ఈ పరిణామాలూ, ఈ దుష్ప్రచారం, ఈ ఉన్మాదం భారతీయ సమాజాన్ని ఎటు తీసుకుపోతాయి? వీటికి అడ్డుకట్ట లేదా? ఉండదా? ఈ ప్రశ్నలు తప్పక వేసుకోవలసిన పరిస్థితిలోనే ఇప్పుడు భారతీయులు, ప్రధానంగా హిందువులు ఉన్నారు. ఇటీవల ఇక్కడి ఒక ఇంగ్లిష్‌ ‌న్యూస్‌ ‌చానల్‌ ‌ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేసింది. మేధావులుగా చెలామణి అవుతున్న కొందరు భారతదేశం గురించి విదేశీయులకి ఎలాంటి సమాచారం ఇస్తున్నారో అది మరొకసారి తెలియచేసింది. రాణా ఆయూబ్‌ అనే ఒక మహిళా జర్నలిస్ట్ ‌తాజాగా ఒక విదేశీ పత్రికకు రాసిన వ్యాసం శీర్షికను కూడా ఆ కార్యక్రమంలో ఉదహరించారు. భారత్‌లో మైనారిటీలపై పెరిగిపోతున్న వివక్ష, ప్రధాని మోదీ మౌనంతో అత్యాచారాలకు ఊతం అనే అర్థం వచ్చే శీర్షిక అది. మరొక కీలక ఉదాహరణ. ‘వాయిస్‌ ఆఫ్‌ ‌ఖొరసాన్‌’ ‌పత్రిక తాజా సంచిక. దాని ముఖచిత్రంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో వేశారు. మువ్వన్నెల జెండా పట్టుకున్న మోదీ ఫొటో వేసి, వెనుక మాత్రం ముస్లింల మీద జరిగిన దాడులుగా చెప్పే దృశ్యాలను, నెత్తురును మరిపించే విధంగా సిరా మరకలు అచ్చువేశారు. ఇంతకీ ఈ పత్రిక ఉగ్రవాద ముస్లిం సంస్థ ఇస్లామిక్‌ ‌స్టేట్‌ ‌ఖొరసాన్‌ ‌ప్రావిన్స్‌కు చెందినది. ఐఎస్‌ఐఎస్‌ అనుబంధ సంస్థ. ముఖచిత్ర కథనానికి పెట్టిన శీర్షిక ‘బాధకీ ఆశకీ మధ్య భారత్‌’. ‌భారత్‌లో ముస్లింలు ఇంకా మౌనం పాటిస్తే ఇంకొన్ని దాడులు జరుగుతాయని ఆ వ్యాసంలో హెచ్చరించారు. అంటే అక్షరాలా ముస్లింలను రెచ్చగొట్టే పనే చేశారు. నుపూర్‌ ‌వివాదం మొదలు కశ్మీర్‌, ‌గుజరాత్‌, ‌ఢిల్లీ అల్లర్ల వరకు చాలా అంశాలను ఇందులో ప్రస్తావించారు. వాటన్నిటిలో ముస్లింలే బాధితులన్నట్టు వర్ణించారు. కానీ ఇటీవల రాజస్తాన్‌, అమరావతిలలో పరమ కిరాతకంగా ఇద్దరు హిందువులను నరికి చంపిన విషయం మాత్రం ప్రస్తావించలేదు. ఇలాంటి రాతలకూ, రాణా ఆయూబ్‌ ‌వంటి కిరాయి మేధావులకు జవాబు అన్నట్టూ తాజాగా రొడ్జర్స్ (అమెరికా సంయుక్త రాష్ట్రాలు) విశ్వవిద్యాలయం ఒక పత్రాన్ని విడుదల చేసింది. నిజమే, హిందూధర్మం కేంద్రంగా దుష్ప్రచారం వాస్తవమే అని ఆ పత్రంలో అంగీకరించారు. ఆ పత్రం గురించి తెలుసుకునే ముందు నిజంగా భారతదేశంలో ఈ క్షణంలో ఏం జరుగుతున్నదో తెలుసుకుందాం. పట్నాలో బట్టబయలైన మరొక ఉగ్రముఠా కథనం ఇంకా వికృతం. 2047కి భారత్‌ ఇస్లామిక్‌ ‌దేశం కావడం దాదాపు ఖాయమన్నట్టే చెప్పేశారు.


ఈ జూలై 13న బిహార్‌ ‌రాజధాని పట్నాలో ఇద్దరు ముస్లిం ఉగ్రవాదులను అరెస్టు చేసి, ఎనిమిది పేజీల ఒక పత్రాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అదొక భారీ ప్రణాళిక. ఇంకా చెప్పాలంటే భారీ కుట్ర. దాని శీర్షిక, ‘భారత్‌ 2047- ‌ముస్లిం పాలన దిశగా భారత్‌’. అం‌తేకాదు, ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు సంబంధించిన ఒక పథకం కూడా వీళ్ల దగ్గరే పోలీసులకు దొరికింది. విధానసభ నూరేళ్ల ఉత్సవాల సందర్భంగా జూలై 12న ప్రధాని బిహార్‌లో పర్యటించినప్పుడు ఆ పని పూర్తి చేయాలని ముస్లిం ఉగ్రవాదులు పన్నిన కుట్రకు సంబంధించిన పత్రమది. ఆ ఇద్దరు ముస్లిం ఉగ్రవాదులని పట్నాలోనే ఫుల్వారి షరీఫ్‌ ‌ప్రాంతంలో అరెస్టు చేశారు. ఉగ్రవాద సంస్థ పాప్యులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియాతో వీళ్లకి సంబంధాలు ఉన్న విషయం కూడా బయటపడింది. ఈ ఇద్దరిలో ఒకరు మహ్మద్‌ ‌జలాలుద్దీన్‌, ‌మరొకరు అతార్‌ ‌పర్వేజ్‌. ఇతడు నిషేధ స్టూడెంట్స్ ఇస్లామిక్‌ ‌మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇం‌డియాలో పనిచేసేవాడు. ఇప్పుడు పాప్యులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా, దాని అనుబంధ ఎస్‌డీపీఐ (సోషలిస్ట్ ‌డెమాక్రటిక్‌ ‌పార్టీ ఆఫ్‌ ఇం‌డియా)లో పనిచేస్తున్నాడు. ఈ రెండు సంస్థలు ముస్లిం ఉగ్రవాద సంస్థలేనని వీర సెక్యులర్‌, ‌మార్క్సిస్టు, కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ ‌విజయన్‌ ‌కూడా నిర్మొహమాటంగా చెప్పారు. కేరళ దర్యాప్తు అధికారులు కోర్టుకు సమర్పించిన నివేదికలో కూడా ఇదే వెల్లడించారు. ఇంతకీ ఇందులో జలాలుద్దీన్‌ ‌జార్ఖండ్‌ ‌పోలీస్‌ ‌శాఖలో పనిచేసి పదవీ విరమణ చేసినవాడు. ప్రధాని బిహార్‌ ‌పర్యటనకు ఒకరోజు ముందే జూలై 11న ఇతడిని అరెస్టు చేశారు. అతార్‌ ‌పర్వేజ్‌ ‌మంజార్‌ ‌పర్వేజ్‌ ‌సోదరుడు. ఇతడు గతంలో పట్నాలో జరిగిన బాంబుపేలుడు కేసుకు సంబంధించి ప్రస్తుతం కారాగారంలో ఉన్నాడు. పర్వేజ్‌, ‌జలాలుద్దీన్‌లకు మూడు బ్యాంక్‌ అకౌంట్లు ఉన్నాయి. 14, 30, 40 లక్షల రూపాయల స్థాయిలో వీళ్లు లావాదేవీలు నిర్వహించినట్టు బయటపడింది.

మహ్మద్‌ ‌జలాలుద్దీన్‌ ‌కేసుతో సంబంధం ఉన్న మరొక అరెస్టు కూడా పట్నాలోనే, అదే ఫుల్వారీ షరీఫ్‌ ‌దగ్గర జరిగింది. ఇక్కడ అరెస్టయిన వ్యక్తి పేరు మర్గవ్‌ అహ్మద్‌ ‌దానిష్‌ అనే తాహిర్‌. ఈ ‌ముఠాయే ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నింది. ఇప్పుడు దేశమంతా చర్చించుకుంటున్న ఘాజ్వి ఎ హింద్‌ ‌వాట్సప్‌ ‌గ్రూప్‌ను నిర్వహిస్తున్నది ఇతడే. 26 ఏళ్ల తాహిర్‌ ‌పాకిస్తాన్‌ ‌నుంచి కార్యకలాపాలు నిర్వ హిస్తున్న ఉగ్ర సంస్థ తెహ్రీక్‌ ఎ ‌లబ్బేక్‌తో సంబంధాలు కలిగి ఉన్నాడు. ఘాజ్వి ఎ హింద్‌ ‌వాట్సప్‌ ‌ద్వారా ఇతడు ఏం చేస్తున్నాడో పోలీసులే చెప్పారు. దీని నిండా హిందూ ద్వేషమే. విష ప్రచారమే. పాకిస్తాన్‌తో పాటు బంగ్లాదేశ్‌, ఇం‌కొన్ని దేశాల పౌరులు కూడా ఈ గ్రూప్‌లో సభ్యులు. తాహిర్‌కి ఫైజాన్‌ అనే పాకిస్తానీ మిత్రుడు ఉన్నాడు. ఈ ఇద్దరు భారత జాతీయ పతాకం, చిహ్నాలకు సంబంధించి అవమాన కరమైన పోస్టులు పెడుతూ ఉంటారు.

తాహిర్‌, అతడి ఘాజ్వి ఎ హింద్‌ ‌వాట్సప్‌ ‌ఘనత ఇంకా ఉంది. ఇతడు ఫుల్వారీ షరీఫ్‌ అనే ప్రాంతంలో పుట్టాడు. వీళ్లకి కరాచీలో కూడా బంధువులు ఉన్నారు. ఫుల్వారీ షరీఫ్‌ ‌ప్రాంతంలో కొద్దిగా చదువుకున్న ముస్లిం యువకులను ప్రలోభాలతో వశం చేసుకుని విషం నూరి పోస్తుంటాడని పోలీసులు చెప్పారు. అక్కడి జనాభా లక్షా ఇరవై వేలు. ఇందులో అరవై శాతం ముస్లింలు. ఎక్కువ మంది చిన్న చిన్న వృత్తులు, పనులు చేస్తారు. అదనపు ఆదాయం కోసం మధ్య ఆసియాకు కూడా వెళ్లి వస్తూ ఉంటారు. జూలై 14న తాహిర్‌ను అరెస్టు చేసిన తరువాత అతడి సెల్‌ఫోన్‌ను తనిఖీ చేస్తే అత్యంత ప్రమాదకర సమాచారం బయటపడింది.

ఫిబ్రవరి 27, 2022న ఘాజ్వి ఎ హింద్‌ ‌గ్రూప్‌ను ఇతడు సృష్టించాడు. ఇందులో పది మంది సభ్యులు ఉన్నారు. ఎనిమిది మంది బంగ్లా దేశీయులు, ఒక పాకిస్తానీ. తానే నిర్వాహకుడు. ఇప్పుడు ముస్లింలు జరుపుతున్నది ఆఖరి పోరాట మని, ఇందులో భారత్‌ ఓడిపోవచ్చునని, దరిమిలా పాకిస్తాన్‌లో విలీనం అవుతుందని, దీనితో సహజం గానే ముస్లిం దేశమవుతుందని సందేశాలు పెట్టాడు. ఈ వాట్సాప్‌ ‌గ్రూప్‌ ‌గుర్తుగా అఖండ భారత్‌ ‌పటం పెట్టి, దానిమీద పాకిస్తాన్‌ ‌జెండాను చిత్రించారు. అందులోనే భారత్‌పై దండయాత్రకు సిద్ధం కావలసిందని బంగ్లాదేశీ యువకులకు సందేశాలు పంపాడు. అల్‌ ‌జిహాద్‌ ‌పేరుతో ఇతడు ఈ మే 18వ తేదీన ఉర్దూలో ఒక పోస్టు పెట్టాడు. ప్రపంచ వ్యాప్తంగా ముస్లింల మీద జరుగుతున్న ఊచకోతను ఖండించవలసిందని ఇతడు పోస్టులు పెట్టేవాడు. ఈ వాట్సప్‌ ‌గ్రూప్‌ అభివృద్ధి కోసం గడచిన ఐదేళ్లుగా ఐఎస్‌ఐలో పనిచేస్తున్నట్టు కూడా రాసుకున్నాడు. ఇది ఈ జూన్‌ 22‌న కనిపించిన పోస్టు. ఇతడికి ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ‌కూడా ఉంది. దానికి 2000 మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఉత్పత్తులను బహిష్క రించాలన్నది కూడా ఇతడి నినాదాలలో ఒకటి. ఒవైసీకి చెందిన ఎంఐఎం పార్టీకి ఓటు వేసి వృథా చేయవద్దని, 2023లో జరిగే జిహాద్‌కు సిద్ధంగా ఉండాలని కూడా పిలుపునిచ్చాడు. జూలై 15న మోదీని హతమార్చడానికి వేసిన ప్రణాళిక బయటపడడంతో ఇంత వరకు 26 మంది మీద ఎఫ్‌ఐఆర్‌ ‌దాఖలు చేశారు. దర్భంగా, ముజఫర్‌పూర్‌, ‌మధుబని వంటి పన్నెండు పట్టణాలలో వీరిని పట్టుకున్నారు.

2047కు ముస్లిం దేశంగా భారత్‌ ‌ప్రణాళిక, మోదీ హత్యకు కుట్రలకు సంబంధించి కొన్ని అరెస్టులు జరిగాయి. ఇంకా జరుగుతాయి. ఇంతకీ 2047 నాటికి భారత్‌ ‌ముస్లిం దేశం అన్న వీళ్ల ప్రణాళిక స్వరూపం ఏమిటి? దీనికి పెద్ద భాష్యామే ఇచ్చారు. 75 ఏళ్ల క్రితం భారత్‌ ‌నుంచి ఒక ఇస్లామిక్‌ ‌దేశం విడిపోయింది. వందేళ్ల సందర్భంగా మొత్తం భారతదేశమే ఇస్లామిక్‌ ‌దేశం కావాలి అన్నదే ఆ నినాదం. ఇందుకు నాలుగు దశలను ఎంచుకున్నారు. ఇందులో పీఎఫ్‌ఐలో విరివిగా ముస్లింలను సభ్యులుగా చేయడం కూడా ఒకటి. ముస్లింలు ఐక్యం కావాలి. హిందువులను విభజించాలి. పీఎఫ్‌ఐ ‌ముస్లింలను మార్షల్స్‌గా తయారు చేస్తుంది. నాలుగో దశలో పీఎఫ్‌ఐ అధికారం చేజిక్కించుకుంటుంది. ఇందుకోసం భారత్‌తో యుద్ధం చేయడానికి కూడా సిద్ధమేనట. ఈ పనికి ప్రపంచ ముస్లిం దేశాలు కూడా బాసటగా నిలుస్తాయట. ఆ ముస్లిం దేశాలేవో ప్రకటిస్తే మంచిది. లేకపోతే లేనిపోని నింద. ఆ ఎనిమిది పేజీల పత్రంలో దిగ్భ్రాంతి కలిగించే అంశాలూ ఉన్నాయని పోలీసులే చెబుతున్నారు. మెజారిటీ వర్గాన్ని లొంగదీసి, మోకాళ్ల మీద నిలబెట్టేసి ఇస్లాంకు పూర్వ వైభవం తేవడం పెద్ద కష్టం కాదని ఆ పత్రంలో రాసుకున్నారు. ఇప్పుడున్న ముస్లింలలో పది శాతం మన వెనుక ఉన్నా, దీనిని సాధించ వచ్చునని కూడా అది ప్రకటించింది. పిరికిపందలైన మెజారిటీ ప్రజలను లొంగదీయడం కష్టంకాదని కూడా గంటాపథంగా పీఎఫ్‌ఐ ‌పేర్కొన్నది. సంస్థలోకి కొత్తగా యువకులను చేర్చే అంశం మీద దృష్టి పెట్టాలని కూడా పత్రం ఆదేశించింది. విధేయులైన ముస్లింలు ప్రభుత్వ శాఖలలో ప్రవేశించాలని, ప్రభుత్వోద్యోగాలలో, న్యాయశాఖలో కూడా చొరబడాలని ఈ పత్రం చెబుతోంది. భద్రతా బలగాలు చెప్పిన ప్రకారం ఆర్‌ఎస్‌ఎస్‌కూ; ఎస్‌సీ, ఎస్టీ, ఓబీసీలకు నడుమ విభజన తేవాలన్నది కూడా పీఎఫ్‌ఐ ‌పథకాలలో ఒకటి. ఆర్‌ఎస్‌ఎస్‌ అ‌గ్రకు హిందువుల సంక్షేమం కోసం పనిచేసేది మాత్రమేనని చెప్పడం పీఎఫ్‌ఐ ఉద్దేశం. మన మేధావులు, ఒవైసీ వంటి వారి దృష్టిలో ‘అమాయక ముస్లింలు’ వీళ్లే కదా!

2002 గుజరాత్‌ అల్లర్ల గురించి ప్రత్యేక దర్యాప్తు బృందం జరుపుతున్న పరిశోధనలో చాలా పెద్ద విషయాలే బయటపడుతున్నాయి. ఇందులో తీస్తా సెతల్వాడ్‌ అనే సిటిజన్స్ ‌ఫర్‌ ‌జస్టిస్‌ అం‌డ్‌ ‌పీస్‌ (ఎన్‌జీవో) నాయకురాలు ప్రధాన పాత్ర వహించారు. ఈమె బెయిల్‌ ‌దరఖాస్తు అహ్మదాబాద్‌ ‌కోర్టులో జూలై 15న విచారణకు వచ్చినప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం కీలక విషయాలు వెల్లడించవలసి వచ్చింది. ఇదే కేసులో విచారణను ఎదుర్కొంటున్న గుజరాత్‌ ‌మాజీ పోలీసు డైరెక్టర్‌ ‌జనరల్‌ శ్రీ‌రాంకుమార్‌ ‌బెయిల్‌ ‌పిటిషన్‌ ‌కూడా దీనితోనే విచారణకు వచ్చింది. ఈ ఇద్దరు గుజరాత్‌ అల్లర్లకు సంబంధించి సాక్షులను బెదిరించడం, దొంగ సాక్ష్యాలను సృష్టించడం వంటి నేరాలకు పాల్పడ్డారు. అయితే ఈ ఇద్దరి నేరాలు అక్కడితో ఆగలేదు. ఇటీవల మరణించిన గుజరాత్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకుడు, సోనియా గాంధీకి సన్నిహితుడు అహ్మద్‌ ‌పటేల్‌ ‌పాత్ర కూడా ఈ అల్లర్ల వెనుక ఉన్నదని ప్రత్యేక దర్యాప్తు బృందం వెల్లడించింది. ఇందుకు పటేల్‌ ‌తీస్తాకు రూ. 30 లక్షలు చెల్లించారని ఆరోపణ. ఈ డబ్బు తీసుకోవడానికి ఎక్కడెక్కడ పటేల్‌ను ఆమె కలిశారో కూడా ఆ బృందం తెలియ చేసింది. అంత దారుణమైన గుజరాత్‌ అల్లర్లు జరిపించడానికి తీస్తాకు ముప్పయ్‌ ‌లక్షలతో పాటు పద్మశ్రీ పురస్కారం కూడా దక్కింది.

ఇక గడచిన ఆరేడు మాసాలుగా దేశంలో కొందరు ముస్లింల దుందుడుకు చర్యల వల్ల మత సామరస్యం దారుణంగా దెబ్బతిన్నది. రాజస్తాన్‌లో ఉగాది వేడుకలలో భాగంగా జరిగిన హిందువుల ఊరేగింపు మీద రాళ్ల దాడి జరిగింది. తరువాత హనుమత్‌ ‌జయంతి, శ్రీరామనవమి ఉత్సవాల శోభాయాత్రల మీద కూడా దాడులు జరిగాయి. బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపూర్‌శర్మ వ్యాఖ్యల తరువాత ఇద్దరిని ముస్లిం మతోన్మాదులు హత్య చేశారు. నుపూర్‌ ‌వ్యాఖ్యలను సమర్ధించడమే ఆ ఇద్దరు చేసిన పాపం. దీనికి ప్రతీకారంగా ఎక్కడైనా దేశంలో ముస్లింలు హత్యకు గురయ్యారా?

ప్రస్తుతం దేశంలో హిందూ వ్యతిరేక శక్తులు, ముస్లిం మతోన్మాదుల ప్రయాణం ఎలా ఉంది? 2002లో గుజరాత్‌ అల్లర్లను సాకుగా తీసుకుని నాటి ముఖ్యమంత్రి, నేటి ప్రధాని నరేంద్ర మోదీని పదవి నుంచి దించాలన్న కుట్ర నుంచి, ఇప్పుడు హత్య చేయాలన్న ఆలోచన వరకు సాగింది. మోదీని అధికారం నుంచి దించడం ఎందుకు? ఆయనను హిందూ సంస్థలకు ప్రతినిధిగా భావించడమే. హిందూత్వకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నుంచి వచ్చిన వ్యక్తిగా, భారతీయ జనతా పార్టీ నాయకుడు కాబట్టి ఆయనను ద్వేషించడం. హిందూ దేశాన్ని ముస్లిం దేశంగా మార్చాలన్న మతోన్మాదుల ప్రతిజ్ఞ వలెనే మోదీని భౌతికంగా అంతమొందిం చాలన్న కుట్రలు కూడా పాతవే. భారత్‌ను ఇస్లామిక్‌ ‌దేశంగా మార్చాలన్న వీరావేశం కేరళ కేంద్రంగా పనిచేస్తున్న ఎస్‌డీపీఐ, పీఎఫ్‌ఐ ఎప్పటి నుంచో బాహాటంగానే చెబుతున్నాయి. ఈ పని సామ దాన భేద దండోపాయాలతో, చాప కింద నీరులా సాగిపోతున్న మాట కూడా కాదనలేనిది. ఈ వాస్తవాలను ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి. కనీసం ఒక వర్గం మీడియా అయినా వాస్తవాలు చెబుతోంది. తాజాగా బీజేపీ నాయకుడు, సుప్రీంకోర్టు న్యాయవాది అశ్విని కుమార్‌ ఉపాధ్యాయ ఒక టీవీ చానల్‌ ‌చర్చలో చెప్పిన విషయాలు కూడా ఉన్నాయి.

2023 సంవత్సరానికి, అంటే వచ్చే సంవత్సరానికి భారత్‌ ‌ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశమవుతుంది. ఇది ఐక్య రాజ్యసమితి నివేదికలోని అంశం. కానీ ఆ జనాభాలో హిందూ జనాభా శాతం ఎంత? ఇదే ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ఈ దేశంలో 200 జిల్లాలలో హిందువులు వలస పోవలసిన పరిస్థితులు ఉన్నాయని ఉపాధ్యాయ చెప్పారు. చదువు వస్తే, జనాభా దానంతట అదే అదుపులోకి వస్తుందని కొందరు చెప్పడమే పెద్ద భ్రమ అన్నారు ఉపాధ్యాయ. అదెంత భ్రమో తెలియాలంటే కేరళ వెళ్లి చూడవచ్చునని కూడా సూచించారు. అక్కడ డాక్టర్‌, ‌నర్స్, ఇం‌జనీర్‌లు ఉన్న కుటుంబంలో కూడా 10 నుంచి 20 మంది పిల్లలు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. అలాగే 9 రాష్ట్రాలలో హిందువులు తుడిచిపెట్టుకుపోయారని చెప్పారు. లద్దాఖ్‌లో 2 శాతం, లక్షద్వీప్‌లో 2.2 శాతం మాత్రమే హిందువులు మిగిలారు. ఈశాన్య రాష్ట్రాలలో చాలాచోట్ల హిందువులు మైనారిటీలు. అదే టీవీ చర్చలో పాల్గొన్న మరొక వక్త సంగీత్‌ ‌రాగి. సంగీత్‌ ‌చెప్పిన వాస్తవం ఇది! 1947 నాటి విభజనకు ముందు భారత్‌లో ముస్లిం జనాభా 23 శాతం. ప్రత్యేక దేశం కోరుకుని 14 శాతం ముస్లింలు పాకిస్తాన్‌ ‌వెళ్లిపోగా, భారత్‌లో 9 శాతం మిగిలారు. కానీ ఇవాళ ముస్లిం జనాభా 18 శాతానికి చేరుకుంది. దేశంలో వందలాది జిల్లాలు ముస్లింలు మెజారిటీలుగా ఉన్న జిల్లాలుగా మారిపోయాయని సంగీత్‌ ‌చెప్పారు. ఈ అంకెలతోనే ఒక దేశ మౌలిక స్వరూపాన్ని మార్చగలరా? ఇదంతా దుష్ప్రచారం అని చెప్పే వారూ ఉన్నారు. ఇక్కడ పీఎఫ్‌ఐ ‌హెచ్చరిక గుర్తు చేసుకోవాలి. 10 శాతం ముస్లింలు మా వెనక ఉంటే చాలు, ఇక్కడి మెజారిటీ హిందువులతో కయ్యానికి దిగిపోతామని పీఎఫ్‌ఐ ‌హెచ్చరించలేదా? కాబట్టి దేశంలో ముస్లిం జనాభా పెరుగుదల కేవలం మతాచారాల ప్రకారమే జరుగుతున్నది కాదు, మతోన్మాద దృష్టికి, ఆధిపత్య కోణానికి సంబం ధించినది కూడా. ఉత్తర ప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ‌జనాభా స్థిరీకరణ కార్యక్రమం కోసం తపిస్తున్నది ఇందుకే. ఈ దేశంలో ముస్లిం జనాభా 20 శాతానికి చేరుకున్నా వారు ఇంకా మైనారిటీలు ఎందుకు అవుతారని ఉత్తరప్రదేశ్‌ ‌బీజేపీ నాయకుడు సిమ్రన్‌జిత్‌ ‌సింగ్‌ ‌ప్రశ్నించడం ఇందుకే. మైనారిటీ లంటే ఎవరు అనేది కూడా ఈ దేశం మరచి పోయినట్టే ఉంది. సింగ్‌ ‌చెప్పిన ప్రకారం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం చూపించలేని వర్గాన్ని మాత్రమే మైనారిటీలుగా భావించాలని ఆయన గుర్తు చేస్తున్నారు. కానీ ఇవాళ ఈ దేశంలోని చాలా జిల్లాలలో ఆ వర్గం (ముస్లింలు) 20 శాతం మించి ఉన్నారని సింగ్‌ ‌చెబుతున్నారు. ఇదే సమయంలో మరొక వాస్తవం కూడా గుర్తించవలసి ఉంటుందని చెప్పారు. నిజంగా మైనారిటీలు అయి ఉండి, జనాభాలో 0.01 శాతం నుంచి 2 శాతమే ఉన్న వర్గాలకు మాత్రం ఎలాంటి సౌకర్యాలు అందడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం ముస్లిం దేశాలలో, ఉదారవాదులలో, ముస్లిం ఉగ్రవాదులలో హిందూద్వేషం ఒక వాస్తవం. దానిని గుర్తించండి అని భారత్‌ ఈ ‌సంవత్సరం జనవరిలోనే ఐక్యరాజ్య సమితిని కోరింది కూడా. హిందూ ద్వేషంతో పాటు బౌద్ధులు, జైనులు పట్ల ఉన్న ద్వేషం గురించి కూడా భారత్‌ ‌సమితి దృష్టికి తీసుకువెళ్లింది.

ఇలాంటి వాస్తవాలు ప్రపంచానికి కనిపించవేమి అన్న సందేహం సహజంగానే వస్తుంది. ఆ వాస్తవాలు చూసే స్పృహ, వాస్తవికత ఇప్పుడు మొదలయింది. అదొక శుభవార్త. అమెరికాకు చెందిన రొడ్జర్స్ ‌విశ్వవిద్యాలయం ఇందుకు శ్రీకారం చుట్టింది. హిందూధర్మానికి వ్యతిరేకంగా అబద్ధపు ప్రచారం కాస్త ఎక్కువైందని ఆ విశ్వవిద్యాలయం చేసిన ‘యాంటీ హిందూ డిస్‌ఇన్ఫర్మేషన్‌: ఎ ‌కేస్‌ ‌స్టడీ’ అన్న అధ్యయనంలో వెల్లడించింది. నిజానికి ఈ దుష్ప్రచారం ఇవాళే మొదలైనది కూడా కాదని, గడచిన కొన్నేళ్లుగా సాగుతోందని అది అంగీకరించింది. ఊరూ పేరూ లేని సామాజిక మాధ్యమాల ద్వారా హిందూధర్మం మీద విద్వేషాన్ని రెచ్చగొట్టే తీరులో సందేశాలు ఉంటున్నాయని ఆ అధ్యయనంలో భాగస్వాములైన వారు వెల్లడించారు. వైట్‌ ‌నేషనలిస్ట్, 4 ‌చాన్‌ ‌జెనోసైడ్‌ ‌పెపె, ఇస్లామిక్‌ ‌వెబ్‌ ‌నెట్‌వర్క్ ‌ద్వారా ఈ విద్వేష ప్రచారాన్ని తీవ్రంగా చేస్తున్నాయని కూడా తేలింది. రొడ్జర్స్ ఎన్‌సీ ప్రయోగశాలలో ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ ‌ద్వారా వీటిని కనుగొన్నారు. ఈ అధ్యయనంలో రొడ్జర్స్ ‌డేటా సేకరణ, విశ్లేషణల కోసం న్యూజెర్సీ గవర్నర్స్ ‌స్టెమ్స్ ‌నిపుణుల సాయం కూడా తీసుకున్నారు. అయితే హిందూ వ్యతిరేకతతో వస్తున్న సందేశాలన్నీ ఒక్క పాకిస్తాన్‌ ‌నుంచే వస్తున్నాయని అనుకోనక్కర లేదని కూడా ఈ అధ్యయనం చెబుతున్నది. కొన్ని ముస్లిం దేశాలు అర్థంపర్ధం లేకుండా హిందూ వ్యతిరేక ప్రచారంలో సాయం చేస్తున్నాయి. అందులో ఇరాన్‌ ఒకటి. ఇది ఉన్మాదం కాక మరేమిటి? భారత్‌లో ముస్లిం వర్గాన్ని సామూహిక ఊచకోత కోస్తున్నారని చెప్పే విషప్రచారం కోసం ఒకే సందేశం ఉన్న పది లక్షల ట్వీట్లు ఇరాన్‌ ‌నుంచి వచ్చాయని రొడ్జర్స్ అధ్యయనం వెల్లడిస్తున్నది. అంటే ఒకే మాటను పదే పదే చెబితే ఎవరైనా నమ్మక తప్పదన్న సూత్రాన్ని నమ్మి ఇదంతా చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే మౌఢ్యాన్ని భారతీయుల నెత్తిన రుద్దడమే. ఇదెంత గుడ్డిగా సాగుతున్నదంటే బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపూర్‌శర్మ మహమ్మద్‌ ‌ప్రవక్తకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జరిగిన హత్యల తరువాత ఇస్లాం మతోన్మాదం మీద సామాజిక మాధ్యమాలలో ఆగ్రహం వెల్లువెత్తింది. దానిని కూడా పట్టించుకోకుండా ఆ దేశాల నుంచి హిందూత్వ మీద విద్వేషం వెదజల్లే సందేశాలు వస్తూనే ఉన్నాయి. ముస్లిం దేశాలలో మధ్య యుగాలలో రాజ్యమేలిన శిక్షలను, జీవితాన్ని భారతీయ సమాజంలో చొప్పించాలని ముస్లిం మతోన్మాదులు ప్రయత్నించడమే విడ్డూరం. మహమ్మద్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు నుపూర్‌ ‌శర్మను బహిరంగంగా ఉరితీయాలని వాళ్లు కోరిన సంగతి ఇందుకు ఉదాహరణ. లేదా ‘సర్‌ ‌తన్‌ ‌సె జుడా’ (తల నరకాలి) నినాదం కూడా అందుకు రుజువనే చెప్పాలి. ఇలాంటి పిలుపులు ఇచ్చిన తరువాతనే కన్హయ్యలాల్‌ (‌రాజస్తాన్‌), ఉమేశ్‌ ‌కొల్హే (మహారాష్ట్ర) తలలు నరికిన దుర్ఘటనలు చోటు చేసుకున్నాయని మరువరాదు. హిందువుల పండుగలను ముస్లిం మతోన్మాదులు లక్ష్యంగా చేసుకున్న సంగతిని కూడా ఆ అధ్యయనం వెల్లడించింది.

హిందూ వ్యతిరేక ప్రచారంలో సారాంశం ఏమిటి? హిందువుగా ఉండడమే పాపమని చెప్పడం. హిందువులంటేనే ఒక దుష్టశక్తికి ప్రతినిధులని ప్రకటించడం. ఇక, హిందువులంతా అశుభ్రంగా ఉంటారు, విశ్వసనీయత లేని వారు వంటి ప్రచారాలు సరేసరి. నిజానికి హిందువు అంటే హిందూ జీవన విధానాన్ని నమ్మినవాడు. ఆ సంగతి వదిలి విష ప్రచారం జరుగుతోంది. కానీ హిందువుల మీద ద్వేషంతో జరిగే దుర్ఘటనలను, రక్తకాండను కప్పిపుచ్చుతున్నారు. అలాంటివేమీ జరగలేదని నమ్మించే ప్రయత్నం కనిపిస్తున్నదని రొడ్జర్స్ అధ్యయనం చెబుతోంది. ద్వేషంతో సాగుతున్న ఇలాంటి ప్రచారంలో వాస్తవం ఏమిటో తెలుసుకునే సామర్థ్యాన్ని యువతకు కల్పించాలని కూడా ఆ అధ్యయనం సూచించింది.

మరొక మతాన్ని భూమ్మీద లేకుండా చేయాలన్న దురద మధ్య యుగాల నాటిది. ఒక్కటి మాత్రం నిజం. చరిత్రలో అల్లావుద్దీన్‌ ‌ఖల్జీ, ఔరంగజేబ్‌లను మించిన మతోన్మాదులు బహుశా ఉండకపోవచ్చు. వాళ్ల దాష్టీకాల నుంచే హిందూ ధర్మం బతికి బట్టకట్టింది. దాని ధర్మమే దానిని రక్షిస్తున్నది. ఈ విద్వేష కార్యకలాపాలన్నీ ఆర్‌ఎస్‌ఎస్‌, అనుబంధ సంస్థలే కేంద్రంగా సాగుతున్నాయి. దీనిని భారతీయులు గమనించడం అవసరం.

About Author

By editor

Twitter
Instagram