– ఎమ్వీ రామిరెడ్డి –

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

చరిత్ర పుటల్లోంచి నడిచొచ్చిన పురాతన విగ్రహంలా ఉందామె.

దుఃఖభారంతో అడుగు ముందుకు వేయలేకపోతోంది.

ఆరేళ్ల ముని మనవడు అనిరుధ్‌ ఆసరాతో బయటికి నడిచింది.

‘సంపత్‌ ‌బాబూ అమర్‌ ‌రహే!’ నినాదాలు హోరెత్తుతున్నాయి.

చైనా సరిహద్దు నుంచి సూర్యాపేటకు చేరుకున్న సంపత్‌ ‌దివ్యపేటికను ఇంటిముందు వేసిన షామియా నాలో ఉంచారు. వెంటవచ్చిన సైనికులుచుట్టూ నిలబడ్డారు. సంపత్‌ ‌భార్య కళ్లల్లో నీరింకిపోయింది. తల్లి ఒళ్లో కూచుని అమాయకంగా తండ్రి భౌతిక కాయం వంక చూస్తున్నాడు అనిరుధ్‌.

‌జనం బారులు తీరి నివాళులర్పించారు.

ఎనభై ఆరేళ్ల ఎల్లమ్మ శవపేటికపైకి వంగి, మనవడి మొహంలోకి చూసింది.

ఆమె కళ్లనుంచి రెండు నీటిబొట్లు జారిపడ్డాయి.

ఓ సైనికుడు ఆమెను పక్కకు తీసుకొచ్చి కుర్చీలో కూచోబెట్టాడు.

‘అసలేం జరిగింది బిడ్డా?’ అదే సైనికుణ్ని అడిగింది.

శ్రీకాకుళానికి చెందిన ఆ సైనికుడు చెప్పటం మొదలుపెట్టాడు.

************

లద్దాఖ్‌. ‌భారత్‌-‌చైనా సరిహద్దు. డిస్ప్యూటెడ్‌ ‌టెరిటరీ.

చైనా సైనికులు భారత భూభాగంలోకి ప్రవేశించి, టెంట్లు వేశారు. భారత సైనికులు హెచ్చరించినా వినలేదు. చూస్తుండగానే మరో మూడొందల మంది చైనా జవాన్లు అక్కడికి చేరుకున్నారు. వాళ్లందరి చేతుల్లో ఇనపరాడ్లు ఉన్నాయి. 1962 నాటి ఒప్పందం ప్రకారం…‘స్టాండాఫ్‌’ ‌స్థితిలో ఆయుధాలు ఉపయోగించకూడదన్న స్పృహతో కూడిన వ్యూహాత్మక పన్నాగం అది.

సమాచారం అందుకున్న కల్నల్‌ ‌సంపత్‌ ‌కుమార్‌ ‌వందమంది భారత జవాన్లతో అక్కడికి చేరుకుని, టెంట్లు ఖాళీ చెయ్యాలని హెచ్చరించాడు.

టెంటులోంచి బయటికొచ్చిన చైనా సైనికుడు నిర్లక్ష్యంగా ప్రశ్నించటంతో పాటు కల్నల్‌ ‌మీద చెయ్యివేసి, వెనక్కి తోశాడు. తూలి పడబోయి, నిలదొక్కుకున్నాడు సంపత్‌.

‌భారత్‌ ‌సైనికుల్లో సహనం బద్దలైంది. టెంటును పీకెయ్యటానికి ప్రయత్నించారు. డ్రాగన్లు ఇనప రాడ్లతో దాడిచేశారు.

ప్రత్యర్థులు ఎక్కువ మంది ఉన్నా భారత వీరులు వెనకడుగు వెయ్యలేదు. రాళ్లతోనే ఎదురుదాడికి దిగారు. చిమ్మచీకట్లో పోరు హోరెత్తింది.

రాళ్లు దొరక్క భారతసైన్యం ముష్టిఘాతాలతోనే సమాధానమివ్వసాగింది.

పరిస్థితుల్ని అంచనా వేస్తూ, సహచరులకు బాసటగా నిలిచాడు సంపత్‌. ‌తోపులాటలో ఇరు వర్గాలూ గాల్వన్‌ ‌లోయ అంచుకు చేరుకున్నాయి. దాదాపు పదిహేనుమంది సైనికులు లోయలోకి పడిపోయి, తన కళ్లముందే వీరమరణం పొందటంతో కల్నల్‌లో కోపం కట్టలు తెంచుకుంది.

నష్టనివారణకు ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. దూరంగా పడి ఉన్న ఇనపతీగ మెదడులో మెరుపుతీగై మెరిసింది.హెల్మెట్‌ ‌లైట్‌ ‌వెలుగులో చుట్టూ చూశాడు.

భారత జవాన్లలో ఎక్కువ మంది లోయ అంచుకు చేరువలో ఉన్నారు. అభిముఖంగా నిలబడిన చైనా జవాన్లు సావకాశంగా దాడి చేస్తున్నారు.

సింహంలా దూసుకెళ్లిన సంపత్‌… ఓ ‌సహచరుడి సహకారంతో ఇనప తీగను ఆ చివర్నించి ఈ చివరి వరకు ప్రత్యర్థుల కాళ్లకు తాటించి, బలంగా దాన్ని వెనక్కి లాగాడు. పాతిక ముప్పయ్‌ ‌మంది చైనా సిపాయిలు బిళ్లపాటుగా లోయలోకి పడిపోయారు.

భారతసైన్యం జూలు విదిలించింది. శత్రు మూకను తరిమికొడుతూ టెంటు దాకా చేరుకుని, దాన్ని ఊడ బీకి తగలబెట్టింది. వెనకడుగు వేసినట్టు నటించిన చైనా బలగాలు ప్రతిదాడిలో భాగంగా సంపత్‌ను ఏకాకిని చేసి, మట్టుబెట్టాయి.

‘తెల్లారాక చూస్తే, మనవాళ్లు ఇరవై మంది వీరమరణం పొంది ఉన్నారు. వాళ్లల్లో కల్నల్‌ ‌సార్‌ ‌కూడా ఉండటం చూసి, మా గుండెలు తరుక్కు పోయాయి’ మరో తెలుగు సైనికుడు చెప్పిన మాటలు ఎల్లమ్మ చెవుల్లో సైరన్లు మోగిస్తున్నాయి.

************

సైరన్ల మోత క్రమంగా దగ్గరైంది.

అధికారులూ ప్రజాప్రతినిధులూ పోలీసులూ చేరుకున్నారు.

అంతిమయాత్ర మొదలైంది. వేలాది జనం వెంట నడిచారు.

వెళ్లలేని ఎల్లమ్మ మెల్లగా ఇంట్లోకి నడిచింది. హాల్లోని గోడకు రెండు ఫొటోలు వేలాడుతున్నాయి. ఆమెకు దూరమైన భర్త, కొడుకు. ఇప్పుడా పక్కన మనవడి ఫొటో చేరబోతోంది!

కళ్లకు నీటిపొర అడ్డు పడుతుండగా… ఆమె తన కొడుకు కొమురయ్య ఫొటో మీద చెయ్యి వేసింది.

కొడుకు జ్ఞాపకాలు జానపద గీతాలై గుండెల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.

దాదాపు పదిహేనేళ్ల క్రితం…

సూర్యాపేటలోని ప్రభుత్వ కళాశాల మైదానం. లక్ష మందికిపైగా జనం. కొమురయ్య వేదికనెక్కి, కంఠం విప్పాడు…

‘ఊరుగాసే తల్లి ఉరిమురిమి సూడంగ

ఉరిమురిమి సూసే తల్లి బోనమొండింది

బోనాల పండుగ నా తెలంగాణ

శివసత్తుల ఆట నా తెలంగాణ

నాగేటి సాళ్లల్ల నా తెలంగాణ

నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ…’

కొమురయ్య పాట ఊరూరా మార్మోగింది. తనో సాంస్కృతిక సమరయోధుడై జాతి ఆత్మగౌరవాన్ని దశదిశలా విస్తరింపజేస్తాడని కలలు కన్నారు. అవి సాకారం కాకుండానే కనుమరుగయ్యాడు.

కొడుకు జ్ఞాపకాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, ఆమె నిలబడలేకపోయింది.

కళ్లు తుడుచుకుని, భర్త అంజయ్య ఫొటోను చేతుల్లోకి తీసుకుని, మంచం మీద కూచుంది.

ఆమె స్మృతిపథం సాయుధపోరాటమై రెక్క విప్పింది…

************

విసునూరు దేశ్‌ముఖ్‌ అరాచకం రాజ్య మేలుతున్న కాలం!

పక్కనున్న కడవెండి గ్రామం గుక్కపట్టి ఏడుస్తున్న పసిగుడ్డులా ఉంది. దేశ్‌ముఖ్‌ ‌తల్లి కడవెండిలోనే తిష్ఠ వేసి, ప్రజల్ని లూటీ చేసేది. దౌర్జన్యంగా భూములు లాక్కునేది. ఎదురు తిరిగిన వారిని…ఆమె పెంచి పోషించే గూండాలు చిత్రహింసలు పెట్టేవారు.

మరోవైపు రజాకార్లు, పోలీసులు నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడేవారు.

భువనగిరిలో ఆంధ్ర మహాసభ జరిగిన తర్వాత, అక్కడి తీర్మానాల సారాంశం గాలిలో పరిమళమై వ్యాపించి మెల్లగా గ్రామాలకు చేరింది. ప్రజల్లో ప్రతీకార జ్వాలలు రాజుకున్నాయి.

1945 జూలై…

దేశ్‌ముఖ్‌ ‌మామ కనుసన్నల్లో నలభైమంది గూండాలు కడవెండి గ్రామ నాయకుల్ని మట్టు బెట్టడానికి సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు వందమంది ఎరమరెడ్డి మోహన్‌రెడ్డి నాయకత్వంలో ప్రదర్శనగా బయల్దేరారు. గొర్రెల మందను దొడ్డిలో తోలి అప్పుడే ఇంటికివచ్చిన దొడ్డి కొమురయ్య ఊరేగింపులో అగ్రభాగాన నిలిచాడు.

అతని మిత్రుడు పదహారేళ్ల అంజయ్య కూడా జత కలిశాడు.

‘విసునూరు దేశ్‌ముఖ్‌ ‌దౌర్జన్యాలు నశించాలి, గూండాల దాడుల్ని ఎదుర్కొంటాం’ అని నినాదాలిస్తూ ఉప్పెనలా ముందుకు సాగారు.

ప్రదర్శన బొడ్రాయికి చేరుకునే సరికి మరో రెండొందల మంది వచ్చి చేరారు.

అప్పటికే గడీ ముందు పాఠశాల భవనంలో నక్కి ఉన్న గూండాలు ఎలాంటి హెచ్చరికలు లేకుండా జనసైన్యంపై విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. దొడ్డి కొమురయ్య పొట్టలోకి తుపాకిగుళ్లు దూసుకెళ్లాయి. బయటకు వేలాడుతున్న పేగుల్ని చేతుల్తో పట్టుకొని ‘ఆంధ్ర మహాసభకు జై•’ అంటూ నేలకొరిగాడు. అంజయ్య నేలమీద కూలబడి స్నేహితుడి తలను ఒళ్లోకి తీసుకున్నాడు. జనం వెనక్కి తగ్గలేదు. ముక్త కంఠంతో సింహగర్జన చేశారు. అంజయ్య బాణంలా దూసుకుపోయి, గ్రామస్థులతో కలసి గూండాల మీద విరుచుకుపడ్డాడు. ముష్కరులు తోక ముడిచారు.

దొరసాని మాటువేసి, అంజయ్యను చిత్ర హింసలు పెట్టింది. అతనిలో దుఃఖం పెల్లుబికింది. అది క్రోథంగా మారింది. దోపిడీకి వ్యతిరేకంగా పోరా డాలన్న సంకల్పం దృఢపడింది. నాయకులతో కలసి తిరుగుతూ, గెరిల్లా సమర వ్యూహాలు నేర్చుకుంటూ జీవితాన్ని ఉద్యమంతో ముడివేసుకున్నాడు.

ఆరోజు రాత్రి ఊరవతలి బావి దగ్గర జరిగిన రహస్య సమావేశంలో మొండ్రాయి, రామవరం గ్రామాల్లోని సమస్యలపై చర్చించారు. భూస్వాములైన కడార్‌ ‌సోదరులు ప్రజల శ్రమను నిలువుదోపిడీ చేస్తుండటాన్ని తీవ్రంగా పరిగణించారు.

రైతులు వెట్టిచేసి పొలాలు దున్ని పెట్టాలి. చాకలి వారు ఉచితంగా బట్టలుతకాలి. ఉత్తరాలు తీసు కెళ్లాలి. కచ్చడాల ముందు పరుగెత్తాలి. మంగలివారు తాటివనం నుంచి కల్లుకుండలు మోసుకురావాలి. పని వాళ్లందరికీ క్షౌరాలు చెయ్యాలి. నెలకోసారి భూస్వాముల గేదెలకు, దున్నపోతులకు కూడా క్షౌరం చెయ్యాలి!

మహిళలు నాట్లు వేయాలి. కలుపు తీయాలి. పసిపిల్లల తల్లులు తమ బిడ్డలకు పాలివ్వటానికి కూడా ఇళ్లకు వెళ్లటానికి లేదు. చేపుకొచ్చిన వారి పాలిండ్లను పిండించి పొలంలోనే పారబోయించే వారి కర్కశత్వం గురించి విని, అంజయ్య ఆవేశంతో ఊగిపోయాడు. పొలాలు సందర్శించి ఆ బాధలకు గురవుతున్న మహిళలకు ధైర్యం చెప్పాలని తీర్మానం చేశారు.

మరుసటి రోజే పదిమంది కుర్రాళ్లతో కలిసి మొండ్రాయిలోని బావి దగ్గర పొలాల్లోకి వెళ్లారు. తలా ఒక మడిలోకి చేరుకున్నారు. అంజయ్య వెళ్లిన పొలంలో పదీపదిహేను మంది మహిళలు, బాలికలు నడుం వంచి పని చేస్తున్నారు. భూస్వామి తొత్తులు నలుగురైదుగురు గట్టుమీద నిలబడి పెత్తనం చలాయిస్తున్నారు. అంజయ్య నిశ్శబ్దంగా అంతా గమనిస్తున్నాడు.

మధ్యాహ్నం మూడు దాటుతుండగా, ఊరివైపు నుంచి ఒకతను ఆ పొలం కాడికి చేరుకున్నాడు. అతని చేతుల్లో ఓ చంటిపాప- ఏడెనిమిది నెలలుంటాయేమో- గుక్క పట్టి ఏడుస్తోంది.

‘లచ్చిమీ, మబ్బుల పాలిచ్చి పొలానికచ్చినవ్‌. ‌బిడ్డ గుక్కపట్టి ఏడుస్తాంది. ఓ పాలిటొచ్చి పాలియ్యే’ గట్టు మీద నిలబడి తన భార్యవైపు చూస్తూ పెద్దగా అరిచి చెప్పాడు.

లక్ష్మి తలెత్తి, భర్త చేతుల్లోని బిడ్డను చూసింది. తలతిప్పి, గట్టునున్న రాక్షసుల వంక చూసింది. వాళ్లు కర్రలు చూపిస్తూ, కళ్లతో బెదిరించారు. ఆమె లేవబోయి, ఆగిపోయింది.

చంటిదాని ఏడుపు గాల్లో తేలివచ్చి కూలీల గుండెల్లో ఫిరంగులు పేలుస్తోంది. ఆమె పక్కనే ఉన్న పన్నెండేళ్ల ఎల్లమ్మ పని చేస్తూనే చుట్టూ చూస్తోంది. బాల్యంలోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న ఎల్లమ్మను తాత సాకుతున్నాడు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండ టంతో కుటుంబ భారాన్ని ఎల్లమ్మే భుజాన వేసు కుంది. పనులకు పోయి, పావలా బేడా కూడ బెడుతోంది.

భర్త కేకలు పెడుతున్నా లక్ష్మి స్పందించక పోవటంతో, ఎల్లమ్మ ‘పిల్ల పానం పొయ్యేట్టుంది. ఎల్లక్కా’ అంది.

‘ఆల్లు రాచ్చసులే. ఆల్ల సంగతి నీకు దెల్వదా ఏంది?’ అంది లక్ష్మి.

చటుక్కున లేచింది ఎల్లమ్మ. గబగబా గట్టుకు చేరుకుని, అతని చేతుల్లోని పాపను తన చేతుల్లోకి తీసుకుని, తల్లి దగ్గరకు తీసుకొచ్చింది. పాముల్లా పాక్కుంటూ వచ్చారు తొత్తులు. వాళ్ల కన్నా ముందే చేరుకుని, పాపను లక్ష్మి పొత్తిళ్లలో ఉంచింది ఎల్లమ్మ.

తల్లి ఆరాటంగా బిడ్డను గుండెలకు హత్తుకుంది.

అమృతధారలు గొంతులోకి జారటంతో పాప ఏడుపు మానింది.

నలుగురు తొత్తులు లక్ష్మిపై దాడి చేయబోయారు. ఎల్లమ్మ అమాంతం తల్లీబిడ్డల మీదికి గొడుగులా వంగింది. నాలుగు కర్రలు అంజమ్మ వీపుమీద దాడి చేశాయి.

నిర్దాక్షిణ్యంగా కొడుతున్నారు. తోటి కూలీలు నిస్సహాయంగా చూస్తున్నారు. ఎల్లమ్మ జాకెట్టు చిరిగి రక్తం కారుతోంది. అయినా, తల్లీబిడ్డలకు రక్షణ కల్పిస్తూనే ఉంది.

గట్టుకు అవతలి చేలో నిలబడి అంతా చూస్తున్న అంజయ్య ఈలవేసి దళసభ్యుల్ని పిలిచాడు. వాళ్లు చేరుకునే లోపే తను చేలోకి దిగాడు. గూండాల చేతుల్లోని కర్రలు లాక్కున్నాడు. కుడిచేతి పిడికిలి బిగించి, ఒక దుండగుడి దవడ మీద బలం కొద్దీ కొట్టాడు. వాళ్లు ఎల్లమ్మను వదిలేసి అంజయ్య మీద దాడి చేశారు. పరుగెత్తుకు వచ్చిన దళసభ్యులు తొత్తుల తిత్తి తీశారు.

పాలిస్తున్న తల్లి రొమ్ములపై కట్టెతో దాడిచేసిన దుండగుణ్ని అంజయ్య కుళ్లబొడిచాడు. బురదలో పడిపోయిన వాడి తలపై పెద్ద బండరాయి విసిరాడు. అతని ప్రాణం గాల్లో కలిసిపోయింది.

తొత్తులు పారిపోయి భూస్వామికి చెప్పారు. ఆయన రాత్రికి రాత్రే గుర్రంపై వెళ్లి మున్సిఫ్‌ ‌మేజి స్ట్రేటును, పోలీసు సర్కిల్‌ ఇన్‌స్పెక్టరును కలిశాడు.

మరుసటిరోజు పొద్దున్నే లారీ నిండా రిజర్వు పోలీసులు, గూండాలు కడవెండి చేరుకున్నారు. ఇంటింటినీ గాలించారు. అంజయ్య ఆచూకీ లభించకపోవటంతో అతని తల్లిని బొడ్రాయి దగ్గరకు లాక్కొచ్చి, హింసించటం మొదలు పెట్టారు. దళ సభ్యుడి ద్వారా విషయం తెలుసుకున్న అంజయ్య తనే వచ్చి లొంగిపోయాడు. మొత్తం పన్నెండు మందిని అరెస్టు చేసి, ధర్మాపురం క్యాంపు పోలీసులకు అప్పజెప్పారు.

రాత్రి పదిగంటల వేళ… అంజయ్యను ఓ డేరాలోకి తీసుకెళ్లారు. అక్కడ మకాం వేసి ఉన్న ఎస్సై, సీఐల ఎదుట ధీమాగా నిలబడ్డాడు అంజయ్య. అతని ఆత్మస్థైర్యం… సీఐకి కంపరం కలిగించింది.

‘ఏరా, భూస్వాములకే ఎదురెల్తవా?’ గద్దించాడు సీఐ.

‘మాతనీ, బూమాతనీ గౌరవించనివాడు బూసా మెలా అవుతడు?’ ఎదురు ప్రశ్నించాడు.

సీఐ సైగతో జవాన్లు అంజయ్యను నేల మీద బోర్లా పడుకోబెట్టారు. ఓ జవాను అతని నడుం మీద కూచుని, అంజయ్య రెండు అరికాళ్లనూ ఎత్తిపట్టుకున్నాడు. ఎస్సై లాఠీతో కొట్టడం మొదలు పెట్టాడు. అంజయ్య పంటిబిగువున బాధను భరిస్తున్నాడు. అరవై డెభ్బైయ్‌సార్లు కొట్టినా సీఐ అహం శాంతించ లేదు. అంజయ్య అరికాళ్లు రక్తంతో తడిసిపోయాయి.

జవాన్లు అతన్ని లాక్కెళ్లి, మరో డేరాలో మిగతా వారితోపాటు పడేశారు.

రెండురోజుల పాటు లేవలేకపోయాడు. పోలీసుల చిత్రహింసలు ఆగలేదు.

భూస్వామి అక్కడికి వచ్చినరోజు… అంజయ్యతో మూత్రం తాగించారు. జవాన్ల వృషణాలను నోటిలో చొప్పించారు. పాకీదొడ్డిని శుభ్రం చేయించారు.

జవాన్లు దయదలచి పెట్టిన జొన్నసంకటితోనే ప్రాణం నిలుపుకొన్నాడు అంజయ్య.

కళ్లు పీక్కుపోయాయి. గడ్డం పెరిగింది. బట్టలు మైలపడ్డాయి. శవంలా తయారయ్యాడు.

ఆంధ్రమహాసభ సభ్యుల కృషి ఫలించింది.

అరెస్టయిన వారంతా పద్దెనిమిది రోజుల ఆ నరకం నుంచి బయటపడి, ఇంటిబాట పట్టారు.

అంజయ్య ఇంటికి చేరుకునేసరికి తల్లి మట్టిలో కలిసిపోయింది.

నిస్త్రాణగా నులకమంచంపై వాలిపోయాడు.

ఈ విషయం గ్రామాలన్నింటా పాకి, ఎల్లమ్మ చెవికి చేరింది.

ఆరోజు సాయంత్రానికి అంజయ్య ఇంటికి చేరుకుంది ఎల్లమ్మ. వెంట తెచ్చిన జొన్నన్నంలో పచ్చడి కలిపి అతనికి తినిపించింది. అన్నీ తానై సేవలు చేసింది. అంజయ్య క్రమంగా కోలుకున్నాడు.

ఊళ్లో వ్యాపించిన వదంతులను లక్ష్యపెట్టకుండా ఎల్లమ్మ అతనింట్లోనే ఉండిపోయింది.

సాయుధ పోరాటానికి పార్టీ ఇచ్చిన పిలుపు నందుకుని, రెండు నెలల తర్వాత మళ్లీ పోరుబాట పట్టాడు అంజయ్య. ఎల్లమ్మ కడవెండిలోనే ఉండి, మహిళా గెరిల్లా పోరాటంలో భాగం పంచుకుంది.

దేశానికి స్వాతంత్య్రం వచ్చినా… నిజాం సంస్థా నపు నిర్బంధం నుంచీ, రజాకార్ల రక్కసిగోళ్ల నుంచీ ఆ ప్రాంతానికి విముక్తి లభించలేదు. పోలీసు చర్య తర్వాత కూడా స్వేచ్ఛ• దొరకలేదు.

బిగించిన పిడికిలి సడలించకుండా గ్రామాలకు గ్రామాలు ఉవ్వెత్తున ఉద్యమంలో భాగమై నిరంకుశ పోకడల్ని మట్టుబెట్టాయి.

మిలిటరీ-పోలీసు బలగాల కుయుక్తుల్ని నిర్వీర్యం చేశాయి.

నాలుగు వేలమంది వీరుల ప్రాణత్యాగం అనంతరం… తెలంగాణలో తలెత్తి తిరగగల నూతన మానవుడు ఉదయించాడు. నాలుగేళ్ల తర్వాత అంజయ్య ఎల్లమ్మ మెడలో తాళి కట్టాడు. రెండేళ్ల తర్వాత పుట్టిన కొడుక్కి తన మిత్రుడి జ్ఞాపకార్థం కొమురయ్య పేరు పెట్టుకున్నాడు.

ఉపాధి నిమిత్తం అక్కడా ఇక్కడా తిరిగి చివరికి సూర్యాపేటలో స్థిరపడ్డాడు.

‘పదిమంది కోసం బతకటమే పవిత్ర కార్యంరా’ అని కొడుక్కి ఎప్పుడూ చెబుతుండేవాడు.

పాతికేళ్ల క్రితం అంజయ్య అనారోగ్యంతో మర ణించిన నాటినుంచీ సంసారానికి ఎల్లమ్మే పెద్ద దిక్కయింది. కొమురయ్య, కోడలు రోడ్డు ప్రమాదంలో మరణించటంతో ఎల్లమ్మ కుంగిపోయింది.

మనవడు సంపత్‌ ఆమెను ఊరడించాడు. ధైర్యం చెప్పాడు. దేశం కోసం పాటు పడేందుకు సైనికుడిగా బాధ్యతలు స్వీకరించి, ఆమెకు నూతన జవసత్వాలు కల్గించాడు.

ఇప్పుడా మనవడు కూడా చైనా సరిహద్దుల్లో…

************

పురాతన శాఖ తవ్వకాల్లో బయల్పడిన శిలాశాసనంలా కూచొని ఉంది ఎల్లమ్మ.

సూర్యాపేట నుంచి హైదరాబాదు నగరానికి చేరిందామె.

ఒకప్పడు రజాకార్లపై నిప్పులు కురిపించిన ఆమె కళ్లల్లోని కాంతి క్రమంగా కొడిగడుతోంది.

‘అవ్వా’ అంటూ వచ్చి, ఒళ్లో కూచున్నాడు అనిరుధ్‌.

‌బాబు వెనకే వచ్చిన సంపత్‌ ‌భార్య ‘నేను ఆఫీసు కెళ్తున్న. బాబు జాగ్రత్త. ఏమన్న ఉంటే ఫోన్‌జెయ్యి’ అని చెప్పి వెళ్లిపోయింది.

అనిరుధ్‌ ‌తన చేతుల్లో ఉన్న చాక్లెట్లలోంచి ఒకదాని రేపర్‌ ‌తీసి, అవ్వ నోట్లో పెట్టాడు.

ఆమె పెద్దగా నవ్వి, బోసినోటితో చప్పరించటం మొదలుపెట్టింది.

‘మనమడా, నువ్వు పెద్దయినంక ఏంగావాలను కుంటున్నవ్‌?’ ‌సరదాగా అడిగిందామె.

అనిరుధ్‌ ‌గలగలా నవ్వి, అంతలోనే సీరియస్‌గా మారి, కళ్లు తిప్పుతూ సమాధానం చెప్పాడు.

ఆ సమాధానం విన్న ఎల్లమ్మ కళ్లల్లో… మళ్లీ సూర్యోదయమైంది!

About Author

By editor

Twitter
Instagram