– డా।। గోపరాజు నారాయణరావు –

పని నుంచి తిరిగి వస్తుంటే అన్నాడు గారంగి లింగాలు, ‘రామన్న! చాలా కతలు చెప్పావు. మొట్టాడం వీరయ్య దొర గురించి చెప్పలేదేం?’ అంత శ్రమ చేసి వస్తున్నా, డస్సిపోయి ఉన్నా కూడా కత కోసం లింగాలు అడగడం రామన్న కళ్లలో నీళ్లు తెప్పించింది. ‘ఆయన కత ఎందుకు వదిలేస్తాను. అంతా సొంతూళ్లకి వెళ్లే యావలో ఉన్నారు! వినాలని ఉండాలి కదా!’ అన్నాడు రామన్న. ‘అబ్బే, అలా అనుకోవద్దు. ఇంక మిగిలింది ఈ ఒక్కరాత్రే! ఆ కత కూడా చెప్పు. అంతా వస్తాం.’ హామీ ఇచ్చాడు లింగాలు. అన్నం తిన్న తరువాత అంతా అక్కడికి చేరుకున్నారు. రోజూ వచ్చే వాళ్ల కంటే ఇద్దరో ముగ్గురో ఎక్కువే కనిపించారు. నలుగురో ఐదుగురో ఆడవాళ్లు కూడా వచ్చారు. నెగళ్లు రాజుకొంటు న్నాయి. చివరిరోజని కొంచెం జాగు చేశారు, వెలిగించడం. చలికి చివరి రోజేమిటి? అంతకంతకీ తన ఉనికిని చాటడడం మొదలెట్టింది. కట్టెలలో నిప్పు పడింది. పొగ గాలివాటుగా పోతోంది. బాగా అలసి పోయి ఉన్నాడు రామన్న. కాళ్లు గుంజుతున్నాయి. కళ్లు లోతుకుపోయాయి. సలుపుతున్న చేతి వేళ్లని సుతారంగా ఒత్తుకుంటున్నాడు. నూతిలో నుంచి వస్తున్నట్టున్నాయి మాటలు. ‘గూడెం పాతవీధి ముఠాకీ తెల్లోళ్ల పోలీసోళ్లకీ ఎప్పుడూ చుక్కెదురే. అసలు తలొంచలేదు. ఈ కొండలకే గుండెకాయ గూడెం ముఠా. ముఠాదారులని కోతుల్లా ఆడించాలని చూసిన తెల్లతోలంటే మొదటి నుంచి చీదరించు కుంటున్న ముఠా ఇదే. తగ్గి వీరయ్యదొర గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత వచ్చాడు మొట్టాడం శొబిలం దొర. ఆయనా తెల్లోళ్ల మీద కత్తి కట్టాడు. ముఠాదారు పదవిలో ఉన్నోళ్లు తిరుగుబాటుదారులకీ, పితూరీదారులకీ ఆసరా ఇవ్వకూడదని అదే పనిగా చాటించేది సర్కారు. ఆ ఆజ్ఞను ధిక్కరించాడు గొబిలం. ఆయన కాలంలోను ఒక తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటులో ఉన్నోళ్లని ఈయనే ఓ కాపు కాశాడు. సాకు కోసం చూస్తున్న పోలీసోళ్లు గొబిలం దొరని అరెస్టు చేసి వాల్తేరు జైలుకు పంపిం చారు. ఈ మధ్యలో ఇంకొకటి జరిగింది. శివసారుల తిరుగుబాటుకు ఆసరా ఇచ్చినందుకు లంబసింగి ముఠాదారుడిని మన్యం నుంచి వెలేసింది సర్కారు. అప్పుడే చంద్రయ్య పితూరీలో పన్డేసిన ఒకాయన లంబసింగి ముఠాదారుకి పితూరీ ఎలా లేవదీయాలో చెప్పాడు. లంబసింగి ముఠాదారు రెండు వందల మందిని కలుపుకున్నాడు. నేరుగా పోయి కృష్ణదేవిపేట పోలీస్టేషన్‌ ‌కొట్టేశాడు. కకావికలైపోయారు పోలీ సోళ్లు. తరిమి తరిమి కొట్టి ఐదుగురు కానిస్టేబుళ్లను చంపేసింది ఆ దండు. ఆయుధాలు, మందుగుండు దోచుకుని స్టేషన్‌ని తగులబెట్టారు. అక్కడ నుంచి వాళ్లెవరూ మళ్లీ కనిపించలేదు. నెలరోజులైనా ఎవరి ఆచూకీ దొరకలేదు. అంతా కొండలలో దాగారు. మళ్లీ శాపం. హఠాత్తుగా పితూరీ నాయకుడు చచ్చి పోయాడు. ఇంకో ముఠాదారు పితూరీదారులందరి ఆచూకీ పోలీసులకి చెప్పేశాడు. ఆ పితూరీ అలా చల్లారి పోయింది. మళ్లీ గూడెం పాతవీధి ముఠా దగ్గరకి వద్దాం. అసలే తెలోళ్లంటే అసహ్యించుకునే ఆ ముఠాలో తిరుగుబాటు రాకుండా గొబిలం దొరని పోలీసులు పట్టుకుపోయిన తర్వాత ఆయన కొడుకు, చిన్నోడు, అతడినే ముఠాదారుని చేశారు. ఆయనే మొట్టాడం వీరయ్యదొర. తండ్రిని బంధించి, కొడు కును గద్దెనెక్కించే కుతంత్రం నడుపుతూ ఉంటారు తెల్లోళ్లు. ఎందుకు? తిరుగుబాటు రాకుండా. ఇక్కడ కూడా అదే వరస. కానీ పులి కడుపున పులే పుడత దన్న నిజాన్ని చాటినోడు వీరయ్య దొర. ఊహ తెలి సిన తరువాత మొట్టాడం వీరయ్య దొర కూడా అయ్య బాటలో ప్రయాణం కట్టాడు. ముఠాదారులు తిరుగు బాట్లకు ఆసరాగా ఉండకుండా, పితూరీలలోకిపో కుండా ఆయుధాలన్నీ తీసేసుకున్నారు పోలీసులు. అంతేనా, ఆ పేరుతో ముఠాదారుల వంశపారం పర్యపు హక్కులో కూడా జోక్యం మొదలైంది. ముఠా లని వాళ్ల చేతుల్లో పెట్టుకుని, పదవుల్లోంచి గెంటేసిన ముఠాదారులకి సంవత్సరానికి ఇంత అని భరణం ఇవ్వడం మొదలైంది. అది కూడా ఎక్కువకాలం ఇవ్వ లేదు. ముఠాదారుల కాడ చిల్లిగవ్వ లేకుండా అయిపోయింది. అందుకే గోదారి లోయలో లాగ రాయి దగ్గరే పోలీసుల మీద, అటవీ అధికారుల మీద మళ్లీ తిరుగుబాట్లు మొదలైనాయి. ఈ తిరుగు బాటుదార్లకి వీరయ్యదొర ఆసరాగా ఉన్నాడని బయట పడిపోయింది. వీరయ్య దొరని కూడా పదవి నుంచి తీసేశారు. విజయనగరం తీసుకుపోయి బంధిం చారు. విజయనగరంనుంచి తప్పించుకుని మన్యంలో కుటుంబం దగ్గరకు వచ్చాడు. మళ్లీ అరెస్టు చేసి, రాజవొమ్మంగి పోలీస్‌స్టేషన్లో పెట్టారు. ఇప్పుడు అక్కడే ఉన్నాడాయన. అసలే ముదిమి. ఎన్ని బాధలు పడతన్నాడో అక్కడ! వీరయ్య దొరగార్ని విజీనగరం పంపేసినా లాగరాయి కాడ గొడవలు ఆగలేదు. లాగరాయి-కొండపల్లి దగ్గర వేరే వాళ్లు కూడా పితూ రీలు లేవదీశారు. అక్కడ కూడా పోలీసులు, అటవీ అధికారుల బాధలు ఎక్కువైపోయాయి. ఏ తిరుగు బాటు చూడండి! పోలీసుల మీద కడుపు మంటతోనే. పోలీసోళ్లు పెట్టే బాధల గురించి ఎవరికి చెప్పాలి? ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. ఇంక చేసేదేముంది? కొందరు కోయలు, ఓజులు (కమ్మరులు) ఆయుధాలు పట్టుకుని దాడులు మొదలుపెట్టారు. వీళ్లందరూ కొండపల్లి, లాగరాయి ప్రాంతాల వాళ్లే. వీళ్లు కూడా పోలీస్టేషన్లు కొట్టాలనే చూసేవారు. సంవత్సరంపాటు ఆ చుట్టుపక్కల ఎక్కడో ఒకచోట పోలీస్‌స్టేషన్లు తగలబడుతూనే ఉన్నాయి. చివరికి పోలీసులు వీళ్లని ఉత్తరానికి తరిమివేశారు. ఇంక మిగిలినోడు గరిమల్ల మంగడు. ఈయన కృష్ణదేవిపేటలో గొడవలు లేవదీశాడు. మూడు పంటలకి ముందే, గుర్తు లేదా! లాగరాయి అల్లర్లను చూసి మంగడు పితూరీ లేవ దీశాడు. ఎక్కువకాలం నడవలేదు. పోలీసులు కృష్ణ దేవిపేటలోనే మంగణ్ణి పట్టుకుని కాల్చేశారు.’ అంటూ ముగించాడు రామన్న. రెండు నిమిషాల మౌనం. ‘ఈ కతలన్నీ మాకు ఎందుకు చెప్పావ్‌!’ ‌దాదాపు ఏడుస్తూ అడిగాడు లింగాలు. వాళ్లందరి వీరత్వం తలుచుకుంటూ, ఇప్పుడు కొండవాళ్ల దైన్యాన్ని ప్రత్య క్షంగా చూస్తుంటే దుఃఖం తన్నుకొస్తోంది. ‘ఆ కత ఇప్పుడు నా కోసం మళ్లీ జరగదు. నేను ఆ కతలోకి వెళ్లలేను. ఎందుకు మరి!’ మళ్లీ అతడే అన్నాడు.

జవాబిచ్చాడు రామన్న. ‘ఇలాంటి దుఃఖం మన గుండెల్లో కొండగాలిలా వీస్తూనే ఉండాలనే చెప్పాను. కలవర పెట్టాలనే చెప్పాను.’ మళ్లీ తనే తాపీగా అన్నాడు. ‘ఆ కతలు చెప్పుకుంటే పెతర్లు (పూర్వీకుల ఆత్మలు) ఇక్కడే తిరుగుతాయి. పెతర్ల గురించి చెప్పుకుంటే నెత్తురు ఉప్పొంగుతాది. ఉప్పొంగాలి. పెతర్ల గురించి మరిచిపోతే, నెత్తురు ఉప్పొంగడం మరిచిపోతే బానిసల్లా బతకడానికి అలవాటు పడిపోతాం!’ నెగళ్లు నిశ్చలంగా మండుతున్నాయి.

**********

‘మూగయ్యా! పేనం బాగా లేదంటన్నావ్‌, ‌నిన్నటి నుంచి! ఇంకా పడుకోలేదేం! అన్నట్టు కిష్టయ్య గొంగడి ఇస్తాడని చెప్పావ్‌. ‌తెచ్చుకోలేదా? మళ్లీ ఆ గోనె గుడ్డలే కప్పుకున్నావేం? ఈ రోజైనా ముసుగెట్టి హాయిగా పడుకో!’ అన్నాడు, కంటందొర, గుక్క తిప్పుకోకుండా. రామన్న కథ విని ఎవరికి వారు వెళ్లిపోయారు. మూగయ్య ఒక్కడే ఆ నెగడు దగ్గర మిగిలాడు. అన్ని నెగళ్లు చురచుర మండుతున్నాయి. మూగయ్య కూర్చున్న చోటికే వచ్చాడు శనోరం ఊరు యువకుడు, కంటందొర.

రాత్రికి కాపలా. రేపు ఉదయం బియ్యం, కూలి డబ్బులు తీసుకుని సొంతూళ్లకి వెళ్లిపోతామన్న సంగతి అక్కడున్న చాలా మందికి ఆనందాన్నిస్తోంది. మూగయ్య మాత్రం దిగాలుగానే ఉన్నాడు. ‘ఇప్పటి నుంచీ దిగులెందుకు మూగయ్యా! డబ్బులు, బియ్యం వచ్చినన్ని వస్తాయి. లేకపోతే లేదు. మనకి అలవాటే కదా! మాట్లాడవేం! కిష్టయ్య ఇచ్చాడా? లేదా?’ అన్నాడు జాలిగా. ఏమీ మాట్లాడకుండా ఆ మంటకేసే చూస్తూ రెండు చేతులూ చలి కాచుకుంటు న్నాడు మూగయ్య. ‘ఏంటి మాట్లాడవు? ఇచ్చాడా లేదా గొంగడి!’ ‘ఇచ్చాడ్రా!’ మౌనం వీడి, నిమిషం తరువాత అన్నాడు మూగయ్య, బాగా జలుబు చేసిన గొంతుతో, ‘మరి కప్పుకో. ఇన్ని రోజులు చలితో ఎంత బాధపడ్డావో నాకు తెలుసు. మరి కప్పుకో’ అన్నాడు కంటం. ఒక వెర్రి నవ్వు నవ్వి ‘నేను కప్పు కునే ఉన్నాన్రా!’ అన్నాడు మూగయ్య. ‘మరి కంపు కొడతన్న ఈ గోనెగుడ్డలెందుకు పైన?’ అంటూ దగ్గరగా వచ్చి లాగాడు కంటందొర. ఆ రెండు నేల మీద పడిపోయాయి. నిజమే! భుజం నిండా ఉంది గొంగడి. దాన్ని చూసి విస్తుపోయాడు కంటందొర. ఎక్కడ చూసినా తాటికాయలంత రంధ్రాలు. మొత్తం కొట్టేశాయి ఎలుకలు.

మూగయ్య ముఖం చూడ్డానికి ధైర్యం చాల్లేదు కంటం దొరకి. కిందకి వంగాడు మూగయ్య గోనె గుడ్డల కోసం. అతడి కళ్ల నుంచి రెండు కన్నీటి బొట్లు తళుక్కుమంటూ రాలిపడడం ఆ నెగడు వెలుగులో కనిపించింది.

**********

‘ఆ డబ్బులు ఇస్తాడంటావా?’

గూడులోనే చాప మీద పడుకుని ఉన్నాడు ఆమె మొగుడు పిట్టల చిన్నయ్య. అతడి పక్కనే కూర్చుని ఉంది అతడి భార్య కొండమ్మ. కళ్లు ఒక్కసారి తెరిచి, గూడు ఎదురుగా ఉన్న చురచుర మండుతున్న నెగడు కేసి చూసి, మళ్లీ మత్తుగా మూసుకుంటూ అన్నాడు ‘దేవుడికి తెలియాలి.’ రోడ్డు పని మొదలవుతోందంటే ఎంత దిగులో, ముగుస్తున్నదన్నా అంతే దిగులు. ఆ దిగులు వెనుక ఎన్నో అనుభవాలు మరి! చింతపల్లి రోడ్డు పని పూర్తయ్యాక రాజుపాకలులో ఎదురైన అనుభవం ఇప్పటికీ కొండమ్మ కళ్ల ముందు కదులు తూనే ఉంది. కొన్ని నెలలు అవుతున్నా, నిన్న మొన్నే జరిగినట్టుంది. రాళ్లపాలెం నుంచి వెళ్లి ఆరు వారాల పాటు పనిచేశారు మొగుడు పెళ్లాం కూడా. మూడేసి వారాల వంతున రెండుసార్లు వచ్చారు. అక్కడి రోడ్డు పనికి వచ్చిన దాదాపు అందరూ అంతే. నడి వేసవిలో పని. అయినా చేశారు. కొండమ్మకు కూలి మాత్రం దక్కలేదు. సరికదా, దొంగతనం అంటగట్టాడు సంతానం. అక్కడనే ఏమిటి, రోడ్డు పని జరిగిన ప్రతిచోటా ఇదే తంతు. ఒకసారి కొండమ్మ, ఇంకో సారి రాజమ్మ, కాకపోతే చింతమ్మ, రంపులమ్మ.. ఆ పని పూర్తి కాలేదనీ, ఈ పనిలో లోపం ఉందనీ పూటన్నర పాటు అదనంగా ఉంచే శాడు బాస్టియన్‌ అప్పుడు. చివరికి వదిలి పెట్టాడు. ఇలాగే, నెగళ్లు వేసుకుని ఉన్నారు అక్కడ. ఆ రాత్రి హాయిగా తిని పడుకుని పొద్దుటే వచ్చేయ్యమన్నాడు మేస్త్రీ రామమూర్తి మునసబు ఇంటికి.

బాస్టియన్‌ ‌నులక మంచం మీద కూర్చున్నాడు. సంతానం పిళ్లై మస్తర్లు పట్టుకుని అరుగు మీద కూర్చు న్నాడు. గిరిజనులంతా మునసబు ఇంటి ముందు ఖాళీ స్థలంలో గొంతుక్కూర్చుని ఉన్నారు. దాదాపు నూట యాభయ్‌ ‌మంది. కొద్దిసేపు లెక్కలు చూడడం, మధ్యలో లేచి వెళ్లి బాస్టియన్‌ ‌చెవిలో ఏదో ఊదడం. అలా నాలుగుసార్లు అయ్యాక అప్పుడు పిలవడం మొదలుపెట్టాడు పేర్లు. ‘‘గారంగి లింగాలు’ నెమ్మ దిగా చదివాడు. ‘గారంగి లింగాలు’ కోర్టులో అమీ నాలా గట్టిగా అరిచాడు అక్కడ మేస్త్రీ రామ మూర్తి. లింగాలు అన్ని రోజులూ రాళ్లు మోసే పనే చేశాడు. తవ్విన మార్గంలో బయటపడిన రకరకాల పరిమా ణంలో రాళ్లని తట్టల్లో పట్టుకెళ్లి ఎక్కడో పోసి రావడం. ‘లింగాలు! నీకు పని అబ్బలేదురా! నీ మొత్తం కూలీ నాలుగు రూపాయలు. నీకు నాలుగు కుంచాల బియ్యం కొలిచాం, పనిలోకి వచ్చిన రోజు. ఇంక రెండు రూపాయలు కూలి ఇవ్వాలి. అది మాత్రం నీకు ఇవ్వద్దన్నారు దొరవారు. ఇప్పుడు కుంచెడు బియ్యం తీస్కుపో. లంబసింగి రావాలి. అక్కడ పని మెరుగ్గా ఉంటే ఆ డబ్బులు గురించి ఆలోచిద్దాం!’ అన్నాడు రామమూర్తి. ‘మేస్త్రీ! ఒక్క రూపాయి..’ దీనంగా అడిగాడు లింగాలు. ‘నోర్మూసు కుని పో’ మెడ పట్టి గెంటినంత పని చేశాడు మేస్తి. అప్పటికే ఇంకో పేరు పిలుస్తున్నాడు పిళ్లే ‘కారంగి నాగులు, మర్రిపాలెం’

‘ఒరే! కారంగి నాగులూ…’ గట్టి అరిచాడు మేస్తి. లేచి వెళ్లాడు నాగులు. పని మొదలెట్టినప్పుడు బియ్యం ఎంత కొలిచాం?’ అడిగాడు పిళ్లై. ‘నాకేటి తెలుసు దొరా!’ అన్నాడు నాగులు. ‘కొలిచాం కదా! నువ్వు పట్టుకెళ్లావ్‌ ‌కదా!’ అన్నాడు కలం గాల్లో ఊపుతూ. ‘ఔను దొరా, కొలిసారు’ చెప్పాడు నాగులు. ‘ నీకు వారం రోజుల కూలి ఇవ్వాలి. ఇక్కడ రాసుకున్నాం. వచ్చేసారి పనికొచ్చి నప్పుడు సర్దుతారు దొరవారు. బియ్యం తీసుకుని వెళ్లిపో !’ తరువాత కిష్టయ్య కేసి చూస్తూ అన్నాడు పిళ్లై. ‘రెండు కుంచాలు..’ కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి నాగులికి. ఏదో చెప్ప బోయాడు. అప్పటికే పిళ్లై నోటి నుంచి ఇంకో పేరు వచ్చేసింది, ‘మటం యండయ్య.’ మేస్త్రీ గట్టిగా పిలిచే లోపునే లేచి వెళ్లాడు యండయ్య. ‘నువ్వు కొండ కంబేరు రోడ్డు పనిలో ఉన్నావు కదా!’ అడిగాడు పిళ్లై. ‘ఔను దొర.’ భయం భయంగా చెప్పాడు యండయ్య. ‘అప్పుడు నాలుగు రూపాయలు ఇవ్వాలి. అందులోవి ఇదిగో ఈ రెండు, ఇప్పుడు చేసిందానికి ఒక రూపాయి. పట్టుకుని వెళ్లు. నీకు ఇంకా మూడు రూపాయలు వస్తాయి. పద్దు రాసుకున్నాం! రెండు కుంచాల బియ్యం కొలుస్తాడు కిష్టయ్య.’ అతడు పట్టిన దోసిలిలో మూడు నాణేలు పడ్డాయి. నిజానికి తనకి అసలు ఎంత రావాలో, ఎంతిచ్చారో, ఇప్పుడు చేతిలో ఎంత పడేశారో లెక్క పెట్టుకోవడం యండయ్యకి తెలియదు. చేతిలో పడిన నాణేలని చూసుకుని బ్రహ్మానంద పడిపోయాడు. అంతా ఈర్ష్యగా చూశారు అతడి కేసి. ఎవరెవరివో పేర్లు పిలుస్తున్నారు. ఏవో చెబుతున్నారు. ఇస్తే రెండో మూడో రూపాయలు ఇస్తున్నారు. లేకపోతే లేదు. ఒక కుంచం బియ్యం కొలిచేసరికి ఇదే పదివేలు అనుకుని తృప్తి పడుతు న్నారు. మళ్లీ కాగితాలు వెనక్కీ ముందుకీ తిప్పుతూ కాలక్షేపం చేసి, అరగంట తరువాత పిలిచాడు పిళ్లై. ‘కొండమ్మ!’, ‘పిట్టల చిన్నిగాడి పెల్లాం, కొండమ్మ’ గట్టిగా అరిచాడు మేస్త్రీ. ‘దండాలు. మొన్న పనిలో తొమ్మిదణాలు రావాలి బాబూ!’ అంది వినయంగా. ‘ఏమే, మాకు తెలీదా! నోర్మూస్కో! నాల్రోజులు కూలి చేసేటప్పటికే లెక్క తెలిసిపోయిందీళ్లకి!’ వ్యంగ్యంగా అన్నాడు మేస్త్రీ. ఆ తొమ్మిదణాలు, ఇప్పుడు ఇవ్వ వలసిన ఇంకో తొమ్మిది అణాలు- అబ్బో చాలా పెద్ద మొత్తం. ఎలా ఎగొట్టాల అని చూస్తున్నాడు పిళ్లై. ఆమె అలా అడగడం కలసి వచ్చింది. ‘ఏమే, నువ్వు చింతపల్లి పనిలో పారొకటి తిరిగి ఇవ్వలేదని కిష్టయ్య చెప్పాడు. ఆ బకాయి ఒకటుంది కదా! అంటే పార డబ్బులు నువ్వే ఇవ్వాలి!’ అన్నాడు. కళ్లల్లో నీళ్లు తిరిగాయి కొండమ్మకి. దాదాపు ఏడుస్తూ అంది, ‘సత్తె పెమానం. నాకేటీ తెల్ద్టు దొర! కిష్టయ్యని అడ గండి. ఆఖార్రోజున కడిగి మరీ ఇచ్చేశాను..’ అంది.

‘మరి కిష్టయ్య గాడు రాలేదు. ఎలాగూ లంబ సింగి పనికి వస్తావ్‌ ‌కదా! అక్కడ తీస్కో మొత్తం. బియ్యం మూడు కుంచాలు కొలిపించుకో ! ఇప్పుడు ఈ రూపాయి తీస్కో. వెళ్లిపో!’ అన్నాడు పిళ్లై. అడుగు పడలేదామెకి. మ్రాన్పడి పోయింది. ‘పొమ్మంటే పోవేమే!’ గట్టిగా అరిచాడు బాస్టియన్‌. ఉలిక్కిపడి వచ్చేసిందామె. పిట్టల చిన్నయ్యకీ అంతే. ఒక రూపాయి చేతిలో పెట్టి వెళ్లమన్నారు. రెండు కుంచాల బియ్యం ఇచ్చారు. మధ్యాహ్నం పదకొండు గంటల వేళకి చెల్లింపులు పూర్తయ్యాయి. యండయ్య లాంటి ఒకరిద్దరు అమాయకుల ముఖంలో తప్ప మిగిలిన వాళ్ల ముఖాల నిండా బాధ ఇంతకాలం కష్టాలు కలసి పంచుకున్నా, కలసి దెబ్బలు తిన్నా, కలసి కన్నీళ్లు కార్చినా ఆ క్షణంలో ఒక రూపాయి తీసుకున్న వాడికి రెండు రూపాయి తీసుకున్నవాడు పరమ శత్రువులా కనిపించాడు. మూడు రూపాయలు చేతిలో పడినవాడు ఆ ఇద్దరికి శ్రతువులా కనిపిస్తున్నాడు. అసలేమీ తీసుకోని వాళ్లకి కడుపు మండిపోతూ ఉండడంతో వాళ్ల మీద వాళ్లకే కోపంగా ఉంది. అదే అక్కడ దారుణమైన నిశ్శబ్దాన్ని రాసి పోసింది. ఆ ఎండలో ఎవరికి వాళ్లు కాళ్లు ఈడ్చుకుంటూ తలా ఒక దిక్కుకూ వెళ్లిపోయారు. నిన్న రాత్రి వరకు ఒకరి మీద ఒకరికి ఉన్న ఆప్యాయత, ప్రేమ ఏమైపో యాయో! ఎవరి దగ్గర ఎవరూ వీడ్కోలు తీసుకోవడం లేదు. చాలామంది కళ్లల్లో తడి. ఏడుపుకి సిద్ధంగా కొందరి ముఖాలు..అణుచుకున్న కసితో ఎరుపెక్కిన ముఖాలు. బద్దలవడానికి సిద్ధంగా ఆవేదన, అందరి గుండెలలోను బాధ… వణుకుతున్న పెదవులు… ‘తొమ్మిదణాల గురించి ఇంకా ఆలోచించకే. తొంగో. ఇంటికి పోతన్నాం. అందుకు సంతోషించు.’ అన్నాడు పిట్టల చిన్నిగాడు, గూడులో కూర్చుని తదేకంగా ఆలోచిస్తున్న భార్యతో. రేపు రోడ్డు పనీ, బాస్టియన్‌ ‌బూతులూ, కిష్టయ్య దాష్టీకం ఉండవన్న ఊహకి కాబోలు ఆమెకి గాఢంగా నిద్రపట్టేసింది.

(వచ్చేవారం ముగింపు)

About Author

By editor

Twitter
Instagram