– డా।। గోపరాజు నారాయణరావు

కానీ అప్పటికే గంతన్న చుట్టం పెద్దబ్బి దగ్గర లంచం తీసుకుని భూములు అప్పగించేశాడు బాస్టియన్‌. ఏం ‌మాట్లాడకుండా విసురుగా లోపలికి వెళ్లి కూర్చున్నాడు బాస్టియన్‌. ‌రెండు నిమిషాల తరువాత గంతన్న లోపలికి వెళ్లి బాస్టియన్‌ ‌కాళ్ల దగ్గర కూర్చున్నాడు. ఎటో చూస్తున్నాడు బాస్టియన్‌. ‌రెండు కాళ్లు పట్టుకుని అడిగాడు గంతన్న, ‘‘దొరా! నా భూములు నాకిప్పించండి దొరా! నన్ను అన్నేయం చేయకండి దొరా!’’ ‘‘ఏంట్రా లంజాకొడకా! అవి నీ భూములా? నా కన్నా ఎక్కువ తెలుసా నీకు? అవి ప్రభుత్వం వారి భూములు. నీ భూములని బుకాయిం చడమే కాకుండా నా మీద నువ్వు ఫిర్యాదు చేస్తావా? ఫిర్యాదు! ఏమనుకున్నావురా బాస్టియన్‌ అం‌టే?’’ అంటూ గుండెల మీద తన్నాడు. వెనక్కి పడిపోయాడు గంతన్న. రోడ్డు పని కోసం ఊరి వాళ్లని పంపే బాధ్యత తీసుకోవాలని శరభన్న పాలెంలో మునస బులతో పంచాయతీ పెట్టినప్పుడు నా వల్ల కాదని గంతన్న అంటే బాస్టియన్‌కి తల తీసేసినట్టయింది. ఆ కసి అలా పెరుగుతూనే ఉంది. సమయం కోసం చూస్తున్నాడు బాస్టియన్‌. అది తన అడ్డాలోనే దొరికింది. ‘‘ఒరేయ్‌!’’ ఒక్క ఉదుటన లోపలికి వచ్చాడు మల్లు. అతడి ఉగ్రరూపం చూసి బాస్టియన్‌ ‌కొంచెం కంగు తిన్నాడు. పిళ్లై బేజారెత్తిపోయాడు.

అంత ఆవేశంతో వచ్చినా అన్నగారి పరిస్థితి చూసి జావగారిపోయాడు మల్లు. కింద పడిపోయిన అన్నగారిని పట్టుకున్నాడు. అదే అవకాశంగా మల్లు రెండు చేతులు వెనక్కి విరిచి బయట స్తంభం దగ్గరకి తీసుకుపోయి దానికి ఆనించాడు బాస్టియన్‌.‌పిళ్లై తాడు తెచ్చి కట్టేశాడు. బాస్టియన్‌ ‌వెళ్లి కింద పడిపోయిన గంతన్నని డొక్కలో తన్నాడు. లేవ బోతుంటే గుండెల మీద మళ్లీ తన్నాడు. వెర్రికోపంతో రగిలిపోతున్నాడు బాస్టియన్‌. అక్కడ కనిపించిన రూళ్లకర్ర అందుకుని మల్లు దగ్గరకి వచ్చి మోకాళ్ల మీద రెండు నిమిషాల పాటు బలం కొద్దీ కొట్టాడు. విలవిలలాడిపోయాడు మల్లు. పదో పన్నెండో దెబ్బలు, రంగురంగు మంటూ.. పక్కన చేరి పిళ్లై బూటు కాళ్లతో తన్నుతున్నాడు. అరగంట పాటు ఆ అన్నదమ్ముల మీద విరుచుకుపడి తరువాత మెడ పట్టుకుని బయటకి గెంటేశారు బాస్టియన్‌, ‌పిళ్లై.

**********

కొండమ్మ, సన్యాసమ్మ నేల తడుపుతున్నారు. ఆ ఇద్దరే ఉన్నారక్కడ. ‘ఆ ముష్టి ముండ కొండమ్మని అక్కణ్ణుంచి పంపెయ్‌ ‌రా!’ అని పురమాయించాడు బాస్టియన్‌, ‌కిష్టయ్యని. ముష్టి ముండ ఎవరో వెంటనే అర్థమయింది కిష్టయ్యకి. ‘‘ఏమే కొండమ్మా! ఆ పక్కన నేల తడిపేటోళ్లు తక్కువున్నారు. ఇక్కడ ఇద్దరేం చేస్తారు? నువ్వెల్లు, సన్యాసమ్మ ఇక్కడ తడుపుద్దిలే! నలుగురు పని ఒక్కత్తే చేసిపారేస్తది!’’ అన్నాడు కిష్టయ్య, అక్కడికి వస్తూనే. ‘‘అలాగే కిట్టయ్య!’’ భయపడుతూ చెప్పి, అక్కడ నుంచి బయలుదేరింది కొండమ్మ. ‘‘అక్కడికి నీళ్లు మోసుకుపోవడం ఎందుకే! ఆ బుంగలోయి ఇక్కడే పోయ్యి!’’ అంది సన్యాసమ్మ. గబగబా నీళ్లు చల్లుతోందామె.

పుల్ల కోసం వెతుకుతున్నాడు కిష్టయ్య. నేలని పరీక్షించాలి మరి! ‘‘రెప్పపాటు ఉండవే! ఇది చూసెళ్లు. ఇప్పుడు బేసిను దొర ఊడిపడతాడు.’’ అంది సన్యాసమ్మ. ‘‘నిజం కదా! నేను పోతానే! నేనుండను!’’ అంటూ వెళ్లిపోయింది, భయంగా.. ‘‘ఏరా కిష్టయ్య! వరికూటి బొడ్డు గాడు, ఆడే బౌడ ఊరోడు. రేపైనా ఆవుపాలు తీసుకొస్తాడంటావా?’’ అన్నాడు బాస్టియన్‌. ‌మాటలు అన్నది కిష్టయ్యతోనే అయినా, చూపులు మాత్రం తడిసిన చీర వెనుక ఉన్న సన్యాసమ్మ అవయవాల మీదే ఉన్నాయి. ‘‘ఆవుని తీసుకొచ్చి పాలు పిండి ఇవ్వకపోతే ఏం జరుగుతుందో నిన్నే కదా చూశాడు. తెస్తాడు దొర!’’ అన్నాడు కిష్టయ్య. నిజమే, బొడ్డుగాడిని పిలిపించి మరీ కొట్టాడు బాస్టియన్‌. ‌సన్యాసమ్మ వేగంగా నేల తడుపుతోంది. కిష్టయ్యతో మాట్లాడుతూనే సన్యాసమ్మ తనువంతా పరికిస్తున్నాడు బాస్టియన్‌. అలా చూస్తూనే దక్షిణం వైపు చూశాడు హఠాత్తుగా. గతుక్కుమన్నాడు. అక్కడ రోలర్‌ ‌డ్రైవర్‌ ‌విలియం ఓ చెట్టు కింద నిలబడి నారింజకాయ ఒలుచుకు తింటూ బాస్టియన్‌ ‌నాటకం అంతా చూస్తున్నాడు.

********

‘‘లోతుగడ్డనున్న.’’ రెండు చేతులతో ఎత్తి పట్టు కున్న గునపాన్ని బలంగా నేలలోకి దింపుతూ పెద్ద గొంతుతో అన్నాడు ఉగ్గిరంగి రామన్న. డస్సిపోతున్న నవనాడుల్లోనూ మళ్లీశక్తిని దట్టిస్తున్నట్టుంది ఆ పదం.

‘‘వీరభద్రుడా!’’ చిట్రాళ్లగొప్పు పొలిమేరల్లో రోడ్డు పనిలో ఉన్న దాదాపు నూట నలభైమంది కూలీలు అన్నారు ముక్తకంఠంతో. లోయంతా ప్రతిధ్వనించింది ఆ సామూహిక గానంతో. కొండలు కూడా వంత పాడినట్టు ఖంగుమంది ఆ ప్రాంతం. వివశులై పోతారు అడవిబిడ్డలు ఆటన్నా, పాటన్నా. అక్కడ బాస్టియన్‌ ‌లేడు. బాస్టియన్‌ ‌లేకపోతే కిష్టయ్య, పిళ్లై కూడా పెద్దగా పట్టించుకోరు. అయినా ఇప్పుడు ఆ పాట వాళ్ల గొంతుకులలో సహజంగా పలకడం లేదు.

ఈ కష్టం నుంచి నీ బిడ్డలని కాపాడకుండా ఏమిటీ తాత్సారం? అన్న ఆక్రోశం ఆ లయకు తోడైన ట్టుంది. ఆ గునపాన్నే పైకి లాగి మళ్లీ పోటు వేయ డానికి ఎత్తి అన్నాడు రామన్న, ‘‘లంబసింగినున్న….’’ ‘‘బాలరాకాసమ్మ…..’’ అన్నాయి జనం గొంతుకలు. విశాఖమన్యంలో వినిపించే కొండరెడ్ల పాట. మళ్లీ అందుకున్నాడు రామన్న పాట. రెండో పదం జనమంతా కలసి అంటున్నారు.

‘‘లోతుగెడ్డనున్న…..’’ – ‘‘వీరభద్రుడా……!’’

‘‘లంబసింగినున్న….’’ – ‘‘బాలరాకాసమ్మ…..’’

‘‘బోడికొండనున్న…’’ – ‘‘శాంబరమ్మ….’’

‘‘మాడుగులనున్న….’’ – ‘‘మత్స్యకంబేరమ్మ…..’’

‘‘కొండకంబేరున్న…’’ – ‘‘నీలకంఠుడా!’’

‘‘దమ్మము సావడి…’’ – ‘‘ మనము చేరవా……’’

‘‘ఎటు వెళ్లినారో….’’ – ‘‘పంచపాండగూలు!’’

పాట అర్థం కాకున్నా, అందులోని లయనీ, ఆ లయకు తగ్గట్టు వేగంగా కదులుతున్న కొండజనాన్ని తదేకంగా గమనిస్తున్నాడు విలియం. కొండజనం పనిలో వేగం అతడిని విస్తుపోయేటట్టు చేస్తోంది. పెద్దపెద్ద యంత్రాలలో లయాత్మకంగా కదిలే భాగాలు గుర్తుకు వస్తున్నాయి. ఈ దశ పని పూర్తయ్యాకే రోలర్‌ ఎక్కిస్తాడు విలియం. ఎక్కడి నుంచో మరి, అప్పుడే వచ్చాడు బాస్టియన్‌. అతడు కంటపడగానే కొండ జనం గొంతులో ఊపు ఇంకా తగ్గిపోయింది. అడు గులో అడుగు వేస్తూ నడుస్తోంది బాస్టియన్‌ ‌గుర్రం- నిర్మిస్తున్న రోడ్డుకు ఒక పక్కగా. చిట్రాళ్లగొప్పు ఊరు దగ్గర నుంచి ఫర్లాంగు మేర, అంటే పది గొలుసుల దూరం వరకు జరుగుతున్న రోడ్డు పనిని చూస్తున్నాడు బాస్టియన్‌ ‌గుర్రం మీద నుంచే. ఎవరో తరుముకు వస్తున్నట్టే ఎవరి పని వారు వేగంగా చేస్తున్నారు వాళ్లంతా. అదే నచ్చదు బాస్టియన్‌కి. ఈ వేగం చాలదు. శరవేగంగా సాగాలంటాడు. ఈ 1922 సంవత్సరాంతానికల్లా మన్యంలో రోడ్లన్నీ సిద్ధమై పోవాలి. శరవేగం, శరవేగం అంటూ పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నాడు. అందుకే ఆ బక్క కొండవాళ్ల అంత వేగంగా కదులుతున్నా తృప్తి పడలేక పోతున్నాడు. అసలు పని జరుగుతున్నట్టే ఉండదు అతని కంటికి. శారీరక శ్రమనే కాదు, గాయాల సలుపుని కూడా ఆ పాట కొద్దిగా అయినా మరిపిం పచేస్తోంది. అందుకే పది రెట్ల శక్తిని ఇస్తోంది. కొందరు తట్టలతో తెచ్చి ఎర్ర కంకర చిమ్ముతుంటే, ఆ కంకర మీద కడవలతో, బుంగలతో నీళ్లు తెచ్చి అరచేతిని అడ్డం పెట్టి లాఘవంగా తడుపుతున్నారు కొందరు. మరుక్షణంలో దిమ్మెసాలు వచ్చి నర్తిస్తున్నాయి. అవే పదాలు మళ్లీ మళ్లీ అంటున్నారు వాళ్లు. ‘‘బోడికొండనున్న… ’’-‘‘శంబరమ్మ నీవు!’’

‘‘మాడుగులనున్న…… – ‘‘మత్స్యకంబేరమ్మ!’’ ఒకచోట నిలిపాడు గుర్రాన్ని బాస్టియన్‌. ‌కాస్త పరిశీలనగా చూసిన తరువాత అర్థమైంది అతడికి. వంకర గునపాలతో చిన్నచిన్న రాళ్లను పెళ్లగించే పని నలుగురైదుగురే చేస్తున్నారు. కొండవాళ్లు వంకర గునపాలని పిలుచుకునే క్రౌబార్లు ఇక్కడి పని కోసమే ఇరవై వరకు తెప్పించాడు బాస్టియన్‌. ఒక కొస ఒంపు తిరిగిన గద్ద ముక్కులా ఉంటుంది. రెండో వైపు అర్థచంద్రాకారపు బద్ద ఉంటుంది. పని వేగంగా జరుగుతున్నందువల్ల ఒక్కొక్కదాని కొసలు విరిగి పోతూ వచ్చాయి. రెండు రోజుల క్రితమే పాడైన క్రౌబార్లని నర్సీపట్నం పట్టుకువెళ్లి మరమ్మతు చేయించుకుని రమ్మని ఎదురుగానే కనిపించిన ఒక యువకుడిని ఆదేశించాడు బాస్టియన్‌. ఈ ‌పని త్వరగా పూర్తి చేయించమని కిష్టయ్యని కూడా పురమాయించాడు. ఆ గిరిజనుడి పేరు బూతా ఎర్రేసు. ఊరు మర్రిపాలెం. చెట్లు కొట్టడం, నేలను కొద్దిగా చదును చేయడం, అందుకు నేలలోని చిన్నా పెద్దా రాళ్లని తొలగించడం, అప్పుడు అరడుగు మేర కంకర పోయడం, ఆపై మట్టి పొర వేయడం, చివరికి మళ్లీ ఎర్ర కంకర పొర వేసి, అప్పుడు నీళ్లు చల్లి దిమ్మెసా చేయడం రోడ్డు పనిలో కనిపిస్తాయి. కానీ నేలలో రాళ్లు తీయకుండా రోడ్డు వేస్తే ఎగుడు దిగుళ్లు కనిపిస్తాయి. ఇంజనీరు వంక పెడతాడు. ‘‘కిష్టయ్యా!’’ గట్టిగా అరిచాడు బాస్టియన్‌, ‌గుర్రం మీద నుంచే. ఏ మూల నుంచో వచ్చి చేతులు కట్టుకుని గుర్రం పక్కగా నిలబడ్డాడు కిష్టయ్య. ‘‘ఏరా! క్రౌబార్లు ఇంకలేవా, మనకాడ?’’ ‘‘లేవు దొర. ఇవే ఉన్నాయి. మిగిల్నియ్యి పాడైయ్యాయి కదా దొర!’’ అన్నాడు కిష్టయ్య. ‘‘రెండ్రోజులైంది చెప్పి, ఇంకా బాగుచేయించలేదా? ఆడెవడికో చెప్పాం…. మర్రి పాలెం వాడెవడో’’ పేరు గుర్తుకు రాలేదు బాస్టియన్‌కి. గుర్తుచేశాడు కిష్టయ్య, ‘‘ఎర్రేసు దొర, బూతా ఎర్రేసు.’’ ‘‘పిలు, ఎదవని! ’’ పళ్లు నూరుతూ అరిచాడు బాస్టియన్‌. ‌చుట్టూ చూసి ఓ చోట గొప్పు తవ్వుతున్న ఎర్రేసుని గమనించి తప్పట్లు కొట్టి, చేతులు ఊపి మొత్తానికి ఇటు రమ్మని సైగ చేశాడు కిష్టయ్య. పాట వేగం జోరు పూర్తిగా తగ్గిపోయింది. ఒకరకమైన నిశ్శబ్దం ఆవరించింది. ఏదో జరగబోతోంది! ప్రతి అడవిబిడ్డ గుండె కీడును శంకిస్తూనే ఉంది. చేతిలో పలుగుని అక్కడే నేలకు గుచ్చి, తలకు చుట్టుకున్న తుండుగుడ్డ విప్పుకుని మెడలో దండలా వేసుకుంటూ గబగబా వచ్చాడు ఎర్రేసు భయపడుతూనే. పాతి కేళ్లుంటాయి. కొంచెం బలంగానే ఉన్నాడు. కానీ డస్సిపోయి కనిపిస్తున్నాడు. అతని రెప్పల చివరి వెంట్రుకల మీద కూడా ఎర్రటి కంకర దుమ్ము కమ్ముకుని ఉంది. పెరిగిన గడ్డం, దాని నిండా కూడా దుమ్ము. దీనితో మరీ నీరసంగా కనిపిస్తున్నాడు.

‘‘ఏరా లంజా కొడకా! వంకర గునపాలు ఎందుకు పట్టుకెళ్లలేదురా? ఎవరి చంక నాకు తున్నావ్‌?’’ ఉరిమాడు బాస్టి యన్‌. ‘‘‌పొద్దున్న కూడా అడిగాను దొర. రేప్పోవచ్చులే అన్నాడు కిష్టయ్య’’ విషయం చెప్పాడు తడబడుతూ ఎర్రేసు. అప్పటికే వణికిపోతున్నాడతడు. ‘‘ఏరా, నన్నెప్పుడడిగావురా? దొర చెప్పాక, నన్ను అడగడం దేనికిరా? చెప్పు తీసుక్కొడతాను నాయాలా!’’ అంటూ అడ్డంగా బొంకాడు కిష్టయ్య.

ఎర్రేసు చెప్పిన వెంటనే వంకర గునపాలని మరమ్మతు చేయించుకు రాకపోవడంలో గొప్ప రాజ్య ధిక్కారం కనిపించింది బాస్టియన్‌కి. సర్రున గుర్రం దిగి, ఎర్రేసు మెడలోని తుండుగుడ్డ రెండు కొసలను తటాల్న అందుకుని, మళ్లీ అంతే వేగంతో గుర్రం ఎక్కాడు బాస్టియన్‌. ‌బలంగా లాగడంతో కెవ్వున అరిచాడు ఎర్రేసు. అప్పటికే అతడి పీక గుర్రం మెడకు తాసుకు పోయింది. ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. ‘‘ఎక్కడు న్నాయిరా ఆ క్రౌబార్లు?’’ గట్టిగా అడిగాడు కిష్టయ్యని బాస్టియన్‌. ఈ ‌విషయాన్ని ఇంత తీవ్రంగా పరిగణిస్తాడన్న సంగతి, ఇది ఇంతకు దారి తీస్తుందన్న సంగతి కిష్టయ్య కూడా ఊహించలేదు. వాడు కూడా బెంబేలెత్తి పోయాడు. తడబడిపోతూ అన్నాడు. ‘‘అక్కడే దొర… మన సామాన్లన్నీ పెడతాం కదా… ఆ మామిడి చెట్టు కిందే… ఉన్నాయి.’’ అందరిలోనూ ఆవేశం పొంగింది. పనులు వదిలేసి గబగబా గుర్రం దగ్గరకు వచ్చి, చుట్టూ మూగారు. ‘‘దొరా! ఏంటిది? సంపేత్తారా మనుసుల్ని?’’ గట్టిగా అరిచిందా యువతి మొదట. కోపంతో ఒక పక్క నిలువెల్లా ఒణికిపోతూనే, ఇంకోపక్క భీతితో ఆమె పెదవులు, ఇతర అవయ వాలు ఆవేశంతో కదిలిపోతున్నాయి. ఆమెను కిష్టయ్య ఏదో అనబోయాడు. అప్పుడే గిరిజనులంతా ఒక్కసారి గొంతెత్తారు. ‘‘దొరా! ఏంటీ అన్నాయం? ఆడి తప్పేంటి? వదిలెయ్‌ ‌దొర. ముందు ఆణ్ణి ఒదులు… సచ్చిపోతాడు! ’’ తలొక మాటగా అన్నారు. అవేం పట్టించుకోకుండా ఉరుముతున్నట్టు అన్నాడు బాస్టి యన్‌, ‘‘ఎవత్తిరిదే!’’ కిష్టయ్య చెప్పాడు, ‘‘ఆడిపెళ్లాం దొర!’’ కసికొద్ది గుర్రం డొక్కలో తన్నాడు బాస్టియన్‌. ఒక్క గెంతు గెంతి పరుగు లంఘించుకుంది గుర్రం. ఆ ఊపుకి నేల మీద పడబోయాడు యెర్రేసు. గుర్రం జీనులో ఏదో తోలు పట్టీని గట్టిగా పట్టుకుని నిల దొక్కుకున్నాడు. తట్టలూ, కుండలూ, గునపాలూ పెట్టుకునే ఆ మామిడిచెట్టు అక్కడి దాదాపు వంద మీటర్ల దూరంలో ఉంది. చిరతపులి లేగదూడను లాక్కుపోతున్నట్టు పరమ కర్కశంగా లాక్కుపోతున్నాడు ఎర్రేసుని బాస్టియన్‌.

‌గుండెలు అవిసిపోయాయి కొండజనానికి. అది చూడలేక, కెవ్వున అరిచి గుర్రాన్ని అందుకోవడానికి అన్నట్టు వెనక పరుగు తీసింది ఎర్రేసు పెళ్లాం మొదట. ఆమె వెనకే పరుగుతీశారు, కూలీలందరూ. ఆ ప్రాంతంలోనే అక్కడ క్కడ ఆడుకుంటున్న పిల్లలు ఒక్కసారి ఏదో క్రూర జంతువుని దగ్గరగా చూసినట్టు భయంగా ఏడుపు మొదలుపెట్టారు ఇదంతా చూసి. ఆ చోటంతా ఏడుపులతో, పెడబొబ్బలతో, అరుపు లతో నిండిపోయింది. ‘‘దొరా… ఆపు దొరా! తప్పు కాయి దొరా! అన్నాయం దొరా! అయ్యో! గుర్రం తొక్కేస్తంది.. పడిపోతన్నడు.. కిందపడిపోతన్నాడు.. కిష్టయ్యా… నువ్వేనా చెప్పు దొరకి… ఆడు సచ్చి పోతాడు… ఇదేమన్నాయం… ఆపు… దొరా!’’ తలో మాట అంటున్నారు. వదిలిపెట్టడం లేదు బాస్టియన్‌. ఎ‌ర్రేసు గుర్రంతో సమంగా కదలలేకపోతున్నాడు. పాదాలు కొట్టుకుపోతున్నాయి. గుర్రం గిట్టల కింద తన పాదాలు పడి నలిగిపోకుండా జాగ్రత్త పడదామని కాస్త పక్కకు అడుగు వేసినా మెడ వంగిపోయి, మెదడులో చుక్కలు కనిపిస్తున్నాయి. ‘‘సచ్చిపోయాడు దేవుడోయ్‌! ‌దొరా దణ్ణం పెడతాను ఒదులు దొరా!’’ అరుస్తో పరుగు తీస్తోంది ఎర్రేసు భార్య. వాళ్ల ఆక్రంద నలు వింటున్న కొద్దీ పైశాచికానందం పెరిగి పోతోంది బాస్టియన్‌లో. గుర్రాన్ని చర్నాకోలతో మళ్లీ బాదాడు. ఇంకాస్త వేగం అందుకుంది. ‘‘ఇదన్నాయం.. ఇదన్నాయం. ఆడు సచ్చిపోతే మేం ఊరుకోం… ఇదే చెప్పడం…’’ పెద్ద గొంతుతో అన్నాడు ఓ యువకుడు. గుర్రం మామిడిచెట్టు దగ్గరకొచ్చి ఆగింది. తటాల్న వదిలాడు తుండుగుడ్డని బాస్టియన్‌. ఒక్కసారిగా కిందపడిపోయి దొర్లాడు ఎర్రేసు. రెండు పాదాలు బాగా కొట్టుకుపోయి రక్తం ఉబికి, ఎర్ర కంకర దుమ్ముతో కలుస్తోంది. బాధతో ముఖం కందగడ్డలా మారిపోయింది. భయంతో పొగిలి పొగిలి వస్తోంది దుఃఖం. ‘‘తీసుకెళ్లి బాగు చేయించు. ఎలా వెళతావో.. ఇక్కడున్నట్టుగా రావాలి. సాయంత్రానికి కనిపించాలి!’’ గట్టిగా అరిచాడు బాస్టియన్‌ ‌క్రౌబార్లని చూపుడు వేలితో చూపిస్తూ. అప్పటికే నాలుగైదు అడుగుల దూరంలో వచ్చి నిలబడున్నారు అడవి బిడ్డలు. అందరిలోనూ ఆవేశం. అందరికంటే ముందే కనిపిస్తోంది ఎర్రేసు భార్య.

చటుక్కున గుర్రం దిగి, వడివడిగా నడిచి వెళ్లి ఆమె చెంప మీద బలంగా కొట్టాడు బాస్టియన్‌. అలాగే చతికిల పడిపోయిందామె. ‘‘ఏరా…. ఏంట్రా… దండెత్తుకొచ్చారు? ఫితూరీయా? ఫితూరీ చేస్తారా? చెప్పండ్రా! రండి, తిరగబడండి! సిపాయిల తిరుగుబాటేంట్రా ఇది? ఏంటీ… వెంటపడి పరిగెట్టు కొచ్చారు? అన్నాయమా? ఊరుకోరా?! ఏం చేస్తార్రా! ఏం చేస్తార్రా…’’ అంటూ చర్నాకోల తీసుకుని గొడ్లను బాదినట్టు బాదడం మొదలు పెట్టాడు బాస్టియన్‌, ‌బండబూతులు తిడుతూ. ఒక మృగంలా మారి పోయాడతడు. హడలిపోయారు గిరిజనులు. ఓ కట్టె తీసుకుని బాస్టియన్‌కు తోడయ్యాడు కిష్టయ్య. మళ్లీ వంద గజాల అవతల పని జరుగుతున్న చోటు వరకు కొడుతూ తీసుకువెళ్లారు ఆ ఇద్దరు. ఇక్కడ ఎర్రేసు శక్తంతా కూడదీసుకుని లేస్తున్నాడు. కాళ్లు పని చేయడం లేదేమోనని అనిపించింది. తిమ్మిరెక్కిపోయి నట్టయింది. రెండు నిమిషాలు పట్టింది నిలబడ డానికి. కుంటుతూ వెళ్లాడు. ఒక్కొక్క క్రౌబార్‌నీ తీసి కట్ట కట్టడానికి ఉద్యుక్తుడవుతున్నాడు, మెడ బాధనూ, పాదాల మంటనూ లెక్క చేయకుండా. విలియం, అతడి సహాయకులు తమాషా చూస్తున్నారు.

(ఇంకా ఉంది)

About Author

By editor

Twitter
Instagram