– బంకించంద్ర చటర్జీ

ఉపక్రమణిక

అత్యంత విస్తృతమైన అరణ్యం. ఆ అరణ్యంలో ఎక్కువ భాగం పత్తి చెట్లు. విచ్ఛేదశూన్యం, ఛిద్రశూన్యం అయిన ఆ అరణ్యంలో కాలిదారి అనేదే లేకుండా ఉంది. కొన్నిచోట్ల ఒక చెట్టు ఇంకొక చెట్టుతో ఒరుసుకుని వేడుకగా ముచ్చటలాడుకుంటున్నట్టు ఉన్నాయి. పశుపక్ష్యాదుల సవ్వడి తప్ప అక్కడ యింకే విధమయిన చప్పుడు వినిపించదు.

అది విస్తృతమయిన అగమ్యమయిన అంధకారమయమయిన అరణ్యం. పట్టపగలే ఎండ పొడ పడదు. ఇప్పుడేమో రాత్రి సమయం. అర్ధరాత్రి. చీకటి దట్టంగా అలముకుంది. భూగర్భంలో ఎటువంటి చీకటి అలుముకుని ఉంటుందో అడవిలో అలాగే ఉంది. అరణ్యానికి బయటకూడా చీకటితెరలు వ్యాపించి ఉన్నాయి. కంటికి ఏమీ అగుపించడంలేదు. అరణ్యంలోపల భయంకరమైన అంధకారం!

పశుపక్ష్యాదులన్నీ నిస్తబ్దంగా ఉన్నాయి. అఖిల ప్రాణజాతమూ పెను నిద్రావస్థలో  కూరుకొనిపోయాయి. ఈ అనంత శూన్యారణ్యంలో అంధకారం అంటే ఏమిటో బాగా తెలిసి వస్తుంది. భయానకమయిన నిస్తబ్దతను భేదిస్తూ ఈ ధ్వని వినవచ్చింది. ‘నా మనోరథం ఎప్పటికైనా నెరవేరుతుందా?’’

ఈ విధంగా మూడు పర్యాయాలు నిస్తబ్ద అంధకారం నుండి చొచ్చుకొని వచ్చి ఈ ప్రశ్న వినిపించింది.

‘అది సరే! నీ గాఢమైన మనోవాంఛ తీరడానికి నీవు ఏమి సమర్పించగలవు? ఏమిటి నీ నిశ్చయం?’’

జవాబు: ‘నా తనువునే ఇవ్వగలను. జీవసర్వస్వం… ప్రాణ సమర్పణే చేయగలను!’’

ప్రతిశబ్దం : ‘జీవనం తుచ్ఛమయినది. అందరూ దానిని త్యాగం చేయగలరు.’

 ‘అయితే ఇంకా ఏముంది? ఏమున్నది? నేనేమి ఇవ్వగలను? అంతకన్నా నా దగ్గర మరేముంది?’’

 జవాబువచ్చింది: ‘భక్తి! సడలని భక్తి. ఆరాధన. నా నేస్తమా! నీకుండవలసినది  అంకిత భక్తి’ అని పై నుంచి అతడికి నిశ్చల గంభీర స్వరం ఒకటి వినిపించింది.

ప్రథమ భాగము

1

వంగ సంవత్సరం 1176 (క్రీస్తుశకం 1769). వేసవికాలంలో ఒక రోజు. పదచిహ్న అనే పేరుగల ఆ ఊళ్లో ఎండవేడిమి దుస్సహంగా ఉంది. ఎప్పుడూ చూడలేదు అనే విధంగా ఉంది ఎండ. గ్రామంలో అనేక ఇళ్లు ఉన్నాయి. అయితే మనుషులు ఎవరూ అగుపించడం లేదు. పెద్ద బజారులో గొప్ప గొప్ప దుకాణాలు, రకరకాలయిన కొట్లు, చిన్న సందుల్లో మట్టి ఇళ్లు, మహాభవంతులు ఇలా అనేకం ఉన్నాయి. అయితే ఈరోజు అంతా నిర్మానుష్యంగా ఉంది. దుకాణదారు అక్కడనుండి ఎలా పారి పోయాడో ఎవరికీ తెలియకుండా ఉంది. ఈరోజు బజారంతా ఎంతో కళకళలాడుతూ, బేరసారాలతో సంతలా ఉండవలసిన రోజు. అయితే ఎందుచేతనో శూన్యంగా ఉండిపోయింది. భిక్ష జరగవలసిన రోజు. కాని భిక్షకులు ఎవరూ అగుపించటం లేదు. సాలెవాళ్లు తమ మగ్గాలను కట్టి పెట్టి ఇళ్లలో ఏడుస్తూ కూర్చున్నారు. వ్యవసాయదారులు తమ వ్యవసాయం మరచిపోయి, పిల్లలను ఒళ్లో పడుకోబెట్టుకుని విహ్వలులై ఉన్నారు. దాతలు తమ దానధర్మాలు మానివేశారు. ఉపాధ్యాయులు బడిని మూసి వేశారు. బహుశా పిల్లలు సైతం ఏడుపు మానివేసి ఉంటారు. ఎంత భయానక పరిస్థితులు వచ్చి పడ్డాయంటే శిశువులు ఏడవడానికి కూడా జడుసుకునే పరిస్థితి. ఉలికిపడే పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. రాజపథంలో ఇప్పుడు ప్రయాణికులు ఎవరూ నడవడం లేదు. వీథులన్నీ బావురుమంటున్నాయి. సరోవరాల దగ్గర స్నానార్థం కూడా ఎవరూ గుమిగూ డడం లేదు. ఇంటి గుమ్మాల ముందు సైతం ఎవరూ కనిపించడం లేదు. చెట్లపైన పక్షులు కూడా కని పించడంలేదు. అంతా స్మశానం మోస్తరుగా ఉంది.

ఒక పెద్ద భవనము కనిపిస్తోంది. ఆ భవనశీర్షం గగనాన్ని చుంబిస్తున్నట్లుగా ఉంది. చాలా దూరం నుంచే ఆ ఇంటిని చూడగలం. అరణ్య ప్రాంతంలో శైల శిఖరంలాగ అగుపిస్తోంది. కాని దాని తలుపులు మూసి ఉన్నాయి. ఎవరూ వచ్చి వెడుతున్న అలికిడి కూడా వినిపించడం లేదు. గాలి కూడా లోపలికి దూరలేదేమో అనిపిస్తోంది.

ఆ ఇంట్లో ఇప్పుడు భార్యాభర్తలు గాఢోద్విగ్నమైన మనసులతో, ఆలోచనలతో ఎదురెదురుగా కూర్చుని ఉన్నారు. రాత్రి అంధకారంలో ఆ భవనంలో ఒక గదిలో అప్పుడే వికసించిన పుష్పాలవలె ఆ దంపతులు కూర్చుని ఆలోచన చేస్తున్నారు. వారి ఎదుట కరవు భీతి వికటాట్టహాసం చేస్తున్నట్లు ఉంది.ఆ ఇంటి యజమాని మహేంద్ర సింగ్‌, ఆయన భార్య ఒకరినొకరు పలకరించుకునే ధైర్యం కూడా కోల్పోయి ఆలోచనలలో మునిగిపోయారు.

1174లో (క్రీ.శ.1767) పంటలు ఏమాత్రం బాగా పండలేదు. అందువల్ల 1175లో (క్రీ.శ. 1768) కరవు వచ్చింది. భారతవాసి కష్టంలో పడిపోయాడు. కాని నవాబులు మాత్రం తమకు రావలసిన పన్నులను పైసలతో సహా వసూలు చేస్తున్నారు. దరిద్రంతో తల్లడిల్లిపోతున్న ప్రజలు రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేస్తున్నారు. పైసలు కూడబెట్టి పన్నులు బకాయి లేకుండా చూచుకున్నారు.

 మరు సంవత్సరం సకాలంలో వర్షాలు పడి నాయి. రైతులు చాల ఆనందించారు. పంటలు బాగా పండుతాయని ఆశించారు. దేవతలు ప్రసన్నులయి నారని సంతోషించారు. గ్రామాలలోని మఠాలలో, మందిరాలలో గానా బజానా తిరిగి ప్రారంభం అయింది. స్త్రీలు తమకు నగలు చేయించవలసిందిగా భర్తలతో తగువులాడుతున్నారు. అంతా ఆనందమ యంగా ఉండగా, హటాత్తుగా ఆశ్వీయుజ మాసంలో దేవతలు తిరిగి విముఖులు అయినారు. ఆశ్వీ యుజం, కార్తీక మాసాలలో ఒక్క నీటి బొట్టు అయినా ఆకాశం నుండి రాలలేదు పొలాలలో వరి ఎండి గడ్డి అయిపోయింది. వర్షం లేకపోవడంవల్ల కంకి వేయలేదు. ఒకటి రెండు చోట్ల కొద్దిగా ధాన్యం పండింది. కాని దానిని తమ సైన్యం కోసం రాజు గారు కొనివేశారు. అందువల్ల జనానికి భోజన ప్రాప్తి లేకుండాపోయింది. ముందు ఒక పూట పస్తు ఉండడం ఆరంభించారు. ఒక్కొక్కసారి ఈ పూట అయినా అర్ధాకలితోనే లేచిపోవలసి వచ్చేది. తరువాత ప్రతిరోజూ ఉపవాసమే అయిపోయేది. చైత్ర మాసంలోని పంట నోటి దగ్గరకు వస్తూనే మాయం అయిపోయింది. అయితే పన్నులు వసూలు చేసే అధికారి మహమ్మద్‌ ‌రజాకాన్‌ ‌మటుకు తన ధనార్జనకు ఇదే తగిన సమయమని ఆనందించాడు. పన్నును ఒక్కమారుగా పదిశాతం పెంచివేశాడు. వంగ దేశంలో ఇంటింటా ఆర్తనాదాలు వినిపించ సాగినాయి.

మొదట ప్రజలు భిక్షుకవృత్తి ఆరంభించారు. కాని బిచ్చంగూడా దొరక్కుండాపోయింది. అప్పుడు ఉపవాసాలు ఆరంభించారు. ఆపైన వారికి రోగాలు రాసాగినాయి. వ్యవసాయపు పరికరాలైన నాగళ్లు, వక్కులు, తాళ్లు వేళ్లు అమ్ముకున్నారు. విత్తనాలకోసం అట్టిపెట్టుకున్న ధాన్యం అమ్ముకున్నారు.

ఇళ్లు వాకిళ్లు అమ్ముకున్నారు. పొలాలు అమ్ము కున్నారు. దీని తరువాత ప్రజలు పిల్లలను అమ్ము కోవడం కూడా ఆరంభించారు.

పిల్లలు అయిపోయిన తరువాత గృహలక్ష్మిని అమ్మసాగారు. ఆపైన బాలబాలికలను భార్యలను అమ్ముతామంటే మాత్రం కొనేవారు ఎవరున్నారు? అందరూ అమ్ముతాము అనేవారే. కాని కొనేవారు ఎక్కడ ఉన్నారు? ఆకలి బాధకు తట్టుకోలేక ప్రజలు – ఆకులు అలములు తిని కడుపు నింపుకోసాగారు. అట్టడుగు జాతులకు చెందినవారు కుక్కలను, పిల్లులను, ఎలుకలను చంపి తినసాగారు. ఈ దేశం వదలి పారిపోయినవారు విదేశాలలో అన్నాహారాలు లేక మరణించారు. పారిపోకుండా ఇక్కడే ఉన్నవారు అయినవీ కానివీ తిని రోగాలు తెచ్చుకుని ఇక్కడే చనిపోయారు.

రోగాలు బాగా విస్తరించడానికి ఇదే సమయం. జ్వరము, మసూచికము, క్షయ, కలరా ఇటువంటి అంటువ్యాధులు బాగా వ్యాపించాయి. మసూచి జ్వరము బాగా వ్యాపించింది. ఇంటింటా మహ మ్మారికి గురియై ప్రజలు చనిపోతున్నారు. వీళ్లందరికీ ఎవరు సేవలు చేస్తారు? నీళ్లూ పాలూ ఎవరు ఇస్తారు? చికిత్స లేదు, ఆలన పాలన లేదు. చనిపోతే శవాలను కూడా ఎవరూ ఎత్తివేయడంలేదు. అతి రమణీయము, మనోహరము అయిన ఇళ్లు వాకిళ్లు ఇటువంటి మరణాలతో నిండిపోతున్నాయి. ఇంటిలో ఎవరికైనా మసూచికం అంటుకున్నదీ అంటే, మిగిలినవారు ఆ ఇంటిని వదిలి పోతున్నారు.

పదచిహ్న గ్రామంలో మహేంద్రసింహుడు గణ నీయమయిన వ్యక్తి. అతడు చాల ఐశ్వర్యవంతుడు. అయినా ఈ కరవు మూలంగా బీదవారు, భాగ్య వంతులు ఒకటే అయిపోయారు. ఈ సమయంలో రోగగ్రస్తులై అతని ఆత్మబంధువులు, స్వజనం, నౌకర్లు చాకర్లు అందరూ వెళ్లిపోయారు. చనిపోయినవారు చనిపోయారు. మిగిలినవారు పారిపోయారు. ఇప్పు డిక ఆయన భార్య, బిడ్డ మాత్రం మిగిలి ఉన్నారు.

ఆయన భార్య కల్యాణి ఆలోచనలు కొద్దిసేపు పక్కకు నెట్టి గోశాలకు వెళ్లింది. ఆవుపాలు తీసుకు వచ్చింది. తానే స్వయంగా పితుక్కు వచ్చింది.

పాలు వెచ్చ చేసి అమ్మాయి చేత తాగించింది. ఆవుకు మేతవేసి వచ్చింది. ఆమె వచ్చి కూర్చున్న తరువాత మహేంద్రుడు ‘‘ఇక ఎన్నాళ్లు సాగుతుంది?’’ అన్నాడు.

‘‘ఎన్నో రోజులు గడవదు. ఎన్నాళ్లు గడుస్తుందో అన్నాళ్లూ గడుపుదాం. ఆ తరువాత మీరు అమ్మాయిని తీసుకుని పట్టణం వెళ్లిపొండి.’’ –

‘‘పట్టణానికి వెళ్లడం తప్పనిసరే అయితే, ఇప్పుడు ఇక్కడ ఇలా కష్టపడడం ఎందుకు? ఇప్పుడే వెళ్లి పోవచ్చును కదా!’’ అన్నాడు మహేంద్రుడు. దీని తరువాత ఇద్దరూ ఈ విషయమై చాలా సేపు సమాలోచించుకున్నారు.

‘‘పట్టణానికి వెళ్లినందువల్ల విశేషలాభం ఏదయినా ఉంటుందా?’’ అని అడిగింది కల్యాణి.

‘‘ఆ ప్రదేశం కూడా ఇలాగే జనశూన్యం అయిపోతుంది. ప్రాణ రక్షణోపాయం కూడా ఉండదనుకుంటాను.’’

‘‘మూర్షిదాబాద్‌, ‌ఖాసింబజార్‌, ‌కలకత్తా ఏదో నగరానికి వెళ్లి ప్రాణాలు కాపాడుకుందాం. ఏమయినా, త్వరగా ఈ గ్రామం వదలి వెళ్లడమే ఉచితమని తోస్తోంది.’’

‘‘మన పూర్వీకులు సంపాదించిన డబ్బంతా ఈ ఇంటి నిండా మూలుగుతోంది. మనం వెళ్లిపోతే దీనిని దొంగలు దోచుకుంటారు.’’

‘‘ఇప్పుడు దొంగలు దోచుకుందుకు వచ్చినా మనం అడ్డుపడగలమా ఏమిటి? ఒక ప్రక్క ప్రాణాలు పోతూ ఉంటే, ఈ భోగభాగ్యాలను గురించి ఆలోచన ఎందుకు? తలుపులన్నీ మూసి వెడదాం. బతికి బాగుంటే, తరువాత వచ్చి అనుభవించవచ్చును’’ అంది కల్యాణి.

‘‘నీవు నడవగలవా? బోయీలంతా చనిపో యారు. ఎడ్లు ఉన్నాయిగాని బండిలేదు. బండి ఉంటే బండివాడు లేడు. ఎలా ప్రయాణం చేయడం?’’

‘‘విచారించకండి. నేను కాలినడకనే వస్తాను.’’

కల్యాణి మనసులో ఒక నిశ్చయానికి వచ్చింది. అదేమిటంటే మార్గమధ్యంలో తాను నడవలేక చనిపోయినా బిడ్డా, భర్తా క్షేమంగా ముందుకు వెళ్లగలుగుతారు. రెండవరోజు ఉదయం కూడా కొంత డబ్బు తీసుకుని పశువులన్నిటినీ విప్పివేసి, అన్ని తలుపులకు తాళాలు వేసి, పిల్లను చంకన వేసుకుని ఇద్దరూ రాజధాని వైపు ప్రయాణం సాగించారు. మహేంద్రుడు ‘‘దారి చాల కంటక ప్రాయంగా ఉంటుంది. అడుగడుగునా దొంగల భయం. ఉత్తచేతితో వెళ్లడం మంచిదికాదు’’ అంటూ తిరిగి ఇంటికి వెళ్లి తుపాకి, తూటాలు తీసుకు వచ్చాడు. వాటిని చూచి కల్యాణి ‘‘సమయానికి గుర్తుచేశారు. నేను కూడా రక్షణాస్త్రం తెచ్చు కుంటాను. కాస్త సుకుమారిని ఎత్తుకోండి’’ అని ఇంటిలోనికి వెళ్లింది. ‘‘నీవేం అస్త్రం తెస్తావు?’’ అడిగాడు మహేంద్రుడు.

కల్యాణి ఇంటిలోనికి వెళ్లి విషం ఉన్న డబ్బాను తన కొంగుకు ముడి వేసుకుని ఇవతలకు వచ్చింది. దుఃఖదినాలలో ఎటువంటి ఆపదలు వస్తాయో ముందు ఊహించలేం. ఈ ఆలోచనతోనే కల్యాణి విషం సేకరించి చిన్న డబ్బాలో జాగ్రత్త చేసుకుంది.

జ్యేష్టమాసం అవడంచేత భూమి అగ్నిగోళంలా మండిపోతోంది. గాలి వెంటే నిప్పు సెగలు వ్యాపిస్తు న్నాయి. ఆకాశం కాలిన రాగిపళ్లెం లాగ వేడిమిని ప్రసారం చేస్తోంది. కల్యాణి శరీరం నుండి చెమట ధారలుగా కారుతోంది. ఆమె అడపా దడపా చెట్ల నీడల కింద కూర్చుని సేద తీర్చుకుంటూ అలాగే ఆయాసంతో నడక సాగిస్తోంది. చెరువులలో దొరికిన మురికి నీరే తాగి దప్పిక తీర్చుకుంటోంది. అమ్మా యిని మహేంద్రుడు ఎత్తుకున్నాడు. అప్పుడప్పుడు మహేంద్రుడు భార్యకు సపర్యలు చేస్తున్నాడు. కల్యాణి ఇంత శ్రమకు ఓర్చుకుని ఈ విధంగా ప్రయాణం చేస్తూ ఉండడం మహేంద్రుడికి ఆశ్చర్యం కలిగి స్తోంది. దగ్గరలో ఉన్న ఒక జలాశయం దగ్గర అంగవస్త్రం తడుపుకు వచ్చి అమ్మాయికి, భార్యకు కాళ్లు చేతులు, ముఖం తుడిచాడు మహేంద్రుడు.

ఈ సపర్యల వల్ల కల్యాణికి కొంతవరకు సేద తీరింది. కాని ఆకలి బాధ ఎక్కువ అవసాగింది. వారిద్దరూ ఎలాగో ఆకలి బాధను అణచుకోగలుగు తున్నారుగాని, అమ్మాయి సంగతి ఏమిటి? వారు తిరిగి నడక ప్రారంభించారు. ఆ అగ్ని తరంగాలను దాటుకుంటూ వెళ్లి సంధ్యాసమయం కాకముందే ఒక బస్తీకి చేరుకున్నారు. బస్తీ చేరుకోవడంతోటే మహేంద్రునకు చాల తృప్తి కలిగినట్టయింది. ఇక్కడ తన భార్యకు, కుమార్తెకు భోజనాదికాలు, విశ్రాంతి లభిస్తాయని అతడి ఆశ. కాని ఈ ఆశ అంతరించటా నికి ఎక్కువసేపు పట్టలేదు. అటు ఇటు పరికించి చూచాడు మహేంద్రుడు. ఎవరూ మానవమాత్రులు అగుపించడంలేదు. ఎక్కడా సంచారమే కరవైపో యింది. పెద్ద పెద్ద ఇళ్లూ, భవంతులూ, మేడలు-అన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. అందరూ పట్టణం నుంచి పారిపోయారన్నమాట! మహేంద్రుడు తన భార్యను, కుమార్తెను ఒక ఇంటిలోనికి తీసుకువెళ్లాడు. వారిని లోన కూర్చుండజేసి, ఆ ఇంటిలో ఎవరైనా పలుకుతారేమోనని పిలిచాడు. బదులులేదు. తరు వాత కల్యాణితో ‘‘కొద్దిసేపు ధైర్యంగా ఇక్కడే కూర్చో. నేను బయటకు వెళ్లి కాసిని పాలు దొరుకుతాయేమో చూచి తీసుకువస్తాను’’ అని మహేంద్రుడు మట్టిపాత్ర తీసుకుని బయటకు వెళ్లాడు.

(సశేషం)

About Author

By editor

Twitter
Instagram