకపోవడం మరో ప్రధాన లోపం. ఉదాహరణకు వయసుకు తగిన బరువు లేని పిల్లలు అధికంగా ఉన్న రాష్ట్రాలు జార్ఖండ్‌, ‌బిహార్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌గుజరాత్‌, ‌మహారాష్ట్ర. ఈ రాష్ట్రాలపై ఎక్కువ దృష్టిపెట్టాలి.

జాతీయ పోషకాహార వారోత్సవాల చరిత్ర

1975లో అమెరికన్‌ ‌డయేటిక్‌ అసోసియేషన్‌ (ఏడీఏ) ఈ పోషకాహార వారోత్సవాలను మార్చి నెలలో ప్రారంభించింది. ఏడీఏను ప్రస్తుతం అకాడమీ ఆఫ్‌ ‌న్యూట్రిషన్‌ అం‌డ్‌ ‌డయేటిక్స్ అని పిలుస్తున్నారు. ప్రజల్లో పోషకాహారంపై చైతన్యం కలిగించడం మాత్రమే కాదు, డయేటియన్స్ ‌వృత్తికి కూడా తగిన ప్రోత్సాహం కల్పించడం దీని ప్రధాన లక్ష్యం.

1980లో పోషకాహారంపై నిర్వహించిన వారోత్సవాలకు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో, అప్పటి నుంచి ఏటా నెలరోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఇక మనదేశం విషయానికి వస్తే 1982 నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జాతీయ పోషకాహార వారోత్సవాలు జరుగుతున్నాయి. అప్పటినుంచే భారత ప్రభుత్వం ప్రజల్లో పోషకాహార ప్రాధాన్యంపై విస్తృత ప్రచారం ప్రారంభించింది.

పోషకాహార లోపం అంటే?

పోషకాలు అసమతుల్యంగా ఉన్న స్థితినే పోషకాహార లోపం అంటాం. అంతేకాని తక్కువ పోషకాలు లేదా ఎక్కువ పోషకాలుండటం అనేది పోషకాహార లోపం కాదు. తగినన్ని కేలరీలు, ప్రొటీన్లు లేదా ఇతర పోషకాలు కలిగిన ఆహారాన్ని తినకపోవడం వల్ల పోషకాహార లోపం కలుగుతుంది. అదేవిధంగా అతిపోషకాహారం అంటే మన శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకోవడం. ఎవరైనా తన శరీరానికి అవసరమైన దాని కంటే ఎక్కువ కేలరీలు తీసుకున్నట్లయితే అది కూడా పోషకాహార లోపానికి దారితీస్తుంది. అంటే పండ్లు, కూరగాయలు, ప్రొటీన్లు, ధాన్యం మొదలైనవి తీసుకోకపోవడం వల్ల కలిగే స్థితి ఇది. విటమిన్లు, ఖనిజ లవణాలు వారు తీసుకునే ఆహారంలో తక్కువగా ఉండటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది.

ముఖ్యంగా చిన్నపిల్లల్లో పెరుగుదల ఆగిపోవడం, ప్రతి రక్షక వ్యవస్థ బలహీనం కావడం వల్ల తరచుగా అనారోగ్యానికి గురికావడం వంటివి జరుగుతుంటాయి. ఎప్పటికప్పుడు పోషకాహార లోపాన్ని గుర్తిస్తూ తగిన చర్యలు తీసుకోవాలి.

పరిష్కారమేంటి?

ఫుడ్‌ అం‌డ్‌ ‌న్యూట్రిషన్‌ ‌సెక్యూరిటీ అనాలసిస్‌ ఇం‌డియా-2019 పోషకాహార లోపాన్ని పరిష్కరించేందుకు కొన్ని సూచనలు చేసింది. పంటమార్పిడులు పాటించే రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం, తక్కువ ఖర్చుతో పంటలు పండించే సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం, తమ ప్రాంతంలోని భూమిని సక్రమంగా వినియోగించుకునేలా రైతులకు అవగాహన కల్పించడం ద్వారా సుస్థిర పంట ఉత్పత్తుల అభివృద్ధి సాధించడం, కోతల అనంతర నష్టాల నివారణలో భాగంగా నిల్వల సామర్థ్యాన్ని పెంచడం, చిన్నపిల్లలకు ఆహారాన్ని అందించే అలవాట్లలో మార్పులు, ఆకలి, అన్ని రకాల పోషకాహార లోపాలను నివారించాలన్న సుస్థిరాభివృద్ధి లక్ష్యం-2ను సాధించడానికి మరిన్ని చర్యలు తీసుకోవడం. వీటిని అనుసరించడం ద్వారా పోషకాహార లోపాలను సమర్థవంతంగా అరికట్టవచ్చు.

పిల్లలకు అనుబంధ ఆహారం ఇవ్వడంలో సూచనలు

– రెండేళ్ల వరకు పిల్లలకు తల్లి పాలు తప్పనిసరిగా ఇస్తుండాలి.

– పిల్లలకు నిదానంగా, సహనంతో ఆహారం అందించాలి. వారిని తినడానికి ప్రోత్సహించాలి తప్ప, ఒత్తిడి తీసుకురాకూడదు. ఆరోగ్యకరమైన రీతిలో ఆహారం అందించే పద్ధతులను పాటించాలి.

– మొదట చిన్న పరిమాణంలో ఆహారాన్ని అందిస్తూ, వారి వయసు పెరిగే కొద్దీ ఈ పరిమాణాన్ని పెంచుకుంటూ పోవాలి. క్రమంగా ఆహారంలో మార్పులు తీసుకొనిరావాలి. శిశువుల వయస్సును బట్టి ఆహారాన్ని అందించాలి. 6-8 నెలల వయస్సున్న పిల్లలకు రోజుకు రెండు లేదా మూడుసార్లు భోజనం అందించాలి, 9-23 నెలల మధ్య వయస్కులైన పిల్లలకు 3-4సార్లు ఆహారాన్ని అందిస్తూ అవసరమైతే ఒకటి లేదా రెండుసార్లు స్నాక్స్ ఇవ్వాలి.

– అనారోగ్యంగా ఉన్నప్పుడు తగిన రీతిలో బలమైన అనుబంధ ఆహారాన్ని ఎంపికచేసి అందించాలి. ద్రవాహారాన్ని అందిస్తూ, శిశువులకు తల్లి పాలను కొనసాగించాలి. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని అందించాలి.

ఈ అలవాట్లను కొనసాగించాలి!

– పిల్లలకు భోజనం తర్వాత తాజా పండ్లను ఇవ్వాలి. ఫ్రిడ్జ్‌లో జంక్‌ ‌ఫుడ్‌ ‌కాకుండా, పోషకాలతో కూడిన ఆహారాన్ని ఉంచాలి.

– అన్ని రకాల కూరగాయలు, పండ్లు పిల్లలకు రుచి చూపాలి.

– ఆహార తయారీలో పిల్లలను కూడా భాగస్వాములను చేయాలి. అందువల్ల వారు భోజనాన్ని మరింత ఆస్వాదించగలుగుతారు.

– అన్నం తినేటప్పుడు టీవీని కట్టేయండి. అప్పుడు పిల్లలు తినడంపై ఎక్కువ దృష్టిపెట్టి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకో గలుగుతారు.

About Author

By editor

Twitter
Instagram