– చొప్పరపు కృష్ణారావు, 8466864969

ఆగస్ట్ 29 ‌జాతీయ క్రీడా దినోత్సవం

ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారత క్రీడాచరిత్రలో ‘స్వర్ణ’శకానికి ఏడేళ్ల క్రితమే ప్రధాని నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. భారత క్రీడారంగ భావి అవసరాలను దృష్టిలో ఉంచుకొని వినూత్నరీతిలో ఖేలో ఇండియా కార్యక్రమాలను అమలుచేస్తూ కొత్తపుంతలు తొక్కిస్తున్నారు. అంతర్జాతీయ క్రీడోత్సవాలలో భారత యువ, నవతరం క్రీడాకారులే అత్యధికంగా బంగారు పతకాలు సాధిస్తూ దేశానికే గర్వకారణంగా నిలవడమే ఇందుకు నిదర్శనం. ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌వేడుకలను, జాతీయ క్రీడాదినోత్సవాన్ని సుసంపన్నం చేస్తున్నారు. యువత ఎక్కువగా ఉన్న మనదేశంలో క్రీడారంగ అభివృద్ధికి ప్రధాని మోదీ అధిక ప్రాధాన్యమిస్తున్నారు. గత క్రీడామంత్రులు రాజ్యవర్ధన్‌సింగ్‌ ‌రాథోడ్‌, ‌కిరణ్‌ ‌రిజిజు నుంచి ప్రస్తుత క్రీడామంత్రి అనురాగ్‌ ‌ఠాకూర్‌ ‌వరకు.. మార్గదర్శనం చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ఖేలో ఇండియా, ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు వంటి పథకాలతో ఈ రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. అంతర్జాతీయ క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు అండగా నిలవడం, ప్రపంచ స్థాయిలో పతకాలు సాధించినవారిని ఆర్థిక ప్రోత్సాహకాలతో వెన్నుతట్టి ప్రోత్సహించడం ద్వారా చాంపియన్లుగా తీర్చిదిద్దుతున్నారు.

జనాభాపరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్‌ ఎన్నో రంగాలలో దూసుకు పోతున్నా.. క్రీడారంగంలో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రగతి సాధించలేకపోయింది. అయితే, ఈ పరిస్థితిని అధిగమించడానికి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం గత ఏడు సంవత్స రాలుగా వినూత్న విధానాలతో పాటుపడుతోంది. ఒలింపిక్స్ ‌పతకాల పట్టిక మొదటి 10 స్థానాలలో నిలవటమే లక్ష్యంగా కసరత్తు ప్రారంభించింది.

లక్షలాది గ్రామాలు, పల్లెలకు ఆలవాలమైన భారత్‌లో ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఏ మాత్రం కొదవలేదు. ప్రాథమిక స్థాయిలోనే ప్రతిభా వంతులైన క్రీడాకారులను గుర్తించి, ప్రపంచ మేటి శిక్షకుల పర్యవేక్షణలో తీర్చిదిద్దటానికి కేంద్ర ప్రభుత్వం ‘ఖేలో ఇండియా గేమ్స్’‌ను నిర్వహిస్తోంది. 10 నుంచి 15 సంవత్సరాలలోపు వయసు కలిగిన ప్రతిభావంతులైన బాలలు, యువతను గుర్తించి ప్రపంచ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇవ్వటానికి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు చేసింది. దేశంలోని వివిధ రాష్ట్రాలతో కలసి పనిచేస్తూ ప్రతిభా న్వేషణ కార్యక్రమాలు చురుకుగా నిర్వహిస్తోంది. దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో వెయ్యికి పైగా ప్రతిభాన్వేషణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులలో ప్రతిభను గుర్తించడానికి శిక్షకులు, నిపుణుల బృందాలను అందుబాటులో ఉంచింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయటానికి చర్యలు చేపట్టింది.

2028 ఒలింపిక్సే లక్ష్యం..

అమెరికా వేదికగా 2028లో జరిగే ఒలింపిక్స్.. ‌పతకాల పట్టిక మొదటి పది స్థానాలలో భారత్‌ను నిలపడమే లక్ష్యంగా పథకాలు సిద్ధం చేసినట్లు కేంద్ర క్రీడామంత్రి చెబుతున్నారు. ఒలింపిక్స్‌లో సూపర్‌ ‌పవర్‌గా ఉన్న అమెరికా, చైనా లాంటి దేశాలను అధిగమించే సత్తా భారత్‌కు లేకున్నా.. పతకాల పట్టిక మొదటి పదిస్థానాలలో నిలవాలంటే కనీసం 10 నుంచి 15 వరకూ బంగారు పతకాలు సాధించాలని, ఆ దిశగా క్రీడావిధానంలో సమూలంగా మార్పులు చేసినట్లు కేంద్రమంత్రి ఓ సందర్భంలో ప్రకటించారు. వివిధ రాష్ట్రాల క్రీడామంత్రులతో సవివరంగా చర్చించిన తర్వాతే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం, భారత ఒలింపిక్‌ ‌సంఘం, ప్రముఖ కార్పొరేట్‌ ‌సంస్థలు కలసి సమన్వయంతో క్రీడాభివృద్ధికి కృషి చేస్తారని, మొత్తం 14 రకాల క్రీడలను గుర్తించి వాటిలోనే ఒలింపిక్స్ ‌పతకాలు సాధించటమే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు. ఒక్కో రాష్ట్రం పలు రకాల క్రీడలపైన దృష్టి పెడితే సాధించగలిగేది ఏమీ ఉండదని, ఒక్కో రాష్ట్రం తనకు నచ్చిన ఒకటి లేదా రెండు క్రీడలను ఎంపిక చేసుకొని వాటి పైనే దృష్టి కేంద్రీకరిస్తే ఒలింపిక్స్‌లో పతకాలు కచ్చితంగా సాధించొచ్చని భావిస్తున్నారు.

క్రీడాశిక్షకులకు డబుల్‌ ‌ధమాకా

అత్యుత్తమ క్రీడాకారులను తిర్చిదిద్దిన దేశీయ శిక్షకులను విదేశీ శిక్షకులతో సమానంగా ఆదరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించగల అథ్లెట్లను తీర్చిదిద్ధిన భారత శిక్షకులకు ఇప్పటి వరకూ ఇస్తున్న 2 లక్షల రూపాయల వేతనంపై పరిమితిని ఎత్తి వేయడంతో పాటు నాలుగేళ్లపాటు కాంట్రాక్టు ఇవ్వాలని భారత క్రీడాప్రాధికార సంస్థ నిర్ణ యించింది. దీంతో దేశవాళీ క్రీడా శిక్షకులకు ఉద్యోగ భద్రతతో పాటు ఆర్థికంగా భరోసా ఉటుందని, ఫలితంగా అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని భావిస్తున్నారు.

ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకాలు అందించే అవకాశం ఉన్న కుస్తీ, బాక్సింగ్‌, ‌వెయిట్‌ ‌లిఫ్టింగ్‌, ‌హాకీ, విలువిద్య, బ్యాడ్మింటన్‌, ‌షూటింగ్‌తో సహా మొత్తం 14 క్రీడాంశాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ 14 రకాల క్రీడాంశాల నుంచి ఒక్కో క్రీడను ఒక్కో రాష్ట్రానికి కేటాయించడంతో పాటు క్రీడాభివృద్ధికి తగిన నిధులు సైతం సమకూర్చా లని నిర్ణయించింది. ఒకటి లేదా రెండు క్రీడాంశాలకు ఒక్కో కార్పొరేట్‌ ‌సంస్థ స్పాన్సర్‌గా ఉంటుందని, ప్రతిభావంతులైన క్రీడాకారులు, శిక్షకులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు, ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచే క్రీడలను నిర్భంధ పాఠ్యాంశంగా ప్రవేశపెట్టే దిశగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

1980 మాస్కో ఒలింపిక్స్‌లో భారత్‌ ‌చివరి సారిగా హాకీలో బంగారు పతకం సాధించగా, 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో షూటర్‌ అభినవ్‌ ‌బింద్రా వ్యక్తి గతంగా ఒకే ఒక్క స్వర్ణ పతకం నెగ్గడం ద్వారా సరి కొత్త చరిత్ర సృష్టించాడు. టోక్యో వేదికగా ముగిసిన 2021 ఒలింపిక్స్ అథ్లెటిక్స్ ‌జావలిన్‌ ‌త్రో భాగంలో నీరజ్‌ ‌చోప్రా స్వర్ణ పతకం సాధించడం ద్వారా మరో చరిత్రకు తెరతీశాడు. మరో ఆరేళ్లలో జరిగే లాస్‌ ఏం‌జెలిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ 10 ‌నుంచి 15 వరకూ బంగారు పతకాలు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బంగారు కల నిజం కావాలంటే ప్రభుత్వం, క్రీడాసంఘాలు, కార్పొరేట్‌ ‌సంస్థలు, క్రీడాకారులు, శిక్షకులు కలిసి పనిచేయటమే కాదు, అంకితభావంతో పాటుపడక తప్పదు.

టోక్యో  నుంచి  బర్మింగ్‌హామ్‌ ‌వరకు..

జపాన్‌ ‌రాజధాని టోక్యో నగరంలో ముగిసిన 2021 ఒలింపిక్స్, ‌బర్మింగ్‌ ‌హామ్‌ ‌వేదికగా జరిగిన 2022 కామన్వెల్త్ ‌గేమ్స్‌లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి రాణించడం ద్వారా సత్తా చాటుకోగలిగారు. 200కు పైగా దేశాలు తలపడిన టోక్యో ఒలింపిక్స్ ‌పతకాల పట్టికలో భారత్‌ 48‌వ స్థానం సంపాదించింది. అంతేకాదు, 2018 ఆసియా క్రీడల పతకాల పట్టిక 8వ స్థానం, 2022 బర్మింగ్‌హామ్‌ ‌కామన్వెల్త్ ‌గేమ్స్ ‌పతకాల పట్టికలో 4వ స్థానం సంపాదించింది.

సరికొత్త విజేతలు

టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్‌ ‌చోప్రా నుంచి బర్మింగ్‌హామ్‌ ‌కామన్వెల్త్ ‌గేమ్స్‌లో స్వర్ణాల పంట పండించిన వెయిట్‌ ‌లిఫ్టర్‌ ‌జెరోమీ లాల్‌ ‌రునింగా, మహిళా బాక్సర్లు నిఖత్‌ ‌జరీన్‌, ‌నీతు గంగాస్‌, ‌యువ వెయిట్‌ ‌లిఫ్టర్లు అచింత షియోలీ, సంకేత్‌ ‌మహదేవ్‌ ‌సర్గార్‌, ‌ట్రిపుల్‌ ‌జంపర్‌ ఎల్దోసీ పాల్‌, ‌హైజంపర్‌ ‌తేజస్విన్‌ ‌శంకర్‌, ‌లాంగ్‌ ‌జంపర్‌ శ్రీ‌శంకర్‌, ‌యువ వస్తాదులు దీపక్‌ ‌పూనియా, వినేశ్‌ ‌పోగట్‌, ‌టీటీ మిక్స్‌డ్‌ ‌డబుల్స్ ‌క్వీన్‌ ఆకుల శ్రీజ, బ్యాడ్మింటన్‌ ‌పురుషుల గోల్డ్ ‌మెడలిస్టులు సాత్విక్‌, ‌చిరాగ్‌ ‌షెట్టి వంటి ఎందరో నవతరం అథ్లెట్లు ఖేలో ఇండియా పథకం ద్వారా లబ్ధి పొంది దేశానికి పతకాలు అందించిన వారే. లాన్‌ ‌బౌల్స్ ‌క్రీడ పురుషుల, మహిళల ఫోర్స్ ‌టీమ్‌ ‌విభాగంలో భారత్‌ ‌తొలిసారిగా రజత, స్వర్ణ పతకాలతో సంచలనం సృష్టించింది.

తమిళనాడులోని మామల్లపురం వేదికగా భారత గడ్డపై మొదటిసారిగా జరిగిన 44వ చెస్‌ ఒలింపియాడ్‌ ‌పురుషుల, మహిళల విభాగాలతో పాటు, వ్యక్తిగత విభాగంలోనూ భారత క్రీడాకారులు పతకాలు సాధించడం ద్వారా దేశానికే వన్నె తెచ్చారు.

హాకీకి పూర్వవైభవం

నాలుగు దశాబ్దాల క్రితం చివరిసారిగా హాకీలో బంగారు పతకం సాధించిన భారతజట్టు.. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో పునరుజ్జీవన పథంలో పయనిస్తోంది. బర్మింగ్‌హామ్‌ ‌కామన్వెల్త్ ‌గేమ్స్‌లో సైతం భారత పురుషుల జట్టు రజత, మహిళల జట్టు కాంస్య పతకాలతో జాతీయ క్రీడ మనుగడను ప్రపంచానికి చాటి చెప్పాయి.

ఆకాశమే హద్దు..

బాక్సింగ్‌; ‌కుస్తీ, వెయిట్‌ ‌లిఫ్టింగ్‌, ‌కామన్వెల్త్ ‌గేమ్స్‌లో తొలిసారిగా ప్రవేశపెట్టిన మహిళా టీ-20 క్రికెట్లో సైతం భారత క్రీడాకారులు సఫల మయ్యారు. చదరంగం, షూటింగ్‌, ‌బ్యాడ్మింటన్‌, ‌ట్రాక్‌ అం‌డ్‌ ‌ఫీల్డ్‌లోని జావలిన్‌ ‌త్రో, లాంగ్‌ ‌జంప్‌, ‌ట్రిపుల్‌ ‌జంప్‌ అం‌శాలలో భారత అథ్లెట్లు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నారు. నీరజ్‌ ‌చోప్రా, లక్ష్యసేన్‌, ‌జెరమీ, పాల్‌ ఎల్దోసీ, నిఖత్‌ ‌జరీన్‌, ‌నీతు గంగాస్‌, ‌చదరంగ గ్రాండ్‌ ‌మాస్టర్‌ ‌ప్రజ్ఞానంద్‌ ‌లాంటి రేపటితరం క్రీడాకారుల చేతిలో భారత క్రీడారంగం సురక్షితంగా ఉంటుదని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. భారత క్రీడాచరిత్రలో స్వర్ణ యుగానికి, బంగారు రోజులకు తెరలేచిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ధ్యాన్‌చంద్‌ ‌పుట్టినరోజే…

భారత హాకీ పితామహుడిగా పేర్గాంచిన మేజర్‌ ‌ధ్యాన్‌చంద్‌ ‌పుట్టిన రోజైన ఆగస్ట్ 29‌న ప్రతి ఏటా మనం జాతీయ క్రీడాదినోత్సవాన్ని అధికారికంగా జరుపుకుంటున్నాం. ఒలింపిక్స్‌లో పుష్కరకాలం పాటు భారత్‌ను స్వర్ణవిజేతగా నిలిపిన అసాధారణ ఆటగాడు ధ్యాన్‌చంద్‌. ఆయన హాకీ స్టిక్‌ ‌పట్టాడంటే చాలు, ఆ చేతిలో అది కాస్త మంత్రదండమైపోతుంది. 1936 బెర్లిన్‌ ఒలింపిక్స్‌లో ధ్యాన్‌చంద్‌ ఆటతీరు, మణికట్టు మాయకు అలనాటి జర్మన్‌ ‌నియంత అడాల్ఫ్ ‌హిట్లర్‌ ‌సైతం మంత్రముగ్ధుడైపోయాడు. ఆయన వాడుతున్న హాకీ స్టిక్‌లో ఏదైనా అయస్కాంతం ఉందేమోనన్న అనుమానంతో పరీక్షలు కూడా చేయించాడు. అయితే, అదంతా ధ్యాన్‌చంద్‌ ‌నైపుణ్యం, మణికట్టు మాయ మాత్రమేనని గ్రహించి తమ ఆర్మీలో చేరితే మేజర్‌ ‌పదవి ఇస్తానంటూ ఆశపెట్టాడు. ధ్యాన్‌చంద్‌ ‌మాత్రం జర్మనీ సేనలో మేజర్‌గా ఉండటం కంటే, భారత సైన్యంలో సిపాయిగా ఉండటమే తనకు ఇష్టమని చెప్పి తనలోని దేశభక్తిని ఆనాడే చాటుకున్నాడు. ధ్యాన్‌చంద్‌ ‌నాయ కత్వంలో భారత్‌ ‌వరుసగా మూడు ఒలింపిక్స్‌లో బంగారు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. 1928, 1932, 1936 ఒలిం పిక్స్‌లో ధ్యాన్‌చంద్‌ ‌విశ్వరూపమే ప్రదర్శించాడు. 1926 నుంచి 1948 వరకు భారత, ప్రపంచ హాకీలో ధ్యాన్‌చంద్‌ ‌శకంగా సాగింది. ఒలింపిక్స్‌లోనే ధ్యాన్‌చంద్‌ 101 ‌గోల్స్ ‌సాధించడం ఓ అరుదైన రికార్డుగా ఉంటే, తన కెరియర్‌లో మొత్తం వెయ్యి గోల్స్ ‌సాధించిన మొనగాడిగా ఆయన నిలిచి పోయాడు.

1948లో తన చిట్టచివరి అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌ ఆడిన ధ్యాన్‌చంద్‌కు 1956లో పద్మభూషణ్‌ అవార్డు ఇచ్చి భారత ప్రభుత్వం గౌరవించింది. ధ్యాన్‌చంద్‌ ‌మరణానంతరం ఆయన పేరుతో న్యూఢిల్లీలో నేషనల్‌ ‌స్టేడియాన్ని కూడా నిర్మించారు. అంతేకాదు, ధ్యాన్‌చంద్‌ ‌పేరుతో ఓ తపాల బిళ్లను సైతం విడుదల చేయడంతో పాటు క్రీడారంగంలో జీవనసాఫల్య పురస్కార గ్రహీతలకు ఇచ్చే మేజర్‌ ‌ధ్యాన్‌చంద్‌ అవార్డును సైతం ప్రవేశపెట్టారు. అయితే, ధ్యాన్‌చంద్‌కు మరణానంతర భారతరత్న అవార్డు ఇవ్వాలంటూ ఏడాది ఏడాదికీ డిమాండ్‌ ‌పెరుగుతూ వస్తోంది. తన ఆటతీరు, వ్యక్తిత్వంతో భారత హాకీకే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఆయనకు భారతరత్న ఇవ్వాలని క్రీడాభిమానులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేస్తున్నారు. వివిధ రంగాలకు చెందిన 48 మంది ప్రముఖులు ఇప్పటి వరకూ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. భారత క్రీడారంగాన్ని కొత్తపుంతలు తొక్కించిన ధ్యాన్‌చంద్‌కు మాత్రం భారతరత్న దక్కడం లేదు.

మోదీ వైపే అందరి చూపు..

భారతరత్న ఇవ్వాలని దేశంలోని కోట్లాదిమంది క్రీడాభిమానులు, లక్షలాది మంది హాకీ ప్రియులు కోరుకొంటున్నారు. ధ్యాన్‌చంద్‌కు భారతరత్న ప్రకటిస్తే ఆ పురస్కారం గౌరవం మరింత ఇనుమడి స్తుందని క్రీడాపండితులు చెబుతున్నారు.

ఈ క్రీడాదినోత్సవం వైభవంగా జరుపుకుందాం!

కరోనా వికటాట్టహాసంతో గత మూడేళ్లుగా కుదేలైన అంతర్జాతీయ క్రీడారంగం తిరిగి పునర్వైభ వాన్ని సంతరించుకుంటోంది. అభిమానులతో కిటకిటలాడే స్టేడియాలు; చప్పట్లు, కేరింతలు, కరతాళ ధ్వనుల నడుమ ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుగుతున్న పలు రకాల క్రీడోత్సవాలలో వివిధ దేశాల క్రీడాకారులు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలతో పాటు జాతీయ క్రీడా దినోత్సవాన్ని కూడా వేడుకగా జరుపుకుంటోంది.

క్రీడారంగంపై చిన్నచూపెందుకు?

మేజర్‌ ‌ధ్యాన్‌చంద్‌ ‌జయంతి రోజైన ఆగస్ట్ 29‌న జాతీయ క్రీడాదినోత్సవాన్ని జరుపుకోడం గత కొద్ది సంవత్సరాలుగా భారతజాతికి ఓ ఆనవాయితీగా వస్తోంది. అయితే, 75 సంవత్సరాల స్వతంత్ర భారత్‌లో ఇప్పటికీ జాతీయ క్రీడాదినోత్సవం ప్రాధాన్యం ఏమిటో, అసలు ఏ రోజున జరుపు కుంటారో కూడా తెలియనివారు ఉన్నారంటే ఆశ్చర్యపోవడం మనవంతే అవుతుంది. ప్రపంచంలో అత్యధిక యువజన జనాభా ఉన్న దేశం మనది. మన జనాభాలో 60 శాతం మంది యువజనులే. అయినా క్రీడలంటే ఏ మాత్రం ఆసక్తి లేదు. వాలంటైన్స్ ‌డే, మైకేల్‌ ‌జాక్సన్‌ల పుట్టిన రోజుల గురించి ఉన్న అవగాహన, జాతీయ క్రీడాదినోత్సవం గురించి లేకపోవడం చేదునిజం.

వివిధ క్రీడలకు చెందిన మొత్తం 25 మంది అర్జున అవార్డీల బృందంతో ఇటీవలే నిర్వహించిన ఓ సదస్సులో భారత క్రీడారంగం వెనుకబాటుకు గల కారణాలు బయటకు వచ్చాయి. ఇందులో  విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. 132 కోట్ల భారత జనాభాలో 5.2 శాతం మందికి మాత్రమే క్రీడల గురించి కనీస అవగాహన ఉన్నట్లుగా ఆ సర్వే ద్వారా తేలింది. జనాభాలో సగభాగం ఉన్న మహిళల్లో కేవలం 1.31 శాతం మందికి మాత్రమే క్రీడల గురించి అవగాహన ఉందంటే ముక్కుమీద వేలేసుకోవాల్సిందే. అంతేకాదు, దేశ జనాభాలో 3.27 శాతం మంది మాత్రమే క్రీడల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు పరిశీలనలో వెల్లడైంది.

మైదానాలు లేని పాఠశాలలెన్నో..

పాఠశాల అంటే సువిశాలమైన క్రీడా మైదానం, తరగతి గదులు అన్నమాట నేటితరం పాఠశాలలకు ఏమాత్రం వర్తించదు. చిన్న చిన్న నగరాలు, పట్టణాలలో సింగిల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ‌పాఠశాలలు, డబుల్‌, ‌ట్రిపుల్‌ ‌బెడ్‌ ‌రూం కళాశాలలను చూస్తుంటే క్రీడారంగంలో భారత్‌ ఏ ‌గతిన బాగుపడుతుందన్న సందేహం రాకమానదు. భారత క్రీడారంగ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు నిపుణుల సంఘాలలో సభ్యుడిగా ఉన్న భారత హాకీ మాజీ కెప్టెన్‌ ‌జాఫర్‌ ఇక్బాల్‌ ‌సైతం ఆటలంటే ఏమిటో తెలియని నేటితరం బాలలు, పాఠశాలలు, కళాశాలలను చూసి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నేటితరం బాలలకు ఆటలు ఆడే కనీస సదుపాయాలు లేకపోవడాన్ని మించిన విషాదం మరొకటి లేదని భారత మాజీ క్రీడాదిగ్గజాలు, అర్జున అవార్డు గ్రహితలు వాపోతున్నారు. క్రీడలను నిర్బంధ పాఠ్యాంశంగా ఎందుకు చేయరని ప్రశ్నిస్తున్నారు. మన సమాజం, ప్రభుత్వాలు, క్రీడావ్యవస్థ ఆలోచనా ధోరణిలో మార్పు రానంత వరకూ భారత వెనుకబాటుతనం కొనసాగు తూనే ఉంటుందని నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నారు. ఇంటర్నెట్‌ ‌సంస్కృతి, స్మార్ట్ ‌ఫోన్‌ ‌విష కౌగిలి, పశ్చిమ దేశాల అనుకరణలో ముందున్న మన దేశంలో ప్రభుత్వాలు చొరవచూపకుంటే క్రీడాసంస్కృతి ఎండమావిగానే మిగిలిపోతుంది.

సమగ్ర క్రీడావిధానం రావాలి!

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే మనదేశంలో క్రీడలు ఉమ్మడి జాబితా అంశంగా ఉండటం ఈ రంగ అభివృద్ధికి ప్రతి బంధకంగా మారింది. కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తానికీ ఒక కీడావిధానాన్ని రూపొందిస్తే రాష్ట్రాల స్థాయిలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే ప్రత్యేక క్రీడావిధానం ఏర్పాటు చేసుకోవడం క్రీడాప్రగతిలో అసమానతలకు తావిస్తోంది. ఈ పరిస్థితిని నివారించి దేశమంతటికీ ఒకే సమగ్ర క్రీడావిధానం సిద్ధం చేయటానికి రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తీసుకుంటామని గతంలోనే క్రీడామంత్రి ప్రకటించారు. క్రీడల్ని కేంద్ర జాబితా అంశంగా చేర్చే ఆలోచన కూడా ఉందని ప్రకటించారు. అయితే ఇదంతా దశలవారీగా జరుగుతుందని చెబుతున్నారు.


క్రీడాకారుల నేస్తం మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ, విదేశాల లోని కోట్లాదిమందికి మాత్రమే కాదు, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే భారత అథ్లెట్లు, క్రీడాప్రముఖులకు స్ఫూర్తిప్రదాతగా నిలుస్తున్నారు. అహరహం శ్రమించి, అంతర్జాతీయ పోటీలలో పాల్గొంటూ దేశానికి పతకాలు, ఖ్యాతి సంపాదించి పెట్టే క్రీడాకారులతో ఎలా మసులుకోవాలో భారత ప్రధానుల్లో మోదీకి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదనడంలో అతిశయోక్తి లేదు. వివిధ క్రీడలకు చెందిన నిన్నటి, నేటితరం క్రీడాకారులతో మోదీ తనదైన శైలిలో సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. మహేంద్ర సింగ్‌ ‌ధోనీ, విరాట్‌ ‌కొహ్లీ, రవీంద్ర జడేజా, పీవీ సింధు, లక్ష్యసేన్‌, ‌మేరీ కోమ్‌, ‌మీరాబాయి చాను, నిఖత్‌ ‌జరీన్‌, ‌హిమాదాస్‌, ‌నీరజ్‌ ‌చోప్రా, పారా టీటీ బంగారు విజేత బావినా పటేల్‌, ‌బ్యాడ్మింటన్‌ ‌డబుల్స్ ‌గోల్డ్ ‌మెడలిస్ట్ ‌చిరాగ్‌ ‌శెట్టి.. ఇలా ఒకరేమిటి తనను మర్యాదపూర్వకంగా కలవటానికి వచ్చిన క్రీడాకారు లకు రెండు చేతులతో ఆహ్వానం పలుకుతున్నారు.

ప్రపంచ అథ్లెటిక్స్, ఆసియా క్రీడలు, టోక్యో ఒలింపిక్స్, ‌బర్మింగ్‌హామ్‌ ‌కామన్వెల్త్ ‌గేమ్స్, ‌చెస్‌ ఒలింపియాడ్‌.. ‌పోటీలు ఏవైనా భారత క్రీడాకారులు పోటీలలో పాల్గొనటానికి ముందు, పాల్గొని విజేతలుగా తిరిగి వచ్చిన తరువాత వారిని కలుసు కుంటూ, భుజం తడుతూ, మనోధైర్యం నింపుతూ ప్రేరణ కలిగించడంలో ప్రధాని నరేంద్రమోదీ తర్వాతే ఎవరైనా. ఒకవేళ ఓటమి ఎదురై తీవ్ర నిరాశలో కూరుకుపోయినా నేనున్నానంటూ ట్విట్టర్‌ ‌సందేశాలతో ఊరట కలిగిస్తున్నారు.

ప్రధాని మోదీని కలుసుకొని, తాము సాధించిన పతకాలు, ఘనతలను చాటుకోవడానికి క్రీడాకారులు ఉత్సాహపడుతుంటారు కూడా. టోక్యో ఒలింపిక్స్ ‌స్వర్ణపతక విజేత నీరజ్‌ ‌చోప్రా తాను విసిరే బల్లాన్నే (జావలిన్‌ ‌నే) ప్రధానికి కానుకగా ఇచ్చాడు. ప్రపంచ బాక్సింగ్‌, ‌కామన్వెల్త్ ‌గేమ్స్ ‌గోల్డ్ ‌మెడల్‌ ‌విన్నర్‌ ‌నిఖత్‌ ‌జరీన్‌ ‌సైతం ప్రధానిని కలసి సెల్ఫీ దిగడంతో పాటు, తాను ఉపయోగించే బాక్సింగ్‌ ‌గ్లోవ్స్‌లో ఓ జతను బహూకరించింది. అస్సామీ రన్నర్‌ ‌హిమదాస్‌ ‌ప్రధానిని కలిసిన సమయంలో తమ సాంప్రదాయ కండువా (గమోచా)ను కప్పి మరీ గౌరవాన్ని చాటుకుంది.

ఇటీవలే బర్మింగ్‌హామ్‌లో ముగిసిన కామన్వెల్త్ ‌గేమ్స్‌లో 22 బంగారు, 16 వెండి, 23 కంచు పతకాలతో సహా మొత్తం 61 పతకాలు సాధించడం ద్వారా భారత్‌ను పతకాల పట్టిక 4వ స్థానంలో నిలిపిన భారత అథ్లెట్ల బృందాన్ని తమ నివాసానికి పిలుపించుకొని మరీ ప్రధాని ఘనంగా సత్కరించారు. ప్రధాని స్వయంగా తమను అభినందించడం, తమ నివాసానికి ఆహ్వానించి మరీ సత్కరించడంతో భారత క్రీడాకారులు పొంగిపోతున్నారు.

అన్నట్లు.. స్వయంగా యోగాను పాటించే ప్రధాని నరేంద్ర మోదీ పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ ‌స్టేడియాన్ని ఆయన పేరుతో అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఆయనకు ఆయనే సాటి

క్రీడారంగానికి సంబంధించి భారత ప్రధానిగా నరేంద్రమోదీ పలు సాహసోపేతమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. క్రీడావిధానాలు, క్రీడాగమనం మార్చడంలో మోదీకి మోదీ మాత్రమే సాటి. దేశ అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్నను జాతీయ హాకీ పితామహుడు మేజర్‌ ‌ధ్యాన్‌చంద్‌ ‌పురస్కారంగా మార్పు చేయడంలో మోదీ తెగువ చూపారు. దేశంలోని ఎక్కువమంది క్రీడాభిమానులు రాజీవ్‌ ‌ఖేల్‌రత్న అవార్డు పేరును మార్చాలంటూ తనకు విజ్ఞప్తులు పంపారని, ఎక్కువమంది అభిప్రాయాలను గౌరవిస్తూ పురస్కారం పేరును మార్చినట్లుగా ఆయన ప్రకటించి సంచలనం సృష్టించారు.

అంతేకాదు, గౌతం గంభీర్‌ ‌లాంటి విఖ్యాత మాజీ క్రికెటర్లు, క్రీడాప్రముఖులను తమ పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా పార్లమెంటులో అడుగుపెట్టేలా చేశారు. రాష్ట్రపతి విచక్షణాధికారం కింద నామినేట్‌ ‌చేసే రాజ్యసభ సభ్యతానికి గతంలో మేరీకోమ్‌ను నామినేట్‌ ‌చేసిన మోదీ ప్రభుత్వం, ఇటీవలే కేరళకు చెందిన పరుగుల రాణి పీటీ ఉషను నామినేట్‌ ‌చేసి తన విలక్షణతను చాటుకున్నారు.

అవకాశం దొరికిన ప్రతిసారి క్రీడాప్రముఖులకు తగిన సముచిత అవకాశాలు కల్పిస్తూ భారత క్రీడారంగాన్ని మోదీ కొత్తపుంతలు తొక్కిస్తున్నారు.  అంతేకాదు, నవతరం క్రీడాకారుల్లో పలువురికి సోషల్‌ ‌మీడియా ద్వారా స్ఫూర్తిదాయకమైన సందేశాలతో ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తున్నారు. తమిళనాడు వేదికగా జరిగిన 44వ చదరంగ ఒలింపియాడ్‌ ‌విజయవంతం కావడంలో మోదీ తన వంతు పాత్ర నిర్వర్తించారు. భారత నాటి, నేటి తరం క్రీడాకారులతో మోదీ తన అనుబంధాన్ని కొనసాగిస్తూ క్రీడావర్గాల నేస్తంగా గుర్తింపు పొందారు.


మోదీ మానస పుత్రిక ‘ఖేలో ఇండియా’

కేంద్రంలో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ముందు, గత ఏడు దశాబ్దాల కాలంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా భారత క్రీడారంగం పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. దీనిని అధిగమించడానికి గత ప్రభుత్వాలు అనుసరించిన వ్యూహాలు, పథకాలను సమగ్రంగా సమీక్షించిన ప్రధాని ‘ఖేలో ఇండియా’ కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. గతంలో ఉన్న రాజీవ్‌గాంధీ ఖేల్‌అభియాన్‌, ‌పట్టణ ప్రాంతాలలో మౌలిక క్రీడాసదుపాయల కల్పన పథకం, క్రీడారంగంలో జాతీయ ప్రతిభాన్వేషణ పథకాలను మిళితం చేయడం ద్వారా ‘ఖేలో ఇండియా’ కార్యక్రమానికి తుది రూపు ఇచ్చారు.

ఈ పథకం అమలు కోసం 2018లో 1,756 కోట్ల రూపాయలతో ప్రత్యేక బడ్జెట్‌ను ఏర్పాటు చేశారు. క్రీడారంగంలో అత్యంత ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారి చదువుకు ఆటంకం కలగని విధంగా ప్రపంచ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇవ్వటానికి దేశంలోని 20 విశ్వవిద్యాల యాలను ఎంపిక చేశారు. దేశంలోని వివిధ ప్రాంతా లకు చెందిన క్రీడాకారులకు ఈ 20 విశ్వవిద్యాలయ కేంద్రాలు స్పోర్టింగ్‌ ఎక్స్‌లెన్స్ ‌వేదికలుగా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు.

నిధుల వరద

దేశంలో క్రీడారంగ సమగ్ర అభివృద్ధి కోసం ప్రధాని మోదీ నేతృత్వంలో ఓ సమర్థవంతమైన ప్రణాళికను ఆచరణలోకి తెచ్చారు. నిధులు అందుబాటులో ఉంచడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 2019-2020 సంవత్సరానికి ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ ‌బడ్జెట్‌లో సైతం క్రీడల కోసం 214 కోట్ల 20 లక్షల రూపాయలు కేటాయించారు. ఇందులో భారత క్రీడాప్రాధికార సంస్థకు 450 కోట్ల రూపాయలు, క్రీడాకారుల ప్రోత్సాహక నిధికి 89 కోట్ల రూపాయలు, జాతీయ క్రీడా సమాఖ్యలకు 245 కోట్ల రూపాయలు, ఖేలో ఇండియా కార్యక్రమానికి 550 కోట్ల 69 లక్షల రూపాయలు అందుబాటులో ఉంచారు. 2021-22 సంవత్సరానికి రూపొందిం చిన కేంద్ర బడ్జెట్‌లో ఖేలో ఇండియాకు 657. 71 కోట్ల రూపాయలు కేటాయించారు.

మూడంచెలుగా శిక్షణ

అధునాతన శిక్షణ సదుపాయాలతో పాటు ప్రపంచ ప్రమాణాలతో తీర్చిదిద్దే శిక్షకులు సైతం ఈ కేంద్రాలలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అట్టడుగు స్థాయి నుంచే ప్రతిభా వంతులైన క్రీడాకారులను గుర్తించి శిక్షణతో పాటు విద్యాసదుపాయాలనూ అందిస్తారు. దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు, వ్యవస్థలు స్పోర్టస్ ఎక్స్‌లెన్స్ ‌కేంద్రాలతో అనుసంధానమై ఉంటాయి. అంతేకాదు, వివిధ క్రీడలకు సంబంధించిన తాజా సమాచారం తెలుసుకోవడానికి వీలుగా ప్రత్యేక యాప్‌లను కూడా కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ అందుబాటులోకి తెచ్చింది.

ఎంపిక చేసిన విశ్వవిద్యాలయాలలోని క్రీడా మైదానాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం, అత్యాధునిక శిక్షణ సౌకర్యాలు అందుబాటులో ఉంచడం, క్రీడాశిక్షకుల పరిజ్ఞానాన్ని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగు పరచడం ఖేలో ఇండియాకు ఆయువు పట్టుగా ఉన్నాయి. పదేళ్ల నుంచి పద్దెనిమిదేళ్ల వయసున్న ప్రతిభావంతులైన బాలలు, యువతీ యువకులను గుర్తించి ఎంపిక చేసిన క్రీడలతో పాటు చదువులోనూ రాటుదేలేలా చేయటమే ఖేలో ఇండియా ప్రధాన లక్ష్యం.

భారీగా ఉపకార వేతనాలు

ఖేలో ఇండియా స్కూల్‌ ‌గేమ్స్‌లో పాల్గొన్న వారిలో అసాధారణ ప్రతిభావంతులైన వెయ్యిమందికి నెలకు 500 నుంచి 2 వేల రూపాయల వరకూ ఉపకారవేతనంగా అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. వివిధ క్రీడల్లో శిక్షణ కోసం ఎంపిక చేసిన వెయ్యి మంది క్రీడాకారులకు ప్రపంచ ప్రమాణాలతో కూడిన క్రీడాశిక్షణ, చదువు, ఆహారం, వసతి సదుపాయాలు కల్పించారు. 2018లో ప్రారంభమైన ఖేలో ఇండియా స్కూల్‌ ‌గేమ్స్ ‌పథకం కోసం 50 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. ఈ మొత్తాన్ని ఆ తర్వాతి కాలంలో ఏడాదికి 10 కోట్ల రూపాయలు చొప్పున పెంచుతూ వస్తున్నారు. శిక్షణ కోసం బాలబాలికల సంఖ్యను సైతం ఏడాది ఏడాదికీ పెంచుతున్నారు.

చిన్న వయసులోనే ప్రతిభను గుర్తించి, అత్యున్నత శిక్షణ, నిరంతర పర్యవేక్షణతో ఒలింపిక్స్ ‌స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దటమే నరేంద్ర మోదీ మానస పుత్రిక ఖేలో ఇండియా అంతిమ లక్ష్యం. ఈ దేశంలోని బాలలంతా తమకు నచ్చిన ఏదో ఒక ఆట ఆడితే ఖేలో ఇండియా లక్ష్యం నెరవేరినట్లే. న్యూఢిల్లీ, మహారాష్ట్ర, పంచకుల వేదికలుగా ముగిసిన ఖేలో ఇండియా క్రీడల ద్వారా మెరికల్లాంటి పలువురు క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు. దేశంలోని వేలాది యువ క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకోవడానికి ఖేలో ఇండియాను వేదికగా చేసుకోగలిగారు.

గత ఐదేళ్లుగా అమలు చేస్తూ వస్తున్న ఖేలో ఇండియా కార్యక్రమాల ద్వారా వెలుగులోకి వచ్చిన పలువురు యువక్రీడాకారులు గత కొద్ది సంవత్స రాలుగా జరిగిన ఆసియా క్రీడలు, టోక్యో ఒలింపిక్స్, ‌బర్మింగ్‌హామ్‌ ‌కామన్వెల్త్ ‌గేమ్స్, ‌ప్రపంచ జూనియర్‌ ‌కుస్తీ, ట్రాక్‌ అం‌డ్‌ ‌ఫీల్డ్‌వంటి క్రీడోత్సవాలలో భారత్‌కు బంగారు పతకాలు అందించగలిగారు.

About Author

By editor

Twitter
Instagram