భారతీయుడిగా ఏటా ఆగస్ట్ 15 ‌సందర్భాన్ని నేను తప్పక  గుర్తుంచుకుని గౌరవిస్తాను. అదొక అనుభూతి. కానీ నిజాం ఏలుబడి నుంచి తెలంగాణ విముక్తమైన సెప్టెంబర్‌ 17‌న ఈ పేరుతో దినోత్సవం జరుపుకుంటే ఆ అనుభూతి ద్విగుణీకృతమవుతుంది. రజాకార్ల అరాచకాల కాలాన్ని చూసిన వారికి ఈ అనుభూతి లోతుపాతులు మనసును తాకుతాయి. ఇందులోని గాఢత 1948 తరువాత పుట్టిన వారికి అర్ధం కాకపోవచ్చు. ఆగస్ట్ 15‌తో పాటు సెప్టెంబర్‌ 17‌ను కూడా ఒకనాటి నిజాం సంస్థాన భాగాలైన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలు అధికారికంగా జరుపుకుంటున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం అనేక కారణాలతో, ప్రధానంగా రాజకీయ కారణాలతో నాయకులు ఈ ఉత్సవాలను నిర్వహించడానికి నిరాకరించడం నిజంగా విషాదం. హైదరాబాద్‌ ‌సుదీర్ఘకాలం ముస్లిం పాలనలో ఉండిపోయింది. ఆ పాలన హిందువుల మనోభావాలను దారుణంగా గాయపరిచింది. నిజాం అసమర్ధతను మంత్రులు, అధికారులు ఆసరాగా చేసుకుని తీవ్రమైన చర్యలకే పాల్పడ్డారు. సంస్థానానికి ప్రధాని లాయక్‌ అలీ, సైనికదళాల అధికారి ఎల్‌ ఎ‌డ్రూస్విత్‌ ‌నాడు చేసిన ఈ పని చూడండి. పాకిస్తాన్‌ ‌సర్వసైన్యాధ్యక్షుడి సాయంతో, సిడ్నీ కాటన్‌ అనే పైలట్‌ ‌సహకారంతో ఆ దేశం నుంచి ఆయుధాలు, మందుగుండు చేరవేయించారు. కరాచీ నుంచి జూన్‌ 4,1948‌న వీటిని బీదర్‌ ‌చేర్చారు. అక్కడ నుంచి పది విమానాలు అపారమైన నిజాం సంపదతో పాశ్చాత్య దేశాలకు వెళ్లాయి. సంపదను దట్టించడానికి విమానాల సీట్లు కూడా తొలగించారు.


ఈ నేపథ్యంతో నిజాం సంపదను అంచనా వేయాలి. ఇంత అపార ధనరాశులు అనేక మార్గాలలో ఆయన వద్దకు చేరాయి. వారసత్వంగా వచ్చినది, భూసంపద, ప్రభుత్వ లాంఛనాలు, ఆభరణాలు- రకరకాలుగా సంపద చేరేది. వీ•న్నిటికి మించిన పెద్ద సంపద ‘నజర్‌’. అం‌టే అధికారులు, తాబేదారులు, సామంతులు చెల్లించుకునే కానుకలు. ఈ సంపద యావత్తు ఈ ప్రాంతానిది లేదా భారత్‌దే. అది ఎన్ని లక్షల కోట్ల రూపాయలు విలువైనదో అంచనాకు అందదు. ఆఖరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ను ప్రపంచ ధనికులలో ఒకనిగా ఫిబ్రవరి, 1937లో టైమ్‌ ‌మ్యాగజీన్‌, 1946‌లో ‘లైఫ్‌’ ‌మ్యాగజీన్‌ ‌ప్రకటించాయి. ఆ వార్తాకథనం కోసం వచ్చిన మార్గరెట్‌ ‌బర్క్ ‌వైట్‌  ‌నిజాం అతి పెద్ద భూస్వామి అని రాశారు. ఆ అతి పెద్ద సంస్థానంలో 15 వంతులలో ఒక వంతు నిజాం సొంత ఆస్తి. సంస్థానం మీద వచ్చిన ఆదాయంలో 15 శాతం నిజాం సొంతం. తన ఇద్దరు కుమారుల కోసమని ఖజానా నుంచి ఇంకొంత ధనం వచ్చేది. ఇదంతా కలిపి కోట్ల రూపాయలలో ఉండేది. తమ ఆభరణాలెన్నో నిజాంకే తెలియదు.  ముత్యాలెన్నో కొలతకు అందవు. ఒక సమయంలో కింగ్‌ ‌కోఠి భవనం పైన ముత్యాలన్నీ పరచగా మొత్తం నిండిపోయిందని చెబుతారు. బంగారం నిల్వ చేయడానికి ఇనప్పెట్టెలు చాలేవి కాదు. ఇవన్నీ బర్క్ ‌వైట్‌ ‌రాసిన విషయాలు. ముంబయ్‌కి చెందిన జర్నలిస్ట్ ‌డీఎఫ్‌ ‌కరాకా కూడా నిజాం వ్యక్తిగత ఆస్తి విలువ వంద మిలియన్‌ ‌పౌండ్లని లెక్క గట్టారు. ఇందులో 25,500,000 పౌండ్లు ధనరూపంలో దగ్గరే ఉండేది. ఆభరణాల విలువ 35,000,000 పౌండ్లు. లండన్‌ ‌టైమ్స్ ‌ఫిబ్రవరి, 1967లో ఇచ్చిన వివరాల ప్రకారం (సంస్మరణ వ్యాసంలో) వార్షికాదాయం 2,500,000 పౌండ్లు. 150 మంది ఒకేసారి భోజనం చేయడానికి కావలసిన పాత్రలు -అంతా బంగారం- ఉండేవి. 1963లో కేంద్ర ప్రభుత్వం బంగారం మీద నియంత్రణ విధించింది. ఆ సమయంలో నిజాం వారసుడు ముఖరమ్‌ ‌జా 22 టన్నుల బంగారం ఉందని ప్రకటించాడు.

నిజాం చేతిలో ఉన్న భూమి వివరాలు తెలుసుకుంటే కళ్లు చెదురు తాయి. నిజాం సంస్థానం వైశా ల్యం 81,698 చదరపు మైళ్లు. నిజాం సంస్థానంలో గ్రామాలు 22457. ఇవి మూడు రకాలు. మొదటి రకం సెర్ఫ్ ఎ ‌ఖాస్‌. ఇవి 1961 గ్రామాలు. ఇవన్నీ పాలక కుటుంబాల ఆస్తులు. అసలు ప్రభుత్వానికి చెందిన భూములలో 10 శాతం ఈ రకానికి చెందినవే. వీటి మీద ఆదాయం మొత్తం రాచ కుటుంబానిదే. ఇది 55 లక్షల ఎకరాల సాగు భూమి. వీటి నుంచి 25 మిలియన్‌ ‌రూపాయల వార్షికాదాయం వచ్చేది. కానీ ఈ భూములు జాగీర్లతో పోల్చుకుంటే దుస్థితిలో ఉండేవి. ఇది కాకుండా ఏటా రూ. 70,00,000 రాష్ట్ర ఖజానా నుంచి అందేవి. సంస్థానాన్ని భారత ప్రభుత్వానికి అప్పగించిన తరువాత నెలకు రూ.50,00,000 భూములకు నష్టపరిహారంగా, మరొక రూ. 50,00,000 రాజ భరణంగా ఏటా లభించేది. వీటిలో దేనికీ ఆదాయపు పన్ను లేనేలేదు. నిజాం ఇంత భారీగా ఆదాయం పొందినప్పటికీ సెర్ఫ్ ఎ ‌ఖాస్‌ ‌గ్రామాలు అత్యంత వెనుకబడి ఉండేవి. రెండోరకం గ్రామాలలోనే పైఘా, సంస్థాన్‌, ‌జాగీర్‌, ‌దేశ్‌ముఖ్‌ల భూములు. ఇందులో పైఘా భూములు నిజాం బంధువులు, సన్నిహితులవి. ఈ గ్రామాల సంఖ్య 6535. భూ ఆదాయమంతా వీళ్ల చేతులలోనే ఉండేది. ఆఖరికి ఖల్సా లేదా దివానీ భూమి ఉన్న గ్రామాలు 13961. అప్పుడు ఆస్తి పన్ను ఎక్కువ.

ఆఖరి నిజాం వద్ద ఆభరణాల గుట్టలే ఉండేవి. అవన్నీ మొగలులు, కాకతీయులు, విజయనగర పాలకులు, ఖాందేష్‌, అహ్మద్‌ ‌షాహి, నిజాం షాహి, బరీద్‌ ‌షాహి, కుతుబ్‌ ‌షాహీ పాలకుల నుంచి వచ్చినవే. ఆఖరి నిజాం 1911లో అధికారంలోకి వచ్చిన నాటికి జాకబ్‌ ‌వజ్రం సహా ఎన్నో విలువైన ఆభరణాలు, నవరత్నాలు ఉండేవి. వీటి రక్షణకు నిజాం మూడు ట్రస్ట్‌లు ఏర్పాటు చేశాడు. మొదట కింగ్‌కోఠిలోని రాజ ప్రాసాదంలోనే ఉంచినా తరువాత ముంబాయిలోని మెర్కంటయిల్‌ ‌బ్యాంక్‌లో దాచారు. తాను మరణించిన తరువాత అందులో రెండు ట్రస్ట్‌లలోని ఆభరణాలను కుటుంబ సంక్షేమం కోసం ఉపయోగించాలని వీలునామా రాశాడు.

 1944లో నిజాం తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు బ్రిటిష్‌ ‌ప్రభుత్వం ఆయన ఆస్తిని తస్కరించాలని పథకం వేసింది. అప్పుడు వాళ్లు కట్టిన విలువ వంద మిలియన్‌ ‌పౌండ్లు. ఇది నిజాం అధికారిక నివాసం (కింగ్‌ ‌కోఠి)లోనిది మాత్రమే. అంటే వ్యక్తిగత సంపద. ఢిల్లీలోని ఇండియా ఆఫీస్‌ అధికారి ఫ్రాన్సిస్‌ ‌వైలీ అప్పటి వైస్రాయ్‌ ‌వేవెల్‌కి ఇందుకు సంబంధిం చిన రహస్యపత్రం ఒకటి పంపించాడు. హైదరాబాద్‌ ‌లోనే ఉండే బ్రిటిష్‌ ‌రెసిడెంట్‌ 1945 ‌మే మాసంలో పంపించిన 17 పేజీల నివేదిక ప్రకారం కూడా నిజాం వ్యక్తిగత సంపద వంద మిలియన్‌ ‌పౌండ్లు.

నజర్‌ ‌పేరుతో నిజాం గుంజుకున్న డబ్బు, వస్తువుల విలువ అసాధారణమైనది. ఇది మొగల్‌ ‌దర్బారు సంప్రదాయం. ప్రభుత్వ అధికారులు, సైనికాధికారులు, పైఘాలు, జాగీర్దార్లు వారి వారి సామాజిక హోదాను బట్టి నజర్‌ ‌విలువ ఆధారపడి ఉండేది. ఈద్‌కు, నిజాం జన్మదినానికి ప్రతి ఉన్నతాధి కారి నజర్‌ ఇవ్వాలి. కనీస నజర్‌ – ఒక బంగారు నాణెం లేదా నాలుగు వెండి నాణేలు. పేరుకు నాణేలే అయినా ఇవి జేబులో వేసుకుని తీసుకవెళ్లేవి కాదు. వాటి బరువు రెండువందల గ్రాముల నుంచి ఉండేది. ఈ నాణేలను వేరేగా తయారుచేయించేవారు. నాణేలే కాకుండా రత్నాలు, పచ్చలు వంటి జాతి రాళ్లు, గుర్రాలు, ఏనుగులు, దుస్తులు , ఆయుధాలు కూడా నజర్‌ ‌రూపంలో చెల్లించేవారు. సంస్థానం బయటివారికి కూడా ఇది తప్పేది కాదు. ఒకసారి మౌలానా జఫార్‌ అలీ అనే పండితుడు నిజాంను వచ్చి కలిశాడు. మూడుసార్లు సలాం చేశాడు. కానీ నజర్‌ ఏం ‌లేదు. దీనితో నవాబు అలీ నజర్‌ ఏది? అని అడిగాడని చరిత్రకారులు చెబుతారు. 1965 నాటి పాక్‌ ‌యుద్ధ సమయంలో నిజాం కేంద్ర ప్రభుత్వానికి 33,000 బంగారు నాణేలు ఇచ్చాడం టేనే ఆయన సంపద ఎంతో అర్ధమవుతుంది.

పాకిస్తాన్‌లో చేరడానికి మొగ్గు చూపిన నిజాం మొదట్లో ఆ దేశ ప్రభుత్వం కోసం రూ. 20 కోట్లు సమర్పించాడు. నిజాం దక్కన్‌ ఎయిర్‌వేస్‌ ‌ద్వారా బంగారం గుట్టలను చేరవేయించాడు. 1918లో టర్కీ ఒట్టోమన్‌ ‌రాజ్యం పతనమైన తరువాత పాలకుడు రెండో మాజిద్‌కు నెలకు 300 పౌండ్లు వంతున నిజాం పింఛన్‌ ఏర్పాటు చేశాడు.

 1948లో లండన్‌లోని పాకిస్తాన్‌ ‌హైకమిషనర్‌ ‌బ్యాంక్‌ ‌ఖాతాకు హైదరాబాద్‌ ఆర్థికమంత్రి 35 మిలియన్‌ ‌పౌండ్లు (రూ. 306 కోట్లు) ఈ డబ్బు (హైదరాబాద్‌ ‌ఫండ్‌) ‌బదలీ చేశాడు. ఈ నిధి మీద బిజినెస్‌ అం‌డ్‌ ‌ప్రోపర్టీ కోర్టస్ ఆఫ్‌ ఇం‌గ్లండ్‌ అం‌డ్‌ ‌వేల్స్ 2019‌లో ఇచ్చిన తీర్పు ప్రకారం అది  భారత ప్రభుత్వానికీ, నిజాం వారసులకూ చెందుతుంది. ఇది తమదేనంటూ పాకిస్తాన్‌ ‌చొరబడినా, భారత్‌కే విజయం లభించింది. ఈ సొమ్ములో వచ్చే వాటాను సంస్థానానికి చెందిన 120 మంది వారసులు పంచుకుంటారని ఆ కుటుంబీకులు చెప్పారు. ప్రభువుల భోగాలకు పోయినంత పోగా మిగిలిన సంపద ఇది. భృత్యులు, బంధువులు కొల్లగొట్టినంత కొల్లగొట్టగా నేటికి కనిపిస్తున్న కనకరాశులు ఇవి.

– డా।। దేమె రాజారెడ్డి, న్యూరో సర్జన్‌, అపోలో. ‘మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ అం‌డ్‌ ‌హిస్‌ ‌వెల్త్’ ‌రచయిత

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram