ఆగస్ట్ 29 ‌బలరామ జయంతి

– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌కృష్ణాగ్రజుడు బలదేవుడిని వైకుంఠవాసుడి ఏడవ అవతారంగా భాగవతం పేర్కొంటుండగా, ‘రామో రామశ్చ రామశ్చ’ అని దశావతారాలలో ఒకరుగా పరిగణిస్తారు. ఆయన కర్షక ప్రతినిధి. ‘పొలాలనన్నీ, హలాల దున్నీ, ఇలాతలంలో హేమం పిండగ, జగానికంతా సౌఖ్యం నిండగ, విరామమెరుగక పరిశ్రమించే, బలం ధరిత్రికి బలికావించే’ అని ఆధునిక కవి శ్రీశ్రీ అన్నట్లు హలధారియై అనావృష్టి నివారణకు అహరహరం శ్రమించాడు. అధర్మాన్ని నిరసించడం, తామసం, ముక్కుసూటితనం ఆయన నైజం.


బలరాముని అవతార విశేషాలు శ్రీమద్భాగ వతంలోని దశమస్కంధంలో కనిపిస్తాయి. రోహిణి తనయుడిగా పేరున్న ఆయన దేవకీనందనుడు కూడా. ఇద్దరు తల్లుల పుత్రుడు కావడం విశేషం. ‘నీ సోదరి దేవకి అష్టమగర్భ సంజాతుడు నీ మృత్యు కారకుడవుతాడు’ అని అశరీరవాణి కంసుడిని హెచ్చ రించడంతో ఆయన అప్రమత్తమై సోదరిని, బావ మరిది వసుదేవుడిని ఖైదు చేయించాడు. వారి ఆరుగురు శిశువులను కంసుడు సంహరించిన తరు వాత ఏడవ గర్భం సమయంలో శ్రీమన్నారాయణుడు విచిత్ర సన్నివేశాన్ని ఆవిష్కరించాడు. యోగమాయ సహకారంతో దేవకీదేవి గర్భస్థ పిండాన్ని వసుదేవుడి మరో భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెట్టాడు. ఈ పక్రియను ‘సంకర్షణం’ (బాగా లాగడం) అంటారు. అలా పిండ మార్పిడితో జనించడం వల్ల బలరాముడు ‘సంకర్షణుడు’గా ప్రసిద్ధుడయ్యాడు. పురాణాల ప్రకారం, శ్రీమన్నారాయణుడి శ్వేతతేజస్సు బలరాముడిగా, నీలతేజస్సు శ్రీకృష్ణుడిగా ప్రభవించాయి. శ్రీమహా విష్ణువు కేశసంపదలోని ఒక తెల్లటి దానిని రోహిణి గర్భంలోకి , నల్లటి దానిని దేవకీ గర్భంలోకి ప్రవేశ పెట్టారని, అందుకే సోదరులు తెలుపు, నలుపు రంగులతో పుట్టారనే కథనం ప్రచారంలో ఉంది. బలవంతులలో శ్రేష్ఠుడు కనుక బలదేవుడని, బలిష్టంగా, అందంగా ఉంటాడు కనుక బలరాము డని, నీలవస్త్రధారుడు కనుక నీలాంబరుడని, తాళవృక్ష ధ్వజం కలిగి ఉండడంతో తాళంకుడని, ప్రలంబుడనే రాక్షసుడిని సంహరించినందుకు ప్రలంబుఘ్నడని ఆయన ప్రసిద్ధుడు. నైమిశారణ్యంలో మునులను బాధిస్తున్న బల్వలుడనే రాక్షసుడిని హలాయుధంతో సంహరించాడు.

బలరాముడు భీమ దుర్యోధనులకు గదా యుద్ధంలో శిక్షణ ఇచ్చాడు. దుర్యోధనుడు ఈ విద్యను మరింత శ్రద్ధగా, పట్టుదలగా నేర్చాడు. ద్రౌపదీ వస్త్రా పహరణం సందర్భంగా, ఆమెను అవమానించిన దుర్యోధనుడి తొడలు విరగకొడతానన్న భీముడి ప్రతిజ్ఞ నుంచి తప్పించుకునేందుకు పాండవుల వనవాసం సమయంలో దుర్యోధనుడు గదాయుద్ధ విద్యను మరింత మెరుగుపరుచుకున్నాడు. బలరాముడి వద్ద ప్రత్యేకంగా శిక్షణ పొందాడు.

బలరాముడికి తమ్ముడు కృష్ణుడంటే ఎంతో వాత్సల్యానురాగాలతో పాటు ఆయన పాండవ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారనే కినుక ఉండేది. అలా అని తమ్ముడికి ఇబ్బంది కలిగించే చర్యలకు దిగలేదు. కురుక్షేత్రం సంగరంలో శ్రీకృష్ణుడు పార్థుడికి సారథ్యం వహించడానికి అంగీకరించినప్పుడు, దుర్యోధనుడు తనకు ప్రియశిష్యుడే అయినా, ధార్తరాష్ట్రులు, పాండవులు ఆప్తులనే భావనతో ఏ పక్షానికీ సహకరించేందుకు ఇష్టపడలేదు. తటస్థ వైఖరి అవలంబించారు. కురుక్షేత్ర యుద్ధకాలంలో తీర్థ యాత్రలకు బయలుదేరి వెళ్లాడు. బలరాముడికి  యతులు, తీర్థయాత్రలంటే మక్కువ. ఆయన తీర్థయాత్రలు మహా భారతంలో విశేషంగా వర్ణితమయ్యాయి. అదీగాక, ‘యథా యథాహి ధర్మస్య…’ అని కృష్ణుడే చెప్పినట్లు, ఈ రణంలో కొన్నికొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవచ్చని ముందే ఊహించి ఉంటారని కూడా జ్ఞానులు వ్యాఖ్యానిస్తారు. కురుక్షేత్ర సంగ్రామం దాదాపు ముగిసి, భీమ దుర్యోధనుల గదాయుద్ధం సమయానికి బలరాముడు తిరిగి వచ్చాడు. భీముడు తన ప్రతిజ్ఞ నెరవేర్చు కున్నాడు. అందుకు ‘శ్రీకృష్ణోపదేశ’మూ సహకరిం చింది. అదే బలభద్రుడికి నచ్చని విషయం. గదా యుద్ధంలో నాభికి దిగువభాగాన కొట్టరాదన్న యుద్ధ నీతిని భీముడు ధిక్కరించాడన్న ఆగ్రహంతో బలరాముడు ఆతనిపై హలాయుధాన్ని ప్రయోగించ బోయాడు. పాండవుల పట్ల దుర్యోధనుడి దుర్నీతి, దుశ్చర్యలను తమ్ముడు కృష్ణుడు ఏకరవు పెట్టడంతో అక్కడి నుంచి మౌనంగా నిష్క్రమించాడు.

గాంధారి శాపఫలితంగా కృష్ణభగవానుడు శరీర త్యాగం చేసే సమయంలోనే బలదేవుడు ఒక చెట్టు నీడన ధ్యానం చేస్తుండగా, ఆయన నోటి నుంచి వెలువడిన తెల్లని పాము సముద్రంలో చేరింది. ఆ వెంటనే ఆయన శరీరం నేలకు ఒరిగింది.

ముందు యుగం( త్రేతా)లో శ్రీరామచంద్రుడిని ‘రామానుజుడి’ (లక్ష్మణుడు)గా సేవించి, తరువాతి యుగం(ద్వాపర)లో కృష్ణాగ్రజుడుగా సేవలందు కున్నాడు. ముందు జన్మలో రామలక్ష్మణుల మాదిరిగా, ద్వాపరంలో బలరామకృష్ణులుగా వారిది అవినాభావ సంబంధం. సమాధి స్థితిగా చెప్పే యోగమార్గంలోని అష్టాంగ స్థాయిలోని ఎనిమిదో సోపానం కృష్ణ భగవానుడు అయితే, దానికి ముందు మెట్టు బరాముడని ప్రవచనకర్తలు అభివర్ణిస్తారు. అయితే లక్ష్మణుడు అన్నను సర్వకాల సర్వావస్థలతో వెన్నంటి ఉంటే, బలరాముడి విషయంలో కొంత భిన్నత్వం కనిపిస్తుంది. తమ్ముడి పక్కన అన్న కనిపించలేదు అంటే ఒక విశేష ఘట్టానికి తెరలేస్తుందని అర్థం. సుభద్రార్జునుల కల్యాణం వంటి ముఖ్య ఉదంతాలు అందుకు ఉదాహరణలుగా చెబుతారు.

కొన్నిచోట్ల బలరాముడు తమ్ముడితో పూజలందు కుంటుండగా, పూరీక్షేత్రంలో అనుజుడు జగన్నాథుడు (శ్రీకృష్ణుడు), చెల్లెలు సుభద్రతో కొలువుదీరాడు. అక్కడి వార్షిక రథయాత్రలోనూ ఆయన రథమే ముందుంటుంది.

About Author

By editor

Twitter
Instagram