– బంకించంద్ర చటర్జీ

6

రాత్రి చాలా పొద్దుపోయింది. అడవి అణు వణువూ అంధకారమయం. కానీ అరణ్యం పైన మాత్రం వెన్నెల. అలా అని అది పున్నమి రాత్రి కూడా కాదు. పలచని వెన్నెల ఛాయామాత్రంగా సొగసుగా పరుచుకుని ఉంది. ఆ సన్నని వెలుతురులో మఠం రెండవ కొస ఏమీ కనిపించడం లేదు. ఆ మైదానం సుదూర తీరాలలో ఏం జరుగుతున్నదో అసలే అంతుపట్టదు. ఈ మఠానికి సమీపంలోనే మూర్షిదాబాదు నుండి కలకత్తాకు వెళ్లే రహదారి ఉన్నది, విశాలమైనది. రహదారి పక్కగా ఒక కొండ ఉంది. దాని మీద మామిడిచెట్లు అనేకం ఉన్నాయి. కొండగాలికి తలలు ఊపుతున్న ఈ చెట్ల ఉపరి భాగాలు వెన్నెల వెలుగులో ప్రకాశిస్తున్నాయి.

బ్రహ్మచారి ఈ కొండ మీద నిలబడి దేనికోసమో పరకాయించి వింటున్నాడు. ఆయన ఏం వింటు న్నాడో ఊహించలేం. ఈ అనంత అరణ్యంలో పరి పూర్ణమైన శాంతి ఆవరించింది. అప్పుడప్పుడూ ఆకుల మర్మర ధ్వని మాత్రం వినిపిస్తున్నది. ఈ అడ వంతా కొండ మూలస్థానంలో ఉంది. పైన కొండ, కింద అడవి. వెనక వైపున ఇంత క్రితం చెప్పిన రహదారి. అక్కడ ఏమి చప్పుడు వినవచ్చిందోగాని బ్రహ్మచారి అటు వైపుగా నడక సాగించాడు. ఆయన భయానకమైన అరణ్యంలో అడుగుపెట్టాడు. ఒక మెరక ప్రదేశంలో చెట్ల కింద చాలామంది మనుషులు కూర్చుని ఉన్నారు. వారు ఒడ్డూ పొడుగూ ఉన్న మనుషులు. బలవంతులు. అదీగాక ఆయుధాలతో ఉన్నారు. చెట్ల శాఖలు, ఆకుల సందులలో నుండి చంద్ర కిరణాల వెలుతురు అప్పుడప్పుడు ఈ ఆయు ధాల మీద ప్రసరించి వాటిని మెరిసేటట్టు చేస్తు న్నాయి. అక్కడ దాదాపు రెండువందల మంది కూర్చుని ఉన్నారు. అందరూ మౌనంగా కిక్కురు మనకుండా కూర్చున్నారు. బ్రహ్మచారి వారికి వెనకగా వెళ్లి నిలబడ్డాడు. వారికి ఏదో సైగచేశాడు. ఎవరూ లేవలేదు మాట్లాడలేదు. ఎవరికోసమో వెదుకు తున్నట్లు బ్రహ్మచారి అందరినీ పరిశీలనగా చూశాడు. చివరకు ఒక వ్యక్తి భుజం తట్టి లేవదీసి దగ్గరకు తీసుకున్నాడు.

బ్రహ్మచారి వెదికి తీసుకువచ్చిన వ్యక్తి మాంచి బలిష్ఠుడు, యువకుడు. సాధుసంతులు ధరించే వస్త్రాలు ధరించాడు. భగవదర్పిత దివ్య చందన లేపన శరీరుడై ఉన్నాడు. అతడిని కొంచెం పక్కకు తీసుకు వెళ్లి, బ్రహ్మచారి ఇలా అన్నాడు. ‘‘భవానందుడా! మహేంద్రసింహుడి గురించి ఏమైనా వార్త తెలిసిందా?’’

‘‘ఈరోజు ఉదయం అతడు భార్యను, పిల్లను వెంటబెట్టుకుని ఇంటినుండి బయలువెడలాడు. బస్తీవైపు నడిచాడు…ఒక సత్రం చేరినట్టు తెలిసింది!’’ జవాబిచ్చాడు భవానంద.

బ్రహ్మచారి మధ్యలోనే అందుకుని ‘‘ ఆ సంగతి నాకు తెలుసు. కానీ దారిలో గందరగోళం జరిగింది కదా! ఎవరో అపహరించుకుపోయారు కదా! ఆ పని ఎవరు చేశారు ఆ గందరగోళమంతా? తెలిసిందా?’’

‘‘నేను అనుకుంటున్నది ఏమిటంటే, ఆ గ్రామ రైతులే చేసివుండాలి. గ్రామాలలోని రైతులు కడుపుమంటకు ఆగలేక ఇలా తయారవుతున్నారు. ఇప్పుడు అందరూ దొంగలుగా, దారిదోపిడీలు చేసే వాళ్లుగా మారిపోతున్నారు. ఈరోజు మేం కూడా దోపిడీ చేశాం. కొత్వాలు దొరగారి ధాన్యం వెడుతూ ఉంటే అటకాయించాం. ఇంగ్లీషు వాళ్ల పోలీసు అధికారి కోసం వెళుతున్న రెండు మణుగుల బియ్యం. అదంతా లాక్కుని వైష్ణవులకు భోగం చేశాం.’’

‘‘దొంగల చేతిలోనించి అతడి భార్యను, కుమా ర్తెను మాత్రం నేనే ఈ రోజు రక్షించాను. వారిద్దరూ ఇప్పుడు మఠంలో ఉన్నారు. ఇప్పుడు నీమీద పెద్ద భారం ఉంది. నీవు మహేంద్రుడు ఎక్కడున్నాడో వెదికి, అతని భార్యనూ, పిల్లనూ అతనికి అప్పగించు. ఇక్కడి పని జీవానందునకు చెప్పి వెళ్లు!’’ అన్నాడు బ్రహ్మచారి.

భవానందుడు అలాగేనని చెప్పి వెళ్లాడు. అప్పుడు బ్రహ్మచారి రెండవ దిక్కుగా వెళ్లిపోయాడు.

7

సత్రంలో కూర్చుని ఉన్నందువల్ల, ఆలోచిస్తూ ఉన్నందువల్ల ఏమీ ప్రయోజనం లేదని మహేంద్రుడు అక్కడ నుండి వెళ్లిపోయాడు. నగరంలోనికి వెళ్లి భార్యా సుతల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాలనుకున్నాడు. కొంతదూరం వెళ్లగా ఒక దృశ్యం అగుపించింది. కొన్ని ఎడ్లబళ్లు వెడుతు న్నాయి. వాటికి రెండు వైపులా సాయుధులైన సిపాయిలు ఉన్నారు. వాళ్లు ఆంగ్ల సైన్యానికి చెందినవాళ్లే. అప్పుడు వంగదేశం ఇంగ్లీషు వారి అదుపాజ్ఞలలోనే ఉంది.

వంగ సంవత్సరం 1176 (క్రీ.శ.1769) నాటికి వంగ రాష్ట్రం మీద ఆంగ్లేయులకు శాసనాధికారం లేదు. అప్పటికి ఆంగ్లేయులు బంగాళా దేశానికి దివానులు మాత్రమే. వారు పన్నులు మాత్రం వసూలు చేసుకుంటారు. అందులో మాత్రం మాహా ప్రజ్ఞాశాలురని పేరుంది. దేశరక్షణ బాధ్యత వారికి లేదు. కుల సంపదల రక్షణ విషయంలో విశ్వాస ఘాతకుడు, మనుష్య జాతికే కళంకం తెచ్చిన వాడు మీర్జాఫర్‌ ‌చేతులలోనే వుంది. మీర్జాఫర్‌ ఆత్మరక్షణ కూడా చేసుకోలేని బలహీనుడు. ఇంక అతడు బంగాళా దేశాన్ని, దేశప్రజలను రక్షించగలిగేది ఏమి ఉంటుంది? మీర్జాఫర్‌ ‌కడుపునిండా తాగి పడు కుంటాడు. అతడు అంతకంటే చేయగలిగేది ఏమీ ఉండదు. ఆంగ్లేయులే పనంతా చేసుకుంటున్నారు. వంగదేశీయులు ఏడుస్తూ ఉండిపోయారు.

వంగదేశీయుల డబ్బు ఆంగ్లేయులకు ప్రాప్తం ఉన్నప్పటికీ, శాసనాధికారం మటుకు ఇంకా నవాబు దగ్గరే ఉంది. ఆంగ్లేయులు పన్నులు వసూలు చేస్తున్న తావులలో తమ తమ కలెక్టర్లను నియమించు కున్నారు. వీరి ద్వారా వసూలు అయిన డబ్బు కలకత్తా వెళ్లిపోతోంది. జనం ఆకలి బాధతో చచ్చిపోతున్నారు. కలెక్టర్లు డబ్బు వసూలు చేయటం మటుకు మానడం లేదు. కాని పన్నులు పూర్తిగా వసూలు కావడం లేదు. కారణం ఏమిటంటే, భూమాత అనుగ్రహం లేనప్పుడు అన్నీ సవ్యంగా ఎలా జరుగుతాయి? ప్రాప్తించిన డబ్బు మటుకు బండి మీద వేసి సిపాయిల కాపలాలో కలకత్తా పంపివేస్తున్నారు. ఈ డబ్బు ఇంగ్లీషు వారి కంపెనీ ఖజానాలో జమ అవుతోంది. ఆ రోజులలో దారిదోపిడి దొంగల భయం ఎక్కువ. అందుచేతనే ప్రతి బండికి ఇటు అటు ముందు వెనుక ఏబది మంది సిపాయిల బలగంతో డబ్బు కలకత్తాకు చేరుతోంది. సాయుధులయిన సిపాయిలు నిర్భ యంగా ఈ పనిని నిర్వహించగలుగుతున్నారు. పగలైతే ఎండవేడిమి అంతా తమపరమే అవుతుందని సిపాయిలు రాత్రిపూట ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు మహేంద్రుడు ప్రయాణం చేస్తున్న రహదారి లోనే ఒక గుంపు సిపాయీలు, ఖజానాతో నడుస్తు న్నారు. మహేంద్రుని నడకకు అంతరాయం కలి గింది. అందుకని అతడు ఒకపక్కకు తప్పుకున్నాడు. సిపాయీల కంటపడితే వారు దొంగగా భావించి ఏదేనా గందరగోళం చేస్తారని వారు పూర్తిగా వెళ్లిపోయేంతవరకు అడవిలో పక్కగా ఒదిగి ఉందామనుకున్నాడు.

అతడు ఇంత జాగ్రత్తగా ఆలోచించినా, ఒక సిపాయీ చూడనే చూశాడు. ‘‘అదుగో, ఒక దొంగ పారిపోతున్నాడు’’ అన్నాడు. మహేంద్రుని చేతిలో తుపాకి ఉంది. అందుచేత సిపాయీ ఇంత దృఢంగా నిర్ణయానికి రాగలిగాడు. సిపాయీ పరుగు పరుగున వచ్చి మహేంద్రుడిని పట్టుకున్నాడు. మహేంద్రుడిని దెబ్బలు కొట్టి అతని తుపాకి లాక్కున్నాడు. మహేం ద్రుడు నిరాయుధుడయ్యాడు. అయినా అతని కోపం కట్టలు తెంచుకు పారుతోంది. సిపాయీని కొట్టాడు. వాడు స్మృతి తప్పి కింద పడిపోయాడు. తరువాత ఇద్దరు ముగ్గురు సిపాయీలు ముందుకు వచ్చారు. మహేంద్రుడిని పట్టుకున్నారు. తమ సేనాపతి దగ్గరకు తీసుకువెళ్లారు. సిపాయీలలో ఒకడిని చంపివేశాడని అభియోగం తెచ్చారు. సేనాపతి అప్పటి పరిస్థితిలో బాగా మద్యపానం చేసివున్నాడు. ‘‘దొంగను పట్టుకుని పెళ్లి చేయండి!’’ అని ఉత్తరువు ఇచ్చాడు. సాయుధుడై ఉన్న వాడికి పెళ్లి చేయటం ఏమిటని అనుమానం వచ్చింది సిపాయీలకు. వారు మహేంద్రుడిని చేతులు కాళ్లు కట్టివేసి బండిలో పడవేశారు. ఇంత మంది సిపాయీలు ఉన్నప్పుడు తిరుగబడి ఏమాత్రం ప్రయోజనం లేదని మిన్నకుండిపోయాడు మహేంద్రుడు. అదీగాక తన భార్య, కుమార్తె ఏమైనారో తెలియక పుట్టెడు దుఃఖంలో మునిగి ఉన్నాడు అప్పటికే. అందుచేత అతడికి చనిపోవడమే మంచిపనిగా కనిపిస్తోంది. ఆత్మరక్షణ కోసం ఎటు వంటి గట్టి పనీ చేయదలుచుకోలేదు. సిపాయీలు అతడిని బండికి గట్టిగా కట్టారు. మళ్లీ సిపాయీలు బండి పక్కన బారులు తీరి, యథాప్రకారం నడుస్తున్నారు.

8

బ్రహ్మచారి ఆజ్ఞ తీసుకున్న భవానందుడు మంత్ర జపం చేసుకొని, దైవస్తోత్రం హరికీర్తన చేసుకుంటూ సత్రంవైపు ప్రయాణం సాగించాడు. మహేంద్రుడికి భార్యాకూతుళ్ల వియోగం జరిగింది ఈ సత్రం పరి సరాలలోనే. మహేంద్రుడు ఏమైనాడో తెలుసుకోవా లంటే, దాని కోసం అన్వేషణ ఇక్కడినుండే ప్రారంభం కావాలని భవానందుడు నిశ్చయించుకున్నాడు.

ఆ రోజులలో ఆధునికమైన రహస్య దారులు లేవు. ఏ నగరంనుండయినా కలకత్తా వెళ్లవలెనంటే, మొగలు సామ్రాట్టులు నిర్మించిన రాస్తాలో నడిచి వెళ్లవలసిందే. మహేంద్రుడు పదచిహ్న గ్రామం నుండి కలకత్తాకు వెడుతున్నాడు. ఈ రహదారి దక్షిణం నుండి ఉత్తరానికి వెడుతోంది. ఆ దారులన్నీ భవానందకు కూడా చిరపరిచితమే. ఈ రహదారి  లోనే భవానందుడు కూడా సిపాయిలను కలుసు కోవడం తటస్థించింది. దొంగలు తమను దోచు కుందుకు ప్రయత్నం చేస్తారని సిపాయీలకు రూఢి అయిన నమ్మకం. అదీగాక ఒక దొంగ దొరికిపోయి బండిలో బందీగా ఉన్నాడు. అందుచేత సిపాయిలు భవానందుడిని చూడడంతోటే అతడు కూడా దొంగల ముఠాకు చెంది ఉంటాడని తీర్మానించుకున్నారు. అతన్ని కూడా పట్టుకున్నారు. ‘‘నన్నెందుకు పట్టు కుంటారు?’’ అన్నాడు భవానందుడు. ‘‘నీవు దొంగవు’’ అని బదులు చెప్పాడు సిపాయీ. ‘‘కని పించడం లేదా నా కాషాయవస్త్రాలు? దొంగలు ఇలా ఉంటారా ఏమిటి?’’ తిరిగి ప్రశ్నించాడు భవానంద.

‘‘ఈ రోజులలో సన్యాసులు కూడా దొంగతనాలు చేస్తూనే ఉన్నారు.’’ అంతే తీవ్రంగా జవాబిచ్చాడు సిపాయీ.

ఈ మాటలు అంటూనే సిపాయి భవానందుడి మెడమీద గట్టిగా కొట్టాడు. కోపంతో భవానందుని నేత్రాలు ఎర్రబారినాయి. కాని పైకి ఏమీ అనలేదు. వినయస్వరంతో ‘‘అయ్యా! నన్ను ఏం చేయమంటారో ఆజ్ఞాపించండి!’’

ఈ వినయస్వరంతో సంతుష్టి కలిగింది సిపాయీకి. ‘‘ఈ మూట నెత్తిన పెట్టుకు నడువు!’’ అంటూ బరువైన మూట అతడినెత్తికి ఎత్తాడు. కాని ఇంతలోనే సిపాయిలలో మరొకడు ఇలా అరిచాడు. ‘‘వొద్దు వొద్దు. అలా వదిలి వేస్తే పరుగులు తీస్తాడు. వీడిని కూడా ఇందాకటివాడిమాదిరిగా కట్టి పడేద్దాం!’’ అన్నాడు.

ఈ మాటలు వినడంతోటే ఇందాకటి బందీని ఎక్కడ కట్టివేశారో చూడాలని భవానందునకు ఉత్కంఠ కలిగింది. తన నెత్తిమీది మూటను కింద పడవేసి, సిపాయీ దవడ మీద గట్టిగా దెబ్బతీశాడు. అప్పుడు సిపాయీలు అతడిని కూడా బంధించి మహేంద్రుడిని కట్టివేసిన చోటికే చేర్చారు. భవా నందుడు మొదటి బందీని చూడడంతోటే, ఇతడే మహేంద్రుడు అని గ్రహించగలిగాడు.

సిపాయీలు ఇంక నిశ్చింతగా కోలాహలంగా నడవసాగారు. బండి చప్పుడు చేసుకుంటూ ముందుకు నడుస్తోంది. అప్పుడు భవానందుడు అతి నింపాదిగా ‘‘మహేంద్రసింహా! నేను నిన్ను గుర్తు పట్టాను. నీకు సహాయం చేయటానికే ఇక్కడికి వచ్చాను. నేనెవరో నీవు ఇప్పుడే తెలుసుకోవలసిన అవసరం లేదు. నేను చెప్పేది మటుకు శ్రద్ధగా విను. నీచేతి కట్లు బండి చక్రాల మీద ఉంచు.’’

మహేంద్రుడు విస్మితుడైనాడు. అతడు ఏమీ మాట్లాడకుండా భవానందుడు చెప్పినట్లుగా చేశాడు. బండి చక్రం విసురుకు అతని చేతి బంధనాలు సడలి పోయినాయి. ఈ విధంగా చేతికట్లు తొలగించుకుని, కాళ్ల కట్లు కూడా తొలగించుకున్నాడు. భవానందుడు కూడా విముక్తుడు అయినాడు. ఇద్దరూ బండి మీద నిరామయంగా కూర్చొని వున్నారు. ఈ

బ్రహ్మచారి కొండమీద ఎక్కి, నాలుగు రోడ్లను పరికించి చూచిన రాస్తాగుండా ఈ సిపాయిలు వెళ్ల వలసి ఉంది. ఆ అరణ్య మధ్యంలో వారికి ఇంకొక మనిషి అక్కడ నిలబడి ఉండడం కనిపించింది.

సిపాయీలలో ఒకడు అతడిని పట్టుకోవటానికి పరుగు ప్రారంభించాడు. ఇది గమనించి కూడా అక్కడ నిలబడి ఉన్న మనిషి పారిపోవటానికి ప్రయత్నం చేయలేదు. అలాగే నిలబడి ఉన్నాడు. సిపాయీ దగ్గరగా వచ్చి అతడిని బంధించి వేసిన ప్పుడు కూడా అతడు ఏమీ మాట్లాడలేదు. సిపాయిలు ఇతడి నెత్తిమీద బరువైన మూట పెట్టి నడిపించ సాగారు. అప్పుడు హవల్దారు సిపాయీల వెనకగా నడుస్తున్నాడు. ఇంతలో పిస్తోలు పేలిన చప్పుడైంది. హవల్దారు పిస్తోలు దెబ్బ తగిలి కిందికి వాలి పోయాడు. ‘‘ఈ దొంగ వెధవ మన హవల్దారును చంపేశాడు’’ అంటూ ఒక సిపాయి కొత్తగా దొరికిన ఆసామీ చేయి పట్టుకున్నాడు. కాని అతని చేతిలో ఇప్పుడు కూడా పిస్తోలు ఉంది. పిస్తోలుతో సిపాయీ తల మీద బాదాడు. సిపాయీ ఈ దెబ్బకు నేల కొరిగాడు. ఈ సమయంలో ‘‘హరి హరి!’’ అను కుంటూ రెండు వందలమంది వ్యక్తులు సిపాయిలను చుట్టుముట్టారు. సిపాయీలు యజమాని రాక కోసం ఎడరు చూస్తున్నారు.

యజమాని దొంగలముఠా వచ్చిందని గ్రహిం చాడు. బండి దగ్గరకు వచ్చి నిలిచాడు. ఆంగ్ల సిపాయీలకు ఆపద సమయంలో మత్తు దిగి పోతుంది. బండి చుట్టూ వలయాకారంలో నిలి చారు. ఇంతలో ఎవరో సిపాయిల యజమాని నడుముకు బిగించి వున్న కత్తిని లాగారు. ఆ కత్తితోనే యజమాని తల నరికారు. ఆ తల నేల మీద పడి పోయింది. గుర్రం మీద నుండి అతడి శరీరం కూడా కిందికి ఒరిగిపోయింది.

(సశేషం)

About Author

By editor

Twitter
Instagram