‘మా బెదిరింపులు, మేం సృష్టిస్తున్న రక్తపాతం మా మతాన్ని అపహాస్యం చేసినందుకు కాదు, మా ప్రవక్త వ్యక్తిగత జీవితం, అందులోని ఒక మహిళ గురించి వ్యాఖ్యానించినందుకు కాదు. ఎందుకంటే అవేవీ కొత్తవి కావు. మేము ఇంతకు ముందు విననివీ కావు. మరెందుకు? మేమంటే మీకు భయం పోతోంది. మీరు ఐక్యమవుతున్నారు. హిందువులకు సాంస్కృతిక పరమైన విజయాలు వరసపెట్టి లభిస్తున్నాయి. వీటిని చూసి విర్రవీగవద్దని చెప్పడానికే ఇదంతా!’ అన్నట్టే ఉంది, ఇవాళ దేశంలో చాలామంది ముస్లిం మతోన్మాదుల వైఖరి. బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపూర్‌శర్మ వివాదంలో మలుపులన్నీ ఇందుకు సంబంధించినవే. ఉదయ్‌పూర్‌, అమరావతి కిరాతకాల వెనుక ఉన్నది కూడా అదే. మతోన్మాదుల వ్యాఖ్యలను, వైఖరిని చాలా ప్రతిపక్షాలు నిస్సిగ్గుగా సమర్థించడం పరిస్థితిని మరింత వేడెక్కిస్తున్నది. దీనిని మతోన్మాదంగా అవి చూడడం లేదు. ఒకవేళ మతోన్మాదమని పైకి చెబితే సాధారణ ముస్లిం ఓటరు కూడా దూరమైపోతాడన్న భీతి వాటిని వెంటాడుతోంది. ఇదంతా బుజ్జగింపు రాజకీయం. నుపూర్‌ను ఉరి తీయాలని ప్రకటించేవారు కొందరు. ఆమె దిష్టిబొమ్మకు ఉరేసిన వారు కొందరు. వీరికేమాత్రం తీసిపోకుండా నుపూర్‌ను వెంటనే అరెస్టు చేయాలని బెంగాల్‌ అసెంబ్లీలో తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏకంగా తీర్మానమే చేసింది. తెరాస అధినేత  కేసీఆర్‌ ‌కూడా ఇదే పల్లవి అందుకున్నారు. ‘అదుపు లేని నోరు కారణంగా దేశం మొత్తం అగ్నిగుండమైంది’ అని సుప్రీంకోర్టు అత్యంత కటువుగా వ్యాఖ్యానించింది. కానీ దేశ అత్యున్నత న్యాయస్థానం సహా, విపక్షాలు, మేధావులు సౌకర్యంగా విస్మరించిన సంగతి ఒకటి ఉంది.


నుపూర్‌ ‌వ్యాఖ్యల తరువాత ఆమెపై లైంగిక అత్యాచారం చేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఒక్క మహిళా సంఘం కూడా పెదవి విప్పలేదు. ఆమెకు శిరచ్ఛేదమే సరైన శిక్ష అని ఇంకొందరు మాట్లాడారు. ఒక్క పౌర హక్కుల నేత కూడా నోరు తెరవలేదు. నుపూర్‌ ‌శిక్షార్హురాలే అన్నట్టు అమర్త్యసేన్‌ ‌వంటి ‘నోబెల్‌’ ‌భుజకీర్తుల మోసినవారు కూడా మాట్లాడారు. మరి… మొయిత్రీ కాళీమాతను అవమానించినప్పుడు ఈ నోళ్లు మూకుమ్మడిగా ఎందుకు పడిపోయాయి? నుపూర్‌ ‌వ్యాఖ్యలకు మద్దతు పలికినందుకు ఉదయ్‌పూర్‌లో కన్హయ్యలాల్‌, అమరావతిలో కోల్హేలు ప్రాణాలు పోగొట్టుకుంటే వారి జీవించే హక్కు గురించి ఎవరికీ ఎందుకు పట్టలేదు? అస్సాం వరదలు కేవలం ముస్లిం ఉగ్రవాద కుట్ర అని, ఆ కారణంగా170 మంది కొట్టుకుపోయారని, కోట్లాది రూపాయల ఆస్తి నష్టం జరిగిందని బయటపడినా వీళ్లంతా కుక్కిన పేనుల్లా ఎందుకు ఉన్నట్టు? కాబట్టే ఇదంతా బీజేపీని అడ్డం పెట్టుకుని దేశం మీద చేస్తున్న దాడిగానే భావించాలి. రగడ మీద రగడ. వివాదం వెనుక వివాదం. మోదీ హయామంతా దీనితోనే నింపాలని ముస్లిం మతోన్మాదులు, టీఎంసీ, తెరాస, ఆప్‌ ‌వంటి పార్టీలు ఆశిస్తున్నాయి. ఇది ఈ మేధావులకు ఎందుకు అర్ధం కాదు? కానీ ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. అందుకే ఎక్కువ విజయాలు బీజేపీకే వస్తున్నాయి. కానీ వర్తమాన భారతాన్ని రగడల భారతంగా, వివాదాల భారతంగా ఉంచాలని విపక్షాలు, వీటి మద్దతుతో ముస్లిం మతోన్మాదులు చేస్తున్న వికృత చేష్టలతో పురోగతి కుంటుపడుతుంది. అంతిమంగా ప్రజలు నష్టపోతారు.

ముస్లిం మతోన్మాదులు నది కట్టలు తెంచిన కారణంగా పోటెత్తిన వరదలలో చనిపోయిన వారు సామాన్యపౌరులే అయినా, చేసింది ఇస్లామిక్‌ ‌టెర్రరిస్టులు కాబట్టి దేశం మౌనం వహించాలా? కానీ ఎవరో చేసిన వ్యాఖ్యలే నుపూర్‌ ‌శర్మ పునరుల్లేఖిస్తే జాతి ముందు నిలబడి క్షమాపణ చెప్పాలా? ఇదేం న్యాయం? అందుకే భారతీయ సమాజం దీని మీద రెండుగా చీలిపోయింది. ప్రతిపక్షాలను ఇప్పుడు ఎవరూ గౌరవించడం లేదు. ప్రజాస్వామ్యానికి ఉండవలసిన నాలుగు స్తంభాలలో ఒకటి ఆ విధంగా పనికిమాలినదిగా మిగిలింది. కానీ న్యాయ వ్యవస్థ కూడా మరొక స్తంభమే. నుపూర్‌ ‌వివాదంలో సుప్రీంకోర్టు కూడా తన ఔన్నత్యాన్ని తానే కోల్పోతున్నదన్న బాధ దేశ పౌరులలో కనిపిస్తున్నది.

టీవీ చానెళ్లలో కనిపించి దేశానికి క్షమాపణ చెప్పమని కూడా సూచించింది. తన మీద పలుచోట్ల జరుగుతున్న దర్యాప్తులను నిలువరించవలసిందిగా ఆమె పెట్టుకున్న పిటిషన్‌లో కోర్టు అహంకారం కూడా చూసింది. న్యాయమూర్తులంటే ఆమెకు చాలా చిన్నచూపు అని కూడా వ్యాఖ్యానించింది. అదేం లేదు, ఆమె క్షమాపణ కోరారు, వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని ఆమె న్యాయవాది చెప్పారు. కానీ చాలా ఆలస్యమైంది కదా అంటూ కోర్టు తేల్చేసింది. జూన్‌ 6‌న ఒక టీవీ చానల్‌ ‌చర్చలో ఆయేషా గురించి వ్యాఖ్యానించారు. ఆ చర్చలో పాల్గొన్న ఒక వ్యక్తి శివలింగం మీద చేసిన అసభ్య వ్యాఖ్యలకు జవాబుగానే ఆమె మాట్లాడారు. శివలింగం మీద ప్రయోగించిన పరుష పదజాలం గాలికి కొట్టుకుపోయింది. మరొకవైపు ప్రవక్త గురించి చేసిన వ్యాఖ్యలను అంతర్జాతీయ వివాదంగా మార్చారు. ఆయేషా గురించి నుపూర్‌ ‌చెప్పిన మాటలన్నీ గతంలో అదే మతానికి చెందిన వ్యాఖ్యాతలు చెప్పినవే. ఆ మత గ్రంథాలలో ఉన్నవే. అయినా ఎందుకీ రగడ? దేశంలో రక్తపాతం రావాలి. ఉగ్రవాదుల ఉనికిని చాటాలి. ముస్లిం మతోన్మాదు లకీ, పాక్‌ ‌భక్తులకీ కావలసింది స్పష్టమైన చీలిక.

నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరవాత దేశంలో మతం ఆధారంగా చీలిక తేవాలన్న తపన ముస్లిం ఉన్మాదులలో, వారి సమర్ధకులలో ఎక్కువైన మాట నిజం. ఈ వాస్తవాన్ని ముస్లిం మతోన్మాదులు బాహాటంగానే చెబుతున్నారు. తమ వ్యతిరేకతకు లక్ష్యంగా మోదీని చూపించినా, నిజానికి అదంతా హిందూత్వను ద్వేషించడమే. అదే సమయంలో అన్యమతాలను లౌకికవాదం పేరుతో నెత్తిన పెట్టుకోవడం, బుజ్జగించడం. వాస్తవానికి విపక్షాలకు మైనారిటీల మీద ప్రేమ ఏమీ లేదు. వారి ఓట్లపైనే ప్రేమ. ఈ ద్వంద్వ వైఖరి, రెండు నాల్కల ధోరణిపై ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పిస్తున్నా వాటి వైఖరి మారడం లేదు.

తాజా రగడ పూర్వాపరాలలోకి వెళ్లడానికి నుపూర్‌ ‌వివాదం నుంచి ఈ చర్చను ప్రారంభిద్దాం. భారతీయ జనతా పార్టీ నాయకురాలు, ఆ పార్టీ అధికార ప్రతినిధి నుపూర్‌ ‌శర్మ ఉదంతం ఇటీవల అనేక వాస్తవాలను నగ్నంగా చూపింది. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలపై ఉద్దేశపూర్వకంగా దుమారాన్ని రేపారు, ఈ నయా మేధావులు. నుపూర్‌ ‌వ్యాఖ్యలపై అటు పార్టీ, ఇటు ప్రభుత్వం తక్షణమే ప్రతిస్పందించాయి. పార్టీ వెంటనే ఆమెను బహిష్కరించింది. ఆమె వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అయినా ఈ మేధావులు, లౌకిక వాదులు ఆగలేదు. నుపూర్‌పై దేశవ్యాప్తంగా వివిధ పోలీస్‌ ‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అవి సంబంధిత న్యాయస్థానాల్లో విచారణకు రానున్నాయి. తనపై వివిధ రాష్ట్రాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఢిల్లీకి బదలీ చేయాలంటూ నుపూర్‌ ‌శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలపై కొంతమంది మాజీ న్యాయమూర్తులు, పదవీ విరమణ చేసిన ఉన్నతాధికారులు మొదట హర్షం వ్యక్తం చేశారు. ఈ వికృత ధోరణికి వ్యతిరేకంగా మరికొంతమంది మాజీ న్యాయమూర్తులు, ఐఏఎస్‌లు స్పందించవలసి వచ్చింది. న్యాయమూర్తుల వ్యాఖ్యలపై వారు ఆక్షేపణ తెలిపారు. అంతేకాక న్యాయస్థానం తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం లక్ష్మణరేఖను దాటిందని విచారం వ్యక్తం చేశారు.

సుప్రీం తీర్పుల మీద, ఆదేశాల మీద ఇటీవల చెలరేగుతున్న దుమారం నుపూర్‌ ‌వ్యాజ్యంతో బహుశా పరాకాష్టకు చేరింది. ఇటువంటి వ్యాఖ్యలు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో న్యాయవ్యవస్థకు చెరగని మచ్చగా, దురదృష్టకరమైనవిగా ఆ మాజీలు పేర్కొన్నారు. వీరంతా సాదాసీదా వ్యక్తులు కారు. 15మంది హైకోర్టు మాజీ జడ్జీలు, 77 మంది మాజీ ఉన్నతాధికారులు, మరో 25మంది ఇతర ప్రముఖులు ప్రకటన విడుదల చేశారు. న్యాయస్థానం వ్యాఖ్యలు ఇంటాబయటా ప్రకంపనలు రేపుతాయ న్నారు. తక్షణం దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్య విలువలపై, దేశభద్రతపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. ఈ మేరకు విడుదల చేసిన సంయుక్త ప్రకటనపై బాంబే హైకోర్టు మాజీ చీఫ్‌ ‌జస్టిస్‌ ‌క్షితిజ్‌ ‌వ్యాస్‌, ‌కేరళ హైకోర్టు మాజీ జడ్జి పి.న్‌.‌రవీంద్రన్‌, ‌గుజరాత్‌ ‌హైకోర్టు మాజీ జడ్జి ఎస్‌.ఎం.‌సోనీ, రాజస్తాన్‌ ‌హైకోర్టు మాజీ జడ్జిలు ఆర్‌.‌స్‌.‌రాథోడ్‌, ‌ప్రశాంత్‌ అగర్వాల్‌, ‌ఢిల్లీ హైకోర్టు మాజీ జడ్జి ఎస్‌.ఎన్‌.‌ధింగ్రా తదితరులు ఉన్నారు. మాజీ ఐఏఎస్‌ అధికారులు ఆనందబోస్‌, ఆర్‌.ఎస్‌. ‌గోపాలన్‌, ఎస్‌.‌కృష్ణకుమార్‌, ‌మాజీ రాయబారి నిరంజన్‌ ‌దేశాయ్‌ ‌తోపాటు మాజీ డీజీపీలు ఎస్‌.‌పి. వైద్‌, ‌బి.ఎల్‌.‌వోహ్రా, లెఫ్టినెంట్‌ ‌జనరల్‌ ‌వీకే చతుర్వేది (రిటైర్డు), ఎయిర్‌ ‌మార్షల్‌ (‌రిటైర్డు) ఎస్‌.‌పి.సింగ్‌ ‌తదితరులు ఈ ప్రకటనపై సంతకాలు చేశారు.

ఇంతకీ బీజేపీ బహిష్కృత అధికార ప్రతినిధి నుపూర్‌ ఇప్పుడు ఒంటరి కాదు. ఇదొక గమనించదగిన విశేష పరిణామం. డచ్‌ ఎం‌పీ గీర్ట్ ‌వైల్డర్స్ ఆ ‌వ్యాఖ్యలను సమర్ధించారు. మహమ్మద్‌ ‌గురించి ఆమె సత్యాలు మాట్లాడింది. అందుకు ఆమెను ఎప్పటికీ క్షమించరాదు అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. నుపూర్‌ ఒక హీరో అని అన్నారు. ఉదయ్‌పూర్‌ (‌కన్హయ్యలాల్‌)‌హత్యకు ఆమె కారణం కానే కాదని కూడా అభిప్రాయపడ్డారు. అసలు సంగతి ఇది కాదు. గీర్ట్ ‌చెప్పిన ఇంకో నాలుగు మాటలు ప్రతిపక్షాల కళ్లు తెరిపించగలవు. ‘నేను భారతీయుడిని కాదు. అలాగే హిందువును కూడా కాదు. కానీ నాకొక విషయం బాగా తెలుసు. ప్రవక్త మహమ్మద్‌ను చీకటికోణంలో చూపించాలంటే హిందూ దేవీదేవుళ్లను రాక్షసులుగా చిత్రించనక్కర లేదు. సెక్యులరిజం అంటే అర్ధం అది కానేకాదు. కాబట్టి నుపూర్‌ ‌శర్మ హిందూ దేవుళ్లను కించపరుస్తూ మరొకరు మాట్లాడుతుంటే ప్రతిస్పందించడంలో ఎలాంటి తప్పు లేదు’ అన్నారు. బంగ్లాదేశ్‌ ‌రచయిత్రి, ‘లజ్జ’ నవలాకర్త స్పందన మరొక విధంగా ఉంది. మహమ్మద్‌తో సహా ఎవరూ విమర్శలకు అతీతులు కారు అన్నారామె. నా ప్రవక్త గురించి మాట్లాడినా నేను పీకలు, నాలుకలు కోస్తాను. ఆ వ్యాఖ్యలు చేసిన వారిని సమర్ధించినా ఇదే గతి పట్టిస్తాను. కానీ అవతలి మతం వారి విగ్రహాలను అవమానపరిచినా నన్ను అడిగే హక్కు ప్రపంచంలో ఎవరికీ ఉండదు అన్న ధోరణి మతోన్మాదులలో స్పష్టంగా కనిపిస్తున్నది.

———————————————————————

ఎంతకాలం ఈ అరాచకం?

ఇంతకీ ‘కాళీ’ పోస్టర్‌తో దేశంలో వాతావరణాన్ని మరింత కలుషితం చేసిన లీనా మణిమేఖలై ఒక డాక్యుమెంటరీ చిత్రాల రూపకర్త. నుపూర్‌ ‌వ్యాఖ్యలతో ముస్లిం మతోన్మాదులు సృష్టించిన కల్లోలంలో, దరిమిలా కన్హయ్యలాల్‌, ‌ప్రభాకరరావు కోల్హేల హత్యలతో వేడెక్కి ఉన్న భారత్‌లో లీనా విడుదల చేసిన పోస్టర్‌ ‌మరింత విషం చిలకరించింది. ఈ అతి తెలివి సృజన గురించి ఎక్కువగా ప్రతికూల వ్యాఖ్యలే వచ్చాయి. నుపూర్‌ ‌వ్యాఖ్యలకు అనుకూలంగా అనేకంటే, దరిమిలా ఆమె మీద మతోన్మాదులు చేసిన వ్యాఖ్యల మీద భారతీయులు ముఖ్యంగా హిందువులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కానీ లీనాకు ఎలాంటి మద్దతు లభించలేదు. చాలామంది భారతీయ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా లీనా చర్యను ఖండించారు. అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను తన చిత్రంలో చూపించిన దేవత మానవతా మార్గదర్శకురాలని లీనా బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం మరీ జుగుప్సాకరంగా ఉంది. కవయిత్రిగా, చిత్ర నిర్మాతగా తాను కాళిని స్వతంత్ర దృక్పథంతో చిత్రించానని ఆమె సమర్ధించుకోవడం మరీ విడ్డూరం. ఈమె మీద కూడా ఇప్పుడు భారత్‌లో పలుచోట్ల ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. మొహువా మొయిత్రా మద్దతు కూడా ఈమెకే.

ఇలా హిందూదేవతలను అవమానిస్తూ సినిమాలు తీయడం, దాని మీద నిరసనలు వెల్లువెత్తడం కొత్తకాదు. దీనికే భావ ప్రకటనా స్వేచ్ఛ అని, క్రియేటివ్‌ ‌లిబర్టీ అని పేర్లు. 2015లో బాలివుడ్‌లో నిర్మించిన యాంగ్రీ ఇండియన్‌ ‌గాడెసెస్‌ అనే సినిమా కూడా వివాదాలను తెచ్చింది. ఈ సినిమాకు సెన్సార్‌ అధికారులు చాలా కట్‌లు సూచించారు. గతేడాది సైఫ్‌ అలీ ఖాన్‌ ‌తీసిన తాండవ్‌ ‌వెబ్‌ ‌సిరీస్‌ ‌కూడా ఇలాంటి వివాదాలనే తెచ్చుకుంది. ఇందులోను హిందూ దేవుళ్లనే అవమానపరుస్తూ దృశ్యాలు ఉన్నాయి.

లీనా అనే ఆ తుంటరి మహిళా దర్శకురాలు ఇంతలోనే ఇంకో పని కూడా చేశారు. శివపార్వతులను కూడా ఇలా పొగ తాగుతున్నట్టు తన ట్విటర్‌ ‌ఖాతాలో పోస్ట్ ‌చేశారు. ఇది హిందువులను అవమానపర్చడమే కాదు, రెచ్చగొట్టడం కూడా. ఇలాంటి పనికిమాలిన ‘కళాజీవులకి’ అంతర్జాతీయ సమాజం, ఈ దేశంలోని వామపక్షవాదులు, ఉదారవాదులు భుజకీర్తులు తగిలిస్తూ ఉంటారు. దీనిని ఇంకా ఎంతకాలం హిందూ సమాజం భరించాలి? దేశ వ్యతిరేక శక్తులని, హిందూ మత ద్వేషులని ఎంతకాలం సహించాలి? ఔను ఆమె భారతద్రోహి. ఆ మాట ఆమె నివసిస్తున్న కెనడా చట్టసభ సభ్యుడే అన్నారు. భారతీయ మూలాలు ఉన్న ఎంపీ చంద్ర ఆర్య. ఆయన అన్న మాట ఇదే- హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక శక్తులు ఇక్కడి వాళ్లతో చేతులు కలుపుతున్నారు.

————————————————————————

 మన జీవించే హక్కును ఇవాళ సుప్రీంకోర్టు లాగేసుకుంది అని ప్రఖ్యాత బాలివుడ్‌ ‌దర్శకుడు వివేక్‌ ‌రంజన్‌ అగ్నిహోత్రి బాహాటంగానే వ్యాఖ్యానించారు. ఆమెకు ఏమైనా జరగరానిది జరిగితే ఎవరి నోటి దురుసు అందుకు బాధ్యత వహిస్తుందని కూడా ప్రశ్నించారాయన. ఇదొక (సుప్రీంకోర్టు వ్యాఖ్య) చెడు సంప్రదాయాన్ని ప్రవేశపెడుతుందని ఆయన ట్వీట్‌ ‌చేశారు. మన నాగరికత మనం ఇచ్చుకున్న తప్పుడు తీర్పుల వల్ల నిరంతరం గాయపడుతూనే ఉందనీ, ఇది గాంధీజీ ఖిలాఫత్‌ ఉద్యమానికి మద్దతు ఇచ్చినప్పటి నుంచి జరుగుతూనే ఉందనీ కూడా ఆయన అన్నారు. యువర్‌ ఆనర్‌! ‌మీ గౌరవం కోసం కొంత గౌరవప్రదంగా ఏమైనా చేయండి అని అనుపమ్‌ ‌ఖేర్‌ ‌కాస్త కటువుగానే ట్వీట్‌ ‌చేశారు. రచయిత వైద్యా శేఫాలి ఒక భారత పౌరురాలు -నుపూర్‌ ‌శర్మ మీద అన్ని వైపుల నుంచి చంపుతా మంటూ వచ్చిన హెచ్చరికలును ఈ దేశ అత్యున్నత స్థానం గమనంలోకి తీసుకోకపోవడం నమ్మశక్యం కాకుండా ఉంది అన్నారు. ఈ అత్యున్నత న్యాయస్థానమే కశ్మీరీ పండిత్‌లు సామూహిక మరణదండనకు గురయ్యారన్న పిటిషన్‌ను తిరస్క రించింది. అక్కడ నుంచి పండిత్‌లను తుడిచిపెట్టే యోచన ఉన్నదీ అంటే నమ్మని కోర్టు కూడా ఇదే అని అశోక్‌ ‌పండిత్‌ అన్నారు. అంతేకాదు, ఇవాళ హిందువుల నరమేధానికి నుపూర్‌ ‌కారణమని ఈ కోర్టు ఆరోపిస్తున్నదని కూడా ఆయన వ్యాఖ్యా నించారు. ప్రముఖ క్రికెటర్‌ ‌గౌతమ్‌ ‌గంభీర్‌ ‌కూడా నుపూర్‌కు మద్దతు తెలియచేశారు. ఎంత ఆశ్చర్య మంటే, నుపూర్‌కు వ్యతిరేకంగా ఎంతటి నెట్‌వర్క్ ‌మోహరించి ఉందంటే, అహ్మదాబాద్‌కు చెందిన ఒక న్యాయవాది తన వాట్సాప్‌లో ఆమె ఫొటోను స్టేటస్‌గా పెట్టుకున్నారు. కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే ఆయనకు బెదిరింపు మెసేజ్‌ ‌వచ్చింది. బిహార్‌లోని అరా పట్టణంలో ఒక వ్యక్తి నుపూర్‌ ‌వ్యాఖ్యను సమర్ధిస్తూ పోస్టు పెట్టినందుకు వెంటనే ఘర్షణలు జరిగాయి. అక్కడే నుపూర్‌ను సమర్ధిస్తూ పోస్టు పెట్టినందుకు ఒక యువకుడిని చావగొట్టారు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. హైదరాబాద్‌, ‌ఢిల్లీ సహా దేశంలో పలుచోట్ల నుపూర్‌ అనుకూల ప్రదర్శనలు జరిగాయి. ఇప్పుడు నుపూర్‌ ఒం‌టరివారు కారని చెప్పడం అందుకే.

 నుపూర్‌ ‌శర్మపై సర్వోన్నత న్యాయస్థానం చేసినవి తీవ్రమైన వ్యాఖ్యలేనని అంతా అంగీకరిస్తు న్నారు. ఇష్టారీతిన ఆమె చేసిన వ్యాఖ్యలు దేశం మొత్తంపై ప్రభావం చూపాయని ఇందుకు ఆమె బాధ్యత వహించాలని, క్షమాపణలు చెప్పాలని కోర్టు పేర్కొంది. వాస్తవానికి నుపూర్‌ ‌శర్మ వ్యాజ్యానికి, కోర్టు ఆదేశానికీ, ఆ వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదు. ఆమె విన్నవించింది ఒక్కటే. దేశవ్యాప్తంగా తనపై నమోదు చేసిన కేసులను ఒకచోటకు చేర్చి విచారించమని గౌరవ న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. అంతకు మించి తను వ్యాఖ్యలు చేయలేదని కానీ, కేసును కొట్టేయాలని కానీ ఆమె కోరలేదు. దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో విచారణకు హాజరు కావడం కష్టమని, అందువల్ల ఢిల్లీకి వాటిని మార్చినట్లయితే తనకు సౌకర్యంగా ఉంటుందని మాత్రమే కోరారు. ఇందులో పెద్దగా అభ్యంతరం పెట్టాల్సింది కానీ, అనూహ్యంగా ప్రతిస్పందించా ల్సింది కానీ ఏమీ లేదు. దీంతో దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రతినిధులుగా వ్యవహరించే ఇద్దరు న్యాయమూర్తులు తమ పరిధులు దాటారని భావించడం వల్లే తాము బహిరంగ ప్రకటన రూపంలో స్పందించాల్సి వచ్చిందని ఆ మాజీలు పేర్కొన్నారు. ఢిల్లీకి చెందిన సామాజిక కార్యకర్త అజయ్‌ ‌గౌతం సైతం సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలపై ఆక్షేపణ తెలుపుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌నూతలపాటి వెంకట రమణకు లేఖ రాశారు. తన లేఖను పిటిషనుగా స్వీకరించాలని కోరడం గమనార్హం. కోర్టు విచారణ సందర్భంగా నుపూర్‌ ‌శర్మ తరఫు న్యాయవాది వాదనలను గమనించాల్సిన అవసరం ఉంది. శర్మ ప్రాణాలకు ముప్పుందన్న న్యాయవాది మణిందర్‌ ‌సింగ్‌ ‌వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. అంతేకాక జరిగిన ఘటనకు శర్మ లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. శర్మ ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని కోర్టుకు వివరించారు. గతంలో పాత్రికేయుడు అర్ణబ్‌ ‌గోస్వామి ఎఫ్‌ఐఆర్‌లను కలిపే అవకాశం ఇదే కోర్టు ఇచ్చిందని ధర్మాసనానికి వివరించారు. ఒక చర్యకు రెండో ఎఫ్‌ఐఆర్‌ అవసరం లేదని అప్పుడు పేర్కొందని తెలియజేశారు. గోస్వామి విషయం ఒక పాత్రికేయుడి హక్కులకు సంబంధించినది. దానిని, దీనిని కలిపి చూడలేమని కోర్టు స్పష్టం చేసింది. చివరికి పిటిషన్‌ను విచారించలేమని, ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలని కోర్టు పేర్కొంది.

సహజంగానే కోర్టు తీర్పును కాంగ్రెస్‌ ‌యువరాజు రాహుల్‌ ‌గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, బెంగాల్‌ ఆర్థికవేత్త, నోబెల్‌ ‌గ్రహీత అమర్త్యసేన్‌ ‌తదితరులు స్వాగతించారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. న్యాయ మూర్తుల వ్యాఖ్యలకు దురుద్దేశాలను ఆపాదించడం సరైనది కాదు. కేసు విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యలు చేయడం సహజం. వాటిని తీర్పుగా చూడరాదు. అదే సమయంలో తీర్పులో ఈ అంశాలు ప్రతిబింబిస్తాయని భావించడం కూడా సరికాదు. బాధ్యతాయుతమైన పౌరుడిగా న్యాయవ్యవస్థ పట్ల సంపూర్ణ గౌరవ ప్రతిపత్తులు కలిగి ఉండాలి. అదే సమయంలో అత్యంత సంయమనం వహిస్తూ కోర్టు వ్యాఖ్యలపై సముచిత రీతిన స్పందించడంలో ఎలాంటి తప్పూ లేదు. వీటిని కోర్టు ధిక్కార వ్యాఖ్యలుగానో మరో విధంగానో ఎంతమాత్రం చూడరాదు. గౌరవ న్యాయమూర్తుల వ్యాఖ్యలపై అభ్యంతరాలుంటే అప్పీలుకు పోవచ్చు. ఇంతకుమించి ఏం చేసినా తప్పే అవుతుంది. అందుకే మాజీ న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు అర్థవంతమైన, పార్లమెంటరీ భాషలో, సముచితంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

———————————————————————————–

భారతీయ చైతన్యం కాళీ అమ్మవారు

కాళీ పోస్టర్‌ ‌వివాదం మధ్య ఉదారవాదులకు ప్రధాని కీలెరిగి వాత పెట్టారు. ఈ పనికిమాలిన మేధావులు కళాకారులు ఆశిస్తున్న అడ్దదారి కీర్తిని ఆయన కొట్టి పారేశారు. భారతీయ భక్తికి కాళీమాత కేంద్ర బిందువు అని ఆయన శ్లాఘించారు. స్వామి ఆత్మస్థానానంద శత జయంతి సందర్భంగా ఇచ్చిన ఉపన్యాసంలో ఆయన కొన్ని చక్కని మాటలు చెప్పారు. భారత్‌కు కాళీ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని ఆయన అన్నారు. ఈ ప్రపంచమంతా ఒక చైతన్యం ఉందని, అది కాళీ పూజల సందర్భంగా బెంగాల్‌లో కూడా ఉంటుందని రామకృష్ణ పరమహంస చెబుతూ ఉండేవారని మోదీ చెప్పారు. కాళీమాత ఆశీస్సులు పొందడం భారత్‌ అదృష్టమని ఆయన అన్నారు.

———————————————————————————–

ఇవే విపక్షాలు, నయా మేధావులు ఇతర విషయాల్లో మాత్రం మౌనం వహించడం వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. ఇందుకు ఉదయ్‌పూర్‌లో దర్జీ హత్యోదంతమే నిదర్శనం. ఇస్లాం మతాన్ని అవమానించారని కాదు, నుపూర్‌ ‌వ్యాఖ్యను సమర్థించారన్న ఆరోపణతో రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఆ దర్జీని ఇద్దరు వ్యక్తులు పట్టపగలే దారుణంగా నరికి చంపారు. దానిని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ ‌చేశారు. కన్హయ్య తల నరికేశామని, ఈ అగ్గి రాజేసిన మోదీని సైతం వదలబోమని, ఆయననూ హతమారుస్తామని ప్రకటించడం దుండగులు రియాజ్‌ అఖ్తారీ, గౌస్‌ ‌మహ్మద్‌ ‌కరకుతనాన్ని సూచిస్తుంది. ఈ దారుణాన్ని ఖండించడానికి లౌకికవాదులకు, నయా మేధావులకు మాటలు రాలేదు. దీనిపై అటు విపక్షాలు కానీ, ఇతరులు కానీ స్పందించిన దాఖలాలు లేవు. కొన్ని ముస్లిం సంస్థలు మాత్రం మొక్కుబడిగా ఖండించి చేతులు దులిపేసుకున్నాయి. ఇలాంటి క్రూరమైన చర్యలు ఇస్లాం మతానికి విరుద్ధమని ‘జమైత్‌ ఉలేమా-ఎ-హింద్‌’ ‌తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సంస్థ ప్రధాన కార్యదర్శి మౌలానా హకీముద్దీన్‌ ‌ఖాస్మి ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్‌ ‌కు చెందిన ఎంఐఎం పార్టీ అధినేత, పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్‌ ఒవైసీ కూడా ఖండించారు. ఉదయ్‌పూర్‌ ‌తరహాలోనే మహారాష్ట్రలోనూ మరో దారుణం చోటుచేసుకుంది. అమరావతి జిల్లాలో ఓ మెడికల్‌ ‌షాపు నిర్వహిస్తున్న ప్రహ్లాద్‌రావు కోల్హేపై దుండగులు దాడికి తెగబడ్డారు. రాత్రి దుకాణం మూసివేసి వెళుతుండగా కొంతమంది వ్యక్తులు వచ్చి హతమార్చారు. దీనికి సంబంధించి నిందితులు ఇర్ఫాన్‌ ‌ఖాన్‌, ‌మదస్సిర్‌ అహ్మద్‌, ‌షారూక్‌ ‌పఠాన్‌, అబ్దుల్‌ ‌షేక్‌ ‌తస్లీం, షోయబ్‌ ‌ఖాన్‌, అతిబ్‌ ‌రషీద్‌, ‌యూసఫ్‌ ‌ఖాన్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రహ్లాద్‌ను చంపితే అయిదు లక్షలు ఇస్తామని, వారిని సురక్షితంగా కారులో రహస్య ప్రదేశానికి తరలిస్తా మని నిందితులు హామీ ఇచ్చినట్లు విచారణలో వెల్లడైంది. దేశంలో హిందువుల దేవుళ్లనూ, దేవతలనూ నిందిస్తే అది తప్పే కాదన్న వాతా వరణాన్ని ప్రతిపక్షాలతో పాటు న్యాయస్థానాలు కూడా కలిగిస్తున్నట్టు చాలామంది సాధారణ పౌరులు అనుమానించడం ఎప్పుడో మొదలయింది. అయినా హిందువులు తలలు నరకమని, నాలుకలు కోయమని ఆదేశాలు జారీ చేయడం లేదు. ఈ విషయం దగ్గరే విపక్షాలు దారుణంగా విఫలమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా హిందువులదే తప్పు అన్నట్టు భాష్యం చెప్పడం అత్యంత హీనమైన బుజ్జగింపు.

నుపూర్‌ ‌శర్మ వ్యాఖ్యలను అడ్డం పెట్టుకుని ముస్లిం మతోన్మాదులు రగిలించిన వేడి చాలలే దన్నట్టు మధ్యలో కాళీ వివాదం తెచ్చారు. అన్యమతా లపై ఈగ వాలినా నానా రాద్ధాంతం చేసే విపక్షాలు, మేధావులు, లౌకికవాదులు హిందూ దేవుళ్ల విషయంలో మాత్రం ఉదాసీనంగా వ్యవహరించడం వారి ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. కాళీ వివాదం కూడా అంతే. ఈ ధోరణికే భావ ప్రకటన స్వేచ్ఛ అని, లౌకికవాదమని అందమైన సమర్థింపు ప్రకటనలు చేయడం గమనార్హం. ఇలాంటి విషయాల్లో అందరికన్నా ముందుండే బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పార్టీ దగ్గరకు వచ్చేసరికి అడ్డగోలు సమర్థింపులకు దిగడం ఆమె రెండు నాల్కల ధోరణికి నిదర్శనం. కాళీమాతను మాంసాహారిగా, మద్యం స్వీకరించే దేవతగా తాను నమ్ముతున్నానని తృణమూల్‌ ఎం‌పీ మహువా మొయిత్రా వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. దీంతో ఒకింత వెనకడుగు వేసిన మొయిత్రా కొంతమేరకు దిగివచ్చారు. అయినా మొండితనంగా మాట్లాడారు. ‘నేను కాళీమాత భక్తురాలిని, గూండాలకు, వారి బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదు. దమ్ముంటే నాపై చర్యలు తీసుకోవాలని సవాల్‌ ‌చేస్తున్నా. నా వెనక సత్యం ఉంది. సత్యానికి బ్యాకప్‌ ‌శక్తుల అవసరం లేదు’ అని ఆమె పేర్కొన్నారు. మొయిత్రా వ్యాఖ్యలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె వ్యాఖ్యలపై బెంగాల్‌ ‌బీజేపీ భగ్గుమంది. ఆమెను అరెస్టు చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్‌, అసెంబ్లీలో విపక్షనేత సువెందు అధికారి డిమాండ్‌ ‌చేశారు. పోలీసులు తగిన చర్యలు తీసుకో కుంటే కోర్టులను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా వందలాది ఫిర్యాదులు వస్తున్నాయని వారు తెలిపారు. స్థానిక బీజేపీ కార్యకర్తలు బౌబజార్‌ ‌ఠాణా వద్దకు చేరుకుని ఎంపీకి వ్యతిరేకంగా పెద్దయెత్తున నినాదాలు చేశారు. ఆమెను అరెస్టు చేయాలంటూ ఢిల్లీలో గో మహాసభ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో టీఎంసీ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆమె వ్యాఖ్యలు వ్యక్తిగతమని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చింది. కానీ నేరుగా పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఎక్కడా ఖండించకపోవడం ఇక్కడ గమనార్హం. నుపూర్‌ ‌శర్మను పార్టీ నుంచి బహిష్కరించినా, ఆమె వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేసినా నాడు విపక్షాలు నానాయాగీ చేసిన విషయం గమనార్హం. ఈ ఉదంతంతో వారి ద్వంద్వ ప్రమాణాలు మరోసారి బయటపడ్డాయి. దర్శకురాలు, నటి, రచయిత్రి లీనా మణిమేగలై తాజా డాక్యుమెంటరీ చిత్రం ‘కాళీ’కి సంబంధించి ఇటీవల విడుదల చేసిన పోస్టర్‌ ‌తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కాళీ పాత్రధారి స్వలింగ సంపర్కులు, ట్రాన్స్‌జెండర్లకు సంబంధించిన జెండాను చేతబూని సిగరెట్‌ ‌చేతిలో ఉన్న దృశ్యాన్ని పోస్టర్‌లో చిత్రించారు. ఓ చర్చా కార్యక్రమంలో దీనిపై టీఎంసీ ఎంపీ మొయిత్రా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. అయితే తాను ఏ చిత్రానికి, పోస్టరుకూ మద్దతు ఇవ్వలేదని, ధూమపానం అనే పదాన్ని అసలే వాడలేదని ఆమె వివరణ ఇచ్చారు. నేను నమ్మిన విషయాన్ని నిర్భయంగా చెబుతా. ఇందుకోసం ఎంత మూల్యమైనా చెల్లిస్తాను. నా ప్రాణాన్ని పణంగా పెట్టడానికైనా సిద్ధమే. ఈ చిత్రం టొరొంటో ఆగాఖాన్‌ ‌మ్యూజియంలోని రిథమ్స్ ఆఫ్‌ ‌కెనడా విభాగానికి చెందినది. పోస్టరులోని సందర్భాన్ని తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడండి. కాళీ ఓ సాయంత్రం టొరొంటో వీధుల్లో విహరిస్తున్నప్పుడు ఏం జరిగిందన్నది దీని ఇతివృత్తం. దీన్ని చూశాక అందరూ నన్ను ఐ లవ్‌ ‌యూ … అంటారని మొయిత్రా అడ్డగోలుగా వాదించడం విశేషం. తమిళనాడులోని మదురైలో జన్మించిన మణిమేగలై టొరొంటోలో ఉంటున్నారు. అయితే దీనిపై కెనడాలోని హిందూ సమాజం అభ్యర్థనలతో కాళీ పోస్టరును తొలగించాలంటూ కెనడా అధికారులకు భారత హైకమిషన్‌ ‌విజ్ఞప్తి చేసింది.

 మొయిత్రా విద్యావంతురాలు. ప్రతిష్టాత్మకమైన జేపీ మోర్గాన్‌ ‌కంపెనీలో పనిచేశారు. కాంగ్రెస్‌ ‌వాదిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె తరవాత టీఎంసీలో చేరారు. 2016లో కరీంపూర్‌ ‌సీటు నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. తరవాత 2019లో పార్లమెంటుకు పోటీచేశారు. కృష్టానగర్‌ ‌నియోజక వర్గం నుంచి లోక్‌సభలో అడుగుపెట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి వంటి కీలక పదవులను నిర్వహించారు. ఇంత సుదీర్ఘ చరిత్ర గల ఉన్నత విద్యావంతురాలైన మొయిత్రాకు దేశంలో భిన్న వర్గాల ప్రజల ఆరాధనా పద్ధతులు, విశ్వాసాలు, నమ్మకాల గురించి, వాటిని గౌరవించాలన్న విషయం తెలియదని అనుకోలేం. ఇండియా టుడే నిర్వహించిన సదస్సులో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేవలం బుజ్జగింపు రాజకీయాలతోనే నెట్టుకు వస్తున్న టీఎంసీ నాయకురాలు ఇంతకు మించి సంస్కారం చూపగలదని భావించనక్కరలేదు. ఇంత జరిగినా ఆమెపై చర్య తీసుకోవడానికి పార్టీ నీళ్లు నములు తోంది. సాగదీసే, తప్పించుకునే ధోరణిని కనబరు స్తుంది. ఆమె వ్యాఖ్యలకు పార్టీ దూరమని, వ్యక్తిగత మని చెప్పడం తప్ప చర్యల గురించి మాట్లాడటం లేదు. పార్టీ అన్ని మతాల విశ్వాసాలను, నమ్మకాలను, ఆరాధనా పద్ధతులను గౌరవిస్తుందని సీనియర్‌ ‌నేత సౌగత్‌ ‌రాయ్‌ ‌సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఆమెపై చర్య గురించి అడిగితే తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని తప్పించుకునే ధోరణి ప్రదర్శించారు. అదే నుపూర్‌ ‌విషయంలో ఏకంగా అసెంబ్లీ తీర్మానమే చేసింది. ఆమెను అరెస్టు చేయాలని గోల పెట్టింది. మరి మొయిత్రా వ్యాఖ్యలు ఎందుకు పట్టవు? ఆ పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ ఈ విషయం తనకు తెలియ దన్నట్లు నటిస్తున్నారు. పూర్తిగా మౌనం పాటిస్తు న్నారు. అసలు ఎలాంటి వివాదం లేదన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో జరిగినా, ఆయాచోట్ల మైనార్టీలపై ఈగ వాలినా మమత చేసే రాద్ధాంతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక హస్తినలోని ప్రధాన విపక్షాల సంగతి ఇందుకు భిన్నం కాదు. ఇప్పటివరకు వారు ఈ విషయమై నోరు విప్పిన దాఖలాలు లేవు. ఇలాంటి ద్వంద్వ వైఖరులను ప్రజలు గమనించలేదని విపక్షాలు అనుకోవడం పెద్ద పొరపాటు. వీరి రెండు నాల్కల ధోరణిపై ఎన్నికల సమయంలో ప్రజలు వాత పెడుతున్న సంగతిని అవి గమనించడం లేదు.

ఈ ఘటనపై స్పందించడానికి లౌకికవీరులైన రాహుల్‌ ‌గాంధీ, సీతారాం ఏచూరి, డి.రాజా, ఒవైసీ లకు మాటలు రావడం లేదు. నుపూర్‌ ‌శర్మ వివాదంపై గళమెత్తిన బెంగాల్‌ ‌మేధావి, నోబెల్‌ ‌బహుమతి గ్రహీత అమర్య్త సేన్‌ ‌తాజా వివాదంలో మౌనం వహించారు. బెంగాలీలు కాళీమాతను ఘనంగా ఆరాధిస్తారు. ఏటా భారీగా సంబరాలు, ఉత్సవాలు చేస్తారు. కులమతాలకు అతీతంగా ప్రతి బెంగాలీ వీటిల్లో పాల్గొంటారు. కాళీమాతను బెంగాల్‌ ‌ప్రైడ్‌గా పేర్కొంటారు. ఇంతటి ఘనచరిత్ర ఉన్న అమ్మవారికి జరిగిన అమర్యాదపై ఖండించడానికి విపక్ష నేతలకు మాటలు రాకపోవడాన్ని ఏమనాలి? ఇదేనా వారి లౌకికవాదం? హిందువులపై, వారి దేవుళ్లపై, మత విశ్వాసాలపై అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం భావ ప్రకటన స్వేచ్ఛ కిందకు వస్తుందా? భావ ప్రకటన స్వేచ్ఛపై పరిమితులు ఉన్నాయని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించడం కాదా? అన్ని మతాలను, వారి ఆరాధనా విధానాలను, విశ్వాసాలను, నమ్మకాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని రాజ్యాంగం ఘోషిస్తున్నా వీరికి తెలియదా? అన్న ప్రశ్నలు తెత్తడం సహజం. ఈ విషయాలన్నీ విపక్షాలకు తెలియదని కూడా అనుకోలేం. అయితే ఓటు బ్యాంకు రాజకీయాలకు అలవాటు పడ్డ పార్టీలు ఇంతకు మించి భిన్నంగా మాట్లాడతాయని ఆశించడం అత్యాశే అవుతుంది. ప్రజలు పలుమార్లు ఎన్నికల్లో గుణపాఠం చెబుతున్నప్పటికీ విపక్షాలకు అర్థం కావడం లేదు. ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగుచోట్ల కమలదళం ఘన విజయం సాధించినా వాటి వైఖరి మారకపోవడం విచారకరం. ఒక్క పంజాబ్‌ ‌మినహా మిగిలిన యూపీ, ఉత్తరాఖండ్‌, ‌గోవా, మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కమలానికి ఓటర్లు ఘన విజయం కట్టబెట్టారు. గతంలో మెజార్టీ సాధించని గోవా, మణిపూర్‌ ‌వంటి రాష్ట్రాల్లో ఈసారి సంపూర్ణ ఆధిక్యాన్ని ఓటర్లు అందించిన విషయం విపక్షాలకు గుర్తున్నట్లు లేదు.

 ముస్లిం ఉగ్రవాదులు తమ జిహాద్‌ ‌విద్యలలో కొత్త కోణం చూపించారు. అదే జల జిహాద్‌ అనుకో వచ్చు. అస్సాం వరదలు దాని పుణ్యమే. ఇప్పటివరకు ప్రజల ప్రాణాలు, ఆస్తులు లక్ష్యంగా విధ్వంసానికి పాల్పడుతున్న ఉగ్రవాదులు తాజాగా మొత్తం సమాజానికి హానికరమైన చర్యలకు పాల్పడు తుండటం ఆందోళన కలిగించే పరిణామం. దేశ వ్యాప్తంగా ఉగ్రవాదుల దాడులు కొత్తేమీకాదు. తాజాగా ఈశాన్య రాష్ట్రమైన అసోంలో ఓ నది కట్టలను ధ్వంసం చేసి వరదలకు కారణమయ్యారు. ఇలాంటి ఘటన గతంలో ఎక్కడా చూడలేదు. ఇదే తొలిసారి. దీనివల్ల యావత్తు సమాజానికి చేటు కలుగుతుందన్న కనీస తెలివి కొరవడటం వారి మూర్ఖత్వానికి నిదర్శనం. అసోంను గత పది రోజులుగా వరదలు ముంచెత్తుతున్నాయి. బ్రహ్మపుత్ర దాని ఉపనదులు భారీ వానలతో ఉప్పొంగు తున్నాయి. ఫలితంగా వందల గ్రామాలు, వేలమంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అస్సాం ప్రభుత్వం, అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 175మందికి పైగా ప్రజలు మరణించినట్లు అంచనా. ఈ సమయంలో వెలుగుచూసిన ఉగ్రవాద చర్య అందరినీ ఆశ్చర్య పరిచింది. సిల్చార్‌ ‌జిల్లాలోని బ్రహ్మపుత్ర ఉపనది అయిన బరాక్‌ ‌నది కరకట్టలను కొందరు ఉగ్రవాదులు ధ్వంసం చేశారు. దీంతో వరద సమీప గ్రామాలను ముట్టడించింది. పంటలు నీట మునిగిపోయాయి. ప్రజలు గ్రామాలను వీడి వెళ్లాల్సి వచ్చింది. ఈ విధ్వంసానికి కారకులైన మిధు హుస్సేన్‌ ‌లస్కర్‌, ‌కాబూల్‌ ‌ఖాన్‌ అనే ఇద్దరు నిందితు లను పోలీసులు అరెస్టు చేశారు. సిల్చార్‌ ‌జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ ‌రమణదీప్‌ ‌కౌర్‌ ‌కేసును దర్యాప్తు చేస్తున్నారు. సహజంగా చీమ చిటుక్కుమన్నా స్పందించే, గోరంతలు కొండంతలు చేసే విపక్షాలు, లౌకికవాదులు, ఒక వర్గం మీడియా ఇంతవరకు దీనిని ఖండించిన దాఖలాలు లేవు. స్థానిక మీడియా కూడా విషయాన్ని విస్మరించింది. మొత్తం ఆరులక్షల మందికిపైగా ప్రజలు వరదలకు ప్రభావితమయ్యారు. వారిలో ఒక్క కచర్‌ ‌జిల్లాల్లోని నాలుగు లక్షల మంది ఉండటం గమనార్హం. శివసాగర్‌, ‌నాగౌన్‌, ‌కరీంగంజ్‌, ‌గోల్ఘాట్‌, ‌దిబ్రూఘర్‌ ‌వంటి జిల్లాల్లో వరద తీవ్రత ఇంకా తగ్గలేదు. బ్రహ్మపుత్రకు వరదలు కొత్తేమీ కాదు. ఏటా వస్తూనే ఉంటాయి. అదే సమయంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుంది. నష్ట నివారణ చర్యలు చేపడుతుంటుంది. కానీ ఇలాంటి కుట్రలు జరుగుతాయన్న విషయం తెలియదు. ఇలా జరగడం ఇదే తొలిసారి. ఇకనుంచి అధికార యంత్రాంగం మామూలు రోజులతోపాటు వరదల సమయంలోనూ ఉగ్రవాదుల కుట్రలపై ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరాన్ని తాజా ఘటన గుర్తు చేస్తోంది. అసోంకు పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌ ‌నుంచి దొంగచాటుగా వలసలు ఉంటాయి. వీరి ఓట్లపై కన్నేసిన విపక్ష కాంగ్రెస్‌ అం‌డగా ఉంటుంది. బతుకు దెరువు పేరుతో వచ్చినవారు తరవాత ఉగ్రవాదులుగా మారి విధ్వంసాలకు పాల్పడుతుంటారు. దీనికోసమే కేంద్రం సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం) తీసుకు వచ్చింది. దానిపై విపక్షాలు నానాయాగీ చేశాయి. ఈ నేపథ్యంలో అసోం సర్కారు మరింత అప్రమ త్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Twitter
Instagram