మాలపల్లి నవలకి నూరేళ్లు

బ్రిటిష్‌ ‌పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలలో స్వాతంత్య్రకాంక్ష బలీయం కావడం, జాతీయోద్యమం వెల్లువెత్తడం, స్వరాజ్య సమరంలో గాంధేయ భావాలకు ఆదరణ పెరగడం- ఇదంతా ఒక చారిత్రక క్రమం. ఈ తరుణంలో అంటరానివారుగా పేరుపడిన వర్గాలను తమ వైపు తిప్పుకోవాలన్న ప్రయత్నం స్వాతంత్య్ర సమరయోధులూ, బ్రిటిష్‌ అనుకూలురూ కూడా చేశారు. ఓ వైపు స్వాభిమాన స్ఫూర్తితో సామాజిక అంతరాలను ప్రశ్నిస్తూ జస్టిస్‌ ‌పార్టీ, మరోవైపు హరిజనోద్ధరణ పేరుతో గాంధేయ భావజాలంతో జాతీయవాదులు అలాంటి ప్రయత్నాలు విరివిగా చేసిన కాలమది. అలాంటి చారిత్రక సామాజిక పరిణామాలే ఇతివృత్తంగా వెలువడిన మహోన్నత నవల ‘మాలపల్లి’. తెలుగు సాహిత్యంలోనే అసమాన రచన. దీనికే ‘సంగ విజయం’ అన్న పేరు కూడా ఉంది. ఆ నవలాకర్త ఉన్నవ లక్ష్మీనారాయణ

(1877-1950) ఆయన సంస్కరణాభిలాషి. వితంతువులు, అనాథల•, అణగారిన వర్గాల అభ్యున్నతికై పాటుపడ్డారు. గుంటూరులో 32 వితంతు వివాహాలు జరిపి ‘గుంటూరు వీరేశలింగం’గా ఖ్యాతిగాంచారు. కార్వే మహాశయుని స్ఫూర్తితో గుంటూరులో వితంతు శరణాలయం, స్త్రీలకు వృత్తి విద్య కోసం ‘శారదా నికేతన్‌’ ‌వంటి సంస్థలను తన భార్య లక్ష్మీబాయమ్మతో కలసి స్థాపించారు.

బ్రిటిష్‌ ‌ప్రభుత్వమే ఈ దేశానికి రక్ష అని జస్టిస్‌ ‌పార్టీ భావించింది. సహాయ నిరాకరణ ఉద్యమం పట్ల కఠినంగా వ్యవహరించింది. ‘జస్టిస్‌ ‌పార్టీ వారు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అణిచివేయడానికి కఠిన శాసనములు చేసి బ్రిటిష్‌ ‌ప్రభుత్వానికి సహాయపడ్డారని సంతోషిస్తున్నాము’ అని పేర్కొన్నది సైమన్‌ ‌కమిషన్‌ ‌నివేదిక (పేజీ-203). చీరాల ప్రజలు తమకు మునిసిపాలిటీ వద్దని మొరపెట్టినా వినక, నాటి జస్టిస్‌ ‌పార్టీ మంత్రి పానగల్లు రాజా రామారాయణిం, దాన్ని మున్సిపాలిటీగా ప్రకటిం చారు. ఈ చర్యకు వ్యతిరేకంగా (చీరాల పేరాల) ఉద్యమం నడిపిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్యను పట్టుకుని జైలుకు పంపారు. పల్నాడులో పేదసాదల బాధలను, పాలకవర్గ అన్యాయాలను వెల్లడించి నందుకు ఉన్నవ, మాడభూషి నరసింహాచార్యులకు శిక్షలు విధించారు. బ్రిటిష్‌ ‌ప్రభుత్వంలో అంతర్భాగమైన జస్టిస్‌ ‌పార్టీ మంత్రులు జరిపిన ఘోరకృత్యాలు, నిర్బంధ చర్యలు వర్ణనాతీతం. దేశభక్తులైన రాజకీయ ఖైదీలకు వృత్తి నేరగాళ్లతో పాటు సంకటి, పురుగుల పులుసు పోసి, నూనె గానుగలు లాగించి, కంకర రాళ్లు కొట్టించి హింసించారు. ఇది అన్యాయమని చట్టసభలలో స్వతంత్రులు వాదిస్తే, ‘చట్టాలను ఉల్లంఘించిన వారూ సామాన్య నేరగాళ్లేనని రావుబహద్దూర్‌ ‌కోవెలమూడి గోపాలకృష్ణయ్య చౌదరి (జస్టిస్‌ ‌పార్టీ) సమర్ధించారు. ఆ తరువాత కాంగ్రెసును, బ్రాహ్మణ నాయకత్వాన్ని నిరసిస్తూ ‘సహాయ నిరాకరణమొక విధమైన పిచ్చి’ అని అభివర్ణిస్తూ ని•ష్ట్రవ ×అ•ఱ•అ శీశ్రీఱ•ఱమీ•శ్రీ తీ•ఓవ• అనే గ్రంథాన్ని రాశారు కూడా.

స్వరాజ్యంతో పాటు సురాజ్యం కూడా కావాలని కోరుకున్న వారు మేటి సాహిత్యవేత్త ఉన్నవ లక్ష్మీనారాయణ. సమకాలీన సమాజ ఆకాంక్ష, దాని వెనుక ఉన్న రాజకీయ తాత్త్వికతలను, ఉద్యమ నాయకుల ఉద్దేశాలను పరిపూర్ణంగా అర్థం చేసుకున్న కలం యోధుడాయన. ‘అజ్ఞానము, పశుత్వము, ధనాంధత, నిరంకుశములను నిరోధించినవాడే వీరుడ’ని తాను రచించిన ‘నాయకురాలు’ నాటకంలో ప్రతాపుడనే పాత్రతో పలికించారు. ‘మాలపల్లి’లో కూడా ఈ సాత్విక నిరోధక ధర్మయుద్ధం గురించి చిత్రించారు. ఈ అంశాలే ఉన్నవ ఇతివృత్తాలన• నడిపిస్తూ ఉంటాయి.

ఒక సంచలనంగా 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యరంగంలో ప్రవేశించిన ‘మాలపల్లి’ ఇతివృత్తం ఏమిటి? ఎస్సీలలో అట్టడుగు వర్గాలకు చెందిన మాల దాసరి రామదాసు కథ. అతడు గాంధేయవాది, సాత్వికుడు. ఈతని భార్య మహాలక్ష్మి. వీరికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు. పెద్ద కొడుకు వెంకటదాసు, చిన్నకొడుకు సంగదాసు, కూతురు జ్యోతి. వెంకట దాసు తండ్రికి సాయంగా ఉండేవాడు. సంగదాసు భూస్వామి చౌదరయ్య దగ్గర పాలేరు. సొంత పొలం పనుల్లో జ్యోతి సాయం చేస్తూ ఉండేది. భర్త లేకపోవడంతో రామదాసు చెల్లెలు సుబ్బలక్ష్మి, ఆమె కొడుకు అప్పాదాసు కూడా పనులు చేస్తూ ఆ పంచనే ఉన్నారు.

చౌదరయ్య 800 ఎకరాల రైతు. అయన కొడుకులే రామునాయుడు, వెంకటయ్యనాయుడు. సంగదాసు, రామునాయుడుల భావాలు కలుస్తాయి కాబట్టి వారిరువురూ మంచి స్నేహితులుగా ఉండే వారు. రామదాసు కొడుకులు వెంకటదాసు, సంగదాసు సంస్కరణ భావాలు గలవాళ్లు. చౌదరయ్య చేసే అత్యాచారాలను ప్రతిఘటించటానికి సంగదాసు తోటి దళిత కూలీలను సంఘటితపరచి, చైతన్యం కలిగించి, సమ్మెలకు నాయకత్వం వహించేవాడు. వారికి విద్య నేర్పడానికి బడులు తెరిపించాడు. జీవితాలను సంస్కరించడానికి అతను చేయని ప్రయత్నమంటూ లేదు. అతని అన్న కూడా అతనికి సాయంగా ఉండేవాడు. ఇది చౌదరయ్యకు నచ్చక సంగదాసు తలపై కొట్టడం వలన అతడు మరణిం చాడు. భూస్వామి పోలీసులకు లంచం ఇచ్చి విచారణ పరిధి నుంచి తప్పించుకున్నాడు. నష్టపరిహారంగా కొంత ధనాన్ని ఇవ్వబోగా వారు తిరస్కరించారు. కాని రామునాయుడు పేద రైతులకు దగ్గరై ఎస్సీల అభ్యున్నతికై కృషి చేస్తాడు. సంగదాసు ఆదర్శాల వ్యాప్తి కోసం అతని స్మృతి చిహ్నంగా ‘సంగ పీఠం’ పెట్టారు.

వెంకటదాసు సమీప అడవుల్లో నివసిస్తూ తక్కెళ్ల జగ్గడు అనే మారుపేరుతో సంతానులనే రహస్య కార్యాచరణ దళాలతో (సంతాలు అనే పేరు బంకించంద్రుని ‘ఆనందమఠం’ నవలలోని సంతాలు లను గుర్తు చేస్తుంది) ‘ధర్మ కన్నాలు’ వేయడం ద్వారా ధనికుల ఆస్తిని కొల్లగొట్టి పేదలకు పంచిపెట్టే ఉద్యమానికి నాయకత్వం వహించేవాడు. తండ్రి రామదాసు ఒక దావాలో ఓడిపోయి తన యావదా స్తిని చౌదరయ్యకు స్వాధీనం చేయాల్సివచ్చింది. పొలం నుండి గెంటివేయుంచుకున్న రామదాసు మరో సంపన్నుడి దగ్గర పనికి కుదురుతాడు. తక్కెళ్ల జగ్గడు తన సహచరులు ఆ సంపన్నుని ఇంటిని కొల్లగొట్టడంతో ధర్మకన్నాలతో రామదాసుకు పాత్ర ఉందని రామదాసును, అతని భార్య మహాలక్ష్మిని పోలీసులు అరెస్టు చేస్తారు. చివరికి పోలీసులతో జరిగిన పోరాటంలో వెంకటదాసు పట్టుబడి జైలు పాలవుతాడు. జైల్లో ఉన్న వెంకటదాసు పరిచర్యలు కోసం రామదాసు అతని భార్య మహాలక్ష్మి కొంత కాలం అక్కడ ఉన్నారు. వెంకటదాసు మరణిస్తాడు. రామదాసు ఇద్దరు కొడుకులతో పాటు కూతురు జ్యోతి కూడా మరణిస్తుంది. ఆ బెంగతో తల్లి మహాలక్ష్మి మరణిస్తుంది. వీటన్నిటినీ రామదాసు శాంతంగా స్వీకరిస్తాడు.

క్రమేణా సంగం పీఠం దినదిన ప్రవర్ధమాన మవుతుంది. సహాయ నిరాకరణోద్యమాలు, కార్మికోద్యమాలు, ధర్మకన్నాలు వంటి వాటితో స్వాతంత్య్రం లభిస్తుంది. ఖైదీలందరూ విడుదల అవుతారు. వయోజన ఓటింగ్‌ ‌ద్వారా ప్రజా ప్రతినిధులు ఎన్నికవుతారు. రామదాసు జైలు నుండి విడుదలై తన గ్రామానికి వస్తాడు. రామునాయుడు తన యావదాస్తిని ఎస్సీల అభ్యుదయానికి సమర్పించి సంగదాసు ఆశయాలను సాధించడానికి గ్రామంలోనే పని చేయవలసిందని రామదాసును రామునాయుడు కోరతాడు. కానీ రామదాసు నిరాకరించి అడవులకు వెళ్లిపోతాడు. చివరకు భూస్వాముల మదమణిగి ఎస్సీల అభ్యుదయం, గ్రామాభ్యుదయం జరిగినట్టు చెబుతారు.

తక్కెళ్ల జగ్గడు – వెంకటదాసు మారుపేరు. ఈ పేరుతోనే వెంకటదాసు ‘ధర్మకన్నాల’ ఉద్యమానికి (ధనికుల ఆస్తిని కొల్లగొట్టి పేదలకు పంచే ఉద్యమం) నాయకత్వం వహిస్తాడు. మాలపల్లిలో ప్రభోదాత్మక గేయాలను అలనాటి వాడుక భాషలో రాశారు. ఆదికాలం నుండి నేటి కాలం వరకూ మానవ సమాజ పరిణామాన్ని విప్లవకారుడు తక్కెళ్ల జగ్గడి ధర్మబోధలు రూపంలో వివరించడం కనిపిస్తుంది. ప్రాచీనకాలంలో ప్రజలందరూ అన్నదమ్ములవలె కలసి మెలసి జీవించేవారని, ప్రకృతి వనరులు, సంపద ప్రజలందరి సొత్తుగా ఉండేదని ఆ నాటి పరిస్థితులను గేయరూపంలో వర్ణిస్తాడు.

‘‘ఆదికాలమున అందరు జనులు- అన్నదమ్ములండీ

నదులు వనంబులు నానా మృగములు నాల్గు సంద్రములును

కొండలు వండలు జలములు పొలములు గుంటలు సెలయేళ్ళు

కాయలు పండ్లు పాడిపంటలు ఘనమయినా ఇండ్లు

అంతరువుల భేదము లేక అందరి సొమ్మండి

క•డవా గట్టా వొకరికి బెట్టా కొదవే లేదండి

నా నీ భేదము లేక లోకం నడుస్తుండేది

మనసు లోపల చీకూ చింతలు మందుకైనా లేవు…’’

‘‘ఐకమత్యమే అన్ని పనులకు ఆధారము సుమండీ

శ్రేణులు గట్టి సమ్మె గట్టితే చెల్లును మీ మాట

కొట్టా వద్దూ తిట్టా వద్దు కోర్కెలు నెరవేరున్‌

అసహాయ యోగము తరుణము చూచి అవలంబించండి

దానికి మిగిలిన మంత్రం తంత్రములు ధరలో లేవండి’’.

తెలుగు సాహిత్యంలో శతాబ్దాల పాటు క్షత్రియులే కావ్య నాయకులుగా ఏలిన సంప్రదాయిక ఆనవాయి తీని తోసిరాజని నూరేళ్ల క్రితమే అభ్యుదయ దృక్పథంతో మొట్టమొదటి సారిగా సాహిత్యంలో అట్టడుగు వర్గాలవారిని (మాలలను) నాయకులుగా నిలిపిన అభ్యుదయ నవల మాలపల్లి లేక సంగ విజయము (‘సంఘ సంస్కర్త ఉన్నవ’, జి. వెంకట సుబ్బయ్య). 1917లో బెజవాడలో ఆది ఆంధ్ర (హరిజన) మహాసభలు జరిగాయి -హైదరాబాద్‌లో ప్రసిద్ధ ‘ఆది హిందూ’ నాయకుడు భాగ్యరెడ్డివర్మ అధ్యక్షతన జరిగిన ఈ సభల ప్రతిధ్వనులు (కృష్ణా పత్రిక, ఫిబ్రవరి, 7, 1920 నారాయణరావు, వ్యాసం ‘సంఘ దౌర్జన్యము’) మాత్రమే కాక, గూడూరు రామచంద్రరావు (మాల బ్రాహ్మలు)వంటివారి సేవలు కూడా మాలపల్లి నవల్లో ప్రస్తావనకు వస్తాయి. క్రైస్తవం, దానిలోని వక్రతలు కూడా ఇందులో చర్చకు వస్తాయి.

మిగతా వచ్చేవారం..

– కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Twitter
Instagram