న్యూస్‌వీక్‌ ముఖాముఖీలో ప్రధాని నరేంద్ర మోదీ

భారత్‌ ఇప్పుడు ఆర్థికాభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. మన జనాభా చైనాను అధిగమించింది. సాధించిన దౌత్య విజయాలు, శాస్త్ర సాంకేతిక పురోగతి, సైనిక పాటవం అమెరికా సహా ప్రపంచం భారత్‌ ప్రాధాన్యాన్ని గుర్తించక తప్పని పరిస్థితులు కల్పించాయి. ఈ సమూల మార్పులకు కేంద్ర బిందువు భారత ప్రధాని నరేంద్ర మోదీ. 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కావచ్చు, ఇతర కారణాలతో కావచ్చు. అమెరికా వారపత్రిక ‘న్యూస్‌వీక్‌’ మోదీతో ముఖాముఖీ నిర్వహించింది. గంటన్నర పాటు సాగిన ఈ ముఖాముఖీలో పత్రిక సంపాదక వర్గం రాసిచ్చిన ప్రశ్నలకు మోదీ సమాధానాలు ఇచ్చారు. న్యూస్‌వీక్‌ ప్రెసిడెంట్‌, సీఈఓ దేవ్‌ ప్రగడ్‌, గ్లోబల్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ నాన్సీ కూపర్‌, ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ (ఆసియా) దానిష్‌ మంజూర్‌ భట్‌ ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. ఆర్ధికాభివృద్ధి, అయోధ్య, విదేశీ వ్యవహారాలు, పాక్‌-చైనా సంబంధాలు, దేశంలో పత్రికా స్వేచ్ఛ లేదన్న విమర్శ, మౌలిక సదుపాయాల కల్పన, పర్యావరణం, ముస్లింలకు ప్రాతినిధ్యం వంటి అంశాలపై మోదీ సమాధానాలు ఇచ్చారు.

మోదీ అన్‌స్టాపబుల్‌ శీర్షికతో (నిలువరించడం సాధ్యం కాని) వెలువడిన ఈ ముఖాముఖీలోని కొన్ని అంశాలు:

అయోధ్య ప్రాధాన్యం గురించి

జాతీయతా స్పృహ మీద రాముని పేరు లిఖితమైంది. మా నాగరికతలోని విలువలను, ఆలోచనలను ఆయన జీవితం తీర్చిదిద్దింది. మా పుణ్యభూమి అంతటా ఆయన పేరే ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ప్రాణప్రతిష్ఠ వేళ నేను 11 రోజుల దీక్షలో ఉన్నప్పుడు రాముని పాదస్పర్శను అనుభవించిన క్షేత్రాలన్నింటిని చూశాను. మా అందరిలో రాముడి పట్ల ఎంత భక్తి ఉన్నదో ఆ యాత్రతో తెలిసింది. రాముడు తిరిగి తన స్వస్థలానికి రావడం అంటే భారతజాతి ఐక్యతలో చరిత్రాత్మక ఘట్టం. ఆలయ నిర్మాణం, ప్రాణప్రతిష్ఠ శతాబ్దాల ఓరిమి, త్యాగాలకు పతాకస్థాయి. బాలరాముడు తన స్వస్థలానికి తిరిగి రావాలని కోరుకుంటున్న 1.4 బిలియన్‌ భారతీయుల ప్రతినిధిగానే ప్రాణప్రతిష్ఠలో పాల్గొంటున్నానని నన్ను ఆహ్వానించినప్పుడే అనుకున్నాను. ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్న అసంఖ్యాక రామభక్తుల ఆకాంక్షలను మోసుకుంటూ నేను అక్కడికి వెళ్లాను.ఆ కార్యక్రమం దీపావళితో పాటు జాతి అంతా ఐక్యంగా ఉత్సవం జరుపుకునేటట్టు చేసింది. ప్రతి ఇంటా రామజ్యోతి వెలిగింది.

మోదీ ముద్ర

నన్ను ప్రజలు ఏ విధంగా గుర్తు పెట్టుకుంటారో ఆలోచించడం నా పని కాదు. అలాంటి ఆలోచనతో నేను లేను కూడా.

రాబోయే ఎన్నికలు

హామీలు నెరవేర్చిన ప్రభుత్వంగా మాకు మంచి పేరు ఉంది. ఈ విషయంలో ప్రజలు చాలా పట్టింపుతో ఉంటారు. ఎందుకంటే గతంలో ప్రభుత్వాలు హామీలు ఇచ్చాయి కానీ, వాటిని నెరవేర్చిన దాఖలాలు లేవు. మా ప్రభుత్వం సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌ , సబ్‌కా విశ్వాస్‌, సబ్‌కా ప్రయాస్‌ లక్ష్యంతో పని చేసింది. అంటే అంతా కలసి అందరి అభివృద్ధికి, అందరి విశ్వాసంతో, అందరి కృషితో పురోగమించాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో 11వ స్థానం నుంచి భారత్‌ ఐదో స్థానానికి ఎగబాకిన వైనాన్ని ప్రజలు గమనించారు. ఇవాళ భారతీయుల ఆశయం ఏమిటీ అంటే, ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకోవాలి.

మా కూటమి రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రపంచంలో జరిగిన పరిణామాలు గమనార్హమైనవి. చాలా ప్రభుత్వాలు అప్పటిదాకా ఉన్న ప్రజాబలాన్ని కోల్పోవడం మొదలయింది. గడచిన కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోని ఆయా ప్రభుత్వాల మీద అసంతృప్తి ప్రబలింది. ఇందుకు భారత్‌ మాత్రం మినహాయింపు. ఇక్కడ మా ప్రభుత్వానికి ప్రజా మద్దతు పెరుగుతున్నది.

ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ

మా రాజ్యాంగం చెప్పింది కాబట్టి మేము ప్రజా స్వామికవాదులం కాలేదు. అది మా వారసత్వంలోనే ఉంది.

భారత్‌ ప్రజాస్వామ్యానికి కన్నతల్లి వంటిది. తమిళనాడులోని ఉత్తర మేరూర్‌ శిలాశాసనాలలో 1100-1200 సంవత్సరాలుగా పాటిస్తున్న భారత ప్రజాస్వామిక విలువలు ఎలాంటివో ఉటంకించారు. అలాగే మా పురాతన గ్రంథాలు కూడా. ఇక్కడ విస్తృత సంప్రతింపుల వ్యవస్థల ద్వారానే రాజకీయ వ్యవస్థలు పాలన సాగించాయని చెప్పే ఉదాహరణలు వాటిలో కనిపిస్తాయి. ప్రపంచంలోనే అతి పెద్ద మా ప్రజాస్వామిక వ్యవస్థలో 2019 నాటి సాధారణ ఎన్నికల వేళ 600 మిలియన్‌ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాబోయే కొన్ని నెలలోనే 970 మిలియన్‌ల అర్హులైన ఓటర్లు తమ వయోజన ఓటింగ్‌ హక్కును వినియోగించుకుంటారు. దేశం మొత్తం మీద పది లక్షలకు పైగా పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు.

పోలింగ్‌లో పాల్గొనే ఓటర్ల సంఖ్య నిరంతరాయంగా పెరగడం అంటే ప్రజలకు భారత ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉందని చెప్పే ప్రశంసా పత్రం వంటిది.

భారత్‌ వంటి దేశంలో ప్రజాస్వామ్యం ఇంత ప్రభావవంతంగా పనిచేస్తున్నదంటే అందుకు కారణం ఇక్కడ పాలన గురించి మంచిచెడ్డలు తెలిపే ఒక యంత్రాంగం ఉండడం వల్లనే. ఈ విషయంలో మా మీడియా సహకారం కూడా ఉన్నది. మాకు 1.5 లక్షల రిజిస్టర్డ్‌ ప్రచురణ సంస్థలు, వందల సంఖ్యలో న్యూస్‌ చానల్స్‌ ఉన్నాయి.

అయితే భారత్‌లో కొందరు, పాశ్చాత్య దేశాలలో కొందరు ఈ దేశ ప్రజలతో సంబంధం కోల్పోయారు. భారతీయుల ఆలోచనా పద్ధతి, భావనలు, ఆకాంక్షలను గమనించే విషయంలో వారు దూరంగా జరిగారు. ఇలాంటి వాళ్లే పత్రికా స్వేచ్ఛ అడుగంటుతున్నదని ఆరోపిస్తున్నారు.

మౌలిక సదుపాయాల కల్పనా రంగం, పర్యావరణం

గడచిన పదేళ్లలో మా జాతీయ రహదారుల వ్యవస్థ 60 శాతం వృద్ధి చెందింది. 2014లో 91,287 కిలోమీటర్లు (56,723 మైళ్లు) ఉన్న ఈ వ్యవస్థ, 2023 నాటికి 1,46,145 కిలోమీటర్లకు (90,810 మైళ్లు) విస్తరించింది. మా విమానాశ్రయాల సంఖ్య రెట్టింపు కంటే మించింది. 2014లో 74 విమానాశ్రయాలు ఉంటే, 2024లో వాటి సంఖ్య 150కి చేరుకుంది. అలాగే సాగరమాల పథకం ద్వారా మా నౌకాశ్రయాలు సామర్థ్యాన్ని కూడా పెంచుకున్నాం. మా ప్రయాణికుల సౌకర్యం కోసం టెక్‌ స్మార్ట్‌ ‘వందే భారత్‌’ రైళ్లు వేసుకున్నాం. ఉడాన్‌ పథకంతో సామాన్య భారతీయుడు కూడా విమానంలో ప్రయాణించే సదుపాయం కల్పించు కున్నాం. నగర, పట్టణ ప్రాంత రవాణాను సరళం చేసేందుకు మరిన్ని మెట్రో లైన్‌ల నిర్మాణం మీద దృష్టి పెట్టాం. ఇటీవలనే మా వైమానిక వ్యవస్థ వేయి విమానాల కోసం ఆర్డర్‌ ఇచ్చింది. దీనిని బట్టి మా పౌర విమానయాన వ్యవస్థ ఎంత పురోగమించిందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే మా భౌతిక సదుపాయాల కల్పనకూ, పర్యావరణ మార్పుల పోరాటానికీ మధ్య ఎలాంటి ఘర్షణ లేదు. రూఫ్‌టాప్‌ సౌర విద్యుత్‌ పథకంతో పది మిలియన్‌ గృహాలకు విద్యుత్‌ వెలుగులు అందాయి. సౌర విద్యుత్‌తో నడిచే పంపులతో రైతుల సాధికారత సాధ్యం చేశాం. 400 మిలియన్‌ల విద్యుత్‌ సామర్థ్యం కలిగిన బల్బులు అందించాం. ఇవన్నీ పర్యావరణ పరిరక్షణకే. 2014 నుంచి భారత్‌ తన సౌర విద్యుత్‌ సామర్థ్యానికి తోడు, రెన్యువబుల్‌ ఎనర్జీ మీద పెట్టుబడులను పెంచుకుంది. తద్వారా 2014లో 2,820 మెగావాట్‌ సామర్థ్యం ఇప్పుడు 72,000 మెగావాట్‌కు చేరుకుంది.

మేం పరిణామాత్మక ఆర్థిక సంస్కరణలు చేపట్టాం. జీఎస్‌టీ, కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, దివాలా కోడ్‌, కార్మిక చట్టాలలో సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సరళం చేయడం అందులో ఉన్నాయి. దీనితో వ్యాపారం రంగంలో మంచి పురోగతి సాధ్యమైంది. దేశంలో వస్తువుల తయారీ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఉత్పత్తి ఆధారిత పథకాలను తేవడానికి చొరవ చూపాం. ఈ పథకాలను ఎలక్ట్రానిక్స్‌, సోలార్‌ మాడ్యూల్స్‌, వైద్యరంగ పరికరాలు, ఆటోమొబైల్‌ వంటి 14 రంగాలకు అందుబాటులోకి తెచ్చాం.

ఆర్థిక పురోగతిని స్థిరం చేయడం, ప్రవాస భారతీయుల సేవలు వంటి అంశాలు కూడా ప్రధాని ప్రస్తావించారు.

మహిళలకు ప్రాధాన్యం

నేటి భారత పురోగతి కథనంలో అగ్రభాగాన నిలిచినవారు మహిళలే. మహిళా అభివృద్ధి అని కాకుండా, మహిళల ఆధ్వర్యంలోని అభివృద్ధి అని మేం పదబంధాన్ని మార్చాం. మీరు కూడా అదే పదం ఉపయోగించడం నన్న సంతోషింప చేసింది. రాష్ట్ర శాసనసభలలో, పార్లమెంట్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే చట్టం తెచ్చాం. మరొక 15 శాతం మహిళలు ఈ లోక్‌సభ ఎన్నికలలో ఓటు వేసే హక్కు పొందారు. సైనిక దళాలు సహా పలు రంగాలలో ఇవాళ దేశంలో మహిళలు ప్రాతినిధ్యం పొందారు. పేద మహిళల కోసం 285 మిలియన్‌ల బ్యాంకుల ఖాతాలు మా ప్రభుత్వం తెరించింది. 300 మంది మహిళా పారిశ్రామిక, వాణిజ్య వేత్తలకి ఉచిత రుణాలు ఇచ్చింది. నమో డ్రోన్‌ దీదీ పథకం, లక్షాధికారి దీదీ పథకం వంటి వాటితో వారు లబ్ధి పొందారు. దేశంలోని పైలట్లలో 15 శాతం మహిళలు. ఇది ప్రపంచంలోనే పెద్ద సంఖ్య. మహిళా కార్మికుల శాతం కూడా పెరిగింది. 2017లో 23 శాతం ఉన్న వారి వాటా 2023 నాటికి 37 శాతానికి చేరుకుంది.

చైనా, క్వాడ్‌ల గురించి

మనకి ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాలు కూడిన చాలా వేదికలు ఉన్నాయి. అలాగే క్వాడ్‌ ఒకటి. ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు. ఎస్‌సీఓ, బ్రిక్స్‌ వంటిదే ఇది కూడా. ఒక సానుకూల అజెండాతోనే క్వాడ్‌ పనిచేస్తున్నది. భారత్‌ వరకు చైనాతో సంబంధాలు చాలా ముఖ్యమైనవి, ప్రాధాన్యం కలిగినవి. సుదీర్ఘ కాలంగా అపరిష్కుృతంగా ఉన్న సమస్యలు తక్షణం పరిష్కారం కావాలి. ఇరు దేశాల మధ్య స్థిరమైన, శాంతియుతమైన సంబంధాలు కొనసాగడం మా రెండు దేశాలకే కాదు, ప్రపంచానికి, ఈ ప్రాంతానికి కూడా ముఖ్యమే. మేం సరిహద్దులలో శాంతిని నెలకొల్పగలమనే నమ్మకం నాకు ఉంది.

పాకిస్తాన్‌ గురించి

కొత్త ప్రధానికి నా అభినందనలు. ఈ ప్రాంతంలో శాంతిసౌభాగ్యాలు ఏర్పడాలని, భద్రత ఉండాలని చెబుతాను. అలాగే హింస, ఉగ్రవాదాలకు ఈ ప్రాంతం దూరంగా ఉండాలి. అయితే పాక్‌ అంతర్గత అంశాల గురించి నేను వ్యాఖ్యానించను.

370 రద్దు విమర్శల గురించి

క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అర్ధం చేసుకోవడానికి మీరు (న్యూస్‌వీక్‌ బృందం) పర్యటించాలని, అక్కడ ఏర్పడిన సానుకూల వాతావరణం చూడాలని నేను ఆకాంక్షిస్తాను. నేను గడచిన మాసంలోనే జమ్ముకశ్మీర్‌లో పర్యటించాను. మొదటిసారి అక్కడి ప్రజలు తమ జీవితాల పట్ల ఆశావహంగా ఉన్నారు. అభివృద్ధి, మంచి పాలన, సాధికారత వంటి అంశాల పట్ల వారిలో నమ్మకం కలుగుతున్నదనే అనిపిస్తున్నది.

శాంతి నెలకొనడం వల్ల వచ్చే లాభాలను వారు పొందుతున్నారు. ఒక్క 2023లోనే 21 మిలియన్‌ పర్యాటకులు జమ్ము కశ్మీర్‌ను సందర్శించారు. ఉగ్రవాదప్రేరిత ఘటనలు గణనీయంగా తగ్గి పోయాయి. బంద్‌లు, హర్తాళ్లు, రాళ్లు విసరడం తగ్గిపోయాయి. ఒకప్పుడు సాధారణ జీవితాన్ని అస్తవ్యస్తం చేసిన ఈ దుర్ఘటనలు ఇక గతం. మహిళల జీవితంలో నవోదయం జరిగింది. పురుషులతో సమంగా ఆస్తి హక్కు అనుభవిస్తున్నారు. 370 అధికరణం రద్దు తరువాత అక్కడ అంతర్జాతీయ కార్యక్రమాలు`ఫార్ములా 4 రేసింగ్‌, జీ 20 సమావేశాలు వంటివి` నిర్వహించే వాతావరణం ఏర్పడిరది.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE
Instagram