– డా।। చెళ్లపిళ్ల సూర్యలక్ష్మి

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

విశాఖ వెళ్లే బస్సులో సామాన్లు సర్దుకుని కూర్చున్నాడు నిశ్చయ్‌. ‌తన ప్రాణసఖి నిశ్చల పక్కన లేనందుకు అదోలా ఫీల్‌ అయ్యాడు. ఎంతైనా పెళ్లయిన కొత్త కదా! కానీ, జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయంలో ఒక పూట పని కోసం రాత్రి బస, మళ్లీ సాయంత్రం బస్సులో ఇంటికి రాక – ఇంత శ్రమపడలేనని తేల్చి చెప్పేసింది నిశ్చల.

నిజమే, నాజూకుగా, బొమ్మలా ఉండే ఆమెను ఇంత శ్రమకి గురి చేయడం అమానుషమేనని తనకే అనిపించింది. పైగా, ఇది సింపుల్‌గా రెండూళ్ల మధ్య ప్రయాణం కానే కాదు. తనుండే ఏజెన్సీ ప్రాంతం నుండి పాడేరు వచ్చి, అక్కడి నుండి విశాఖ వెళ్లే బస్సెక్కి, ఓ రెండు మూడు గంటల్లో అక్కడకు చేరుకుని, రాత్రి ఏ లాడ్జిలోనో బస చేసి, పొద్దున్నే ఆఫీసుకి వెళ్లి, పని చూసుకుని, ఏ మధ్యాహ్నానానికో, సాయంత్రానికో బస్సు పట్టుకుంటే చిమ్మ చీకటి అయ్యాకే ఇల్లు చేరుకోవడం! ఏజెన్సీ ప్రాంతాల్లో జనాలు మంచి వాళ్లు గనుక ఆమె భద్రత విషయంగా తనకు ఎటువంటి చింతా లేదు.

ఎటొచ్చీ, ‘ఏమైనా తేవాలా?’ అని తాను అడిగిన ప్రశ్నకి ఆమె కోరిన కోరిక వింతగా అనిపించింది. స్త్రీలు ఇంత అభివృద్ధి చెందినా కూడా ఆమె ఇలా కోరడం వల్ల తనకు ఏదోలా అనిపించి, వెగటు, విసుగూ వచ్చాయి. కానీ, తమ ప్రేమ ప్రయాణం గుర్తుకి తెచ్చుకుని ఆమెని ఏమీ అనలేక పోయాడు.

తామిద్దరూ చిన్ననాటి స్నేహితులు. కాలంతో పాటు తమ స్నేహం ప్రేమగా పెరిగి పెద్దయ్యింది. ఆమె తండ్రి ఆస్తిపాస్తులని అమ్ముకుని పట్నం వెళ్లి పిల్లలని పట్టభద్రులని చేశాడు. తాను మాత్రం ఉన్న ఊళ్లో డిగ్రీ చదువుకుని, టీచర్‌ ‌ట్రైనింగ్‌ ‌ప్యాస్‌ అయ్యాడు.

ఇంజనీరింగ్‌ ‌చదివించాలన్న వాళ్ల నాన్నగారి ఆశని అడియాస చేసి ఆమె బీఎస్సీ చదివింది. అంతటితోనే ఆపేసింది, కాబోయే అత్తమామలు వాళ్ల కొడుకు కన్నా ఎక్కువ చదువుకున్న కోడలు వస్తే హర్షించరు కాబట్టి. ‘పట్నం పిల్లల్ని పట్టలే’మని వాళ్లనుకున్నా, దృఢ ‘నిశ్చ’యంతో, ‘నిశ్చల’ నిలకడతో ప్రేమికులు గెలిచి, పెద్దల ఆశీస్సులతో భార్యా భర్తలయ్యారు.

పాడేరు నుండి టూ-వీలర్‌ ‌మీద మాత్రమే వెళ్లే వీలుండే ఒక కుగ్రామంలో కొత్త కాపురం మొదల య్యింది. సింగల్‌ ‌టీచర్‌గా పని చేస్తున్న తనకి అప్పుడ ప్పుడూ విశాఖపట్నం వెళ్లవలసిన పనుంటుంది. కాపురం పెట్టాక ఇదే మొదలు.

ఆమె గొంతెమ్మ కోరికలేవీ కోరలేదు గాని, ఆ విచిత్రమైన కోరిక కోరే మనసు ఆమెకు ఎలా వచ్చిందో మాత్రం తనకు అవగతమవలేదు. తన తల్లిదండ్రులకి పట్నం పిల్లంటే ఇష్టం లేదు ఇందుకేనేమో, అని కూడా అనుకున్నాడు తను.

*******

ఆఫీసులో పని అనుకున్న దానికన్నా ముందరే అయిపోయింది. అతను ఎప్పుడు వైజాగ్‌ ‌వెళ్లినా పుస్తకాలో, ఇంటికీ, ఒంటికీ, వంటింటికీ సంబంధిం చిన వస్తువులు తెచ్చుకోవడం పరిపాటి. కానీ, భార్యకు కావలసింది కొనాలంటే ఎందుకో బెరుకు. తన గురించి ఆ దుకాణం వాడు ఏమనుకుంటాడు? అక్కడ మరెవరైనా ఉంటే తనని ‘చీప్‌’ అనుకుని, లోకువ కట్టరూ?

ఇన్ని సందిగ్ధాలు అయిన తరువాత, ‘నేను చేసే చిన్న ఉద్యోగాన్ని ‘చిన్న’గా చూడకుండా ఇష్టపడి సన్ను కట్టుకున్న మనిషి, పెళ్లయిన తరువాత మొదటి సారిగా కోరిన చిన్న కోరిక తీర్చ లేకపోతే ఎలా?’ అని తనకి తాను సర్ది చెప్పుకుని ఆమెకు కావలసిన వస్తువు కొన్నాడు.

దానికోసం దుకాణాదారుణ్ణి నిశ్చయ్‌ అడిగి నప్పుడు చూసుకోవాలి, దించిన తల ఎత్తకుండా అడిగాడు. ఎవరైనా చూస్తే, ‘పిల్లి కళ్లు మూసుకుని, ఎవరూ తనని చూడలేదని భ్రమపడుతుంది’ అనే సామెత గుర్తుకు వస్తుంది! అడుగకూడనిది అడిగాడని దుకాణాదారు కూడా అనుకున్నాడో ఏమో, ఆ వస్తువుని ముందు ఒక పాత వార్తాపత్రికలో చుట్టి, తరువాత నల్లరంగు క్యారీ బ్యాగ్‌లో పెట్టి ఇచ్చాడు.

*******

కాలచక్రం గిర్రున తిరిగి, నిశ్చయ్‌కి వ్యక్తిగతం గాను, వృత్తిపరంగాను పదోన్నతిని ప్రసాదించింది. ఇప్పుడు నిశ్చల-నిశ్చయ్‌లకి ఇద్దరు కూతుళ్లు. కవలలు. పదవ తరగతి మంచి మార్కులతో ప్యాస్‌ అయ్యారు. తల్లిదండ్రుల ఆదర్శవాదాన్ని పుణికి పుచ్చుకున్న ఆ అమ్మాయిలు మెడికల్‌, ఇం‌జనీరింగ్‌ అని ఎగబడకుండా, ఒకరు సంగీతం, మరొకరు చిత్రలేఖనం నేర్చుకుంటున్నారు. ఇక తన విషయాని కొస్తే, అమ్మాయిలు మాత్రమే చదివే ఒక ఉన్నత పాఠశాలకి హెడ్‌ ‌మాస్టర్‌ అయ్యాడు నిశ్చయ్‌.

*******

ఆ రోజు పాఠశాలలో అమ్మాయిలు తోరణాలు కట్టి, ముగ్గులు పెడుతున్నారు. కొంత సేపట్లో జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా విద్యా శాఖాధికారి వచ్చారు. నిశ్చయ్‌ ‌స్టేజీ మీద వారిరువురి నడుము కూర్చు న్నాడు. ముందుగా డీఈఓ మాట్లాడుతూ, ‘మన జిల్లాయే కాదు, మన రాష్ట్రంలో మరే జిల్లాలోనూ జరగని విడ్డూరం ఇక్కడ జరుగుతోంది. మొట్ట మొదటిసారిగా, ఒక ప్రభుత్వ పాఠశాలలో శానిటరీ నాప్కిన్‌ ‌వెండింగ్‌ ‌మిషన్‌ ‌నెలకొల్పు తున్నారు. ఇది ఒక పెద్ద ఘనత. మన దేశంలో స్త్రీల నెలసరి గురించి మాట్లాడడం ఒక సాంఘిక నేరం కింద పరిగణిస్తాం! అవునా?’ అన్నారు.

ఆడపిల్లలూ, టీచర్లూ మౌనం వహించారు. ‘చూశారా! మీ మంచి కోసం తీసుకునే చర్యల గురించి మాట్లాడడానికి మీకే ఇష్టం లేకుండా ఉంది. మరి, మీకు మేలు చెయ్యాలని మగవాళ్లు అనుకోకపోతే, వాళ్లని తప్పుబట్టలేం కదా! కానీ, మీ హెడ్‌ ‌మాస్టర్‌ ‌గారు అలాంటి వారు కారు. ఆడపిల్లల తండ్రులు ఈ దేశంలో ఎంతమందైనా ఉండవచ్చు. కానీ, నిశ్చయ్‌ ‌వాళ్లలో తలమానికం లాంటి వారు.

‘ఈ ప్రస్తావన తీసుకుని నా వద్దకు వచ్చినప్పుడు ముందు నేను విస్తుపోయాను. కానీ, అదే సమ యంలో సంతోషంగా కూడా అనిపించింది. ప్రభుత్వం తమకు తాముగా ప్రవేశ పెట్టిన సంస్కర ణల కన్నా, ప్రజలు ప్రభుత్వాన్ని కోరి చేయించుకున్న సంస్కరణలే ఎక్కువ కాలం నిలుస్తాయి.’

‘నిజానికి ఇవ్వాళ గౌరవనీయులైన కలెక్టర్‌ ‌గారు ప్రారంభించబోయే ఆ మిషన్‌ ‌స్త్రీలుండే ప్రతీ వృత్తిపరమైన ఆవరణలోనూ ఒక నిత్యావసర వస్తువు. అయినా, ఈ విషయంపై స్త్రీలు నోరు మెదపరు గనుక అది అంత ప్రజాదరణకి నోచుకోలేదు.’

‘నెలసరి సమయంలో పాటించవలసిన శుచీ-శుభ్రతల గురించి తల్లులకే సరైన అవగాహన లేదని కచ్చితంగా చెప్పగలను. అలాంటిది, ఈ పాఠశా లలో పిల్లల కోసం ఇలాంటి సదుపాయం చేయాలనుకున్న నిశ్చయ్‌ ‌మీకు తండ్రి కాని తండ్రి లాంటి వారు. ఆయన్ని మరోసారి అభినందిస్తూ, కలెక్టర్‌ ‌గారిని ప్రారం భోత్సవం చేసి, సభనుద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతు న్నాను’, అని ముగించారు డీఈఓ.

కలెక్టర్‌ ‌కరతాళ ధ్వనుల మధ్య వెండింగ్‌ ‌మిషన్‌ని, వాడిన నాప్కిన్లని శుచిగా తగులబెట్టే ఇన్సినరేటర్‌ని ప్రారంభించి, ‘నేను కూడా సంప్ర దాయబద్ధమైన కుటుంబంలోనే పెరిగి పెద్దవాణ్ణి అయ్యాను. సభ్యత గల మగవాళ్లు ఇలాంటి విషయాల గురించి మాట్లాడడం గాని, ఆరా తీయడం కానీ చేయకూడదని ఇంట్లో నేర్చుకున్నాను. మా అమ్మ, అక్కలు ఆ సమయంలో ఏవేం కష్టాలు పడేవారో, ఎలాగ నెట్టుకు వచ్చేవారో నాకు తెలియదు. మా అమ్మ సెర్వైకల్‌ ‌కాన్సర్‌తో మరణిస్తే కూడా నెలసరి సమయంతో దానికి ఉన్న అవినాభావ సంబంధాన్ని గుర్తించలేకపోయాను.

‘ఐఏఎస్‌కి ఎంపికయ్యాక మసూరీలో మాకు శిక్షణ ఇచ్చారు. ప్రజా సంక్షేమా నికి సంబంధించి, వివిధ అంశా లపై విశ్వవిఖ్యాతి గాంచిన వారి ఉపన్యాసాలు వినే అదృష్టం కలిగింది. ఆ వరుసలో, స్త్రీల సంక్షేమంపై అరుణా చలం అనే ఆయన ప్రసంగిస్తారంటే, ‘ఈయ నెవరు?’ అనుకున్నాను. గూగుల్‌ ‌చేస్తే ఆయన ‘ప్యాడ్‌ ‌మ్యాన్‌’ అని తెలిసింది. అప్పటికింకా ఆ పేరుతో సినిమా రాలేదు. నేను నేర్చుకున్న సంస్కారాన్ని బట్టి, ఆయనపై నాకు ఒక రకమైన చిరాకు పుట్టింది.’

‘దానికి తోడు, ఆయన మొదలు పెట్టిపెట్టంగానే, ‘ఇక్కడ ఉన్న వాళ్లలో షాప్‌కి వెళ్లి, శానిటరీ నాప్కిన్స్‌ని అడిగి కొన్న వాళ్లు చేతులు పైకెత్తండి’ అన్నారు. నేను తల దించుకుని ఉండిపోయాను. కానీ, ఆ రోజున ఒక పాఠం, కాదు కాదు… గుణపాఠం నేర్చు కున్నాను. ప్రజాసంక్షేమం సమకూర్చాలంటే మనం ఇదివరలో మాట్లాడడానికి జంకే విషయాల మీద కూడా నిర్ణయాలు తీసుకోవాలని అర్థమయ్యింది.

అందుకే, నిశ్చయ్‌ ‌గారు చేస్తున్న కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఘంటాపథంగా చెప్పగలను. ఆ చరిత్రలో నాకు కూడా చోటు దొరికినందుకు గర్వ పడుతున్నాను.

ఇక మీదట జిల్లాలోని పాఠశాలల్లోనూ, కళాశాల ల్లోనూ-ఒకటేమిటి, స్త్రీలు పనిచేసే పరిసరాలన్నిటిలో ఈ మిషన్లు తప్పనిసరిగా నెలకొల్పాలని ఆదేశాలు ఇస్తాను. అంతేకాదు, అన్నీ జిల్లాల్లోనూ ఈ ఆదేశాలు అమలు పరచాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తాను. మరో విషయం – తమిళనాడుకి చెందిన ఒక స్నేహితుడు, గీతా ఇళంగోవన్‌ అనే పాత్రికేయు రాలు ఈ అంశంపై చేసిన డాక్యుమెంటరీ ఇచ్చారు. దాన్ని ఇప్పుడు చూడండి – మనకి భాష అర్థం కాకపోవచ్చు గానీ, ఆ దృశ్యాలే చెప్పాల్సిన విషయాలు చెప్తాయి అని ముగించారు కలెక్టర్‌.

ఆ ‌సమయంలో ఎటువంటి శుచీ-శుభ్రతలు పాటించాలో, పర్యావరణానికి మేలు చేసే విధంగా ప్యాడ్‌ని ఇన్సినరేటర్‌ ‌సహాయంతో ఎలా బుగ్గి చెయ్యవచ్చో ఆ డాక్యుమెంటరీలో వివరించారు.

నిశ్చయ్‌ ‌మాట్లాడుతూ, ‘‘పెద్దలు కలెక్టర్‌ ‌గారు, డీఈఓ గారు నా కృషిని మెచ్చుకున్నారు. దీనంతటికీ కారణం నా భార్య. పెళ్లయిన కొత్తలో ఆమె కొనిపెట్టమని అడిగిన మొదటి వస్తువు శానిటరీ నాప్కిన్‌. ‌నేను విస్తుపోయాను. అయినా, భార్య కోసం మనసు చంపుకుని ఆ పని చేశాను. ఆ తరువాత బెరుకు దానంతట అదే పోయింది.

‘ఎటువంటి విషయమైనా నాతో చర్చించవచ్చని మా అమ్మాయిలని ప్రోత్సహించాను. అరుణాచలం గారి గురించి ఇంతకు ముందే పేపర్‌లో చదివినా, స్త్రీల మొహమాటం వల్ల, ఈ మహత్కార్యాన్ని తలపెట్టినా, నెరవేరే అవకాశం దొరకకపోవడం వల్ల, ఇప్పుడే ఈ పనిని చేయడం కుదిరింది.’

‘వెయ్యి మైళ్ల ప్రయాణం కూడా ఒక చిన్న అడుగుతోనే మొదలౌతుంది’, అని, ఆంగ్లంలో ఒక నానుడి ఉంది. ఇది వెయ్యో మైలురాయైతే, మా ఆవిడ కోసం నేను నాప్కిన్‌ ‌కొనడం మొదటి అడుగు అనుకోవచ్చు. ఆవిడే గనుక తన అవసరాన్ని ఒక కోరికలా కోరకుండా ఉంటే, నాలో ఉన్న ఈ బూజుని దులుపుకునే అవకాశం, తద్వారా నలుగురికి మేలు చేసి, ఇలా పెద్దల మన్ననలు పొందడం, జరిగేవి కావేమో’ అని కరతాళ ధ్వనుల మధ్య ముగించాడు నిశ్చయ్‌.

About Author

By editor

Twitter
Instagram