– డా।। గోపరాజు నారాయణరావు

స్నానం చేసి వారం రోజులైపోయింది. పైగా నెలసరి మూడు రోజులు గడిచాయి. ఈ మూడు రోజుల నుంచి అదొక సమస్య. ఇంతకాలం ఎప్పుడూ లేదామె ఇన్ని రోజులు స్నానం చేయకుండా. మధ్యాహ్నం వేళ ఎండకి పట్టే చెమట, దానిమీద పేరుకునే ఎర్ర కంకర దుమ్ము రోత పుట్టిస్తున్నాయి. ఏది ఏమైనా స్నానం చేయాలని అన్నం తినేశాక నీళ్లు కాచుకుని ఒక చెట్టు మాటుకు తీసుకువెళ్లింది సన్యాసమ్మ. మసక మసకగా వెన్నెల కూడా ఉంది. ఆ ప్రాంత మంతా మలమూత్రాల వాసన. జీవితంలో ఏనాడూ ఎరుగదామె. వాంతి వచ్చినట్ట యింది. గాలి గట్టిగా వీచినప్పుడు ఆ గూళ్లని కూడా వ్యాపిస్తూ ఉంటుంది ఆ దుర్గంధం. ఇంకాస్త ముందుకు వెళ్లి అక్కడ ఒక పొద మాటున కూర్చుని, లాంతరు కొంచెం తగ్గించి అక్కడే పెట్టుకుని, చుట్టూ చూసిం దామె. ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక, చీర విప్పి ఆ పొద మీద వేసి చిన్న సత్తుచెంబుతో నీళ్లు తీసుకుని భుజం మీదుగా పోసుకుంది. కాస్త చలిగా ఉందేమో, ఆ వాతావ రణంలో ఆ వేడివేడి నీళ్లు ఒంటి మీద పోస్తే నవనాడులకీ కొత్త శక్తి వచ్చినట్ట యింది. రెండు చెంబులు ఒంటి మీద పోసుకున్న తరువాత తలకు కూడా చేయాలని అనిపించి, ఇంకో రెండు చెంబులు తలమీద ఒంపుకుంది. మరో చెంబుడు నీళ్లు తీసుకుని సన్నటి ధారగా నెత్తి మీద నుంచి పోసుకుంది. ఏదో తెలియని సుఖం. గాజులు, కడియాల నుంచి శబ్దం రాకుండా జాగ్రత్తగా ఒళ్లంతా ఒట్టి చేతులతోనే రుద్దు కుంది. ఒంగుని ఇంకో చెంబుడు నీళ్లు తీసుకుంటూ ఉండగా దూరంగా ఎండుటాకుల మీద శబ్దం. ఆగిఆగి అడుగులు పడుతున్న శబ్దం. నీళ్ల చెంబు కుండలోనే వదిలేసింది. అంత చీకట్లో ఏమిటి? గుండెలని ఒక చేత్తో కప్పుకుని చీకట్లోకి తరచి చూసింది. చిమ్మ చీకటి. ఆ అడుగులు మనిషివా? లేకపోతే ఏదైనా జంతువా? మనిషైతే మగ మనిషే- సందేహం లేదు. కాబట్లే ప్రమాదం. జంతువైనా అంతే… ప్రమాదమే. చిరిగి పోతుందని కూడా చూడ కుండా పొద మీద చీరను సర్రున లాగి, అదరా బాదరా ఒంటికి చుట్టుకుని తన గూడు వైపు పరుగు తీసింది లాంతరు మాత్రం పట్టుకుని. కుండ, చెంబు అక్కడ వదిలేసింది.

రోలర్‌ ‌నడుపుతున్నాడన్న మాటే గానీ, విలియం దృష్టంతా ఆమె మీదే ఉంది. ఆమె సన్యాసమ్మ. తదేకంగా చూస్తున్నాడు ఆమె కేసి. అది గమనించాడు బాస్టియన్‌. ‌పక్కనే నిలబడి ఉన్న కిష్టయ్యతో ‘ఏంట్రా కిష్టయ్య! ఆ డ్రైవర్‌ ‌గాడు ఇందాకటి నుంచి అలా చొంగ కార్చేసుకుంటున్నాడు. ఎవర్ని చూసి?’ అడ గాడ బాస్టియన్‌.

‘‌సన్యాసమ్మని. ఆడికి అదంటే మహా మోజు. వచ్చినప్పటి నుంచి చూస్తన్నా! కళ్లు తిప్పుకోలేకపోత న్నాడు.’చెప్పాడు కిష్టయ్య. ‘దాన్ని చూస్తే ఎవడికైనా మోజే. ఎక్కడుందరా అది?’ అడిగాడు బాస్టియన్‌. ‘అదిగో దొరా! ఆ రాయికి బొక్కెడతాంది..అటు అటు..!’ అని చేయి ఎత్తకుండా కంటి సైగలతోనే చూపిం చాడు. దూరంగా కనిపించింది సన్యాసమ్మ. ‘ఏంట్రోయ్‌! ‌బంతిపువ్వులా మెరిసిపోతంది?’ చాలా ఆత్రంగా అన్నాడు బాస్టియన్‌. ‘‌రాత్రే ఎన్నెల్లో నిలబడి, సుబ్రంగా తానం అదీ చేసింది దొరా!’ అన్నాడు కొంటెగా. ‘ఏరా ఇది రాదంటావా?’ అన్నాడు బాస్టియన్‌ ఆబగా. ‘ఏం చెప్పినా వినదు. కష్టం దొరా!’ అన్నాడు కిష్టయ్య. ‘ఎందుకులేరా! ఈళ్లలో ఎందరు ద్వారబంధాల చంద్రయ్యలు ఉన్నారో, ఎందరు తమ్మనదొరలు ఉన్నారో నీకూ నాకూ కూడా తెలీదురోయ్‌! ‌జాగ్రత్త ! డోలా లచ్చమ్మ ఉంది చాలు’ అన్నాడు హెచ్చరిస్తూ బాస్టియన్‌. ‌కానీ చూపుల్లో మాత్రం విలియంతో పోటీకి వెళ్లాడు బాస్టియన్‌.

‌నిజానికి కొండ ఆడవాళ్లను అనుభవించడానికి ప్రయత్నించిన వాళ్లని కొండ దేవత ముందు నరికి చంపేస్తారని ఓ భయం ఉంది.

******************

‘ఇది నేను మా తాత నోటి నుంచి విన్నాను. మా తాత కూడా శివసారే. ఆయన ఆ ఊరేగింపుని చూశాడంట!’ నెగళ్ల మంటలు ఒక్కసారిగా లోయ దిశకు మొగ్గాయి. గాలి దిశ అటే మారింది. చెట్లని కూడా కుదిపేస్తూ వీచడం మొదలెట్టింది చల్లటి గాలి. చురచుర శబ్దంతో ఎగసిపడుతున్న నిప్పురవ్వలు లోయ మీద యథేచ్చగా ఊరేగుతున్నాయి. అలా వెళ్లి, ఇలా ఆరిపోతున్నాయి. ‘అదిగో! ఈ నెగళ్లలో పుట్టిన ఆ నిప్పురవ్వలు లోయంతా తిరిగి తిరిగి ఎక్కడో మాయమైపోతున్నట్టే శివసారుల లేవదీసిన ఉద్యమం, అటు రంపదేశాన్నీ, ఇటు మన మన్యం కొండలన్నీ తాకి వచ్చి ఇదిగో ఈ లంబసింగిలోనే అంతమైపోయింది.’ రెండు చేతులతోను ఆ లోయని చూపెడుతూ అన్నాడు రామన్న. ఆ రోజు చాలా ఉద్విగ్నతతో చెబుతున్నాడు. పలకం (డిసెంబర్‌) ‌చివరివారం. చలిపులి బాధతో పచ్చటి మన్యం నల్లటి గొంగడి కింద దాక్కుంది. మారుమూల గ్రామం సడక. ఆ చిన్నకొండ పైనుంచి సడక గ్రామంలోకి తీసుకొచ్చే కాలి బాటలోనే కనిపించాడు. సరిహద్దును గుర్తిస్తూ ప్రతి కొండ గ్రామం పొలిమేరలలో పరిచి ఉంచే పెద్ద పెద్ద నల్ల రాళ్ల వరస మంచులో తడిసి ఉంది, వర్షం పడినట్టు. ఆయాసంతో అలా నిలబడి పోయాడు. ఆ బాట వెంటే పైఊరికి ఎదురు వెళుతున్న సడక గ్రామ బారిక అడుగు వేయబోయి అలాగే నిలిచిపోయాడు, ఆయన్ని చూసి.

సన్నగా పొడవుగా ఉన్నాడా వస్తున్న మనిషి. కొంచెం వంగి నడుస్తున్నాడనిపిస్తోంది. లేత పసుపు రంగుపంచె కట్టుకుని, ఒంటినిండా నల్లటి గొంగడి కప్పుకున్నట్టు లీలగా తెలుస్తోంది. తేమ చేరిన పంచె, గొంగడి కూడా ఆ చిరుగాలికి బరువుగా ఎగురు తున్నాయి. అవేం పట్టించుకోకుండా, ఏదో ఆవహిం చిన మనిషిలా, మంత్రించినట్టు విసవిసా నడిచి వస్తున్నాడాయన సడక వైపు. పొత్తిళ్లలో పసిబిడ్డను పట్టుకున్నట్టు రెండు చేతులలోను ఏదో పట్టుకుని అంత వేగంలోనూ జాగ్రత్తగా వేస్తున్నాడు అడుగులు. నుదురంతా ఖాళీ లేకుండా పసుపు రాసి ఉంది దట్టంగా. మధ్యగా నిమ్మకాయంత కుంకం బొట్టు. అవి కూడా తడిసినట్టే ఉన్నాయి, చిన్నగా కారుతూ. బాగా పెరిగిన తెల్లటి జుట్టు, గెడ్డం కూడా వర్షంలో తడిసినట్టుగా ముద్దగా ఉన్నాయి. మెడలో నల్ల తాడుతో తాయెత్తు. కుడిభుజం మీద మరో తాయెత్తు. బారిక ఎదురు వెళ్లి కాళ్లకి మొక్కి, వినయంగా చేతులు కట్టుకుని నడవడం మొదలుపెట్టాడు పక్కన. వచ్చినవాడు పక్క ఊరి శివసారి. రైతు కూడా. పేరు సలాబి బోడడు. కొండదొర వర్గం. పొత్తిళ్ల బిడ్డని మోస్తున్నట్టు రెండు అరచేతులలో పెట్టుకున్న ఆ వస్తువు – ఒక దండం. రెండడు గుల తెల్లకర్ర.

చాలా చిత్రంగా ఉంది. పైన బండగా, పోను పోను పాము తోకలా సన్నగా ఉండేటట్టు నున్నగా చెక్కారు. నిండా పసుపు, కుంకం బొట్లు. అచ్చం చలికి బిగుసుకుపోయిన కొండచిలవ పిల్లలాగే ఉంది. ‘మీ శివసారి ఇంటికి!’ ఆ ఒక్క మాటే అన్నాడు బోడడు, ముఖం కేసి కూడా చూడకుండా వడివడిగా నడుస్తూనే. శివసారి ఏం చెయ్యమని ఆజ్ఞాపించినా మన్యంలో ప్రతి మునసబు చేయాలి. అది వాళ్ల విధుల్లో ఒకటి. దాదాపు శివాజ్ఞ. ఇక మునసబు దగ్గర బంట్రోతు, బారిక అనగా ఎంత! ఊళ్లోకి పరుగుతీశాడు.

ముందు బారిక, వెనుక బోడడు వేగంగా వెళుతున్నారు. బారిక ఆ తాటాక పాక ముందు నిలబడి కాకేశాడు. అది సడక గ్రామ శివసారి ఇల్లు. అతడు కంగారుగా బయటకు వచ్చాడు. పేరు పోతుకూరి మాలడు. 35 ఏళ్లుంటాయి. పొట్టిగా బలంగా ఉన్నా డతడు. ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి పరవ శించి పోయాడు. వెంటనే బోడడి పాదాల ముందు తల ఆన్చి మొక్కాడు మాలడు. రెండు చేతులలో దండం అలాగే ఉంచుకుని దీవించాడు బోడడు. ‘గురుబ్రహ్మ, గురుర్విష్ణో, గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్‌ ‌పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః ’ దుర్యోధన సంపద కలిగి, భీమన్న బలం కలిగి, అంటింది అమృతమై, ముట్టింది ముత్యమై, శత వెయ్యేళ్లు చల్లగా వర్ధిల్లు. పాడిపంటలు వర్ధిల్లుతూ, పూచిన పూవుల్లా, కాచిన కాయల్లా, పున్నమి వెన్నెల్లా వెలగాలి.’ దీవెన తరువాత లేచిన మాలడు ఆ దండం అందుకోబో యాడు, మర్యాద పూర్వకంగా. ఇవ్వడానికి తిరస్కరిస్తు న్నట్టు ఒక అడుగు వెనక్కివేశాడు బోడడు. ఉలిక్కిపడి తన చేతులు వెనక్కి తీసుకుని, తొందరపాటుకు పరిహారమన్నట్టు రెండు చేతులతో లెంపలు వేసుకు న్నాడు మాలడు. అప్పటికే సడక గ్రామంలో ఆడా మగా అంతా అక్కడి వచ్చారు. మునసబు ముర్ల బాలయ్య మిగిలిన గ్రామస్థులను దాటుకుని కొంచెం ముందుకు వెళ్లి, ఆ ఇద్దరికీ ఐదారడుగుల దూరంలో వినయంగా నిలబడ్డాడు చేతులు కట్టుకుని. ‘ఏమిటి సెలవు?’ చేతులు మళ్లీ జోడిస్తూ అడిగాడు మాలడు. ఏం చెబుతాడో బోడడు అని అంతా ఎదురు చూస్తు న్నారు, చెవులు రిక్కించి. రెండు నిమిషాల తరువాత, కళ్లు మూసుకుని నిశ్చలంగా అన్నాడు బోడడు, ‘నాకు దేవుడు కనిపించాడు!’ ఒక్కసారిగా మౌనం. ఆపై కొండంత విస్మయం అక్కడి వారందరి ముఖాలలో. చేతులెత్తి దణ్ణం పెట్టారు గ్రామస్థులు. పెద్ద గొంతుతో చెప్పాడు బోడడు. హత్తుకునేటట్టు మాట్లాడాడు. ఆ దండాన్ని అలాగే పట్టుకుని ఒకసారి ఆకాశం కేసి చూస్తూ, సందర్భం వచ్చినప్పుడు భూమాత వైపు కళ్లతోనే భక్తిపూర్వకంగా చూపిస్తూ, అప్పుడప్పుడు చెట్టునీ చేమనీ పరికిస్తూ, ఇంకొకసారి మునసబు ముఖంలోకి చూస్తూ, మరొకసారి గ్రామ యువకుల కేసి చూస్తూ, మాలడిని ఉద్దేశిస్తున్నట్టు గంభీరంగా తన మనోగతాన్ని విప్పాడు బోడడు. ‘గొప్ప శుభవార్త చెప్పాడు దేవుడు. కొండవాళ్లందరికీ ఇది శుభవార్త. చింతలు పూస్తే చెడ్డకాలం… మామిళ్లు పూస్తే మంచి కాలం అంటారు మన పెద్దలు. కానీ ఇప్పుడు అన్ని కాలాలు చెడ్డ కాలంతో సమానమే. ఇవాళ అడవిబిడ్డ అడవిలో అడుగు పెడితే నేరం. దానికో శిక్ష. కొమ్మ కొడితే రూపాయి జరిమానా. అడవి మీద గొడ్డలి పడితే కలప పన్ను. పంట మీద మొదలు పన్ను, కల్లుకు వేలంపాట. కల్లు మీద చిగురు పన్ను… అంతా పన్నుల రంథే. గంప పళ్లు తెచ్చుకుంటే అణా పన్ను. భూమి మీద పన్ను. లేగదూడ మేస్తే పన్ను. ఇంటికోసం చిన్న దూలం కొట్టుకుంటే పన్ను. కట్టు బడి పేరుతో ముఠా మీద పన్ను. షావుకారు ఐదు రూపాయలు అప్పిచ్చి, కాడెడ్లని తోలుకుపోతాడు. ఇదేమిటంటే- కోర్టు పంచాయతీ చెప్పిందంటాడు. ఆ కోర్టు ఎక్కడో రాజమండ్రిలో ఉంది. నువ్వు కొండను చదును చేస్తావ్‌. ‌నువ్వే పంట వేస్తావు. ముఠాదారొచ్చి తాను గింజలు చల్లుతానంటాడు. పంటవేసి, కొండగొర్రెల పాల పడకుండా రేయీ పగలూ కాపాడుకుంటే, షావుకారొచ్చి ఆ పంట తనదంటాడు. ఇలా ఎప్పుడైనా ఉందా? ఇది సాగకూడదని దేవుడు చెప్పాడు’. ఇక్కడ హఠాత్తుగా ఆగిపోయాడు రామన్న. అటు రెండు అడుగులు, ఇటు రెండు అడుగులు వేసి చీకట్లోనే తేరపార చూశాడు. తరువాత కొంచెం తగ్గించి చెప్పాడీమాట. అది బోడడు చెప్పిందే. ‘తెల్లోళ్ల జబర్దస్తు ప్రభుత్వం మీద ఫితూరీ ఎత్తాలి. వినండి! దేవుడు చెప్పాడు. పితూరీ లేవదీస్తే ఈసారి గెలుపు మనదే. దేవుడు చెప్పింది నమ్మాలి. పితూరీ ఎత్తాలి. ఈ అడవి, ఈ అడవిలో మన దేవుడు, మన అమ్మోరు, మన చెట్లు, మన పుట్ట అన్నీ మనకి దక్కాలంటే ఫితూరీ లేవదీయ వలసిందేనంటాడు దేవుడు ! ముక్కనుమకి ముక్కులూ మూతులూ ఎండుతుంటే- ముక్క కమ్ములు అమ్ముకు తింటారని సామెత. ఇప్పుడు శివరాత్రి (మాఘం), ఇటిం (చైత్రం), బైశాగి (వైశాఖం), దసరా (ఆశ్వీ యుజం), సవితి (కార్తికం), పొగును(ఫాల్గుణం) అన్నీ ముక్కనుమలే మన బతుకులకి. ఇది బతుకు కాదు. సగం చావు. నీ భూమి నీకు దక్కాలంటే బాణాలు అందుకోమన్నాడు, దేవుడు. మీ మాన్యాల మీద, మీ ఆడవాళ్ల మానాల మీద కన్నేసిన ఎర్రబుట్టలోళ్లని తరిమి కొట్టాలని దేవుడి సెలవైంది. మీ పూర్వీకుల బాటలో నడచి, అడవిని రక్షించుకునే బాధ్యత ప్రతి కొండవాడు ఈ జామునుంచి తీసుకోవాలని చెప్పాడు దేవుడు. అడవిబిడ్డలకు పూర్వ వైభవం దగ్గరలోనే ఉంది. మన రాజ్యాన్ని మనమే మరోసారి ఏలుకో బోతున్నాం. దేవుడు నాకు ఈ కబురు చెప్పాడు. మన చెట్టున మొలిచిన కాయ మనమే తెచ్చుకోవా లన్నారు మన పెద్దలు. ఈ అడవిలో పుట్టాం. పెరిగాం. మన తాత ముత్తాలు ఈ నేల మీద పుట్టి, ఇందులోనే కలసిపోయారు. నీ కట్టె, నా కట్టె ఏ భూమిలో కలవాలి? మన కట్టెలు మట్టి కావడానికి ఇప్పుడు చోటేది? అసలు ఈ అడవి తెల్లోడిదా? ఆడిది కాదు, ఆడు పెంచింది కాదు. మన దేవుడుది! ఈడి పెత్తనం ఎందుకు మరి! మన జమిందార్లు మనం ఇచ్చింది పుచ్చుకున్నారు. తెల్లోడు దొంగ. బందిపోటు. తెల్లోడు ఓడలెక్కి వచ్చి ఉండొచ్చు. సముద్రాలు దాటొచ్చిన మొనగాడు కావొచ్చు. వాడి దగ్గర పెద్ద పెద్ద తుపాకులు ఉండొచ్చు. ఎర్రబుట్టలోళ్ల పహారాలో ఉండొచ్చు.

కానీ మనకాడున్న బాణాలతో అమ్ములు గురి పెడితే విజయం మనదేనని దేవుడు చెప్పాడు. ఒకరోజుతో కాదు, ఒక నెలతో కాదు, కొన్నేళ్లయినా, కొన్ని తరాల పాటైనా మనం పితూరీలు చేస్తూనే ఉండాలి. ఇందులో అలసి పోకూడదు. ఈ అడవి లోనే తిరగాడుతున్న మన పెతర్ల (కాలం చేసిన తండ్రులు, అంటే ఆత్మలు)కి కోపం రాకుండా ఉండా లంటే, అవి శపించకుండా ఉండాలంటే ఫితూరీ లేవదీయమన్నాడు దేవుడు అన్నాడు బోడడు’ అని చెప్పాడు రామన్న. సడక మునసబు బాలయ్య, శివ సారి మాలడు ఆయన ముందుకు వెళ్లి చేతులు కట్టు కుని నిలిచారు. ‘పూజకు వేళయింది. మిగిలిన విషయం పున్నం రోజున మాట్లాడుకుందాం!’ అన్నాడు నెమ్మదిగా. అంటే సరిగ్గా వారం తరువాత. అప్పుడు అడిగాడు మాలడు, ‘ఈ దండం?’ ‘ఇది మహిమ గల దండం. రేపటి నుంచి నిత్యం ఉదయం ఐదుగురు, మధ్యాహ్నం ఐదుగురు, సాయంత్రం ఐదుగురు వచ్చి మొక్కాలి, పంచపాండవుల్లాగా. చుట్టుపక్కల గ్రామాల వాళ్లు వచ్చి మొక్కాలి.’ అన్నాడు కళ్లకు అద్దుకుంటూ బోడడు ‘ఈ దండానికి గొప్ప కత ఉంది. నేను మళ్లీ పున్నానికే నోరు విప్పుతాను. అప్పుడు ఈ దండం గురించే చెబుతాను. మళ్లీ బోడడే అన్నాడు. జనంలో తెలియని ఆవేశం. ఏదో ఉత్కంఠ. మాలడి ఇంటిలోనే ఒక మూల పీనె (అరుగు)ను వెంటనే పేడతో అలికించారు.

దాని మీద పండగలలో దేవతల పీఠం కోసం వేసినట్టు నేరేడాకులు పరిచి ప్రతిష్టించారు దండాన్ని. ఆ దండాన్ని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉరకలేశారు. పున్నమి వరకు బోడడు ఎందుకు ఆగమన్నాడంటే తన ఉద్దేశం గ్రామాలన్నింటికీ తెలియాలి. ఈ ఏడు రోజులలో తన ఆశయం కనీసం పాతిక ముప్పయ్‌ ‌గ్రామాలకు వెళ్లాలి. వాళ్లకి అర్థం కావాలి. మనసుకు నాటాలి. బోడడు చెప్పేది ఎంతో కొత్తగా అనిపిస్తోంది. ఫితూరీ అంటే పది గ్రామాలలోనో, పన్నెండు గ్రామాలలోనో జరిగే అల్లరి కాదట. అది కొండలంతా చుట్టి రావా లట, కొండగాలిలా. ఆ గాలిలో తెల్లవాళ్లు, ఎర్రబుట్ట లోళ్లు కొట్టుకు పోవాలట. పున్నమి రోజు మధ్యాహ్నా నికి చుట్టుపక్కల గ్రామాల ప్రజల సడక చేరుకున్నారు, బోడడు చెప్పేది వినడానికి. మునసబు ముర్ల బాలయ్య, సడక శివసారి మాలడు వెంటరాగా చేతిలో దండంతో బోడడు వచ్చాడు. అంతా చేతులెత్తి మొక్కారు. వారం తరువాత అప్పుడే నోరు విప్పాడు, బోడడు. అంతమంది అడవిబిడ్డలు అక్కడికి చేరడం మహదానందమనిపించింది. రామన్న గొంతు బొంగురు పోయింది. అయినా ఆపడం లేదు. అక్కడ కూర్చున్నవాళ్లు కూడా నిద్ర ఆపుకుంటూ ఉద్వేగంగా ఎదురు చూస్తున్నారు. కొంత తడవు ఆగి మళ్లీ మొదలు పెట్టాడు రామన్న. ‘దేవుడు నాకు ఏం చెప్పాడో వారం క్రితం చెప్పాను. ఇవాళ పాండగుల దర్శనం గురించి చెబుతాను. అడవిబిడ్డలు పడుతున్న దుఃఖం నన్ను కలచి వేస్తుంటే, మతిచెడిపోయి అడవి తల్లికి గోడు వెళ్లబోసుకుం దామని వెళ్లాను. అడవి నాతో మాట్లాడుతుంది. ఎంత ప్రశాంతమైనది అడవి! కలత తేరిన నన్ను ఏదో గాలి ఒకచోటకు తీసుకు పోయింది. అక్కడ ఆకాశాన్ని చిగుళ్లతో రాస్తున్న చింతచెట్టు కనిపించింది. దాని కింద ద్రౌపది, పాండ గులు ఉన్నారు. ఎంత కాంతి! ఎంత తేజస్సు! కూర్చు న్నారు పాండగులు-గున్నతాడి పొడవు నిల్చున్నారు పాండగులు-నిలువుతాడి పొడవు చింతకింద సిమ్మాస నమేసి ఉన్నారు పాండు గులు’ అంటూ ఒక పాట పాడాడతడు. ఆ పాటే తన్మయత్వంతో అందు కున్నారు, మహిళలు, పిల్లలూ చక్కగా ‘లే లే లేల లేలమ్మారో… ఓలే లేల రండో చేరి పాండవులార-భోంచేయ రండో…’’ పాండవులు చింతచెట్టు కిందే ఉంటారని కొండవాళ్ల ప్రగాఢ విశ్వాసం.

(ఇంకా ఉంది)

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram