– చిక్కాల జానకిరామ్‌

అతని చెంప పైనుండి కన్నీళ్లు జారీ అతని సెల్‌ ‌స్క్రీన్‌పై పడ్డాయి. జాన్‌ ‌వాళ్ల నాన్న వలన ఏడవడం అదేమీ మొదటి సారి కాదు. కానీ ఈ సందర్భం వేరు. ఒక్కసారి కన్నీళ్లు తుడుచుకుని, సెల్‌ ‌స్క్రీన్‌ను తుడిచి ఆ వీడియో మళ్లీ చూశాడు. ఏదో తెలియని సిగ్గు, తప్పు చేసిన భావన అతనిలో. ఎన్నో ఏళ్లుగా జాన్‌ ‌లో గూడు కట్టుకున్న అపోహలు, అవాస్తవాలు పగిలిపోతున్న భావన.

మొదటిసారి మా నాన్న అప్పారావుకి నేను ఏకైక కొడుకుని అని అరవాలనిపించింది. టైం చూశాడు. ఇంకా గంట సమయం ఉంది ఆఫీస్‌ ‌నుండి వెళ్లిపోవడానికి. తన టేబుల్‌ ‌మీద ఉన్న బెల్‌ ‌నొక్కి సర్వెంట్‌కి వేడివేడి కాఫీ తీసుకురమ్మని చెప్పాడు. సర్వెంట్‌ ‌కూడా జాన్‌ ‌ముఖంలో తేడాని గమనించాడు.

లేచి కాఫీ తాగుతూ తన ఆఫీస్‌ ‌క్యాబిన్‌ ‌నుంచి వ్యూ చూస్తూ పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాడు.

జాన్‌ ‌వాళ్లది రామవరం అనే పల్లెటూరు. ఆ ఊరి చివరి పేటలో వీళ్ల ఇల్లు. ఇప్పుడంటే జాన్‌ ‌కానీ ఆ పేటలో చిన్నప్పుడు అతనిని జానయ్య అని పిలిచేవారు. జాన్‌ ‌వాళ్ల నాన్న పేరు అప్పారావు పారిశుద్ధ్య కార్మికుడు, అమ్మ పేరు లక్ష్మి గృహిణి. ఏకైక కొడుకు కావడంతో జాన్‌ని వాళ్లు ఉన్నంతలో ప్రేమగా,గారాబంగా చూసుకునేవారు.

ఆ ప్రేమ, గారాబం జాన్‌కి హాయిగా ఉన్న, అతనికి  ఇబ్బంది కలిగించిందల్లా వాళ్ల నాన్న వృత్తి. ఊరిని శుభ్రంగా ఉంచే ఆ పారిశుద్ద్యం జాన్‌కి మాత్రం ఎందుకు  చెత్తగా, చిత్తుగా తగులుకుందో చూద్దాం.

చిన్నప్పుడు జాన్‌ని వాళ్ల నాన్న బడి దగ్గర దించేసి తన పనికి వెళ్లేవాడు. వాళ్ల నాన్న సైకిల్‌ ఎదుట ఊస మీద కూర్చుని బడికి వెళ్లడం జాన్‌కి గుర్రపు బండి ఎక్కి  సవారీకి వెళ్ళినట్టు ఉండేది.

కొంచెం పెద్దయ్యాక తెలిసింది ఆ సైకిల్‌ ‌సవారీ తనని తక్కువ వాడిని చేసిందని. దానికి కారణం… ఎదుట సైకిల్‌పై జాన్‌ ‌కూర్చుంటే, వెనుక వాళ్ల నాన్న పాకీ చీపురుని సైకిల్‌ ‌క్యారేజ్‌కి కట్టుకునే వాడు. ఆ చీపురిని చూసిన జాన్‌ ‌స్నేహితులు బడిలో తనని హేళన చేసేవారు. జాన్‌ ‌దగ్గరికి వస్తుంటే ముక్కు మూసుకుని ఆటపట్టించేవారు. అలా చేస్తుంటే జాన్‌కు ఏడుపు తన్నుకు వచ్చేది. అలా ఎన్ని కన్నీళ్ళు తుడుచుకున్నాడో తన చొక్కా కాలర్‌కే తెలుసు.

జాన్‌ ఇది కాదని కోపగించుకుని వాళ్ల నాన్నను బడికి రావద్దన్నాడు. తనే రోజు బడికి నడిచి వచ్చేవాడు.

ఒ• రోజు అర్ధరాత్రి నిద్దట్లో ఉన్న జాన్‌కి బయట అలికిడికి మెలుకువ వచ్చింది. ఏమిటా అని కిటికీ నుంచి చూశాడు. బయట నిలబడిన వాళ్ల నాన్న ఒళ్లంతా రొచ్చుతో నిండిపోయింది. అతని ఒంటి మీద నుంచి దుర్గంధ భరితమైన వాసన ఇంట్లోకి కూడా వస్తుంది.

జాన్‌కి అర్థమైంది, వాళ్ల నాన్న ఎక్కడో బాత్రూమ్‌ ‌ట్యాంకు నీరు ఎత్తి శుభ్రం చేసి వచ్చాడని. వాళ్ల అమ్మ  నాన్నకి ఒక కొత్త సబ్బు, నాలుగు షాంపులు ఇచ్చింది స్నానం చేయడానికి. తలస్నానం చేసి వచ్చి వేళకాని వేళ భోజనం చేశాడు వాళ్ల నాన్న. కానీ ఆ కష్టం జాన్‌ ‌మనసులో వేరే విధంగా రూపుదిద్దుకుంది. ఎందుకు మా నాన్నే ఇలాంటి పనులు చేయాలి? అనే ప్రశ్న మొదలైంది. దానితోపాటు నాన్న మీద చిరాకు కలిగింది.

కొన్ని రోజులు ఇలా సాగాయి. ఒకరోజు తరగతిలోని పిల్లలని సోషల్‌ ‌బోధించే ఉపాధ్యా యుడు వారి తండ్రుల గురించి, వారి వృత్తుల గురించి చెప్పమన్నారు.

అందరూ మా నాన్న రైతు, కిరాణా కొట్టు షావుకారు, దినసరి కూలీ, వడ్డీ వ్యాపారి…ఇలా చెబుతున్నారు. జాన్‌ ‌వంతు వచ్చింది. ఏమని చెప్పాలి? అప్పటికే జాన్‌కి చెమటలు పట్టాయి. బిడియంగా లేచి నిల్చున్నాడు. మా నాన్న పేరు అప్పారావు. నేను ఆయనకు ఒకే ఒక కొడుకుని. మా నాన్న పాకీ పని చేస్తారు. అనగానే క్లాస్‌ అం‌తా గొల్లున నవ్వింది. జాన్‌ ‌సిగ్గుతో చచ్చిపోయాడు. ఉపాధ్యాయుడు వెంటనే సైలెన్స్ అని గట్టిగా అరిచాడు. క్లాస్‌ అం‌తా నిశ్శబ్దం అయిపోయింది. ఒక్క జాన్‌ ఏడుపు తప్ప ఏమి వినపడటం లేదు. అప్పటికే అతని కన్నీళ్లు తన ఎదుట ఉన్న సోషల్‌ ‌టెక్సట్ ‌బుక్‌ ‌పుటలని తడిపేస్తున్నాయి.

ఆ సంఘటన తరువాత నేరుగా జాన్‌ ‌వెళ్లి వాళ్ల నాన్నని,‘నాన్న ఈ పాకీపని మనకెందుకు? వేరే పని ఏదైనా చెయ్యొచ్చుగా’ అని అడిగాడు. దానికి వాళ్ల నాన్న సమాధానం ఒక నవ్వు నవ్వేసి లేచి తీగ మీద ఉన్న రుమాలు భుజం మీద వేసుకుని బయటకు వెళ్లిపోయాడు. ఏమీ అర్థం కాని జాన్‌ అప్పటి నుంచి తన తండ్రి వృత్తినే కాదు, తన తండ్రిని కూడా ద్వేషించడం మొదలు పెట్టాడు. అతనికి దూరంగా ఉండేవాడు. ఎక్కువగా ఇంటికి వచ్చేవాడు కాదు.

వీళ్లకి ఇంకా దూరంగా ఉండాలంటే బాగా చదవాలి అని గ్రహించాడుజాన్‌ . అలాగే చదివాడు కూడా. పైచదువులకు పట్నంలోని కళాశాలలో సీటు వచ్చింది. అక్కడే వసతిగృహం సదుపాయం కూడా కలిగింది.

అలా జాన్‌ ‌కళాశాలకు చేరుకున్నాడు. పట్నం పైగా వసతి గృహంలో ఉండడంతో అరుదుగా ఇంటికి వచ్చేవాడు. ఒకసారి తనతో పదో తరగతి చదివిన మిత్రుని పెళ్లి  కావడంతో ఊరికి వచ్చాడు కానీ ఇంటికి వెళ్లలేదు. పెళ్లిలో కొందరు మిత్రులను కలుసుకున్నాడు. వారితో తన మార్కుల గురించి, పట్నం గురించి చెప్పాడు. వాళ్లు కూడా ఆనందించారు. పెళ్లి కుమారుడికి  శుభాకాంక్షలు తెలిపి  తెచ్చిన బహుమతిని అందజేశారు.

మిత్రులతో కలిసి జాన్‌ ‌భోజనపంక్తిలో కూర్చున్నాడు. భోజనం చేస్తూ వారితో  కబుర్లలో పడ్డారు. ఇంతలో ఎదురుగా ఉన్న వరుస వారు భోజనం ముగించి లేచారు. అక్కడ ఆకుల తీస్తూ జాన్‌ ‌వాళ్ల  నాన్న. జాన్‌ ‌చూసీచూడనట్లు మొహం కిందకి దింపాడు. కానీ అప్పారావు కొడుకుని చూశాడు.‘ఏరా ఎప్పుడొచ్చావ్‌? ఇం‌టికి రాలేదే? భోజనాలయ్యాక ఓసారి రారా అమ్మ చూస్తా అంటుంది’ అనేసి జాన్‌ ‌వాళ్ల మిత్రులను కూడా పలకరించి ఆకులు పట్టుకుని చెత్త బండి దగ్గరికి వెళ్లి పోయాడు.

మిత్రులు ఏమీ అనలేదు. కానీ జాన్‌కే ఎందుకో చాలా అవమానంగా అనిపించింది. తన తండ్రి ఆకులు ఎత్తడం, అందరి ముందు తనని పలకరించడం ఏదోలా అనిపించింది. తనకి తెలియకుండానే రెండు కన్నీటి బొట్లు జారీ ఎదుట ఉన్న విస్తరిలో పడ్డాయి. పక్కనున్న మిత్రుడు సాంబార్‌ ‌వేడిగా ఉంది, ఊదుకుని తినరా మూతి కాలినట్టు ఉంది అన్నాడు.

కానీ కాలింది మూతి కాదు జాన్‌ ‌మనస్సు. జాన్‌ అప్పటి నుండి ఇంటికే వెళ్లలేదు. కసిగా చదివాడు. వీళ్లకి  అందనంత దూరం ఎగిరిపోవాలనే కోరికతో చదివాడు. మార్కులను, ర్యాంకులను దాటుకుంటూ వచ్చి ఒక మంచి ఉద్యోగంలో పడ్డాడు.

ఉద్యోగరీత్యా హైదరాబాద్‌ ‌సిటీకి చేరుకున్నాడు. అక్కడ తన పేరు, తన పని తప్ప తన ఊరు కాని, తన కుటుంబం గురించి కానీ, తన వ్యక్తిగత విషయాలు కానీ ప్రస్తావించేవాడు కాదు. పనిలో పైకి ఎదగడం మీదే అతని ధ్యాసంతా. అందరూ జాన్‌ని పనిరాక్షసుడు అనుకునేవారు.

అయితే ఆఫీసులో అతని కష్టాన్ని మరిపించి, తనకి ఎవరూ లేరు అనే భావన నుంచి గట్టెక్కించే అద్భుతం జరిగింది. ఆ అద్భుతమే లావణ్య. ఆమె  జాన్‌  ‌సహోద్యోగి. వారి మధ్య ప్రేమ చిగురించింది. కుటుంబానికి దూరంగా ఉండే జాన్‌ ‌తనకు అన్నీ లావణ్యనే అనుకున్నాడు.

తనని విపరీతంగా ప్రేమించాడు. వారిద్దరూ పెళ్లి గురించి ప్రస్తావించుకున్నారు. లావణ్య తండ్రి జాన్‌ని కలిసాడు. తనకు ఎవరూ లేరు అని చెప్పాడు జాన్‌.అతనికి చక్కటి ఉద్యోగం ఉండడంతో మతం కూడా పెళ్లికి అడ్డుగా కనిపించలేదు. అయితే పిల్లనిచ్చేవారి భయాలు లావణ్య తండ్రిలోనూ లేకపోలేదు. దానితో జాన్‌ ‌గురించి మొత్తం కూపీ లాగాడు. జాన్‌ ‌తల్లిదండ్రుల గురించి, అతని ఊరి గురించి తెలిసింది. తనకు ఎవరూ లేరు అని జాన్‌ ‌చెప్పిన అబద్ధం బట్టబయలైంది.

అది చాలు ఆ ప్రేమకు, పెళ్లికి స్వస్తి పలకడానికి. జాన్‌ ‌లావణ్య తండ్రిని చాలా బతిమాలాడు. తనకు  మంచి ఉద్యోగం ఉంది అన్నాడు. ‘నా కూతురికీ• ఉద్యోగం ఉంది’ అని సమాధానం వచ్చింది. మరి మీకేం కావాలి అని అడిగాడు. ‘నీ తండ్రి చేసేది పాకీపని లేదా పారిశుద్ధ్యం అది చెప్పుకోవడానికి నీకే సిగ్గుగా ఉంది..! నీకు ఎవరూ లేరు అన్నావు. మరి అటువంటిది నువ్వే తక్కువగా చూసే ఆ ఇంటికి నా కూతుర్ని ఎలా కోడలిగా పంపిస్తాను అనుకున్నావు. ఇక్కడితో ఈ విషయాన్ని, నా కూతుర్ని మర్చిపో’ అని పంపేశాడు.

తర్వాత కొన్ని రోజులకే లావణ్య ట్రాన్స్ఫర్‌పై వెళ్ళిపోయింది. ఇది జాన్‌ని మరింత కుంగదీసింది. ఏడిపించింది. ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నాడో అతని  దిండులనే అడగాలి. జాన్‌లో ఇంకా కసి పెరిగింది! ఈ ప్రభుత్వ ఉద్యోగం కాక ఇంకా ఏదో కావాలి అనిపించింది. ఈ కింది స్థాయి ప్రజల నుండి దూరంగా ఉండాలనిపించింది.

అప్పుడే సాఫ్ట్వేర్‌ ‌బూమ్‌ ‌వచ్చింది. బాధను దిగమింగుకుని ఆ వైపు దృష్టి పెట్టాడు జాన్‌. ఉద్యోగం చేస్తూనే ఇంజనీరింగ్‌ ‌చదివాడు.

ఎన్నో కష్టాలు అధిగమించి ముంబైలోని ఖరీదైన సాఫ్ట్వేర్‌ ‌కంపెనీలో ఉద్యోగం పొందాడు. ఆ కంపెనీ లోనే అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం అదే కంపెనీ సీఈవో అయ్యాడు.

ప్రభుత్వ ఉద్యోగం చేసినప్పుడు కొడుకు ఇంటికి రాకపోయినా, కనీసం ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అప్పారావు దంపతులకు తెలుసు. కానీ జాన్‌ ‌ముంబై వెళ్లిపోయాక అసలు కొడుకు ఎక్కడ ఉన్నాడో? ఏం చేస్తున్నాడో? అసలు బ్రతికే ఉన్నాడో? లేదో? తెలియని పరిస్థితి ఆ దంపతులది. పై చదువులకో, ఉద్యోగానికో పోయి ఉంటాడులే. మనని గుర్తుపెట్టుకుని తిరిగి రాక పోతాడా అని వెయ్యి కళ్లతో, అమితమైన ప్రేమతో ఎదురుచూస్తున్నారా తల్లిదండ్రులు. కానీ అతను రాలేదు.

కాలం ముందుకు సాగిపోయింది. కరోనా అనే ప్రమాదకర వ్యాధి ప్రపంచాన్ని జడిపిస్తూ, భారత్‌కు కూడా వచ్చింది. ఆ సమయంలో సరిహద్దుల దగ్గర సైనికుల్లా ప్రాణాలకు తెగించి సేవలందించారు ఫ్రంట్లైన్‌ ‌వారియర్స్. ఇం‌దులో ఎవరికి వారే సాటి.

ఫ్రంట్‌ ‌లైన్‌ ‌వారియర్‌గా తన సేవలను ఉన్నతస్థాయిలో అందించాడు అప్పారావు. ఉదయం వీధులు ఊడ్చి బ్లీచింగ్‌ ‌చల్లడం దగ్గర నుండి, రక్తసంబంధీకులు కూడా దగ్గరకు రాని కరోనా పార్థివదేహలకు అంత్యక్రియలు నిర్వహించడం వరకు అన్ని పనులు చేసేవాడు. మెల్లగా కరోనా ఉధృతి తగ్గి మామూలు రోజులు రాసాగాయి.

ఫ్రంట్లైన్‌ ‌వారియర్స్ ‌సేవలను గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. అత్యుత్తమ ఫ్రంట్లైన్‌ ‌వారియర్స్‌ని ప్రధానమంత్రి చేతుల మీదగా సత్కరించా లనుకుంది. దానికి అనుగుణంగా జాబితా తయారు చేయించింది. అందులో అప్పారావు పేరు చోటు చేసుకుంది.

కారణం అప్పారావు రిటైర్మెంట్‌కి దగ్గరయ్యాడు, కానీ ఇన్నేళ్లలో ఒక్క రోజు కూడా సెలవు పెట్టలేదు. ఆదివారాలు కూడా పనిలోనే గడిపాడు. రామవరం వెళ్లి వీధులను పరిశీలిస్తే తెలుస్తుంది అప్పారావు పనితనం. కరోనా సమయంలో పరిశుభ్రత గురించి టీవీలలో చూసి రాత్రి పగలు ఊరిని శుభ్రంగా ఉంచడం కోసం పాటు పడ్డాడు.

సన్మానం జరిగే రోజు రానే వచ్చింది. రామవరం సర్పంచ్‌ ‌మనిషిని తోడిచ్చి అప్పారావుని ఢిల్లీ పంపాడు. సభకు చేరుకున్నారు. వేదికపై ఫ్రంట్లైన్‌ ‌వారియర్స్ ఒక్కొక్కరికి ప్రధానమంత్రి చేతుల మీదుగా సన్మానం జరుగుతుంది. కొందరు చిన్నపాటి స్పీచ్‌ ‌కూడా ఇస్తున్నారు. అనువాదకులు దానిని హిందీలోకి అనువదిస్తున్నారు. అప్పారావు వంతు వచ్చింది. ప్రధానమంత్రి శాలువా కప్పి, సన్మానపత్రం, రివార్డు నగదు చేతిలో పెట్టి సన్మానించారు. అప్పారావుని కూడా మాట్లాడమన్నారు.

అప్పారావు బిడియంగానే మైక్‌ అం‌దుకొని అందరికీ నమస్కరించి మాట్లాడడం మొదలు పెట్టాడు.

‘అయ్యా మాది రామవరం అనే పల్లెటూరు. మా తాతలు,తండ్రులు ఇదే పారిశుద్ధ్య వృత్తిని చేశారు. నేను అదే చేస్తున్నాను. ఈ పనికి కులం అంటగట్టి మమ్మల్ని దూరం పెట్టినవారున్నారు, దూషించినవారున్నారు. కానీ మేము ఎవరిని వదులుకోలేదు. ఊరంతా మాదనుకున్నాం. మా బాధ్యతగా దానిని శుభ్రంగా ఉంచాము.

ఒకసారి మా అబ్బాయి నన్ను అడిగాడు. నాన్న ఈ వృత్తి ఎందుకు ఇంకొకటి చేయొచ్చు కదా అని. అప్పులపాలవుతానని రైతు, ప్రాణాలు పోతాయని సైనికుడు తమ వృత్తులను విరమిస్తే ఎవరైనా బ్రతకగలరా. అలాగే ఏ వృత్తైనా జనం కోసమే. జనంలో కొందరు సౌకర్యంగానూ, మరికొందరు సుఖంగానూ బ్రతకాలంటే, కొందరు కొంత కష్టపడాలి. అలాగని కష్టపడేవారు ఏమీ తక్కువ కాదు, కింది వారు కాదు. ఎందుకంటే వారు లేనిదే పైస్థాయి వారికి సౌకర్యం ఉండదు కనుక.

ఉదయం లేస్తే పాలవాడు, మీ డ్రైవర్‌ ఇలా ఎవరో ఒకరి మీద మీరు ఆధారపడల్సిందే. అందుకే వారిని పురుగుల్లా చూడొద్దు, మీ పురోగతిలో ఒక భాగంగా చూడండి. అదేదో డిగ్నిటీ ఆఫ్‌ ‌లేబర్‌ అం‌టారు అది నాకు తెలియదు కానీ చేసేవారి శ్రమకు తగ్గ గుర్తింపివ్వండి. మీ డ్రైవర్‌ని పలక రించండి, మీ పనివాళ్ల కష్టసుఖాలు తెలుసుకోండి. అవేమి మిమ్మల్ని తక్కువ చెయ్యవు, మంచోడిని చేస్తాయి.

నా వృత్తిని నేను దైవంగా భావిస్తాను. ఇదే నాకు,నా కుటుంబానికి నాలుగు మెతుకులు పెట్టింది. నా కొడుకుని చదివించి ఉన్నత స్థాయికి చేరుకునేందుకు మార్గం వేసింది. దేశానికే పెద్దలైన ప్రధాని గారు ముందు నన్ను నిలబెట్టింది. అందుకే ఒక పారిశుద్ధ్య కార్మికుడిగా గర్వపడతాను’ అని ముగించాడు.

సభ అంతా చప్పట్లతో మారుమోగింది. ప్రధానమంత్రి దగ్గరకు వచ్చి నా మిత్రుడు దేశ ప్రజలు నేర్చుకోవలసిన జీవన సత్యాన్ని బోధించాడు అని చెప్పి అప్పారావు భుజం తట్టారు.

అప్పారావు మాట్లాడిన ఆ వీడియో దేశమంతా వైరల్‌ అయ్యింది. తమ దగ్గర పనిచేసే వాళ్లతో ఫోటోలు దిగి సామాజిక మాధ్యమాలలో పెట్టడం మొదలుపెట్టారు. ఆ వీడియో అలా ఎవరో జాన్‌కి షేర్‌ ‌చేశారు.

తన తండ్రి గొప్పతనాన్ని జాన్‌ ‌తెలుసుకున్నాడు. తండ్రి ఆ ప్రసంగాన్ని ఎవరికో కాదు తనలాంటి వారికోసమే చేశాడని అర్థమయింది. తల్లిదండ్రులను వదిలేసి చేసిన పొరపాటుకు వీడియో చూస్తూ మనసులోని క్షమాపణలు చెప్పుకున్నాడు. దేశం గుర్తించి గౌరవిస్తున్న తన తల్లిదండ్రులను కలుసుకోవడం తన తక్షణ కర్తవ్యంగా గ్రహించాడు. అప్పుడే ఆఫీస్‌ ‌గడియారం ఐదు కొట్టింది. కోటు తీసుకుని క్యాబిన్‌ ‌నుంచి బయలుదేరాడు.

క్యాబిన్‌ ‌నుంచి బయటకు రాగానే స్వీపింగ్‌ ‌చేస్తున్న ముక్తినాథ్‌ ‌కనిపించాడు జాన్‌కు. అప్పుడు జాన్‌కు నాలుగు రోజుల క్రితం జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది. ముక్తినాథ్‌ ‌క్యాంటీన్‌ ‌దగ్గర ఎవరితోనో మాట్లాడుతూ తన కూతురికి త్వరలో పెళ్లి అని, ఖర్చులకి డబ్బులు తక్కువ అయ్యాయని, అప్పు చేయాల్సి రావచ్చు అని బాధ పడుతున్నాడు. అది విన్న జాన్‌ ‌ఛీ ఛీ ఎందుకు కంటారో పిల్లల్ని పేదరికంలో ఉండి అని ఛీదరించుకున్నాడు. అది గుర్తుకు వచ్చి సిగ్గుపడ్డాడు. ముక్తినాథ్‌ని ఒకసారి క్యాబిన్‌లోకి రమ్మని మళ్లీ క్యాబిన్‌కి వెళ్ళాడు. చెక్కు మీద రెండు లక్షల రూపాయలు రాసి సంతకం చేశాడు. ‘ముక్తినాథ్‌ ‌నాకు తెలిసినప్పటి నుండి ఆఫీస్‌లో పని చేస్తున్నావు. నీ కూతురు పెళ్లి నా చెల్లిదిగా భావించి నేను ఇస్తున్నాను కాదనకుండా తీసుకో’అని చెక్కు అందజేశాడు.ముక్తినాథ్‌ ‌జాన్‌ ‌కాళ్లు పట్టుకున్నంత పని చేశాడు, జాన్‌ అతనిని పైకి లేపాడు.

ఆఫీసులో ప్రతి ఒక్కరిని మొదటిసారి విష్‌ ‌చేస్తూ, చిరునవ్వుతో పలకరిస్తూ తన కారు వద్దకు చేరుకున్నాడు. అందరూ తిరిగి ఆనందంగా తనని విష్‌ ‌చేస్తుంటే ఎంత హాయిగా ఉంది. ఇక నా తల్లిదండ్రులను రేపటికల్లా కలుసుకుని తనకు దూరమైన ప్రేమని,నవ్వుని సంతోషాన్ని, గౌరవాన్ని, మనశ్శాంతిని కలకాలం నిలుపుకోవాలి అనుకుని బయల్దేరాడు. సీఈవో జాన్‌గా కాదు… అప్పారావు కొడుకు జానయ్యగా

About Author

By editor

Twitter
Instagram