‌వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

– పి.వి.ఆర్‌. ‌శివకుమార్‌

ఆరుగంటలన్నా కాకముందే, చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఊరికి దూరంగా ఉన్న ఆ పరిశోధనా సంస్థ పని వేళలు ముగియటంతో, చివరిగా మిగిలిన కొద్దిమంది ఒకరొకరుగా వెళ్లిపోతుండగా, గేటు మూసుకునేందుకు చూస్తున్నాడు చౌకీదార్‌.

ఆ ‌సమయంలో సంస్థగేటుకీ, దూరంగా ఉన్న బస్‌ ‌స్టాప్‌కీ మధ్యగా ఒక పక్క ఆగి ఉన్న వాహనంలో మనుషులు అసహనంగా కదులుతూ, సావధానులై చూస్తున్నారు. రోడ్డు వారగా నడుస్తూ వస్తున్న ఓ యువతి వారిని ఆకర్షించింది. వాహనం కదిలి, రివర్స్ ‌గేర్‌లో ఆమెను సమీపించింది. ఆలోచనల్లో తల వంచుకుని నడుస్తున్న ఆ యువతి గమనించే లోగా, ఒక వ్యక్తి స్లైడింగ్‌ ‌డోర్‌ ‌తెరుచుకుని బయటకు దుమికి, గురిపెట్టిన తుపాకీతో ఆమెను బలవంతాన వాహనం లోపలికి నెట్టేశాడు. తప్పించుకునే క్రమంలో జరిగిన పెనుగులాటలో ఆమె భుజానికున్న బ్యాగ్‌ ‌జారిపోయి రోడ్డు పక్కనున్న తుప్పల్లో పడిపోయింది.

వెనుకగా వస్తున్నవాళ్ళు ఈ దృశ్యాన్ని గమనించి అరుస్తూ వాహనాన్ని వెంబడించే ప్రయత్నంలో ఉండగానే, వాహనం అదృశ్యమై పోయింది. వెన్నాడిన వారిలో ఒక యువకుడు రామ్‌. ‌తన మొబైల్‌ ‌ఫోన్లో రామ్‌ ‌మున్షి బాగ్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌కు ఫోన్‌ ‌చేసి, కళ్ల ముందు జరిగిన ఘాతుకం తెలిపాడు. వెనువెంటనే, పోలీస్‌ ‌దళాలు ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టాయి గానీ, ఎటువంటి ఆచూకీ దొరకలేదు. అపహరణకు గురైన యువతి వివరాలు కూడా తెలియరాలేదు.

********

రాత్రి పదకొండుగంటలవేళ స్థానిక వార్తా పత్రిక కాశ్మీర్‌ ‌రోష్ణీ సంపాదకుడు హసన్‌ ‌ఫోన్‌ ‌మోగింది. యథాలాపంగా ఫోన్‌ ‌తీసిన హసన్‌కు అవతలి మాటలు వినగానే, ఆ నాలుగు డిగ్రీల వాతావరణంలో సైతం చెమటలు పట్టాయి. డిఫెన్స్ ‌మినిస్టర్‌ ‌కుమార్తెని తాము కిడ్నాప్‌ ‌చేశామనీ, భారత జైళ్లలో మగ్గుతున్న ఆరుగురు ఉగ్రవాదులని విడుదల చేసి, ఆమెను కాపాడు కొమ్మనీ, అల్‌- ‌బదర్‌ అని చెప్పుకుంటూ ఒక ఉగ్రవాద సంస్థ నుంచి వచ్చిన ఫోన్‌ ‌కాల్‌ అది.

‘మా దేశంలో చొరబడి, కిరాతకంగా మా వీరజవాన్లని పొట్టనబెట్టుకున్న టెర్రరిస్తుల్ని పట్టుకున్నది విడిచిపెట్టేందుకేనా?’ ధైర్యం కూడగట్టుకుని, అన్నాడు హసన్‌.

‘‌చూడు భయ్యా, నీ తాహతుకి మించి మాట్లా డకు. ఈ వలీ బేరం ఆడుతున్నది నీతో కాదు.

న్యూస్‌ ‌బ్రేక్‌ ‌చేసుకోవటమే నీ వంతు. స్వంత కూతురినే రక్షించుకోలేని డిఫెన్స్ ‌మినిస్టర్‌ ‌దేశాన్ని ఎలా రక్షిస్తాడో, మీ దేశం తేల్చుకుంటుంది. సరిగ్గా ఇరవై నాలుగు గంటల తరవాత ఫోన్‌ ‌చేస్తాం. అప్పటికల్లా మా సహచరులని శ్రీనగర్‌ ‌చేర్చాలి. వాళ్లను అప్పగించవలసిన ప్రదేశం అప్పుడు తెలియచేస్తాం.’ ఆ మాటలు చెప్పి, ఫోన్‌ ‌కట్‌ ‌చేసేశాడు వలీ. వణికే చేతులతో ఫోన్‌ ‌పట్టుకుని, న్యూస్‌ ‌బ్రేక్‌ ‌చేయటం ప్రారంభించాడు హసన్‌.

********

ఇంట్లోనే ఆఫీస్‌ ‌రూమ్‌లో కూర్చుని, పని చూసు కుంటున్న రక్షణ మంత్రి ధనుర్ధారికి తన కుమార్తె అపహరణ వార్త తెలిసే వేళకి రాత్రి పదకొండు గంటలయింది.

ఆ షాక్‌ ‌బుర్రలోకి సింక్‌ అవుతుండగానే, ప్రధాన మంత్రి నుండి కాల్‌ ‌వచ్చింది.

‘ఇది మీకు వ్యక్తిగతంగా ఖేదం కలిగించే విషయమే గానీ, అంతకన్నా ఎక్కువగా మన అందరికీ అత్యంత ఆందోళనకరమైన విషయం. ఉదయం నాలుగు గంటలకు క్యాబినెట్‌ ‌సమావేశం ఏర్పాటు చేశాను. అందరం కలిసి చర్చించి, సరైన పరిష్కారానికి వద్దాం. మీరు అధైర్య పడకండి.’ చెప్పారు ప్రధాని.

తీవ్రమైన ఆందోళన, అంతకు మించిన ఆలోచన మధ్య చిక్కుకుపోయాడు ధనుర్ధారి. రక్త బంధం, దేశం పట్ల కర్తవ్యం మధ్య నలిగిపోతూ, భార్యతో కలిసి ఆలోచనలు సాగించాడు. వెంటనే కరిప్పూర్లో ఉండే తన చెల్లెలికి ఫోన్‌ ‌చేశాడు, భావన ఆమెతోనే ఉన్న విషయం నిర్ధారించుకున్నాక, ఊపిరి పిల్చుకున్నాడు. పది నిమిషాలు భార్యతో, చెల్లెలితో వాదోపవాదాల తరవాత ఒక నిర్ణయానికి వచ్చాడు.

వెంటనే, ప్రధానికి ఫోన్‌ ‌చేసి, క్యాబినెట్‌ ‌మీటింగ్‌ ‌కన్నా ఒక గంట ముందు, ఆయనతో ఆంతరంగిక సమావేశం కోరాడు. సరిగ్గా మూడు గంటలకి ప్రధాని పర్సనల్‌ ‌ఛాంబర్‌లో ప్రవేశించిన ధనుర్ధారి, ఆయనతో కలిసి మీటింగ్‌లో పాల్గొనే వేళకి నిబ్బరంగా ఉన్నాడు.

‘విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. దేశ భద్రతకి, మన ప్రభుత్వానికీ ఇది సవాలు. సమస్య పరిష్కరించే దిశలో మీ అందరి అభిప్రాయాలూ తెలిపితే, చివరగా రక్షణ మంత్రి మాట్లాడతారు.’ అంటూమీటింగ్‌ ‌ప్రారంభించారు ప్రధాని.

సత్వరం రక్షణ మంత్రి కుమార్తెను విడిపించే దిశలో కదలాలని కొందరూ, సమయం తీసుకునైనా ఉగ్రవాదులు ఆమెని దాచిన స్థావరాన్ని ఆచూకీ తీసి, తదుపరి చర్య తీసుకోవాలే తప్ప, టెర్రరిస్టులని విడుదల చేసి, ప్రాణాలు పణంగా పెట్టి వాళ్లని బందీలు చేసిన మన సైనికుల త్యాగాన్ని వృథా పోనివ్వరాదని కొందరూ భావోద్వేగాలతో భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చారు. చివరగా, గొంతు సవరించుకుని, మాట్లాడాడు ధనుర్ధారి,

‘నా కుమార్తె అపహరణ అయిన విషయం నిజం కాదు…’

అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ‘అంటే? ఇది నీలి వార్తా?’

‘అపహరణ జరిగిన మాట వాస్తవం. ఐతే, ఉగ్రవాదులు మరెవరినో నా కుమార్తెగా పొరబడ్డారు. నా కుమార్తె ప్రస్తుతం శ్రీనగర్‌లో లేదు. కేరళలో నా చెల్లెలి ఇంట్లో క్షేమంగా ఉంది.

ఇక్కడ నేనొక వ్యక్తిగత విషయం మీతో పంచుకుంటున్నాను. దశాబ్దాల క్రితం నా చెల్లెలు మతాంతర వివాహం చేసుకున్న నాటినుండీ, ఆమెతో మా కుటుంబ సంబంధాలు తెగిపోయాయి. పసి వయసులో మూడేళ్లపాటు ఆమె దగ్గర పెరగటం మూలాన, నా కుమార్తెకి మాత్రం మేనత్త మీద అభిమానం నిలిచి పోయింది. గత వారం నా చెల్లెలి కుమార్తె పెళ్లి. మేం వెళ్లకపోయినా, పట్టుబట్టి తను ఆ పెళ్ళికి వెళ్లింది.అపహరణ సంగతి వినగానే, ఆమెతో మాట్లాడాను. ఆమె అక్కడ క్షేమంగా ఉంది.’

ఒక్కసారిగా సభ్యులలో కలకలం. సహచరుడి కుమార్తె క్షేమంగా ఉందన్న మాట వారికి రిలీఫ్‌ ‌నిచ్చింది.

కొనసాగించాడు ధనుర్ధారి,

‘తక్షణం మనం చేపట్టవలసిన రెండు చర్యలు నేను ప్రతిపాదిస్తున్నాను. ఒకటి, నా కుమార్తెను క్షేమంగా కేరళ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకురావటం, రెండు… శ్రీనగర్‌లో తను పనిచేస్తున్న పరిశోధనా సంస్థను తాత్కాలికంగా మూసివేసి, ఆమె ఉంటున్న అతిథిగృహం సహా అయిదు కిలోమీటర్ల పరిధిలో నిరవధిక కర్ఫ్యూ విధించటం.

దీనివల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయి.

మొదటి చర్య వలన, తమ పొరబాటు గ్రహించిన ఉగ్రవాదులు నా కుమార్తె ఆచూకీ పసిగట్టి, కేరళ నుండి ఆమెను కిడ్నాప్‌ ‌చేసే వ్యవధి ఉండదు.

రెండవ చర్య, తాము కిడ్నాప్‌ ‌జరిపిన ప్రదేశా లకి వెళ్ళి, తమ పొరబాటుకి కారణాలు అన్వే షించే అవకాశం వాళ్లకు లేకుండా చేస్తుంది’

‘ఒక విధంగా, ఇది మనకు లభించిన అరుదైన అవకాశం. ప్రభుత్వాన్ని వత్తిడి పెట్టే ప్రయత్నం చేసిన ఉగ్రవాదులే ప్రజా బాహుళ్యం ద్వారా మానసిక వత్తిడికి గురి అయ్యే పరిణామం సాధ్యమౌతుంది.’ ‘రక్షణ మంత్రి ప్రతిపాదనలను అంగీకరిద్దాం.’ అన్నారు ప్రధాని.

ధనుర్ధారి ప్రతిపాదించిన రెండు చర్యల మీదా క్యాబినెట్‌ ఆమోద ముద్ర పడింది. వాటి అమలుకై ఆఘమేఘాల మీద ఆదేశాలు జారీ అయ్యాయి. పత్రికా ప్రకటన విడుదల అయింది.

‘రక్షణ మంత్రి కుమార్తె అపహరించబడిన మాట అబద్ధం. ఆమె క్షేమంగా ఢిల్లీలో ఉన్నారు. ఉగ్రవాదులు వేరెవరినో అపహరించి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే పథ•కం వేశారని మా అభిప్రాయం. దేశంపై దొంగ దాడులు చేసి, మన వీర జవానుల ప్రాణాలు బలిగొంటూ పట్టుబడిన ముష్కరులను, ఇటువంటి అబద్ధపు, అసంబద్ధపు చర్యలతో విడిపించుకోగలమన్న వారి ఆశలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలోనూ నెరవేరనివ్వదు.

తమ స్వార్ధ ప్రయోజనాలకోసం, సామాన్య పౌరులను అపహరించటంలోని విజ్ఞతని వారు ప్రశ్నించుకోవాలి. సాటి పౌరులని అపహరించే నైచ్యానికి దిగజారుతున్న ఉగ్రవాదులను సమర్థిస్తున్న లోయలోని కొద్దిమంది సానుభూతి పరులు కూడా ఆత్మపరిశోధన చేసుకోవాలి. ఆ అమాయకురాలి విడుదలకై ప్రజలు, ముఖ్యంగా సంపూర్ణ కాశ్మీరం ఉగ్రవాదులపై ఒత్తిడి తెస్తారనే ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది.

ఒక్క ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నంలో, బందీలుగా ఉన్న ముష్కరులని విడిచిపెడితే, వారు మున్ముందు చేసే ఘాతుకాలకి మరెన్ని వందల ప్రాణాలు బలి పెట్టవలసి వస్తుందో ఊహించబట్టే, వారిని వదిలే ఆలోచనే ప్రభుత్వానికి లేదని, నిర్ద్వందంగా ప్రకటిస్తున్నాం.

తమ కుటిల యోచనలతో, ఉగ్రవాదులు ఒక అమాయకురాలైన యువతిని బలి తీసుకునే పక్షంలో, ప్రజలలో తమకున్న కొద్దిమంది సానుభూతిపరులని కూడా కోల్పోవటం తథ్యమని మీడియా ముఖంగా వారిని హెచ్చరిస్తున్నాం.’

మధ్యాహ్నం ఒంటిగంట వేళ, పటిష్ఠమైన సెక్యూరిటీ మధ్య, కోజీకోడ్‌ ‌నుంచి న్యూఢిల్లీ చేరి, బెరుకు బెరుగ్గా ఇంట్లోకి ప్రవేశించిన భావనను చూస్తూనే, ఆమెను కన్నీటితో తడిపేశారు. ధనుర్ధారీ, రత్నగర్భా. మనసు దిటవు పరచుకుని, అప్పటికే షెడ్యూల్‌ ‌చేసిన ప్రెస్‌మీట్‌కి భావన సహా వచ్చాడు ధనుర్ధారి.

ముందుగానే విధించిన పరిమితుల ప్రకారం, భద్రతా చర్యగా ఆ సమావేశంలో కెమెరాలు నిషేధించారు.

‘మీ స్వాతంత్య్రానికి విఘ్నం కలిగించి నందుకు మన్నించండి. నా కుమార్తె చిత్రాలు ప్రస్తుత పరిస్థితులలో బహిరంగం కావటం క్షేమం కాదన్న సెక్యూరిటీ హెచ్చరికల వలన ఈ నిషేధం పెట్టవలసివచ్చింది. నా కుమార్తె అపహరించ బడలేదన్న సత్యం మీ అందరికీ ప్రత్యక్షంగా చూపాలనే, ఈ మీట్‌ ‌పెట్టాను. ఆకస్మాత్తుగా లోనైన మానసిక ఒత్తిడి దృష్ట్యా, నా కుమార్తె ఇప్పుడు ఎవరి ప్రశ్నలకు జవాబునిచ్చే స్థితిలో లేదు. అయితే, మీ కోసం క్లుప్తంగా మాత్రం మాట్లాడుతుంది. దయచేసి, ఆమె ప్రైవసీకి విలువనిస్తారని ఆశిస్తాను.’ సానుభూతిగా చూశారు విలేకరులు.

‘నా అదృష్టం కొద్దీ, ఈ సమయంలోనే, మా మేనత్త గారింటికి వెళ్ళటం జరిగింది. లేనిపక్షంలో, ఈ పాటికి నేను…’ ఒక్క క్షణం రుద్ధ కంఠంతో ఆగిపోయి, తిరిగి మాట్లాడిందామె,

‘నా స్థానంలో చిక్కుకుపోయిన ఆ అమాయకురాలిని క్షేమంగా విడిచిపెట్టవలసిందిగా మీ ద్వారా ఉగ్రవాదులని ప్రార్థిస్తున్నాను.’ రెండు చేతులూ జోడించి, దుఃఖంతో కూర్చుండి పోయింది.

‘ప్రభుత్వంతో ఏవిధంగానూ సంబంధం లేని యువతిని బంధించి, ప్రభుత్వంతో బేరసారాలు సాగించటం మూర్ఖత్వం! ఇటువంటి చర్యలకి ప్రభుత్వం లొంగబోదు. కనీస మానవతనైనా ప్రదర్శించి, ఆ యువతిని విడిచి పెడతారో, మన వీర జవానులని బలి తీసుకున్నట్లే, ఆమెనీ బలి తీసుకుని, వారి రాక్షసత్వాన్నే బయటపెట్టుకుంటారో, ఉగ్రవాదులు తేల్చుకోవాలి. ఎట్టి పరిస్థితులలోనూ ప్రభుత్వం నుంచి లొంగుబాటు ఉండదని స్పష్టం చేస్తున్నాం.’ అని ప్రకటించాడు ధనుర్ధారి.

‘కిడ్నాప్‌ అయినది మీ కూతురైతే, ఇంతే కఠినంగా ఉండేదా ప్రభుత్వం? ఒక సామాన్య పౌరురాలి ప్రాణం కనుక తేలిగ్గా సవాలు విసురుతున్నారా?’ నిరసనగా అడిగాడు ఒక విలేఖరి.

నిగ్రహంతో జవాబు చెప్పాడు ధనుర్ధారి,

‘నా కూతురైతే ఏం చేస్తామన్న మీ ప్రశ్న ఊహాజనితం. అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు జవాబు చెప్తాం.ఇప్పటి పరిస్థితికి మానవతతో స్పందించండి. ’ మీట్‌ ‌ముగిసిపోయింది.

********

మీడియాలో మారుమోగిన కథనాలు ఉగ్రవాద శిబిరంలో విస్ఫోటనం కలిగించాయి. తాము ఎక్కడ, ఎలా,పొరబడ్డారో వారికి అర్థం కాలేదు. బందీని సోదా చేసి తెలుసుకుందామన్నా, కట్టు బట్టలు తప్ప ఆమె దగ్గర మరేమీ లేవు!

‘ఏమిటి? నువ్వు తన కూతురివే కాదంటున్నాడు మీ నాన్న?’ బందీని రౌద్రంగా అడిగాడు వలీ.

ఆ వార్తకి ఒక నిమిషం పాటు మౌనంగా ఉండిపోయిందామె. ఆ తరవాత కఠినంగా చెప్పింది.

‘మా దేశంలో ఏ తండ్రీ తన కూతురి గురించి కావాలని అబద్ధం చెప్పడు.’

‘అయితే, నువ్వు డిఫెన్స్ ‌మినిస్టర్‌ ‌కూతురివి కాదా?’

‘అనుమానమా?’

‘మరి నువ్వెవరివి?’ నిరసనగా నవ్విందామె, ‘భారతమాత కూతురిని.’

చెళ్లున పడింది ఆమె చెంపమీద దెబ్బ. నోరు మూసుకుని, పళ్ల బిగువున ఓర్చుకుంది.

ఆ తరవాత ఆమెను ఎన్నివిధాల హింసించినా మూసుకున్న నోరు తెరిపించలేక పోయారు వాళ్లు.

తీవ్రమైన నిరాశకి గురయ్యారు. ‘తమగురి తప్పింది. ఈమె ప్రాణాలకి విలువ లేదు! ఎలాగిప్పుడు?’

ఇరవై నాలుగు గంటలు గడిచాయి.

‘రేపటిలోగా తమ సహచరుల విడుదలకు అంగీకరించని పక్షంలో, బందీ శవాన్నే పంపుతామని’ కాశ్మీర్‌ ‌రోష్ణీ’ సంపాదకుడికే వర్తమానం తెలిపారు ఉగ్రవాదులు.

‘అవి కేవలం బెదిరింపు’ అని నమ్మిన ప్రభుత్వం దానిని విస్మరించింది.

శ్రీనగర్‌ ‌పరిశోధనా సంస్థ పరిసరాలకి వెళ్ళి, జరిగిన పొరబాటు గురించి ఆచూకీ తీద్దామని ఉగ్రవాదులు రెండు రోజులు ప్రయత్నించినా, కర్ఫ్యూ వలన ఏమీ సాధ్యపడలేదు.

మరో ఎదురు దెబ్బ. ఆనాటి ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ ‌మీడియా మొత్తం, అపహరణను బాధ్యతా రహిత చర్యగా వర్ణిస్తూ, అధికారమున్నవారిగా భ్రమపడి, సామాన్య యువతిని బందీ చేసినందుకు ఉగ్రవాదులను నిందించాయి. ఉగ్రవాదుల చేతకానితనానికి సానుభూతిపరులు మండిపడితే, విమర్శకులు వారి అసమర్థతని అపహాస్యం చేశారు. మొత్తం మీద, ఉగ్రవాదుల మీద మానసిక ఒత్తిడి మొదలయింది. 72 గంటలు గడిచేసరికి, అంతర్జాతీయంగా కూడా ఉగ్రవాదుల మీద విమర్శలు వెల్లువెత్తేలా, తెర వెనుకే మంత్రాంగం నడిపింది ప్రభుత్వం.

ఆ సాయంత్రం, అల్‌- ‌బదర్‌ ‌సంస్థ ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన ఫోన్‌ను వణుకుతూనే ఎత్తాడు వలీ. అవతల నుంచి జామిన్‌ ‌ఖాన్‌ ‌డైనమైట్‌ ‌లా ప్రేలాడు.

‘తప్పతాగి పని చేస్తున్నారా? తప్పు వ్యక్తిని ఎలా పట్టుకున్నారు? ఒకవైపు, భారత ప్రభుత్వం రోజురోజుకీ చెలరేగి దెబ్బ తీస్తూ, మన దేశం పరువు తీస్తోంది. పఠాన్‌ ‌కోట్‌ ‌దాడికి సర్జికల్‌ ‌స్ట్రైక్స్ ‌తో జవాబు, పుల్వామా ఎటాక్‌కి బాలాకోట్‌ ‌విధ్వంసం సమాధానం! ఇప్పుడు వాళ్లకా అవసరం కూడా లేకుండా మీరే సెల్ఫ్ ‌గోల్‌ ‌చేసి, సహాయం చేశారు!! మన సానుభూతిపరులు కూడా మనని తప్పు పట్టే వాతావరణం కల్పించారు!’

‘కాదు బాస్‌, ఏదో మెలిక ఉంది, ఎక్కడ పొరబడ్డామో అర్థం కావడం లేదు. కొద్దిగా టైమిస్తే…’ ‘ఇచ్చిన సమయం చాలు. వెంటనే, మీ ఘనమైన బందీని వదిలేసి, ఆపరేషన్‌ ‌చుట్టేసి, గుట్టుగా వెనక్కి రండి.మీకు అర్థమయ్యేలా నేను ఇక్కడ చేస్తాను.’ కరుగ్గా ఆర్డర్‌ ‌జారీ చేశాడు జామిన్‌ ‌ఖాన్‌.

‌చెమటలు కారుతుండగా, కుర్చీలోకి జారిపోయాడు వలీ.

తెలతెలవారుతున్న వేళ ఊరి బయట హైవే ప్రక్కన సగం స్పృహతో పడి ఉన్న యువతిని, పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు చూసి, స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఆమె మాట్లాడే స్థితికి రాగానే, ఆమె రక్షణ మంత్రి కుమార్తె అని తెలిసి నిశ్చేష్టు లయ్యారు. తక్షణం రక్షణ మంత్రి కార్యాలయానికి ఫోన్‌ ‌వెళ్లింది. రెండు గంటల వ్యవధిలో, ఆమెను ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకు వచ్చి, రక్షణ మంత్రి ఇంటికి చేర్చారు. కుమార్తెను క్షేమంగా కలుసుకున్న ధనుర్ధారి, అతని భార్య ఆనందోద్వేగాలలో కూరుకు పోయారు.

ఆ కుటుంబాన్ని అభినందించటానికి ప్రధాని స్వయంగా వచ్చేశారు,

‘నీ తెగింపు దేశవాసులందరికీ ఆదర్శప్రాయం ధనుర్ధారీ! కుమార్తె బలి అయిపోయినా సరే, దుండగులని వదలకూడదన్న నీ దీక్షకీ, కుమార్తెను రక్షించుకునే క్రమంలో నువ్వు అల్లుకున్న పథకానికీ హేట్సాఫ్‌.’

ఆమె నీ కుమార్తె కాదన్న నెపంతో మనం టెర్రరిస్టుల విడుదల తిరస్కరించినా, తమ కోర్కె నెరవేరలేదన్న కసితో వాళ్ళు బందీని బలి తీసుకునే అవకాశమే ఎక్కువ. అది తెలిసీ, ఖైదీలను విడవకూడదన్న దీక్షతో నీ కుమార్తెను పణంగా పెట్టటానికి నువ్వు తెగించటం అతి గొప్ప విషయం.

అపహరణకు గురయింది నీ కుమార్తె అయితే ప్రజలలో, ప్రభుత్వ వర్గాలలో, ఉగ్రవాద సానుభూతి పరులలో కలిగే స్పందననూ, ఆమె నీ కుమార్తె కాదన్నప్పుడు ఆ స్పందనలలో కలిగే వైరుధ్యాలని సరిగ్గా అంచనావేసి, నువ్వు రచించి, అమలు జరిపిన పథకం వంద శాతం ఫలించటం నీ విజయం.

మనందరి అదృష్టం. ప్రపంచ దేశాల్లో మన దేశ ప్రతిష్ఠ పెరగటానికీ నీ పథకం దోహదం చేసింది. నిన్ను అభినందించటానికి నా దగ్గర మాటలు మిగల్లేదు ధనుర్ధారీ!’ ఆప్యాయంగా అతడిని ఆలింగనం చేసుకున్నాడాయన. అప్పటిదాకా పడిన టెన్షన్‌ ‌దిగిపోగా, హాయిగా నవ్వాడు ధనుర్ధారి.

About Author

By editor

Twitter
Instagram