– బంకించంద్ర చటర్జీ

మహేంద్రుడు బయటకు వెళ్లిపోయాడు. జనశూన్యమైన. ఆ ఇంటిలో కళ్యాణి కూతురుని దగ్గర పెట్టుకుని ఒక్కతే వుండిపోయింది. ఆమె నాలుగువైపులా పరికించసాగింది. ఆమె మనస్సులో భయం వంటి భావం అంకురించింది. ఈ ప్రాంతాలలో ఎవరూలేరు. మానవ మాత్రులు ఎక్కడా తిరుగుతున్న శబ్దమే వినరావడం లేదు. అప్పుడప్పుడు కుక్కలు, నక్కలు అరుస్తూ వున్న సవ్వడి వినవస్తోంది. ఆమె ఇలా ఆలోచించసాగింది ‘‘వారిని ఎందుకలా బయటకు వెళ్లనిచ్చాను? మరికొంతసేపు ఆకలి బాధకు తట్టుకుంటే సరిపోయేదికదా!’’ కొంత సమయం గడిచిన తరువాత ఆమెకు మరో ఆలోచన వచ్చింది ‘‘నాలుగువైపులా తలుపులు బిగించి వేస్తాను.’’

కాని ఆమె చూడగా ఒక తలుపుకు కూడా గడియగాని, గొళ్లెంగాని వున్నట్లు అనిపించలేదు. ఆమె ఈ ప్రయత్నంలో నాలుగువైపులా తిరుగుతూ వుండగా, ఎదురుగా వున్న ద్వారం నుండి ఒక మనుష్యాకృతి వంటి నీడ వచ్చిపడింది. కంకాళమాత్ర మయిన నల్లని, నగ్న, వికటాకార మనుష్యమూర్తి తలుపు దగ్గర నిలబడింది. ఈ మూర్తి కొన్ని క్షణాలకు తన చేతిని బారసాచి ఎవరినో పిలచినట్లు సంజ్ఞ చేసింది. కళ్యాణి ప్రాణాలు ఎగిరిపోయినట్లు అనిపించింది. కంకాళం సంజ్ఞ చేయడంతోటే, మరొక మూర్తి అదే ఫక్కీలో వున్నది వచ్చి మొదటి మూర్తి ప్రక్కన నిలవబడింది. మరొకటి మరొకటి వచ్చి నిలబడినాయి. అలా ఎన్నో వచ్చి నిలచినాయి. అంధకారబంధురమైన ఆ గృహం శ్మశాన సదృశం అయింది. ఈ కంకాళమూర్తులు కళ్యాణికి, అమ్మాయికి చుట్టూ వలయాకారంలో నిలబడ్డాయి. కళ్యాణి భయంతో కెవ్వున కేకవేసి మూర్ఛపోయింది. ఒక కంకాళం కళ్యాణిని, అమ్మాయిని ఎత్తుకుని బయటకు నడిచింది. పొలాలను దాటి, అరణ్యంవైపు పరుగుతీసింది.

కొంత తడవుకు మహేంద్రుడు పాలు తీసుకుని వచ్చాడు. అక్కడ తన భార్య, కుమార్తె అగుపించలేదు. ఇంకెవరూ కనిపించడం లేదు. భార్యను, పిల్లను పేరు పేరున పిలువసాగాడు. ఎటువంటి బదులు రాలేదు. వారి జాడ తెలియలేదు.

3

దొంగలు కళ్యాణిని ఎత్తుకుపోయి ఒక వనంలో దించారు. ఆ వనం చూడటానికి మనోహరంగా వున్నది. ఆ శోభను చూడటానికి అక్కడ వెన్నెల లేదు. తనివితీర చూచి ఆనందించే కన్నులు కూడ అక్కడలేవు. దరిద్రుని హృదయ సౌందర్యంలాగ ఆ వనసౌందర్యం కూడా వైభవం అనుభవం లేక మోడు వారి పోయి వున్నది. దేశంలో ఆహార ద్రవ్యాలు లేవు. అయినా యీ వనంలో చెట్లు చిగిర్చి పూలు పూస్తున్నాయి. పూల సుగంధం యీ అంధకారంలో కూడా బహు దూరం వ్యాపిస్తోంది. అటువంటి వనసీమలో దొంగలు కళ్యాణిని, ఆమె కుమార్తె సుకుమారిని దిగవిడిచినారు. దొంగలు ఈ ఇద్దరి చుట్టూ వలయాకారంగా కూర్చున్నారు. ‘ఈ మనుష్యులను యేమి చేయాలి’ అనే విషయం తమలో తాము చర్చించుకోసాగారు. కళ్యాణి వంటిమీద వున్న అలంకార ఆభరణాలను దొంగలు ముందుగానే హస్తగతం చేసుకున్నారు. దొంగలలో ఒక ముఠా ఈ నగలను పంచుకోవడం అనే వ్యవస్తలో మునిగిపోయారు. ఈ పంచుకునే కార్యక్రమం అయిపోయిన మీదట ఒక దొంగ ఇలా అన్నాడు: ‘‘మనం ఈ వెండి, బంగారాలు తీసుకుని ఏం జుర్రుకుంటాము? ఒక నగ తీసుకుని నాకు ఒక గుప్పెడు ఆహారం పెట్టండి. ఆకలి బాధకు నా ప్రాణాలు ఎగిరిపోయేట్లుగా వున్నాయి. ఈ రోజు ఉదయం నేను నాలుగు ఆకులు అలములు తిన్నాను. అంతే’’

ఒక దొంగ ఇలా బాహాటంగా అనడంతోటే తతిమ్మా దొంగలుకూడా యిదే ధోరణి సాగించారు. వారి యజమానికి వారినందరినీ సమాధానపర్చడం సాధ్యం కాకుండా వచ్చింది.

‘‘అన్నం పెట్టు. బియ్యం ఇవ్వు. ఆకలితో చచ్చిపోతున్నాం! ఈ వెండి, బంగారాలు మాకు అక్కరలేదు’’ అంటూ గందరగోళంగా తయారయింది అక్కడి వాతావరణం. దళపతి వాళ్లను శాంత పరచటానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాని ఎవరు వింటారు? క్రమంగా ఉచ•స్వేరంలో మాట్లాడసాగారు అందరూ. ఒకడినొకడు తిట్టుకోవడం, కొట్టుకోవడం జరుగుతోంది. అందరూ కలిసి దొంగల నాయకుడిని, తమ దళపతిని కొట్టనారంభించారు. అసలే ఆకలి బాధకు నక నకలాడిపోతూ వున్నాడేమో, దళపతి రెండు మూడు దెబ్బలకే స్పృహతప్పి నేలమీద పడిపోయినాడు. పడడంతోటే అసువులను కూడా వీడినాడు. దొంగలలో ఒకడు ఇలా అన్నాడు : ‘‘కుక్కల నక్కల మాంసం తింటున్నాము. ఆకలితో ప్రాణం పోతోంది. రండి. ఈ శవాన్ని చీల్చుకు తిందాము.’’

ఒకడు శవాన్ని కాల్చటానికి అనువుగా నిప్పు రాజవేసే ప్రయత్నంలో మునిగిపోయినాడు. ఆకులు, అలములు, కట్టెపుల్లలు, చిదుకులు పోగుచేసి నెమ్మదిగా నిప్పుచేశాడు. క్రమంగా నిప్పు రాజుకుంది. పెద్ద మంట అయింది.

ఇంతలో వారిలో ఒకడు ‘‘ఆగండి! నరమాంసం తినడానికి నిశ్చయించుకున్నప్పుడు అస్థిపంజరంలా వున్న యీ ముసలివాడిని పీక్కుతినడం ఎందుకు? ఇక్కడ కోమలమైన స్త్రీలను ఎత్తుకువచ్చి పడేశాముగదా! ముందు ఆ చిన్నపిల్లను కాల్చుకుతిందాము, బాగుంటుంది’’ అన్నాడు.

‘‘అలాగే! ఏదో ఒకటి స్థిరంచేయండి అలాగే చేద్దాం’’ అన్నాడు మరొకడు. ‘‘ఆకలితో చచ్చిపోతున్నాను. తొందరగా తేల్చండి.’’

ఈ మాటలతో అందరూ కళ్యాణిని, సుకుమారిని పడవేసిన వైపు తిరిగారు. అయితే ఆశ్చర్యం! ఆ స్థలం నిరామయంగా వుంది. అక్కడ సుకుమారికాని, కళ్యాణికాని పడిలేరు. ఆ ప్రదేశం శూన్యంగా వుంది. దొంగలు ఇందాకటి నుండి తమలో తాము వివాదాలు పడుతున్న సమయంలో కళ్యాణి తెలివి తెచ్చుకుని చిన్నపిల్లను చంకన వేసుకుని అడవిలోనికి పరుగెత్తింది. తాము చంపుకు తిందామనుకున్న మనుష్యులు కానరాకపోవడంతో దొంగలకు శివమెత్తినట్లు అయింది. వారంతా ‘‘పట్టుకోండి, పట్టుకోండి’’ అని అరుస్తూ నాలుగువంకలా పరుగులు తీశారు. అవస్తావిశేషం చేత మనుష్యులు సైతం, జంతుమాత్రంగా తయారవుతారు.

4

అరణ్యం మధ్యలో గాఢాంధకారం అలుముకుని వున్నది. కళ్యాణికి దారి కనిపించడం కూడా చాలా కష్టం అయిపోతోంది. చెట్లు చేమలు అడ్డదిడ్డంగా పెరగడంవల్ల దారి యేర్పరుచుకు ముందుకు వెళ్లడం కష్టం అయిపోతోంది. అదీగాక, చీకటి. ముళ్లు గుచ్చుకోకుండా ఒదిగిఒదిగి నడవవలసివస్తోంది. సుకుమారి ఈ ముళ్ల తాకిడికి యేడుస్తూ వుంది. ఈ యేడుపు విని దొంగలు తమ ఉనికి తెలుసు కుంటారేమోనని కళ్యాణి భయపడసాగింది. కళ్యాణి పిచ్చి దానివలె పరుగుతీయసాగింది.

కొంతసేపటికి చంద్రోదయం అయింది. ఇంతవరకు కళ్యాణికి ఒక మొండి ధైర్యం ఉంది. అదేమంటే, చీకటిలో తనను ఆ నరపిశాచులు గుర్తించలేరని చంద్రుని కాంతి యిప్పుడు ప్రసరించ డంతో ఈ ధైర్యమంతా సడలిపోయింది. చంద్రకాంతి వనమంతా ఆవరించింది. అడవి లోపల కూడా వెలుగుతో నిండిపోయింది. ఒక రకమయిన ఉజ్వలతతో వెలిగిపోతోంది అంతా. కళ్యాణి పిల్లను అదుముకుని వడివడిగా పరుగు తీస్తోంది. దొంగలు వెనక అరుచుకుంటు వస్తున్నారు.

పిల్ల యేడుపు వినిపించడంతో దొంగల అరుపులు మరింత అయినాయి. కళ్యాణి దిగ్భమతో ఆగిపోయింది. ఆమె అశక్తురాలయింది. నీరస పడిపోయింది. ఒక వటవృక్షం కింద కటిక శూన్యమయిన ప్రదేశాన్ని చూచుకుని మెత్తటి ఆకుల మీద కూలబడిపోయింది. భగవంతుని స్మరించు కోసాగింది. ‘‘భగవాన్‌! ఎక్కడ వున్నావు నీవు? నిన్ను నిత్యము పూజిస్తున్నాను. నీ ధైర్యంతోనే ఇలా ఒంటరిగా అడవిలో పరుగులు తీస్తున్నాను. ఓ మధుసూదనా! నన్ను తరింపచేయి! ఎక్కడ వున్నావో భగవాన్‌!’

ఈ ‌సమయంలో భయము, భక్తి ఆమెను ఆవరించినాయి. ఆకలిచేత నీరసించిన శరీరం అచేతనావస్థలోనికి మారుతోంది. అయినా, అంతరిక్త మయిన చైతన్యావస్థలో ఆమెకు ఒక కీర్తన వినిపిస్తోంది. ఈ కీర్తన అంతరిక్షం నుండి, స్వర్గధామం నుండి వస్తున్నట్లుగా వుంది.

‘‘హరే మురారే! మధుకైట భారే!

గోపాల, గోవింద, ముకుంద ప్యారే!

హరేమురారే! మధుకైట భారే!

గోపాల, గోవింద, ముకుంద ప్యారే!

హరే మురారే! మధుకైట భారే!’’

కళ్యాణి చిన్నతనం నుండి పురాణవర్ణనలు వినడానికి అలవాటుపడి వున్నది. దేవ రుషి అయిన నారదుడు వీణాపాణి అయి ఆకాశమార్గంలో పాడుకుంటూ తిరుగుతూ వుంటాడని ఆమె ఎరు గును. ఈ పాట వినడంతోటే ఆమెకు యీ విషయం చప్పున స్ఫురించింది. ఆమె మనస్సులో ఒకరూపం యేర్పడింది. శుభ్రమయిన శరీరం, శుభ్రమయిన వేషం, మహాముని వీణ చేత పుచ్చుకుని ఆకాశంలో వెన్నెలదారుల వెంట నడచి వెడుతున్నాడు.

ఈ ‘‘హరేమురారే మధుకైట భారే!’’ క్రమంగా యీ పాట ఆమెకు దగ్గరగా రాసాగింది. మరింత స్పష్టంగా వినపడసాగింది. ‘‘హరే మురారే మధుకైట భారే!’’ చివరకు కళ్యాణి పారవశ్యంతో కిందికి ఒరిగిపోయింది.

5

ఆ అరణ్యంలో కొండరాళ్లతో నిర్మించిన ఒక మఠం వున్నది. పురాతత్త్వవేత్తలు ఎవరయినా ఆ స్థలాన్ని చూచినట్లయితే, ఇక్కడ కొన్ని వేల సంవత్స రాల క్రితం ఒక బౌద్ధ విహారం వుండి వుండేదని చెపుతారు. ఆ బౌద్ధ విహారమే క్రమేణ హిందూ ఆరామం అయిందని కూడా చెపుతారు. అది రెండంతస్తుల భవనం. దానిలో అనేక దేవమంది రాలు, ఎదురుగా నాట్యమందిరం వున్నాయి. చుట్టూ శిలాకుడ్యాలు వుండడం, దట్టమైన అడవి ఆవరించి వుండడంవల్ల ఈ భవనం ఎవరికీ కనిపించదు. చాల ప్రాచీనమైన కట్టడం అవడంవల్ల అక్కడక్కడ గోడలు బీటలు వారి ఒరిగి పోయినాయి. అయితే, పగటిపూట చూస్తే ఈ భవనానికి కొద్దిపాటి మరమ్మత్తులు చేసినట్లు అగుపిస్తుంది. దుర్భేద్యమైన ఈ అడవిమధ్య ఈ భవనంలో మనుష్య సంచారం వున్నదన్న ‘విషయం కూడా తెలుస్తుంది పరిశీలనగా చూస్తే, భవనంలో ఒక పక్క అఖండం వెలుగుతోంది. కళ్లు తెరవడం తోటే కళ్యాణి ఈ అఖండానికి ఎదురుగా ఆ రుషి నిలబడి వుండడం చూచింది. కళ్యాణి చాల ఆశ్చర్యంతో నాలుగుపక్కల పరికించి చూడసాగింది. ఆమెకు ఇప్పటికి కూడా పూర్తిగా చైతన్యం కలుగలేదు. ఈ విషయం కనిపెట్టి ఆ మహాపురుషుడు ‘‘అమ్మాయీ! ఇది దేవతలు నివసించే చోటు. నీవేమీ భయపడనవసరంలేదు. ఇక్కడ కాసిని పాలు వున్నాయి, తాగు. తరువాత మాట్లాడుకుందాం’’ అన్నాడు.

మొదట కళ్యాణికి ఏమీ అర్ధం కాలేదు. తరువాత కొద్దికొద్దిగా ఆమె హృదయం శాంతపడసాగింది. కొంగు సరి చేసుకుని, ఆయనకు సాష్టాంగ ప్రణామం చేసింది. మహాత్ముడు ఆమెను ఆశీర్వదించి గదిలో నుండి వేడివేడి పాలు తీసుకువచ్చి ఆమెకు ఇచ్చి ‘‘అమ్మాయీ! ఈ పాలు పిల్లకు కూడా తాగించు, నీవూ తాగు. ఆ తర్వాత మాట్లాడుకుందాం’’ అన్నాడు. కళ్యాణి సంతుష్ట హృదయంతో పిల్లకు పాలు తాగిస్తోంది. తరువాత ఆయన ఇలా అన్నాడు. ‘‘నేను బయటకు వెడుతున్నాను. నీవు ఎటువంటి విచారము, సంకోచము లేకుండా ఇక్కడే కూర్చో’’. ఈ మాటలు అని ఆయన గదిలో నుండి బయటకు వెళ్లాడు. కొద్దిసేపటి తరువాత తిరిగి వచ్చాడు. ఆయన వచ్చేసరికి కళ్యాణి పిల్లకు పాలు పట్టించడం అయింది. తాను ఏమీ తాగనేలేదు. గ్లాసులోని పాలు కొద్దిగా మాత్రమే వినియోగం అయినాయి. ఆయన ఈ సంగతి పరిశీలనగా చూచి గమనించాడు.

‘‘అమ్మాయీ! నీవు పాలు తాగనే లేదు. నేను మళ్లీ బయటకు వెడుతున్నాను. నీవు పాలు త్రాగేంతవరకు నేను తిరిగి లోనికి రానేరాను.’’

ఆయన ఈ మాటలు పలికి బయటకు వెళ్లబోతూ వుండగా కళ్యాణి లేచి నిలబడి చేతులు జోడించింది.

‘‘ఏమిటి?’’ అన్నాడు ఆయన. ‘‘నన్ను పాలు త్రాగమని బలవంతం చేయకండి. నాకు బాధగా వుంటుంది. నేను పాలు తాగలేను ఈ స్థితిలో.’’

ఈ మాటలకు వనవాసి కరుణామయ హృదయంతో ఇలా అన్నాడు. ‘‘ఏమిటమ్మా బాధ? నేను బ్రహ్మచారిని. నీవు నాకు కుమార్తెవంటిదానవు.

నీ మనస్సు ఏమిటో నా ముందు విప్పి చెప్పు. ఏమీ బిడియపడకు. నీవు స్పృహ తప్పిపడివుంటే నేను ఇక్కడికి తీసుకువచ్చాను. చాల నీరసంగా వున్నావు. ఏమీ తీసుకోకపోతే మరీ డీలా పడిపోతావు.’’ ..

ఈ మాటలకు కళ్యాణి కళ్లనీళ్లు పెట్టుకుంది. ‘‘మీరు దేవుడితో సమానం. మీ ముందు నా బాధ చెప్పుకోవడానికి ఏమీ బిడియం లేదు. ఇంతవరకూ మా స్వామి ఏమీ పుచ్చుకుని వుండరు. వారిని కలుసుకోకుండా, వారి క్షేమం తెలుసుకోకుండా నేను పచ్చి మంచినీళ్లు మటుకు ఎలా తాగగలను?’’

‘‘నీస్వామి ఎక్కడ వున్నారు?’’

‘‘నాకు తెలియదు వారు నాకోసం పాలు తీసుకురావడానికి వెళ్లారు. ఇంతలో దొంగలు నన్ను ఎత్తుకుపోయినారు. తరువాత వారు ఏమయ్యారో నాకు తెలియదు.’’

బ్రహ్మచారి ఒక్కొక్క మాట అడిగి ఆమె నుండి జవాబులు రాబట్టుకుని విషయమంతా తెలుసు కున్నాడు. కళ్యాణి తన భర్త పేరు నోటితో చెప్పలేక పోయింది. చివరకు బ్రహ్మచారి ‘‘నీవు మహేంద్రుని భార్యవా?’’ అని అడిగాడు. జవాబుగా కళ్యాణి తల ఆడించింది. బ్రహ్మచారికి అర్థం అయింది. ‘‘నీవు నా మాట విను. నేను నీ భర్తను వెదికి తీసుకువస్తాను. నాలో నమ్మకం వుంచి పాలుతాగు. నీవు త్రాగేంతవరకు నేను బయటకే పోను.’’

‘‘ఇక్కడ కొద్దిగా నీళ్లు దొరుకుతాయా?’’ అని అడిగింది కళ్యాణి.

బ్రహ్మచారి నీళ్ల కలశం చూపించాడు. కళ్యాణి అంజలి ఘటించింది. బ్రహ్మచారి ఆమె దోసిటిలో నీళ్లుపోశాడు. నీళ్లతో నిండిన దోసిలి బ్రహ్మచారి పాదాల చెంతకు చేర్చి ఆమె ‘‘తాము దయతో తమ పాదరేణువులు ఇందులో ప్రసాదించండి’’ అంది. బ్రహ్మచారి బొటనవేలును నీళ్లలో తాకించాడు. కళ్యాణి ఆ నీళ్లను తృప్తిగా త్రాగింది.. ‘‘నేను అమృత పానం చేశాను. ఇంక నన్ను తినమని, తాగమని బలవంతం చేయకండి. నా స్వామి జాడ తెలియ వచ్చేంతవరకు ఇంకేమీ పుచ్చుకోను’’ అంది కళ్యాణి.

ఈ మాటలకు బ్రహ్మచారి కూడా సంతుష్టుడు అయినాడు.

‘‘నీవు ఇక్కడే ఈ దేవస్థానంలో వుండు. నేను నీ భర్తను వెదికి తీసుకు వస్తాను’’ అన్నాడు.

(సశేషం)

About Author

By editor

Twitter
Instagram