– డా।। గోపరాజు నారాయణరావు

వాళ్లు కూర్చుంటే గున్నతాడి అంత ఉన్నారట. నిల్చుంటే నిలువుతాడి ఎత్తట. ‘పాండగుల ముందు నేనెంత. ఇంత. ఆ మహానుభావులు చెప్పారు. ధర్మన్న, భీమన్న, అర్జునయ్య, నకులుడూ సహదేవుడు, అటు పక్క ద్రౌపది తల్లి. నన్ను చూడగానే గదల విద్యల వాడు భీమన్న అన్నాడు. నువ్వు హిడింబి, సాంబుల బంధువ్వి. మా బావ కిష్టయ్య అష్టమ భార్య జాంబవతి మీ ఆడపడుచు. ఏకలవ్యుడు మీ అన్న. మీకేల ఈ దురవస్థ, అన్నాడు కోపంగా. తలరాత కదా భీమయ్యా! అన్నాను. కాదు, మీ గొప్పతనం మీరు మరిచిపోయారు. మీ తాతలని మీరు మరచిపోయారు. మీరేమిటో మీరు మరచిపోయి అడవిబిడ్డల ధర్మాన్ని వదిలేశారు అన్నాడు భీమయ్య. తమ సెలవు ఏమిటీ అన్నాను. అది భీమయ్య చెప్పాలా? మీ అడవి మీద మీరే అధిపతులు కావాలి అన్నాడు ధర్మయ్య. ఔను, విలుకాండ్రు వీరత్వం వీడరాదు అన్నాడు అర్జునయ్య. ఔనన్నట్టు తల ఆడించింది అమ్మ ద్రౌపది. నీ వాళ్లను యుద్ధానికి సిద్ధం చెయ్యమని భీమయ్య గర్జించాడు. నకుల సహ దేవులను ఆజ్ఞాపించగా తెచ్చి ఇచ్చిన దండమే ఇది. మనకి విజయాన్ని ఇస్తుంది.’ అని ఆగాడతడు. జనం ఎవరి స్థానాల్లో వాళ్లు లేచి నిలబడి గొప్ప భక్తి ప్రత్తులతో, కొన్ని జన్మల పుణ్యఫలమన్నట్టు దండానికి దణ్ణం పెట్టారు.

బోడడు మాలడి కేసి చూశాడు. మాలడు మునసబు కేసి చూశాడు. ‘తమ సెలవు’ అన్నాడు ఉద్విగ్నంగా, మునసబు. బోడడు, మాలడు మన్యంలో ప్రతి గ్రామానికి వెళ్లారు ఆ దండంతో. తుడుములు, డప్పులు మెగిస్తూ తమ ప్రాంతాలలో తిప్పారు, దైవకార్యంలా. అపురూపంగా అనిపించేది ఊరేగింపు. సందేశం కూడా అపురూపమే. గ్రామాలు, ముఠాలు కాదు.  రంపదేశం, విశాఖ మన్యం కలసి తిరుగుబాటు చేయాలంటున్నారు శివసారులు. ఆ సంక్రాంతి మాసంలో పాడవ, మాడుగుల, పాడేరు దగ్గర మాచేరు నదికి, ఆపై మత్స్యకుండం దాకా వెళ్లారు. మన్యంలోని ప్రతి ఆలయానికి వెళ్లి దేవుళ్ల, దేవతల అనుమతి, ఆశీస్సులు తీసుకుంటున్నారు. ప్రతి గ్రామంలోను బోడడు చెప్పేది ఒక్కటే. ‘మా మొఖాసాలు అని కాదు, మా మునసబీ అని కాదు. మనందరి అడవితల్లి కోసం బతుకుదాం అనగలిగిన నిజమైన అడవిబిడ్డల కోసమే ఈ యాత్ర చేస్తున్నాను. ఇది దేవుడి ఆదేశం. అడవితల్లి ఆక్రోశం’. నాలుగువారాలో, నాలుగు నెలలో కాదు, రెండేళ్లు- రంపదేశంలోను, విశాఖ మన్యంలోను తిరిగి తిరిగి ప్రచారం చేసింది శివసారుల దళం. దాదాపు ముప్పయ్‌ ‌మంది శివసారులు, వీరికి కొందరు ముఠాదారులు కూడా తోడయ్యారు. వీరంతా కలసి గూడెం వెళ్లారు. రెండు బృందాలుగా విడిపోయారు. ఒక బృందం పోలీసు స్టేషన్‌నీ, ఇంకో బృందం ప్రభుత్వ అతిథి గృహాన్ని తగులపెట్టాయి. తగులబడుతున్న స్టేషను, అతిథిగృహం, వాటి చుట్టూ పసుపు పంచెలతో, పసుపు బొట్లతో నిలబడి ఉన్న శివసారులను చూస్తుంటే మహాయజ్ఞం కోసం వ్రేల్చిన యజ్ఞగుండాలని మరిపించాయి. వారంతా రుత్విక్కుల్లా కనిపించారు. బోడడు అడవిబిడ్డలని ఫితూరీకి సన్నద్ధం చేస్తున్న సంగతి తెలిసిపోయింది అప్పటికే పోలీసులకి. గూడెం నుంచి మత్స్యకుండం వెళ్లి, అక్కడ నుంచి తిరిగి వచ్చింది పూజారుల దళం, ఇదిగో, ఈ లంబసింగికే. ఊరి పొలిమేరలలోనే సిద్ధంగా ఉన్నారు పోలీసులు. కొండపూజారుల బృందాన్ని అరెస్టు చేశారు. శివసారుల వెంట తిరిగినందుకు లంబసింగి ముఠాదారుని పదవి లాగేసుకున్నారు’. ఊపిరి బిగపట్టి విన్నారంతా. శివసారుల ఉద్యమాన్ని తలుచుకుంటే సంభ్రమంగా ఉంది.

************

పొగలు చిమ్ముకుంటూ రోడ్డు చదును చేస్తోంది- పది టన్నుల రోడ్డు రోలర్‌. ‌వింత వింత శబ్దాలు చేస్తూ నడుస్తోంది, నెమ్మదిగా. ముందు వెడల్పాటి పొట్టి రోలర్‌. ‌వెనుక రెండు ఎత్తు ఎత్తు రోలర్లు, చక్రాల్లా. మనిషెత్తున ఉన్నాయి. దారి పక్కన కొంచెం దూరంలో నిలబడి చూస్తున్నారు కొండవాళ్ల పిల్లలు.

రోలర్‌ ‌ముందు భాగం మీద అతికించిన ఇత్తడి గుర్రం బొమ్మ వాళ్లకి మరీ వింతగా అనిపిస్తోంది. కాళ్లు ఎత్తినట్టు ఉన్న బొమ్మ, ఉబ్బెత్తుగా. అయితే దాని నుంచి నెమ్మదిగా వాళ్ల దృష్టి తమ కాళ్ల కింద నేల మీదకు వెళ్లింది.

రోలర్‌ ‌దగ్గరవుతుంటే, మూడు రోలర్ల కదలికకి భూమి నెమ్మదిగా కంపిస్తోంది. పాదాల కింద తమాషాగా అనిపిస్తోంది. వాళ్లలో వాళ్లు నవ్వుకు  న్నారు, దానికి. ఆ పదినెలల పిల్లవాడు మాత్రం వలలో చిక్కుకున్న పక్షిలా బిత్తరపోయి చూస్తున్నాడు. కూలికి వచ్చిన కొండవాళ్లంతా ఓరగా రోలర్‌ ‌కేసి చూస్తూ పని చేస్తున్నారు. వాళ్లకీ వింతే.  కొంతదూరం వెళ్లాక రోలర్‌ ‌ని ఆపేశాడు విలియం. అలాగే కూర్చున్నాడు, పనివాళ్లని చూస్తూ. పదిహేను లేదా ఇరవై అడుగుల మేర రోడ్డు మీద ఐదారుసార్లు ముందుకీ వెనక్కి తిప్పాడు రోలర్‌ని విలియం. నేలంతా గట్టిగా అయిపోయింది. ఎర్రకంకరతో, తడిసిన ఆ నేల మాంసాన్ని ఎండబెట్టినట్టుంది. నిజానికి విలియం రోలర్‌ ‌స్టీరింగ్‌ ‌దగ్గర నుంచి చూస్తున్నది పనివాళ్లని కాదు. పనిని అంతకంటే కాదు. గుండెల మీద ఆచ్ఛాదన సరిగాలేని కొండ ఆడవాళ్లని. కొందరు ఆడవాళ్లు అమాయకంగా సిగ్గు పడు తున్నారు. కొందరు చీదరింపును లోపలే అణుచుకుంటున్నారు. చిట్రాళ్లగొప్పు నుంచి వేగంగా జరుగుతూ లంబసింగి చేరువవుతోంది నిర్మిస్తున్న ఆ రోడ్డు. అందుకే చల్లదనం ఎక్కువవుతోంది. పక్కనే ఉన్న తాజంగి లోయ నుంచి వచ్చే గాలి మహా ఉధృతంగా ఉంది. లంబసింగికి అది మామూలే. మధ్యాహ్నం మూడు గంటలవుతోందని చెబుతున్నట్టు చలిగాలి మొదలైంది. ఆ చలికి, కొన్ని రోజులుగా పడుతున్న శ్రమతో ఒళ్లంతా నొప్పులనిపిస్తున్నాయి. కాళ్లు పీక్కు పోతున్నాయి కొందరికి. జ్వరం వచ్చినట్టుంది ఇంకొందరికి. పని మందగించింది. కొందరు బాధతోనే తాపీగా పని చేస్తున్నారు. పార పని చేస్తున్న ఆ ఆరుగురు, నీళ్లు చల్లుతున్న ఆ నలుగురు మాత్రం చతికిల పడిపోయారు. గునపాలు పట్టుకున్న మరో ఇద్దరు కూడా అక్కడికే వచ్చి మాట్లాడుతున్నారు. నిజానికి ఇంకో గంట పోతే ఆ రోజు పనికి స్వస్తి చెబుతారు. అందుకే ధైర్యంగా కబుర్లలోకి దిగారు. అప్పుడే వచ్చాడు బాస్టియన్‌. ‌పనిలో వేగం తగ్గితే అతడి ఆగ్రహం తారస్థాయికి చేరుతుంది. చేతిలో ఎందుకు ఉందో, అసలు అలాంటి దుర్బుద్ధితోనే వచ్చాడో మరి…ఒక వెదురు కర్రతో అక్కడికి వచ్చాడు. అలసటతో కూర్చున్న ఆ పన్నెండు మంది దగ్గరకి వచ్చాడు. అంత దూరం నుంచే చూసి, చటుక్కున లేచి నిలబడ్డారు వాళ్లు. ‘ఏంట్రా? ఇది పనా?’ నెమ్మదిగా అడిగాడు. ఆ పన్నెండు మందే కాకుండా మిగిలిన అందరూ కీడు శంకిస్తూ స్థాణువులైపోయారు. అప్పటి దాకా దూరంగా విలియంతో ముచ్చట్లు పెట్టిన పిళ్లై, కిష్టయ్య ఒక్క ఉదుటన అక్కడికి చేరారు. ‘మీ ఇద్దరూ ఏం చేస్తున్నారు? ఆడితో మీకు మాటలేంటి?’ నెమ్మదిగానే అడిగాడు బాస్టియన్‌. ‘ఈళ్లకి ఇందాకటి నుంచి చెబుతూనే ఉన్నాం దొర!’ అన్నాడు కిష్టయ్య. ‘దొరతనం అంటే ఇంత లోకువైపోయిందిరా మీకు? చూపిస్తాను నడండి!’ అంటూ కర్ర పుచ్చుకుని కొట్టడం మొదలుపెట్టాడు.

కిష్టయ్య చుట్టూ చూసి అక్కడో కర్ర ముక్క దొరికితే దానిని అందుకున్నాడు. పిళ్లై  పిడిగుద్దులు మొదలుపెట్టాడు. పశువులను తోలుతున్నట్టు గప్పీదొర బంగ్లా వైపు నడిపించాడు వాళ్లని బాస్టియన్‌. ‌దాదాపు రెండు ఫర్లాంగులు ఉంది. దారంతా కొడుతూ తీసుకువెళుతుంటే, వాళ్లు చేస్తున్న హాహాకారాలకి ఇళ్లలోని వృద్ధులు బయటకు వచ్చి చూసి తల్లడిల్లిపోతున్నారు. మొదట ఏడుస్తూ, తప్పు కాయమని వేడుకున్నారు వాళ్లు. తరువాత మౌనంగా దెబ్బలు భరించడం మొదలు పెట్టారు. వాళ్ల ముఖాల నిండా అవమానభారం. వాళ్ల కళ్ల నిండా బాధ. ఆ తవ్విన నేల మీద అతి కష్టం మీద అడుగులేస్తున్నారు కొండవాళ్లు. నేల అలా ఉండడం వల్ల కాదు, తమ నేల మీద తమనే బందిపోట్ల మాదిరిగా తన్నుకుంటూ తీసుకు వెళుతున్నందుకు కుమిలిపోతున్నారు వాళ్లు. వీపు మీద, పిరుదుల మీద, పిక్కల మీద- ఎక్కడబడితే అక్కడ కొడుతున్నాడు బాస్టియన్‌ ‌కర్రతో. బూతులు తిడుతూనే ఉన్నాడు. బంగ్లా పక్కనే ఉన్న ఖాళీ స్థలం వరకు వచ్చాక మరీ దారుణంగా కొట్టాడు బాస్టియన్‌. ఒళ్లంతా తట్లే అందరికీ. అప్పుడు కనుసైగ చేశాడు బాస్టియన్‌ ‌కిష్టయ్యకి. లోపలికి వెళ్లి ఒక గిన్నెతో పట్టుకొచ్చాడు కారంపొడి. తల్లడిల్లిపోయారు కొండవాళ్లు. పిళ్లై•, కిష్టయ్య చేతుల నిండా తీసుకుని వాళ్ల కళ్లలో చల్లారు మొదట.

మంట… మంట… వాళ్ల ఆర్తనాదాలతో కొండలు కూడా ప్రతిధ్వనించాయి. తరువాత ఒంటి మీద తేలిన తట్ల మీద పూయడం మొదలుపెట్టారు. కిందపడి దొర్లుతూ అరుస్తూనే ఉన్నారు. చాలాసేపు ఆ అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి.

చీకట్లు ముసురుకుంటున్నాయి. చలి జోరందు కుంటోంది. పని కట్టిపెట్టి కూలీలంతా గుడిసెల దగ్గరకి వెళుతున్నారు. రోజూలాగే దారిలో ఉన్న ఆ బావి దగ్గర ఆగారు ఆడవాళ్లు. ఆ బావి నుంచే నీళ్లు తోడుకు వెళతారు చిన్న చిన్న మట్టి కుండలలో. వంటకీ, తాగడానికి అవే. ఆ పెద్ద బావి గప్పీ దొర బంగ్లాకి కాస్తంత దూరంలోనే ఉంది. ఇద్దరో ముగ్గురో పురుషులు తాటాకు చేదలతో నీళ్లు తోడుతున్నారు. నీళ్ల చుక్కలు మీద పడ్డ చలికి తట్టుకోలేమన్నట్టు నైపుణ్యంగా కుండలలో నీళ్లు పోయించు కుంటున్నారు, స్త్రీలు. అంతా మూగిపోయి ఉన్నారు, బావి చుట్టూ. సన్యాసమ్మ నిస్త్రాణంగా పదడుగుల అవతలే చదునుగా ఉన్న బండరాయి మీద చతికిల పడింది, పోటీ పడే ఓపిక లేక. అది చూసి కొండమ్మ కూడా వచ్చి ఆమె పక్కనే కూలబడింది.

‘ఇదిగో కిదొర, నా కుండలో పొయ్యి నీళ్లు. కడుపు కాలిపోతంది. ఎప్పుడు వండాలి? ఎప్పుడు తినాలి!’ అంటోందామె. ‘అందరి కడుపులూ అంతే కదే!’ అంటున్నాడతడు, నీళ్లు తోడుతూ. ‘చితుకులు దొరా! పిల్లలు ఏడుస్తున్నారు నన్ను పంపెయ్‌!’ అని వేడుకుంటోంది ఇంకో మహిళ. సన్యాసమ్మ వాళ్ల కేసి చూస్తోంది. కొండమ్మ గప్పీదొర బంగ్లా ఉన్న వైపు చూస్తోంది. అప్పుడే నెమ్మదిగా, హఠాత్తుగా అంది, ‘సన్యాసమ్మ! రేత్రి నాకో కలొచ్చింది’. ‘నీ పెనిమిటి కనిపిం చాడా?’ అడిగింది సన్యాసమ్మ. ‘ఛఛ. ఆడు పక్కలోనే ఉన్నాడు. బెస్టీను దొర వచ్చాడే !’ అంది కొండమ్మ. ‘నీకు ఇదేం రోగమే!  కట్టుకున్నోణ్ణి పక్కలో ఉంచుకుని, ఆ కొండముచ్చు గాణ్ణి కలగన్నావా? పాపిష్టి ముండ!’ అంది సరదాగా. ‘చత్‌! ‌చెప్పే దిను. ఆ కల్లో చిడిపి గండి కనిపించిందే!’ అంది కొంచెం భయంగా.  సన్యాసమ్మ కూడా కొంచెం భయపడింది, నిజంగానే. ‘చిడిపిగండి ఎందు కొచ్చిందే కల్లోకి!’ లోయంత ఆశ్చర్యాన్ని ముఖంలో నింపుకుని అడిగింది. చిడిపిగండి అంటే మాయలూ మంత్రాలూ చేస్తున్నారని అనుమానం వస్తే, అలాంటి వాళ్లని తీసుకువెళ్లి రాళ్లతో కొట్టి చంపుతారు. అలా కొట్టి చంపేసే స్థలం పేరే చిడిపిగండి.  ‘చిడిపిగండే కాదు. అందులో మనమంతా ఉన్నాం. ఆ బేస్టీను కూడా ఉన్నాడు’ అంది కొండమ్మ, చేతులూ కళ్లూ తిప్పుతూ. ‘అక్కడిక్కూడా వచ్చాడా బేస్టీను దొర?’ అడిగింది సన్యాసమ్మ.

 కలని గుర్తు చేసుకుంటూ చెబుతున్నట్టు, ఎటో చూస్తూ నెమ్మదిగా వర్ణించింది కొండమ్మ. ‘పెద్ద మంత్రగాడంట… ఇంత జుట్టు ఆడికి, గొర్రె బొచ్చు లాగా. చిన్న గోచి. మిడిగుడ్లు ఏసుకుని చూస్తన్నాడు. మెత్లో యాపాకులు. చేతికి ఏదో తొడుక్కున్నాడు. సరిగ్గా కనపడలేదు. ఆ..ఇంతింత గోళ్లు కూడా ఉన్నాయి. నడుంకి చిన్నచిన్న ఎముకల దండ. మనమంతా ఇంతింత రాళ్లు పెట్టి కొడతన్నామంట. ఆ మంత్రాలోడు ఎవరనుకుంతన్నావు ? బెస్టీను దొరే. ఆడిని  కొడతన్నా మంట!’ అంది, భయంభ యంగా కొండమ్మ. మళ్లీ ఆమే ఆ భయమంతా ఒక్కసారే పోయినట్టు గట్టిగా నవ్వేసింది. ‘ఉ…. తర్వాత!’ ఆసక్తిగా అడిగింది సన్యాసమ్మ. ‘చటుక్కున తెలివొచ్చేసింది. గురెట్టి కొట్టామో లేదో, రాళ్లు తగిలాయో లేదో, ఆడు సచ్చాడో లేదో తెలీలేదు’, నిరాశగా, అమాయకంగా అంది కొండమ్మ. సన్యాసమ్మ కూడా నవ్వేసింది.

************

‘ఈళ్లేనా?’ అడిగాడు బాస్టియన్‌, అప్పటికే అక్కడ దొరికిన ఒక పచ్చికొమ్మ చేతిలోకి తీసుకుంటూ. ‘ఆమ!’ అన్నాడు పిళ్లై . వాళ్లవైపు అడుగులు వేస్తున్నాడు, కళ్ల నిండా ఏదో పైశాచికానందం.

అంతకు ముందే మస్తరు చూశాడు పిళ్లై. నలుగురు కనిపించడం లేదని తేలింది. ఉగ్రుడైపో యాడు బాస్టియన్‌. ‘‌లం…కొడుకులు. దొంగ లం.. కొడుకులు. ఎక్కడికిపోతారో చూస్తాను. పిళ్లై ఏ ఊరు వాళ్లది? కిష్టయ్యా!  ఇప్పుడే వెళ్లి గుర్రం ఎనక కట్టి లాక్కురా ఎదవల్ని!’. ‘దొరా! ఆళ్లు పారిపోలేదు దొరా! తప్పుకాయి దొర. ఇక్కడే ఉన్నారు.’ ‘ఇదెవర్తిరా!’  కిష్టయ్యని అడిగాడు బాస్టియిన్‌. ‘ఆ ‌నలుగురిలో బండయ్య అని ఉన్నాడు దొర, ఆడి పెళ్లాం కాబోలు!’ హాజరు తీసుకున్నాక పని మొదలైంది. అరగంట గడుస్తుండగా వచ్చారు ఆ నలుగురు. వాళ్లకి బాస్టియన్‌ ఇచ్చిన డబ్బులు లెక్క పెట్టు కోవడమే కాదు, సమయం గురించి కూడా తెలియదు. అందుకే జీలుగుకల్లు దొరికితే తాగి వస్తున్నారు. కానీ బాస్టియన్‌ అక్కడ ఉంటాడని ఊహించలేదు వాళ్లు.

‘ఎక్కడ చచ్చారా?’ గట్టిగా అరిచాడు బాస్టియన్‌. ‌వాళ్ల సమాధానం కోసం చూడలేదు. కొద్ది దూరంలో పని జరుగుతున్న ఆ స్థలం వరకు గొడ్లను బాదినట్టు బాదుతూ నడిపించి అక్కడ వదిలిపెట్టాడు. అప్పుడే ఆ పక్క నుంచి వెళుతున్నాడు రామునాయుడు. కళ్లంట నీళ్లు తిరిగాయి. అడుగులో అడుగు వేసుకుంటూ ఆ మామిడిచెట్టు దగ్గరకు వచ్చాడు రామునాయుడు. తాతను అలాంటి స్థితిలో చూసి కొండవాళ్ల పిల్లలు చాలా డీలా పడిపోయారా రోజు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు రామునాయుడు. ఒక్క పాట కూడా పాడలేదు. అతడి ముఖం మీద నవ్వు ఏమైందో? ముఖాలు తుడుచుకుంటూ, తల దులుపుకుంటూ, బట్టలు దులుపుకుంటూ వస్తున్నారు, రోడ్డు పని నుంచి అంతా.

చాలా విచారంగా ఉన్నాడు రామునాయుడు. అంత విచారంగా ఎప్పుడూ చూడలేదు. అందుకే నాలుగోసారి అడిగింది ఇద్దరు ముసలమ్మలలో బాగా పండిన ముసలమ్మ, ‘ఏంటయ్యా అలాగున్నావ్‌?’. ఎవరి కుండలు వాళ్లు తీసుకుంటూ ఉంటే, ఎవరి పిల్లలు వాళ్ల దగ్గరికి చేరుతున్నారు. ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క చోట చూసుకుని తినడానికి సిద్ధమవుతోంది. పనస ముక్కలు, అన్నం, గుమ్మడి పులుసు- రోజూ లాగే. వాళ్లని మౌనంగా చూస్తున్నాడు రామునాయుడు. అంతా పది పన్నెండు నిమిషాలే. పిల్లలందరికీ పెట్టిన ఇద్దరు ముగ్గురు తల్లులు కుండలు సర్దమని పిల్లలకి చెప్పేసి తునికాకు విస్తళ్లని చేత్తో పట్టుకుని మిగిలిన అన్నం తింటూనే పని జరుగుతున్న చోటికి నడుస్తున్నారు పరుగులాంటి నడకతో.

ఆ దృశ్యం చూసి కడుపు తరక్కుపోయింది రామునాయుడికి. అంతా ఖాళీ అయిపోయింది మళ్లీ. పిల్లలు కుండలు సర్దుతున్నారు. అప్పుడు భారంగా లేచాడు రామునాయుడు. ‘ఇదిగో, రేపు ఇంక నేను రాలేను. మీరే ఉండండి !’ అన్నాడు అడుగులో అడుగు వేస్తూ. అప్పుడు మళ్లీ ఆ వృద్ధురాలు అంది-‘ఏంటయ్యా రాముడు ఏంటి నీ బాధ, ఆలోచన!’ ఒక్క మాట మాట్లాడకుండానే నిష్క్రమిం చాడతడు.

జరుగుతున్నవి వింటూ ఉంటే, మళ్లీ ఒక్కసారి నేరుగా బాస్టియన్‌ని కలవాలని అనిపిస్తోంది. రోడ్డుపని దగ్గరకి రావొద్దని నిర్మొహటంగా బాస్టియన్‌ ‌చెప్పిన సంగతి గుర్తు లేక కాదు. ఆ కొండవాళ్లని ఒక్కసారి చూసి నేనున్నానని చెప్పాలి. వీలైతే బాస్టియన్‌ను ఒప్పించి వెంటనే పరీక్షలు చేయవలసిన వాళ్లనైనా పరీక్షిం చాలి అతడు ఏమనుకున్నా. వాళ్ల చేత ఈ పని ఇలాగే కొద్దిరోజులు చేయిస్తే  మన్యం మంచం పడుతుందన్న వాస్తవాన్ని చెప్పాలి. అందుకే కొండకంపౌరు వెళ్లడం మానేసి మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో చిట్టిరాళ్లగొప్పు రోడ్డు పని దగ్గరకి వెళ్లారు డాక్టర్‌ ‌మూర్తిగారు. ఆయన వెళ్లే సరికి బాస్టియన్‌ ఒక చెట్టు కింద నిలబడి ఉన్నాడు. ఎందుకో మరి విలియం, బాస్టియన్‌ ‌చాలా సన్ని హితంగా మాట్లాడుకుంటున్నారు ఆ క్షణంలో. డాక్టర్‌ ‌వస్తున్న సంగతి బాగా దగ్గరకి వచ్చాక గానీ పసిగట్ట లేకపోయాడు బాస్టియన్‌. అం‌దుకే చిరునవ్వు నవ్వాడు, లోపల మాత్రం తప్పించుకోలేక పోయినందుకు విచారిస్తున్నాడు. ‘ఏం డాక్టర్‌! ‌మీకు ఇక్కడేం పని? ఏమైనా ఉంటే కబురు చేయవచ్చు!’ చాలా కరుకుగా అన్నాడు బాస్టియన్‌, ‌పైకి నవ్వుతూనే. ‘నేనొచ్చిన పనేమిటో మనిద్దరం కలిసినప్పుడే గెస్ట్‌హౌస్‌ ‌దగ్గర విన్నవించాను. వైద్య పరీక్షలు. మీరు అనుమతిస్తే ఇక్కడే ఉన్న వీళ్లందరికీ వైద్య పరీక్ష•లు చేస్తాను. నా పని పూర్తవుతుంది.’ అన్నారు మూర్తి గారు. ‘వైద్య పరీక్షలు చేయాలని నేనూ చెబుతాను డాక్టర్‌ ‌గారూ! అది ప్రభుత్వ ఆదేశం.

 మిగతా వచ్చేవారం

About Author

By editor

Twitter
Instagram