సెప్టెంబర్‌ 8 ‌ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం

అక్షరాస్యత ప్రగతికి మూలం. అభివృద్ధికి సాకారం. మహాత్మాగాంధీ ‘దారిద్య్రం, నిరక్ష రాస్యత ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నాయి. నిరక్షరాస్యత నిర్మూలిస్తేనే దారిద్య్ర నిర్మూలన జరుగుతుంది’ అని చెప్పారు. సుమతీ శతకకర్త ‘ఇమ్ముగ చదవని నోరును / అమ్మా! యని పిలిచి యన్న మడుగని నోరున్‌/ ‌తమ్ములమబ్బని నోరును / కుమ్మరి పను ద్రవ్వినట్టి గుంటర సుమతీ’ అన్నాడు. ఇంపుగా చదువని నోరు కుమ్మరి మట్టి త్రవ్వే గుంట లాంటిదని చదువు ప్రాధాన్యాన్ని 13వ శతాబ్దంలోనే చెప్పాడు.  పోతన  భాగవతంలో హిరణ్య కశిపుని పాత్ర ద్వారా ప్రహ్లాదుడికి చదువు ప్రాశస్త్యాన్ని వ్యక్తీకరిస్తూ ‘చదువనివాడ జ్ఞుండు చదివిన సద సద్వివేక చతురత గలుగున్‌’-‌చదువు వల్ల అజ్ఞాం తొలగిపోయి విజ్ఞత కలుగుతుందని, సదసద్వివేక చతురత సాధ్యమవుతుందని చదువు ప్రయోజనాన్ని గొప్పగా ప్రబోధించాడు.


ఐక్యరాజ్య సమితిలో ప్రధానమైన విద్యా, విజ్ఞాన శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ (యునెస్కో) 1945లో ప్రారంభమైంది. ఈ సంస్థ అంతర్జాతీయ సహకారంతో ఆయా అంశాల పరిరక్షణ కోసం పాటుబడుతుంది. అందులో 193 మంది సభ్యులు, ఆరుగురు అసోసియేట్‌ ‌సభ్యులుంటారు. దాని ప్రధాన కేంద్రం ఫ్రాన్స్ ‌రాజధాని పారిస్‌లో ఉంది.

యునెస్కో 1965 అక్టోబర్‌ 26‌వ తేదీన సభ్య దేశాల విద్యాశాఖ మంత్రుల సమావేశం నిర్వహించి, సెప్టెంబర్‌ 8‌వ తేదీని ప్రపంచ అక్షరాస్యతా దినోత్స వంగా ప్రకటించింది. అక్షరాస్యతను వ్యక్తులకు, సంఘాలకు అందించడమే దీని ఆశయం. పిల్లల్లోనే కాకుండా వయోజనుల మీద దృష్టి కేంద్రీకరించి అక్షరాస్యతను పెంపొందించాలన్న లక్ష్యంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుతారు.

ప్రపంచవ్యాప్తంగా అప్పటికి 775 మిలియన్‌ల పెద్ద వారిలో కనీస అక్షరాస్యతా లేని వారు ఉన్నారు. వారిలో మహిళలు రెండు వంతుల మంది ఉన్నారు. పిల్లల్లో 60.7 మిలియన్లు మధ్యలో బడి మానేసి బాల కార్మికులుగా మారుతున్నారు.

యునెస్కో రూపొందించిన నివేదిక ప్రకారం (2006) దక్షిణ ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో అక్షరాస్యతా శాతం అతి తక్కువగా ఉంది. మహిళలు నిరక్షరాస్యత మూలంగా వివక్షతకు గురవుతున్నారు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంలో భాగంగా వివిధ దేశాల్లో ‘అందరికీ విద్య’ అనే నినాదంతో అక్షరాస్యతను పెంచే ప్రయత్నం జరుగుతోంది.

ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ఇతర దేశా లతో పోలిస్తే భారతదేశం అక్షరాస్యత విషయంలో అట్టడుగు స్థానంలో ఉండటం బాధాకరం. దేశంలో ఇంత మాత్రమైనా అక్షరాస్యత సాధించటానికి కేరళ వంటి కొన్ని రాష్ట్రాలు ముందంజలో ఉండటమే కారణం. బిహార్‌, ఆం‌ధప్రదేశ్‌ ‌వంటి రాష్ట్రాలు అక్షరాస్యతలో బాగా వెనుకబడి ఉన్నాయి.

ప్రపంచ నిరక్షరాస్యుల్లో సగం మంది మన దేశంలో ఉండటం విచారకరం. స్థిరమైన ఆర్థికా భివృద్ధి సాధించాలంటే దేశంలో 80 శాతం మంది అక్షరాస్యులై ఉండాలి. స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో కూడా ఆ స్థాయిలో అక్షరాస్యత లేకపోవడం బాధాకరం.

భారతదేశానికి స్వాతంత్య్రం లభించే నాటికి (1947 ఆగస్ట్) 15 ‌శాతం మంది అక్షరాస్యులు న్నారు. ఆ మాత్రం అక్షరాస్యత సాధనకు గాడిచర్ల హరిసర్వోత్తమరావు వంటివారు గ్రంథాలయోద్య మంలో భాగంగా వయోజన విద్యను ప్రోత్సహిం చారు. సాహితీ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం 1887 ప్రాంతంలో తన శిష్యుల ద్వారా రాజ మండ్రిలో రాత్రి పాఠశాలలు నిర్వహించి వారికి ఒక్కొక్కరికి నెలకు 8 రూపాయలు పారితోషికం ఇచ్చారు. ఆయన శిష్యుడు చిలకమర్తి లక్ష్మీ నరసింహం 1902లో రాత్రి పాఠశాలలు నిర్వ హించారు. వీరి కృషి వల్ల తెలుగునాట అక్షరాస్యత శాతం కొంత మేరకు జరిగింది.

అప్పట్లో తెలుగు పాఠ్య గ్రంథాలు గ్రాంథి•క భాషలో ఉన్నందున చదువు కొనేందుకు బడుగు బలహీన వర్గాల వారు జంకేవారు. స్వాతంత్య్రా నంతరం భారత ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి ప్రయత్నం చేసినా, ఆశించిన మేరకు అక్షరాస్యత సాధించలేకపోయింది.

1979లో మొరార్జీ దేశాయ్‌ ‌ప్రధాని అయిన వెంటనే గాంధీ జయంతి రోజున జాతీయ వయోజన విద్యా పథకాన్ని (ఎన్‌.ఏ.ఇ.‌పి) ప్రవేశపెట్టారు. అప్పటి జనాభాలో భారతదేశంలో 15 నుండి 35 సంవత్స రాల మధ్య వయసున్న వయోజన నిరక్షరాస్యులు 10 రెట్ల మంది ఉన్నారు. వారిని 5 సంవత్సరాల్లో (1984 నాటికి) వయోజన విద్య ద్వారా అక్షరాస్యు లుగా చేయాలని తలచారు. ఆయన ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగనందున ఆ పథకం ఆచరణ సాధ్యం కాలేదు. ఆ తర్వాత ప్రధానిగా వచ్చిన ఇందిరాగాంధీ జాతీయ వయోజన విద్యా పథకంలో భాగంగా విశ్వవిదాలయాల ద్వారా కళాశాలలను భాగస్వాములు చేసి విద్యార్థి వాలంటీర్ల ద్వారా నిర్వహించేలా వయోజన విద్యా పథకాన్ని ప్రవేశ పెట్టారు. ప్రతి కళాశాలకు అధ్యాపకుల్లో ఒకరిని వయోజన విద్యాపథకం ఆఫీసర్‌గా గౌరవ వేతనంపై నియమించారు. కళాశాల ఆధ్వర్యంలో పదిమంది విద్యార్థి వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి, పది వయోజన కేంద్రాలు నిర్వహించారు. వాలంటీర్లకు గౌరవభృతి చెల్లించేవారు. పోగ్రామ్‌ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో కేంద్రాలను పర్యవేక్షించేందుకు ఒక సూపర్‌వైజర్‌ని నియమించేవారు. ఈ వ్యాసకర్త 1984 నుండి 1990 వరకు కళాశాలల వయోజన విద్యా కార్యక్రమ అధికార్లకు, సూపర్‌వైజర్‌లకు శిక్షణ నిర్వహకుడిగా (రిసోర్స్ ‌పర్సన్‌) ఆం‌ధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిం చాడు. రాజీవ్‌గాంధీ ప్రధాని అయిన తర్వాత ఈ కార్యక్రమ నిర్వహణకు 1986లో జాతీయ అక్షరాస్యతా మిషన్‌ ‌ప్రవేశపెట్టారు. ప్రతి రాష్ట్రానికి ఒక వయోజన విద్యా సంచాలకులు, ప్రతి జిల్లాకు వయోజన విద్యాధికారి, ప్రాజెక్టు ఆఫీసర్లను నియమించి కార్యక్రమాలను నిర్వహించారు. సంబం ధిత అధికార్లు నిబద్ధతతో నిర్వహించకపోవడం వల్ల వారి నివేదికల ఆధారంగా రూపొందిన అక్షరాస్యత పెరుగుదల నివేదికలు సరైనవి కావని తేలింది. విశ్వవిద్యాలయాలు, కళాశాలల కూడా చేపట్టిన వయోజన విద్యా కార్యక్రమాలు సరైన ఫలితాలను సాధించలేకపోయాయి. ఇప్పటికీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నామమాత్రంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి.

యునెస్కో 1990 సంవత్సరాన్ని ప్రపంచ అక్షరాస్యతా సంవత్సరంగా ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి 2003-2012 కాలాన్ని అక్షరాస్యత దశాబ్దిగా ప్రకటించింది. ‘లిటరసీ ఫర్‌ ఆల్‌.. ‌వాయిస్‌ ‌ఫర్‌ ఆల్‌; ‌లెర్నింగ్‌ ‌ఫర్‌ ఆల్‌’ అనే అంశాలను దశాబ్ది లక్ష్యాలుగా నిర్దేశించింది.అయితే ఆశించిన మేరకు లక్ష్యాల సాధన జరుగలేదు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా వివిధ దేశాల్లో ‘అందరికీ విద్య’ నినాదంతో అక్షరాస్యతను పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ‘అక్షరాస్యత-ఆరోగ్యం’ లక్ష్యంగా(2008) ముఖ్యంగా హెచ్‌ఐవీ, క్షయ, మలేరియా వంటి సమస్యల నివారణ కోసం చిత్తశుద్ధితో కృషి చేసే సంస్థలకు మంచి బహుమతులిచ్చి ప్రోత్సహించారు.

భారతదేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించా లంటే ‘అక్షరాస్యులకే ఓటు హక్కు’ అని రాజకీయ పార్టీలన్నీ ఏకగ్రీవంగా ప్రతిపాదన చేయాలి. కానీ ఈ ప్రతిపాదనకు రాజకీయ పార్టీలు సుముఖత వ్యక్తం చేయవు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అక్షరాస్యులకే అని, బ్యాంకుల ద్వారా పొందే రుణ సదుపాయాలు అక్షరాస్యులకే అని ప్రకటించినా అక్షరాస్యత శాతం పెరుగుతుంది. ఈ ప్రతిపాదనను రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో అమలు పరిస్తే సంపూర్ణ అక్షరాస్యత సాధ్యమవుతుంది. ఏది ఏమైనా ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవాల వల్ల ప్రజల్లో అక్షరాస్యతపై అవగాహన పెరుగుతుంది. విద్యాసంస్థలు, విద్యాధికులు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, ఉపాధ్యాయులు ర్యాలీల ద్వారా అక్షరా స్యత ఆవశ్యకతను ప్రబోధించి ప్రజల్లో చైతన్యాన్ని కలిగించాలి. వయోజన విద్యా సంబంధిత అధికారులు చిత్తశుద్ధితో కార్యక్రమాన్ని అమలు చేయాలి. ప్రత్యేకించి బడుగు బలహీనవర్గాల వారిలో మహిళల్లో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నారు. అటువంటివారు నివసించే కాలనీల్లో ‘అక్షరాస్యత- ఆరోగ్యం’ వంటి అవగాహనా కార్యక్రమాలు నిర్వ హించి చైతన్య పరచాలి. వారి పిల్లలను సక్రమంగా పాఠశాలలకు పంపించేటట్లు చేయాలి. ఆరోగ్య కార్యకర్తలు, ఈ కృషితో భాగస్వాములు కావాలి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకై చిత్తశుద్ధితో కృషి జరగాలి. అప్పుడే సంపూర్ణ అక్షరాస్యత సాధ్య మవుతుంది. ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవం ఆశయం సఫలమవుతుంది.

– డా।। పి.వి.సుబ్బారావు 9849177594 రిటైర్డ్ ‌ప్రొఫెసర్‌ & ‌తెలుగు శాఖాధిపతి, సి.ఆర్‌. ‌కళాశాల, గుంటూరు.

About Author

By editor

Twitter
Instagram