నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించేందుకు గ్రంథాలయోద్యమం ఒక సాధనం కాగలదన్న భావన అప్పటి మేధావులలో ఉండేది. గ్రంథాలయోద్యమం, ఆంధ్ర భాషోద్యమం అపుడు పరస్పరం పర్యాయ పదాలైనట్లు సాగుతుండేవి. గ్రంథాలయా లకు వారు పెట్టిన పేర్లను బట్టి చాలా అంశాలు అవగతమవుతాయి. భాషతో భావ దారిద్య్రాన్ని, బానిస ప్రవృత్తిని వదలగొట్టాలని నాటి పెద్దలు యోచించడానికి చాలా కారణాలే ఉన్నాయి. సంస్థానంలోని మూడు భాషా ప్రాంతాలలో తెలంగాణ కంటే మరాఠా, కన్నడ ప్రాంతాలు తమ భాషా సంస్కృతుల పరిరక్షణలో మెరుగుగా ఉండేవి. ఆ ప్రాంతాలు హైదరాబాద్‌కు కొంత దూరంగా ఉన్నందువల్ల అధికారుల దృష్టి కొంత తక్కువగా ఉండేది. తన జీవితపు తొలి దశలో మరాఠా ప్రాంతంలో నివసించిన కొమర్రాజు లక్ష్మణరావు తెలుగు, ఇంగ్లిష్‌లతో పాటు మరాఠీలోనూ పండితుడు. ఆయన తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఆద్యుడు. తెలుగులో అక్షరాస్యత గలవారు తెలుగు సాహిత్యాన్ని, దేశంలోని ఇతర ప్రాంతాలలో జరుగుతున్న రాజకీయ, సాంస్కృతిక పరిణామాలను తెలుసుకునేందుకు వీలుగా గ్రంథాలయోద్యమాన్ని ప్రారంభించాడారాయన. అంటే నిజాం రాజ్యంలోని హిందువులు తాము ఏ స్థితిలో ఉన్నారో ఆత్మ పరిశీలనకు ఇది ఉపకరించాలని ఆయన భావించారని అనుకోవాలి.


సెప్టెంబరు 1,1901న హైదరాబాద్‌లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం, 1904లో హనుమకొండలో శ్రీరాజరాజ నరేంద్ర ఆంధ్రభాషా నిలయం, 1905లో సికింద్రాబాద్‌లో ఆంధ్ర సంవర్ధినీ లైబ్రరీ ఏర్పడ్డాయి. 1910 వచ్చేసరికి సూర్యాపేట (ఆంధ్ర విజ్ఞాన ప్రకాశిని), మంథని, హుజూర్‌ ‌నగర్‌, ‌కుక్కునూరు, రుద్రకోట, శుభ్రవీడు, శ్రీశైలం, చెన్నూరు వంటి చిన్నస్థాయి తెలంగాణ పట్టణాలలో కూడా గ్రంథాలయాలు ఆవిర్భ వించాయి. 1913లో వరంగల్లులో శబ్దానుశాసన గ్రంథాలయాన్ని నెలకొల్పారు. త్వరలోనే ఆదిలాబాదు నుంచి నల్లగొండ – మహబూబ్‌ ‌నగర్‌ ‌సరిహద్దుల వరకు పలువురు ఉత్సాహవంతులు స్వయంగా పుస్తక భాండాగారాలు తెరిచారు. అవి కొన్ని వందల నుంచి వేలాది పుస్తకాలతో నడిచేవి. 1920 నుంచి ఆరంభించి తెలుగు వార్తాపత్రికలను, మేగజైన్లను ఆయా గ్రంథాలయాలకు తెప్పిస్తుండేవారు. వివిధ గ్రంథాలయాల సమాచారాన్ని ‘తెనుగు’ అనే వార్తాపత్రిక వెలుగులోకి తెస్తుండేది. వాటి పేర్లను గమనించినప్పుడు, తర్వాతి కాలంలో రాజ్యానికి విముక్తి లభించినపుడు హిందూ-ముస్లిం ఐక్యతను సాధించడం ఆ గ్రంథాలయ స్థాపకుల లక్ష్యమనిపించేది.

హైదరాబాద్‌ ‌ప్రభుత్వం రైతుల నుంచి శిస్తులో రూపాయికి ఒక అణా చొప్పున (రూపాయికి మొత్తం 16 అణాలు) స్థానిక నిధికి సర్‌ ‌ఛార్జ్‌గా వసూలు చేస్తుండేది. కానీ ప్రాంతీయ భాషా గ్రంథాలయాలకు, పాఠశాలలకు ఎటువంటి నిధులు కేటాయించేది కాదు. పైగా, గ్రంథాలయాలు తెరిచిన ఔత్సాహికులను, వాటిని మూసివేయవలసిందిగా వత్తిడి చేసేది. తను మాత్రం ఉర్దూ, పర్షియన్‌, అరబిక్‌ ‌గ్రంథాల కోసం హైదరాబాద్‌లో అసఫియా కుఖానా పేరిట లైబ్రరీ నెలకొల్పింది. ఇతర గ్రంథాలయాల నిర్వహణలో అధికారులు పలు సమస్యలు సృష్టిస్తుండేవారు. వాటిలో ఉంచాలంటూ ఉర్దూ పుస్తకాలు పంపేవారు. పోలీసులు తరచు ఆ గ్రంథాలయాలకు వెళ్లి అక్కడ జరిగే కార్యకలాపాలను గమనించేవారు. నిర్వాహకుల సమావేశాలపై నిఘా వేసేవారు. తరచు రికార్డులు తీసుకువెళ్లేవారు.

ఇన్ని నిర్బంధాలున్నా గ్రంథాలయోద్యమం పువ్వాడ వెంకటప్పయ్య, టి.కె. బాగయ్య, చట్రాతి లక్ష్మీనరసమ్మ, గంగుల సాయిరెడ్డి, మంతిప్రగడ వెంకటేశ్వరరావు, జానపాటి సత్యనారాయణ, ఉన్నవ వెంకటరామయ్య వంటివారి నిబద్ధమైన, నిస్వార్థమైన కృషి వల్ల విస్తరించసాగింది. వీరంతా ఒక బృందం వలె పనిచేశారు. 1901లో ఆరంభమైన ఆ ఉద్యమం తెలంగాణలో స్వాతంత్య్రోద్యమకాలమంతా సాగి, సాంస్కృతిక పునరుజ్జీవనానికి దోహదం చేసి, అంతిమంగా నిజాం పాలనకు చరమవాక్యం పలికే రాజకీయోద్యమానికి దారులు వేసింది. గ్రంథాలయోద్యమం క్రమంగా విస్తరించి ప్రాముఖ్యాన్ని సంపాదించటంతో ఒక స్థాయిలో తెలంగాణలో గ్రంథాలయ సదస్సు జరిగింది. గ్రంథాలయోద్యమం క్రమంగా, ఆంధ్ర జనసంఘం నాయకత్వాన ఉండిన ఆంధ్రోద్యమంలో విలీనమైంది. ఈ పరిణామం 20వ శతాబ్దపు మూడవ దశాబ్దంలో చోటు చేసుకోగా, తర్వాతి శతాబ్దంలో నిజాం ఆంధ్రమహాసభలో భాగమైంది. ఆ విధంగా తొలుత కేవలం నిజాం సంస్థానంలో ఆంధ్ర సాంస్కృతికోద్యమంగా ఉన్న గ్రంథాల యోద్యమం, ఒక విశిష్టమైన రాజకీయోద్యమంగా పరిణతి చెందింది.

తెలంగాణ ప్రజల చైతన్యాన్ని పెంచేందుకు ఇతర అనుబంధ ఉద్యమాలను ప్రారంభించటానికి గ్రంథాలయోద్యమం పునాదులు వేసింది. ఆ విధంగా ఉద్యమం బహుముఖీనమైంది. సంస్థానంలో రచనలు, ప్రచురణలు పెరిగాయి. అప్పుడు వెలువడిన సాహిత్యాన్ని చారిత్రక, వైజ్ఞానిక రచనలనీ, చిన్న కథలు, జాతీయ గీతాలని వర్గీకరించవచ్చు. ఆ తర్వాత నుంచి తెలంగాణ సాహిత్య దిశ సామాజిక, రాజకీయ అంశాలవైపు మళ్లింది. కొమర్రాజు లక్ష్మణరావు ఆలోచనల మేరకు హైదరాబాద్‌లో విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి ఏర్పడి, తర్వాత ఆయన పేరిట ‘లక్ష్మణరాయ పరిశోధన మండలి’గా రూపాంతరం చెందింది. ఆ సంస్థ పక్షాన అనేక వైజ్ఞానిక, సామాజిక, చారిత్రక గ్రంథాలను చవక ధరకు ప్రచురించారు. మధ్యయుగాల నాటి తెలంగాణ చరిత్ర గ్రంథాలను కూడా వారు ప్రచురించటంతో పాటు, పరిశోధకు లను గ్రామాలకు వెళ్లి శాసనాలు, తాళపత్ర గ్రంథాలు, ఇతర చారిత్రక ఆధారాలను సేకరించేటట్టు ప్రోత్సహించారు. ఇరవయ్యవ శతాబ్దపు మొదటి దశాబ్ద కాలంలో వేసిన సాహిత్య బీజాలు ఆ విధంగా తర్వాతి కాలంలో గొప్ప ఫలితాలనిచ్చాయి.

శేషాద్రి-రమణ కవుల పేరిట జంటకవులుగా ప్రసిద్ధులైన ఇద్దరిలో ఒకరైన దూపాటి వేంకటరమణా చార్యులు తనకు చారిత్రక పరిశోధనలో ఉన్న ఆసక్తితో ఆ పని కోసమే తెలంగాణ వచ్చి ఉపాధ్యా యునిగా స్థిరపడ్డారు. ఆయన అనేక శాసనాలను గ్రామాల నుంచి సేకరించి అప్పటి పత్రికలలో ప్రచురించారు. ‘తెలంగాణలో మీరు ఎక్కడకు వెళ్లినా తాళపత్ర గ్రంథ సాహిత్యం లభిస్తుం’దని ఆయన సభలలో అంటుండేవారు. ఆయన వరంగల్లులో కాకతీయుల చరిత్రపై సదస్సు నిర్వహించి, ఆ పత్రాలతో కాకతీయ సంచిక పేరిట ఒక సంకలనాన్ని ప్రచురించాడు. తెలంగాణ సాహిత్య ప్రపంచానికి సురవరం ప్రతాపరెడ్డి ఇచ్చిన కానుక గోలకొండ కవుల సంచిక. సాహిత్యోద్యమంలో, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. సురవరం సామాజిక కార్యకలాపాలలో కూడా చురుకుగా పాలుపంచుకునేవారు. ఆయన రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర, తెలుగువారి సామాజిక, సాంస్కృతిక చరిత్ర రచనలో ఒక మైలురాయి వంటిది.

విజ్ఞాన చంద్రికా మండలి వలెనే మరికొన్ని ప్రచురణ సంస్థలు ఆ కాలంలో ఏర్పడి సామాజిక, చారిత్రక అంశాలపై అనేక పుస్తకాలను వెలువరిం చాయి. వాటిలో గోలకొండ, కిన్నెర, దివ్యవాణి, సుకృతి, ప్రసాదం, మాతృభారతి, ఆంధ్రశ్రీ, కాకతీయ, పూలతోట, వీరేశలింగ కవికంఠాభరణ, కృషి ప్రచారిణి, శివధర్మ, విజ్ఞాన ప్రచారిణి, వెంకటేశ్వర, కావ్యమాల అన్నవి పేరు పొందాయి. అణా గ్రంథమాల, దేశోద్ధారక గ్రంథమాల, ఆంధ్రకేసరి గ్రంథమాల సంస్థలు ఉద్యమానికి మద్దతుగా చవకగా పుస్తకాలను ప్రచురించేవి. కాని వాటిని రాయటం, ముద్రించటం కన్నా ప్రజలలోకి తీసుకువెళ్లటం ఎక్కువ కష్టంగా ఉండేది.

తెలుగు భాషాసంస్కృతుల పట్ల ప్రభుత్వ ఉపేక్ష అట్లుండగా, పుస్తకముద్రణ సదుపాయాలు తక్కువ. 1926 నాటికి కూడా కేవలం తెలుగులో ముద్రించే కేంద్రాలు హైదరాబాద్‌లో లేవు. అయిదారు ప్రెస్‌లలో అందుకు ఏర్పాటు మాత్రం ఉండేది. హైదరాబాద్‌ ‌బయట వరంగల్‌, ‌నల్లగొండ, ఇనుగుర్తిలో ఉండేవి. ఆ కాలంలో ప్రత్యేకంగా తెలుగు ముద్రణాలయా లన్నవి లాభసాటి అయ్యేవి కావు. 1912లో సరోజినీ విలాస్‌ ‌ప్రెస్‌లో ముద్రితమై పాలమూరు (మహబూబ్‌ ‌నగర్‌) ‌నుంచి వెలువడిన ‘జాతబోధిని’ పత్రికను తొలి తెలుగు మాసపత్రికగా భావిస్తారు. దానికి సంపాదకుడు, ప్రచురణకర్త శ్రీనివాసశర్మ. కాని ఆ పత్రిక నిధుల కొరతతో మరుసటి సంవత్సరమే నిలిచిపోయింది. తర్వాత అక్కడా ఇక్కడా పత్రికలు వెలువడినా ఎక్కువకాలం నిలవలేదు. డివైన్‌ ‌లైఫ్‌ ‌సొసైటీ ఆలోచనలను ప్రచారం చేసేందుకు స్వామి వెంకటరావు 1917లో ‘ఆంధ్రమాత’ పత్రికను ప్రారంభించాడు. 1922 ప్రాంతంలో నల్లగొండ నుంచి ‘నీలగిరి’ పత్రిక మొదలైంది. వరంగల్‌ ‌నుంచి 1923 జూన్‌లో ఆంధ్రాభ్యుదయం అనే మాస పత్రికను కోకల సీతారామశర్మ వెలువరించాడు. తెలంగాణలో విద్యావ్యాప్తి ఆ పత్రిక లక్ష్యం. అదే సంవత్సరం డిసెంబర్‌లో వరంగల్‌ ‌నుంచే ‘శైవ ప్రచారిణి’ అవే మరొక మాసపత్రిక ఆరంభమైంది. వ్యవస్థాపకుడు కడిమెల రాజలింగారాధ్య, సంపాదకుడు ముదిగొండ వీరేశలింగశాస్త్రి.

సామాజిక సంస్కరణ

భారతదేశంలో సామాజిక సంస్కరణ, సామాజిక అభ్యున్నతి, జాతీయోద్యమం ముప్పేటగా సాగాయి. ఇందుకు హైదరాబాద్‌ ‌రాజ్యం మినహాయింపు కాలేదు. బ్రిటిష్‌ ఇం‌డియాలో సామాజిక పరిణామాల గురించి తెలిసిన మేధావులు, సాంస్కృతికోద్యమంలో భాగంగా సామాజిక సంస్కరణోద్యమాన్ని కూడా చేపట్టారు. హైదరాబాద్‌ ‌సంస్థానంలో ఇందుకు ఆద్యుడు మాదర భాగ్యరెడ్డి వర్మ. ఆయన దళితుల అభ్యున్నతి కోసం పాటుపడ్డాడు. నగరంలోని దళితవాడలలో ఈ కార్యక్రమాన్ని 20వ శతాబ్దపు మొదటి దశకంలోనే ఆరంభించాడు. వారు తమ వివాహాల పరిష్కారం కోసం పంచాయితీల వైపు వెళ్లవద్దని, అవి తమకు అన్యాయం చేస్తాయని వారికి చెప్పాడాయన. కుల పంచాయితీలు కక్షిదారులు ఇద్దరినీ కొల్లగొడుతున్నందున అందుకు బదులు న్యాయ పంచాయితీలను ఏర్పాటు చేసుకొమ్మన్నాడు. మద్యపానం మానివేసి భవిష్యత్తు కోసం సొమ్ము దాచుకోవాలని చెప్పాడు. తమ రోజు కూలీ నుంచి అణా చొప్పున పొదుపు చేస్తే సంవత్సరానికి తులం బంగారం కొనుక్కోవచ్చునని లెక్కలు చూపాడు. ఆదిహిందువుల పేరిట తొలుత 35 మంది దళితులతో స్వచ్ఛంద సేవాదళాన్ని ఏర్పాటుచేశాడు. ఆ దళ సభ్యులు దళితులను చైతన్యవంతులను చేసేందుకు సమావేశాలు ఏర్పాటుచేశారు. ఇతర కులాలవారితోనూ కలిసి పనిచేసి వారి ప్రశంసలు పొందారు. భాగ్యరెడ్డి జగన్మిత్ర పేరుతో ఒక సంస్థను ఏర్పాటుచేసి దానిద్వారా దళితవాడలలో దళిత హరిదాసులతో భజనలు, హరికథల వంటివి చెప్పించేవాడు.

దళిత కళాకారులతో పాటు జానపద నృత్యాలు, నాటక కార్యక్రమాలు నిర్వహించ వలసిందిగా ఇతర కులాలవారిని ప్రోత్సహించాడు. తర్వాత 1911లో సామాజిక సంస్కరణల కోసం దళితులను, సవర్ణులను కలిపి ఆది-హిందూ సర్వీస్‌ ‌లీగ్‌ను నెలకొల్పాడు. ఆ లీగ్‌కు కార్యదర్శిగా పనిచేశాడు. 1921 నుంచి 1924 వరకు ఆది-హిందూ సభలు నిర్వహించాడు.

దళితుల అభ్యున్నతితో పాటు సామాజిక సంస్కరణోద్యమాన్ని చేపట్టేందుకు హైదరాబాద్‌లో 1913లో డెక్కన్‌ ‌హ్యుమానిటేరియన్‌ ‌లీగ్‌ను ఏర్పాటు చేశారు. అందులో అన్ని కులాలవారున్నారు. లీగ్‌కు లాల్జీ మేఘ్‌ ‌జీ అనే కలప కాంట్రాక్టరు ఉదారంగా ఆర్థికసహాయం చేశాడు. ఆ సంస్థకు రాయ్‌ ‌బాలముకుంద్‌ ‌వ్యవస్థాపక అధ్యక్షుడు కాగా, భాగ్యరెడ్డి కార్యదర్శి. 1915లోనే హైదరాబాద్‌ ‌సోషల్‌ ‌సర్వీస్‌ ‌లీగ్‌ను కూడా స్థాపించారు. హిందూ సమాజాన్ని సంస్కరించవలసిన అవసరం గురించి ప్రజలకు తెలియజెప్పేందుకు జిల్లాలలో పలు సమావేశాలు నిర్వహించారు. సంస్కరణల సమస్యలను చర్చించేందుకు మూడు సామాజిక సదస్సులు జరిపారు. హైదరాబాద్‌లో 1921 నవంబర్‌ 11-12 ‌తేదీలలో జరిగిన చివరి సదస్సులో ఆలంపల్లి వెంకటరామారావు తెలుగులో మాట్లాడుతుండగా మహారాష్ట్ర యువకులు హేళన చేశారు. ఆ సదస్సులో వేర్వేరు భాషలవారున్న మాట నిజమే అయినా, అత్యధిక సంఖ్యాకులైన తెలుగువారి పరిస్థితి ముస్లిమేతర వర్గాల దృష్టిలో కూడా తీసికట్టు అయినట్లు ఆ ఘటన నిరూపించింది. దానితో ప్రభుత్వంతోపాటు ఉర్దూ, మరాఠా, కన్నడ సామాజికులు తమను గుర్తించి గౌరవించే విధంగా ప్రత్యక్ష కార్యాచరణకు పూనుకోవాలని తెలుగు మేధావులు భావించారు. వారు అదే రాత్రి సమావేశమై ఆంధ్ర జనసంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సాంస్కృతిక ఉద్యమం పేరిట ఒక సుదీర్ఘమైన రాజకీయ ఉద్యమానికి ఆ విధంగా అంకురార్పణ జరిగింది.

జాతీయోద్యమం

తెలుగు భాషా సంస్కృతుల పునరుద్ధరణకు 20వ శతాబ్దపు మొదటి రెండు దశాబ్దాల కాలంలో జరిగిన ఈ ప్రయత్నాలను అట్లుంచి, బ్రిటిష్‌ ఇం‌డియాలో చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలకు కూడా హైదరాబాద్‌ ‌రాజ్యం స్పందించింది. అక్కడి రాజకీయ కార్యకలాపాలతో సంస్థాన ప్రజలకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. స్వదేశీ ఉద్యమాన్ని హైదరాబాద్‌ ‌నగరంలో 1905లో ముల్లా అబ్దుల్‌ ‌ఖయ్యూం, అఘోరనాథ ఛటోపాధ్యాయ ఆరంభిం చారు. నగరంలోని పలుచోట్లనేగాక బయట కూడా వారు సమావేశాలు జరిపి స్వదేశీ గురించి వివరిస్తూ విదేశీ ఉత్పత్తులను బహిష్కరించవలసిందిగా ప్రజలను కోరారు. లాలా లాజపత్‌ ‌రాయ్‌, ‌బాలగంగాధర తిలక్‌, ‌బిపిన్‌ ‌చంద్రపాల్‌ ‌వంటి జాతీయ నాయకుల చిత్రాలను విక్రయించారు. జాతీయవాద కార్యకలాపాల వ్యాప్తికి వివేకవర్ధని, నూతన విద్యాలయ, శ్రీకృష్ణదేవరాయ గ్రంథాలయం వంటి సంస్థలు కేంద్రాలుగా మారాయి. తిలక్‌ను ప్రభుత్వం విచారించి 1908లో ద్వీపాంతర శిక్ష విధించిన అనంతరం ఉద్యమం ఉద్ధృతమైంది. చిన్నా పెద్దా భజనమండళ్లు, ఇతర సంఘాలు ఆందోళనలో పాల్గొన్నాయి. నిజాం ప్రభుత్వం విదేశీ సరకుల దిగుమతినైతే నిరోధించలేదుగాని, స్వదేశీ వస్త్రాలను, ఉద్యమ సాహిత్యాన్ని విక్రయించరాదని దుకాణాల వారిని హెచ్చరించింది. 1918లో కాంగ్రెస్‌ ‌కమిటీ ఆన్‌ ‌హైదరాబాద్‌, ‌హైదరాబాద్‌ ‌స్టేట్‌ ‌రిఫార్మస్ అసోసియేషన్‌ ‌పేరిట రెండు సంస్థలు ఏర్పడ్డాయి. ఖిలాఫత్‌ ఉద్యమంతో ముస్లిం, హిందూ మేధావులు ఒకే వేదిక పైకి వచ్చారు. వారి ఉమ్మడి సమావేశాలు వివేకవర్ధిని పాఠశాలలో జరుగుతుండేవి. ఆ ఉద్యమానికి బారిస్టర్‌ అస్టర్‌, అస్కరీ హసన్‌, ‌ఖలీ యుజ్జమా, మొహమ్మద్‌ ‌మూర్తుజా, హుమాయూన్‌ ‌మీర్జా నాయకత్వం వహించారు. కాని ఆ మైత్రి స్వల్ప కాలికం అయింది. అదెట్లున్నా, బాధ్యతాయుత ప్రభుత్వాన్ని కోరుతూ విస్తృత రాజకీయోద్యమాన్ని ప్రారంభించేందుకు హైదరాబాద్‌లో పరిస్థితులు అనువుగా ఉన్నట్లు మాత్రం ఈ పరిణామాలు సూచించాయి.

హైదరాబాద్‌ ‌రాజ్యంలోని జాతీయోద్యమం విప్లవ జాతీయోద్యమ ధోరణికి దూరంగా ఏమీలేదు. 1895లో జువ్వాద్‌ ‌హుస్సేన్‌ అనే వ్యక్తి బ్రిటిష్‌ ‌రెసిడెంట్‌ను హతమార్చేందుకు ప్రయత్నించగా అతన్ని పట్టుకుని రాజ్యం నుంచి బహిష్కరించారు. బ్రిటిష్‌ ఇం‌డియాలో అటువంటి చర్యలకు పాల్పడిన విప్లవకారులు కొందరు హైదరాబాద్‌ ‌సంస్థానంలో శరణు తీసుకునేవారు న్యాయశాస్త్రం చదివేందుకు ఇంగ్లండులో ఉండిన (1908-10) శ్రీకిషన్‌కు వీర సావర్కర్‌ ‌స్థాపించిన అభినవ భారత్‌తో సంబంధా లుండేవి. ఆయన న్యాయమూర్తి రాయ్‌ ‌బాల్‌ ‌ముకుంద్‌ ‌కుమారుడు. తండ్రి చదువు పూర్తిచేయ కుండానే తిరిగి రావలసిందిగా చెప్పాడు. అట్లా వచ్చిన శ్రీకిషన్‌ ఇక్కడనే న్యాయశాస్త్రం చదివి ప్రాక్టీసు ఆరంభించాడు. మరొకవైపు తీవ్రవాద సిద్ధాంతాలతో యువకులను జాతీయోద్యమం దిశగా ప్రోత్సహిస్తూనే ఉన్నారు. నియంతృత్వ పాలనలో ఉండిన హైదరా బాద్‌ ‌సంస్థానంలో అధిక సంఖ్యాకులైన ప్రజలు, నాయకులు తమ సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం అనుసరించిన ఈ రాజకీయ-సాంస్కృతిక వ్యూహాలలో, పరాయిపాలనకు వ్యతిరేకంగా బ్రిటిష్‌ ఇం‌డియాలో జరిగిన జాతీయోద్యమ లక్షణాలన్నీ కనిపించేవి. ఈ వ్యూహాలు 20వ శతాబ్దపు మొదటి రెండు దశాబ్దాల పొడవునా కన్పించాయి. 19వ శతాబ్దపు చివరి దశలోనే నాటిన ఈ విత్తనాలు ఈ రెండు దశాబ్దాలలో మొలకెత్తాయి.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
Instagram