– డా।। గోపరాజు నారాయణరావు

నెగళ్లు మండుతున్నాయి. దూరంగా ఎక్కడో నక్క ఊళ. అది కూడా శ్రద్ధగా విన్నాడు రామన్న. రంప జమిందారీ వారసత్వం గాధలో మిగిలిన భాగం చెబుతున్నాడు రామన్న. ఏది జరగకూడదని మునసబులూ, కొండోళ్లూ కోరుకున్నారో అదే జరిగింది. ఒకసారి కాదు రెండు పర్యాయాలు కూడా, వద్దనుకున్నదే జరిగింది. కంపెనీ అధికారులు జగ్గా అమ్మనే తండ్రికి వారసురాలిగా మన్సబ్‌ ‌దార్ని చేశారు. మింగలేక కక్కలేక ఉండిపోయారు మునసబులూ, ప్రజలూ. ఓ ఆడదానికి ఒంగి ఒంగి దణ్ణాలు  పెట్టడం ఎలా? అదే ప్రశ్న. ‘కొత్త మన్సబ్‌ ‌దారుని కూర్చోపెట్టేటప్పుడు మమ్మల్ని అడిగే పని లేదా ! కంపెనీ నిర్ణయాన్ని అంగీకరించలేం’ అంటూ మెలిక పెట్టారు, తమ అసమ్మతి ఆ పద్ధతిలో వ్యక్తం చేస్తూ. కానీ ఈ అసమ్మతిని గట్టిగా వినిపిస్తే, ఒత్తిడి చేస్తే ఆమె తమ్ముడుని మన్సబీదారుని చేస్తారని శంక. ఇంకో ఎత్తు కూడా వేశారు. పోనీ పెళ్లయినా చేసుకోమని జగ్గా అమ్మని అంతా కోరారు. అల్లుడిని రంగం మీదకు తేవచ్చుననీ, ఈమెను పరదా వెనక్కి నెట్టేయవచ్చు ననీ వారి ఆలోచన. ఈ ఒత్తిడి భరించలేక ఆమె తన తమ్ముడికి అనుకూలంగా మన్సబ్‌దారి పదవి నుంచి తప్పుకుంటు న్నట్టు ప్రకటించింది. మహిళకు ఒంగి ఒంగి సలాములు చేసే పని తప్పిందనుకుంటే, ఇప్పుడు ఉంపుడుగత్తె కొడుకును సింహాసనం మీద కూర్చో బెట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తున్నది. ఒప్పుకో లేదు ప్రజలు. ఇంకో ఎత్తు వేశారు. శ్రీజగ్గా అవివాహిత. అదే వాళ్లకి గొప్ప ఆయుధంగా మారిపోయింది. ఆమె మంచిది కాదని ప్రచారం మొదలైంది. మునసబులంతా కలసి అక్కాతమ్ముళ్లని రంపదేశం నుంచి బహిష్కరించారు. రాంభూపతి కంపెనీ అధికారులకి ఫిర్యాదు చేశాడు. పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్టు కంపెనీ జమిందారీని తమ చేతుల్లోకి తీసుకుని పిల్ల రాంభూపతి మైనార్టీ తీరే వరకు జాగ్రత్తగా కాపాడతానంది. ఈ నిర్ణయమే నాలుగేళ్ల తరువాత చినికిచినికి గాలివానై ఫితూరీ దాకా వెళ్లింది. రంపదేశంలో కలెక్టర్‌ ‌దొర పెండర్‌ఝా పాలన మొదలయింది. ఇలాంటి పాలన గురించి మన్యం ఎప్పుడూ వినలేదు. చూడలేదు. తమని తెల్లోడు పాలించడం అసహ్యంగా అనిపించింది. ఎనిమిదేళ్లు రంప విభాగం అతలాకుతలమైపోయింది. ముఠా దారులే అల్లర్లు చేయించారు. మన్సబ్‌దారులు, మునసబులు వర్గాలుగా చీలిపోయారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మన్సబ్‌దారుల ఇళ్ల మీద దాడులు జరిగాయి. ఈ దాడులకు నాయకత్వం వహించినవాడు పాలెపు పెద్దిరెడ్డి. ఇతడు బగత. ఇతడిదొక బృందం. ఎందుకో హఠాత్తుగా అల్లర్లు సద్దుమణిగాయి. ఈ నిశ్శబ్దాన్ని పిల్ల రాంభూపతి నియామకం గురించి తీసుకున్న నిర్ణయానికి ఆమోదమనే కంపెనీ పొరబడింది. చివరికి ఎవరి మాటనీ ఖాతరు చేయకుండా ఈస్టిండియా కంపెనీ పిల్ల రాంభూపతిదేవ్‌నే జమిందారుగా ప్రకటించింది. మళ్లీ భగ్గుమంది రంపదేశం. ఇంకొందరు మన్సబ్‌దారుల, మునసబులు తిరుగుబాటులో చేరారు. వీళ్లందరినీ కుంఫిణీ  ప్రభుత్వం కొండల నుంచి బహిష్కరించింది.అయినా అల్లర్లు సాగుతూనే ఉన్నాయి. కొత్త జమిందారు కొండ కింద గ్రామాలలో ఉంటూ చుట్టం చూపుగా ఎప్పుడో ఒకసారి రంప వెళ్లేవాడు. విపరీతమైన డబ్బు ఆశ. ఏదో ఒక పేరుతో ప్రజలని డబ్బు కోసం వేధించడమే అతడి వ్యాపకం.

***********

తన సహాయకుడు చెప్పిన మాటలు మరింత కలవర పెట్టాయి డాక్టర్‌ ‌మూర్తిని. చిట్రాళ్ల గొప్పులో ఏం జరుగుతోందో చూసొచ్చాడతడు. పని జరుగు తున్న చోటు దరిదాపులకి వెళ్లడానికి కూడా భయం వేసిందట. గప్పీ దొర బంగ్లా దగ్గరకే కాదు, రోడ్డు పని దగ్గరకి వెళ్లడానికి కూడా ఎవరూ ఒప్పుకోరట. ‘‘మనల్ని డిప్యూటీ తాసీ•ల్దారు దొర పని కాడికే రానీడు దొరా! ఇక పరీక్షలేం చేస్తాం? తమరు సర్కారోళ్లు పంపిన డాట్రుగారు కాబట్టి ఇక తప్పక రానిచ్చినా, ఒక్క కొండోడు కూడా మీతో మాట్లాడే సాహసం చెయ్యడు బాబు! అలాగుంది అక్కడ పరిస్థితి.’’ అన్నాడతడు. ‘‘ఎందుకు ? భయమేనా?’’ అన్నారు డాక్టర్‌ ‌మూర్తి. ‘‘భయమే కదా దొరా! అదికాక మరేం ఉంటది! తమరు ఇటు తిరుగుతారో లేదో, మీతో మాట్లాడిన ఆ కొండోళ్లని బాస్టీను దొర బతనిస్తాడా బాబయ్యా! ప్రాణాలు తీసీకుండా వదుల్తాడా !’’ అన్నాడు అతడు. ‘‘అదీ నిజమేలే!’’ అన్నారు డాక్టర్‌ ‌మూర్తి. తమ డాక్టర్‌ ‌దొర అక్కడికి వెళ్లే ఆలోచన నుంచి ఇప్పటికి వెనక్కి తగ్గినందుకు అతడు చాలా సంతోషించాడు. కర్తవ్యాన్ని విస్మరిస్తున్నానన్న న్యూనతా భావం డాక్టర్‌ ‌మూర్తిలో మరింత పెరిగింది. ఈ నిస్సహాయతకు మూలమేమిటో అర్థం కావడం లేదు. తెల్లవాళ్లే కాదు, వాళ్ల కింద పని చేస్తున్న నల్లవాళ్లు కూడా ప్రజలని తెల్లవాళ్లలాగే హింస పెడుతున్నారు.

***********

గూడెం కొత్తవీధి సంత.

‘‘ఏరా మునసబు! ఈళ్ల పేర్లేంటి?’’ అడిగాడు బాస్టియన్‌.

అతడు చెప్పాడు, ఆ ముగ్గురి పేర్లు ‘‘ఈడి పేరు నేతి బోడేసు. ఆడెనకాల ఉన్నోళ్లు మంగడు, సోముడు దొరా!’’

‘‘ఎక్కణ్ణించి కొట్టుకాచ్చా నారింజపళ్లు? గత్తం (ఎరువు) ఏసినట్టు ఏపుగా ఉన్నాయి!’’ వ్యంగ్యంగా అడిగాడు బాస్టియన్‌.

‌కొండవాళ్లని భయపెట్టకపోతే లాభం లేదు. తుపాకీ గుండుకు దొరక్కుండా పారిపోతున్నారు. డౌనూరు సంతకి రావడం మానేశారు. పక్కనే రోడ్డు పని. రేపన్నరోజు పని మొదలుపెడితే ఎలా? అందుకే గూడెం కొత్తవీధి సంతకి వచ్చాడు బాస్టియన్‌. ‌మన్య ప్రజలని బెదరగొట్టాలి. మాట వినేటట్టు చేయాలి. మునసబు ఇంటి ఎదురుగానే సంత. అరుగు మీద నులక మంచం వేయించుకుని కూర్చుని ఉన్నాడు. పక్కన పిళ్లై  మస్తరు పట్టుకుని ఉన్నాడు. చిట్రాళ్లగొప్పు రోడ్డు పని దగ్గర కిష్టయ్యని పెట్టి వచ్చారు. ఈ ‘‘ఏరా మునసబు! ఈ కొండోళ్లు మన్యం సొమ్ముని ఇలా అడ్డంగా మేసేస్తన్నారేంటి ? చట్టాలున్నాయి. మునసబులు కూడా సర్కారోళ్లే కదా! ఆ మాత్రం చెప్పలేరా?’’ ‘‘పళ్లు ఆళ్ల తోటలోయేనంట దొర!’’ మునసబులని కూడా సర్కారులో భాగమని చెప్పినందుకు సంతోష పడుతూనే, నీళ్లు నములు తున్నట్టు చెప్పాడు భయం భయంగా మునసబు.

మూడు గంపల్లో నిగనిగలాడిపోతూ నోరు ఊరిస్తున్నాయి ముద్దబంతి రంగు నారింజపళ్లు. ‘‘నువ్వు నోరు మూస్తావా ? పోలీస్టేషన్కి నువ్వు కూడా వస్తావా ? ’’అన్నాడు బాస్టియన్‌. ‘‘‌మా తోటలోయే దొర!’’ బోడేసు అన్నాడు భయం భ••యంగా. ‘‘తోళ్లు తీయించీగల్ను ఎదవా!’’ గట్టిగా అరిచాడు బాస్టియన్‌. ‘ఏరా మునసబు ! ఈళ్లని పోలీసు స్టేషన్కి తీసుకు పోమ్మంటావా ? ఇక్కడే ఏదైనా మాట్లాడతావా?’’ అన్నాడు లౌక్యంగా. మునసబుకి అర్థమైంది. ‘‘పేదోళ్లం కనికరించాలి దొరలు.’’ చేతులు నలుపు కుంటూ అన్నాడు మునసబు. ‘‘రెండ్రూపాయలు జరిమానా కట్టమను ఎదవల్ని!’’ అన్నాడు మునసబు. గుండె జారిపోయింది ఆ ఇద్దరికి. వాళ్ల బొడ్డున ఉన్న రూపాయి పావలా, తన రొంటిన ఉన్న ముప్పావలా తీసి బాస్టియన్‌ ‌చేతిలో పెట్టాడు మునసబు. ‘‘మునసబు ! ఈ పళ్లు పోలీసు స్టేషన్లో అప్పగించాలి. ఏదైనా సంచిలో ఏసి అక్కడే ఉంది మన గుర్రం. దాని మీద ఎక్కించు!’’ ఆదేశించాడు బాస్టియన్‌.. ‌పిళ్లై•• గుంభనంగా నవ్వుకున్నాడు.

***********

‘‘కారం తమ్మనదొర పేరు మన్నెం మర్సిపో కూడదు!’’ అంటూ మొదలుపెట్టాడు రామన్న.

మూడో రాత్రి కూడా రంప కథే చెప్పాడు కారం తమ్మనదొర పేరు వినగానే వాళ్ల నిద్రమత్తంతా తేలిపోయింది. పిల్ల జమిందారు తీరుకి గొడవలు మరింతగా పెరిగిపోయాయి. పెద్దిరెడ్డి తిరుగు బాటుకు తోడు మరో తిరుగుబాటు మొదలైంది. దీని నాయకుడే కారం తమ్మనదొర. తమ్మనదొర రంపదేశంలోనే బండపల్లి ముఠాదారు.

కోయ కులం. ముప్పయ్‌ ‌మందితో దండుని కూడేసి తిరుగుబాటు లేవదీశాడు. రంపదేశంలో కుంఫి•ణీ కొమ్ము కాస్తున్న మన్సబ్‌దార్లని తరిమి కొట్టడానికి తిరుగుబాట్లు చేస్తున్న పెద్దిరెడ్డి బృందం కూడా తమ్మనదొరతో కలసిపోయింది. ఇద్దరూ సాహసులే. పోలీసుల మీద కలిసి దాడులు చేసేవారు. అప్పుడే తమ్మనదొర హఠాత్తుగా మొత్తం మన్యానికి వీరాధివీరునిగా అవతరించాడు. అల్లర్లను అణచడానికి రంప అడవులలోకి వచ్చిన పోలీసు బృందం మీద తమ్మనదొర బృందం చాటు నుంచి దాడి చేసి దిమ్మెరపోయేటట్టు చేసింది. మన్యప్రజలు విస్తుపోయారు ఆ సాహసానికి. నట్టడవిలో జరిగిన ఈ దాడిలో ఏమైందో తెలుసా? ఎప్పుడూ ఎవరూ విన్లేదు మరి! పన్నెండు మంది పోలీసులు చచ్చి పోయారు. ఇంకో ఇరవై మందికి దెబ్బలు తగిలాయి. వాళ్ల హాహాకారాలు ఆ కొండలలో ప్రతిధ్వనించాయి. ఐదేళ్లు… పోలీసులని దాడులతో ఉక్కిరిబిక్కిరి చేసేశాడు తమ్మనదొర.

కానీ ఒక్కసారిగా ఎదురుదెబ్బ తగిలింది. పెద్దిరెడ్డిని ఎవరో మోసం చేశారు. దొరికిపోయేటట్టు చేశారు. పాపం, కోర్టు పంచాయితీకి వెళ్లకుండానే రాజమండ్రి జైల్లో చనిపోయాడు. తరువాత తమ్మనదొరను పట్టించిన వారికి బహుమానం ప్రకటించింది కంపెనీ ప్రభుత్వం. దీనితో ఇతడు జడ్డంగి పారిపోయాడు. ఇది రంపకీ, గూడానికీ మధ్య గ్రామం. బండపల్లి ముఠాని పోలీసులు జప్తు చేశారు. పెద్దిరెడ్డి చనిపోయాడు. అయినా అల్లర్లు ఆగలేదు. ఎవరు చేస్త్తున్నట్టు? తండ్రిని మోసగించిన వాళ్ల అంతు తేలుస్తామంటూ పెద్దిరెడ్డి ముగ్గురు కొడుకులు, మరో ముప్పయ్‌ ‌మందిని కూడగట్టి అల్లర్లు మొదలు పెట్టారు. అదీ సంగతి. జప్తుచేసిన బండపల్లి ముఠాకి నలభయ్‌ ఏళ్ల తరువాత మళ్లీ కారం తమ్మనదొర కొడుకునే వృద్ధాప్యంలో తీసుకొచ్చి ముఠాదారుని చేశారు తెల్లోళ్లు. నలభయ్‌ ఏళ్లకి తమ్మనదొర కొడుకు ఎందుకు గుర్తుకొచ్చాడు? గుర్తొచ్చేటట్టు చేసినవాళ్లు ఇద్దరు. వాళ్లే కారం తమ్మనదొర. ఇంకొకరు ద్వారబంధాల చంద్రయ్య లేదా చంద్రారెడ్డి.

ఆ ఇద్దరు తమ్మనదొర కొడుకు ముఠాదారు కావడానికి ఒక్క సంవత్సరం ముందే రంప కొండలలో పోలీసుల మీద దండెత్తారు.

ఈ తమ్మనదొర కూడా కోయ నాయకుడే. ఈయన ఇంకో తమ్మనదొర. పాత తమ్మనదొరది బండపల్లి ముఠా. ఈ తమ్మనదొరది చోడవరం దగ్గర ఉన్న భూపతిపాలెం. ఇతడు రంగంలోకి దిగాక తెల్ల ప్రభుత్వానికి తలొగ్గి ఏం సాయం చేసినా సరే, ఆ గ్రామం బూడిద చేసేవాడు. ప్రభుత్వానికి అనుకూ లంగా ఉన్న ప్రతి మునసబు చేతులు కట్టేసి లాక్కుపోయారు. పట్టుకోవడానికి పోలీసులు వస్తుంటే ఆ సమాచారం అంతా తిరుగుబాటుదార్లకు ఎప్పటికప్పుడు చేరిపోయేది.

నిన్నటి దాకా వేసిన రోడ్డుని రోలర్‌తో చదును చేస్తున్నాడు విలియం. అలికిన నేల ఆరినట్టే ఉంది రోలర్‌ ‌చదును చేశాక. అక్కడ రోలర్‌ ‌తిరుగుతూ ఉంటే, కొంచెం ముందు రోడ్డు వెయ్యవలసిన ఎగుడు దిగుడు నేలని కొందరి చేత చదును చేయిస్తున్నాడు బాస్టియన్‌. ‌చదును చేసిన నేల మీద ఆడవాళ్లు గంపల్లో తెచ్చిన ఎర్రకంకర పోస్తున్నారు. తరువాత ఎర్రకంకర మీద నీళ్లు చల్లుతున్నారు. ఇంకొక చోట దిమ్మెసా జరుగుతోంది. కూలీలు వాళ్ల పని వాళ్లు చేస్తున్నారు. ఆ చెట్టు కింద నిలబడ్డ బాస్టియన్‌ ‌మాత్రం విలియంని కొరికి చంపేయాలన్నంత కోపంగా చూస్తున్నాడు. దాని పొగ గొట్టంలాగే అతడి గుండె కూడా భుగభుగ లాడిపోతోంది. అప్పుడే వచ్చాడు సంతానం పిళ్లై ‘వణక్కం’ అంటూ. ‘‘మస్తరు చూశావా పిళ్లై?’’ అడిగాడు బాస్టియన్‌. ‘‘ఆమ… పొద్దున్నే చూసి పూడ్చినాను దొర.’’ అన్నాడు ఎక్కడ లేని వినయం ప్రదర్శిస్తూ. ‘‘జనం తగ్గినట్టు లేదా?’’ మళ్లీ అడిగాడు బాస్టియన్‌, ‌కొంచెం కటువుగా.

‘‘ఇల్లే సారూ, ఎవరూ పోలేదు.’’ నమ్మకంగా చెప్పాడు పిళ్లై. ‘‘అంతా ఉన్నారా?.. లేకపోతే ఎవడైనా…’’ మళ్లీ ఆరా తీశాడు బాస్టియన్‌. ‘‘ఒక్కడు కూడా పోలేదు. ఎక్కడకి పోతారు దొరా?! అంతా ఉన్నారు’’ అన్నాడు కిష్టయ్య అందుకుని. అలాంటి అనుమానం అక్కర్లేదన్న భరోసాతో పాటు, పని వదిలిపోయేటంత ధైర్యం ఇంకా మిగిలి ఉందా వీళ్లలో అన్నట్టు ఎంతో ధీమాగా ఉంది అతడి మాట. అయినా రాన్రాను చాలినంత మంది దొరకడం కష్టమవుతోంది. ఇన్ని జరుగుతున్నా బాస్టియన్‌ ‌హింస ఆపడు. కిష్టయ్య జులుం ఆగదు. ‘‘పది ముషమ్‌ల (మూరలు) దూరం… రొంబ నిమ్మిదిగా పని చేస్తుంటిరి’’ పెదవి విరుపుగా అన్నాడు పిళ్లై•. అది బాస్టియన్‌ ‌మెప్పుకోసం అన్నమాట. ఇలా పిళ్లై• చాడీలు అపడు. ‘‘జాలీ దయా చూపించకండయ్యా! తోళ్లు తీసి పని చేయించండి. ఏం ఊరికే చేస్తున్నారా, నా కొడుకులు! కూలి దొబ్బడం లేదూ!’’ గట్టిగా అరిచాడు బాస్టియన్‌.

***********

రూళ్లకర్రని కొద్దికొద్దిగా దొర్లిస్తూ పెన్సిల్‌తో గీతలు గీస్తున్నాడు పిళ్లై• కూలీల మస్తర్‌లో. గప్పీదొర బంగ్లా హాలు గుమ్మం పక్కన నిలబడి ఉన్నారు ఆ ఇద్దరు. తలపాగ చుట్టుకున్న మనిషి బట్టిపనుకుల మునసబు. పేరు గాం గంతన్నదొర. ముప్పయ్‌ ఏళ్లుంటాయి. బగత కులం. అందుకు తగ్గట్టే కాసెకోక గోచి పోసి పంచె కట్టాడు. అతడి పక్కనే కొంచెం నిర్లక్ష్యంగా నిలబడి ఎటో చూస్తున్న ఆ పొట్టి యువకుడు అతడి తమ్ముడు గాం మల్లుదొర. బలంగా ఉంటాడు మల్లు. ఎవరినీ లెక్క చేయడు.

కోపం ఎక్కువ. ఇరవై ఏళ్లుంటాయి. వాళ్ల అసలు ఊరు నడింపాలెం. బాస్టియన్‌ని కలుసుకోవడానికే వచ్చారు. ఆ రూళ్లకర్ర వైపే చూస్తున్నాడు గంతన్న. అక్కడ ఎవరూ లేనట్టే తన పని చేసుకుంటున్నాడు పిళ్లై•. అరగంట గడిచిన తరువాత గుర్రం బంగ్లా ముందుకొచ్చి ఆగింది. గుర్రం దిగి, దాన్ని అక్కడే చిన్న చెట్టు కొమ్మకి కట్టేసి మెట్టెక్కుతూ పైకి చూశాడు బాస్టియన్‌. అతడు పళ్లునూరడం స్పష్టంగా వినిపించింది. ఆ ఇద్దరు కనిపించగానే కళ్లు ఎర్రబడి పోయాయి. ముఖం కందగడ్డ అయిపోయింది. వడివడిగా మెట్లెక్కి గంతన్న ముందు నిలబడి అడిగాడు, పరుషంగా ‘‘ఎందుకొచ్చార్రా?’’. ఆ మాట విని పిళ్లై లేచి వచ్చి ‘వణక్కం!’ అన్నాడు. అదేమీ పట్టించుకోకుండా మళ్లీ పెద్ద గొంతుతో అడిగాడు బాస్టియన్‌, ‘‘‌నిన్నే, ఎందుకొచ్చార్రా?!’’ కొంత ధైర్యాన్ని కూడగట్టుకుని నెమ్మదిగా చెప్పాడు గంతన్న, ‘‘భూముల గురించి ఓ మాట, అదే మా మాట చెప్పాలి కదా దొర!’’ ‘‘ఏం చెబుతావో చెప్పు!’’ అన్నాడు, పళ్లు నూరుతూ. ఇవాల్టితో నీ అంతు తేల్చేస్తానన్న హెచ్చరిక కూడా అందులో ఉంది. ‘‘దొర! తమరు దయ చూపించాలి. బట్టిపనుకులలో నేను తాకట్టు పెట్టిన భూములు మావే దొర! ఆ భూములు సర్కారువని తమరు అనుకోవద్దు. ఎవరో ఏదో చెప్పినా, తమరు దొరలు. నాయం చేయాల!

నా మీద దయుంచి నా భూములు నాకు ఇప్పించండి! ఎలాగూ పోలీసు దొరవారి ఆజ్ఞ కూడా అయింది!’’ అన్నాడు గంతన్న. బట్టిపనుకులలో తన కుటుంబం భూములే తాకట్టు పెట్టాడు గంతన్న. ఇవి ప్రభుత్వ భూములంటూ బాస్టియన్‌ అసిస్టెంట్‌ ‌పోలీసు కమిషనర్‌కి ఫిర్యాదు చేశాడు. ఈ మధ్యనే ఆ భూములు ప్రభుత్వ భూములు కావని తేల్చాడు అసిస్టెంట్‌ ‌కమిషనర్‌. ‌పైగా తిరిగి గంతన్నకి అప్పగించాలని కూడా ఆదేశించాడు. మళ్లీ తనే అన్నాడు గంతన్న ‘‘దొరా! ఆ భూములు మా బంధువు సుమర్ల పెద్దబ్బి కొడుకు వాసాలయ్యకి ఇచ్చారు. నా మునసబి చాలిం చేశారు. నేను అన్నేయం అయిపోతాను దొరా!’’ అన్నాడు దీనంగా. అన్నగారి ధోరణికి మల్లు రగిలిపోతున్నాడు. నిజమే, ఆ భూములు తిరిగి గంతన్నకి అప్పగించమని ప్రభుత్వం ఆదేశించింది.

(ఇంకా ఉంది)

About Author

By editor

Twitter
Instagram