1946-1951

జనగామ తాలూకాలోని ‘దొర’ విసునూరు రామచంద్రారెడ్డి ఆగడాలే తెలంగాణ సాయుధ రైతాంగ పోరా•ం ఆరంభం కావడానికి తక్షణ కారణమైనాయని చరిత్రకారులు చెబుతారు. ప్రజలకు కంటగింపుగా మారిన ఈ దేశ్‌ముఖ్‌ ఆగడాలు చరిత్ర ప్రసిద్ధి చెందాయి. చాకలి ఐలమ్మ అనే బడుగు వర్గాల మహిళ భూమిని ఆక్రమించడానికి ఈ భూస్వామి మనుషులు ప్రయత్నించడంతో ఘర్షణ మొదలయింది. మిగిలిన చిన్న రైతులు ఆమెకు అండగా నిలిచారు. ఈ క్రమంలోనే రామచంద్రారెడ్డి తన ఆగడాలను విస్తృతం చేశాడు. జూలై 4,1946న భూస్వామి అరాచకాలకు నిరసనగా స్థానిక ‘సంఘం’ నాయకుడు  దొడ్డి కొమరయ్య అనే రైతు నాయకత్వంలో వరంగల్‌ ‌జిల్లాలోని కడివెండిలో రామచంద్రారెడ్డి ఇంటి దిశగా దాదాపు వేయి మంది రైతులు నిరసన ఊరేగింపు తీశారు. రైతుల ఊరేగింపు మీద హఠాత్తుగా తుపాకులు పేలాయి. కొమరయ్య అక్కడికక్కడే చనిపోయాడు. ఆయన సోదరుడు మల్లయ్య కాలికి తూటా తగిలింది. మరొక ఇద్దరు కూడా గాయపడ్డారు. సాధారణంగా ఇలాంటి ఎదురుదాడి జరిగితే అంతా పారిపోవడం సహజం. కానీ కొమరయ్య మరణ వార్త తెలిసి దాదాపు రెండు వేలమంది పోగుపడ్డారు. నిరసన ప్రదర్శన రామచంద్రారెడ్డి ఇంటి వైపు సాగింది. భూస్వామి ఇంటిని చుట్టుముట్టారు. ఇదే తెలంగాణ సాయుధ పోరాటానికి ఆరంభం. ఇది ఆధునిక భారతదేశంలో జరిగిన అతి పెద్ద సాయుధ పోరాటంగా చరిత్రకు ఎక్కింది. వరంగల్‌, ‌నల్లగొండ మొదట ఉద్యమానికి ఊతమిచ్చాయి. దేశ్‌ముఖ్‌లకీ, పట్వారీలకీ తోడు నిజాం ప్రభుత్వం, అందులోనే భాగమైన కాశీం రజ్వీ సేన రజాకార్ల పీడ కూడా రైతాంగాన్ని వేధించింది. సాయుధ పోరాటానికి హైదరాబాద్‌ ‌స్టేట్‌ ‌కాంగ్రెస్‌, ‌సోషలిస్టులు కూడా మద్దతు ఇచ్చారు. సెప్టెంబర్‌ 17, 1948 ‌నాటికి నిజాం విముక్తమైంది.

ఈ సాయుధ పోరాటం పతాక స్థాయికి చేరుకున్న సమయానికి 15,000 చదరపు మైళ్ల విస్తీర్ణంలోని ముప్పయ్‌ ‌నుంచి నలభయ్‌ ‌లక్షల మంది ప్రజల మీద దాని ప్రభావం కనిపించింది. రెండు వేల నుంచి మూడు వేల గ్రామాల మీద రైతుల ఆధిపత్యం ఏర్పడింది. 2000 మంది గెరిల్లా పొరాట యోధులతో, దాదాపు 10,000 మంది మద్దతుదారు లతో ఉద్యమం సాగింది. చివరికి కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాన్ని అక్టోబర్‌ 21, 1951‌న విరమించింది.

ఇది ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నడిపిన ఉద్యమమే. ఈ నాయకులంతా ఒకప్పుడు నిజామాంధ్ర మహాసభలో పనిచేసినవారేనన్నది విస్మరించలేం. కానీ, తమ ఆధ్వర్యంలో జరిగిన ఇంత పెద్ద పోరాటాన్ని అక్షరబద్ధం చేసే సమయం వచ్చే సరికి కమ్యూనిస్టు పార్టీ ముక్కలైంది. ఆ రాజకీయాలు ఈ చరిత్ర నిర్మాణం మీద పడిందన్న సంగతి కూడా గుర్తుంచుకోవాలి. దాదాపు ముప్పయ్‌ ఏళ్ల తరువాత మాత్రమే ఈ పోరాటం మీద పూర్తి స్థాయి గ్రంథాన్ని పేవియర్‌ ‌రాశారు. అంతకు ముందు సీపీఎం నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య (1972), సి.హెచ్‌. ‌రాజేశ్వరరావు, (1972), రావి నారాయణ రెడ్డి (1973), రాజ్‌బహదూర్‌ ‌గౌర్‌ (1973) (ఈ ‌ముగ్గురు సీపీఐ) కూడా పుస్తకాలు వెలువరించారు. పేవియర్‌ ‌చరిత్ర అంతా సీపీఐ ఎంఎల్‌కు చెందిన డీవీ రావు రచన మీద ఆధారపడి ఉందని చెబుతారు. కాబట్టి ఈ మూడు వర్గాల అభిప్రాయాలు ఒకటి కాలేవు. పైగా ఈ ఉద్యమం మీద తెలంగాణ సామాజిక, రాజకీయ పరిస్థితులే కాకుండా అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం కూడా ఉంది. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో మార్పు అంటే, అందుకు భారత్‌లోని కమ్యూనిస్టు ఉద్యమం మినహాయింపు కాదు. తెలంగాణ సాయుధ రైతాంగ ఉద్యమానికి రెండు దశలు ఉన్నాయి. మొదటి దశ 1946 జూలై నుంచి 1948 సెప్టెంబర్‌ ‌వరకు. రెండో దశ 1948 సెప్టెంబర్‌లో భారత సైన్యం నిజాం రాజ్యం మీదకు వచ్చిన తరువాత రెండోదశ మొదలయింది.

దొడ్డి కొమరయ్య మరణం 300 నుంచి 400 గ్రామాలను కుదిపేసింది. ప్రజలంతా గ్రామాలలో ఏకమై వెట్టి గురించి, జమిందార్లకు చెల్లించే శిస్తుల గురించి చర్చించుకున్నారు. కొమరయ్యను కాల్చి చంపిన కడివెండి గ్రామానికి దగ్గరే ఉన్న ఒక గ్రామంలో రెండు వందల ఎకరాలను స్వాధీనం చేసుకుని పేదలకు పంచారు ఉద్యమకారులు. కానీ ఇది పెద్ద పక్రియ. జమిందార్ల భూములను ఆక్రమించడం, పేదలకు పంచడం, వాటిని వారు నిలబెట్టుకోవడం పెద్ద సమస్య కాబట్టి, ఇంటికి ఒక పురుషుడు వంతున ఉద్యమంలోకి వచ్చారు. ఇక నిజాం ప్రభుత్వం దేశ్‌ముఖ్‌లు, జమిందార్ల వెనకే ఉంది. ఈ ఘర్షణ 1942 నుంచి మొదలయింది. గ్రామ రాజ్యాలు ఇదంతా పర్యవేక్షించేవి. జనంలో ఐక్యత కూడా పటిష్టంగా ఉంది. 1946 నవంబర్‌లో మట్టారెడ్డి అనే రైతును జమిందార్ల మనుషులు చంపితే వేలాది మంది అంత్యక్రియలకు హాజరై సంఘీభావం ప్రకటించారు. గెరిల్లా పోరాట పంథాలో ఉద్యమం సాగింది. ఊరి మధ్యలో ఒక పెద్ద డప్పు ఉంచేవారు. ప్రమాదం ముంచుకు వస్తుంటే దానిని మోగించేవారు. పురుషులు, స్త్రీలు అంతా వచ్చి ఎదురు నిలిచేవారు. రాళ్లు, కారం కూడా ఆయుధాలుగా ఉపయోగించారు. కరపత్రాలు, పాటల బృందాలు, బుర్రకథ దళాలు, గొల్లసుద్దుల ద్వారా ఉద్యమ ప్రచారం జరిగింది.

నవంబర్‌ 1946‌లో సీపీఐని నిషేధించారు. దానితో రైతాంగ పోరాటానికి విరామం వచ్చింది. నిజాం ప్రభుత్వం గ్రామాలలో ఏర్పాటు చేసిన సాయుధ భటుల శిబిరాలను తొలగించింది. దీనితో ఆంధ్ర సీపీఐ నాయకత్వం సాయుధ పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించింది. ఆగస్ట్ 15, 1947 ‌దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కానీ సంస్థానాలకు బ్రిటిష్‌ ‌ప్రభుత్వం ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది. ఆ మేరకు నిజాం, మైనారిటీ వర్గం, అంటే ముస్లింలు స్వతంత్ర రాజ్యంగా కొనసాగాలని అనుకున్నారు. నిజాం సంస్థానంలోని కాంగ్రెస్‌ ‌వాదులు హైదరాబాద్‌ ‌భారత్‌ ‌యూనియన్‌లో విలీనం కావాలని సత్యాగ్రహాలు ఆరంభించారు. ఇదే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మార్గం ఏర్పరించింది. సీపీఐకి కూడా మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీలోని తెలుగు ప్రాంతాలు, హైదరాబాద్‌ ‌ప్రాంతాన్ని విలీనం చేసి విశాలాంధ్ర నిర్మించాలన్న ఆలోచన ఉంది.

అయితే భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత గ్రామీణ తెలంగాణకు రజాకార్ల పీడ పతాక స్థాయికి చేరుకుంది. 1948 ఆగస్ట్ ‌నాటికి పనిచేస్తున్న రజాకార్ల సంఖ్య దాదాపు లక్ష. ఆగస్ట్ 15, 1947 ‌తరువాత 13 మాసాలు నిజాం స్వతంత్రంగా ఉన్నాడు. ఆ కాలంలో రజాకార్లు చేసిన అత్యాచారాలు మానవ చరిత్రకే కళంకం. 1948 మధ్య కాలానికి ఉద్యమం కరీంనగర్‌, ఆదిలాబాద్‌ ‌జిల్లాలకు పాకింది. అలాగే కృష్ణా, గుంటూరు సరిహద్దులలో కూడా విస్తరించింది. అప్పటికి 20 మంది వంతున 50 నుంచి 60 గ్రామాలలో బృందాలు పనిచేస్తున్నాయి. భారత సైన్యం రాక మీద కమ్యూనిస్టులలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. 1948లో సీపీఐ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన బీటీ రణదివే సాయుధ పోరాటాన్ని కొనసాగించాలన్న పంథాలో నడిచారు. అయితే 1950లో చండ్ర రాజేశ్వరరావు ఆ పంథాను మార్చారు. 1935 నుంచి 1948 వరకు పార్టీ కార్యదర్శిగా పని చేసిన పూరన్‌ ‌చంద్‌ ‌జోషి కూడా సాయుధ పోరును విరమించాలని గట్టిగానే పార్టీలో ప్రచారం చేశారు. 1951లో ఆచార్య వినోబా భావే నిర్బంధంలో ఉన్న అనేక మంది కమ్యూనిస్టు కార్యకర్తలతో మాట్లాడారు. వారిని విడిపించడానికి హామీ ఇచ్చారు. పార్టీ సెంట్రల్‌ ‌కమిటీ పోరాటాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది నాయకులు పార్లమెంటరీ రాజకీయా లలోకి వచ్చారు. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల నుంచి పోటీ చేసిన చాలామంది విజయం సాధించారు. నిజానికి ఈ ఉద్యమం ప్రభావం పట్టణ, నగర ప్రాంతాలను తాకలేదు. జైలు నుంచి విడుదలైన వెంటనే ఎన్నికల రంగంలో దిగిన పోరాట ఉద్యమ నాయకుడు రావి నారాయణరెడ్డి దేశంలోనే అత్యంత ఎక్కువ మెజారిటీ సాధించారు. జనవరి 26, 1950న సివిల్‌ ‌సర్వెంట్‌ ఎం‌కె వెల్లోడికి ముఖ్య మంత్రి బాధ్యతలు అప్పగించారు. 1952లో డాక్టర్‌ ‌బూర్గుల రామకృష్ణరావు హైదరాబాద్‌ ‌రాష్ట్ర ముఖ్య మంత్రిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యారు.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram