– కృపాకర్‌ ‌పోతుల

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

‘నమస్కారం మాస్టారూ’ అన్న పలకరింపు విని వరసలో నిలబడి ఉన్న నేను తల తిప్పి పక్కకు చూసాను. ఎవరో, ఎప్పుడూ చూసిన గుర్తులేదు. నలభై, నలభై ఐదేళ్ల మధ్య ఉండొచ్చు వయసు. ఖరీదైన బట్టలు వేసుకొని, టై కట్టుకొని, చాలా హుందాగా ఉన్నాడు.

‘నమస్కారం మాస్టారూ’ అంటూ మళ్లీ అభివాదం చేసాడు.

‘గుర్తు పట్టేరా మాస్టారూ?’ అడిగాడు చిన్నగా నవ్వుతూ.

‘క్షమించాలి. గుర్తు పట్టలేకుండా ఉన్నాను.’ అన్నాను ఎవరై ఉంటారో, ఎక్కడ చూసుంటానో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ.

‘మీరు సీతయ్యపేట హైస్కూలులో పనిచేసినప్పుడు మీ దగ్గర చదువుకున్నాను మాస్టారూ. ప్రకాశరావు నా పేరు. మూడేళ్లు లెక్కలూ, ఇంగ్లీషూ మీరే చెప్పేరు మాకు’ అన్నాడాయన.

‘పేరేమన్నారూ. ప్రకాశరావా. గుర్తు రావట్లేదు నాయనా. ఎప్పుడో చాన్నాళ్ల క్రితం, ఉద్యోగంలో చేరిన కొత్తలో పనిచేసానక్కడ. అదొక కారణమైతే, మహమ్మారిలా మీద పడి కమ్మేసిన వృద్ధాప్యం ఇంకొక కారణం. జ్ఞాపకశక్తిని నెమ్మది నెమ్మదిగా హరించేస్తోంది. క్షమించాలి’ అన్నాను నేను కూడా చిరునవ్వుతో.

 ‘అయ్యో ఇంత చిన్న విషయానికే క్షమించడం వరకూ ఎందుకు మాస్టారూ. మీ సర్వీసులో మీ దగ్గర కొన్ని వేలమంది చదువుకొని ఉంటారు. వారందరినీ గుర్తు పెట్టుకోవడం మీకు సాధ్యమయ్యే పనేనా’ అని తేలికగా అంటూ..

 ‘ఏం పనిమీద వచ్చారు మాస్టారూ’ అని ప్రశ్నించాడు.

 ‘నా పెన్షన్‌ ఎకౌంట్‌ ఈ ‌బ్యాంకులోనే ఉంది నాయనా. ప్రతి నెల మొదటివారంలో వచ్చి డబ్బులు తీసుకుంటాను. ఆ పనిమీదే వచ్చాను. ఈరోజు ఐదో తారీఖైనా రద్దీ కొంచెం కూడా తగ్గలేదు.’’ అన్నాను కాస్త విసుగ్గా.

 ‘నా కేబిన్లో కూర్చుందాం రండి మాస్టారూ. కాస్త కాఫీ కూడా తాగుదాం. పెన్షన్‌ ‌డబ్బులు నేను తెప్పిస్తాను లెండి’ అంటున్న అతని వైపు అయోమయంగా చూసాను. అది గమనించిన అతను చిన్నగా నవ్వుతూ.. ‘ఈ బ్రాంచి అసిస్టెంట్‌ ‌జనరల్‌ ‌మేనేజర్ని నేనే మాస్టారూ. రెండు వారాలైంది, ముంబయ్‌ ‌నుండి బదలీ మీద వచ్చి. రండి నాతో’ అంటూ లోపలికి దారితీసాడు. అతన్ని అనుసరించాను మౌనంగా.

 గదిలో కూర్చున్నాక బెల్‌ ‌కొట్టి, మెసెంజర్ని పిలిచాడు. నా పాస్‌ ‌పుస్తకం, చెక్కూ అతని చేతికి అందిస్తూ, ‘కౌంటర్కి వెళ్లి డబ్బులు తెచ్చిపెట్టు. కొత్తనోట్లు ఇమ్మన్నానని చెప్పు. దానికంటే ముందు బీరువాలో బిస్కెట్లున్నాయి. సాసర్లో వేసి తీసుకురా. అలాగే రెండు కాఫీ పట్రమ్మను. అన్నట్టు మాస్టారూ! మీకు చక్కెర లేకుండానే కదా అని అడిగి, నేను అవునని తల ఊపాక, ఒకటి పంచదార లేకుండా’ అంటూ టకటక ఆదేశాలు జారీచేసాడు.

 తరవాత విశ్రాంతిగా కుర్చీలో వెనక్కి జారబడి ‘ఇంకా గుర్తు రాలేదా మాస్టారూ. పోనీ, నారాయణ గుర్తున్నాడా మీకు?’ అని అడిగాడు.

 ‘నారాయణ ఎందుకు గుర్తులేడూ. ఆఁ ఇప్పుడు గుర్తొచ్చింది నువ్వు నారాయణ కొడుకు ప్రకాష్‌వి. నీకు ప్రైవేటు కూడా చెప్పేవాడ్ని కదా నేను’ అన్నాను ఎట్టకేలకు అతన్ని గుర్తుపట్టినందుకు ఉపశాంతిగా, దీర్ఘమైన నిట్టూర్పు వదులుతూ.

‘హమ్మయ్య. మొత్తానికి గుర్తుపట్టేరు మాస్టారు. మీరు మా ఊరు వదిలిపెట్టి, ఇంతకాలమైనా మేము మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ మరచిపోలేదు మాస్టారూ. ఈరోజు నేనీస్థితిలో ఉన్నానంటే అది మీ చలవే మాస్టారూ. లెక్కల్లోనూ, ఇంగ్లీషులోనూ మీరు వేసిన పునాదే, నేను బాగా చదువుకోవడానికీ, బ్యాంకు పరీక్షల్లో ఎంపిక కావడానికీ దోహదపడింది. మా నాన్నైతే ప్రతిరోజూ దేవుడితో పాటూ మిమ్మల్ని కూడా తలంచుకొని, దండం పెట్టుకుంటాడు మాస్టారూ’ అన్నాడు ప్రకాష్‌ ఆత్మీయంగా నవ్వుతూ.

ప్రకాష్‌ ‌మాటలు విన్న నా తనువు ఆనందంతో పులకించింది. గర్వంతో ఛాతీ ఉప్పొంగిందేమో కూడా.

 మూడున్నర దశాబ్దాల క్రిందట నా దగ్గర చదువుకున్న విద్యార్థి, ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు, అకస్మాత్తుగా కనబడి, ‘మీ దగ్గర చదువు కున్నాను మాస్టారూ. నేనీరోజు ఈ స్థితిలో ఉన్నా నంటే, దానికి కారణం మీరు పెట్టిన విద్యాభిక్షే’ అని గౌరవంగా చెప్తుంటే, ఒక ఉపాధ్యా యునిగా అంతకంటే కావలసినది ఇంకేముంటుంది. నాజన్మ సార్ధకమైనట్లు అనిపించింది ఆ క్షణంలో. ఉద్వేగంతో గొంతు పూడుకుపోయిందేమో నోటినుండి మాట పెగలక, మసకబారిన కళ్లతో, మౌనంగా చూస్తూ ఉండిపోయాను నా శిష్యుని వేపు.

 కాఫీ తాగడం పూర్తవగానే, ‘మా డీజీఎం రమ్మని ఫోన్‌ ‌చేసారు మాస్టారూ. అక్కడికే వెళ్తూ, మిమ్మల్ని చూసి ఆగిపోయాను. మీ ఫోన్‌ ‌నెంబరూ, ఎడ్రసూ ఇవ్వండి. ఎల్లుండి, ఆదివారం వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తాను. నాన్న కూడా ఇక్కడే ఉన్నాడు. మిమ్మల్ని చూసి చాలా ఆనందిస్తాడు’ అన్నాడు ప్రకాశరావు తన మొబైల్‌ ‌చేతిలోకి తీసుకుంటూ.

 నేను కూడా హడావిడిగా నా ఫోన్‌ ‌నెంబరూ, దానితోపాటూ చిరునామా చిన్న కాగితం మీద రాసిచ్చి, ప్రకాశరావుకి కృతజ్ఞతలు తెలుపుకొని, బ్యాంకులో నుండి బయట పడ్డాను.

రోడ్డుమీద నడుస్తున్నానన్నమాటే గాని, నా మనసంతా అనిర్వచనీయ మైన ఆనందంతో నిండిపోయింది. నా ఆలోచనలన్నీ, ఎప్పుడో చాన్నాళ్ల క్రితం నేను పనిచేసిన సీతయ్యపేట చుట్టూ, ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియని అమాయకులైన ఆ ఊరి ప్రజల చుట్టూ పరిభ్రమించసాగాయి. ఎలా ఉందో ఊరిప్పుడు. బాగా మారిపోయి ఉంటుంది అనుకున్నాను కాస్త బెంగగా.

 రెండువేల జనాభా మాత్రమే ఉన్న చిన్నగ్రామం సీతయ్యపేట. జిల్లాలో బాగా వెనుకబడిన ప్రాంతంలో, కొండలమధ్య, ఒక మూలకు విసిరేసిన ట్టుంటుంది. ఆరోజుల్లో అక్కడకు వెళ్లడానికి సరైన రోడ్డు కూడా ఉండేది కాదు. నలభైమైళ్ల దూరంలో ఉన్న పట్టణం నుండి ఒక్కటంటే ఒక్క బస్సు, అది కూడా ప్రైవేటు బస్సు మాత్రం తిరిగేది అక్కడికి. టెలిఫోను సౌకర్యం మాట సరే, కనీసం, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం అయినా లేని కుగ్రామం అది. అందుచేతనే ఆ ఊరిలో ఉద్యోగం అంటే అదేదో పెద్ద శిక్షగానో, దండనగానో భావించేవారందరూ.

 కొత్తగా ఉద్యోగంలో చేరినవారినో, అధికారుల చేతులూ మూతులూ తడపడానికి నిరాకరించిన నిజాయితీపరుల్నో, వారి (అధికారుల) ఆగ్రహానికి గురైన అక్కుపక్షుల్నో తప్ప, ఇతరులెవ్వర్నీ అక్కడ నియమించేవారు కాదు; ఒకవేళ నియమించినా, ఏ రాజకీయ నాయకుడ్నో పట్టుకొని నియామక ఉత్తర్వులు రద్దు చేయించుకునేవారు తప్ప, ఎవరూ అక్కడికి వెళ్లేవారు కాదు. అలాంటి ఊరిలో పడేసారు నన్ను, ఉద్యోగంలో కొత్తగా చేరినవాడ్ని కావడంతో.

 సీతయ్యపేట, ఊరు చిన్నదే గాని, చాలా పరిశుభ్రంగా ఉండేది. ఏవో రెండు మూడు కుటుంబాలు తప్ప, అక్కడ నివసించేవారందరూ నేలతల్లిని నమ్ముకొని బ్రతికే చిన్న, సన్నకారు రైతులే. రెక్కాడితే గాని డొక్కాడని అల్పజీవులూ బడుగుజీవులూను. కాని, స్వచ్ఛమైన స్ఫటికంలాంటి, ప్రేమించే హృదయం గలవారు అందరూ.

 అంతేకాకుండా చాలా గ్రామాలలో ఉన్నట్టు రాజకీయాల రొష్టూ, కులవివక్షా మచ్చుకైనా కనబడని ఆదర్శగ్రామం అది. ఊరి ప్రజలందరూ అన్న దమ్ముల్లా కలిసిమెలిసి ఉండేవారంటే అబద్ధం కాదు.

 అక్కడ పనిచేసే ఉపాధ్యాయులందరూ, ప్రధానోపాధ్యాయునితో సహా, దగ్గరలో ఉన్న పట్టణం నుండి ఉదయం వచ్చి సాయంకాలం వెళ్లిపోయేవారే. నేనొక్కడినే, చిన్న ఇల్లొకటి అద్దెకు తీసుకొని, అక్కడే ఉండేవాడిని, నా వంట నేనే వండుకు తింటూ. ఆ కారణం చేతనో, మరెందుచేతనో గాని, ఊరి ప్రజలు ఎక్కువగా అభిమానించేవారు నన్ను.

 కాలుష్యరహితమైన వాతావరణం. ఉరుకులూ పరుగులూలేని ప్రశాంతమైన జీవనం. నచ్చిన పుస్తకం కొనుక్కోవడానికి చేతిలో కావలసినంత పైకం, కొనుక్కున్న పుస్తకం చదువుకోవడానికి కావలసినంత సమయం… నాలాంటి పుస్తకాల పురుగుకి ఏంకావాలి అంతకంటే. జీవితం పరమానందభరితంగా ఉండేది.

అక్కడ పరిచయమయ్యాడు నారాయణ. ఒకరోజు.. సెలవనుకుంటాను. ఉదయం పది, పదకొండు గంటలప్పుడు ఇంటికి వచ్చాడు. ఏదో చదువుకుంటున్న నాకు నమస్కారంచేసి, చేతులు కట్టుకొని…

 ‘నన్ను మేస్త్రీ నారాయనంతారు సార్‌. ‌తాపీపని సేత్తాను. మా కుర్రోడు, పెకాసరావు గోడు, మీ ఇస్కూల్లో, మీకాడే సదువుకుంతన్నాడు. ఆడొక్కడే సార్‌ ‌గుంటడు మాకు. ఆడైనా నాలుగచ్చరం ముక్కలు నేర్సుకుంతాడన్న ఆసతో బర్లో ఒడీసేను సార్‌. ‌కాని ఆడు మాత్రం, అస్సలు సదవకుంతలేడు సార్‌. ఆడుకు తిరిగేత్తన్నాడు సార్‌. ‌సెవఁడాలెక్క దీసీసినా లెక్కసెయ్యకుంతన్నాడు. అందుకే సాయంకాలం బరొగ్గీసాక, ఒక గంటసేపాడికి పరివేటు సెప్పమని తవుఁరి కాల్లట్టుకు బతిమాల్దావఁని ఒచ్చేను సార్‌’ అన్నాడు ఉపోద్ఘాతం ఏమీ లేకుండానే.

‘నేను ఇంటిదగ్గర ఎవరికీ ప్రైవేట్లు చెప్పను నారాయణా. బడిలో రోజంతా పిల్లల్తో వాగి వాగి, ఇంటికొచ్చాక కూడా అదేపని మళ్లీ చెయ్యాలంటే నా వల్ల కాదు.’ నా నోటమాట పూర్తయ్యిందో లేదో అన్నంత పనీ చేసేసాడు. ఒక్క ఉదుటున వచ్చి నా పాదాలు రెండూ పట్టుకొని

‘అంత మాటనియ్కండి సార్‌. ‌సిన్నప్పుడు బర్లోకెల్లి సదువుకోవాలని మా సెడ్డ ఇదిగా ఉండీది నాకు. మా అయ్యమాత్రం సత్తే ఈల్లేదని చెప్పి, పనిలోకి ఈడ్సుకెలిపోయీవోడు. బడికెల్తానని ఏడిత్తే సింతబరికుచ్చుకోని రేవెట్టీసీవోడు. అందుకే, నాకెలాగూ సదువబ్బలేదు, కనీసం ఆడైనా సదువు కుంతాడని ఆసపడితే ఆడు మాత్రం అస్సలు సదవనంతన్నాడు సార్‌. ఉప్పుడు మీరు కాదనేత్తే ఆడెందుకూ పనికిరాకుండా పోతాడు సార్‌. ‌మీ కస్టం ఉంచుకోను సార్‌. ‌మీరెంతిమ్మంటే అంత, తినో తినకో, నెలవగానే ఒట్టుకొచ్చి మీ సేతిలో ఒడేత్తాను సార్‌. ‌రోజుకొక గంట సెప్పండి సార్‌ ‌చాలు’ అంటూ బ్రతిమలాడడం మొదలుబెట్టాడు.

చిన్నప్పట్నుండీ పెరిగిన వాతావరణ ప్రభావం వల్లనో, చదివిన సాహిత్యప్రభావం చేతనో చెప్పలేను గాని, నేను చేపట్టిన ఉపాధ్యాయవృత్తి ద్వారా ఈ ప్రపంచాన్ని మార్చేయాలన్నంత ఆవేశం, మార్చి వేయగలనన్న ఆత్మవిశ్వాసం రెండూ గుండెనిండా ఉన్న నవయువకుడ్నేమో ఆ రోజుల్లో, కాదని చెప్పడానికి నోరు రాలేదు నాకు.

 ‘సరేలే. ఎలాగోలా వీలు చూసుకొని మీ వాడికి చదువు చెప్తానుగాని, నా కాళ్లొదిలిపెట్టు. సాయం కాలం ఆరుగంటలకల్లా ఇక్కడుండాలి. సరేనా’ అన్నాను నారాయణ చేతుల్లోనుండి నా కాళ్లు విడిపించుకునే ప్రయత్నం చేస్తూ.

‘అలాగే సార్‌.’ అన్నాడు మళ్లీ ఇంకొకసారి నమస్కారంచేస్తూ.

అలా నారాయణ కొడుకు కోసం మొదలైన నా ‘ప్రైవేటు ప్రహసనం’, అనతికాలంలోనే ఆ ఊరిలో చదువుకుంటున్న పిల్లలందరికీ విస్తరించి, నేనక్కడ ఉన్నంతకాలం మూడుపువ్వులూ ఆరుకాయలుగా విలసిల్లింది. మొదట్లో కొడుకుతో పాటూ అప్పుడ ప్పుడూ మాత్రమే వచ్చే నారాయణ, కొన్నాళ్ల తరవాత ప్రతిరోజూ వచ్చి నేను ప్రైవేటు చెప్పడం అయిపోయే వరకూ అక్కడే కూర్చొనేవాడు, చదువుకుంటున్న పిల్లల్నీ, చదువు చెప్తున్న నన్నూ కళ్లింతచేసుకొని చూస్తూ.

ఒకరోజు ఎందుకన్నానో తెలియదుగాని, ‘చిన్నప్పుడు నీకెంత చదువుకోవాలని ఉన్నా మీ నాన్న చదువుకోనివ్వలేదని చెప్పేవు కదా నారాయణా. ఇప్పుడు చదువుకోకూడదూ. నేను చెప్తాను’ అన్నాను చిన్నగా నవ్వుతూ.

సిగ్గుతో మెలికలు తిరిగిపోయాడు నారాయణ. ‘నాకు సదువేటిసార్‌, ‌కమ్మలుకట్టి సంపేత్తారు మా ఊరోలంతా. అయినా, సదువుకుందావఁనుకుంతే మాత్రం ఈ వొయుసులో సదువబ్బుతాదేటి ఎవడికైనా’ అన్నాడుగాని, ఆ క్షణంలో అతని కళ్లలో కదలాడిన యథేష్టమైన తృష్ణ గమనించిన నాకు, ఎంత కష్టపడైనా అతనికి నాలుగక్షరం ముక్కలు నేర్పించాలనే గట్టి పట్టుదల కలిగింది.

‘అయ్యన్నీ నాకొగ్గీ నారాయనా. అయినా నువ్వు డెబ్భై ఎనభై ఏల్ల ముసిలోడివా ఏటి నీకు సదువబ్బక పోడానికి. అసలు నీకు సదువుకోవాలనుందా లేదా? అచ్చెప్పు సాలు (అది చెప్పు చాలు). మిగిల్నియ్యన్నీ నాన్చూసుకుంతాను కదా’ అన్నాను నవ్వుతూ, అచ్చం నారాయణలాగే, మా ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడుతూ.

నేనలా మాట్లాడడం విన్న నారాయణ ఎంత ఆనందించాడో చెప్పలేను. ఆ తరవాత నారాయణను ఒప్పించడానికి ఎంతో సమయం పట్టలేదు నాకు.

నారాయణ చదువుకుంటున్నాడన్న విషయం, ఆ చిన్నగ్రామంలో దావానలంలా వ్యాపించింది. దానితో, ప్రజలు అతనికి తాటాకులు కట్టే ప్రయత్నాలు చాలానే చేసారు గాని, నారాయణ వాటినసలు పట్టించుకోకుండా, స్థితప్రజ్ఞుడిలా తన చదువు తాను చదువుకుంటూ పోతుండడంతో, కొన్ని రోజులకల్లా ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించా రందరూ.

చదువుయెడల నారాయణకున్న భక్తిశ్రద్ధలూ, అతనికున్న తెలివితేటలూ, గ్రాహకశక్తీ చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించేది. నా దగ్గర చదువుకుంటున్న పిల్లలందరికంటే కూడా చాలా త్వరగా గ్రహించగలిగేవాడు ఏవిషయమైనా.

నేనక్కడున్న మూడేళ్లకాలంలో, చిన్న చిన్న కథల వంటివి చదవగలిగేపాటి చదువు నేర్పగలిగాను అతనికి. ఆ మాత్రమైనా నేర్పించగలిగినందుకు నాకూ, ఆపాటి నేర్చుకున్నందుకు నారాయణకూ చాలా గర్వంగానూ గొప్పగానూ కూడా ఉండేదా రోజుల్లో.

తరవాత నాకు అక్కడనుండి మా సొంతూరికి బదలీకావడం, పెళ్లీ, పిల్లలూ, సంసారం, పర్యవ సానంగా పెరిగిన బాధ్యతలూ.. వీటిమధ్య మరుగున పడిపోయిన సీతయ్యపేటా, అక్కడి జ్ఞాపకాలూ… ఇన్నాళ్లకు ప్రకాశరావు కనబడడంతో తిరిగి జీవం పోసుకున్నాయి.

‘ఎలా ఉన్నాడో నారాయణ’ అనుకున్నాను హుషారుగా ఇంట్లో అడుగుపెడుతూ.

అన్నట్టుగానే ఆదివారం సాయంకాలం వచ్చాడు ప్రకాశరావు. నన్ను వాళ్ల ఇంటికి తీసుకొని వెళ్లేడు. అపార్ట్మెంటులోనికి అడుగు పెట్టీపెట్టగానే కళ్లు చెదిరిపోయాయి నాకు. హాలులో కబోర్డస్ ‌నిండా, పద్ధతిగా అమర్చిపెట్టిన పుస్తకాలే అన్నీ. నా ప్రపంచంలోకే నేను మళ్లీ అడుగుపెట్టిన అనుభూతి కలిగింది నాకు వాటిని చూస్తుంటే. ‘ప్రకాశరావు కూడా బాగా చదువుతాడన్నమాట’ అనుకున్నాను ఆనందంగా. ఆ మాటే అన్నాను అతనితో.

సమాధానంగా చిన్నగా నవ్వి, ‘కూర్చోండి మాస్టారూ’ అంటూ, తన భార్యనూ, రత్నాల్లాంటి ఇద్దరు కూతుర్లనూ పరిచయం చేసాడు. పిల్లలిద్దరూ వినయంగా చేతులు జోడించి, ‘నమస్కారం తాతగారూ’ అని చక్కటి తెలుగులో అంటూ, గౌరవంగా నమస్కారం చేస్తుంటే, ఆనందంతో నా హృదయం పులకించింది.

‘అన్నట్టు మాస్టారూ, మీరు కనిపించినట్టుగాని, మిమ్మల్ని ఇంటికి తీసుకొస్తున్నట్టు గాని నాన్నకి చెప్పలేదు. మిమ్మల్ని చూసి ఎలా స్పందిస్తాడో చూద్దాం’ అని లోగొంతుకలో చెప్తూ ‘నాన్నా, నిన్ను చూడడానికి ఎవరో పెద్దాయన వచ్చారు. ఒకసారి ఇలా రండి’ అని పిలిచాడు.

‘నన్ను చూడ్డానికా. ఈ ఊర్లో ఎవరొ…’ అంటూ హాలులో అడుగుపెట్టిన నారాయణ, నన్ను చూసి, షాక్‌ ‌తిన్నవాడిలా నిలబడిపోయాడు కొన్ని క్షణాలపాటూ. తేరుకొని, నెమ్మదిగా చేతిలో ఉన్న పుస్తకాన్ని మడిచి, పక్కనే ఉన్న టీపయ్‌ ‌మీద చాలా జాగ్రత్తగా పెట్టాడు. తరవాత, రెండు అంగల్లో నన్ను చేరుకొని, నా పాదాలకి నమస్కరించాడు. కాస్త ఇబ్బందిగా ఫీలౌతూ, అతన్ని లేవనెత్తి హృదయానికి హత్తుకున్నాను ఆప్యాయంగా.

ఆ తరవాత… అక్కడ నేను గడిపిన మూడు గంటల సమయమూ మూడుక్షణాల్లా గడిచి పోయిందంటే అతిశయోక్తి కాదు. మూడుగంటలూ, ఇంచుమించూ నారాయణే మాట్లాడాడు. అతని సంభాషణ మొత్తం తాను చదివిన పుస్తకాల గురించీ, వాటిమీద తన విశ్లేషణ అభిప్రాయాలూను. నోరు తెరుచుకొని మంత్రముగ్ధుడిలా వింటూ కూర్చుండి పోయాను, ఆశ్చర్యంతో మాత్రమే కాదు, అంతులేని ఆనందంతో కూడా.

చివరిలో, వచ్చేసేటప్పుడు ‘ఆరోజు నాకు చదువు చెప్పడానికి పూనుకొని, నాలో నిద్రాణమైన తృష్ణని ఒక్క కుదుపు కుదిపి నిద్రలేపేరు మాస్టారూ. ఇంకో మాటలో చెప్పాలంటే దావాగ్ని రగిలించి వదిలి పెట్టారు. మీరు రగిలించిన ఆ కారగ్గి ఏనాడూ ఆరిపోలేదు సార్‌. అలా మండుతూనే ఉంది. కనిపించిన ప్రతీ అక్షరాన్నీ నాతో చదివించింది. మా ఊరి కోవఁటోళ్ల కొట్లలో, పాతపేపర్ల కట్టల్లో.. దొరికిన ప్రతీ పుస్తకాన్నీ శ్రద్ధగా చదివేలా చేసింది. పనిలోకెళ్లిన సమయంలో తప్ప, మెలుకువగా ఉన్న ప్రతీక్షణం, గుడ్డిదీపం వెలుగులోనైనా సరే, పూజచేస్తున్నంత భక్తితో, ఏదో ఒకటి చదివేలా ప్రేరేపించింది. ఫలితంగా, ఈ మాత్రం చదివి, అర్థంచేసుకోగలిగే స్థితికి చేరుకున్నానీరోజు. ఇది మీరు పెట్టిన భిక్ష మాస్టారూ. అందుకే మీరు నాకు భగవంతునితో సమానం’ అన్నాడు గద్గదమైన గొంతుతో.

కొన్ని క్షణాలపాటూ నారాయణ వైపు చూస్తూ ఉండిపోయాను సాలోచనగా. తరువాత నెమ్మదిగా అతని చేతులు రెండూ నా చేతుల్లోకి తీసుకున్నాను. అతని కళ్లలోకి సూటిగా చూస్తూ ‘నువ్వు సామాన్య మానవుడివి కాదు నారాయణా. మహర్షివి. రామాయణ మహాకావ్యాన్ని మనకందించిన మహానుభావుడు వాల్మీకితో సరితూగ గల అర్హతలున్నవాడివి. లేకపోతే ఆ చదువులతల్లి కటాక్షం నీకు ఇంతగా లభించేదా చెప్పు! నీకు నాలుగక్షరం ముక్కలు నేర్పించే అవకాశం ఆనాడు లభించడం… అది నా పూర్వజన్మ సుకృతం నారాయణా. అందుకే… ఇన్ని సంవత్సరాల పాటు కఠోరశ్రమకోర్చి నువ్వు సముపార్జించుకున్న నీ విద్వత్తుకు మాత్రమే కాదు సుమా… నీకు కూడా…’ అంటూ తటాలున వంగి అతని పాదాలను స్పృశించాను గౌరవంగా.

 తెల్లబోయి చూస్తున్న నారాయణ తేరుకునేలోపే బయటకు అడుగులు వేసాను త్వరత్వరగా, భావోద్వే గంతో చెమ్మగిల్లిన కళ్లు రెండూ ఒత్తుకుంటూ.

By editor

Twitter
Instagram